శుక్రవారం, మే 09, 2014

తెలంగాణ ప్రజలు స్పష్టంగానే ఉన్నారు



 తెలంగాణవాదులకు టంకశాల అశోక్ గారి గురించి పరిచయం అవసరం లేదు.పత్రికలు చదివే వారికి ఆయన, ఆయన విశ్లేషణలు తెలుసు. తెలంగాణలో సీనియర్ జర్నలిస్టులలో ఆయన ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన రిపోర్టర్గా, ఎడిటర్గా పనిచేశారు. చాలాకాలం ఢిల్లీలో పనిచేసిన ఆయనకు రాజకీయ వార్తా విశ్లేషణ కొట్టిన పిండి. తెలంగాణ ఉద్యమాన్ని అతిదగ్గర నుంచి పరిశీలించడమే కాకుండా పరిణతితో కూడిన విశ్లేషణలతో ఉద్యమ స్వభావాన్ని సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసిన అశోక్ గారు ఏప్రిల్ 25 నాకొక ఎస్ఎంఎస్ పంపించారు. బహుశా అది ఆయన సన్నిహితులందరికీ పంపించి ఉంటారు. ఎన్నికల్లో ఎటూ తేల్చుకోలేక తెలంగాణ సమాజం అయోమయంలో ఉందేమో!అన్న అనుమానాన్ని ఆయన తన ఎస్ఎంఎస్లో వ్యక్తపరిచారు. అప్పటికే ప్రచారం వేడెక్కింది. నరేంద్రమోడీకీ, చంద్రబాబు జోడీ అయ్యాడు. వారికి పవన్కళ్యాణ్ తోడయ్యాడు. వారి వెనకే లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ్ నడుస్తున్నాడు. కాలకూటమికి ఆంధ్రా మీడియా బాజాలూదుతోంది. తెలంగాణకు ఎంత మాత్రం అనుకూలంగాలేని రాష్ట్ర విభజన, ఉద్యోగుల  ఆప్షన్స్, పదేళ్ళ ఉమ్మడి రాజధాని ఇవన్నీ అయోమయానికి గురి చేస్తున్నాయి. బలహీనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, సమీకృతమైన నిర్మాణంలేని టీఆర్ఎస్ మధ్య ప్రజలు ఊగిసలాటలో ఉన్నారన్నది ఆయన మెసేజ్ సారాంశం

 నాతో సహా హైదరాబాద్లో ఉండి ఆంధ్రా మీడియా కబుర్లు చదివే  చాలామందికి ఇదే అనుమానం ఉండింది. పైగా జేఏసీ తటస్థ వైఖరి కూడా అయోమయం కలగడానికి కారణమైంది. ఎందుకంటే ఉద్యమ కాలంలో తర్వాత చాలా సందర్భాల్లో ప్రొఫెసర్ కోదండ రామ్ మాట మీదే నడిచిన తెలంగాణ ప్రజలు తటస్థ వాదాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలియని పరిస్థితి. 

చాలా సందర్భాల్లో మేధావులకు ప్రజలకు ఆలోచనల్లో  కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన విషయంలో రెండు శిబిరాలకు పెద్దగా పొసగదు. మేధావుల దృక్కోణం ఆదర్శ వాద చట్రంలో ఉంటుంది, ముందుగానే స్థిరపరుచుకున్న అభిప్రాయాలు, భావజాలాలు ఆలోచనలను ప్రభావితం చేస్తుంటాయి. సామాన్యుల ఆలోచన వాళ్ళ అనుభవాలమీద, రోజువారీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. పార్టీల మంచి చెడ్డలతో పాటు అభ్యర్థులు వారితో ఉన్న సంబంధాలు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందుకే ఎన్నికల ఫలితాలు ఓటింగ్ సరళి అంచనా వేసేవాళ్ళు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక ఉద్యమ నాయకత్వం సంగతి చెప్పనవసరం లేదు. వాళ్ళు అవి ఎప్పుడైనా ముందు ఏర్పరచుకున్న లక్ష్యం ప్రకారం నడుస్తాయి. ప్రజలను లక్ష్యం దిశగా నడిపించాలని చూస్తాయి. ఎవరు అధికారంలోకి వస్తే తమకు, తమ లక్ష్యానికి అనుకూలమో అటువైపే నాయకత్వం మొగ్గుచూపుతుంది. జేఏసీ నేతలు కూడా కొందరు కాంగ్రెస్ వైపు మరికొందరు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం చాలామందిని అయోమయంలో పడేసింది. అయోమయం ఉద్యమ నాయకులకు, మేధావులకే పరిమితమా లేక తెలంగాణ ప్రజలుకూడా ఇదే స్థితిలో ఉన్నారా తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది

 కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సీహెచ్. దినేష్కుమార్ (రాజనీతి శాస్త్రం) డాక్టర్ టి. శ్రీనివాస్ (సమాజ శాస్త్రం) మిత్రుడు ఎంవీ రమణారెడ్డి (ఆర్టిస్ట్) మరికొందరం తెలంగాణ జిల్లాల్లో ప్రజల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అసలు ఎన్నికల గురించి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎజెండా ఏమిటి, ఎవరివైపు, ఎందుకు మొగ్గు చూపుతున్నారు, ఏయే అంశాలు ప్రభావితం చేయవచ్చు ఇట్లా అనేక ప్రశ్నలతో దాదాపు ఆరు జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలను పలుకరించాం. వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాం. ప్రజలు మనం అనుకున్నంత అమాయకంగా లేరు. అయోమయంలో అసలే లేరు.  తమకు ఏం కావాలో, ఎవరు కావాలో ప్రజలకు స్పష్టంగా తెలుసనే విషయం అర్థమయ్యింది. తెలంగాణ ఏర్పాటైనా మనకింకా భావనే కలుగడం లేదని, ప్రజలు ఆశించినంతగా ఉత్సాహం చూపడంలేదని నెలకొన్న భావనలకు భిన్నమైన దృశ్యం పల్లెల్లో కనిపించింది. వాళ్ళ మాటల్లో కోటి ఆశలు వ్యక్తమైనాయి. తమ కల నెరవేరిందని ఇక తమ తలరాతలు మారాల్సి ఉందని అది ఎన్నికలతో సాధ్యం కాబోతుందని చాలామంది చెప్పుకొచ్చారు. ఎన్నికల పట్ల పోటీ చేస్తున్న అభ్యర్థుల పట్ల పార్టీలు, వాటి ప్రణాళికల పట్ల ప్రజలకు మేధావులకంటే ఎక్కువగానే స్పష్టత ఉందని అనిపించింది. ఓటు ద్వారా తెలంగాణ తెచ్చినందుకు కృతజ్ఞత చెప్పడంతో పాటు అదే ఓటుతో శిథిలమైన తమ బతుకులు పునర్నిర్మించుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. అది ఇప్పటికే ఓటింగ్ సరళి ద్వారా వ్యక్తమయ్యింది. ఈసారి గత ఎన్నికల్లోకంటే కాస్త ఎక్కువగా 72 శాతం పోలింగ్ జరిగింది.  

ఎన్నికల్లో అయినా ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు అన్నది ప్రధానమైన అంశం. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని ఎంతమంది నమ్ముతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. నూటికి అరవై శాతం మంది నిజమే తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని ఒప్పుకున్నారు. కానీ నూటికి తొంబై శాతం మంది కేసీఆర్ లేకుండా, ఆయన పార్టీ లేకుండా తెలంగాణ వచ్చేదే కాదని అన్నారు. నిజంగానే ఇచ్చిన మాట ప్రకారం 2009లోనే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే తెలంగాణ ఘనత కాంగ్రెస్కే చెందేదని తరువాత మూడేళ్ళలో సాగిన దమనకాండ, అడుగడుగునా సాగిన దగా తామింకా మరిచిపోలేదని చెప్పుకొచ్చారు. ఉద్యమంలో తమను కాంగ్రెస్ నేతలు, మంత్రులు, శాసనసభ్యులు వేధించిన తీరు, పోలీసుల దెబ్బలు, చనిపోయిన పిల్లల ఆర్తనాదాలు, లక్షలాదిగా కదిలివచ్చిన ప్రజల భావోద్వేగాలు ఇంకా మా మనసుల్లో నుంచి తొలగిపోలేదని చెప్పారు. ఇంకా తమ మీద కేసులు అలాగే ఉన్నాయని టీఆర్ఎస్ నాయకులే జామీనులు ఇచ్చి బయటకు తెచ్చారని చెప్పారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళను కాదని ఇంకొకరికి ఓటు వేయడానికి మనసు ఒప్పదని కూడా చెప్పారు. ముఖ్యంగా మహిళలు చనిపోయిన పిల్లలకు సంబంధించిన తల్లుల కడుపుకోత గుర్తు చేశారు. అలాగే తమ పిల్లల బాధలు తెలంగాణలో అయినా తొలగిపోవాలని చిన్నదో పెద్దదో పని దొరకాలని కోరుకుంటున్నారు. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటే మన పాలన ఉంటుందని, మన వాళ్ళకే ఉపాధి దొరకాలని భావిస్తున్నట్టు చెప్పారు.  

