శుక్రవారం, డిసెంబర్ 27, 2013

ఉద్యమాల ఉపాధ్యాయుడు

ఉద్యమాల ఉపాధ్యాయుడు 
చరిత్రలో అనేకమంది ఉపాధ్యాయులను మనం చూసి ఉండవచ్చు. అనేకమందిని గురించి విని ఉండవచ్చు. అనేకమంది మహోపాధ్యాయుల చరిత్రలు చదివి ఉండవచ్చు. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి అని పలు సందర్భాల్లో మనకు తారసపడిన ఉపాధ్యాయులను గమనించినప్పుడు మనకు అనిపించి ఉండవచ్చు. కానీ తెలంగాణ ఉపాధ్యాయులను గమనించినప్పుడు మాత్రం ఇలాంటి ఉపాధ్యాయులు ఇంకెక్కడా ఉండరేమో అనిపించకమానదు. ముఖ్యంగా 1969 ఉద్యమం ముగిసిన తరువాత ఆవరించుకున్న నిశ్శబ్దాన్ని చేదించుకుని వచ్చిన తరం తెలంగాణ నేల గర్వపడే విధంగా ఎదిగింది. నేలను ప్రజాస్వామ్యీకరించేందుకు ప్రతిన బూనినట్టు జీవితమంతా జన చైతన్యంలో తపించింది. తరించింది. అలాంటి తరంలోని వాడే ఆకుల భూమయ్య సర్. నిరాడంబరంగా, నిండుగా కనిపించే భూమయ్య సర్ చూడడానికి ఒక సాదాసీదా స్కూల్ టీచర్గానే కనిపించినా ఆయన లోతైన ఆలోచనల వెనుక ప్రజల కోసం పరితపించే నిరంతర చైతన్య శీలత ఉండేది.

 
ఉపాధ్యాయుడు అంటే  తరగతిగది గురించి మాత్రమే ఆలోచించి విద్యార్థులకు పాఠాలు బోధించే పనిముట్టు అన్న భావనను పక్కకుపెట్టి తన చుట్టూ వున్న సమాజాన్ని తరగతి గదిగా మార్చుకున్న వ్యక్తి ఆయన. 1969లో మొదటి తరం తెలంగాణ ఉద్యమానికి  ప్రభావితుడై, అందులో పాల్గొని, ఉద్యమ వైఫల్యం తరువాత పీడిత ప్రజల విముక్తితోనే తెలంగాణ విముక్తి కూడా ముడివడి ఉందని గ్రహించిన అప్పటి తరంలో ఆయన ఒకరు. అనుభవమే చరిత్ర మలిచిన ఉపాధ్యాయుడిగా మార్చింది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఆయన ఉద్యమకారుడిగానే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో చురుకుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడిగా ఎదిగి ఆయన ఉపాధ్యాయ ఉద్యమ స్వరూపాన్నే మార్చివేశారు. అప్పటిదాకా కేవలం జీతాలు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, నియామకాల గురించి ఆలోచించే ఉపాధ్యాయ సంఘాల స్వభావాన్ని మార్చి  ఉపాధ్యాయులు ప్రజలతో మమేకమై, ప్రజాచైతన్యంతో సమాజాన్ని మార్చే మార్గాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుంచి అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో ఆయన అంతర్భాగంగా ఉన్నాడు. అందుకే ఆయన అంత్యక్రియలకు ఇవాళ అనేకమంది తరలివస్తున్నారు

ఆకుల భూమయ్య సర్ ఇవాళ ప్రజాఫ్రంట్ భూమయ్యగా మారడం దాదాపు నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం ఉంది. కాలంలో తెలంగాణ ప్రజలు నిరంతరం ఏదో ఒక పోరాటంలోనే ఉన్నారు. పోరాటాలే ఇక్కడి తొలితరం విద్యార్థులను ప్రజాస్వామిక విలువలవైపు నడిపించాయి. ప్రజా ఉద్యమాల పక్ష్యాన నిలబడేలా చేశాయి. అయితే ఇక్కడి ఉపాధ్యాయులు ప్రజల నుంచి ఎంత నేర్చుకున్నారో అంతకు అంత పలు సంక్షోభ సమయాల్లో ప్రజాపక్షం వహించారు. ఆకుల భూమయ్య కోవకు చెందిన వ్యక్తి. భూమయ్యది పెద్దపల్లి దగ్గరి కాచాపూర్. ఆయన ప్రస్థానం మీద ఊరి ప్రభావం, నేల ప్రభావం, ప్రాంతంలో ప్రజలు చూపిన తెగువ ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయి. పెద్దపెల్లికి చుట్టూ నలభై యాభై గ్రామాలు అప్పటి ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పాలేర్లు సంఘాలు పెట్టి తమ హక్కుల కోసం నినదించడం మొదలుపెట్టిన నాటి నుంచి, రైతు కూలీ సంఘాలు ఏర్పడి కనీస వేతనాల కోసం పల్లెలన్నీ ఏకం చేసిన కాలంలో పెద్దపల్లి ఒక విప్లవ శిబిరం. పీపుల్స్ వార్ నాయకత్వంలో వాళ్ళు ఆలోచనలకు మరింత పదునుపెట్టిదున్నే వాడికే భూమి కావాలనినినదించారు. ఇది కల్లోలానికి దారితీసినది అప్పడికే అక్కడ బయ్యపు దేవేందర్రెడ్డి లాంటి యువనాయకులు ప్రజల్లో ఒక కొత్త ఆలోచనలకు బీజం వేసి ఉన్నారు. అలాగే మల్లోజుల సోదరులు కోటేశ్వర్రావు, వేణుగోపాల్ ఎదిగి వచ్చారు. కాచాపూర్ చుట్టూ ఉన్న ఊర్లు కాలంలో రగిలే కొలుముల్లా ఉండేవి.

 
కాచాపూర్ కూడా 1970కి అటుఇటుగా అట్టుడికిన ఊరు. కాచాపూర్ను ఆనుకుని వడ్కాపూర్ ఉంటుంది. ఊరికి పరిచయమే అవసరం లేదు. వడ్కాపూర్ చంద్రమౌళి అంటే విప్లవోద్యమంలో ఒక సంచలనం. వడ్కాపూర్ ఐదారు కిలోమీటర్ల దూరంలో ఎలిగేడు అనే ఊరుంటుంది. అది కట్ల మల్లేశం ఊరు. తెలంగాణ కార్మిక రంగ చరిత్రను తిరగరాసిన సింగరేణి కార్మిక సమాఖ్య రూపశిల్పి రమాకాంత్గా ఆయన చిరపరిచితుడు. వీళ్ళంతా ఒక కోవకు చెందిన ఒకే కాలపు వీరులు. ఒక దశలో కాచాపూర్ నుంచి కాట్నపల్లి దాకా ఒక ఎర్ర తివాచీలా ఉండేది. తివాచీ నుంచి ఎందరో యువకులు నడిచి వెళ్ళారు. చీకటి నిండిన పల్లెల్లో వెలుగు నింపాలని కలగన్నారు. అప్పటికి అంత సాహసం చేయలేని వాళ్ళు మాత్రం  ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి చేతనైనంత సాయం అందిస్తూ ఉద్యమాలను నిలబెడుతూ వచ్చారు. అలా చివరిదాకా నిలబడ్డ వ్యక్తి ఆకుల భూమయ్య. అలా నిలబడమే కాదు ఒక ఉపాధ్యాయుడుగా ఉంటూనే, ఉద్యమాలతో మమేకమై కదిలాడు

టీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమ మలిదశ మొదలయ్యిందని అంటుంటారు. కానీ అంతకుముందు ఒక దశ ఉండిందని దశ తెలంగాణ ఉద్యమానికి ప్రజాస్వామిక ఆకాంక్షలను జోడించిందని చాలామంది మరిచిపోతుంటారు. 1990 దశకంలో ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీజాలు పడ్డాయి, కిషోర్రెడ్డి మనోహర్రెడ్డి లాంటి మిత్రులు తెలంగాణ విద్యార్థి సంఘాలు పెట్టి అడపాదడపా అలజడులు చేస్తున్న దశలోనే పెద్దలు కేశవరావు జాదవ్, నాట్యకళా ప్రభాకర్, పాశం యాదగిరి ఇట్లా ఎవరికీ తోచిన పద్ధతుల్లో వాళ్ళు తెలంగాణవాదాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు లక్ష్మణ్, హరినాథ్, సింహాద్రి, పీ.ఎల్. విశ్వేశ్వర్రావు లాంటి అనేకమంది కలిసి సెంటర్ ఫర్  తెలంగాణ స్టడీస్ ఏర్పాటు చేసి తెలంగాణ వెనుకబాటుతనానికి కారణాలు అధ్యయనంచేసి ప్రచురించారు. అప్పటికే గాదె ఇన్నయ్య  దగాపడ్డ తెలంగాణ పేరుతో మొట్టమొదటగా వివిధ రూపాల్లో ఉన్న ఆంధ్ర వలస దోపిడీ మీద ప్రచురణలు, సదస్సులు నిర్వహిస్తూ కొత్త ఆలోచనలకు బీజం వేశాడు. ఇట్లా 1995-96 నాటికి తెలంగాణ ఆకాంక్ష మళ్ళీ చిగురించింది. దీన్ని ప్రజాసంఘాలు ఒక డిమాండుగా చేపట్టి ముందుకు తీసుకొచ్చాయి

1996
భువనగిరి సభ, తరువాత 1997లో వరంగల్ డిక్లరేషన్ వచ్చాయి. అవి తెలంగాణ జనసభకు ఒక రూపాన్ని ఇచ్చాయి. భౌగోళిక ప్రాంత విభజన మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇక్కడి వనరుల మీద, భూమి, నీళ్ళ మీద అధికారం కావాలన్న ప్రణాళికతో ప్రజాస్వామిక పునాదుల మీద కొత్త రాష్ట్రం కావాలన్న డిమాండును ఆకుల భూమయ్య నాయకత్వంలో జనసభ ముందుకు తెచ్చింది. అది తరువాత 2010 లో ప్రజాఫ్రంట్ గా ఆవిర్భవించింది. దానికి ఆయన చైర్మన్. ఇట్లా ఆయన తన విద్యార్ధి దశలో వదిలేసినా తెలంగాణ జెండాను మళ్ళీ భుజానికి ఎత్తుకున్నాడు. పోలవరం, సింగరేణి ప్రైవేటీకరణ, వనరుల దోపిడీ విషయాల్లో భూమయ్య సాగించిన పోరాటం మరువలేనిది. ఇట్లా కరీంనగర్ జిల్లాలో ఒక మామూలు ఉపాధ్యాయుడుగా ఆయన మొదలుపెట్టిన ప్రయాణం డిసెంబర్ 24తో ముగిసింది. ప్రమాదంలో చనిపోయినట్టు చెపుతున్నా ప్రమాదం సహజమైంది కాదని దాని వెనుక కుట్ర ఉందని ఉద్యమ సంఘాలు, ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఆకుల భూమయ్య సర్తో సహా ఆయన తరహా భావజాలాన్ని, బాధ్యతలను నిర్వహించిన వారికి ఇటువంటి అనూహ్య ప్రమాదాలు అనుభవంలో ఉన్నాయి

1990
తరువాత తెలంగాణ గురించి, తెలంగాణలో ప్రజాస్వామిక విలువల గురించి, పౌర హక్కుల గురించి మాట్లాడిన అనేకమందిని ఇటువంటి ప్రమాదాలు వెంటాడిన దృష్ట్యా ఇప్పుడు కూడా ఎవడో ఒకడు ప్రమాదం వెనుక ఉండే ఉంటాడన్న అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడబోతున్న తరుణంలో ప్రత్యామ్నాయం లేకుండా చూసుకునే ప్రయత్నంలో పాలకులే పనిచేసి ఉంటారని ప్రజాసంఘాలు అంటున్నాయి. కానీ ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళెవరూ పెదవి విప్పలేదు. కనీసం పోలీసులు కూడా ప్రజల్లో, తెలంగాణ సంఘాల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి పూనుకోలేదు. ఇది అనుమానాలు బలపడడానికి ఆస్కారం కల్పిస్తున్నది. జీవితమంతా తెలంగాణ కోసం నిలబడి రాష్ట్రం ఏర్పడుతున్న దశలో లేకుండాపోవడం విషాదం. ఆయన ఆశించిన ప్రజాస్వామ్య తెలంగాణ సాధన ఒక్కటే ఆయనకు ఎవరైనా ఇవ్వగలిగే నివాళి.