మంగళవారం, మార్చి 19, 2019

పారిక్కర్ తో పరిచయం

  మరిచిపోలేని మనిషి !



జీవితంలో మనకు ఎంతోమంది పరిచయం అవుతుంటారు. పరిచయం అయిన ప్రతి ఒక్కరూ మన స్నేహితులో, బంధువులో లేదా మరో రకంగా 'మన వాళ్ళే' కానక్కరలేదు. వాళ్ళతో మనకు ఎలాంటి అనుబంధం ఉండనవసరం లేదు.  మన రాజకీయ అభిప్రాయాలు, సామాజిక దృక్పథాలు కలవనవసరం లేదు. అయినా మనకు గుర్తుంటారు.  వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనలను ఆకట్టుకుంటారు. అలాంటి వాళ్ళు మరికలేరన్న వార్త విన్నప్పుడు బాధ కలుగుతుంది. వాళ్ళతో ఉన్న పరిచయం గుర్తొస్తుంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ పరిచయం అలాంటిదే.


 2018 ఫిబ్రవరి లో వృత్తిరీత్యా ఆయన తో పరిచయం కలిగింది. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గోవాలో జరిగిన సందర్బంగా ఆయనను కలవాల్సి వచ్చింది. సాధారణంగా ఏడాదికి ఒక సారి జరిగే ఈ సదస్సులను ఒక్కొక్క సారి ఒక్కొక్క రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. UPSC చైర్మన్ తో సహా అన్ని రాష్ట్రాల కమిషన్ల చైర్మన్లు హాజరయ్యే ఈ సదస్సు కు   ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ లను ఆహ్వానించడం ఆనవాయితీ. నేను ఈ జాతీయ సదస్సు స్టాండింగ్ కమిటీ కి చైర్మన్ గా ఉన్నందువల్ల మనోహర్ పారిక్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు.   సదస్సుకు హాజరై అంతసేపు ప్రసంగించలేనేమో, అయినప్పటికీ ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు మా రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల ఆతిధ్యం ఇస్తున్న వ్యక్తిగా మీతో కాసేపైనా గడపడం నా బాధ్యత, కాబట్టి ఎప్పుడు వీలయితే అప్పుడు వస్తాను అని చెప్పారు. మేము కూడా ఆయన రాకపోవచ్చుననే అనుకున్నాం.


11 వ తేదీ రాత్రి గోవా ప్రభుత్వం ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విందులో అందరం భోజనాలకు సిద్ధమవుతుండగా ఒక వ్యక్తి సాదా సీదాగా డైనింగ్ హాల్ లోకి నడుచుకుంటూ వచ్చాడు. పోల్చుకోవడానికి నాకు సమయం పట్టినా మిత్రుడు గోవా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జోస్ మాన్యుయేల్ నోరాహ్న అలర్ట్ చేయడంతో వచ్చింది పారిక్కర్ అని గుర్తించి UPSC చైర్మన్ ప్రొ. డేవిడ్ శామ్లే తో సహా వెళ్లి స్వాగతించాం. ఒక వ్యక్తిగత సహాయకుడు తప్ప సాధారణంగా ముఖ్యమంత్రుల వెంట ఉండే హడావిడి, పోలీసులు, సెక్యూరిటీ అధికారులు, వందిమాగధులు ఇతర మందీ మార్బలం ఎవారూ లేరు. ఒక సాధారణ పౌరుడిగా ఆయన వచ్చి మాలో ఒకరిగా కలిసిపోయారు. అందరినీ పలకరించారు. కుశల ప్రశ్నలు వేశారు. అనేక జోకులు పేల్చి అందరిని నవ్వించి ఆహ్లాద పరిచారు. తెలంగాణా గురించి అడిగారు. గోవా మతసామరస్యం, సంస్కృతి గురించి చెప్పారు. రక్షణ శాఖ గురించి, ఢిల్లీ గురించి, గోవా వాతావరణం, బీచ్ ల గురించి బీఫ్ ( గోవా లో బీఫ్ పై నిషేధం లేదు) గురించి హాస్యభరితంగా అనేక సంగతులు చెప్పారు. రెండు బన్నులు, పప్పు వేసుకుని తింటూ సివిల్ సర్వీసెస్ ఎలా ఉండాలి, సర్వీస్ కమిషన్స్ ఎలా ఉంటె బాగుంటుంది పిచ్చాపాటిగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అని కానీ, దేశ మాజీ రక్షణ మంత్రి అని కానీ, ఒక హిందూ రాజకీయ పార్టీ నాయకుడు అని కానీ మాకెవ్వరికీ అనిపించలేదు. మనకు మామూలుగా ప్రయాణంలో ఎదురై పలకరించి మాట్లాడే మనసున్న మనిషిగా దాదాపు మూడు గంటల పాటు ఆనందంగా గడిపి సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు గవర్నర్ మృదులా సిన్హా సదస్సును ప్రారంభించారు. 


ఆ తరువాత కొద్దిరోజులకే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. నిజానికి ఆయన ఇంతకాలం బతికి ఉండడమే గొప్ప విషయం, అది కేవలం ఆయన మనో నిబ్భరం వల్లే సాధ్యపడింది. ఆయనే అన్నట్టు Human mind can overcome any disease, కానీ ఏ మనిషికైనా జీవితం   తాత్కాలికమే. ఆయన మరణ వార్త దానిని మరోసారి రుజువు చేసింది. ఆయన ఎప్పటికీ గుర్తుండే మనిషి. పారిక్కర్ పరిచయం ఒక మరిచిపోలేని జ్ఞాపకం.  

గురువారం, మార్చి 14, 2019

#నాతెలంగాణ-01

 మలిదశలో తొలిఅడుగు: భువనగిరి సభ   


మార్చి కోసం నేను చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా మిత్రుడు ప్రొ. దినేష్ కుమార్ భువనగిరి సభ ఫోటోలు పంపినప్పటినుంచి వాటిని మీతో పంచుకోవడం కోసం. జయశంకర్ గారి కొత్త పుస్తకం కోసం కొందరు మిత్రులం పాతజ్ఞాపకాలను తవ్వితీస్తుండగా కొన్ని ముఖ్యమైన ఫోటోలు దొరికాయి. అందులో 1997 లో జరిగిన భువనగిరి ఫోటోలు కూడా ఉన్నాయి.
 సదస్సులో ప్రసంగిస్తున్న నేను 

 తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ చేసిన తొలి ప్రజా ప్రయత్నంగా భువనగిరి సభలను చెప్పుకోవచ్చు. అప్పటికి చిన్న చిన్న వేదికలు సభలు ఏర్పాటు చేసినప్పటికీ 1997 మర్చి 8, 9 తేదీలలో జరిగిన ఈ రెండు రోజుల సదస్సు, బహిరంగ సభ ప్రత్యేక తెలంగాణా సాధనలో నిర్మాణాత్మక ముందడుగు గా పేర్కొనవచ్చు.  అది చంద్రబాబు నాయుడు పాలన, నిర్బంధ,  నియంతృత్వ పోకడతో సాగుతున్న కాలం. ఆయన పాలనలో తెలంగాణ పరిస్థితులకు అద్దంపట్టే విధంగా ఈ సభకు "దగాపడ్డ తెలంగాణ" గా నామకరణం చేశారు.

గాదె ఇన్నయ్య
సభ వెనుక కర్త, కర్మ,  క్రియ అన్నీ తానే అయి నడిపించింది మిత్రుడు గాదె ఇన్నయ్య. ఇన్నయ్యకు సుదీర్ఘ పోరాట అనుభవం ఉంది. నేను వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం లో చేరినప్పటినుంచే  (1992) నాకు ఇన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన అప్పటికే ఆయన తెలంగాణా దుస్థితిపై విస్తృత అధ్యయనం చేస్తూ వచ్చారు. తరచూ ఆ అంశాలు మా మధ్య చర్చకు వచ్చేవి. ఆ అధ్యయన సారాంశాన్ని ఆయన 'దగాపడ్డ తెలంగాణా' పేరుతో వివిధ సంచికలుగా ప్రచురించి పంచేవారు. అది తెలంగాణా  భావ వ్యాప్తి లో కీలకంగా మారాయి. ఆ దశలోనే ఈ సభకు "దగాపడ్డ తెలంగాణ" సభగా నామకరణం చేయడం జరిగింది. నేను,   డా. దినేష్ కుమార్ ఇద్దరం ఇన్నారెడ్డికి నిర్వహణలో పాలుపంచుకున్నాం. స్థానికంగా జైని మల్లయ్య గుప్తా, నాగారం అంజయ్య, పిట్టల శ్రీశైలం, , మల్లారెడ్డి, రావి సురేందర్ రెడ్డి మరికొందరు సభ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై మేధో మధనంగా సాగిన ఈ సదస్సు వేదికకు  "నిజాం వ్యతిరేక పోరాటాలు అమరవీరుల ప్రాంగణం"గా నామకరణం చేశారు. ఈ సదస్సును ను తెలంగాణా ఉద్యమ పితామహుడు  కాళోజీ నారాయణ రావు ప్రారంభించారు. ఆంద్ర వలస పాలనలో తెలంగాణా ఎలా నిర్లక్షానికి గురయ్యిందో ఈ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
 
 ప్రసంగిస్తున్న కె. శ్రీనివాస్, వేదికపైన కూర్చున్నది నందిని సిద్ధారెడ్డి 

వివిధ రంగాలలో కొనసాగుతున్న వివక్ష మూలంగా తెలంగాణా ఎలా దగా పడిందో సదస్సులో సమగ్ర చర్చ జరిగింది. విద్య వైద్య రంగం (ప్రొఫెసర్ జయశంకర్) తెలంగాణ వనరులు పారిశ్రామిక కాలుష్యం- (ప్రొఫెసర్ కేశవా రావు జాదవ్)  వలసీకరణ, నిరుద్యోగం   ( ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా ఉన్న కె.  శ్రీనివాస్) భాషా సంస్కృతి మీడియా (నందిని సిద్ధారెడ్డి) , రిజర్వేషన్లు, దళితుల వర్గీకరణ-డాక్టర్ ముత్తయ్య, ఆదివాసి సమస్యలు (ప్రొఫెసర్ బియ్యాల జనార్ధ న రావు) సంక్షేమం పైన నేను ప్రసంగాలు చేసాం.
 
 సభావేదిక మీద గద్దర్, దినేష్ కుమార్ తదితరులు 

ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గద్దర్  తెలంగాణ ఉద్యమం పై అవగాహన కల్పించారు. సదస్సు, బహిరంగ సభలో బెల్లి లలిత పాటలు హోరెత్తించాయి. ఈ సభ తరువాతే బెల్లిలలిత హత్య, గద్దర్ పై కాల్పులూ జరిగాయి. ఈ సభ తరువాత అదే ఏడాది ఆగస్టు నెలలో సూర్యాపేటలో మారోజు వీరన్న మార్గదర్శకత్వంలో డా. చెరుకు సుధాకర్, వి. ప్రకాష్  నేతృత్వంలో మరోసభ జరిగింది, అది తెలంగాణా మహాసభగా మారింది. అనతికాలంలోనే మారోజు వీరన్న "ఎదురుకాల్పుల"లో మరణించారు.

  మలిదశ తెలంగాణా ఉద్యమానికి తొలి బీజాలు వేసిన భువనగిరి సభ నిర్వహణలో పాలుపంచుకుని,  సదస్సులో భాగస్వామినైనందుకు, అదే స్పూర్తితో తెలంగాణ సాధనలో నిలబడి ఉన్నందుకు గర్వంగా ఉంది. సరిగ్గా ఇరవైరెండేళ్ల క్రితం మొదలైన ప్రత్యక్ష తెలంగాణా ఉద్యమ ప్రస్థానాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.