ఉద్యోగులు మొదట కొంత అటు ఇటుగా కనిపించినా ఆప్షన్స్ అంశం తెరమీదకు రావడం, దాన్ని కేసీఆర్ తన ప్రచారంలో విరివిగా వాడడంతో ఉద్యోగుల ఓటింగ్ దాదాపు ఏకపక్షం అయ్యే సూచన కనిపించింది. రైతులు చాలామందిని రుణ మాఫీ ఆకర్షించింది. అయితే అత్యాశకు పోకుండా లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తే ఉపశమనం కలుగుతుందని చాలామంది రైతులు చెప్పారు. కాంగ్రెస్ రెండు లక్షల హామీని నమ్మలేమని పని పదేళ్ళలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇక పోతే కొత్త ప్రాజెక్టులు, చెరువుల మరమ్మత్తు పనులు కూడా రైతులను ఆకర్షించాయి. చదువుకున్న వాళ్ళు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు రుణ మాఫీ మాట కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇల్లు చాలామంది పేదలను ఆకర్షించింది. నిజంగానే ఎన్నికల తరువాత తామంతా డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉండొచ్చని ఆశ పడుతున్నారు. ఇంటికంటే ఎక్కువ దాని గురించి కేసీఆర్ వర్ణించిన తీరు వాళ్ళలో ఆశలు పెంచింది. ఎదిగిన పిల్లలు, పశువులు, కోళ్ళు గుడిసెల్లో ఎట్లున్నయో  చూడండి అని చూపించారు. ప్రజలు అమాయకులని, వాళ్ళు వూళ్ళో ఉన్న ఎవరో ఒకరి ప్రభావంతో ఓట్లు వేస్తారని సాధారణ రాజకీయ విశ్లేషకులు చెపుతుంటారు. కానీ తెలంగాణలో ప్రతి ఇంటిలో ఒక ఒపీనియన్ లీడర్ అంటే ఎవరికి ఓటు వేయాలో చెప్పి ప్రభావితం చేసే వ్యక్తి ఉన్నాడని అనిపించింది. ప్రతి ఇంట్లో, కుటుంబంలో ఎవరో ఒకరు ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమాన్ని చూశారు. అలాగే దాదాపు ప్రతి ఇంట్లో టెలివిజన్ ఉంది. గత మూడేళ్ళుగా ఏం జరిగిందో  ఎవరేం చేస్తున్నారో  ప్రజలు  చూస్తున్నారు. అది ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది.  ఇదే విశ్వసనీయతకు గీటురాయి  కాబోతోంది.  

నేపథ్యంలో ప్రజల్ని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యింది. నాయకత్వ సమస్య, అనైక్యత, ప్రచారలోపాల కారణంగా పార్టీ తన ఎన్నికల ప్రణాళిక ఏమిటో చెప్పలేకపోయింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సభలకు జనసమీకరణ కూడా అనైక్యత వల్లే వీలుకాలేదని అంటున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అధినాయకత్వం చేసిన ప్రయత్నాలకు  జైరాం రమేష్ లాంటి నాయకులు  ఎక్కడికక్కడ తూట్లు పొడిచారు. ఆప్షన్స్ పైన, పోలవరం ప్రాజెక్టు విషయంలో, సెటిలర్స్ విషయంలో ఆయన ప్రకటనలు కాంగ్రెస్ను దెబ్బతీశాయి. అలాగే తెలుగుదేశం పార్టీని నమ్ముకుని గోదారి ఈదాలనుకున్న బీజేపీ కూడా చాలా నష్టపోబోతోంది. ఉద్యమంలో బీజేపీ పాత్రను గుర్తిస్తూనే చంద్రబాబు ద్రోహాన్ని ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. దీనివల్ల టీడీపీ పోటీ చేసిన చోట్ల బీజేపీ ఓటర్లు, బీజేపీ స్థానాల్లో టీడీపీ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. వారి నుంచి ప్రతిచోటా ఒక్కసారికి కేసీఆర్కు అవకాశం ఇస్తాం అన్న మాట వినిపించింది. అన్ని బలహీనతలను కేసీఆర్ తన బలంగా మలచుకున్నాడు. వందకు పైగా సమావేశాల్లో ఆయన తెలంగాణ సాధనలో తన పార్టీ పాత్రను గుర్తుచేశాడు. ఎన్నికల ప్రణాళికలో ఏముందో చెప్పాడు. వీలైనంత మేరకు కాంగ్రెస్ పార్టీని, పొన్నాల లక్ష్మయ్యను ఉతికి ఆరేశాడు. కాంగ్రెస్ పార్టీకి  కేసీఆర్ విమర్శలు తిప్పి కొట్టడానికే ఉన్న సమయం సరిపోయింది. ఒక దశలో పొన్నాల లక్ష్మయ్య నిర్వేదానికి లోనై ఎవరి పాపాన వాళ్ళే పోతారుఅని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు మోడీ మంత్రం కూడా పెద్దగా పారినట్టు లేదు. ఆయన తల్లి చచ్చి బిడ్డ బతికిందిలాంటి నోటి దురుసు మాటలతో పాటు పవన్ కళ్యాణ్  తాట తీసేతలబిరుసు చేష్టలు కూడా ప్రజలను ఆలోచింపజేశాయి. మనం తెలంగాణ వాళ్ళం, మిగతా వాళ్ళంతా ఆంధ్రోల్ల అద్దె మైకులు అన్న అభిప్రాయానికి వచ్చారు. బహుశా ఇవన్నీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించబోతున్నాయి.  

అశోక్ గారు చెప్పిన మోడీ జోడీ ఎన్నికలకు ముందే ఓడిపోయింది. తెలంగాణ బీజేపీ నాయకులే దాన్ని ఆమోదించలేకపోయారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను మరోసారి నిరూపించుకుంది. నిజమే టీఆర్ఎస్ నిర్మాణ పరంగా పటిష్టంగా లేదు. కానీ ప్రజలు మాత్రం పార్టీకి పట్టంకట్టే  పట్టుదలతో ఉన్నట్టు కనిపించారు.   పార్టీ ఎంతవరకు నిలబడుతుంది, ప్రజలకు ఇచ్చిన మాటలు మేరకు నిలబెట్టుకుంటుంది అన్నది కాలమే తేల్చాలి. తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారుడు బాలరాజ్ యాదవ్ నెలరోజులు వేరే పని లేకుండా పది జిల్లాల్లో ఎన్నికల తతంగం గమనించి వచ్చాడు. ఎలా వుంది పరిస్థితి అని అడిగాను. తెలంగాణ ప్రజలు గొప్పవాళ్ళు సార్, వాళ్ళ కాళ్ళకు మొక్కాలి’ . అన్నాడు. అదే నిజం. ఎప్పుడైనా ప్రజలే గొప్పవాళ్ళు. 

3 కామెంట్‌లు:

  1. Dear sir
    Relieved by your article. Even though I am an ardent admirer of KCR, I always suspect that politicians' priorities change once they are in power. Here comes the necessity of TJAC. It's role in next 10 years will be crucial.

    రిప్లయితొలగించండి
  2. Mana Prajaswamyam entha goppadante...prajalu pattubatti pattam kattina prabhutvam kooda chesina vagthaanaalaku kattubadi untundi, nilabettukuttundi ani oka gatti nammakam kooda kaliginchaleni paristhithi...adi kooda kaalame nirnayinchaali....anthe lendi....star hero movie ani velithe adi utter flop movie ayite...sagatu preskhakudu chesedemundi...ikkada kaneesam movie baaguntundanna nammakam to velataru...manam padavi kattabette naayakula meeda manaku nammakam unda? unte adi nijanga nijama nijam la anipinche bhrama...?

    రిప్లయితొలగించండి
  3. Gaaya padda telangana yeppatiki jaagrathhaga undaali. Valasa avaseshalu sheshanaagulla maarakoodadu.

    రిప్లయితొలగించండి