శుక్రవారం, అక్టోబర్ 28, 2011

విద్రోహ పార్టీలకు బుద్ధి చెప్పాలె



దీపావళిలోగా తెలంగాణ పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పిన కాకమ్మ కబుర్లు నమ్మిన వాళ్లకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దీపావళి కూడా దాటిపోయింది కానీ తెలంగాణ పై ప్రకటన మాత్రం రాలేదు. గత రెండేళ్లుగా ఇలాంటి వాయిదాలను అనేకం చూసి వున్నందువల్ల సారి ప్రజలు కూడా పెద్దగా నమ్మినట్టు లేరు. కానీ రాజకీయ పార్టీల నాయకులే కొందరు అలాంటి ప్రచారాన్ని పుట్టించారు. సకల జనుల సమ్మె ఒత్తిడిని తట్టుకోలేని ప్రభుత్వం అలాంటి ఆచరణ సాధ్యం కాని ప్రచారానికి పూనుకుంది. నిజానికి సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక అపూర్వఘట్టం. తెలంగాణ ప్రజలు మొండి ప్రభుత్వం మెడలు వంచడానికి వాడి అరుదైన ఆయుధం. అది అంచనాలను మించి విజయవంతమైనప్పటికీ విమర్శలు మాత్రం తప్పడంలేదు.


సమ్మె వల్లనైనా సాకారం అవుతుందనుకున్న కల నెరవేరలేదన్న దిగులుతో కొందరు, ఇప్పుడు ఉద్యమాన్ని నడిపిస్తోన్న నాయకత్వం విఫలం కావాలన్న కోరికతో కొందరు విమర్శలు చేస్తుండవచ్చు. కానీ ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిష్పాక్షికంగా చూసేవారికి మాత్రం ఇదొక చరివూతాత్మక సందర్భం. ఉద్యోగులు సమ్మె చేస్తే రాష్ట్రం వస్తుందన్న భ్రమలు సమ్మె చేసిన ఉద్యోగులతో సహా ఉద్యమాలలో ఉన్నవారికి ఎవరికీ లేవు. సకలజనుల ఆకాంక్షను ప్రపంచానికి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎంచుకున్న పోరాట రూపాలలో సమ్మె ఒకటి. సమ్మె వల్ల, పాలన, పౌర జీవనం స్తంభించడం వల్ల పాలక వర్గాలు సమస్య తీవ్రతను గుర్తించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తాయని ఉద్యోగులు భావించారు

పైగా తెలంగాణ పౌర సమాజంలో ఒక బలమైన శక్తిగా ఉన్న ఉద్యోగు లు అది తమ బాధ్యతగా కూడా భావించారు. ముఖ్యంగా సమ్మె తెలంగాణ రాజకీయ శక్తులను ఏకం చేయడానికి దోహదపడుతుందని అనుకున్నారు. కానీ మనవి అవకాశవాద, ఆధిపత్య రాజకీయాలని రాజకీయవ్యవస్థలో ప్రజలకంటే పార్టీలు, వాటి ప్రయోజనాలే ముఖ్యం అయిపోయాయని గుర్తించడానికి 43 రోజులు పట్టింది. అదే ఉద్యమంలో అసలు విషాదం. అయినా ఉద్యమంలో భాగంగానే సమ్మెను చూడాలి తప్ప సమ్మె మాత్రమే ఉద్యమం అనుకోవడం పొరపాటు. అలాగే సమ్మె శాశ్వతంగా కొనసాగాలని అనుకోవడం కూడా అత్యాశే!  పైగా సమ్మెను సాకుగా చూపి తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని ప్రభుత్వం అత్యంత నిర్దయగా శిక్షించించింది.

అటువంటి పరిస్థితుల్లో ముందు కు రావాల్సిన ప్రాంతపు నేతలు రాజకీయ ఎత్తుగడలకు పాల్పడి సమ్మె లక్ష్యానికి తూట్లు పొడిచే విధంగా పనిచేశారు. ప్రభుత్వం దీనినొక అవకాశం గా తీసుకుని సమ్మె వ్యతిరేక ప్రచారం చేసి ఉద్యోగులను విలన్లుగా చూపే ప్రయత్నమూ చేసింది. పరిస్థితుల్లో సమ్మె సడలింపు మినహా మరో మార్గం ఏముంటుంది? ఇప్పుడు సమ్మె చేసినందుకే కాదు సమయస్ఫూర్తితో వాయిదా వేసుకున్నందుకు కూడా మనం ఉద్యోగులను అభినందించాలి. అదే సమయంలో సమ్మె మీద నీళ్ళు చల్లి ఉద్యమాన్ని ఆర్పేయాలని చూసిన వాళ్ళ గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకోవాలి.

ఉద్యమం వల్ల ఎవరు ఎంత నష్టపోయారన్న సంగతి వదిలేస్తే లాభపడింది మాత్రం కచ్చితంగా రాజకీయ పార్టీలే. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని రాజకీయ పార్టీలు కొన్ని వాళ్ళ బలాన్ని, బలగాలను పెంచుకుంటే, కొందరు నేతలు తమ తమ పార్టీల్లో వారి వారి పట్టు పెంచుకుంటున్నారు. కొత్త కుంపట్లు పెట్టుకున్నారు. ప్రజా ఆకాంక్షను, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని తమ అధినేతల దగ్గర, అధిష్ఠానాల వద్ద అయాచిత లబ్ధి పొందుతున్నా రు. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఇలా సజీవంగా కొనసాగడం అందరికంటే ఎక్కువ వాళ్ళకే అవసరం. బాధ్యతను వారిమీదే పెట్టవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమయింది.

తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు చరిత్ర పొడవునా ద్రోహం చేస్తూ వస్తో న్న పార్టీ కాంగ్రెస్. ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాస్ నుంచి వేరుచేసి మూడేళ్లకే తెలంగాణతో కలిపి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేసింది మొదలు ఇప్పటిదాకా అన్ని దశల్లో కాంగెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ప్రాంత కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ వాదం ఒక ముసుగు అయ్యింది. అవసరానికి జై తెలంగాణ అని తమ అధినేతలను, అధిష్ఠానాలను బెదిరించి పదవులు పొందడం చెన్నాడ్డి నుంచి జానాడ్డి దాకా పార్టీలో అందరికీ అలవాటై పోయింది. వారివారి వనరులతో, శక్తి యుక్తుల తో పదవులు పొందలేని ప్రతి నాయకుడూ కాంగ్రెస్ పార్టీలో ఇదే నినాదాన్ని ఎత్తుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అధికారంలో, పదవుల్లో ఉన్నవాళ్ళు ఎప్పు డూ తెలంగాణ అనలేదు.

ఇప్పుడు కూడా అనడంలేదు. ఒకరిద్దరు అలా అంటున్న వాళ్ళు ఉన్నా వాళ్లకు ఇప్పుడున్న పదవిపట్ల అసంతృప్తి వల్లనో, నాయకత్వంతో పొసగకపోవడం వల్లనో తెలంగాణ వాదాన్ని వాడుకోవాలనుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదని వాళ్ళ కార్యాచరణతో తేలిపోయిం ది. పార్టీగా కూడా కాంగ్రెస్ తాను అధికారంలోకి రావడానికి తెలంగాణను ఒక నిచ్చెనగా వాడుకుంటూ వస్తోందే తప్ప పార్టీకి ఒక విధానమేదీ లేదు. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు బాధ్యుడైన జవహర్లాల్ నెహ్రూవీలు కాదనుకున్నప్పుడు విడిపోవచ్చుఅన్నాడని చెప్పేవాళ్ళు పార్టీలో ఉన్నట్టుగానే, ‘తెలుగు వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కలిసే ఉండాలిఅని ఇందిరాగాంధీ పార్లమెంటులోనే చెప్పిందని తప్పించుకునే వాళ్ళూ ఉన్నారు. ఎప్పుడో పోయినవాళ్ళు చెప్పిన మాటలను పక్కనబెట్టి ఇప్పుడు సోనియా గాంధీ ఏమంటుందో ఒక్కడూ చెప్పడు. ఆమె కూడా పెదవివిప్పదు.

ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పాలన గాడిన పడుతోన్న సంకేతాలిస్తున్నారు, తెలంగాణ మంత్రులు కూడా ఆయనకు వీర విధేయులుగానే ఉంటున్నారు. తెలంగాణ విషయాన్ని సోనియా గాంధీ అంత ముఖ్యమెన విషయంగా భావించడం లేదని ఆమె వ్యవహార శైలిని గమనిస్తేనే అర్థమౌతుంది. నిజంగానే ఇదొక ముఖ్యమెన సమస్య అనుకుంటే చిదంబరం, మొయిలీ, ఆజాద్, అహ్మద్ పటేల్ ఇట్లా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆడుకునే అవకాశం ఉండేదికాదు. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యాయని ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడం అని ప్రగల్భాలు పలికిన ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇప్పుడు ప్రజలకోసం పదవిని వదులుకునే స్థితిలో లేడు. విసిగిపోయిన ప్రజలు అత్యంత విచారకరమైన పద్ధతుల్లో తద్దినాలు, పిండ ప్రదానా లు చేస్తున్నా మంత్రులు పదవులకు వేలాడుతున్న తీరు దారుణం.

రాయపాటి సాంబశివరావు అంటే ఏమో అనుకున్నాంగానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదవులు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని బలహీనులని ఇప్పు డు వారికి వారే నిరూపించుకుంటున్నారు. నిజానికి ప్రాంత్ర మంత్రుల కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యేది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తరువాత అన్నిగడువులు అయిపోయాక ఎంపీలతో పాటు మంత్రులు, కనీసం ఒక పదిమంది ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీని వదులుకోవడానికి సిద్ధపడితే రాష్ట్ర ప్రభుత్వ పునాదులు కదిలేవి. అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కచ్చితంగా సోనియా గాంధీ నోరువిప్పక తప్పేది కాదు. కానీ మన మంత్రులు మళ్ళీ ఎన్నికలదాకా ప్రజలతో పనిలేదని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగానైనా సరే కనీసం రెండేళ్ళు పదవిలో ఉన్నా చాలని అనుకుంటున్నారు

అలాగే ఎమ్మెల్యేలు కూడా బేరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలామందికి తెలంగాణ అనకుండా నోరుమూసుకుని పడిఉన్నందుకు డబ్బు సంచులు అందుతున్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్ళే ముందు సమ్మెకు సంఘీభావం తెలిపి తాము కూడా రంగంలోకి దిగుతామన్న ఉత్తరకుమారులు ఢిల్లీ నుంచి వచ్చీ రాగానేసమ్మె విరమించాలనిఅన్నారంటే వాళ్ళ ఆయువుపట్టు ఎక్కడుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు కదా! ఇవన్నీ తెలిసీ ఇంకా ఢిల్లీకి మొర పెట్టుకోవడం ఆంటే గోడకు తలబాదుకోవడం వంటిదే.

ఇక మరో పార్టీ తెలుగుదేశం. పార్టీ గురించి ఎంత మాట్లాడకుంటే అంత మంచిది. ప్రత్యేక తెలంగాణ విషయంలో రెండు కళ్ళ సిద్ధాంతంతో ప్రాచుర్యం పొందిన పార్టీ అధినేత హఠాత్తుగా తమ వైఖరి తటస్థం అని తేల్చేశారు. రాజకీయాల్లో తటస్థం ఉండదు. ఏదో ఒక పక్షం వైపు ఉండాలి, లేదా రెండు పక్షాలను కూర్చోబెట్టి సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం వెతకాలి. రాజనీతి ఆంటే అదే. అలాంటి వైఖరి సమంజసం కాదని తెలిసీ తెలంగాణ తెలుగుదేశం నాయకులు మీడియాలో తెలంగాణ వాదులుగా తెగ రెచ్చిపోతున్నారు.

వీరు సమ్మె విషయంలో ఎలా వ్యవహరించారో ప్రజలం తా గమనించే ఉంటారు. ముందు సమ్మెకు మద్దతు అన్నారు, తరువాత తమనెవరూ పిలవడం లేదని అలిగారు. అలా పిలవలేదని ఉద్యోగ సంఘాలను, సంఘాల నేతలను ఆడిపోసుకున్నారు. అమ్ముడుపోయారని, ఎన్నిక ల్లో టికెట్ల కోసం రాజీ పడుతున్నారని ఇట్లా అనేక అభాండాలు వేశారు. చివరకు నలభై మూడో రోజు పోలవరానికి సమ్మెకు లింకు పెట్టి అవమానకరంగా మాట్లాడారు. నలభై రోజులు పార్టీ పోషించిన విదూషక పాత్ర చూసిన ఎవరైనా పోగాలమనే అంటారు. అలా నిజాలు చెప్పినా వాళ్ళు భరించలేరు. అలా అంటే ఎవరినైనా సరే టీఆర్ఎస్ తొత్తులని మీడియాలో ముద్ర వేస్తారు. అట్లా అటు ఇటు కాకుండా ఉండడం పార్టీ అధినేతకు అలవాటైనట్టే, అడ్డదిడ్డంగా మాట్లాడడం తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలకు అలవాటయ్యింది. పోలవరం టెండర్ల విషయంలో పార్టీ వ్యవహరించిన తీరు పార్టీ పేలవత్వానికి అద్దం పడుతుంది. నిజమే పోలవరం టెండర్లునమస్తే తెలంగాణయాజమాన్యానికి సంబంధం ఉన్న కంపెనీకి వచ్చాయనుకుం దాం.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ అధినేత వెంటనే విషయాన్ని స్వయంగా ఎండ గట్టాల్సింది. టెండర్లు రద్దు చేయాలని అడగాల్సింది. కానీ ఆయన అలా చేయలేదు. ఆయనకంటే ముందుగా ఆయన పార్టీలోని సీమాంధ్ర నేతల కంటే ముందుగా రెచ్చిపోయింది రేవంత్ రెడ్డి. సాధారణంగా రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా మాట్లారనే నేను ఇంతకాలం అనుకున్నాను. ఆయన జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఢిల్లీ వెళ్లి పోలవరం ఒప్పందం కుదిర్చాడని అనడం ఆశ్చర్యం కలిగించింది. అంతటితో ఆగకుం డా అందుకు బహుమానంగా సకలజనుల సమ్మె విరమించారని యావత్ తెలంగాణను అవమానించారంటే వాళ్ళను ఏమనుకోవాలి? అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఉన్నారు కూడా. కానీ ఒక రాజకీయ పార్టీ అలా మాట్లాడడం ఒక్క భావ దారివూద్యమే కాదు కుట్ర పూరితం కూడా.! తెలుగు దేశం పార్టీ, టీఆర్ఎస్ మధ్య ఒక రాజకీయ యుద్ధం జరుగుతున్న మాట వాస్త వం. తెలంగాణ వైఖరి విషయంలోనే గొడవ మొదలయింది. ఒకే ఒక్క రాత్రిలో మానిఫెస్టో మరిచిపోయి, ఇచ్చిన మాటల్ని మరిచిపోయి అంతకు ఒక్క రోజు ముందు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మరిచిపోయి చంద్రబాబు సిసలైన సమైక్యవాదిగా మారిపోవడం సమస్యకు మూలం. ఇది ప్రజా వ్యతిరేకతకు, పార్టీ క్షీణతకు కారణం.

కానీ టీడీపీ దివాలాకు టీఆర్ఎస్ కారణమని అనడం ఆడలేక అన్న.. సామెతను గుర్తు తెస్తుంది. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం వైఖరికి నిరసనగా పార్టీని మిగలకుం డా చేయాలని కుట్ర చేసినా అది రాజకీయాల్లో అతి సాధారణ విషయం. రాజకీయ పార్టీ అయినా ఎదుటి పార్టీ ఉండకూడదనే అనుకుంటుంది. పార్టీ సిద్ధాంతం, ఎజెండా ఏదీ లేకపోతే ఎత్తుగడతోనైనా ప్రజలను నమ్మించాలి, గెలవాలి తప్ప, నేను మొనగాడినే కానీ ఎదుటివాళ్ళు ఓడించారని ఆడిపోసుకోవడం చేతగానితనం అవుతుంది. చేతగాని తనాన్ని అంగీకరించలేక సమ్మెకు, పోలవరానికి ముడిపెట్టినట్టు ఉంది తప్ప మరోటి కాదు. విచివూతమేమిటంటే పోలవరం సమస్యను రాజకీయంగా వాడుకునే తెలివికూడా తెలుగుదేశం పార్టీకి లేకుం డా పోయింది. పోలవరం విషయంలో ఒక కాంట్రాక్టర్గా లక్ష్మీ రాజంను నిలదీయలేరు. ఎందుకంటే అలాంటి కాంట్రాక్టర్లకు తెలుగుదేశంపార్టీ పెట్టిం ది పేరు. పైగా పోలవరం పాపం మొదటి దశలో పార్టీ పార్లమెంట్ సభ్యులే కాలువలు తవ్వి చేతులు కడిగేసుకున్నారు. అలాగే నమస్తే తెలంగాణలో వచ్చి వార్తకు ఇప్పటికే పత్రిక వివరణ ఇచ్చుకుంది. వివరణ ఎలా ఉన్నా వార్త చదివి నేను కూడా విస్మయానికి గురయ్యాను.

పోలవరాన్ని ఎవరూ సమర్థించరు. సమర్థించకూడదు. అది తెలంగాణ దుఃఖదాయిని. ప్రాజెక్టు మీద తెలంగాణలోని పార్టీలన్నీ కచ్చితంగా తమ తమ వైఖరులు ప్రకటించాలి. ప్రత్యక్షంగా అక్కడి ప్రజల పోరాటానికి నాయకత్వం వహించి వెంటనే పనులు ఆపించాలి. ఇన్ని అభాండాలు వచ్చిన నేపథ్యంలో న్యాయ పోరాటాన్నే కాదు న్యాయం జరిగేదాకా ప్రజా పోరాటాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ తీసుకోవాలి. ఇప్పట్లో తెలంగాణ తేలినా తేలకపోయినా ఉద్యమం ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజాసంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలది. తెలంగాణ జేఏసీ కూడా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచి కొంతకాలం సకల జనులకు విరామం ఇవ్వడం మంచిదేమో ఆలోచించాలి

మంగళవారం, అక్టోబర్ 18, 2011

కాంగ్రెస్ లక్ష్యంగానే కార్యాచరణ



ప్రభుత్వోద్యోగులు భద్ర జీవులని చాలామంది అనుకుంటారు. ఉద్యో గం ఉంటే కడుపులో చల్ల కదలకుంటా పనిచేసుకోవచ్చని, నెలతిరిగే సరికి జీతం వస్తుంది కాబట్టి జీవితం ప్రశాంతంగా గడిపేయవచ్చని అనుకుంటారు. ఉద్యోగులకు కేవలం భద్రతతో కూడిన జీవితమేకాదు అంతకు మించిన బాధ్యతలు కూడా ఉంటాయని మనలో చాలా మందిమి గుర్తించం. నిజాని కి ఒక సాధారణ పౌరుడికి ఉండే స్వేచ్ఛ, స్వతంవూతతలో సగం కూడా ఉద్యోగులకు ఉండవు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వంలో, పాలకవర్గంలో భాగం. పాలకుల్లో మనకోసం చట్టాలు, అభివృద్ధికి కావాల్సిన పథకాలు రూపొందించే వాళ్ళు, వాటిని అమలు చేసేవాళ్ళు, అవి సరిగా అమలవుతున్నాయో లేదో చూసేవాళ్ళు ఉంటారు. అందులో రాజకీయ వ్యవస్థ ఒక భాగమైతే, ఉద్యోగవర్గం మరో భాగంగా ఉంటుంది.

రాజకీయ వ్యవస్థ చూపిన మార్గంలో ఉద్యోగులు పనిచేసి ప్రజల ఆలనా పాలనా చూస్తారు. ప్రజల అభివృద్ధికి దోహద పడతారు. ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోయినా ఆప్రభుత్వం మీద తిరగబడే అధికారమో, అటువంటి పాలకులను గద్దె దించే అవకాశమో ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉంటాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో గుండెకాయ లాంటివారు. అధికార యంత్రాంగం లో ఉద్యోగులు పనిచేయకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుంది. కాబట్టే ఒక సామాన్య పౌరుడికి ఉండే బాధ్యతలకంటే వారికి ఎక్కువ బాధ్యతలు, నిబంధనలు ఉంటాయి. ఉద్యోగంలో చేరే ముందే ప్రతి ఉద్యోగి, తన బాధ్యతలు గుర్తించి, నిబంధనల మేరకే పనిచేస్తానని, ప్రభుత్వానికి విధేయతతో ఉంటానని లిఖిత పూర్వకంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టే ఉద్యోగులకు కూడా పౌరులకు ఉండే అన్ని హక్కులూ ఉన్నప్పటికీ వాటిని యథేచ్ఛగా వాడుకునే స్వేచ్ఛ ఉండదు.

అటువంటిది తెలంగాణ ఉద్యోగులు ఆ పాలకు ల మీదనే తిరగబడి చారివూతాత్మకమైన రీతిలో ప్రజల పక్షాన నిలబడ్డారు. రాష్ట్ర సాధనకోసం సాగుతున్న పోరాటం ఇప్పు డు కీలక దశలో ఉన్నదని గుర్తించి తమకున్న హక్కు లు అవకాశాల పరిధిని విస్తరించారు. ఉద్యోగులకు కొన్ని ప్రత్యే క హక్కులు ఉంటాయి. అవి ఆయా వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఎదురయ్యే చిక్కులను తొలగించుకోవడానికి తోడ్పడతా యి. వాటిల్లో ముఖ్యమైనది సమ్మె చేసే హక్కు. ఇన్నేళ్ళ మన చరివూతలో ఇలాంటి సందర్భాలు తక్కువ. కానీ తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసి తమకున్న శక్తినంతా ఉద్యమం కోసం వెచ్చించారు. ఆంధ్రా పాలకుల అన్యాయాలకు, అవహేళనకు గురౌతున్నారో తెలిసిన తరువాత కూడా మౌనం గా ఉండడం మంచిది కాదనుకున్నారు. యాభై ఏళ్లుగా జరిగి న చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు, కమిషన్ల నివేదికలు ఏవీ అమలు కాలేదు కాబట్టి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే తప్ప తమ పరిస్థితిలో మార్పు రాదని గ్రహించారు.

పదేళ్లుగా జరుగుతున్న ప్రత్యక్ష రాజకీయ పోరాటాలు, ప్రజాస్వామ్య ఉద్యమాలను పాలకులు గుర్తించకపోవడం వల్ల ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు బలి దానాలు చేస్తుంటే చలించ ని ప్రభుత్వ ఉదాసీనతను తట్టుకోలేక సమ్మె సైరన్ మోగించారు. నిజంగానే ఇది అతిగొప్ప సాహసం. ఇప్పటిదాకా దేశంలో వచ్చిన ఉద్యమాలలో ఎక్క డా అవలంబించని వ్యూహం. తెలంగాణ ఉద్యోగులు ఈ తెగువను ప్రదర్శించే ముందు తమ సమ్మెకు చట్టబద్ధత ఉందని నిరూపించగలిగారు. తెలంగాణ సమాజం విముక్తయితే తప్ప తమకు విముక్తి లేదని, అందుకు రాష్ట్ర ఏర్పాటు మినహా మరో మార్గం లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమం ఇంతటి చతురత ప్రదర్శించలేకపోయింది. అప్పుడు ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశా రు. ఇప్పుడు ఒక దశాబ్ద కాలంగా ఉద్యమం సజీవంగా ఏదో ఒక రూపంలో నిరంతరం సాగుతోంది.

సమాజంలోని అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలోకి వివిధ దశల్లో వచ్చిచేరడం వల్ల తెలంగాణ ఉద్యమానికి పరిపూర్ణమైన ప్రజాస్వామిక స్వభావం వచ్చింది. అంతేకాదు ఇవ్వాళ పాలక వర్గాల్లో భాగంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణవాదాన్ని గుర్తించి అందుకు కావాల్సిన హామీని ఇచ్చి వున్నాయి. అలాగే రాష్ట్ర శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరంతా ఇప్పటికే ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం దాన్ని ఆమోదించడం కూడా జరిగిపోయింది. అంటే ఒక రాజకీయ ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం పాలకుల ఆమోదం ఇప్పటికే పొందింది. ఆ పాలక వర్గాలు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడతామని చెప్పి రెండేళ్లు దాటింది. అలాంటి పరిస్థితుల్లో ఆ పాలనా వ్యవస్థలో భాగంగా ఉద్యోగులు మధ్యలో ఆగిపోయిన ఆ ప్రక్రియను గుర్తుచేయడం తమ బాధ్యతగా భావిం చి సమ్మెకు దిగారు.

అయినా..మన సమాజంలో ‘ఉద్యోగులు సమ్మె విరమించాలి’ అని హుకుం జారీ చేసిన వాల్లున్నట్టే, ‘ఎందుకు, ఎలా విరమిస్తారు’? అని ప్రశ్నించే పెద్దలూ పుట్టుకువచ్చారు. అయినా ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పటికే ఉద్యమం, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించిన స్వామిగౌడ్ ముందస్తుగానే సమాధానం చెప్పి ఉన్నారు. ఉద్యోగులు శాశ్వతంగా సమ్మెలోనే ఉండా లి, శాశ్వతంగా తెలంగాణ ఉద్యమం ఇదే పద్ధతిలో నడవాలని కోరుకోవడాన్ని మించిన వంచన ఇంకోటి ఉండదు.

కానీ పరిణామాలు అందుకు భిన్నంగా మారిపోవడమే ఇవాళ్టి విషాదం. మొదటగా ఈ సమ్మెలో ఉద్యోగుల నాయకత్వంలో ప్రజలు చారివూతాత్మకమై న విజయాన్ని పొందారు. ఇదొక చరిత్ర ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇంత సంఘటిత పోరాట రూపం ఎప్పుడూ వ్యక్తం కాలేదు. అయితే రాజకీయాల్లో ఇటువంటి ద్రోహానికి కూడా చరివూతలో ఎవరూ సాహసం చేయలేదు. ఈ సమ్మె వల్ల రాజకీయ ఐక్యత సాధించాలనుకున్న ఉద్యోగ సంఘాల లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఇది మన రాజకీయ వైఫల్యం. రెండో వైపు సమ్మె వ్యతిరేకవాదం ఒకటి ఇప్పుడు తెరమీదికు వచ్చింది. పాలనా ప్రక్రియలో ఏర్పడ్డ ప్రతిష్టంభనను గుర్తు చేసినందుకు ఆ బాధ్యతను తాము మరిచిపోలేదన్న మాట కూడా చెప్పలేదు సరికదా వారిని వేధించే చర్యలు, వారికి నాయకత్వం వహిస్తోన్న వారి మీద వేటు వేసే చర్యలకు శ్రీకారం చుట్టింది. సమ్మెను నీరుగార్చి ఉద్యోగులను నిలదీయాలని చూసింది. తద్వారా తెలంగాణ వాదానికి తూట్లు పొడవాలని అనుకుంది. దాదాపు ఐదు వారాలుగా కొనసాగుతోన్న సమ్మె మీద ఉక్కుపాదం మోపడమే కాదు, తెలంగాణ సమా జం నుంచే ఉద్యోగుల మీద కొందరిని తిరుగుబాటు చేసే విధంగా ఉసిగొ ల్పింది.

