శుక్రవారం, డిసెంబర్ 20, 2013

ఇంకా ఉంది...!


నా ఆంధ్ర సోదరుల విజయమిది
సరిగ్గా పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజునే ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు శాసన సభకు వచ్చింది.
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు త్యాగం చేశాడో అదే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వస్తోంది!!
జై ఆంధ్రా!

ఇది కరీంనగర్ జిల్లా చందుర్తి అనే మారుమూల పల్లెనుంచి లక్ష్మినారాయణ అనే మిత్రుడు  డిసెంబర్ 17 పంపిన ఎస్ఎంఎస్. ముందు రోజు తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర శాసనసభలో సభావ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి చారిత్రక బాధ్యతను నిర్వహించారు. సమయంలో తెలంగాణకే చెందిన డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క సభాపతి  స్థానంలో ఉన్నారు. శాసనసభలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా తనదైన పాత్ర పోషించారు. ముగ్గురు యువనాయకులు రాజ్యాంగ చట్టాల పరిధి దాటకుండానే సమయస్ఫూర్తితో వ్యవహరించి తెలంగాణ సమాజం తలెత్తుకునే రీతిలో వ్యవహరించారు. అప్పటి దాకా  రాజకీయ నాటకాన్ని ఊపిరి బిగబట్టి గమనిస్తున్న తెలంగాణ సమాజానికి ఊరట నింపారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుకున్న పొట్టిశ్రీరాములు వర్ధంతి రోజునే రాష్ట్ర విభజన బిల్లు శాసనసభలో ఎలా ప్రవేశపెడతారని, ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి, స్పీకర్ మనోహర్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలో లేనప్పుడు బిల్లు సభలో ప్రవేశపెట్టడం తెలంగాణవాదుల కుట్రగా ఆంధ్రప్రాంత అద్దెమైకులు అరిచిగీపెడుతున్న సమయంలో లక్ష్మీనారాయణకు ఇది మా కుట్ర కాదు, మీ విజయం అని చెప్పాలని తోచింది. పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం చేసింది కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకే తప్ప, ఆంధ్రప్రదేశ్ కోసం కాదని ఎవరెన్నిసార్లు చెప్పినా వినని సీమాంధ్ర నాయకులకు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన లక్ష్మినారాయణ మరోసారి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా వారికి శుభాకాంక్షలు కూడా చెప్పాడు. తెలంగాణ సమాజంలో ఇటువంటి సమయస్ఫూర్తి చూసినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంటుంది. ముఖ్యంగా యువ తరంలో ఉన్న మెలకువ ఇవాళ తెలంగాణను నిరంతరం చలనశీలంగా ఉంచుతోంది. నిన్న మొన్నటిదాకా తెలంగాణ ప్రజలను ఎడ్డివాళ్ళుగా ఎద్దేవా చేసినవాళ్లే ఇవాళ ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతున్నారు. ఇదొక శుభ పరిణామం. ఇది తెలంగాణ పోరాట ఫలితం. నిజానికి పోరాటాలు చాలా పాఠాలు నేర్పుతాయి. చరిత్రలో మనుషులు చావడమే కాదు బతకడం ఎలాగో చాలావరకు యుద్ధ సమయాల్లోనే నేర్చుకున్నారు. సుదీర్ఘ సంక్షోభాలు, పోరాటాలు, యుద్ధాలు సాగిన సమాజాలు పరిశీలిస్తే ఇది మనకు అర్థమౌతుంది. అందుకే యుద్ధాలను ఆవిష్కరణలకు అమ్మ లాంటిదని అంటుంటారు. కొత్త సాంకేతిక పరికరాలు, శాస్త్రీయ ఆవిష్కరణలు యుద్ధాల కోసమే జరిగాయి, జరుగుతున్నాయి. అంతేకాదు. కొత్తకొత్త సృజనశీల ఆలోచనలు కూడాసంక్షోభ సమయాల్లోనే ఆవిష్కృతం అయినాయి. తెలంగాణ ఉద్యమం కూడా ఇలాంటి ఎన్నో కొత్త ఆలోచనలకు, వ్యక్తీకరణలకు దోహదపడింది. కవులు, రచయితలు, కళాకారులు, పాత్రికేయులు ఇలా  సృజనశీల రంగాల్లో ఉన్న అందరూ నిరంతరం తమ ఆలోచనలకు పదునుపెట్టి ఉద్యమాన్ని నిలబెట్టినవారే! వీరికితోడు కొత్తగా ఎదిగి వచ్చిన తరం సెల్ఫోన్లతో పాటుగా అన్ని సాంకేతిక సాధనాలను సమర్థవంతంగా వాడుకుంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ప్రజల సామూహిక చైతన్య వ్యక్తీకరణకు ఒక ప్రధాన వాహికగా మారిపోయింది. సందేశాలు, మాటలు, పాటలలో నుంచి తెలంగాణ సమాజం ఎంతో నేర్చుకుంది. ముఖ్యంగా ఎదుటివాడి కుట్రలను ఎక్కడికక్కడ చిత్తుచేసే ఎత్తులను నేర్చుకుంది. అదే ఇప్పుడు తెలంగాణ ప్రక్రియను ముందుకు నడిపిస్తున్నది

