శుక్రవారం, మార్చి 30, 2012

ఆ 'ఆత్మ'లను అర్థం చేసుకున్నారా ?!



రుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణా అల్లకల్లోలమయిందివరంగల్ నడి బొడ్డున భోజ్యా నాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు. జ్వాలలు ఆరిపోక ముందే మరో రాజమౌళి మంటల్లో మాడిపోయాడు. వెంటనే ఉప్పలయ్య ఇలా వరుసగా  రాలిపోతూనే ఉన్నారు.   రాజకీయ పార్టీలు, పాలక వర్గాలు చేస్తున్న మోసం భరించలేక తెలంగాణలో ఇప్పుడు అందరి గుండెలూ ఆవేదనలో రగిలిపోతున్నాయి. చావులు చూసినప్పుడు చలించిపోవడం, దుఖించడం మినహా వాటిని ఆపలేని నిస్సహాయతలో ఇప్పుడు తెలంగాణా సమాజం మిగిలిపోయింది. సమస్య ఏదైనా, ఎంత క్లిష్టమైనదైనా చావుద్వారా పరిష్కరించడం కుదరదు. చనిపోవడమంటే సమస్యనుంచి పారిపోవడమే! ఆత్మహత్య అటువంటి పిరికి తనానికి ప్రతీక లాంటిది. ఆత్మహత్యలను ఒక వ్యక్తిగత సమస్యగా చూసేవాళ్ళు చెప్పే మాటలివి. నిజమే సమస్య వ్యక్తిగతమైనది అయినప్పుడు  సమస్యనుంచి తప్పించుకోవడానికి చనిపోవడం ఒక వైయక్తిక పరిష్కారంగా పరిగణిస్తారు. ఇక్కడ సమస్య వ్యక్తిగతమైనది కాదు. చనిపోతున్న వాళ్ళు కూడా తమ వ్యక్తిగత ఆకాంక్షల  కోసం ఆత్మహత్యను ఎంచుకోవడం లేదు. తెలంగాణా ఒక విస్తృత సామాజిక ఆకాంక్ష.

రాష్ట్ర సాధన అనేది తమ వ్యక్తిగత అవసరాలకంటే ఎక్కువ ప్రధానమైనదిగా భావిస్తున్నవాల్లె, తమ సమస్యలకు ఒక పరిష్కారంగా నమ్మడం వల్లే ప్రజలు ఇంతకాలం అన్నిరకాల ప్రజాస్వామ్య మార్గాలద్వారా తమ ఆకాంక్షను వ్యక్త పరిచారు. ఏళ్ళతరబడి జీవితం అంటేనే పోరాటమని చాటి చెప్పారు. ఎవరినుంచీ ఎటువంటి హామీ రాక  ఇప్పుడు ఆత్మాహుతులకు ఒడిగడుతున్నారు.  ఆత్మ హత్యలు పరిష్కారం కాదని పోరాడితేనే తెలంగాణా వస్తుందని ఉద్యమకారులే చెప్పడం వాళ్లకు విసుగుపుట్టిస్తోంది. ఉద్యమం ద్వారా కూడా తెలంగాణా ఎందుకు రాలేదన్న వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరుకడం లేదు. సమాజంలో ఒక ప్రశ్నకు సమాధానం దొరుకడం లేదంటే సమాజం చచ్చినట్టే లెక్ఖ! అదే ఇవాలా అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది

తామర తంపరల్లా  ఇవాళ తెలంగాణా నిండా ఉద్యమ సంస్థలు, పిడి బాకుల్లాంటి జాకులు చాలానే పుట్టుకొచ్చాయి. ఆశ్చర్యకరంగా అందరూ రెండు మూడేళ్ళుగా వేరే పనిలేకుండా ఉద్యమమే ఊపిరిగా ఊరూరా తిరుగుతూనే ఉన్నారు. ధూమ్ దాంలతో మొదలై, మీటింగులు, యాత్రలు, గర్జనలు, గాండ్రింపులుఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ఏదో ఒక ఉద్యమ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంది. మరో వైపు తెలంగాణా ప్రజానీకం ఒక్కొక్కరు ఏకమై ఒక సంఘటిత శక్తిగా నిలబడింది. రెండేళ్లకు  పైగా మునిగాళ్ళ మీద నిలబడే పోరాడుతోంది. ప్రజానీకానికి తెలంగాణా వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని  ఒక్క సంస్థా ఎందుకు కల్పించక  పోయిందన్నది అర్థం కాని ప్రశ్న!

 మీరే ఒక్క సారి గమనించండి. ఒక సంస్థ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో విశ్వాసాల ప్రకటనకు, రాజకీయ అభిప్రాయాల  వ్యక్తీకరణకు ఒక అవకాశంగా చూస్తోంది. సంస్థ తెలంగాణా వాదుల్ని గెలిపించడం ద్వారా వాదాన్ని వినిపించాలని అంటుంది. మరో సంస్థ ఎన్నికలతో తెలంగాణా రాదని ఉద్యమాల ద్వారానే అది సాధ్యమని కాబట్టి అందర్నీ ఓడించాలని పిలుపునిస్తుందిఇంకొకరు ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తే తప్ప తెలంగాణా రాదని చెప్తుంది. ఒకరు రాస్తారోకో ఆంటే, మరొకరు రైల్ రోకో అంటున్నప్పుడు ఏమనాలో తెలియక ఇంకొకరు విమానాల రోకో అనడం కూడా ప్రజలు చూసారు. ఉద్యమాల పేరుమీద ఎవరి మనుగడ కోసం వాళ్ళు పరస్పర విరుద్ధంగా మాట్లాడుకోవడం తప్ప ఐక్య కార్యాచరణ లేకపోవడానికి కారణాలు వెతకాలి.

ఎప్పుడైనా సరే సైద్ధాంతిక సమస్యలున్న, పరస్పర విరుద్ధ రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పుడు   సంస్థలు కలిసి పనిచేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్ లు)  ఏర్పడతాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు కేంద్ర స్థాయిలో కనీసం డజను జాక్ లు  ఒక్కో విభాగంలో,రంగంలో అరడజను, ఒక్క జిల్లాలో వందలు మొత్తంగా తెలంగాణా ఉద్యమంలో వేలాదిగా జాకులు పుట్టాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయన్నది అర్థం కాని ప్రశ్న. ప్రశ్న ఎందుకోస్తోందంటే ఇలాంటి ఆత్మాహుతులు జరిగినప్పుడు అందరూ ఆత్మహత్యలు పరిష్కారం కాదు పోరాటమే మార్గం అని గంభీర్రమైన సంతాప సందేశాలు, ఊకదంపుడు ఉపాన్యాసాలు ఇస్తున్నారు. పోరాడాలి అని పిలుపునిస్తోన్న మీరేం చేస్తున్నారు? ప్రజలు పోరాడడం లేదని, ఉద్యమాల్లో లేరని ఎందుకు అనుకుంటున్నారు? పిలుపులు ఎవరైనా ఇవ్వగలరు, ఎవరు ఆచరించాలి, ఎవరు జన సమీకరణ చేయాలి, ఎవరు పోరాడాలి, ఎవరు ఎవరి ఆర్ధిక మూలాలను కనిపెట్టాలి, ఎవరు వాటిని దెబ్బ కొట్టాలి? ఇవన్నీ నాయకత్వ స్థానంలో ఉన్న మీరే నిర్ణయించాలి. ఉద్యమం ఎలా ఉండాలో నిర్దేశించి నడిపించాలి. భో జ్యానాయక్ రెండున్నరేళ్ళు అందరు తెలంగాణా విధ్యార్తుల్లాగే ఉద్యమాల్లోనే ఉన్నారు. రాజ మౌళి తన ప్రాణం పోయే రోజుదాకా ఉద్యమాల్లోనే గడిపారు. చివరగా ఆయన భోజ్యా నాయక్ అంత్య క్రియల్లో కూడా పాల్గొన్నారు. అటువంటి ఉద్యమ కారుల చావుల సందర్భంగా సంతాపం చెప్పేటప్పుడు ఇంకా పోరాడాలి ఆంటే జాకులను,  మూకలను ఎలా అర్థం  చేసుకోవాలి?!  

అసలు పోరాటం ఆంటే ఏమిటి. అన్ని పోరాట రూపాలను అద్భుతంగా ప్రయోగించిన తరువాత కూడా ఇంకా పోరాడాలంటే ఎలా? అదీ పోరాట వేదికలు నడిపిస్తోన్న నాయకులు, ఉద్యమ కారులు ఆంటే యేమని అర్థంబహుశ ఇది అర్థం కాకే భోజ్యా 'అందరూ వస్తున్నారు,   తెలంగాణా తెస్తమంటున్నారు..ఇంకెప్పుడు తెస్తారు?' ఆన్న ప్రశ్నను తన ప్రాణం పోయేదాకా అడుగుతూనే ఉన్నాడు. దానికి ఎవరైనా సరే సమాధానం చెప్పగలరా సమాధానం దొరకకే ఇవాళ అనేక మంది సమిధలై పోతున్నారు సంఘాలు, సంస్థలు, జాకులు అన్నీ  ఎందుకు ఒకే గొడుగు కిందికి రావడం లేదు? ఒకే ఉద్యమం, ఒకే ఉధృతి ఎందుకు లేదు. ఎవరి మనుగడ, ఎవరి ఉనికి, ఎవరి స్వార్థం వారిది. ఇటువంటి రాజకీయాలు, ఎత్తుగడలు రాజకీయ పార్టీలకు ఉంటాయి. కానీ కేవలం తెలంగాణా సాధన ఒక్కటే లక్ష్యం అని చెపుతున్నా వారిలో వరుధ్యాలు ఎందుకో  సమాధానం దొరుకదు.   నాకు తెలిసినంత వరకు కోదండ రాం నేతృత్వంలో ఉన్న రాజకీయ జే సి ఒక విశాల వేదిక. .

బీజేపీ నో,  టీ ఆర్ ఎస్ నో మహబూబ్ నగర్లో పోటీ చేయకుండా ఒప్పించడంలో కోదండ రామ్   విఫలమై ఉండవచ్చు, కానీ గడిచిన పదేళ్లుగా విద్యవతుల వేదిక నిర్మిచడంలో, రెండేళ్లకు పైగా తెలంగాణా ఉద్యమాన్ని నిలబెర్త్తదడంలో కొదండ్ దే కీలక భూమిక. అటు హిందూ ఛాందసులు ఆన్న  ముద్ర పడ్డ బీ జే పీ ని, ఇటు వారికి ఆగర్బ్జ్హ శత్రువులమని చెప్పుకునే నక్సలైటు పార్టీ మిత్రులతో సహవాసం చేయించిన వ్యక్తి అతను. ఆశ్చర్యంగా ఆయనతో, ఆయన రాజకీయ నభిప్రాయాలతో చాలా కాలం ఊరేగిన వాళ్ళే ఇవాళ ఆయనకు పోటీగా కుంపట్లు వెలిగించు కుంటున్నారు. వీలయినప్పుడు తెలుగుదేశం పార్టీకి జెండాలు ఊపి, అవకాశం దొరికితే కాంగ్రెస్ కు కండువాలు కప్పి, కుదిరితే కేసీ ఆర్ తో టీ ని కాదంటే కిషన్ రెడ్డితో కప్పు కాఫీ ని తాగే వాళ్ళు ఇప్పుడు సంఘటిత పోరాటాల గురించి, సమైఖ్య కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు తప్ప రెండేళ్లుగా అది ఎందుకు సాధ్యపదలేదో ఆలోచించాలి. అది జరిగి ఉంటే నిజంగానే తెలంగాణా ప్రజలకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. తెలంగాణా వాడుల్లోని  అనైక్యతే ఇప్పుడు రాజకీయ పార్టీల ఐక్యతకు ఆయుష్షు పోస్తోంది. ప్రాంతం వాళ్లైనా, పక్షం వాళ్లైనా,   కులానికి చెందిన వాళ్లైనా, తెలంగాణా వ్యతిరేకులంతా సంఘటితంగానే ఉన్నారు.  

కానీ ఒకే ప్రాంతానికి చెంది ఒకే నినాదం ఆన్న వాళ్ళే వేయిగొంతుకలతో మాట్లాడుతున్నారు. ఒకరి మాటలకు ఇంకొకరు అడ్డుతగులుతున్నారు. అసలు పోరాటం వదిలేసి ఒకరి మీద కారాలు మిరియాలు నూరుకున్తునారు. ఉద్యమకారులే ఉద్యమం వదిలేసి అసలు ఉద్యమం ఎలా ఉండాలో లెక్చర్లు దంచుతున్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణా వస్తోంది. నిజమే! ఆశతోనే సకల జనులు సమైఖ్యంగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలు పతాక స్థాయికి చేరిన ప్రతి దశలో అడ్డంగా మాట్లాడి అడ్డు తగిలిన ఉద్యమ  కారులూ తెలంగాణలో ఉన్నారు.  అసలిప్పుడు తెలంగానే వద్దు అంటున్న మేధావులు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారుఇది అయోమయానికి కారణం అవుతోంది. అయోమయం అర్థం కాక పోవడం వల్లే ఇవాళ అమాయకుల గుండెల్లో అగ్గిమండుతోంది. అది ఆర్పాల్సిన బాధ్యత ముమ్మాటికీ ఉద్యమానిది,ఉద్యమ సంస్థలదే. ఉద్యమాలు నడిపిస్తోన్న వారికే ఉద్యమ గతిమీద, గమనం మీద పట్టులేకపోతే ప్రజలకు ఖచ్చితంగా మిగిలేది అయోమయమే! అయోమయమే ఇప్పుడు అగ్నికీలల్లో ఆవిరైపోతున్నది

అనైక్యత, అయోమయాన్ని ఆసరా చేసుకుని రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్తున్నాయితెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఇంత జఠిలం కావడానికి కారణమైన రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఇప్పుడు చావులకు సంతాపం చెపుతున్నారు. ఆత్మహత్యలకు  కారణమైన వాళ్ళే  చావులు సమస్యలకు పరిష్కారం కాదని ఉపదేశాలిస్తున్నారు. ఇది  వినడానికే విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా ఆత్మహత్యల గురించి మాట్లాడడం బాధ్యతా రాహిత్యమే తప్ప ఇంకొకటి కాదు. చనిపోయిన వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు పదే పదే వేడుకుంటున్నది తెలంగాణా సంక్షోభానికి పరిష్కారం చూపించాలని. పరిష్కారం చూపే బాధ్యత రెండు పార్టీల మీద ఉన్నది. ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి తను ఇప్పటికి ఇంకా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆన్న సంగతి గమనించాలితెలంగాణా ఆత్మాహుతులు తన ప్రభుత్వ అసమర్థతకు, ప్రభుత్వానికి వెన్నెముక అయిన కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి నిదర్శనం ఆన్న సంగతి గుర్తించాలి.

2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసన సభలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే  శాసన సభకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వ విప్ప్ గా  ప్రకటనను రికార్డు చేసారు. 2009 డిసెంబర్ ఏడున శాసన సభా పక్షాల అఖిల పక్ష సమావేశం శాసన సభాపతిగా ఆయన నేతృత్వంలో జరిగింది. సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు  కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అటు తీర్మానం పంపించి మరుసటి రోజే స్పీకర్ గా సీమంధ్ర శాసన సభ్యుల  రాజీనామాలను ఆయనే తీసుకుని పరిస్థితి గంభీరంగా ఉన్నదని కేంద్రానికి నివేదించారు. గంభీరత చల్లారిన తరువాత తెలంగాణ ప్రక్రియ కొనసాగిస్తామని, అది చల్ల ర్చవలసిన బాధ్యత రాష్ట్రంలోని రాజకీయ పార్తీలదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చల్లర్చవలసిన బాధ్యతను కూడా కాంగెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి మీద పెడుతూ ఆయనను ముఖ్య మంత్రిగా చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశ్నకు సమాధానం దొరుకకే ఆత్మాహుతులు ఆయన వైఖరి పట్ల నిరసన ప్రకటిస్తున్నారని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.

ఇప్పుడు ప్రభుత్వాధినేత గా చావులన్నిటికీ ఆయన  భాద్యత వహించి తీరాలి. విశ్వాసం తో ఉండండి అని చెప్పడం కాదు. అటువంటి విశ్వాసం కల్పించడం కోసం శాసన సభలో తీర్మానం చేసి పంపాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. అలాగే చద్రబాబు నాయుడు కూడా బహుశ మొదటి సారిగా ఆత్మహత్యల మీద మాట్లాడారు. కానీ ఆయన మాటలను నమ్మే స్థితిలో తెలంగాణా ప్రజలు ఉన్నారా! తెలంగాణాకు వ్యతిరేకం కాదని వేయిన్నొక రాగంలో చెపుతున్న బాబు  తెలంగాణాకు తమ పార్టీ అనుకూలమని ఒకే ఒక ముక్క కేంద్రానికి రాసి ఉంటే సంక్షోభం ముదిరేది కాదు. ఎన్నికల్లో అనుకూలమని, తరువాత కానే కాదని తమకున్నది రెండు కళ్ళని, తన వాదం తటస్థమని  మాటలు మారుస్తూ    సక్షోభాన్నికి కారణమైన పార్టీ వైఖరిని  ప్రజలేవరూ మరిచి పోలేదు. ఉద్యమాన్నే కాదు చివరకు ఆత్మ హత్యల్లో అసువులు బాసిన వారిని కూడా అవహేళన చేసే విధంగా  తెలంగాణా తెలుగుదేశం ఫోరం నేతలు మాట్లాడిన మాటలను ఇంకా ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాయి. అదే నేతలు ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం అంటున్నారు.

అయ్యా! చనిపోయిన వాళ్ళు మీరు ఆదుకోవాలని  కోరుకోలేదు.  మీ బాబు మారాలని కోర్రుకుంటూ ప్రాణం విడిచారు. మీకు సాధ్యమైతే ఆయనను మార్చండి. నిజంగానే చంద్ర బాబు నాయుడు మరనిస్తోన్న  యువకుల మనోభావాలు గౌరవిస్తే, ఇంకెవరూ చనిపోవద్దని కోరుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా సభా తీర్మానానికి నోటీసు ఇవ్వాలి, లేదా కేంద్రానికి పార్టీ తరఫున లేఖ ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా సంతాప ప్రకటనలతో చేతులు దులుపుకోవడం భావ్యం కాదు

ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ  మరణ వాగ్మూలాలు మరొక్క సారి చదవండివాళ్ళ చివరి మాటలను మళ్ళీ  వినండి.  వాళ్ళ మాటల్లో  నిరాశలేదు. నిస్పృహ లేదు. నిలువెల్లా నిరసన ఉంది.  నిలదీసే ప్రశ్నలున్నాయి.  నిప్పును రాజేసిన వాళ్ళు, మంటలు ఎగదోసిన వాళ్ళు, తెలంగాణాను  రావణ కాష్టం చేసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సమాధానాలు మాత్రమే  మండిపోతున్న మనసులకు స్వాంతన చేకూరుస్తాయి