సింగరేణి సమ్మె విషయంలో కరెంటు సమస్యను, రైతుల ఇక్కట్లను, ఆర్‌టిసి సమ్మె విషయంలో ప్రయాణికుల ఇబ్బందులను, పాఠశాలలు మూసివేసినందు వల్ల విద్యార్థులు వారి భవిష్యత్తును పావులుగా చేసుకుని మొత్తంగా సమ్మె లేకుండా చేయాలని ప్రభుత్వం వేసిన పాచికలన్నీ బాగానే పారినట్టు కనిపిస్తున్నాయి. సమ్మె అంటే యజమానికి, పాలకుడికి, నియంవూతిస్తోన్న వ్యవస్థకు వ్యతిరేకంగా సాగే సామూహిక నిరసన. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రధానంగా చేయాల్సింది ప్రజలకు ఇబ్బంది లేని పాలన, పౌర జీవితం ఎలాంటి సమస్యలు, అవాంతరాలు లేకుండా కొనసాగేలా చూసుకోవడమే పరిపాలన. ఆ పరిపాలనను స్తంభింపజేసి, ప్రభుత్వానికి సమస్యను నివేదించడం సమ్మె ఉద్దేశ్యం. ప్రజాస్వామ్యంలో ఉద్యోగులు, కార్మికులు ఇలాంటి నిరసన తెలియజేసినప్పుడు ఆ ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అందు కు తాత్కాలికంగా ప్రత్యామ్నాయాలు వెతికి పౌరసేవలు కొనసాగేలా చూస్తా యి. ఈ లోగా సమ్మెలో ఉన్న వారితో చర్చిస్తాయి, సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుకుతాయి.

ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడి ప్రభుత్వం ఉద్యోగులను తమలో భాగంగా కాకుండా కేవలం ఒక ప్రాంతపు ప్రజలుగా మాత్ర మే చూసింది. ‘మీరు సమ్మె చేస్తే మీ వాళ్ళే నష్టపోతారు మాకేంటి?’ అనడ మే కాదు,అట్లా నష్టపోయేలా చూసింది. ఆ నష్టాన్ని ఇంకా ప్రత్యక్ష్యంగా ప్రజ ల మీద రుద్దింది. నష్టం జరుగుతోంది ఇక సమ్మె చాలించండి అనే ఒక వర్గా న్ని తయారు చేసింది. ఇది నిజానికి అన్నిటికంటే ఆందోళన కలిగించే విష యం. తమకు నష్టం జరుగుతున్నా సరే సమ్మె చేసే వారిపట్ల సానుభూతితో ఉండడమే ప్రజాస్వామిక లక్షణం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

పరిపాలన, ప్రజాస్వామ్యం, పార్లమెంటు అంటే ఏమిటో తెలిసిన ఉద్యోగులకు పరిష్కారం తమ చేతుల్లో లేదని తెలుసు. రాజకీయ సంక్షోభం ఒక్క దానికి పరిష్కారమని, అది పరిష్కరించాల్సిన వాళ్ళు చేతులు ముడుచు కు కూర్చున్నారని కూడా వాళ్లకు ఎప్పుడో అర్థమైపోయింది. ఇవన్నీ తెలిసే ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉద్యమకారులు, సంఘాలు, సంస్థలు, విడివిడిగా ఈ ఆకాంక్ష న్యాయమైనదని నమ్మి పోరాడుతున్న పౌరసమాజం స్పందిస్తాయని భావించారు. నిజానికి రాజకీయ పార్టీల నుంచి ఆ మేరకు హామీలు కూడా పొందారు. జేఏసీలో భాగంగా ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు అలాగే జేఏసీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా సమ్మెకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. సభలు పెట్టారు, మాట్లాడారు. కానీ తీరా ప్రభుత్వం రంగంలోకి దిగే సరికి వాళ్ళ అసలు స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. ఒక రకంగా వీళ్ళంతా ఉద్యోగుల్ని, ప్రజల్ని యుద్ధరంగంలోకి తోసేసి ఇప్పుడు యుద్ధమే తప్పని అంటున్నారు.

ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరిపోవాలని చేసిన ప్రకటన ఉద్యమ ద్రోహానికి పరాకాష్ట. నిజానికి జేఏసీ ఏర్పాటు చేసిన వాళ్ళలో కేసీఆర్‌తో పాటు జానాడ్డి సమాన బాధ్యుడు. అలాగే ఉద్యోగులు సమ్మెకు దిగాలని, సకలజనుల సమ్మె కు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పినవాడు. అధిష్ఠానం తెలంగాణ ప్రకటన చేయకపొతే రాజీనామా చేస్తానని, ఆమరణ దీక్షకు దిగుతానని బీరాలు పలికిన వాడు. ఇవన్నీ నిజమే అనుకుని ఉద్యోగులతో సహా సకలజనులూ సమ్మెకు దిగితే, ఆ సమ్మెను నిరంకుశంగా ప్రభుత్వం అణచివేస్తున్న సందర్భంలో ప్రజలతో ఉండాల్సిన మనిషి, సమ్మె విరమించాలని హుకుం జారీ చేయడం ముమ్మాటికి ద్రోహమే అని మధుయాష్కి లాంటి ఎంపీలు అంటున్నారు. నిజమే అది ద్రోహమే. కానీ ఈ ద్రోహం ఒక్క జానారెడ్డిదేనా? కాంగ్రె స్ పార్టీ ద్రోహి కాదా? అన్న దానికి ఇటు ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి, అటు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా చెలామణి అయ్యే యాష్కి గారే చెప్పాలి.

అసలు జానాడ్డికి ద్రోహం చేసే అంత సీన్ ఉందా? అన్నది కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే నమ్మించే శక్తి ఉన్నవాడే ద్రోహం చేయగలుగుతాడు. ఈ సారి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను నమ్మించే సత్తా ఉన్న మనిషి కాంగ్రెస్‌లో కాదు గదా ఏపార్టీలో కూడా పుట్టలేదు. టీఆర్‌ఎస్‌తో మొదలైన ఉద్యమం ఇప్పుడు ప్రజా ఉద్యమమై ఎదిగింది. ఇప్పుడు ఆ ఉద్యమం టీఆర్‌ఎస్ చేతుల్లో కూడా లేదు. అలాంటిది జానాడ్డి ద్రోహం చేశాడని అనడం ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదించడ మే అవుతుంది. అప్పుడైనా యిప్పుడైనా భవిషత్తులో ఇంకెప్పుడైనా సరే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే విలన్ నెంబర్ వన్.ఇప్పుడు టార్గెట్ చేయాల్సిం ది కాంగ్రెస్‌నే. ఆ పార్టీకి అలాంటి అపవూపద రాకుండా కాపాడడం కోసం బహుశా మధుయాష్కి జానాడ్డిని బలిచేయాలని చూస్తుండవచ్చు. అప్పుడు 370 మందిని చంపేసింది కాంగ్రె స్ ప్రభుత్వమే అయినా ప్రలోభాలతో లొంగదీసుకుని చెన్నాడ్డిని ద్రోహిగా చరివూతలో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 700 మంది బలి దానాల తరువాత జానాడ్డికి ఆ ముద్ర వేయాలని అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అయినా కాంగ్రెస్‌లో ద్రోహులను లెక్కబెట్టాల్సి వస్తే వరుస క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ ఉంటారు. ఒకరు ముందు ఇంకొకరు వెనక అంతే తేడా! ఇప్పుడు చివరి దశలో ఉన్న ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా అణచివేసి ఎవరూ నోరెత్తకుండా చేసే పనిలో ఆ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లో ముఖ్యమంత్రి, గవర్నర్ జరిపిన చర్చల సారాంశం ఏమి టో ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది. ఉద్యోగుల వ్యవహరిస్తున్న తీరు, సమ్మె విరమణకు, విచ్ఛిన్నానికి చేసి న ప్రయత్నాలు మొదలు రైల్‌రోకోను అడ్డుకున్న తీరు గమనిస్తే ఇక ఈ రాష్ట్రం లో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లినట్టే అనిపిస్తోంది. ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమంపై హఠాత్తుగా ఉక్కుపాదం మోప డం, మాట్లాడే ప్రతి ఒక్కరి గొంతులు నొక్కి జైళ్లలో పెట్టడం ఎమ్జన్సీ నాటి పద్ధతులు. ఆ వ్యూహంలో భాగంగానే కాస్తో కూస్తో చురుకుగా ఉన్న కాంగ్రెస్ నేతలను కూడా అణచివేసి నోరు నొక్కాలని చూస్తోంది. అన్నిటికీ మించి మహిళా ఉద్యమకారులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మరీ హేయంగా ఉంది.

పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, తెలంగాణ జాగృతి నేత కవిత, ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాడుతున్న విమల లాంటి వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన పధ్ధతి దారుణం. రాత్రంతా హైదారాబాద్ రోడ్ల మీద తిప్పి, పలు పోలీ సు స్టేషన్లు మార్చి వేధించిన తీరు చట్టబద్ధమేమో నాకైతే తెలియదు గాని ధర్మబద్ధమైతే కాదు. అలాగే ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రజా సంఘాల నేతలతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో వ్యవహరించిన పధ్ధతి, పెట్టిన కేసులు రేపటి పరిణామాలకు సంకేతంగానే భావించాలి. ప్రజల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించే బలం తెలంగాణ పేరుతో పదవుల్లో ఉన్న మంత్రులకు ఎలాగూ లేదు. కనీసం వాళ్ళ పార్టీ నేతలను విడిపించుకోగలిగే స్థితిలో కూడా లేనప్పుడు వాళ్ళ అధికారానికి అర్థమే లేదు. మంత్రులుగా ఎలాగూ మాట చెల్లే పరిస్థితి లేదు కాబట్టి కొందరు రాజకీయాల్లోకి రాకముందు వాళ్ళు నేర్చుకున్న విద్యలను రోడ్ల మీద ప్రదర్శిస్తున్నారు.

జై తెలంగాణ అని నినదించిన ఒక యువకుడి మీద నడివీధిలో మంత్రి దానం తన దాదాగిరి ప్రదర్శించారు. విచివూతమేమిటంటే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం కూడా మంత్రికి వర్తించ డం లేదు! ఇప్పటిదాకా సహనంతో అన్ని ప్రజాస్వామిక పద్ధతులను ప్రజలు ఆచరిస్తూ, అవలంబిస్తూ వచ్చారు. దాదాపు నలభై రోజుల సకల జనుల సమ్మె తెలంగాణ ప్రజల సహనానికి చివరి పరీక్ష. అయి నా స్పందించకుండా ఇప్పుడు తెలంగాణలో భయోత్పాతం సృష్టించి ఉద్యమంలో హింసను ఎగదోయాలని ప్రభుత్వం చూస్తున్నట్టు కనిపిస్తోంది. అదే వారి వ్యూహమైతే అందులో ముందుగా ఆహుతయ్యేది కూడా కాంగ్రెసే అని తెలుసుకుంటే మంచిది. ఇది ప్రజల ఆకాంక్షతో ఆడుకోవాలని చూసే అందరికీ వర్తిస్తుంది.

మంగళవారం, అక్టోబర్ 11, 2011

నాయకులకు ఇది పరీక్షా సమయం!



తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చలేమని ఢిల్లీ పెద్దలకు అర్థమయిపోయింది. ఒకటి రెండు రోజుల్లో విషయమై ఏదో ఒక ప్రకటన రావొచ్చనీ అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీతో పనిలేకుండా ప్రభుత్వమే హోం శాఖ ద్వారా ఒక ప్రకటన చేస్తుందన్న వార్తలు వచ్చాయి. నిజానికి మొదట విషయాలు మీడియాకు చెప్పింది ఆంధ్రవూపదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్. ఆయన సోనియాగాంధీ అంతరంగికుల్లో ఒకరు. సోనియాగాంధీతో సమావేశమైన అనంతరమే ఆయన సంకేతా లు ఇచ్చినట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. వార్తలేవీ తెలంగాణ ప్రజానీకా న్ని పెద్దగా ఉత్సాహ పరచలేదు. ఎందుకంటేఏదో ఒకటిఅనడంలో తెలంగాణ అనుకూలత ఏదీ లేదు. రెండు సంవత్సరాలుగా ఊరించి ఇప్పుడు రుచీ పచీ లేని మాటలు చెప్పడం తెలంగాణ వాదులేవరికీ పెద్దగా ఊరటనిచ్చే విషయం కాదు. కానీ వెంటనే రెండవ రాష్ట్రాల పునర్విభజన కమి షన్ (ండో ఎస్ఆర్సి ) వేయబోతున్నారన్న కథనాలు కొంత కలవరపెడుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ పరిణామాలపై జాతీయ కాంగ్రెస్లోని కొందరు నేత లు చేసిన ప్రకటనలను తెలుగు మీడియా తనకు తోచిన రీతిలో విశ్లేషించి కలవరానికి కారణం అయ్యింది. సహజంగానే ఏదో రకంగా తెలంగాణ ఏర్పాటు వాయిదా పడితే బాగుండునని అనుకుంటున్న వాళ్లకు ఇదొక మంచి ఆసరా అయ్యింది. అలాగే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్ర తెలిసిన వారికి పార్టీ అలాంటి ప్రయత్నమేదో చేసి కావాల నే సమస్యను మరింత సాగదీయవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీ పేరుతో రెండేళ్ళ కాలాన్ని వృథా చేసిన కాంగ్రెస్ సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేయవచ్చన్న సంకేతాలు అందుతున్నాయి. అదే గనుక జరిగితే ప్రయత్నాన్ని తిప్పికొట్టే బాధ్యత ఇంతకాలం ప్రజలను కేంద్ర ప్రభు త్వం తరఫున, తమ అధిష్ఠాన వర్గం తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్లమెం టు సభ్యులు తీసుకోవాల్సి ఉంటుంది

ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియకపోయినా ఏదో జరుగుతున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరవూపదేశ్ విభజనకు సంబంధించి మాయావతి చేసిన ప్రకటన అక్కడి కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తరవూపదేశ్ ఎన్నికలు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ భవిష్యత్తుకు ఒక సవాలుగా మారాయి.

ఎలాగైనా యూపీలో పైచేయి సాధించాలని పార్టీ చేస్తోన్న ప్రయత్నాలకు మాయావతి యూపీ విభజన ప్రతిపాదనతో చెక్ పెట్టారు. మాయావతి మొదటినుంచీ చెపుతున్నట్టుగానే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని, ఆయన 1955లో చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతున్నారు. మేరకు ఆమె నవంబర్ చివర్లో శాసన సభలో ఒక తీర్మానం కూడా పెట్టబోతున్నారు. చిన్న రాష్ట్రాల వల్ల యూపీ రాజకీయాల్లో అగ్రవర్ణాలు ముఖ్యం గా బ్రాహ్మణ, జాట్ సామాజిక వర్గాల అండతో కాంగ్రెస్, బీజేపీలు చక్రం తిప్పకుండా చేయాలని అలాగే యాదవ, ముస్లిం బలగాలను నమ్ముకుని తన కొడుకు అఖిలేష్ యాదవ్ను అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తోన్న ములాయం సింగ్ను నిలువరించి కొత్తగా ఏర్పడే నాలుగు రాష్ట్రాల్లో దళిత బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలన్నది మాయావతి కల. కల ఎలా వున్నా ఆమె ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలతో పాటు సమాజ్ వాదీ పార్టీలలో కలకలం సృష్టిస్తున్నది. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళే ముందే ఆయా పార్టీలు విభజన పై వారి వారి వైఖరులు చెప్పాల్సి ఉంటుంది.

విచివూతమేమిటంటే ఉత్తరవూపదేశ్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క ప్రాంతంలో జనాదరణ కలిగిఉంది. కాబట్టే తరచుగా వాళ్ళు కూడా యూపీ విభజన గురించి మాట్లాడుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి బుందేల్ ఖండ్ కావాలని అంటోంది. యూపీలోని ఏడు జిల్లాలు మధ్యవూపదేశ్లోని పన్నెండు జిల్లాలను కలిపి బుందేల్ ఖండ్ పేరుతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతోంది. ప్రాంతంలో మొదటినుంచీ కాంగ్రెస్ కొంత బలంగా ఉండడం మూలంగా పార్టీ బుందేల్ఖండ్ ఏర్పాటుకు మద్దతునిస్తోంది. బుందేల్ఖండ్ ఏర్పడితే మధ్యవూపదేశ్లో బీజేపీ బలం తగ్గించవచ్చన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. అలాగే బుందేల్ఖండ్ ప్రజల ఆశీస్సులతో అక్కడ అధికారంలోకి రావోచ్చన్న ఉద్దేశ్యంతో పార్టీ ఉంది. పశ్చిమ ఉత్తరవూపదేశ్లో కొంత బలం, జాట్ కులస్తుల బలగం ఉన్న అజీత్ సింగ్ కూడా ఈసారి కాంగ్రెస్కే మద్దతునిస్తున్నారు. ఆయన పశ్చిమ ప్రాంతం హరితప్రదేశ్గా అవతరించాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికి కాంగ్రెస్ హరితప్రదేశ్ పై తన వైఖరిని చెప్పనప్పటికీ అజీత్ సింగ్ మాత్రం అనేక ఆశలతో ఉన్నాడు.

బుందేల్ఖండ్లో ఉద్యమ సానుభూతి, అజిత్ సింగ్ మద్దతు ఇటివలి కాలంలో దగ్గర అవుతున్న ముస్లింల అండతో అధికారానికి దగ్గర రావొచ్చన్నది కాంగ్రెస్ ఆశ. ఇప్పుడు మాయా నాలుగుముక్కలు అనే సరికి కాంగ్రెస్ అయోమయంలో పడిపోయింది. అయోమయంలో నుంచి తెరుకోవడానికే పార్టీ రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణను ముందుకు తీసుకువస్తోంది. వెంటనే ఒక్క బుందేల్ఖండ్కు మాత్రమే మా మద్దతు అని చెపితే మిగితా మూడు ప్రాంతాలలో జనం తిరగబడే ప్రమా దం ఉంది కాబట్టి పార్టీ తాత్కాలికంగా తప్పించుకోవడానికి ఇప్పుడు ఎస్ ఆర్సి అంటోంది. బహుశా బీజేపీ కూడా ఎస్ఆర్సికి ఓకే అనక తప్పని పరిస్థితి. అందుకే పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మొదట్నుంచీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్తూ వస్తోన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యూపీ విషయంలో ఏం చేయాలో తోచని అయోమయంలో పడింది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగితే హిందూ ఓటు బ్యాంకు విడిపోతుంది.

నిజానికి హిందుత్వ ఎజెండా పట్ల అంతో ఇంతో ఆకర్షణ ఉన్నది యూపీ లోనే. విభజనను గట్టిగా వ్యతిరేకిస్తున్నది మాత్రం ఒక్క సమాజ్వాదీ పార్టీ మాత్రమే. రాష్ట్రం కలిసి ఉంటేనే ముస్లిం ఓట్లు చెక్కు చెదరకుండా ఉంటాయని, అలాగే ఆధిపత్య బీసీ వర్గాలు ప్రధానంగా యాదవులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నందువల్ల కలిసి ఉంటేనే తనకు ప్రయోజనమని ములాయం సింగ్ యాదవ్ భావిస్తున్నారు. మొత్తానికి మాయావతి ప్రకటన వెనుక పకడ్బందీ రాజకీయ వ్యూహం వుందనడంలో సందేహం లేదు. పక్కా వ్యూహాలు రూపొందించి ప్రత్యర్థులను బిత్తర పోయేలా చేయడంలో ఆమె దిట్ట. ఇప్పుడు యుపిలో నాలుగు రాష్ట్రాలు అని ఆమె మూడు కూటములకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. నేపథ్యంలో ఇప్పుడు ఎస్ఆర్సి అలాగే మళ్ళీ తెలంగాణ చర్చలోకి వస్తోంది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేయబోయే రెండో ఎస్ఆర్సి పరిధిలోకి తెలంగాణను కూడా తెస్తారని కొందరు గట్టిగా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నిజంగానే రెండో ఎస్ఆర్సి వేసి కొత్త కొరివిని కొని తెచ్చుకుంటుందా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు చిన్నరాష్ట్రాలకు సంబంధించి అనేక డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ లాగా తెగించి పోరాడుతున్న వాళ్ళు లేకపోవచ్చు కానీ ప్రజల్లో ఆకాంక్షలు మాత్రం ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో పార్టీ ఉన్నా అలాంటి డిమాండ్లను అప్పటికప్పు డు ఏదోరకంగా పరిష్కరిస్తూ వస్తునాయి. అంతేతప్ప మన దేశంలో రాష్ట్రాల విభజనకు ఒక ప్రాతిపదిక ఒక విధానం అంటూ లేదు. పరిస్థితుల్లో ఎస్ఆర్సి వేసే సాహసం కాంగ్రెస్ పార్టీకి ఉందని నేననుకోను. మహా అయి తే యూపీ గండం గడిచే దాకా ఎస్ఆర్సీ మంత్రం జపిస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ చరివూతలో కీలకమైన 2014 ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం నిజంగానే కొరివితో తల గోక్కోవడం అవుతుంది.

ఎస్ఆర్సి వేయడం సులభమే, కానీ తరుణంలో దేశంలోని రాష్ట్రా లను పునర్ వ్యవస్థీకరించడం కష్టం. 1953లో వచ్చిన మొదటి ఎస్ఆర్సికే రాష్ట్రాల విభజన చాలా కష్టమయింది. ఫజల్ అలీ ఆధ్వర్యంలోని మొదటి ఎస్ఆర్సి ప్రక్రియను, సిఫార్సులను అంబేద్కర్ మొదలు రాజగోపాలచారి దాకా చాలామంది విమర్శించారు. రాష్ట్ర విభజనకు కమిటీ ఎన్నుకున్న పద్ధతిని, ప్రామాణికతను అంబేద్కర్ తప్పుపట్టారు. దక్షిణ భారతదేశాన్ని అనేక ముక్కలు చేసి ఉత్తరభారత దేశంలో ఉత్తరవూపదేశ్ లాంటి రాష్ట్రాలను విడగొట్టకుండా ఒక దేశమంతా పెద్దగా ఉంచడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి.

నిజానికి అప్పటికి దేశం అప్పుడే స్వాతంత్రం వచ్చిన ఉద్వేగంలో ఉంది. జాతీయ భావమే తప్ప పెద్దగా ప్రాంతీయ అస్తిత్వాలు లేని రోజులవి. అప్పుడు కమిటీ ఇంకొంత శ్రద్ధ పెట్టినా, లేదా శాస్త్రబద్ధంగా ఆలోచించినా ఇప్పుడు ఇన్ని చిక్కులు ఉండేవికాదు. అయినా కమిటీ ప్రజల ఆకాంక్షలను గుర్తించనట్టే ప్రభుత్వం కూడా కమిటీ నివేదికను గౌరవించలేదు. ముందుగా తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు రెండూ ఏర్పాటు చేసి 1961-62 ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడే తెలంగాణ తొలి శాసనసభ ఆమోదిస్తేనే రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు చేయాలన్న సిఫారసును అప్పటి కాంగెస్ పెద్దలు బుట్టదాఖలా చేసారు. ద్రోహం ఇప్పటికీ తెలం గాణ ప్రజలను వెంటాడుతూనే ఉన్నది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తెలంగాణను రెండో ఎస్ఆర్సికి నివేదించాలని అనుకుంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. తెలంగాణ విషయంలో ఇప్పుడు కేంద్రం చేయాల్సింది, మొదటి ఎస్ఆర్సిని గౌరవించడం. లేదా యూపీ రూపంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చివున్న హామీలను, నెరవేర్చడం. అంతే తప్ప యూపీ నాటకం లో ఏపీ సమస్యను కలిపితే మొదటికే మోసం ఉంటుంది.

అయినా తెలంగాణ సమస్య కొత్తది కాదు. ప్రాంతానికి ఇప్పటికే ఒక నిర్వచనం మాత్రమే కాదు, చరిత్ర కూడా ఉన్నది. అదంతా మొదటి ఎస్ఆర్ సిలో రికార్డ్ అయి ఉన్నది. చరివూతలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు గత అరవై సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. అంతే కాదు ఉద్యమాలు సాగినప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసి ఉన్నాయి. ఇప్పటికే కనీసం పది పన్నెండు కమిటీలు తెలంగాణకు అన్యా యం జరిగిన సంగతి తేల్చి చెప్పాయి. అలాంటి తెలంగాణను మళ్లీ ఎస్ఆర్సి పరిధిలోకి తేవడం పార్లమెంటరీ సాంప్రదాయానికి కూడా విరు ద్ధం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పేరుతో దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నామని, ప్రక్రియ మొదలు కాబోతున్నదని కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. డిసెంబర్ 10 పార్లమెంటులో చిదంబ రం చేసిన తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఇంకా అలా గే సజీవంగా ఉన్నది. దానిపై అదే పార్లమెంటులో కనీసం రెండు మూడు సార్లు చర్చ కూడా జరిగింది. చివరి సారి చర్చ సందర్భంగా కూడా కేంద్ర హోంమంత్రి త్వరలోనే పరిష్కరిస్తామని సభకు హామీ ఇచ్చారు. ఇప్పు డు తెలంగాణకు కావాల్సింది కేవలం రాజకీయ నిర్ణయం.

ఎస్ఆర్సి రాజకీయ నిర్ణయాలు తీసుకోదు. అది కేవలం ప్రభుత్వ విధివిధానాలు అనుసరించి రాష్ట్రాల మధ్య సరిహద్దులు గుర్తిం చి ఆయా రాష్ట్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను చర్చిస్తుంది, తెలంగాణ రాష్ట్రం కొత్తగా సరిహద్దులు గుర్తించాల్సినది కాదు. చరివూత పొడుగు నా తెలంగాణ ప్రాంతం ఉన్నది. రాష్ట్రంగా తెలంగాణలో ఏయే ప్రాంతాలు ఉన్నాయో మొదటి ఎస్ఆర్సి గుర్తించింది. మొదటి ఎస్ఆర్సి పాతది, ఇప్పటి ప్రజల అభివూపాయం కావాలని అనుకున్నా ప్రభుత్వం ఏడాది క్రితం వేసిన శ్రీకృష్ణ కమిటీ ఇప్పటికే పని చేసి పెట్టింది.

బహుశా చరివూతలో రాష్ట్ర ఏర్పాటుకు జరగనంత సుదీర్ఘ ప్రక్రియ ఇప్పటికే తెలంగాణ విషయంలో జరిగిపోయింది. దశలో తెలంగాణను ఎస్ఆర్సి పరిధిలోకి తెచ్చి నైతిక, రాజ్యాంగ, పార్లమెంటరీ సాంప్రదాయాల ఉల్లంఘనకు కేంద్ర వూపభుత్వం పాల్పడుతుందా? నిజాయితీ ఉంటే అలాంటి పని చేయకూడదు. కానీ ఇటీవల కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిజాయితీతో ఉండక పెట్టుబడులకు లొంగిపోతున్నందు ఇప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే ప్రభుత్వాల నిజాయితీకి ఇదొక పరీక్ష

ఒక్క ప్రభుత్వాలకే కాదు. తెలంగాణ కోసం పోరాడుతున్నామని మాట్లాడుతున్న అందరికీ ఇది పరీక్షే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరీక్షకు నిలబడాల్సి ఉంది. రేపో మాపో హైదరాబాద్ రానున్న గులాం నబీ ఆజాద్ తెలంగాణ ఏర్పాటు రోడ్ మ్యాప్ మినహా ఎస్ఆర్సి సహా ఇంకొక వంకర ప్రకటన ఏది చేసినా తిప్పికొట్టి తీరాలి