అయినా ఇంకా తెలంగాణ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నవాళ్ళు, ఆంధ్రా నేతల ఆర్భాటపు మాటలు విని అయోమయంలో పడుతున్నవాళ్ళు ఉన్నారు. శాసనసభలో సీమాంధ్ర నేతల వ్యవహారశైలి కూడా అందుకు  కారణం అవుతోంది. రాష్ట్రపతి పంపిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఒక రకంగా పూర్తిగా ఆంధ్రప్రాంత అనుకూల బిల్లు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి, ఆస్తిపాస్తులకు భంగం కలిగించే అనేక విషయాలు బిల్లులో ఉన్నాయి. అలాగే ఆంధ్రకు అసాధారణ లాభాలు కలిగించే అంశాలు అనేకం బిల్లులో ఉన్నాయి. ఆంధ్రకు లాభం చేసినా అభ్యంతరం చెప్పకూడదు కానీ తెలంగాణకు నష్టం కలిగిస్తున్న రీతిలో ఉన్న పలు ప్రతిపాదనలను కచ్చితంగా తెలంగాణ వ్యతిరేకించాలి. ముందుగా పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకించాలి. దీని వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ముఖ్యంగా తెలంగాణలో మాత్రమే మిగిలి ఉన్న కోయజాతి ప్రాజెక్టు వలన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ప్రపంచంలో మిగిలి ఉన్న అత్యంత అరుదైన మానవ సమాజాల్లో కోయ జాతి ఒకటి. తెలంగాణ ఇస్తున్నాము కాబట్టి కోయల గొంతు కోస్తామని అనడం అత్యంత దారుణమైన ప్రతిపాదన. పోలవరం ప్రాజెక్టును బాధిత ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. రాజకీయపార్టీలు కూడా ముంపు తగ్గించాలని, అందుకోసం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని సూచిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా తరువాత అయినా దీనిపై న్యాయ పోరాటాలు తప్పనిసరిగా చేయాల్సిందే

బహుశా తెలంగాణ ప్రజలు ఇలాంటి పోరాటాలు చేస్తారనేనేమో న్యాయవ్యవస్థను ఉమ్మడిగా ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. ఇది అన్యాయమైన ప్రతిపాదన. రాష్ట్రం అంటే కేవలం భూబాగం, భౌగోళిక ప్రాంతమే కాదు, ప్రాంత ఆర్థిక, సామాజిక, రాజకీయ, న్యాయ వ్యవస్థలు కూడా. ఇవి రాష్ట్ర భావనలో అంతర్భాగం. అందునా ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయస్థానం ప్రాంతీయ ప్రాతిపదికన ఎప్పుడో చీలిపోయి ఉంది. కొన్నిసార్లు హైకోర్ట్ ఆవరణను పోలీసులే అత్యంత సున్నితమైన ప్రాంతంగా భావిస్తూ వచ్చారు. న్యాయవాదుల్లో ఆధిపత్యం చేస్తున్నదంతా సీమాంధ్రులే, తరచుగా అక్కడ ఘర్షణలు జరుగుతాయి. ఆధిపత్య ధోరణుల వల్లే తెలంగాణ న్యాయవాదులంతా ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. అరవయ్యేళ్ళ హైకోర్ట్ చరిత్రలో మొన్నమొన్నటిదాకా తెలంగాణ ప్రాంత అడ్వకేట్ జనరల్ లేడు. ప్రభుత్వ న్యాయవాదుల్లో మెజారిటీ సీమాంధ్రులే. అంతేకాదు తమ ప్రాంతం పట్ల భావోద్వేగాలకు లోనయ్యే న్యాయమూర్తులు సహజంగానే ఉన్నారు. కొందరికి గతంలో తెలంగాణ ఉద్యమాన్ని దాడిగా పేర్కొంటూ రాజీనామాలు చేసిన చరిత్ర కూడా ఉన్నది. అందుకు న్యాయమూర్తులను తప్పుపట్టడం గానీ, దురుద్దేశాలు ఆపాదించడం గానీ చేయలేంకానీ మనకంటూ ఒక ప్రత్యేక హైకోర్ట్ ఉండాలన్నది తెలంగాణ ప్రజల బలమైన కోరిక. లేకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం స్వతంత్రంగా మనగలగడం కష్టం. ప్రతి నిర్ణయానికిఅడ్డుతగిలే ఆస్కారం, ప్రభుత్వాన్ని కోర్ట్  కేసులతో  స్తంభింపచేసే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటప్పుడు రాజ్యాంగబద్ధపాలనకు అవరోధాలు తప్పవు. సొంత హైకోర్టుల కోసం అటు  ఆంధ్రప్రాంతపు న్యాయవాదులు, ఇటు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పూనుకోవాలి. దీనికోసం పోరుతప్ప మరో మార్గం కనిపించడం లేదు.

మూడోది, ముఖ్యమైనది  హైదరాబాద్. ఒకనాడు నగరం ఒక రాజ్యం, తరువాత ఐదు అధికార భాషలు మాట్లాడే ఒక దేశ రాజధాని, కొంతకాలం హైదరాబాద్ ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇది రాష్ట్ర రాజధానిగా మారిపోయిన తరువాత నగరపు ప్రభ తగ్గిపోయి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రానికి రాజధానిగా మిగిలిపోయింది. ఇప్పుడు విభజన తరువాత హైదరాబాద్లో ఇంకొక రాష్ట్ర రాజధాని ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో రెండు నగరాలు ఉంటాయి. రెండు రకాల పరిపాలనలు కొనసాగుతాయి. ఒక ముఖ్యమంత్రి, ఒక గవర్నర్ ఎవరు ఎవరి పరిధిలో ఉంటారో తెలియని అయోమయం పదేళ్ళపాటు కొనసాగుతుంది. నగరంలో స్థానికులే కాందీశీకులైపోయే పరిస్థితి. ఇది నిరంతర ఘర్షణలకు, సమస్యలకు కేంద్రం కాబోతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా విడిపోయే రాష్ట్రానికి విడిది కేంద్రంగా ఒకటి రెండేళ్ళు మించకుండా ఉంచితే తప్ప హైదరాబాద్ తెలంగాణ చేతిలో మిగలదు. అలాగే విద్యా, వైద్య రంగాల్లో కూడా సమస్యలున్నాయి. ఉద్యోగుల హక్కులు వాటాలు తేలాల్సి ఉందినీటి వాటాలు, నిధుల భాగాలలో కూడా మోసలున్నాయి. అప్పులు, ఆస్తులు అసంబద్ధంగా పంచే ప్రతిపాదనలు చేశారు. బిల్లునిండా ఇలాంటి చిల్లులు చాలానే ఉన్నాయి. అవి ఇప్పుడు చర్చించుకుని పరిష్కరించకపోతే ఇంకా పెరిగి పెద్దవవుతాయి. సీమాంధ్రుల పరిస్థితి నిజంగానే నక్కను తొక్కినట్టుగా ఉన్నది. విద్యా, ఉపాధి అవకాశాల్లో అక్కడ ఊహించని మార్పులు రాబోతున్నాయి. బిల్లు వచ్చిందంటే ఇక యుద్ధం ముగిసిందనే అనుకున్నాం. ఇప్పటికిప్పుడు పోరాటంతో పనిలేదని, రాష్ట్రం ఏర్పడితే ఇక కొత్తకాలం మొదలవుతుందని అనుకున్నాం. షరతులు, ఆటంకాలు కొంతకాలమే కదా అనుకున్నాం. తెలంగాణ భౌగోళికంగానైనా వచ్చేసింది కాబట్టి ఇక సామాజిక, ప్రజాస్వామ్య పునర్నిర్మాణం మొదలు పెట్టాలని కలలుగన్నాం. కానీ వీటన్నిటి గురించి చర్చించాల్సింది చాలా ఉంది. చేయాల్సింది మిగిలే ఉంది. కొత్త కాలం కోసం ఇంకొంతకాలం ఆగాల్సిందే

                                                                                                  ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి