శుక్రవారం, సెప్టెంబర్ 21, 2012

తెలంగాణ మార్చ్‌ను ఏమార్చే కుట్ర !


 


తెలంగాణ మార్చ్ శాంతియుతంగా గాంధేయ మార్గంలో జరుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం పదేపదే చెపుతున్నా ప్రభుత్వం మాత్రం ఏదో ఒక రకంగా మార్చ్కు అడ్డుతగిలే ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్ కవాతు తరువాతి పరిణామాలు గమనించిన వారికి హైదరాబాద్ మార్చ్పై అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం మీద శ్రీధర్బాబు తన వందిమాగధులతో చేస్తోన్న ప్రచా రం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. కోదండరాం ఇంటిముందు ధర్నా చేయించడంతో ఆగకుండా ఇప్పుడు అటు సీమాంవూధులను, ఇటు తెలంగాణ వాదుల ముసుగులో కొందరు కిరాయి సైనికులను కూడా కోదండరాం మీదికి ఉసిగొల్పాడు. వాళ్ళల్లో ఒకడు కోదండరాంను ప్రొఫెషనల్ కిల్లర్ అని అభివర్ణించాడు. ఇంకొకతను శ్రీపాదరావు హత్య వెనుక కోదండరాం హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. మంత్రులు శాసన సభ్యులు ప్రాంతాలకు అతీతంగా ఏకమై కోదండరాం మీద దండెత్తే ప్రయ త్నం చేస్తున్నారు. ఇది కేవలం కొదండరాంను దండించడానికి చేస్తున్న పని కాదు. తెలంగాణవాదాన్ని బలహీనపర్చి పబ్బం గడుపుకోవడానికి చేసే ప్రయత్నం. కోదండరాం మీద అవాకులూ చెవాకులూ పేలి ఆయన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసి, వీలయితే అరెస్టుచేసి అణచివేయాలన్న కుట్ర ఆరోపణల వెనుక ఉంది. అందుకే ఆగమేఘాల మీద శ్రీధర్బాబు, సీఎం వెంట స్పందించారు. శ్రీధర్బాబు తన సన్నిహితులను పురమాయించి కోదండరాం మీద కేసులు పెట్టించారు

అయినా హత్యచేసిన వారి మీద కేసులు పెట్టాలి గానీ, హత్య గురించి ప్రస్తావిస్తేనే ఇళ్ళమీదపడి అల్లర్లు చేయడం, అరెస్టు చేసి లోపలేస్తామని అనడం లోకంలో ఎక్కడాలేదు. నిజానికి కోదండరాంకు కటువుగా మాట్లాడే అలవాటే లేదు. అలా మాట్లాడి ఉంటే తెలంగాణ ఉద్యమం ఇలా చప్పబడి ఉండేదికాదని అనేవాళ్ళూ ఉన్నా రు. ఆయనతో కలసి పనిచేసినవాళ్ళు ఆయన మెతక వైఖరికి విసుక్కుంటారు. ఏవిషయాన్నైనా లోతుగా ఆలోచించి వీలయినంత ఎక్కువ సమ యం తీసుకుని తప్ప ఆయన నిర్ణయాలు తీసుకోరు. మాట్లాడే ముందు కూడా ఆచితూచి పదాలు వాడుతుంటారు. ఇది చాలా మందికి నచ్చదు. కరీంనగర్ కవాతు సందర్భంగా ఆయన గతాన్ని ప్రస్తావించాడు. గతంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణవాదాన్ని అణచివేయడం వల్ల ఎం జరిగిందో చెప్పారు. అవును, అదీ నిజం కూడా! 1969లో తెలంగాణ కోసం జరిగిన ప్రజాస్వామ్య ప్రయత్నాన్ని కాంగ్రెస్ కాలరాచింది. రాపిడిలోంచి ఎదిగివచ్చిన యువతరం నక్సలిజం బాటపట్టారన్న సంగతి చరివూతకారులు చెపుతున్నారు. అటువంటి నక్సలైట్లకు శ్రీపాదరావు లాంటి వాళ్ళు బలి కావాల్సి వచ్చింది. ఇది చరిత్ర. చరివూతనే కోదండరాం గుర్తు చేసారు. అప్పుడు శ్రీపాదరావు తెలంగాణను అడ్డుకున్నాడో లేదో తెలియదు కానీ శ్రీధర్బాబు మాత్రం ముమ్మాటికి అడ్డుకుంటున్నాడు. అంతేకాదు అణచివేయాలని చూస్తున్నాడని జేఏసీ సభ్యులు ఫిర్యాదులు చేస్తున్నారు. విషయం ప్రస్తావిస్తూ ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేసి, అడ్డుకుంటే ప్రజలు అప్రజాస్వామిక పద్ధతులనే అవలంబించే అవకాశం ఉంటుందని హెచ్చరించాడు. అది నిజం కూడా. అది చెప్పడానికి కోదండరాం లాగా రాజనీతి శాస్త్ర ఆచార్యులమే కావాల్సిన పనిలేదు, ఏమాత్రం రాజకీయాలు తెలిసిన వాళ్ళకైనా అది అర్థమౌతుంది. మూడుసార్లు రాష్ట్ర శాసనసభకు గెలిచి, కేబినేట్లో మంత్రిగా ఉన్న శ్రీధర్బాబుకు కూడా అది అర్థమయ్యిం ది. కానీ అవకాశం దొరికింది కాబట్టి ఆయన కోదండరాంను బెదిరించాలని భావించి ఉండవచ్చు. తద్వారా తెలంగాణవాదాన్ని ఓడించి, కిరణ్ కుమార్కు మరింత దగ్గరవ్వాలని కూడా ఆశించవచ్చు.

 
కానీ కోదండ రాంకు ఇవన్నీ మామూలే. మూడేళ్ళలో ఆయన ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసాడు. తిట్లు, శాపనార్థాలు, నిందలు ఎన్ని వచ్చినా నిలబడ్డాడు కాబట్టే ఇప్పుడు ఉద్యమ నాయకత్వంలో ఒక్కడే మిగిలాడు. బహుశా కోట్లాది మం ది ప్రజల అండ, ఆకాంక్ష ఆయనను అలా నిలబెట్టి ఉంటుంది. ఇంతకీ శ్రీధర్బాబు బలం ఏమిటి అని నేనొక జర్నలిస్టు మిత్రున్ని అడిగాను. శ్రీధర్బాబును చంటి పిల్లాడి రోజుల నుంచి చూస్తున్న ఆయన నవ్వి ఎదుటి వాడి బలహీనత అన్నాడు. ఎప్పుడైనా ఆయన ఎదుటివాడి బలహీనతలతోనే రాజకీయాలు చేస్తాడు. ఇప్పుడూ అదే చేస్తున్నాడు అని ఆయన చెప్పాడు. కానీ కోదండరాం బలహీనుడు కాదన్న సంగతి శ్రీధర్బాబు గుర్తిస్తే మంచిది

ఈమధ్య కరీంనగర్ వెళ్ళినప్పుడు ఒక విషయం అర్థమయ్యింది. అది అక్కడ శ్రీధర్బాబు బలపడుతున్నాడని. ఆయన బలపడడం కోసం ఇప్పు డు వాళ్ళ తండ్రిగారి బలాన్ని, బలగాన్ని కూడా విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు. మీరు కరీంనగర్ వెళ్తే బస్టాండ్ నుంచి బయటకు రాగానే ఒక భారీ విగ్రహం స్వాగతం పలుకుతుంది. అదీ మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాదరావుది. ఆవిగ్రహాన్ని మధ్యనే ప్రతిష్టించారు. మొదటిసారి విక్షిగహాన్ని చూసినప్పుడు ఆయన విగ్రహం అక్కడ ఎందుకు పెట్టారో నాకు అర్థంకాలేదు. ఆయనకు పట్టణానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన కరీంనగర్కు చివరిమూలలో గోదావరి నడి ఒడ్డున ఉండే మంథనికి చెందినవాడు. పోనీ కరీంనగర్కు ఆయన చేసింది ఏమైనా ఉందా ఆంటే అదీ లేదు. సాధారణంగా జిల్లా కేంద్రంలోనైనా జాతీయ నాయకుల విగ్రహాలు, రాష్ట్ర స్థాయి నేతల విగ్రహాలు ఉంటాయి. అవేకాక జిల్లా నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకే వన్నెతెచ్చిన వారి విగ్రహాలు, జిల్లాను అభివృద్ధి చేసిన వాళ్ళ విగ్రహాలు ఉంటాయి. శ్రీపాదరావు గారికి అటువంటి చరిత్ర ఏమీలేదు. మూడుసార్లు శాసనసభకు గెలవడం, ఒకే ఒక్కసారి స్పీకర్గా పనిచేయడం మినహా ఆయనకు పెద్దగా మరే ఘనతా లేదు. ఆయనకంటే ముందు శాసనసభకు ఆయనకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు, కరీంనగర్ జిల్లాను, పట్టణాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. పోనీ స్పీకర్గా పనిచేసిన ఘనత సాధించినందుకు పెట్టారేమో అనుకున్నా ఆయనకంటే ముందుగానే అదే జిల్లాకు చెందిన జి.నారాయణరావు స్పీకర్గా పనిచేసి పదవికే వన్నె తెచ్చారు. ఎక్కువకాలం మంత్రిగా ఉండి అంతో ఇంతో పట్టణానికి మేలు చేసిన వారిలో జే. చొక్కారావుతో సహా అనేకమంది కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఉన్నారు. అందరికంటే చతురుడు, రాజకీయాల్లో చరితార్థుడు పీవీ నరసింహారావు ఉన్నాడు. ఆయన కరీంనగర్కు ఏమీ చేయలేక పోయినా జిల్లాలో పుట్టి, అదే మంథని నుంచి మూడుసార్లు ఎంఎల్ గా గెలిచి, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంవూతిగా పదవిలో తనదైన ముద్ర వేశారు.అంతేకాదు, అప్పటికి కొన ఊపిరితో ఉన్న జాతీయ కాంగ్రెస్కు ప్రాణ ప్రతిష్ట చేసి ఢిల్లీలో తలెత్తుకుని నిలబడేలా చేశారు. ఆయన రాజకీయాలు ఏవైనా, విధానాలు ఎలావున్నా అతను కరీంనగర్ కన్నబిడ్డ.

 
కరీంనగర్ ప్రధాన కూడలిలో కచ్చితంగా ఒక కాంగ్రెస్ నాయకుడి విగ్రహం ఉండాలని ఎవనా అనుకుంటే అదీ ముమ్మాటికీ పీవీ దే అయి ఉండాలి. అంతేకాదు పీవీ నరసింహారావు, జాతీయవాది. జాతీయ నేత. విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఆలపించి నిజాం రాజును ధిక్కరించిన ధైర్యవంతుడు. తెలంగాణ విముక్తి ఉద్యమంతో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మొదటి నుంచీ ముడివడి ఉన్నపేరు ఆయనది. 1969 ఉద్య మం తరువాత తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఇందిరాగాంధీ ఆయనను ముఖ్యమంవూతిని చేశారు. ఆయన తెలంగాణ సమస్య మూలాలు తెలిసిన వ్యక్తిగా భూసంస్కరణలకు శ్రీకారం చుట్టి సీమాంధ్ర నేతల ఆగ్రహానికి గురయి పదవిని కోల్పోయాడు. తరువాత ఆయన దేశ రాజకీయాల్లో అపర చాణ్యుకుడై చరివూతకెక్కాడు గానీ సొంత జిల్లాలో మాత్రం ఒక్క విగ్రహానికి కూడా నోచుకోలేకపోయాడు

శ్రీపాదరావుకు పీవీకి ఉన్నటువంటి చరిత్రలేదు. ఆయన ఒక రకంగా చరివూతలో ఉన్నారంటే కేవలం నక్సలైట్ల చేతిలో చనిపోయినందు వల్లే. నిజానికి ఆయన నక్సలైట్లకు టార్గెట్ అయ్యేంత చెడ్డ వ్యక్తి కూడాకాదు. విషయాన్ని తరువాత నక్సలైట్లు కూడా చెప్పుకున్నారు. శ్రీపాదరావు దాదాపు మూడు దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ వార్తల్లో వ్యక్తి కాలేదు. ఒప్పించ తానొవ్వక అన్నట్టు ధన్యుడుగానే రాజకీయాల్లో చక్రం తిప్పారు. జిల్లాలో గ్రూపు రాజకీయాలతో కాకుండా తనపని తాను చేసుకుంటూ నియోజక వర్గానికి మాత్రమే పరిమితమైన సాదా సీదా నేత. కాబట్టే ఆయన కనీసం మంత్రి కూడా కాలేక పోయారు. శ్రీధర్బాబు మాత్రం అలా కాదు. రాజకీయ ఎత్తుల్లో ఆయన తండ్రిని మించిన కొడుకు. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ సానుభూతితో మొదటిసారి గెలుపొందారు. తరువాత రాజశేఖర్డ్డి హయాంలో రెండోసారి గెలిచి కాంగ్రెస్పార్టీకి శాసనసభలో విప్గా కిరణ్ కుమార్డ్డి టీంలో పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడా పనిచేసి ఆయన కన్న క్రిష్ణ లాంటి అనేకమంది శిష్యులతో తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. మూడోసారి బొటాబొటీ మెజారిటీతో గెలిచినా ఆయనను సామాజిక సమీకరణల్లో భాగంగా రాజశేఖర్డ్డి హయాంలో మంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయన కిరణ్కు తెలంగాణలో ఒక కీలక సహచరుడుగా మారిపోయాడు. ఇదే అదునుగా శ్రీధర్ తన పట్టు బిగిస్తున్నాడు. క్రమంలో ఇప్పుడు కరీంనగర్ పట్టణంలోనే కాదు మొత్తం జిల్లాలో శ్రీపాదరావును ఒక మహానేతగా మలిచే పనికి పూనుకున్నాడు. వీలయిన ప్రతిచోటా ఆయన విగ్రహాలను ప్రతిష్టిస్తున్నాడు. ఇప్పుడు జిల్లాలో రాజకీయ నాయకుడికి లేనన్ని విగ్రహాలు ఒక్క శ్రీపాదరావుకు ఉన్నాయంటే అదీ ఆయన కొడుకుగా తీర్చుకుంటున్న రుణమే.!! 

పీవీ నరసింహారావుకు ఎంత ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్నా శ్రీధర్బాబు లాంటి కొడుకు లేక పోవడం వల్ల ఆయన ఒక్క విగ్రహం కూడా లేకుండాపోయింది. కనీసం శ్రీధర్బాబుకైనా అటువంటి ఆలోచన రావాల్సింది. ఎందుకంటే ఆయనకు పీవీ పరాయివాడు కాదు. వాళ్ళ కుటుంబానికి ఆప్తుడు. పీవీ ఖాళీ చేసిన సీటు నుంచే శ్రీపాదరావు శాసనసభకు వచ్చారు. రాజకీయాలు తెలిసిన వాడు కాబట్టి ఆయన పీవీ విగ్రహమే కాదు, అంబేద్కర్, కొమురంభీం ఇలా అన్ని విగ్రహాలలో కూడా వివాదాస్పదమే అవుతున్నాడు. విగ్రహాన్ని పెట్టడానికి వీలులేకుండా వివాదాలు సృష్టిస్తున్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. శ్రీధర్బాబుకు నిజానికి ఆధునికుడిగా కనిపిస్తారు. కానీ ఆయన వివాదాస్పదం చేస్తున్న విషయాలు ఆయనకు అంత మంచివి కాదు. తన మాటే నెగ్గాలని అనుకోవడం, ఇంకొకరికి మాట్లాడే స్వేచ్చలేకుండా చేయడం, అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం రాజకీయ నాయకులకు అంత మంచిదికాదు. అవి ఫ్యాక్షనిస్టులు వాళ్ళకొడుకులకు ఉండాల్సిన లక్షణాలు. ఇదం తా శ్రీధర్బాబు వ్యక్తిగతంగా కక్షతో చేస్తున్నాడని అనుకోవడానికి వీలులేదు. ఆయన సీమాంధ్ర నాయకత్వానికి సహకరిస్తున్నాడు. ఇలాంటి కవ్వింపు చర్యల ద్వారా రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి తెలంగాణ మార్చ్ను అడ్డుకుని అణచివేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి అండదండగా ఉం టున్నాడు. అదే జరిగితే శ్రీ్తధర్బాబును తెలంగాణ ప్రజలు క్షమించరు

మార్చ్ను అడ్డుకోవాలని చూడడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు మామూలుగా అనుమతిస్తే కేవలం మార్చ్ మాత్రమే జరుగుతుం ది. కానీ ఏదో ఒక సాకుతో మార్చ్ను అడ్డుకుంటే అది తెలంగాణ లాంగ్ మార్చ్ అవుతుంది. అది ఎక్కడ మొదలవుతుందో ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. విషయం అందరూ గుర్తించుకోవాలి