పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం

జర  ఆలోచించుండ్రి సార్!!

https://nielamegham.blogspot.com/2016/12/blog-post.html#moreప్రొ. ఘంటా చక్రపాణి గారు మహబూబ్ నగర్ లో 2016  డిబర్ 10 వ తేదీన జరిగిన తెలంగాణా రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (TSUTF ) ద్వితీయ మహాసభల్లో చేసిన ఉపాన్యాసం మీద కొందరు అనవసర రాద్ధాంతం చేస్తూ వర్ణాధిక్యతను ప్రదర్శిస్తున్నారు. "విద్యా వ్యవస్థ బాగుపడాలని అడగడానికి వాడెవడు" అని "మేం పోరాడితేనే తెలంగాణా వచ్చింది. మమ్మల్నే పాఠాలు చెప్పమంటావా"? అని ప్రశ్నిస్తున్నారు? ఇదేనా మన సంస్కృతి.? ఇందుకోసమేనా తెలంగాణా సాధించుకుంది. బుద్ధిజీవులు, దళిత బహుజనులు, పేదల పక్షపాతులు తెలంగాణా భావితరాలు బాగుపడాలనుకునే బుద్ధిజీవులు  దయచేసి చదవండి. మంచి మాటను కూడా హర్షించలేని వీళ్ళను ఏమనాలో  ఆలోచించండి.
 నిజానికి KG to PG ఉచితవిద్యకోసం ప్రభుత్వ్మ్ ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఎం చేయాలి, పౌరసమాజం ఏంచేయాలి అన్నివిషయాలు ఘంటా చక్రపాణిగారు తన ప్రసంగంలో నిష్కర్షగా చెప్పారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి నిర్మొహమాటంగా మాట్లాడినందుకు చక్రపాణి గారిని తప్పుపడదామా, రేపటి పదవులకోసం అల్లరి చేస్తోన్న వాళ్ళను నమ్ముదామా ఆలోచించండి.. ఆతరువాతే, ఆమోదయోగ్యమైతేనే స్పందించండి! నేను ఆ సభలో ఉన్నాను. మొత్తం ప్రసంగాన్ని నా మొబైల్ ఫోన్లో రికార్డు చేసాను. దాన్ని యధాతదంగా లిపీకరించాను. దీనిని తిరిగి ప్రముఖ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం గారి వీడియో తో సరిపోల్చుకున్నాను. ఆ ప్రసంగాన్ని మీకోసం ఇక్కడ పోస్టు చేస్తున్నాను. చదవండి ! ఆలోచించండి!! విచిత్రంగా పత్రికల్లో హెడ్ లైన్స్ చదివి, పేస్ బుక్ పోస్టింగులు చూసి కొందరు రెచ్చిపోతున్నారు. ఓపికగా విందాం, చదువుదాం, స్పందిద్దాం!
మరొక మనవి ఇప్పుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పాలనా వ్యవస్థ ప్రక్షాళన చేయాలనుకున్తున్నారు. అది విద్యారంగం నుంచే మొదలు కావాలి. జవాబుదారీ తనం ఉపాధ్యాయుల నుంచే ప్రారంభం కావాలి. పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు మహర్దశ రావాలి. నియామకాలు జరగాలి, అలాగే rationalization జరగాలి. కామన్ స్కూలింగ్ రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం దళితబహుజనులు ఆదివాసుల పిల్లలే కాదు. అంతరాలు లేకుండా అందరూ చదవాలి.

 
వేదిక మీద ఉన్న పెద్దలు, టీ ఎస్ యు టీ ఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహా సభలకు హాజరయిన ఉపాధ్యాయ సోదర, సోదరీమణులు, ఇక్కడున్న మేధావులు, విద్యారంగ నిపుణులు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. టీఎస్ యు టీ ఎఫ్ కు నా శుభాకాంక్షలు... సాధారణంగా ఇటువంటి సభలు మనం మనలో మనం మన ఆలోచనలు పంచుకోవడానికి, అలాగే వర్తమాన సామాజిక వ్యవహారాలను ముఖ్యంగా దేశ, రాష్ట్ర, ప్రపంచ పరిస్థితులకు సంబంధించిన అంశాలు, పరిస్థితులు, పాలసీలను చర్చించుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి, భవిషత్ దిశను నిర్దేశించుకోవడానికి జరుపుకుంటాం. ఇది మనకు, ఉపాధ్యాయ ఉద్యమానికి ఏంటో ఉపయోగ పడుతుంది. ఈ వేదికకు మీరు దాచూరి రామిరెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. రామిరెడ్డిగారు ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమాన్ని విస్తరించడమే కాకుండా సమాజాన్ని చైతన్యవంతం చేసిన ఉపాధ్యాయులు గా వారి స్ఫూర్తిని కొనసాగించే ఆలోచనతోనే మీరు ఈ పేరు పెట్టుకున్నారు. నిజంగానే ఉపాధ్యాయ వృత్తి మొత్తం సమాజంలో అత్యంత కీలకమైన, విశిష్టమైన వృత్తి. ఆ వృత్తిలో ఉన్న మీకు నా అభినందనలు. ఇందాక సభాధ్యక్షులు నన్ను ఆహ్వానిస్తూ 'మీరు, నేను' అని మాట్లాడారు.ప్రభుత్వం తరఫున నేనిక్కడికి రాలేదు. కేవలం ఒక ఉపాధ్యాయుడిగా వచ్చాను. వారు 'మీరు ఇది చేయాలి, మేము ఇది చేస్తాం' అని చెప్పారు. నేను ప్రభుత్వం అని వారి ఉద్దేశ్యం, కానీ నేను ప్రభుత్వం కాదు.మీరు ఏది చేస్తారో, నేనూ అదే చేయాలని అనుకుంటాను. అయినప్పటికీ ఈ సభకు నన్నాహ్వానించినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు. 'తెలంగాణా రాష్ట్రంలో పాఠశాల విద్య: ప్రభుత్వ బాధ్యత, ఉపాధ్యాయుల కర్తవ్యం' అనే అంశం మీద మాట్లాడవలసిందిగా నిర్వాహకులు నన్ను కోరారు. ఇది సంక్లిష్ట సందర్భం, అలాగే క్లిష్టమైన అంశం, అసలు ఈ సమావేశానికి రావాలా వద్దా అని నేను చాలా ఆలోచించాను. కానీ మీ నాయకుల ఒత్తిడి మేరకు అలాగే మీ అందరితో నా ఆలోచనలు మీతో పంచుకోవడానికి ఈ సభ దోహద పడుతుందని అంగీకరించాను.

  మిత్రులారా!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు దాటింది. మీకందరికి తెలుసు రాష్ట్ర  ఏర్పాటులో ఉపాధ్యాయులది కీలక పాత్ర. ముఖ్యంగా ప్రొ. జయశంకర్ గారి నుంచి మొదలు ఇవాళ ఉదయం మాట్లాడిన చుక్క రామయ్య గారి వరకు, ఇప్పుడు వేదిక మీద ఉన్న ప్రొ. నాగేశ్వర్ గారి నుంచి మొదలు ఉద్యమానికి సారథ్యం వహించిన కోదండ రామ్ వరకు ఉపాధ్యాయుల నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాడాం. అనేకఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత రాష్ట్ర ఏర్పాటు జరిగింది. తెలంగాణ గతంలో ఏర్పడ్డ పదహారు రాష్ర్టాల మాదిరిగానో ముప్పై రాష్ర్టాల మాదిరిగానో కేవలం  భౌగోళిక స్వరూపం దృష్ట్యా, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఏర్పడింది కాదు. అస్తిత్వ రీత్యా, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక వైవిధ్యం రీత్యా, ఇక్కడి ప్రజలకున్న సోయి రీత్యా, వారికున్న ఆకాంక్షల రీత్యా ప్రత్యేక రాష్ట్రం అవసరమని అధ్యాపకులు, ఉపాధ్యాయులు మేధావులు భావించారు. 1953-56 నుంచి కూడా ఈ స్పృహ అలా కొనసాగుతూఉండడం వల్లనే ఆ ఉపాధ్యాయ స్పృహ వల్లనే ఇవాళ మనం కొత్త రాష్ట్రంలో ఉన్నాం.  స్వరాష్ట్రంలో ఇవాళ మీరు కూడా రెండవ మహాసభలు జరుపుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం అనేది ఎందుకు అవసరం అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళందరం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో విద్యాపరంగా, మానవవనరుల వికాసం పరంగా  అభివృద్ధి చెందలేదు. ఈ విషయాన్ని ఆ కాలంలోనే ఫజల్ అలీ కమిషన్ చెప్పింది. ఒక బ్రిటిష్ విద్యా వ్యవస్థలో విలసిల్లిన ఆంధ్రాకు, నిజాం  పరిపాలనలో ఉన్న తెలంగాణకు మధ్య విద్యావ్యవస్థలో వ్యత్యాసం ఉన్నది. అందుకే  అసమానతలు ఏర్పడ్డాయి. దీనివల్ల   ప్రజల మధ్య ఒకరకంగా అభిప్రాయ భేదాలున్నాయి. కాబట్టి మనం రాష్ట్రం సాధించుకుంటే మన విద్యా వికాసానికి దోహదపడుతుందని చాలామంది  టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు కూడా బలంగా నమ్మి  ఉద్యమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా జాక్ లలో భాగస్వాములుగా  పోరాడాయి. ఉమ్మడి రాష్ట్రంలో  ఉన్న తారతమ్యాలు చూసిన తర్వాత కచ్చితంగా తెలంగాణ విద్యారంగంలో వెనుకబడి ఉందని అంగీకారానికి వచ్చిన తరువాత ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. 

మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు ఏమిటి? లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?  ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, పరిపాలిస్తున్న వారికి గానీ  దీనిపైనా ఒక స్పష్టమైన వైఖరి ఉన్నదా అనే విషయాలను మనం ఈ సందర్భంగా ఆలోచించవలసి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత రెండేళ్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఎలా ఉన్నాయో గమనించాలి.  ఎన్నికల సమయంలో తెలంగాణలో విద్యారంగాన్ని కొత్త దశకు తీసుకు వెళ్తామని హామీ అన్ని రాజకీయ పార్టీలు తమ తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్నాయి. ఇందులో ప్రధానంగా టీఆర్‌ఎస్ కేజీ టు పీజీ అనే కొత్త నినాదంతో ముందుకు వచ్చింది. ఈ నినాదం చాలామంది విద్యావేత్తలు ఆశ్చర్యం కలిగించింది. ఇది చాలా సాహసోపేతమైన, ఆచరణకుయోగ్యం కానటువంటి నినాదంగా కనబడింది. ఎందుకంటే మనం సంస్కరణల యుగంలో ఉన్నాం. ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ కాలంలో  విద్యను ప్రైవేటీకరించడం జరిగింది. కానీ దాన్ని ఉచితంగా పీజీ వరకు ఇస్తామన్న నాయకులు కానీ పార్టీలు కానీ ప్రభుత్వం గానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. దేశంలోని ఇతర  రాజకీయ పార్టీలను చూసినా ప్రాథమిక విద్యను, లేదా ప్రాథమికోన్నత స్థాయివరకో ఉచితంగా అందిస్తామన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నత విద్యను ఉచితంగా ఇస్తామని ఎవరూ చెప్పలేదు. ఉన్నత విద్యను ప్రైవేటు రంగానికి పరిమితం చేస్తూ మన గత పాలకులు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేజీ టు పీజీ వరకు ఉచితవిద్య ఎలా అమలు చేస్తారు అనే విషయంలో చాలామందికి అనుమానాలు సహజంగానే కలిగాయి. ఇదొక చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నాయి. ఇప్పటివరకు ఈవిషయంలో ఒక విధానం అంటూ ఏదీ ప్రకటించినప్పటికీ వాళ్ళ మ్యానిఫెస్టో ఆధారంగా ఆ తరువాత తీసుకున్న కొన్ని చర్యల ఆధారంగా ఈ ప్రభుత్వం కేజీ టు పీజీ వైపు పోతున్నది. ఈ మధ్యకాలంలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు కేజీ టు పీజీ లో భాగంగానే గురుకుల పాఠశాలలు ఏర్పాటు  చేస్తున్నామనే మాటను పదే పదే  చెపుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఈ ఏడాదితో పాటు రాబోయే ఏడాదికి సుమారు ఆరువందల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తున్నది. 

ఈ నేపథ్యంలో ఈ గురుకుల పాఠశాలలనేవి నిజంగానే తెలంగాణ మానవవనరుల వికాసానికి ఏమేరకు దోహదపడుతాయి? వంటి అంశాలను చర్చించాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాల మీద ఉన్నది. ఉపాధ్యాయ సంఘాలు గతంలో ఎంతో గొప్పగా ఉండేవి. నేను 1985 కాలంలో 398 జీతంతో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా నా జీవితాన్ని మొదలుపెట్టాను. అప్పుడు సభలకు వెళ్ళినప్పుడు చాలా ఆసక్తికరమైన చర్చలు జరుగుతుండేవి. ఆ సభల్లో ఆర్థిక సంస్కరణలు, సామ్రాజ్యవాదం, లాటిన్ అమెరికన్ దేశాల సంక్షోభం, రష్యా పరిణామాల గురించి ఇలా అనేక అంతర్జాతీయ జాతీయ పరిణామాలపై చాలా చర్చలు జరిగేవి. దాంతో పాటు విద్యావిధానం మీద కూడా సుదీర్ఘ చర్చలు జరిగేవి. నేను రెండు మూడేళ్ల నుంచి గమనిస్తున్నాను. ఉపాధ్యాయ సంఘాలు ప్రచురించే కరపత్రాలు చూస్తున్నాను. ఉపాధ్యా సంఘాల వాళ్ళు నాకు చాలా ఆప్తులు, వాళ్ళ పత్రికలు కూడా నాకు వస్తుంటాయి. వాళ్ళూ కలుస్తుంటారు. అనేక విషయాలు చర్చిస్తుంటారు. ఇవన్నీ గమనిస్తుంటే ఉపాధ్యాయ సంఘాల అజెండా మారుతున్నదని నాకనిపిస్తున్నది. ఈ మధ్యకాలంలో ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఒక కరపత్రం వేశాయి. అందులో పదిహేను డిమాండ్లు ఉన్నాయి.  అందులో పధ్నాలుగు డిమాండ్లు కేవలం ఉపాధ్యాయుల సంబంధించినవి పెట్టారు. అంతేతప్ప సమాజానికి , పాలసీలకు గానీ, రాష్ర్టానికి గానీ, దేశానికి గానీ, ప్రపంచానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించలేదు. ఇది బాధాకరమైన అంశం. ఎంతో చలనశీలంగా ఉండాల్సిన ఉపాధ్యాయ ఉద్యమం ఒక కార్మికోద్యమంలాగా మారడం సమంజసమా? ఒక ఆర్టీసీ కార్మక సంఘం లాగా ఉపాధ్యాయ సంఘం కేవలం డిమాండ్లకే పరిమితం కావడం మంచిదేనా? ఉపాధ్యాయుడు సమాజానికి దిక్సూచి. అతడు కేవలం తన తరగతి గాదికో, తన పాఠశాలకు, తన ఊరికి పరిమితం కాదు. అలాగే తమ క్లాసుకు, తమ సబ్జెక్టుకు, తమ వృత్తికి మాత్రమే పరిమితం కాదనేది నాకున్న అభిప్రాయం. అలాంటప్పుడే టీచర్లు విద్యార్థికి సమాజానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహనను కల్పించగలుగుతారు. సమాజపు బాధను అర్థం చేసుకుంటారు. సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకు ఉందని అనుకుంటాం. కాబట్టి  గతంలో విద్యావ్యవస్థతో పాటు, రిజర్వేషన్స్ గురించి, భూసంస్కరణల గురించి, అప్పులు, ప్రపంచబ్యాంకు గురించి మాట్లాడేవాళ్ళు. లేదా పెరుగుతున్న ధరల గురించి మాట్లాడే వాళ్ళు. కానీ ఇప్పుడు సమస్యలు వందరెట్లు పెరిగినా ఉపాధ్యాయులు మాట్లాడకపోవడం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నది. దానిమీద కూడా కొంత ఆలోచన చేయాలి. ఉపాధ్యాయ సంఘాల కరపత్రంలో ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా సంబంధంలేని ఒకే ఒక (సామాజిక) అంశం 24 గంటలు విద్యుత్ ఇవ్వాలన్నది మాత్రం కరపత్రంలో ఉన్నది. కానీ నిర్బంధ ఉచిత విద్య ఎందుకని లేదో నాకు అర్థం కావడం లేదు. 

