ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా మందిని భయపెడుతున్నాయి. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ శకం మొదలవుతోందంటే ఆయన ఆలోచనలు, గతంలో ఆయన పరిపాలనలో గుజరాత్ చవిచూసిన అనుభవాలు తెలిసిన వారికి రానున్న రోజులు ఎలా ఉంటాయో అని ఊహించుకుంటే భయం కలుగడం సహజం. అయితే ఆయన రాకతో పులకించిపోతున్నవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆయన హిందూ భావజాలాన్ని భారత జాతీయ సాంస్కృతిక వాదంగా విస్తరించాలని తపన పడుతున్న చాందసవర్గాలు, ఆయన ఆర్ధిక సంస్కరణలలలో భాగస్వాములుగామారి కోట్లకు పడగెత్తాలని కలలుగంటున్న వ్యాపార దళారీ వర్గాలు,దేశం ఎటుపోయినా పరవాలేదు, జీతం పెరగాలి, ధరలు తగ్గాలి అని మాత్రమే ఆలోచించే మధ్యతరగతి భద్ర జీవులు ఇట్లా వివిధ వర్గాలు ఆయన రాకను ఆహ్వానిస్తున్నాయి. ఆయన ప్రధాని అవుతున్నందుకు ఆనందిస్తున్నాయి. కానీ ఈ ఆనందం కంటే కొందరు ఆలోచనా పరుల్లో వ్యక్తమౌతోన్న భయం ముమ్మాటికీ ఒక ప్రమాద సూచికగానే అర్థం చేసుకోవాలి. ప్రమాదం అంటే వ్యక్తిగతంగా మనకేదో ముప్పని కాదు, లౌకిక పునాదుల మీద నిలబడ్డ ఈ దేశానికి, ఈ దేశపు సామాజిక విలువలకు, ముఖ్యంగా భావ సమైక్యతకు భంగం తప్పదని మాత్రం అర్థం అవుతోంది. ఈ సంగతిని తెలంగాణా ప్రజలు అందరికంటే ముందే అర్థం చేసుకుని ఆయన అవసరం లేదనుకున్నారు. ఎన్నికల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ లో ఐదు, పార్లమెంటు లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టారు. అంతటి విజ్ఞతను ప్రదర్శించినందుకు తెలంగాణా ప్రజలను అభినందించాలి.కానీ ఇప్పుడు తెలంగాణా ప్రజలకు కొత్త భయం పట్టుకుంది.మోడీ తెలంగాణాకు మొండిచేయి చూపుతాడని, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారి ఆంధ్రా పక్షపాతిగా ఉంటాడనీ అనుమానిస్తారు.
అధికారం మీద, హైదరాబాద్ మీద అచంచలమైన వ్యామోహం ఉన్న చంద్రబాబు ఏదో కుట్రచేసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత్ ప్రాంతం చేస్తాడని, లేదా రెండు రాష్ట్రాలను ఒక్కటి చేస్తాడని అంటున్నారు. దీనికి చంద్రబాబు చపలత్వమే కారణం. ఆయన అప్పుడే మళ్ళీ 2019 కి సంబంధించిన పగటికలలు మొదలు పెట్టాడు. వీలయితే ఆలోపే తెలంగాణాకు వస్తానంటున్నాడు. రాజనీత తెలిసిన వాళ్ళు ఎవరూ ఇలా మాట్లాడరు. కొన్ని సందర్భాల్లో కొన్ని మర్యాదలైనా పాటిస్తారు. కాబోయే ముఖ్యమంత్రులుగా కొంతయినా హుందాగా వ్యవహరిస్తారు. కానీ బాబు గారు అలా చేయలేదు.చింత చచ్చినా పులుపుచావనట్టు తెలంగాణా లో కేవలం పదిహేను స్థానాలకే పరిమితమై పోయి అదికూడా హైదరాబాద్ లో బీ జీ పీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు వచ్చే అయిదేళ్ళ తరువాతి గురించి అప్పుడే మాట్లాడడం అత్యాశ అవుతుంది.చంద్రబాబు డాంభికాలు వింటుంటే కె సి ఆర్ పదేపదే చెప్పినట్టు ఆయన నెట్టేసిన సరే ఆంధ్రాకు వెళ్ళేలా లేడు. ముందుగా ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.అక్కడతెలుగుదేశం పార్టీని గెలిపించినట్టే ఇక్కడ ప్రజలు తెలంగాణా రాష్ట్ర సమితిని గెలిపించారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. వేరే రాష్ట్రం వ్యవహారాల్లో వేలుపెట్టడం మంచిది కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. కనీసం తెలంగాణా తెలుగుదేశం నేతలయినా ఆయనకు ఆ విషయం బోధ పరచాలి. నిజానికి వోట్ల వారీగా చూసినా సీట్లవారీగా చూసిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ కంటే ఇక్కడ తెలంగాణా రాష్ట్ర సమితి నే ప్రజలు ఎక్కువగా ఆదరించారు. తెలంగాణలో రెండో రాజకీయ పార్టీ టీఆరెస్ దరిదాపుల్లో కూడా లేదు. కానీ చంద్రబాబు కు జగన్ చాలా చేరువలోనే ఉన్నాడు. రేపటినుంచి బాబు గారిని నిద్రపోనీయనని ప్రతిన బూని మరీ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పక్క చూపు మానేసి ముందు చూపుతో వ్యవహరిస్తే మంచిది.
ఇక పోతే మోడీ తెలంగాణాకు నష్టం చేస్తాడా? అంటే ఒక్క తెలంగాణాకు నష్టం చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండక పోవచ్చు. అలా చేయాలని ప్రయత్నం కూడా చేయడు. అది ఆయనకు చిన్న విషయం ఎందుకంటే ఆయన కు పెద్ద పెద్ద ఎజెండాలు ఉన్నాయి . నిజానికి అవే ఎక్కువ ప్రమాదకరం . ఎవరయినా భయపడాల్సింది వాటిగురించే. ఇప్పుడు దేశంలో ప్రగతిశీల లౌకిక శక్తులు భయపడుతున్నది కూడా ఆయన చాందస వాద చరిత్ర చూసే. మోడీకి చాందస వాద చరిత్ర ఉంది.దీన్ని వాజపేయీ ముందు చాన్దసవాడి అనుకున్న లాల్ కిషన్ అద్వాని నే స్రువ పరిచారు. కేవలం మతాభిమానం ఉన్న పరవాలేదు, కానీ ఆయనకు పరమత ద్వేషం ఉందన్నది దేశమంతా గుర్తించిన వాస్తవం. గుజరాత్ లో గోద్రా రైలు ప్రమాదానికి ప్రతీకారంగా (?)వేలాది మంది అమాయకులను ఊచకోత కోశారు. దానికి సంబందించిన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మోడీ అండతో అల్లరిమూకలు వేలాదిమందిని వేటాడి చంపాయి. స్త్రీలు, పురుషులు, ముసలి, ముతకా తేడా లేకుండా కనిపించిన ప్రతి ముస్లింను చంపేశారు. అల్లర్లలో వెయ్యిమంది దాకా మరణించగా మరో మూడువేలమంది అమాయకులు క్షతగాత్రులై అప్పటి కిరాతకానికి ప్రత్యక్ష సాక్షులుగా మిగిలారు. కానీ ఈ దేశంలో చట్టాలు, కోర్టులు ఆదిపత్య శక్తుల సాక్షాలు తప్ప అణగారిన వర్గాల ఆక్రందనలు వినవు అనడానికి మనకళ్ళముందే చుండూరు కేసు ఉంది. చుండూరు నిందితులను చూసీ చూడనట్టు వదిలేసినట్టే కోర్టులు నరేంద్ర మోడీని కూడా వదిలేసాయి. గుజరాత్ మారణకాండకు మోడీ క్షమాపణ కోరలేదు. కనీసం దాన్ని ఖండించలేదు. మీరు జరిగిన దానికి చింతిస్తున్నారా ఆని ఒక విదేశీ విలేకరి అడిగితే ' అవును..! మీడియాను మేనేజ్ చేసుకోనందుకు చింతిస్తున్నా'నని చెప్పాడంటే ఆయన తలబిరుసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆ తలబిరుసు తోనే ఆయన తన ప్రచారంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అక్కడి బంగ్లా దేశీయులు వెల్లిపోవాల్సిందేనని చెప్పారు. ముస్లింలు ఏ దేశం వారయితే ఆదేశం పోవలసిందేనని ఆయన పదేపదే అంటాడు. అలాగయితే ప్రపంచంలో అనేక దేశాల్లో ముఖ్యంగా అరబిక్ దేశాల్లో, గల్ఫ్ లో ఉన్న మనవాళ్ళ సంగతేమిటి అన్నదికూడా ఆలోచించాలి. అదొక్కటే కాదు మతం మోడీ పాలనలో మౌలికాంశం అయితే ఒక్క తెలంగాణాకే కాదు యావత్ భారత దేశానికే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది.
మోడీ ఆర్ధిక శక్తులు అక్రమ సంపాదనా పరుల చేతుల్లో కీలుబొమ్మ. ఆయన వెంట అదాని, అంబానీ లు తప్ప ఇంకెవరూ ఉండరనే విమర్శ కూడా ఉండదు. నిజానికి వాళ్ళ మార్కెట్ వ్యూహంలో భాగంగానే మోడీని కూడా ఒక సరుకుగా మార్చి మార్చివేశారని ప్రచారం తీరు తెన్నులు చూస్తే అర్థమౌతుంది. ఎలాంటి సరుకైనా సరే సరిఅయిన ప్రచారం ఉంటే మార్కెట్ ను ఆకర్షిస్తున్దన్నది వ్యాపార సూత్రం. దాన్ని మోడీ మిత్రులు అమలు చేసి నిరూపించారు. పత్రికలు, చానళ్ళు, రేడియో లు ,హోర్డింగులు మొదలు సోషల్ మీడియా మొత్తం కొనేశారు. మోడీ ఎన్నికల ప్రచారానికి బీజీపీ చేసిన మొత్తం ఖర్చు అక్షరాలా ఐదువేల కోట్ల రూపాయలని తెలిసి దేశం ముక్కున వేలేసుకుంటోంది. ఇప్పటి వరకు వ్యాపార ప్రకటనల రంగంలో ఎంత చవకబారు ఉత్పత్తికి కూడా ఇంత ఖర్చు చేయలేదట. ఒక్క హార్డింగ్ లకే బీజీపీ దాదాపు 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. దేశంలో దాదాపు 15వేల హోర్డింగులు పెట్టి ఆ పార్టీ వేలకోట్లు ఖర్చు చేసింది. ఇక పత్రికల్లో ప్రకటనలు కొదువే లేదు. దేశంలోని యాభై ప్రధాన వార్తా పత్రికల్లో (అన్ని భాషల్లో) నలభై రోజులపాటు ప్రకటనలిచ్చి బీజేపీ మోడీని ప్రమోట్ చేసింది. దీనికోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేసింది. ఇవికాక ప్రధాన వార, మాస పత్రికల్లో కూడా 250 కోట్ల తో కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక టీవీల్లో ఈ ప్రకటనలు తెగ ఊదరగొట్టాయి. అన్ని టీవీల్లో కలిపి రోజుకు రెండు వేల సార్లు మోడీ టీవీ తెరమీద కనిపించాడు. అంటే ఆయన ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారంలోనే ఉన్నాడు. దీనికి ఎంత లేదన్నా రెండు వేలకోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయ్యిందని అంటున్నారు. ఇంకా రేడియో, పేస్ బుక్, ఇంటర్ నెట్, వెబ్ సైట్ లలో కూడా మోడీ నిరంతరం దర్శనం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన గత చరిత్రను తెరమరుగు చేయాలన్న ఉద్దేశం తోనే బీజీపీ ఆయనను ప్రతిక్షణం తెరమీద ఉండేలా ప్రచారాన్ని రూపొందించిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
మోడీకి సామాజిక కోణం లేదు. ఆయన దేనికీ చెందదు. ఆయన ప్రచార సరళి చూసిన ఏ ఒక్కరికి కూడా మోడీ సమాజంలో ఎవరి వైపో అర్థం కాదు. ఆర్ధిక వ్యవస్థ ఎలా మెరుగు పరుస్తారో చెప్పాలని అడిగితే 'నేను హర్వర్ద్ లో చదువలేదు, హార్డ్ వర్క్' చాలు అని చెప్పుకున్నారు. తనకు తానే ఉక్కుమనిషి నని కాసేపు సర్దార్ వల్లభ్ భాయితో పోల్చుకున్నారు. అంబేద్కర్ ను అసందర్భంగా తలచుకున్నారు. పేదవాడినని, చాయ్ వాలానని చెప్పుకున్నారు. చివరకు తనొక బీసీని అని కూడా ప్రచారం చేసుకున్నారు. పటేల్ గురించి ప్రచారం చేసుకున్నప్పుడు పటేల్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలుసు. అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు అంబేద్కర్ హిందూ మత చాందస భావ వ్యతిరేకి అని, పొరపాటున కూడా ఆ మతంలో బతకడానికి, కనీసం ఆ మతం లో చావడానికి కూడా ఆయన ఇష్టపడలేదని మోడీకి తెలుసు. అయినా ఆ ఇద్దరినీ వాడుకోవడం వాళ్ళ అటు అగ్రవర్ణాలకు, రైతులు, మోతుబరులకు ఇటు దళితులకు దగ్గర కావొచ్చని వాళ్ళ నామాలు జపించాడు. ఇక తనొక బీసీ నని ఆయనకు పుట్టుకతోనే తెలుసి ఉండాలి, ఒకవేళ తెలియక పోయినా కనీసం రిజర్వేషన్స్ ను, మండల్ కమీషన్ ను బీ జె పీ వ్యతిరేకించిన సందర్భంలోనైనా గుర్తుకు వచ్చి ఉండాలి. కనీసం ఇప్పుడు తన పార్టీ మేనిఫెస్టో రాసినప్పుడైన బీ సి లకు రాజకీయ రిజర్వేషన్ లు ఇవ్వాలన్న ఆలోచన వచ్చి ఉండాలి.కానీ ఆయనకు ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయనకు తన మూలాలు గుర్తుకు రాలేదు. ఆయన మూలాలు మతంలో ఉన్నాయి. మానవత్వంలో కాదు. అది ఎవరి విషయంలోనైనా ప్రమాదమే.
మోడీ గురించి అంతగా భయం లేదుకాని....హైదరాబాదు ని UT గా మార్చే ప్రయత్నం మరి CBN గారి ఆధ్వర్యంలో మోడీ కి ఎక్కుతుందేమో!? అని కూడా సందేహం! AP CM అపుడే, ప్రమాణస్వీకారం చేయకముందే ఏవో బీరాలు పలుకుతున్నాడు...దీనికి కూడా మన మధ్య ఒక సమాలోచన చేయాల్సిన అవసరముందండి!
రిప్లయితొలగించండిహిందూ మత శక్తులు కొందరిని( కొందరు బి.సి. లను, కొందరు ఎస్.సి. లను) మతోన్మాద వ్యక్తులుగా తయారుచేసి ఈ దేశం పైకి వదిలారు. అలాంటి వాళ్ళకు వాళ్ళ మూలాలు తెలియవు. మేము, మావాళ్ళు ఎక్కడినుండి వచ్చారు? మా మూలాలు ఎక్కడ వున్నాయి లాంటి ఆలోచనలు అస్సలు రావు. ఆ కోవకు చెందినవాడే అతను.
రిప్లయితొలగించండి