శనివారం, జులై 10, 2021

పురాస్మృతులు



 ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి
రణగొణ ధ్వనులకు దూరంగా 
ప్రశాంతమైన ఆ ప్రాంతానికి 
గతించిన కాలంలో బతికి చెడ్డ
పురాస్మృతుల దుఖ్ఖ భూమికి  
ఒక్కసారి వెళ్ళిరండి 
 
శాంతిని కాంక్షించే మీకు 
అసలు యుద్ధమంటే ఏమిటో తెలుస్తుంది
బతుకుపోరులో ఓడిపోయిన విస్తాపితులు  
మట్టిలో నిక్షిప్తమై పోవడం కనిపిస్తుంది 
 
 అభివృద్ధిని చూడడానికో
ఆనకట్టను చూడడానికో కాదు
మనిషి ఆనవాళ్లు చూడడానికి
మునిగిపోయిన ఆ వూళ్ళలోకి 
ఒక్కసారి వెళ్ళిరండి 
 
వీలుచూసుకుని వారాంతపు విడిదికో 
విహారానికో వెళ్లి ఓ పూట గడిపిరండి 
 
 
 
 అభివృద్ధికి దారి చూపిన 
ఆ నేలమీద 
నాలుగడుగులు నడిచి రండి
అది ఎంతటి విధ్వంసమో
ఎలాంటి విషాదమో అర్థమౌతుంది
నీళ్లు పారిననేల స్వర్గసీమని 
చెప్పుకుంటున్న మీరు
ఆ నది నిలిచిన చోటికి 
ఒక్కసారి వెళ్లిరండి 
ఆ నిరాశ్రయ నరకాన్ని  చూసిరండి 

వేలాది లక్షలాది మంది ఉసురు తీసిన 
ఆ గాలిని ఒక్కసారి పీల్చిరండి
ప్రాణవాయువు అంటే ఏమిటో తెలుస్తుంది
ప్రాణం విలువేంటో బోధపడుతుంది
 

II 

అదిగో మునిగిపోయి ఉన్న
ముప్పైమూడు ఊర్ల చివరన   
చిందరవందరగా పడుకునిఉన్న గుట్టల నడుమ
పోచమ్మ పహడ్ కూడా ఉండేదక్కడ
 


 పోచమ్మ తల్లి చల్లని చూపు కోసం
పంబాల పూజలు, పోతరాజుల పాటల నడుమ
జమిడికెల కొలుపులు జాతరల నడుమ
హోరెత్తే గోదావరి ఒడ్డున 
ఊరూ వాడా, పిల్లాజెల్లా సల్లంగుండాలని 
ఎల్లనంపిన నేల కదా అది
 
ఎల్లమ్మకూ  ఏడుగురు చెల్లెళ్లకు 
ఎందరో అమ్మలు బోనం వదిలిన జాగ కదా అది 
ఇంకా అక్కడేదో కుతకుత ఉడుకుతున్న వాసన 
మీ ముక్కుపుటాలను తాకుతుంది 
ఆ జననైవేద్యాన్ని ఆస్వాదించడానికైనా 
అక్కడికి ఒక్కసారి వెళ్ళిరండి 
ఆశచావని ఊరి దేవతలకు ఆరగింపు ఇచ్చిరండి

 
 నర దిష్టి సోకకూడదని
నాయకపోడు ఆదివాసులు
మేకపోతులను, గొర్రెపిల్లల్ని
బలిచ్చిన భూమి కదా అది
ఒక్క సారి ఆ భూమిని తాకి రండి 
 ఆ చిత్తడిలో మనిషి నెత్తుటి తడి తగిలి 
మీ పాదాలు స్రవిస్తాయి
 పాషాణ హృదయాలైనా ద్రవిస్తాయి  

ఘనీభవించి, గిడచబారడంకంటే 
ద్రవించడమే గుండెకుమంచిది 
అందుకైనా ఆ ఛాయల్లో తిరిగిరండి 
ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి

నదిఒడ్డున నాగరికత పరిమళాలు విరాజిల్లిన పల్లెలు
ఉన్నట్టుండి మాయమై పోయాయి 
పచ్చని పొలాలు, పసిడిపంటలు
పాడి పశువులు, పసిపిల్లలు నడయాడిన ఆ నేల
అప్పుడెప్పుడో అర్ధ శతాబ్దికిందే అంతర్ధానమయ్యింది
నది చుట్టూ పాయలు పాయలుగా పరుచుకున్న పల్లెలు
ఉన్నట్టుండి ఉప్పొంగిన మహాశ్రీ సాగరంలో కలిసి పోయాయి 
 

మనిషి నిర్మించిన సాగరం 
పేరేదైనా కన్నీటి కాసారమే కదా 
పరాధీన లోకమేకదా 
పరాజితుల శోకమే కదా 
పాతాళానికంటే లోతైన 
ఆ లోకానికి వెళ్ళిరండి ఒక్క సారి
ఆ కన్నీటిని తుడిచి రండి 

మీ కళ్ళింకా ఇంకిపోలేదని
మీలోఇంకా జీవముందని
నిర్ధారించుకోవడానికైనా సరే 
మీరు ఆ వూరికి ఒక్కసారి వెళ్ళిరండి  
 
 
ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి  
ఆశల పొదరిల్లు వదిలి
కలల లోగిళ్ళు వదిలి
ఉనినికి ఊపిరి పోసిన 
ఆ ఊళ్ళు వదిలి
ప్రాణానికి ప్రాణమైన 
పల్లెలు వదిలి
ప్రణయాలనూ,  
ప్రాణ స్నేహితులను వదిలి
తరతరాలుగా పెనవేసుకు బతికిన
బంధువులను, అనుబంధాలను వదిలి
కాందిశీకులై కదిలిపోయిన 
ప్రాణాలు కదా వారివి
అక్కడి జీవితాలతో అల్లుకుపోయిన 
ఆత్మలు కదా వారివి 
 
ఆ ఆత్మ కథల్ని ఆలకించడానికైనా
ఒక్కసారి ఆ నదీలోయకు వెళ్ళిరండి
ఆ ఆర్తిని అర్థం చేసుకోవడానికైనా 
మీరు ఆ నిర్జనావాసాన్ని చూసిరండి
 

III

ఏళ్లకు ఏళ్ళు ఆ నేలమీద 
నడయాడిన పక్షులు, పశువులు
ఆ నేలే నెలవై బతికిన సమస్త జీవరాశులు 
ఎటుపోయి ఉంటాయో, ఏమై పోయాయో కదా 
కొంచెం మనసుపెట్టి చూడండి 
 
 
 
పూడుకున్న నూతిలోనో
పాడుబడిన గోతిలోనో
ఊటబావి నీటిలోనో
ఊరిచివరి ఏటిలోనో
నరమానవుడు కనిపెట్టలేని 
మునిగిపోయిన చోటులోనో
ముళ్లపొదల మాటులోనో 
తలదాచుకు ఉంటాయి 
 
ఏ పాడుబడిన బడి లోనో
దేవుడు లేని గుడిలోనో 
చిత్తడి తడి లోనో
గడ్డిపూల ఒడిలోనో 
పెనవేసుకు ఉంటాయి
ఒక్క సారి ఆరా తీసి రండి 
ఆచూకీ కోసమైనా ఆ ఏరు వరకు వెళ్ళిరండి 
 ఆకుపచ్చ ఎడారితీరాన్ని చూసి రండి

 
నీరింకి నోళ్లు తెరిచిన ఆ ఊర్ల పొలిమేరలు 
ఒక్క సారి తిరిగి రండి
ఆ మెత్తటి పచ్చిక బయళ్ళ మీద 
నాలుగడుగులు నడిచి రండి
ఆ డొంక దారుల్లో
మట్టిమనుషుల అడుగుజాడలు 
మీ మడిమెలను ముడివేసుకుంటాయి
చెదిరిపోని చెమట చుక్కలు 
మంచుబిందువులై 
మీ కాళ్ళను కడుగుతాయి 
గరికపోచల గడ్డిపూలు 
గాఢంగా అల్లుకుంటాయి 
గుండెలకు హత్తుకుంటాయి
పసిపాపలై ఆడుకుంటాయి 
 
ఆ అనుభూతికోసమైనా, ఆనందం కోసమైనా
మీరొక్కసారి ఆ మృత్తిక మైదానానికి 
వెళ్ళిరండి  
 
అక్కడ కాసేపు
కళ్ళు మూసుకుని  
ఆ ఆకాశంనించి 
అలల పైపొరలనుంచి వచ్చే 
తరంగాల రాగాలను వినండి
వాయులీనమైన వేనవేల ఊసులు 
మీ చెవిన పడతాయి
 
 గుండె పగిలిన గొంతుతో 
భూపేన్ హజారికా ఆలపించిన
నదీలోయల అస్తిత్వ స్వర తరంగాలు
మీ హృదయాలకు వినపడతాయి 
ప్రవహిస్తూ వెళ్లాల్సిన గంగమ్మ 
ప్రాణాలను దిగమింగి 
ఎందుకు ఆగిపోయిందో
నిండు జీవితాలను ఎందుకు 
నిండా ముంచేసిందో అర్థమౌతుంది
మా తుజే సలాం అని భూతల్లిముందు 
మోకాలు లోతు బురదలో 
మోకరిల్లిన ఏ ఆర్ రెహమాన్ నివాళి 
ఏ తల్లికోసమో, ఎందుకో మీకు తెలుస్తుంది 
 
ఎప్పుడో బతుకమ్మలు పాడుకున్న
కోలాటపు రాగాలు కలగలిసిన
జానపదుల జాజిరి పాటలు
మరణమృదంగ  బృందగానమై   
ఒక స్వర సింఫనీ మీ మనసును కదిలిస్తుంది
ఆ ఆ గానంతో క్షణమైనా గొంతు కలపండి 
ఆ పదాలకు మీ వంతుగా వంత పాడండి
ఒక్కసారి ఆ స్వర ఝరి లో తడిసిరండి 
ఒక్క సారి అక్కడికి వెళ్ళిరండి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
 నింగిని విడిచి 
జారిపోతున్న 
నీలాకాశానికీ  
పచ్చగా పరుచుకున్న 
ఆ పసిరిక నేలకూ నడుమ
ఇంకిపోకుండా 
ఇంకా మిగిలిన జ్ఞాపకాల కన్నీటి పొర
కుత్తుకలు కోసిన చురకత్తిలా 
తళతళా మెరుస్తూ కనిపిస్తుంది 
వీలయితే ఆ అలలను ఒక్కసారి 
మీ పాదాలతోనైనా తాకిరండి
మీ పాపాలను అక్కడే కడిగేసుకోండి 

IV

మనిషి ఆనవాళ్ళు మాయమైపోయిన 
మరుభూమిలాంటి నేలమీద 
ఏముంటుంది అనుకోకండి 
అక్కడ మీకోసం అనేక పసి ప్రాణాలు 
ఎదురు చూస్తుంటాయి
వన్యప్రాణులై మీకు 
స్వాగతం పలుకుతాయి 
సాదరంగా ఆహ్వానిస్తాయి

 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
 ఊరి వీధుల్లోనో
నది ఒడ్డుమీదనో  
చెట్లల్లోనో, చేమల్లోనో
పొలాల గట్లమీదనో
కొండల్లోనో, కోనల్లోనో
ఎండల్లోనో, వానల్లోనో
పారే వాగుల్లోనో, పొంగే వంకల్లోనో 
ఆడిపాడుకున్న ఆ ఊరి పిల్లలు
గుంపులు గుంపులుగా జింక పిల్లలై
 ఎగురుకుంటూ ఎదురొస్తారు 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

 
 గంతులేస్తూ కనిపిస్తారు 
ఆడుకుంటూ అలరిస్తారు
 తమ తాతల్ని తరిమేసిన బూచాడు 
మళ్ళీ వచ్చాడేమోనని 
గుబులు గుబులుగా మీవంక 
తిరిగి చూస్తూ పరుగెడతారు 
మీ గుండె చప్పుళ్ళు వింటారు 
చుట్టాలు వచ్చినంత సంతోషంగా 
సందడి చేస్తారు, సంబరపడిపోతారు 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 వెళ్లిపోతున్న మీకు 
విచారంగా వీడ్కోలు చెపుతారు 
మళ్ళీ రండని కన్నీళ్లు నింపుకుంటారు 
అదొక మృగయా వినోదంగా మారిపోకముందే
ఆ మూగజీవాలు పారిపోకముందే 
ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి 
ఆ పరివారాన్ని పలకరించి రండి
 
మీకు అక్కడక్కడా తాడూ బొక్కెనలేని
మంచినీటి చేదబావులు
వలలువేసి ప్రాణాలు తోడేసిన
మొండి మోటబావులూ కనిపిస్తాయి
ఇప్పుడు వాటిలో నీళ్ళున్నాయి కానీ జీవంలేదు 
అది నిశ్చల నది
అసలు అక్కడి నీటిలోనే జీవంలేదు

అయినా కొత్తపూత పూస్తోన్న
ఆ  పొలాలను గమనించండి
నాట్లేస్తూనో, కలుపుతీస్తూనో, కోతలు కోస్తూనో
అలిసి పోయిన అమ్మలక్కలు
పగిలిపోయిన గాజుముక్కలై మెరుస్తుంటారు 
 
 
పరుచుకున్న పసిరిక మీద 
ఎర్రని కందిరీగలై ఎగురుతుంటారు 
పల్లెపాటలు పాడుతుంటారు
మనచుట్టే తిరుగుతుంటారు 
ఆడపడచుల వాయినాలు అడగని 
వాళ్ళను ఒక్కసారి 
పలుకరించడానికైనా 
పరామర్శించడానికైనా
అక్కడిదాకా వెళ్ళిరండి

అలాగే పురా జ్ఞాపకాలను దిగమింగి 
సగంపూడుకుపోయి 
పాడుబడిన బావులూ,
కయ్యల్ని దాటుకుంటూ 
ఇంకొంచెం నడవండి

మీ వెంటే ఎప్పుడో నిరాశ్రయులై 
వెళ్ళిపోయిన వలసపక్షులు 
వరుసకడతాయి
పాత వరసలతో 
మిమ్మల్ని పలకరిస్తాయి
 
 
ఏ గల్ఫ్ దేశంనుంచో  వచ్చే 
వలసకూలీల్లాగే ఏడాదికోసారి
ఎండిపోయిన తీరాన్ని చేరి
ఆత్మీయులను కలుసుకుంటాయి
కష్టసుఖాలు కలబోసుకుని
కన్నీరు నింపుకుంటాయి
తాతల కాలంనాటి 
వైభవోపేత వీరగాధల్ని 
కథలు కథలుగా చెప్పుకుంటాయి
                                                    
                                                                            
 
ఇంకాస్త ముందుకు వెళ్ళండి 
నిలువునా శిధిలమైన చావిడి అరుగుల మీదో
నీళ్ళల్లో పూడుకుపోయిన బొడ్రాయి దగ్గరో
బురదలోపలికి కూరుకుపోయిన 
రావిచెట్టు మూలాల్లోనో 
వృధాప్యంతో వంగిపోయిన కొంగలు

గుంపులుగుంపులుగా కూర్చున్న
ఫ్లెమింగోలు కనిపిస్తాయి
జన్మజన్మల రుణమేదో 
ఆ ఊరితో ఉన్నట్టు 
ప్రాణాలకు  రెక్కలు కట్టుకుని
ఖండాతరాలు దాటి 
ఆ వూరికి  వీలుచిక్కినప్పుడల్లా 
వచ్చి పోతుంటాయి
అక్కడే అంతరించి పోయిన 
ఏడేడు తరాలను తలుచుకుని 
వలవలా విలపిస్తాయి

ఆ భూమి పొరల్ని ఆత్మీయంగా 
తడిమి చూసుకుంటాయి 
పూడుకుపోయిన ఆ పునాది రాళ్ళనడుమ 
అమ్మదో, నాన్నదో 
పూర్వీకులదేదైనా ఆచూకీ
దొరుకుతుందేమేమోనని 
ఆశగా తరచి చూస్తుంటాయి 
 
ఒక్క సారి వెళ్ళిరండి
ఆ వెతుకులాటలో సాయపడడానికి 
ఏ సాయంత్రమో అలా వెళ్ళిరండి 
భూస్థాపితమైన అస్తిత్వపు ఆనవాలేదో
మీకు ఖచ్చితంగా దొరికి తీరుతుంది
 

V

తప్పకుండా ఒక్కసారి 
ఒకేఒక్కసారి 
అక్కడికే కాదు, మరెక్కడికైనా 
నదిని  నిలిపేసిన చోటికి 
నాగరికతను నలిపేసిన చోటికి
నీటిలో మునిగిపోయిన 
ఏదోఒక వూరికి 
సీలేరుకో, సింగూరుకో 
మానేరుకో , మా ఊరికో  
ఎక్కడికో ఒక చోటికి వెళ్ళిరండి

 
మీకక్కడ బతుకంటే ఏమిటో తెలిసివస్తుంది 
ఉనికంటే ఏమిటో తెలిసివస్తుంది 
ఊరంటే ఏమిటో తెలిసివస్తుంది 
కులంమంటే, స్థలమంటే  
బలమంటే, బాధంటే, 
మనిషికీ మనిషికీ మధ్య అనుబంధమంటే 
మనిషికీ మట్టికీ పెనవేసుకుపోయిన 
పేగుబంధమంటే తెలిసివస్తుంది 
 
 విస్థాపన ఈ సమస్త సమిష్టి అస్తిత్వాలను 
భూస్థాపితం చేసిందని విశదమౌతుంది 
నిర్వాసితుల నిర్వేదం అర్థమౌతుంది
 

మీరక్కడికి వెళితే నది సంపదగా మారే 
అమానవీయ ప్రక్రియ అర్థమవుతుంది 
నది నీరూ, కన్నీరు ఘనీభవిస్తేనే 
ధాన్యం గింజ అవుతుందన్న 
తత్వం బోధపడుతుంది 
 
సర్వస్వం కోల్పోయిన 
నిర్వాసితుల  బతుకే
మన కంచంలో మెరిసే 
అన్నం మెతుకన్న పరమ సత్యం 
తెలిసివస్తుంది
 
  -ఘంటా చక్రపాణి






 
*2021 జున్ 3-4 తేదీల్లో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాంతంలో  శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ పరిసరాల్లో పచ్చిక మైదానాలుగా మారిపోయిన ముంపు గ్రామాలను చూసినప్పుడు కలిగిన ఆలోచనలు. ప్రాజెక్టులోకి వచ్చేప్రవాహం తగ్గినప్పుడు ఆ నీటి అడుగునేలలన్నీ వివిధ రకాల పక్షులు, జంతువులు, ముఖ్యంగా వేలాదిగా వచ్చి చేరే కృష్ణ జింకలు, నీటికొంగలూ ,ఫ్లెమింగోల లాంటి అరుదైన వలసపక్షులతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రేమికుడూ, ఆ ప్రాణుల ప్రేమికుడూ అయిన క్యాతం సంతోష్ కుమార్ సౌజన్యంతో అక్కడ ఒక రోజంతా కలియదిరిగే అవకాశం వచ్చింది.

**వలసలు, నిర్వాసితులకు సంబంధించిన ఒకటి రెండు ఫైల్ ఫోటోలు మినహా మిగితావన్నీ అక్కడివే . సంతోష్ కుమార్, ఆర్హత్ బోధి, పుష్ప, మిలింద్ తీసినవి.

 

12 కామెంట్‌లు:

  1. సర్వస్వం కోల్పోయిన
    నిర్వాసితుల బతుకే
    మన కంచంలో మెరిసే
    అన్నం మెతుకన్న పరమ సత్యం
    తెలిసివస్తుంది...కళ్ళల్లో నీళ్ళు, గుండెల్లో దుంఖం

    రిప్లయితొలగించండి
  2. ఇది ఒక్క నిర్వాసితుడి వేదన కాదు...సార్వత్రిక దుఃఖంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటికీ యధేచ్చగా కొనసాగుతుంది. పెద్ద ప్రాజెక్టుల కంటే చిన్న రిజర్వాయర్లు ఉత్తమం కదా. పాలకులు భూసేకరణ చట్టాలను తమకు అనుకూలంగా సవరణలు చేసుకున్నాడు. యస్వాడు మునిగితే ఇంత గొప్ప కవిత్వం రాశారు. తెలంగాణ వచ్చాక మునిగిపోయిన కొండపోచమ్మ తదితర నిర్వాసిత గ్రామంలో మీలాగా బుద్దిజీవులు ఉన్న గ్రామస్థులు రాస్తే పాలకుల ద్రోహం, ప్రజల సర్వస్వ త్యాగాలు చరిత్రలో రికార్డు అవుతాయి. మీలో కవి కూడా ఉండటం అభినందనలు సర్...
    కోడం కుమారస్వామి, జనగామ.

    రిప్లయితొలగించండి
  3. కళ్ళు చెమర్చుతున్నాయి సార్...
    ప్రతీ అక్షరం మీ అంతరంగాల్లో నిక్షిప్తమైన భావాలన్నీ ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైతే ఎగసిపడే లావాని ప్రతిబింబిస్తున్నాయి...
    పరిస్థితిని కళ్ళకి కట్టారు.
    అభివృద్ధి, ఆధునిక దేవాలయాలు అని మన పాలకులు చెప్పే కబుర్ల వెనక నిశీధిలో కలిసిపోయిన జీవితాల బాధల్ని వెలుగులోకి తెచ్చారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా కవితాత్మకంగా వుంది. ఇది అవసరం కూడా అనిపించింది . అభినందనలు .
    జింబో

    రిప్లయితొలగించండి
  5. చక్రపాణిగారూ కవిత ఒక దీర్ఘవేదన.కోల్పోయిన ఆవ‌రణాన్ని దేవులాడి పెట్టా‌రు.ఈ poem ప్రచురించండి

    రిప్లయితొలగించండి