శుక్రవారం, మే 02, 2014

ఇదొక సత్య శోధన..!


నేను కార్టూనిస్ట్ ను కాకపోయి వుంటే ఇప్పటికి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అంటాడు ఆర్ కె లక్ష్మణ్. ఆయన వర్తమాన రాజకీయాలను చూసి అసహ్యం తో ఆ మాట అన్నాడు. అసలు దేశంలోఇప్పుడున్నది ప్రజాస్వామ్యమేకాదని ఆయన అభిప్రాయం.ఆర్ కె లక్ష్మణ్ విశ్వా విఖ్యాత రాజకీయ కార్టూనిస్ట్, భారతదేశ రాజకీయవ్యంగ్య చిత్ర కారులకు ఆరాధ్యుడు. తన బాధను కోపాన్ని, అప్పుడప్పుడు సామాన్యునికి కలిగే సంతోషాన్ని తన స్ట్రోక్స్ లో వ్యక్త పరిచే అద్భుతమైన సృజన కారుడు. అన్నిటికీ మించి మనసున్న ఒక సగటు మనిషి. మనసు, మనసునిండా ఆలోచనలు, ఉద్వేగాలు, కోపతాపాలు సగటు మనుషులందరికీ ఉంటాయి. వాటిని అరుపులు కేకలు లేకుండా, అంతులేని విషాదాన్ని కూడామాటలకు మించిన రేఖలతో వ్యక్తం చేసే వ్యంగ్య చిత్రణ కేవలం కార్టూనిస్ట్ ల సొంతం.ఈ దేశంలో,తెలుగు సమాజంలో ఎంతోమంది కార్టూనిస్టు లు, రాజకీయ వ్యంగ్య చిత్ర కారులు ఉన్నారు, కానీ అందులో కొందరే సమాజాన్ని, సమాజంలో ఉన్న రుగ్మతల్ని స్పృశిస్తారు. తమ కుంచె కేవలం జీతానికి పనికొచ్చేపరికరంగా మాత్రమే కాకుండా జీవితాలను మెరుగుపరిచే సాధనంగా వాడగలిగే వాళ్ళు తక్కువ. అలాంటి అరుదయిన వాళ్ళలో ఆణిముత్యం శేకర్. ఆయన భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తోన్న కుల మహమ్మారిని గుర్తించాడు.అదే అసలు సిసలు కాన్సర్ అని రోగ నిర్ధారణ చేసాడు. దానికి శస్త్ర చికిత్స చేసే పనికి పూనుకున్నాడు. దానికి సంబంధించిన ప్రయోగాదీపికే ఈ caste cancer.  

కంబాలపల్లి శేకర్ నేనూ ఒకే  చోటు నుంచి జీవితాలు ప్రయాణాన్ని మొదలు పెట్టాం. 1980 చివరన మొదలయిన మా ప్రయాణం సహాధ్యాయులుగా, సహోద్యోగులుగా సాగుతూ వస్తోంది. ఇద్దరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకే కాలంలో చదువుకున్నాం. ఆ కాలంలో  ప్రగతిశీల విద్యార్థుల సృజనాత్మక వేదికగా ఉన్న ఉస్మానియా రైటర్స్ సర్కిల్ లోశేకర్ తో పరిచయం స్నేహంగా మారింది. చదువుకునే కాలంలోనే వేరు వేరు పత్రికల్లో పనిచేశాం. నేను పాత్రికేయ వృత్తి వదిలేసినా ఆ రంగాన్ని, స్నేహితుల్ని వదులుకోలేక పోవడం వల్ల ప్రతిరోజూ శేకర్ కార్టూన్ల రూపంలో నన్ను పలుకరిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు నా వ్యాసాలు చదివినప్పుడో, టెలివిజన్ లో చూసినప్పుడో కలిగిన అభిప్రాయాలను  ఆంద్రజ్యోతి ఆఫీసులో కలిసినప్పుడో మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడూ మా మధ్య లోతయిన మాటలు లేవు. కాన్సర్ మహమ్మారికి సంబంధించిన మాటలు ప్రస్తావనకు రాలేదు. చిరునవ్వులు తప్ప విషాదభరిత సంభాషణలు లేవు. నిజానికి మా మధ్య కుల వైరస్ ప్రస్తావనలు కూడా లేవు. కాన్సర్ లాగే కులం కూడా పైకి కనిపించదు. నిజానికి మాలో ఒకరి కులం ఇంకొకరికి తెలియదు. ఆ అవసరమే రాలేదు. కాన్సర్ కూడా చాలా కాలం గడిస్తే తప్ప బయటపడదు. ఈ రెండింటికీ పైకి కనిపించకుండానే మనిషిని తినేసే లక్షణం ఉంది. దీన్ని శేకర్ గుర్తించాడు. అనుభవించాడు. దాన్ని ఈ పుస్తకం ద్వారా అందరితో పంచుకున్నాడు  

ఈ పుస్తకంలో కేవలం రంగురంగుల బొమ్మలో, వ్యంగ్య చిత్రాలో కాదు. వాటి నిండా సమాజంలో ఉన్నంత విషాదం ఉంది. కులం నిజంగానే భారతీయ సమాజంలో నిండి ఉన్న దుర్భర విషాదం. అది కాన్సర్ లాగే అనుభవించిన వారికి మాత్రమే అర్థమయ్యే చిత్ర వధ. భారతీయ సమాజంలో మనకు మనంగా కప్పుకున్న లౌకికవాద ముసుగులు తొలగించుకుని శేఖర్ లాగే మనసనే సూక్ష్మదర్శినితో శోధిస్తే మనలోనే ప్రతి కణం లో కులం కనబడుతుంది.దాని మూలాల్లో మనకు మతం కనిపిస్తుంది.  ఒక చిత్రంలో శేకర్ చెప్పినట్టు కులం పుట్టుకతోనే వచ్చేరుగ్మత. జన్యువులను బట్టి మనిషికి గడ్డాలు, మీసాలూ మొలిచినట్టు ఈ దేశంలో ప్రతివాడికీ కులం తోకలు మొలుస్తాయి. కేవలం తోకలే అయితే పోనీలే అనుకునే వాళ్ళం కానీ కొందరికి అవి కొమ్ములవుతాయి.నిజానికి సమాజంలో చాలా మందికి కులం మనిషిని కదలనీయకుండా ఎదగనీయకుండా  సంకెళ్ళయి కట్టి పడేస్తాయి. సరిగ్గా కాన్సర్ లాగే కులం కూడా మనిషిని తినేస్తుంది. ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని నైపుణ్యతలు ఉన్నా,ఎన్ని సాహసోపేతమైన, ఘనకార్యాలు చేసినా ఎదగాల్సిన స్థాయిలో ఎదగనీయకుండా భౌతికంగా, భౌద్ధికంగా కుంగదీసే లక్షణం కులనిది. అదే లక్షణం కాన్సర్ డి కూడా! పుష్తకం లోని ప్రతి చిత్రం ఈ రెండింటినీ పోల్చి చూపుతుంటుంది. 

కేన్సుర్ కేవలం నూటికి అయిదారు మందికే వంశపారంపర్యంగా వస్తుందని అంటారు కానీ కులం మాత్రం నూటికి నూరుశాతం  వారసత్వ వైరస్. ప్రతి ఒక్కడూ ఈ దేశంలో కులంలోనే పుడతాడు. కులంలోనే చస్తాడు.శేకర్ లో ఈ శోధన ఒక్కటే కాదు. కులం పిరమిడ్ ను తిరగేసి చూస్తే ఎలా ఉంటుందా అన్న పరికల్పన కూడా కనిపిస్తుంది. శూద్రుడు మనుధర్మ బ్రాహ్మనుడి మాదిరి కూర్చుని తిని బ్రాహ్మణుడు శూద్రుడిగా సకల సేవలు చేసే స్థితి వస్తే సమాజం ఎలా ఉంటుందా అన్న ఆలోచన్ వ్యక్తం అవుతుంది. కానీ నిచ్చన మెట్ల లా అంతర్గత అంతరాలతో ఉన్న కులం ఎటు వైపు తిప్పినా మహా అయితే ఒకడి మీద ఒకడు ఉండేలా చూస్తుందే తప్ప అందరూ సమానంగా ఉండే అవకాశాని ఇవ్వదు. ఇట్లాశేకర్ కార్టూన్లలో అరుదయిన సోషియో-హిస్టారికల్ థీమ్ తో కులం పుట్టుక, వ్యాప్తి, దాని సామాజిక, ఆర్ధిక,సాంస్కృతిక స్వరూపాలు, రాజకీయ అధికార స్వభావం విశ్లేషిస్తూ మనల్ని మతం మూలాలలోకి తీసుకెళ్తుంది. చివరకు దేవుడు తమ వాడయినా పరాయి వాడయిన పూజారి చేతిలో  బందీ అయిపోవడం ఇట్లా జీవితానుభవం తో కూడిన అధ్యయనం, శాస్త్రీయమైన అవగాహన, తర్కంతో కూడిన సత్యశోధన, హేతుబద్ధత కూడిన నిజనిర్ధారణ తరువాత రెండూ ఒకటేనన్న సూత్రీకరణకు వస్తాడు. 

ఇదొక ప్రయోగం, ఒక గొప్ప ప్రయత్నం, అయినా పరిష్కారాన్ని మాత్రం కనిపెట్టలేక పోయాడు. కాన్సెర్ కు కూడా ఇంకా పరిష్కారం దొరకట్లేదు. దొరికితే మంచివాళ్ళు కూడా మనలో ఇంకా చాలా మందే మిగిలి ఉండేవాళ్ళు. ఇప్పుడు సమాజంలో మంచివాళ్ళు మాయమై పోతున్నారు. ఉన్నా వాళ్ళు కూడా జన్యుసంకరమైన కులవైరస్ కు అతీతులుగా ఉండలేక పోతున్నారు. ఈ  పుస్తకంలో ఎంతో కొంత రేడియో ధార్మికత ఉంది. అది ప్రసరిస్తోన్న కిరణాలు సోకి కనీసం కొందరి మనసుల్లోనైనా కులం క్రిములు చావాలన్నది శేఖర్ ఆశ. అందులో మనిషి మిగలాలన్న కోరిక ఉంది.  సమాజం ఎదగాలన్న ఆకాంక్ష ఉంది. శేఖర్ ఆశ నెరవేరితే బాగుండు! . అప్పటిదాకా శేఖర్ కూడా మనలో ఉంటే... 

1 కామెంట్‌: