గురువారం, ఫిబ్రవరి 26, 2026

అది రోబోల రాజ్యం











భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -కృతిమ మేధో సదస్సు- ఒక ప్రయివేటు  యూనివర్సిటీ  పటాటోపం మూలంగా అబాసు పాలయ్యింది. భారత దేశ సాంకేతిక కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశీయ AI వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి,సాంకేతిక స్వయం సమృద్ధి, సార్వభౌమాధికారాన్ని, సమగ్రత జోడించి ప్రపంచంలో పోటీపడగలిగే AI వ్యవస్థను నిర్మించడానికి  'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌'పేరుతో  భారత ప్రభుత్వం  (ఫిబ్రవరి 16-21, తేదీల మధ్య) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సదస్సు నిర్వహిస్తోంది. కానీఆ లక్షణానికి  భిన్నంగా ఢిల్లీ పక్కనే నోయిడా లో ఉన్న గోల్ గో టియాస్ యూనివర్సిటీ (Galgotias University') చైనా తయారు రోబోటిక్ శునకాన్ని  తమ సృష్టిగా చూపించడం వల్ల ఈ వివాదం తలెత్తింది. ఇప్పుడు మన గ్లోబల్ సమ్మిట్ పక్కకు పోయి ఆ చైనా లోకల్ కుక్క ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 


నిజానికి ఈ శునక రోబోను  నేను గతే ఏడాది ఆగస్టు లో కలిసాను. దానితో కాసేపు ఆడుకున్నాను. అలాగే పాఠాలు బోధించే రోబోలతో, ట్యూషన్స్ చెప్పే పొట్టి రోబోలతో, మనుషులకు సహాయపడే హుమానాయిడ్ రోబోలతో కూడా కాసేపు గడిపాను. పోయిన ఏడాది ఆగస్టు మూడో వారంలో బీజింగ్  స్మార్ట్ ఎడ్యుకేషన్ సదస్సులో  ఈ రోబోలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. కొందరు ఎంపిక చేసిన వైస్ ఛాన్సలర్లను ఇంటర్నేషనల్ అసోసియేషన్ అఫ్ యూనివర్సిటీస్ (IAU) రెండు రోజుల పాటు AI పరిశోధన కేంద్రాలు ప్రధానంగా ఆ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్ నిర్వహించింది. అందులో భాగంగా  ఈ రోబోలను కలవడం జరిగింది. 

Galgotias University' తనదని చెప్పుకున్న  Unitree Go2 నాలుగు కాళ్లతో నడిచే డాగ్ రోబోలు చైనాలో అతి సాధారణం. అమెజాన్ తో సహా అన్ని ఆన్లైన్ మార్కెట్లలో లక్ష రూపాయలనుంచి ఐదు లక్షల వరకు అందుబాటులో ఉన్న ఈ రోబోలు మనిషికి అన్ని పనుల్లో తోడుగా రక్షణగా ఉంటాయి.  ఈ రోబో మేము ఆ  పరిశోధన, తయారీ సంస్థకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కుక్కలాగే  స్వాగతం చెప్పింది. పలుకరించింది. నమస్కారం చెప్పడం, చేతులు అందించి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆనందంతో గంతులేయడం ఉద్వేగంతో కింద పది దొర్లడం వంటి పెంపుడు కుక్కలు చేసే అన్ని పనులు చేసింది. ఇవి మార్నింగ్ వాక్ లో మనిషికి తోడుగా వెళతాయి, అలాగే కాపలా ఉంటాయి. 



చైనాలో ఇలాంటి రోబోలు మన దేశంలో కుక్కలకంటే ఎక్కువే కనిపిస్తాయి. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు ఇతర పనిప్రదేశాలు ఎక్కడ చూసిన కుక్కలను పోలిన, మనుషుల్లా నడిచే రోబోలు కనిపిస్తాయి. మనం వాడే మొబైల్ ఫోన్లు, కార్లు ఇతర ఎలెక్రోనిక్ పరికరాల్లో ఎక్కువభాగం ఈ రోబోలే తయారు చేస్తున్నాయి. మొత్తంగా చైనా ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తోన్న పారిశ్రామిక రంగాన్ని ఈ రోబోలు తమ సామ్రాజ్యంగా మార్చికుని ఆ దేశానికి కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. 
పరిశ్రమల తో పాటు వ్యక్తిగత సేవలు, విద్య, భద్రత, వృద్ధుల సంరక్షణ—పిల్లల పెంపకం ఇలా ఎక్కడ చూసినా రోబోట్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. కేవలం వినియోగమే కాదు మాత్రమే కాదు, లక్షల్లో రోబోట్లను తయారుచేసి చైనా ఈ రంగంలో కొత్త శక్తిగా అవతరించింది.అంతర్జాతీయ రోబోటిక్స్ సమాఖ్య అంచనాల ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా పరిశ్రమల రోబోట్లు వినియోగిస్తున్న దేశం చైనా. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో రోబోట్లు ఫ్యాక్టరీల్లో అమర్చి కార్ల్ మార్క్స్ ఊహించని రీతిలో చైనా వస్తూత్పత్తి వేగవంతం చేసి విశ్వ విఫణిలో కుమ్మరిస్తోంది. 

ఆటోమొబైల్ ఫ్యాక్టరీలలో ప్రమాదకరమైన వెల్డింగ్, పెయింటింగ్ తో పాటు ఇప్పుడు మొత్తం కార్ల తయారీ అంతా  రోబో లే చేస్తున్నాయి. భారీ పరిశ్రమల్లో  భారమైన పనులు, ప్రమాదకర పనులు రోబో లే  చేస్తున్నారు.దీనితో సహజంగానే ఉత్పత్తి వేగం పెరుగుతుంది, మానవ తప్పిదాలు తగ్గుతాయి, నాణ్యత మెరుగుపడుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు పెట్టె పనిని కొన్ని గంటల్లో, నిమిషాల్లో చేసి పెడుతున్నాయని అక్కడి స్టాల్ నిర్వాహకుడు చెప్పారు. ఇంతో పనులు చేయడం, ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం, చివరకు బట్టలు కుట్టడం, టైలరింగ్ వంటి వాటికి కూడా రోబోలు వాడుతున్నారు. ఈ పనుల కోసం చైనా తయారు చేసిన రోబోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. 


విద్యాబోధన లో  వినూత్న విప్లవం: 

చైనా రోబోలు విద్యా బోధనను సులభ తరం చేశాయి. చైనా ఇప్పుడు పిల్లలకు పాఠాలు బోధించడానికి AI యాద్ధృత రోబోలను తయారు చేస్తోంది.అంతే  కాదు వాటిని విరివిగా వాడుతోంది. క్లాస్ రూమ్ లలో టీచింగ్ అసిస్టెంట్ లుగా, అధ్యాపకులకు సహాయ పడుతున్నాయి. ముఖ్యంగా భాషా బోధన, ఇంగ్లీష్ తో సహా అన్ని ప్రపంచ భాషలను అవలీలగా బోధిస్తున్నాయి. ఇది చైనాకు వరప్రసాదిని అంటున్నారు అధ్యాపకులు. సైన్స్ టెక్నాలజీ, బయాలజీ లతో పాటు ప్రయోగాలు, వివరణలు, విశ్లేషణలు అవసరమైన అన్ని సబ్జెక్టులలో మనుషులకంటే వివరంగా ఇవి బోధిస్తున్నాయి. ట్యూషన్లు చెపుతున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటికి ఒక చిన్న తెర-స్క్రీన్- ఉంటుంది. అలాగే ఈ రోబో మనం చెప్పింది వింటుంది.  మాట్లాడుతుంది , మన సందేహాలకు  తిరిగి సమాధానం ఇస్తుంది. ఈ ఇంటరాక్టివ్ రోబోలు ఇప్పుడు అన్ని స్కూళ్లలో అందుబాటులోకి తెస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాడుతున్నారు.  దీనితో కొత్త తరం విద్యార్థులు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడుతున్నారు. 

చైనా రోబోటిక్స్ రంగంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చుతున్నాయి. పరిశ్రమల నుంచి సేవల వరకు, విద్య నుంచి వృద్ధుల సంరక్షణ వరకు—ప్రతి రంగంలో రోబోలు చైనాకి కొత్త వేగం, కొత్త సామర్థ్యం తో దూసుకు వెళ్తోంది. చైనా—ప్రపంచ రోబోట్ల ఫ్యాక్టరీగా మారింది. ప్రతి ఏడాది ఆరు నుంచి ఏడు లక్షల రోబోలను చైనా తయారు చేస్తోంది.  ఇది ప్రపంచ రోబోల ఉత్పత్తిలో 50 శాతంకంటే ఎక్కువ, అలాగే వినియోగంలో కూడా. రోబోటిక్ వాణిజ్యంలో చైనా ఏటా  50–60 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు ఐదులక్షల కోట్లు సంపాదిస్తోంది. ప్రపంచం మొత్తం మార్కెట్ 108 బిలియన్ డాలర్లు కాగా కాగా, దాంట్లోసగానికంటే ఎక్కువ  చైనా వల్లే వస్తోంది. 2030 నాటికి ఈ విలువ 300  బిలియన్ డాలర్లకు పెంచాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. దానికి అనుగుణంగా AI లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. పరిశోధనలు చేస్తోంది.సాంకేతిక పరిజ్ఞానాన్ని అవపోసనపట్టి కొత్త ఆవిష్కరణలతో ఒక సాంకేత బానిస శ్రామిక వర్గాన్ని చైనా తయారు చేయబోతోంది. 








శుక్రవారం, ఆగస్టు 22, 2025

మన పక్కనే మరో ప్రపంచం!

గ్లోబలైజేషన్ ప్రేమికులు ప్రపంచం ఒక కుగ్రామం అయిందని పదే పదే చెపుతుంటారు. ఆ ప్రేమికులు ఈ పదబంధాన్ని రెండు కారణాలు చూపి వాడుతుంటారు, ఒకటి ఆర్ధిక, వాణిజ్య లావాదేవీలు- పెట్టుబడులు వగైరాలు. రెండోది సాంకేతికత సమకూర్చిన అనుసంధాన వ్యవస్థలు. చైనా ఈ రెండింటి విషయాల్లోనే కాదు మనం భ్రమలో ఉన్న అనేక విషయాల్లో స్పష్టంగా, స్వతంత్రంగా ఉంది. ప్రపంచీకరణ పడగ నీడ కూడా ఆ నేలమీద పడకుండా డ్రాగన్ ఒక ఉక్కు కవచాన్ని నిర్మించి ఉంచింది. అక్కడి సామాన్యుడికి వేరే ప్రపంచమేదో ఉందనే ఊహ కూడా రాకుండా నేనే ప్రపంచం అనే నమ్మకాన్ని, నాదే అసలయిన ప్రపంచం అనే ఆత్మ నిర్భరత (!) ను కలిగించింది. ఇరవయ్యేళ్ల ముందు నేను రెండు సంవత్సరాల పాటు చైనా అధ్యయనంలో ఉన్నాను. న్యూ యార్క్ నగరంలోని న్యూ స్కూల్ యూనివర్సిటీ లో ఉన్న India China Institute మొదటి బాచ్ ఫెలో గా నాకు చైనా పైన ప్రపంచీకరణ ఆర్ధిక సామాజిక అసమానతలు అనే అంశం మీద అధ్యయనం చేసే అవకాశం లభించింది. అప్పుడు ఆంధ్రజ్యోతిలో “ మంచైనా చెడైనా అది జన చైనా” పేరుతో ఆదివారం అనుబంధం విస్తృత కవర్ పేజీతో సహా దాదాపు 20 వ్యాసాలు రాశాను. ఇంగ్లీషులో ఒక పుస్తకం, రెండు పుస్తకాల్లో ఐదారు చాప్టర్లు వచ్చాయి. వాటి గురించి తరువాత మాట్లాడుకోవచ్చు. కానీ ప్రపంచమంతా ప్రపంచ దిగ్గజ పెట్టుబడి దారిలో తప్పిపోయిన ఈ ఇరవై ఏళ్ల కాలంలో చైనా ఎలా నిలబడింది అనేది ఆసక్తి కలిగించే అంశం. అలాగే చైనా ఈ ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకువెళ్లబోతోంది అనేది విస్మయం కలిగించే విషయం.
ఇది నేను గమనించింది, నాకు అర్థమైన కోణం మాత్రమే! చైనా అత్యంత (ప్ర)గతి శీల సమాజం ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం కావచ్చు, అసలు అర్థమే కాకపోవచ్చు! కాబట్టి అర్థమైన వాళ్లకు అర్థమైనంత.
మార్కెట్ ఎకానమీ అందించిన సుఖాలకు అలవాటు పడ్డ మనం చైనా వెళితే ఖచ్చితంగా కొన్ని అలవాట్లు వదిలేసి, కొత్త అలవాట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే చైనీకరణ చెందాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ పనులు, వాడే వస్తువులు, సౌకర్యాలు, సేవలు మారిపోయాయి. ఒక రకంగా పాత ఆప్స్ ఆఫ్ లోడ్ చేసుకొని చైనా యాప్స్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఈ తరం ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో దిగాక ఉబర్ కోసం వెతుకుతారు. చైనా లో ఉబర్ ఉండదు. దానికి బదులు దీదీ/డిడి ఉంటుంది. అది బుక్ చేసుకోవాలంటే, వి చాట్ ఉండాలి. వి చాట్ మన వాట్సాప్ లాంటిది. దానితో పాటు పేమెంట్ ఆప్ కూడా. అక్కడ వాట్స్ అప్ ఉండదు. విచాట్ కావాలంటే చైనా సిమ్ వాడాలి. వేరేదేశం సిమ్ నెట్వర్క్ ను చైనా నమ్మదు. వాటికి అనుమతి లేదు. చైనా డిజిటల్ ప్రపంచం పూర్తిగా స్వతంత్రంగా ఉంది. వాళ్లు తామే యాప్‌లు తయారు చేసుకుని, వాటినే వాడుతారు. ప్రభుత్వం గట్టి నియంత్రణ, నిఘా ఉంచుతుంది. ఇంటర్నెట్‌పై పూర్తిగా పర్యవేక్షణ (surveillance) ఉంటుంది.
చైనా ప్రభుత్వం ఇంటర్నెట్, సోషల్ మీడియా, యాప్‌లపై చాలా కఠినంగా నిఘా పెడుతుంది. (విదేశీ సిమ్ లు రోమింగ్ అడపా దడపా కాల్ చేసు కోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు )
ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఉపయోగించే గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్‌లు చైనాలో పనిచేయవు. వాటి బదులుగా చైనా తానే కొత్త యాప్‌లు, సేవలు తయారు చేసుకుని వాడుతోంది. చైనాలోని ప్రతి యాప్‌ మీద ప్రభుత్వానికి పర్యవేక్షణ ఉంటుంది.
ప్రపంచమంతా గూగుల్ సెర్చ్ వాడితే చైనా తన సొంత Baidu వాడుతుంది. గూగుల్ ఇక్కడ పనిచేయదు. WhatsApp కు బదులు WeChat, Facebook, twitter కు బదులు Weibo / WeChat Moments
అలాగే instagram బదులు Xiaohongshu (Little Red Book), YouTube కు ప్రత్యామ్నాయంగా Youku, Bilibili, Tencent Video, Google Maps కు Baidu Maps, Amap (Gaode) ఉంటాయి.

ప్రపంచం వాడే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు చైనాలోనే తయారైనా చైనాలో వాడే ఫోన్లలో మాత్రం Google Play Store ఉండదు. Huawei AppGallery, Oppo Store, Xiaomi Store ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు అన్నీ Alipay, WeChat Pay ద్వారానే జరుగుతాయి.
ఎందుకలా అని ఒక మిత్రుణ్ణి అడిగా చైనా ఒక పెద్ద దేశం. ఇక్కడ 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇంత పెద్ద దేశంలో సామాజిక స్థిరత్వం, భద్రత, ప్రజల మేలు కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ మార్గాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం. అన్నాడు. ఆయన ఒక ప్రొఫెసర్ డీప్సీక్ అభివృద్ధి చేసిన టీమ్ లో ఒకరు. మేము గోప్యత, భద్రత, సామాజిక సమన్వయానికి కి ప్రాధాన్యం ఇస్తాము. మేము జాతీయ డిజిటల్ స్వావలంబన (Digital Sovereignty) సాధించాము. ప్రపంచమంతటా మా సాంకేతికత కు ఆధారణ లభిస్తోంది అన్నాడు. అంతే కాదు. చైనా ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ సాంకేతిక సామ్రాజ్యానికి అధిపతి కాబోతుంది అన్నారు. గడిచిన వారం చైనా ఆవిష్కరణలు చూసినప్పుడు నిజమే చైనా మరో ప్రపంచాన్ని నిర్మిస్తోంది అనిపిస్తోంది.
వాటి గురించి మరెప్పుడైనా!