తెలంగాణాఏర్పడి మూడేళ్లు కావొస్తున్నది. ఈ మధ్యకాలంలో విద్యారంగంలో ఏం జరుగుతోంది? ఏ ఒక్క ఉపాదాధ్యాయ సంఘం కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన కేజీ టు పీజీ విషయంలో స్పష్టమైన డిమాండ్ పెట్టలేదు. కేజీ టు పేజీని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఎవరూ అడగలేదు. ఈ రెండున్నరేళ్లలో ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదు. ధర్నాలు, ఆందోళనలు చేయలేదు. నేను ఈ కార్యక్రమానికి వస్తూ నలుగురైదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడాను. (గతంలో నలుగురితో మాట్లాడితే సరిపోయేది ఎందుకంటే నాలుగైదు ఉపాధ్యాయ సంఘాలే ఉండేవి ఇప్పుడు తెలంగాణ వచ్చాక అవి నలభై యాభైకి పెరిగిపోయాయి.) అయితే వాళ్లంటున్నారు అది ప్రభుత్వ బాధ్యత కదా అని. ప్రభుత్వం చెప్పిన విషయం వాళ్ళే చెయ్యాలి అంటున్నారు. చెయ్యకపోతే మన బాధ్యత ఏమిటి అనేది ఆలోచించాలి కదా.! ముఖ్యంగా వామపక్ష భావజాలం కలిగిన ఉపాధ్యాయులు ప్రజాపక్షంలో ఇలాంటి ఆలోచన చేయాలా వద్దా.? కచ్చితంగా చేయాలని నా అభిప్రాయం. ప్రభుత్వం చేస్తానందికదా, చేస్తుందో లేదో చూద్దాం అంటున్నారు. అలా అనుకుంటే ఐదేళ్ల కాలం కూడా గడిచిపోతుంది. ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉండదు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ, ప్రభుత్వం చేస్తానని చెప్పిన పనులు నిజంగానే చేస్తోందా లేదా అని గమనించవలసిన బాధ్యత సమాజం మీద ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో బుద్ధి జీవుల మీద ఉంటది. ఉపాధ్యాయుల మీద ఉంటది. మరీ ముఖ్యంగా ఇది ఉపాధ్యాయ వృత్తికి, విద్యారంగానికి సంబంధించిన ఒక పెద్ద సంస్కరణ. దానికి సంబంధించిన ప్రయోగం ఒకటిక్కడ జరుగుతున్నది. ఈ సందర్భంలో ప్రేక్షకులుగా ఉండటం ఎంతవరకు సమంజసం? ఇలా చూస్తూ ఉంటే రేపు మనం భాగస్వాములమ య్యే హక్కును, మన ప్రాతినిధ్య అధికారాన్ని, ప్రశ్నించే హక్కును కూడా కోల్పోతాంమనే విషయాన్ని గమనించాలి. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా ఈ అంశం మీద రాష్ట్ర స్థాయిలో ఎందుకని ఒక చర్చ మొదలు పెట్టలేదు? ఎందుకని దీనిపై ఒక విధానపత్రం ఇవ్వలేదు?  కేజీ టు పీజీ ఎలా ఉండాలో ప్రజలను ఎందుకు చైతన్యవంతం చేయలేదు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఎందుకు అడగడం లేదు. ఇది ఉపాధ్యాయ సంఘాల బాధ్యత కాదా? నేనొక రాజ్యాంగ పదవిలో ఉంది ఇలా ప్రశ్నించకూడదేమో! అయినా సరే సామాజిక ప్రయోజనం రీత్యా నా ఆలోచనను మీతో పంచుకుంటున్నాను. ఉపాధ్యాయ సంఘాల బాధ్యతేమిటో ప్రసంగించమని అడిగారు ఇది మన బాధ్యత కాదా?! ఆలోచించండి. 

మిత్రులారా..!

 ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అంశాలతో ఒక కొత్త ప్రయోగాన్ని విద్యారంగంలో చేయబోతోందని సంకేతాలు అందుతున్నాయి. దీనిప్రకారం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ - ఇంగ్లీష్ మీడియంలో - కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఆశ్రమ పాఠశాలల్లో - రెసిడెన్సియల్- విద్యను- సీబీఎస్సీ సిలబస్‌లో  అందిస్తామని ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించిన ప్రయత్నం కూడా కొంత జరుగుతోంది. కానీ దీనిపై రాష్ట్రంలో ఉన్న నలభై ఉపాధ్యాయ సంఘాలకు,లేక మీరు ఐక్యకూటమిగా ఏర్పడిన ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలకో ఏకాభిప్రాయం ఉన్నదా? ఇలాంటి ప్రాధాన్యం గల అంశంలో ఏకాభిప్రాయం సాధించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఏకాభిప్రాయం లేకపోయినా సరే అసలు అలాంటి విద్యావిధానం అవసరమా? ఈ రాష్ట్రంలో పిల్లలకు నిర్బంధ ఉచిత  ఆవాస విద్య అవసరమా లేదా, అది ఇంగ్లీష్ మీడియంలో ఉండాలా ఉండ వద్దా? ఈ విషయాల్లో మన వైఖరి ఏ రకంగా ఉండాలి? ఇది ప్రతి ఉపాధ్యాయ సంఘం ఆలోచించుకోవాలి. దాదాపు రెండున్నరేళ్ళకింద నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న కాలంలోనే హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యు ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది. దాదాపు పది పదిహేను ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపకులు, మేధావులు ఆ సదస్సులో పాల్గొన్నారు. కానీ ఏ ఒక్క విషయంలో కూడా ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. కొందరు కేజీ నుంచి ఎందుకని ప్రశ్నిస్తే ఇంకొందరు, ఆ వయస్సులో పిల్లలు తల్లి ఒడిలో ఉండాలని అన్నారు. అసలు ఇంగ్లీష్ మీడియం ఎందుకని కొందరు అడిగితే, సీబీఎస్సీ   సిలబస్ ఎందుకని కొందరు ప్రశ్నించారు. నిజానికి  దేశంలో సగటు కూలీ, రైతు, దళిత గిరిజనులకు పిల్లలకు గోరుముద్దలు తినిపించి, వేలు పట్టుకుని బడికి నడిపించుకు వెళ్లి చదివించుకునే పరిస్థితి ఉందా? మనం మాతృ భాష గురించి ఏమనుకుంటున్నామనే దానికంటే పిల్లల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. మన పిల్లలను  శ్రీ చైతన్యలోనో, నారాయణలోనో ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో విద్యా బోధనా జరగాలి, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అంటే ఎలా? ఉంటే మొత్తం విద్యా వ్యవస్థ అంత ఒకేలా ఉండాలి. సిలబస్, మీడియం, బోధనా విషయంలో ఒకే పద్ధతి, ఒకే పాలసీ ఉండాలి. అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అటువంటి పరిస్థితి ఉందా? అదే జరిగితే ఇప్పుడున్న పాఠశాలల సంగతేమిటని ఒకరు ప్రశ్నిస్తే, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్ల గతేమిటని ఇంకొందరు నిలదీయశారు. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి.? అసలు కేజీ టు పీజీ అమలు చేయాలా వద్దా? చేయాలంటే టీచర్లను, ఇప్పుడున్న స్కూల్స్ ను ఏం చేయాలి? కొత్త పాఠశాలలు విద్యావిధానం ఎలా ఉండాలి అనేవి నిజానికి నిర్ణయించాల్సింది ప్రభుత్వం మాత్రమే కాదు. మనం. టీచర్లుగా అది మన బాధ్యత. ఇది మన సమాజానికి సంబంధించిన సమస్య, దీనికి పరిష్కారం ప్రత్యామ్నాయం చూపాల్సింది మనం. నిజానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి రాకపోవడానికి మనకు అంటే టీచర్లకు, ఉపాధ్యాయ సంఘాలకు కూడా బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. మనకొక సరైన ఆయన ఆలోచన లేకపోవడం కూడా  జాప్యానికి ఒక కారణమని నేను భావిస్తున్నాను. 

కేజీ టు పీజీ కార్యరూపం తేవడానికి ఉపాధ్యాయ సంఘాలు కీలక పాత్ర పోషించాలి. ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కూలీనాలి చేసుకునే వాళ్ళు సైతం తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని అనుకుంటున్నారు. ఏ వూరికెళ్ళినా యిప్పుడు స్కూల్ బస్సులు ఉదయం ఏడింటికే పిల్లల్ని ఉదయం ఏడింటికే బడికి తీసుకెళ్లడం కనిపిస్తుంటుంది. పిల్లల్ని మల్లెపువ్వుల్లా తయారు చేసి బస్సు ఎక్కించి తల్లులు కూలీ పనులకు వెళ్తుంటారు. మళ్ళీ సాయంకాలం వాళ్లు వచ్చే సరికి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇవాళ అన్నిగ్రామాల్లో కూడా అలాంటి పచ్చ బస్సులు పిల్లల్ని తీసుకుని పట్నాలకు వస్తున్నాయి. మరి నిజంగానే పట్టణాలకు వచ్చే ఆ పిల్లలకు వూళ్ళో పాఠశాలలు లేవా?  అక్కడ ఉపాధ్యాయులు లేరా? అక్కడ తరగతి గదులు లేవా? ఉన్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలకంటే నాణ్యమైన విద్యను బోధించగల సమర్థులు. ఈ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల కంటే మూడురెట్లు ఎక్కువ విద్యార్హతలున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. అంత్యంత ప్రతిభావంతులు, అనేక పరీక్షల్లో ఉత్తీర్ణులైన మీలాంటి అద్భుతమైన మేధావులు అక్కడ ఉన్నారు. గతంలో మాదిరిగా పాఠశాలలకు కొరతలేదు. నిధులకు కొదువ లేదు. మునుపటిలా ఒక టీచర్, బోర్డు లేక, చాక్ పీస్ లేక బదులు లేవిప్పుడు. అలాగే 70-80 దశకాల మాదిరిగా ఒక టీచర్ కు 90 మంది విద్యార్థులు లేరిప్పుడు. ఇవాళ్టి లెక్కల ప్రకారం చూస్తే 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉన్నాడు. ఆ టీచర్ కూడాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సంపూర్ణశిక్షితుడైన వ్యక్తే ఉన్నాడు. అతనికి మునుపటిలా వనరుల కొరత లేదు, ఇప్పుడు ప్రభుత్వం అన్నీ సమకూరుస్థోతుంది. డిజిటల్ క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి. అయినా మన దగ్గరికి విద్యార్థులు ఎందుకు రావడం లేదు? దీనికి కారణం ఏమిటి అనే చర్చ ఈ రెండేళ్లలో జరుగలేదు? ప్రభత్వ పాఠశాలలను ప్రధాన కేంద్రంగా చేసుకుని తెలంగాణలో మానవవనరులు అభివృద్ధి చేయాలన్న చర్చ సరిగా జరుగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండేళ్లలో ఆరువందల రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభించి వాటితో కేజీ టు పీజీ కి శ్రీకారం చుడుతామని ప్రభత్వం చెపుతోంది. తరాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ముసాయిదాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం దానిని చర్చకు పెట్టాలి. మీలాంటి సంఘాలు దానిపై చర్చకు పట్టుబట్టాలి. ప్రభుత్వ ప్రతిపాదనకు ఒప్పుకుందామా? లేక ప్రత్యామ్నాయం ఆలోచిద్దామా? ప్రభుత్వానికి ఈ అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున ఒక నివేదికేదైనా ఇద్దామా? ఆలోచించాలి. అందులో కేజీ టు పీజీ ఎలా ఉండాలి, కేజీ అంటే ఏ తరగతినుంచి మొదలవ్వాలి? బోధనా ఎలా ఉండాలి? అనే విషయాలమీద మీ ఆలోచనలు, అభిప్రాయాలు విద్యారంగానికి అవసరం. 

ఇవాళ మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిదివేల నుంచి ముప్పై వేలమంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. దాదాపు ముప్పైవేల పాఠశాలలు ప్రభత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. ఈ ముప్పైవేల పాఠశాలల్లో పదివేలకంటే తక్కువ పాఠశాలలే ప్రైవేటు రంగంలో ఉన్నాయి. కానీ 53 శాతం మంది ఆ పాఠశాలలకు వెళ్తున్నారు. మన ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నవారు 47 శాతాని కంటే తక్కువే. గడిచిన రెండు మూడేళ్ళుగా ఏడాదికి దాదాపు యాభై వేలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేటు బడుల్లోకి వెళ్తున్నారు. ఈ బడుల్లో దాదాపు 90 శాతం మంది ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. కార్పొరేట్ విద్య విస్తరించి ఒకే ఒక విద్యాసంస్థ అటు నారాయణను, ఇటు కేశవరెడ్డిని కూడా తనలో కలుపుకుని ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నది. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే బతకలేరేమోనన్న భద్రతలో ప్రైవేటు పాఠశాలల్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనో కార్పొరేట్ సంస్థల్లోనే చదివించకపోతే తమ పిల్లలకు భవిష్యత్తు లేదేమో అనే స్థితి నెలకొన్నది. వాళ్లకు ధైర్యం చెప్పి, ఇంగీష్ అవసరం లేదు, భయం అక్కర్లేదు, బెంగ పడొద్దు అని భరోసా ఇచ్చే నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో కరువైపోయింది. అది ఉపాధ్యాయుల నుంచి, ప్రభుత్వం నుంచి, ప్రజా మేధావుల నుంచి కూడా అలాంటి భరోసా ఇచ్చే నాయకత్వం లేకుండాపోయింది. మనం వాళ్ళను చైతన్యవంతుల్ని చేయడంలో, ప్రైవేటీకీరణను అడ్డుకోవడంలో, మాతృభాషలో విద్యాబోధన, చదువు ప్రాముఖ్యం చెప్పడంలో విఫలమైపోయాం. ఇప్పుడు జనబాహుళ్యం ఆలోచన ఎలా ఉంది అన్నది చూడకుండా ఇంగ్లీషును అడ్డుకుందామా? నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోండి. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా వేదికమీద ఉన్నారు. మీరే కనుక్కోండి. మాసాయిపేట బస్సు యాక్సిడెంట్ ఉదంతం మీకు తెలుసు. అంధులు చనిపోయింది అంత బడుగుల పిల్లలే. ఒక్క మాసాయి పేటలోని కాదు ఇవాళ మొత్తం తెలంగాణా పల్లెల నుంచి పట్టణాలకు పిల్లల్ని మోసుకొచ్చే పచ్చబస్సులు తిరుగుతున్నాయి . ప్రభుత్వ పాఠశాలలు అన్నిగ్రామాల్లో ఉన్నాయి, ఉపాధ్యాయులు, అత్యధిక విద్యార్హతలు, ప్రతిభా సామర్థ్యాలుగలవారు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా దుస్తులు, పుస్తకాలు ఇస్తున్నారు. అంతే కాదు మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు అయినా ఇవన్నీ కాదని పేదలు, బడుగులు, సామాన్యులు సైతం తమ పిల్లల్ని ఎందుకని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారో ఆలోచించాలి. 

నేను వివరాల లోనికి వెళ్ళాను గానీ కేజీ నుంచి పాఠశాల విద్య ప్రారంభించడం సాధ్యమే! మూడవ సంవత్సరం వయసు నుంచి ఎల్ కేజీ తో మొదలు పెట్టి నాలుగో తరగఠీ వరకు ఒక సెక్షన్‌గా విభజించుకోవచ్చు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి నిధులు అందుతున్నాయి. ముఖ్యాంగా ఈ స్థాయి పాఠశాలలకు విమెన్ అండ్ చైల్ వెల్ఫేర్ సహా అనేకమార్గాల ద్వారా నిధులు వస్తాయి. దీనిని ప్రాథమిక పాఠశాలలుగా సెమీ రెసిడెన్సియల్ పద్ధతిలో నిర్వహించవచ్చు. మనం కూడా ప్రైవేటు పాఠశాలలాగే ఉదయమే తాళాలు తీసి పాఠాలు మొదలుపెట్టవచ్చు. ఇప్పుడు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు దాదాపు 15 వేలదాకా ఉన్నాయి. ఆ భవనాలు, స్థలాలను వీటికి వాడుకోవచ్చు అని కొందరు సలహా ఇస్తున్నారు. దీనిపై చర్చ జరగాలి, అలాగే ఉన్నత పాఠశాలలు, కళాశాలలు ఎలా ఉండాలి అనే చర్చ కూడా మొదలు కావాలి. ఇక టీచర్ల సమస్య కూడా మనమే మార్గాలు చూడాలి. ఇంకొంతమంది టీచర్లు తాము తెలుగు మీడియంలో చదివాం తెలుగు మీడియం మాత్రమే బోధిస్తామని అంటున్నారు. అదీ నిజమే! మరి ప్రత్యామ్నాయం ఏమిటి? చర్చయితే జరగాలి. అసలు కేజీ టు పీజీ ఉండాలా, ఉంటే పాఠశాల విద్య ఎలా ఉండాలి, కాలేజీ ఎలా ఉండాలి, డిగ్రీ పీజీ చదువులు ఎలా వుండాలి అన్న చర్చయినా జరగాలి కదా!. 

బయట ఉండి మాట్లాడుతున్న కొద్దిమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వం తమ ప్రమేయం లేకుండా తనంతట తాను పనిచేసుకుంటూపోతున్నదని వాపోతున్నారు. దీనివల్ల ప్రాథమిక విద్య దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవం. మీ ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఇవాళ తెలంగాణలో మైనారిటీలకు ప్రత్యేకంగా 150 రెసిడెన్సియల్ పాఠశాలలు వచ్చాయి. చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పాత బస్తీ ముస్లిం పిల్లలు అందులో చేరిపోయారు. రేపు  హైదరాబాద్‌లో ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూతబడి పరిస్థితులు రాబోతున్నాయి. విద్యార్థులు రావడంలేదు, పాఠశాలలు మూసివేస్తే మనమేకాదు సుప్రీంకోర్ట్ కూడా ఇప్పుడే వద్దనే అంటోంది. మరి విద్యార్థులు లేకపోయినా, ఐదుగురు విద్యార్థులకు ఏడుగురు  ఉపాధ్యాయులున్నా పాఠశాల నడిపించాలనే అంటున్నాం.  స్కూల్స్‌ను అలాగే నడిపిద్దామా ఆలోచించాలి. ఒక్క మైనారిటీలు మాత్రమే కాదు. తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వాళ్లలో నూటికి తొంభై శాతం మంది దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, పేదలకు సబంధించిన పిల్లలే. వాళ్ళ కోసం ఇప్పుడు గురుకులాలు పెట్టి మంచి వసతులు కల్పించడం మంచిదా చెడ్డదా ఆలోచించండి. 

ఇంకొకటి చాలామంది లోలోపల చర్చిస్తున్నది ఏమిటంటే ప్రభుత్వం కులాలపేరుతో పాఠశాలలు, రెసిడెన్సియల్ విద్యాసంస్థలు ఎందుకు పెట్టాలి? అని. నిజమే అలా ఉండకూడదు. అలా కాకుండా కామన్ స్కూల్ ఉండాలనే డిమాండ్ చేస్తున్నాం. నిజానికి ఇవాళ ప్రభుత్వాధీనంలో నడుస్తున్నది. కామన్ స్కూలేనా? కామన్ గా అందరూ వెళ్తున్నారా? ఇవాళ ఉన్నది కామన్ స్కూల్ అనుకుంటే అందులో ఎవరున్నారు? మన పిల్లలున్నారా? మన పిల్లలే లేరు. మన పిల్లలను మన స్కూల్లో లో కాకుండా నారాయణతో వదిలేసి మనం మన స్కూలుకు వెళుతున్నాం. మనం మన పిల్లలను చేర్పిస్తేనే కదా మిగితా వాళ్ళు చేర్పిస్తారు. ఇవాళ కామన్ స్కూల్ గా గ్రామమందరికీ ఉండాల్సిన ఈ పాఠశాలలు మరొక దళితవాడ గానో, గిరిజన తండాగానో, నిరుపేద అణగారిన వర్గాల వీధి బడిగా మారిపోతున్నది. అంతేతప్ప ఇది మొత్తం గ్రామాన్ని  ప్రతిబింబించే విధంగా లేకుండాపోతున్నది. చాలా అధ్యయనాల్లో తేలిందా విషయంఏమిటంటే ఈ ప్రభత్వ పాఠశాలల్లో దాదాపు యాభై శాతం మంది దళితులు, మిగిలిన యాభై శాతంలో, మరో ఇరవై అయిదు శాతం దాకా వెనుకబడిన వర్గాలు, మిగిలిన వారిలో ఆదివాసులు, ముస్లిం పిల్లలు,  అగ్రవర్ణాల పేదలు ఉన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రాతిపదికన రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికి నాణ్యమైన విద్య అందిస్తే తప్పేమిటి అనే వాదన వచ్చే అవకాశం ఉంది. ఇంతమంది అర్హులు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉండి అన్ని వసతులు, వనరులు ఉంది మనదగ్గరికి విద్యార్థులు ఎందుకు రావడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సామాజికి అవసరాల దృష్ట్యా ఇవాళ కేజీ టు పీజీ అవసరాన్ని బలంగా వినిపించడంతో పాటుగా అదే ఒక ప్రత్యేక అజెండాగా పెట్టుకుని సమాజాన్ని చైతన్య పరిచి ఒక ఉద్యమం లాగా ప్రభుత్వం మీద, పాలకుల మీద ఒత్తిడి తెచ్చయినా సరే విద్యా రంగానికి, విద్యా విధానానికి, తెలంగాణా భవిష్యత్తుకు దారి చూపాల్సిన బాధ్యత మీమీద ఉందని నేను భావిస్తున్నాను. 

ఇవాళ చారిత్రక సందర్భంలో తెలంగాణ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజీ టు పీజీ రెసిడెన్సియల్ విద్య అనివార్యమైనటువంటిది. ఇది ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మీద ఖర్చు చేస్తున్న నిధులన్నీ లెక్కేస్తే ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు 40వేల రూపాయలకు పైగా ఖర్చవుతోందని  ఒక జర్నలిస్ట్ మిత్రుడు లెక్కగట్టాడు. అదే ఖర్చుతో ప్రభుత్వం అందర్నీ కార్పొరేట్ పాఠశాలల్లో చదివించవచ్చు. రేపు అలాంటి డిమాండ్ వచ్చినా రావొచ్చు. పాఠశాలల్లో కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు డిమాండ్ కోరే ప్రమాదం కూడా ఉంది. అది వాంఛనీయం కాదు. కాబట్టి ప్రభుత్వమే ఆ భాద్యత తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఈ విద్యార్థులందరినీ రెసిడెన్సియల్ స్కూల్స్ కు బదిలీ చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. 

అలా జరిగితేప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టీచర్ల సంగతేమిటి అని మీరు అడగొచ్చు. అది మీ బాధ్యత. ఏం చేయాలన్నది మీరే ఆలోచించుకోవాలి. మనం కూడా వెళ్లి రెసిడెన్సియల్ పాఠశాలల్లో బోధిస్తామా లేక మనం దీన్ని అడ్డుకుంటూ మన జీతాలు, ప్రమోషన్‌లు, కామన్ రూల్స్, సర్వీసు, మన సంఘాలు మన రాజకీయాలు ఉండాలి కాబట్టి పిల్లలు లేకపోయినా సరే పాఠశాలలు అలాగే  నడువాలని డిమాండ్ చేద్దామా ఆలోచించండి. కొత్త పిల్లలను చేర్చుకుందామా ఒక సవాలు, ఉన్న పిల్లలను కాపాడుకుందామా రెండో సవాలు, పెరుగుతున్న ప్రైవేటుతో పోటీ పడుదామా మూడో సవాలు, ప్రభుత్వాన్ని మంచి మార్గంలో నడిపిద్దామా నాలుగో సవాలు ఇప్పుడు మనముందు ఉంది. ఈ సవాళ్ళను పట్టించుకోకుండా ప్రభుత్వ బాధ్యత ఏమిటి టీచర్ల కర్తవ్యం ఏమిటి అని మాట్లాడుకోవడంలో అర్థం లేదని నేను భావిస్తున్నాను.  నిజానికి ఈ అన్ని అంశాలను కూలంకషంగా మీలో మీరు చర్చించుకోవాలి. నిజానికి మూడు నాలుగు వేలమంది ఇక్కడ హాజరవుతున్నారు. కనీసం వెయ్యి పాఠశాలలనుంచి వచ్చి వుంటారు. మీరే ఆలోచించుకోండి, మీ పాఠశాలల్లో ఎవరు చదువుతున్నారు. మీ ఊరి నుంచి ఎంత మంది బయటి పాఠశాలలకు వెళ్తున్నారు? 

చాలా విచిత్రం ఏమిటంటే పాఠశాల విద్యకు గత కొన్నేళ్లుగా నిధులు పెరుగుతున్నాయి. కానీ బడ్జెట్ లో విద్యారంగం వాటా తగ్గుతోంది. గతంలో పదమూడు శాతం దాకా ఉన్నది ఇప్పుడు 9 శాతానికి పడిపోతోంది. దీని గురించి కూడా ఆలోచించాలి. ఇవాళ చాలారకాల ఫండింగ్ పెరిగింది. అది ఎంతవరకు వినియోగిస్తున్నామో ఆలోచించాలి. ఇవాళ కంప్యూటరీజషన్ పేరుతో డిజిటల్ క్లాస్ రూమ్స్ పేరుతో భారీ ఎత్తున ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అవి సద్వినియోగం అవుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి. నిజంగానే మనం ఆ వనరులన్నీ సరిగా వాడుతున్నామా లేదా ఆలోచించాలి. ఇక మనలో చాలా మంది కన్వెనియెంట్ గా డాటా వేస్తున్నది, మాట్లాడటానికి ఇష్టపడనిది రేషనలైజేషన్. ఇప్పుడున్న సిబ్బందిని అవసరాలరీత్యా రేషనలైజ్ చేయాలా వద్దా? విద్యార్థుల సంఖ్యను, స్కూల్ స్థాయిని బట్టో అధ్యాపకుల బదిలీలు నియామకాలు ఉండాలా వద్దా కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా నిష్కర్షగా మాట్లాడుకోవాలి. నిజానికి విద్యారంగం తెలంగాణలో పటిష్టం కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి చర్చ జరగాలి. కేజీ టు పీజీ విధానం ముందుగా కేజీ నుంచి మొదలు కావాలి. కనీసం పదివేల పాఠశాలలు పటిష్టంగా దీన్ని అమలు చేయాలి. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదగాలి. ఇదంతా ప్రభుత్వమే చేయాలి అనుకోకుండా ప్రభుత్వం తో చేయించే బాధ్యత కూడా ఉపాధ్యాయ సంఘాల మీద ఉందని నేను భావిస్తున్నాను. 

