మంగళవారం, మార్చి 31, 2020

సామాజిక దూరానికి స్వస్తి!


 కరోనావైరస్ మహమ్మారిని ఎలా నివారించాలో చర్చించేటప్పుడు Social Distance అనేపదాన్ని i ప్రభుత్వం, మీడియా సంస్థలతో సహా అందరూ వాడుతున్నారు, తెలుగులో సామాజిక దూరం అనే ఎబ్బెట్టు పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ విషయమై గతవారం 'ఘంటాపథం'లో చర్చించాం.   ఈ పదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా చాలామందినుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అమెరికా లోని నార్త్ ఈస్టర్న్  విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ,  పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ డేనియల్ ఆల్డ్రిచ్ ఈ పదం తప్పుదారి పట్టించేదని మరియు దాని విస్తృత ఉపయోగం ప్రతికూలంగా ఉంటుందని ఆందోళన వ్యక్క్తం చేశారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇకపై భౌతిక లేదా శారీరక దూరం అనాలని నిర్ణయించింది.

అందరూ  కరోనావైరస్ యొక్క వ్యాప్తిని మందగించడానికి తీసుకున్న ప్రయత్నాలు శారీరక దూరాన్ని కొనసాగిస్తూ సామాజిక సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రోత్సహించాలని అల్డ్రిచ్ చెప్పారు.ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. 

👇
 సామాజిక దూరంకాదు. కేవలం భౌతికంగా దూరం.


సోమవారం, మార్చి 30, 2020

కరోనా ఖర్మ కాదు! కర్మ!!


నిషి తనకు కారణాలు తెలియని, ఊహకు, తర్కానికి  అందని విషయాలన్నిటికీ ఖర్మ అనుకుని దేవుడి మీద భారం వేస్తుంటాడు. కానీ మన జీవన్మరణాల భారం దేవుడిది కాదు. మనదే. అది మన కర్మ ఫలితం. ప్రకృతిని మనమే నాశనం చేసి మనకు మనమే ముప్పు తెచ్చుకుంటున్నాము. ప్రకృతిలో ఎదురయ్యే ఉపద్రవాలన్నిటికీ మనిషే కారణమని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఎప్పటినుంచో చెపుతున్నారు.

లండన్ కు చెందిన Steve Cutts అనే పర్యావరణ ప్రేమికుడు 2012 లో రూపొందించిన MAN  అనే యానిమేషన్ ఫిలిం ఇప్పుడు కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కరోనా వర్సెస్ కర్మ పేరుతో దీన్ని కొందరు యూట్యూబ్ లో లోడ్ చేశారు, దానికి త్రి ఇడియట్స్ చిత్రంలోని పాటను కూడా జోడించారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

స్వయంగా యానిమేటర్ అయిన Steve ఇల్లస్ట్రేషన్స్ ఆధారంగా ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని, మనిషి చేష్టలు, చర్యలు, కర్మల వల్ల ఏర్పడుతున్న ముప్పును చక్కగా వివరించారు. ఇది కరోనా కు కారణం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెపుతుంది. ఈ క్రింది వీడియో ఒరిజినల్ దీనికి Edvard Grieg సమకూర్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.

గురువారం, మార్చి 26, 2020

LIFE UNDER THE LOCKDOWN


మనలో చాలామందికి ఈ LOCKDOWN పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడంలేదు. నిజానికి అదొక క్రమశిక్షణ, కానీ చాలామంది దీన్నొక శిక్షగా భావిస్తున్నారు.  కొందరైతే దీన్ని భరించలేక ఏదో ఒక వంకతో బయట తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు తింటున్నారు.  నిర్బంధాన్ని, దాన్ని విధిస్తున్న ప్రభుత్వాలని, అమలుపరుస్తున్న పోలీసులను  నిందిస్తున్నారు.

కానీ ఇదంతా రేపటి యుద్ధానికి సన్నద్ధం అనేవిషయం గమనించాలి, ఇప్పుడు మనం సహనాన్ని నేర్చుకోవాలి. స్వేచ్ఛ ను ఆస్వాదించే మనం నిర్బంధంలో ఎలా ఉండాలో కూడా అలవాటు పడాలి. రేపటి ఈ యుద్ధం ఎంతకాలమో ఎవరికీ తెలియదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి మనిషికంటే ఈ మహమ్మారి శక్తివంతమయినది.

 ఈ యుద్ధంలో మనం చేయాల్సింది ఎదురొడ్డాడం కాదు, దాక్కోవడం, చేతులు ముడుచుకుని కూర్చోవడం! మనం వెళ్ళాల్సింది ఏ హెచ్చరికనూ లెక్కచేయని ఇటలీ, అమెరికా, ఐరోపా దేశాల మార్గంలో కాదు. ఒక్కొక్క క్షణం లెక్కవేసుకుని తమని తాము కట్టడి చేసుకున్న ఆసియా ప్రజల దారిలో! అది సౌత్ కొరియా, థాయిలాండ్, తైవాన్, వియాత్నం ఏ దేశమైనా కావొచ్చు కొరోనాకు తలవంచలేదు, పోరాడి గెలిచాయి, గెలుస్తున్నాయి, కొన్ని అదుపులో పెడుతున్నాయి.

చైనా అయితే ఎదురొడ్డి పోరాడి ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. ఎలా? అది చెప్పడానికే ఈ వీడియొ డాక్యుమెంటరీ! LOCKDOWN లో చైనాలోని వుహాన్ నగర ప్రజలు ఏంచేశారు. అక్కడి ప్రభుత్వం ఏంచేసింది? ఈ వీడియో విశదీకరిస్తుంది. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా చైనా ప్రభుత్వ వ్యూహాన్నే అనుసరిదిస్తోంది. ప్రజలు ఈదశలో ఎక్కడికక్కడ చేతులుముడుచుకుని లేదా తరచుగా చేతులు కడుక్కుంటూ కూర్చోండి. మిగితాది ఇప్పటికి ప్రభుత్వానికి వదిలేయండి. రంధ్రాన్వేషణలు మానేయండి.

ఒక అరగంట పాటు CGTN రూపొందించిన ఈ వీడియో చుడండి. యుద్ధవిద్య మీకే అర్థమౌతుంది!! కొందరి ఆలోచనైనా మారుతుందనే ఆశతో!
LockDown లో ఎలా ఉండాలి? చైనా చెప్పిన పాఠం!


కరోనా వైరస్ నియంత్రణ విషయంలో చైనా లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ అనుభవాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయికరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనా నగరం వుహాన్ లో  ఇద్దరు స్థానిక చిత్రనిర్మాతలు Lin Wenhua, Cai Kaihai జనవరిలో నగరం లాక్ డౌన్ అయినప్పటి నుండి 50 రోజులకు పైగా ప్రజల జీవితాన్ని రికార్డు చేశారు.   ఫిలిం ను బీబీసీ  Our World - Wuhan: Life Under Lockdown పేరుతో ప్రసారం చేసిందిఇది హృదయం ద్రవింపజేసే కథ! చిత్రాన్ని రూపొందించిన వారిలో ఒకరు తన భార్య కొరోనావల్ల ఎంత కఠోరమైన జీవితాన్ని అనుభవించిందో చూపించారు. ఇంకొకరు ఒక వాలంటీరుగా నగరంలో ఇంటింటికీ తిరిగి మందులు అందిస్తూ రోగులు అనుభవించిన వేదనను రికార్డుచేశారు. డాక్యుమెంటరీ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కరోనా ఎంత భయంకరమైందో, దానిని ఎంత జాగ్రత్తగా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ముఖ్యంగా లాక్ డౌన్ లో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి దీనిని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. తప్పకచూడండి. దూరం ఉండాలి ! దగ్గరవ్వాలి!!


క సమాజ శాస్త్ర విద్యార్థిగా, భారతీయ సమాజంలో భాగస్వామిగా Social Distancing అనే పదం నాకెందుకో ఇష్టంలేదు. తెలుగులో దీనిని సామాజిక దూరం అనాలి, హిందీలో
सामाजिक भेद అనొచ్చని గూగుల్ చూపిస్తోంది. కానీ ఈ రెండూ భాషాపరంగా, భావపరంగా తప్పేనని నా అభిప్రాయం. 

ముఖ్యంగా  తరతరాలుగా సామాజిక అంతరాల్లో మగ్గుతున్న సమాజాలకు  ఇదేమంత ఆమోదయోగ్యమైన పదమేమీ కాదు. ఇప్పటికే వర్ణ బేధం, కుల మత, జాతి, లింగ వైరుధ్యాలకు దూరాన్ని పాటించే సందర్భాలకు సమాజ శాస్త్రాల్లో social distance అనే పదాన్ని వాడుతున్నారు. వ్యక్తులు, ప్రత్యేకించి వివిధ సామాజిక సమూహాలకు చెందినవారు (రంగు, జాతి, వర్గం, కులం, మతం, లింగం ఆధారంగా) మధ్య సామాజిక పరస్పర చర్యను అంగీకరించడం లేదా తిరస్కరించడానికి ఇదే ప్రామాణికం. ఇందులో వివక్ష ఉంటుంది. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగగ్రస్తుల కు దూరం ఉండే విషయంలో social distancing  అనే పదాన్ని స్థిరపరిచారు. వారివి సామాజిక అసమానతలు, అంతరాలు లేని సమాజాలు కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నారు.


ఒక రకంగా ఇతరులతో  కనీస దూరాన్ని పాటించడం అనుకోవచ్చు. ఇది అవసరం, తుమ్మినా, దగ్గినా తుంపరలు మీద పడనంత దూరంలో ఉంటె చాలు. కానీ మనదేశంలో కొందరు అజ్ఞానులు ఈ సామాజిక బేధమంటే వెలివేత అనే అనుకుంటున్నాయి. ఇవాళ దేశంలో ఇదొక కొత్త సామాజిక వివక్షకు దారితీస్తోంది.  దేశమంతటా డాక్టర్ లను కిరాయి ఇళ్లల్లోంచి ఖాళీ చేయిస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో మన వరంగల్ ఎంజీఎం వైద్యులు కూడా ఇలాంటి వివక్షను, వెలివేతను ఎదుర్కోవడం సిగ్గుచేటు. ఈ సంఘటనల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది తప్ప ఇప్పటివకు ఎక్కడా తగిన చర్యలు తీసుకోలేదు. 

ఈ దేశంలోనిమనుషుల్లో ఉన్న మూఢత్వం దీనికి కారణం. ఏ మాత్రం పొంతన లేని అంధవిశ్వాసాలు, వాటిని ప్రోదిచేసి ప్రచారం చేసిన మత ఛాందసాలు దీనికి కారణం. మతమేదయినా మనుషుల్ని మందమతుల్ని చేస్తుందని మధ్యయుగాల నుంచి అనేక అనుభవాలు చెపుతున్నాయి కానీ అవి ఇంకా దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో భక్తి తప్ప భయంలేదని ఇటీవలి పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. 


కరోనా విజృంభిస్తున్న దశలో ముందస్తు సన్నాహక చర్యల్లో భాగంగా( అలాగని చెప్పక పోయినా) 'జనతా కర్ఫ్యూ' పేరుతో ఒకరోజు స్వచ్చంధ బంద్ పాటించాలని స్వయంగా ఈ దేశ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ఇది కరోనా సృష్టించిన సంక్షోభ సమయంలో అలుపు లేకుండా నిస్వార్థ సేవ చేస్తోన్న మన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి గౌరవ సూచకంగా మనం శిరసు వంచి కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భమని, స్వచ్చందంగా కర్ఫ్యూ పాటించి మనం వారికిచ్చే గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెపుదామని అన్నారు. అలాగే సామాజిక దూరాన్నీ పాటించాలని చెప్పారు. అంతే మరుసటి రోజు దేశమంతా బంద్ అయ్యింది. కానీ ఆ సాయంత్రానికి ఏమయ్యింది? వందలు, వేల  సంఖ్యలో  భజనమండలులన్నీ రోడ్ల మీదికి వచ్చిపడ్డాయి. సామాజిక దూరం పాటించాలన్న సంగతి ఈ సమూహాల చెవికెక్కలేదు. సంఘీభావం అంటే కూడా బోధపడినట్టులేదు. ఎందుకంటే ఆమరుసటి రోజునుంచే దేశంలో డాక్టర్ల పట్ల వివక్ష మొదలయ్యింది. ఎవరి సేవలకు దేశమంతా శిరసువంచి కృతజ్ఞత తెలిపిందో మరుక్షణమే వారిని మెడలుపట్టి నెట్టేస్తుంటే జాతి యావత్తూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ఇకపోతే పారిశుధ్య కార్మికులంటే ఈ దేశంలో ఎంత చిన్న చూపు ఉందొ, ఎంత సామాజిక దూరం పాటిస్తుంటారో చెప్పనవసరం లేదు. 

నిజానికి ఇప్పుడు కావాల్సింది సామాజిక దూరంకాదు. కేవలం భౌతికంగా కాస్తంత ఎడంగా ఉండడం. సామాజిక, మానసిక ఐక్యతతో కలిసి కట్టుగా ఉండడం.  ఒకరికి, ఒకరం తోడుగా ఉన్నామనే భావన ఈ సమాజంలో, ప్రజల్లో.  దేశంలో కలుగడం. మనుషులు దగ్గరవడం. ఒకరికి ఒకరు ఒకమీటరో, మూడు ఫీట్లో దూరంగా ఉన్నతమాత్రాన మనుషులు సామాజికంగా దూరం అయినట్టు కాదు.  అలా కాకూడదు కూడా! 

ప్రొ . ఘంటా చక్రపాణి 
25-03-2020