మిత్రులారా!

ఇవేకాకుండా చాలాకాలంగా మరో విషయం కూడా చర్చకు వస్తోంది. ఉపాధ్యాయుల్లో నిబద్ధత, సమయ పాలన, ఆలోచనలు, అలవాట్లు, వైఖరులు మొదలైన వాటికి సంబంధించింది. ఉపాధ్యాయుల్లో విలువలు పడిపోతున్నాయి అనేది చాలా సందర్భాల్లో ఎదురవుతున్న విషయం. ఇది చాలామంది పెద్దలు చెపుతున్న విషయం కూడా. నిజానికి ఇవాళ ఎంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వెళ్తున్నారు అన్న ప్రశ్న వస్తోంది. (సభలో కొందరు చేతులెత్తారు..కొందరు విజిల్స్ వేశారు ... ) లేదు, నేను అడగడం లేదు. నేను మిమ్మల్ని అడగడానికి ఈ సభకు రాలేదు. (ఇంతలో సభలో అరుపులు, కేకలు) నేను కేవలం ప్రస్తావిస్తేనే, ప్రశ్న అడిగితేనే మీరు సహించలేకపోతే ఎట్లా. వాట్సప్ మెసేజ్‌లు వస్తున్నాయి, పిల్లల్ని వేధిస్తున్నారని. పిల్లల్తో సిగరెట్లు తెప్పించుకునే టీచర్స్ ఉన్నారని. పాన్‌లు తెమ్మంటారని, కాళ్ళు ఒత్తమంటారని పిల్లలు చెపుతున్నారు. ఇవన్నీ వాట్సప్ మెసేజిలలో వస్తున్నాయి. అవి చూసినప్పుడు బాధ కలుగుతోంది. నేను అందర్నీ అనడం లేదు. కొందరు అలా చేస్తున్నట్టు వింటున్నాం. కొందరు నిజంగానే అలా ఉన్నారో లేదో మీరే ఆలోచించండి. చేతులెత్తనవసరం లేదు. చెప్పక్కరలేదు. ప్రతి ఒక్కరు పిల్లలకంటే ముందే పాఠశాలలకు వస్తున్నారో లేదో మీరే ఆలోచించండి. ఇటువంటి సమస్యలున్నాయి.  ఇవన్నీ ప్రస్తావించకుండా నేను మాట్లాడలేనని ముందే మీ నాయకులకు చెప్పా. ఇవనీ మాట్లాడుకోకుండా కేవలం ఒక ఆర్టీసీ యూనియన్ లాగా మాట్లాడుకుంటాం అంటే నాకు అభ్యంతరం లేదు. నాకు సంబంధం కూడా లేదు. నిజంగానే అందరూ సమయ పాలన పాటిస్తున్నారంటే సంతోషం. పాటించాలని కూడా నేను కోరుకుంటున్నా. కానీ మేమొక సర్వే చేస్తే తేలిందేమిటంటే ప్రభుత్వ పాఠశాలల సమయం అనుకూలంగా లేకపోవడంకూడా ప్రైవేటు రంగ విస్తరణకు ఒక కారణం. చాలామంది కూలీలు, రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం ఎనిమిదికల్లా పనుల్లోకి వెళతారు. ఈలోగా పిల్లల్ని రెడీ చేసి వెళ్లాలనుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల బస్సులు ఏడు గంటలకల్లా వచ్చి పిల్లల్ని తీసుకెళతాయి. ప్రభుత్వ పాఠశాలలు వీళ్ళు పనులకు వెళ్లిన గంటకో రెండు గంటలకో మొదలవుతాయి. అప్పటిదాకా పిల్లల గతి ఏమిటి? ఇదొక సమస్య. గతంలో చూశాం. సమయానికి రావడం లేదు కాబట్టి టీచర్లు గ్రామాల్లోనే ఉండాలన్న ఉద్యమం కూడా కరీంనగర్ లాంటి జిల్లాల్లో వచ్చింది. ఇది జరిగిన చరిత్ర. 

టీచర్లుగా కొంత సహనంతో ఉండాలి. కొన్ని అలవాట్లను  పద్ధతులను కూడా మార్చుకోవాలి. క్లాస్ రూంలో ఎలా ఉండాలో కొత్తగా నేర్చుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా జెండర్ సెన్సిటిజషన్ పెరగాలి. కులాసాలకు సంబంధించి మన మాటల్లో చేతల్లో చాలా మార్పు రావాలి. సమాజం మారుతోంది, చైతన్య స్థాయి పెరుగుతోంది. సామాజిక మార్పులకు అనుగుణంగా మనమూ మారాలి. ఇవన్నీ మారకుండా ఇవి మన కర్తవ్య నిర్వహణలో భాగమని అనుకోకుండా ఉండటానికి వీలులేదు. మనం జీతం తీసుకుని పనిచేస్తున్నాం కాబట్టి మారుతున్న మనోభావాలకు అనుగుణంగా మనం మారాలి . ఒక ఉపాధ్యాయుడు ఆదర్శవంతుడుగా ఎలా ఉండాలి అన్న విషయంలో చర్చ అవసరం. అటువంటి తప్పులు ఎవరైనా చేసినా మీలాంటి వాళ్ళు సరిదిద్దాల్సిన అవసరం ఉంటుంది. పాఠశాల మీద, ఉపాధ్యాయుల మీద గౌరవం ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులను తల్లిదండ్రులు మనదగ్గరకు పంపించే అవకాశం  ఉంటుందనే విషయాన్ని మరిచి పోగూడదు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించాలని కోరుకోవాలి, ప్రభుత్వానికి ఆ సంగతి గుర్తు చేయాలి. అలాగే మనం కూడా ఉపాధ్యాయులుగా మన కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ముగిస్తాను.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి