మంగళవారం, జులై 12, 2011

వాళ్ళు సరిహద్దులు గీస్తున్నారు..


ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సిన భద్రతా దళాలను పంపించింది. అవి ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని తెలంగాణ పల్లెల్లో నిఘా వేసి ఉన్నాయి. అయినా ఉస్మానియా విద్యార్థులకు ఇవేవీ కొత్త కాదు. ఇప్పుడే కాదు తొంభయేళ్ల కాలంలో అనేకసార్లు అక్కడి విద్యార్థులు ఈ సమాజంలో ఉన్న సరిహద్దుల్ని సవరించడమో, చెరిపేయడమో చేస్తూనే ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం అమెరికా నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ‘అన్నా.. ఉస్మానియా యూనివర్సిటిలో ఏం జరుగుతోంది?’అని అడిగాడు. అక్కడ అప్పటికి ఇంకా తెల్లారి ఉండదు. అతను అడిగిన తీరును బట్టి రాత్రంతా నిద్రపోయి ఉండడని అర్థమైంది. అతను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని డిట్రాయిట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ ఒక్క హరే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ పిల్లలకు కంటికి కునుకురాని కాలమిది. రోజు రోజుకూ మారుతున్న రాజకీయాలు.. ఒకవైపు ఆశల్ని ,మరోవైపు ఆసక్తిని పెంచుతుంటే.. ఉస్మానియా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నా యి. ‘రావూతంతా టీవీల ముందు జాగారం చేస్తున్నాం, ఉన్నట్టుండి మళ్లీ మన ఛాన ళ్లు సమైక్యరాగం అందుకున్నాయి. ఉస్మానియా ఉడికిపోతుంటే అవి ఆంధ్రా వంటా వార్పును వడ్డిస్తున్నాయి. తెలంగాణ విద్యార్థుల మీద , ప్రజా ప్రతినిధులమీద,మొత్తంగా ప్రజలమీద సాగుతున్న ఈ నిర్భంధం తప్పని ఒక్క ఛాన ల్ కూడా చెప్పడం లేదు’ అని వాపోయాడు. అతనే మళ్లీ అన్నాడు ‘వీళ్లు మన తో యుద్ధానికి దిగినట్టుంది. కనీసం కోర్టులైనా జోక్యం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలుపాలని , కనీసం నిరసన తెలిపే హక్కుకూడా లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యమని’వాపోయాడు.అవును తెలంగాణపై ఈ ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. 

ఉస్మానియా యూనివర్సిటి చుట్టూ మోహరించిన సైనిక బలగాలను, సాయుధ దళాలను చూసిన ఎవరికైనా అదే భయం కలుగుతోంది. తాము జీవన్మరణ సమస్యగా భావిస్తు న్న తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ‘గాంధేయమార్గం’లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఓయూ జేఏసీ ప్రకటించింది. అది నేరం కాదు. దీక్షకు దిగుతున్న వాళ్లెవరూ సంఘవ్యతిరేక శక్తులూ కాదు. అదే యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు. పరిశోధకు లు. దాదాపు రెండువేల ఎకరాల్లో ఉన్న విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తకు చదువుతో పాటు సామాజిక స్పృహనందించిన కాలేజీ ముందర వాళ్లు దీక్షకు దిగుతున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటిలో యూనివర్సిటి కోరితే తప్ప పోలీసులు జోక్యం చేసుకోరాదు. ఆ అధికారం వారికి లేదు. కానీ పోలీసులు ఆ దీక్షకు అనుమతి లేదని అడ్డుకున్నారు. యూనివర్సిటికి వెళ్లే దారుల్లో ముళ్ల కంచెలు నాటారు.

గడిచిన ఏడాదిన్న గా ఆమార్గాల వద్ద చెక్ పోస్టులు పెట్టి ఉన్నా ..,అక్కడికి నెల రోజుల క్రితమే సరిహద్దు భద్రతా దళాలను దించారు. దీక్షకు దిగిన వారిని దీవించి వద్దామని వెళ్లిన ఉద్యమ నేతలను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను నిర్భందించారు. తెలంగాణ జిల్లాల నుంచి వస్తోన్న విద్యార్థులను , యువకులను అరెస్ట్ చేసి భయోత్పాతం సృష్టించారు. బహుశ తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు రావాలంటే పాస్ పోర్ట్‌లు , వీసాలు కావాలేమో! ఈ పరిస్థితులు గమనించిన ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనే అనిపిస్తోంది. గడిచిన ఏడాది రెండేళ్లుగా తెలంగాణపై నిరంకుశత్వమే రాజ్యమేలుతోంది. రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా శ్రీకృష్ణ కమిటి చేసిన ఎనిమిదో చాప్టర్ మనల్ని పాలిస్తోంది. ’తెలంగాణ దారికొచ్చే విధంగా అన్ని రకాల పద్ధతులు వాడాలని’ ఆ కమిటీ సూచించిన సంగతి మనకందరి కీ తెలిసిందే. కమిటీ చెప్పిన పొలిటికల్ మేనేజ్‌మెంట్ మొదలైందని, అది అమలైతే మళ్లీ మనకు మోసం తప్పదని గ్రహించిన ప్రజావూపతినిధులంతా రాజీనామాలు చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆమోదంలేని ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రాతినిధ్యంలేని పాలన అమలవుతోంది. మరోరకంగా చెప్పాలంటే ఏ వలస పాలకుల భాగస్వామ్యమైతే మనల్ని నిలువు దోపిడీ చేసి నిట్టనిలువునా ముంచిందో ఇప్పుడు ఆ పరిపాలనే నూటికి నూరుపాళ్లూ అమలవుతోంది. ప్రజల ప్రాతినిధ్యంలేని పాలన ఏ రకంగా కూడా ప్రజాస్వామ్యబద్ధం కాదు. అలాంటి పాలన బహిరంగంగానే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం ఒకవూపాంతం పట్ల నిర్బంధ పూరితంగా వ్యవహరించడం అధర్మం.
అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు నిజంగానే పత్రికలో, న్యాయవ్యవస్థనో ప్రజలకు అండగా నిలబడాలి. ఎందుకంటే మనదేశంలో ఆ రెండు వ్యవస్థలూ అటువంటి హోదాను అనుభవిస్తున్నాయి. అటువంటి పాత్రను గతంలో నిర్వర్తించిన ఘన చరిత్ర వీటికి ఉంది. కానీ తెలంగాణ విషయంలో ఈ రెండు వ్యవస్థలూ పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో గతంలో పత్రికలు ప్రజల పక్షం ఉండేవి. ప్రజల న్యాయమైన ఉద్యమాలను బలపరిచేవి.

తెలంగాణ ఉద్యమాన్ని కూడా మీడియా మొదటి దశలో నిర్ద్వందంగా సమర్థించింది. కానీ డిసెంబర్ తొమ్మిది తర్వాత మీడియా వైఖరి మారిపోయింది. మీడియాలో కూడా ప్రాంతీయ ధోరణి స్పష్టంగా బయటపడింది. ఎనిమిదో చాప్టర్ పేర్కొన్నట్టుగా ఒకటి రెండు ఛానళ్లు పత్రికలు మినహా తెలుగుమీడియా సీమాంవూధకు అనుకూలంగా ఉంది. తెలంగాణ వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఈజిప్టులోనో, టునేషియా లాంటి దేశాల్లో ఎక్కడ పదిమంది గుమిగూడి నినదించినా ప్రజాస్వామ్యపు కమ్మదనాన్ని కథలుకథలుగా ప్రచురించి ప్రసారంచేసే తెలుగు మీడియా తెలంగాణలో ప్రజాస్వామ్యం ముళ్లకంచెల మధ్య మూలుగుతున్నా పట్టనట్టే ఉంటోంది. ఇక కోర్టుల సంగతి చెప్పేదేముంది. తెలంగాణ ఉద్యమంపై సాగుతోన్న అప్రజాస్వామిక అణచివేతను ఆపాలని ఈ ప్రాంతపు న్యాయవాదులంతా ఎడతెగని పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయదేవతను ప్రతిసందర్భంలో వేడుకుంటూనే ఉన్నారు. 

వారిపై వందలాది అక్రమ కేసులు బనాయిస్తోన్నా కనికరించే నాధుడే కనిపించ పైగా న్యాయమూర్తులు కూడా ప్రాంతీయ భావాలకు ప్రభావితులవుతున్నారని విమర్శలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన కేసులింకా పెండింగ్‌లో ఉన్నాయి. అయినా న్యాయవ్యవస్థను, ఆదేశాలను ప్రభుత్వం, పోలీసులు గౌరవిస్తారా?
ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించరాదని, ఆ యూనివర్సిటీ అధికారులు కోరితే తప్ప అక్కడ జోక్యం చేసుకోవద్దని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది. ఇదే మాట మానవ హక్కుల సంఘం పదేపదే చెబుతోంది. అయినా ఇవాళ వేలాదిమంది పోలీసులే కాదు దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన బిఎస్‌ఎఫ్ కమాండోలు ఉస్మానియా యూనివర్సిటీని ముట్టడించి ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలతో మోహరించారు. శత్రువులపైన తప్ప వాడటానికి వీలులేని మందుగుండును యూనివర్సిటీ హాస్టళ్ల మీద, విద్యార్థుల మీద వదులుతున్నారు. అవి రబ్బరు బుల్లెట్లా, బాష్పావాయువు గోళా ల అన్నది కాదు. అవి విద్యార్థులకే కాదు ఆ పరిసరాల్లో నివసించే ప్రజలకూ హానికరంగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్కడ సైన్యం వాడుతోన్న గోళాలు ప్రజలకు హాని కలిగిస్తాయని, జనంపైకి వాడకూడదని హెచ్చరిక ఉన్నప్పటికీ గత వారంరోజులుగా వాటితో వర్షం కురిపిస్తున్నారు. నిజానికి దీన్ని యుద్ధమని కూడా అనలేం. యుద్ధానికి ఒక నీతి ఉంటుంది. కొన్ని నియమాలుంటాయి. ఏ యుద్ధమైనా కొన్ని పద్ధతులను అనుసరిస్తుంది. ఇప్పుడు అక్కడ నిరాయుధలపై ఏ నియమమూ లేని దాడి, ఏ నీతి లేని అణచివేత సాగుతోంది. సరిగ్గా సరిహద్దులోపల శత్రు దేశం మీద వదిలినట్టుగా సరిహద్దు భద్రతా దళాలు వాడే గోళాలను మర ఫరింగులు అమర్చిన వాహనాలతో యూనివర్సిటీ లోపలికి కురిపిస్తున్నారు. అయినా ధైర్యం సడలని విద్యార్థులు ఇప్పుడు నిరాహారదీక్షలకు దిగారు. వారికి వారి ప్రాణాలకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ ప్రజానీకంపై ఉంది. ఇవాళ రాజీనామాలు చేసి చేతులు కడిగేసుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు ప్రజలు సిద్ధంగా సంఘటితంగానే ఉన్నారు. సంఘటితంగా లేనిది రాజకీయ నాయకులే. రేపటి తెలంగాణలో తమ ప్రాబల్యం కోసం ఇప్పుడే ఎవరి కుంపటి వాళ్లు రాజేసుకుంటున్నారు. 

తాము ప్రజల్లో ఉన్నామన్న ప్రచారం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలూ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మీతో ఉన్నారా లేదా అన్నది కూడా మీ మీ అధిష్ఠానాలు గమనిస్తుంటాయి. యాత్రలు, దీక్షలు కాదిప్పుడు కావాల్సింది. తదేకదీక్షతో ఉన్న తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు అండగా ఉండాలి. పోరాటంలో ఉన్న వారికి ప్రజాస్వామ్యంపట్ల, భారత రాజ్యాంగం పట్ల నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయపక్షాలకు ఉందిపజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సిన భద్రతా దళాలను పంపించింది. అవి ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని తెలంగాణ పల్లెల్లో నిఘా వేసి ఉన్నాయి. అయినా ఉస్మానియా విద్యార్థులకు ఇవేవీ కొత్త కాదు. ఇప్పుడే కాదు తొంభయేళ్ల కాలంలో అనేకసార్లు అక్కడి విద్యార్థులు ఈ సమాజంలో ఉన్న సరిహద్దుల్ని సవరించడమో, చెరిపేయడమో చేస్తూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రపు సరిహద్దుల్ని గీసే పనికి పూనుకున్నారు. వారికి అందరం అండగా నిలబడదాం.

మంగళవారం, జులై 05, 2011

ఉమ్మడిగా ఉద్యమిద్దాం



‘విజ్ఞులారా,
మనం మూకుమ్మడిగా బలిదానాలు ఇవ్వకపోతే...
కచ్చితంగా మనల్ని విడివిడిగా బలిగొంటారు..’



అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా వలసవాద విముక్తి పోరాటం లో ఐక్యకార్యాచరణ అవసరాన్ని ప్రబోధిస్తూ బెంజిమన్ ఫ్రాంక్లిన్ అన్న మాటలివి. జూలై నాలుగో తేదీ అమెరికా స్వాతంత్రం ప్రకటించుకున్న రోజు. ఆ స్ఫూర్తితో ఉద్యమకారులనుద్దేశించి ఫ్రాంక్లిన్ ఆ మాటలన్నారు. తెలంగాణలో సోమవారం జరిగిన పరిణామాలు యాదృచ్ఛికమే కావచ్చు గానీ చరివూతలో చాలా సంఘటనలకు కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. జూలై నాలుగు సంఘటనలు ప్రపంచంలో అనేక దేశాలను ప్రభావితం చేశాయి. అనేక ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసాయి. జూలై నాలుగంటే ఒక్క అమెరికా స్వాతంవూత్య దినమే కాదు. తెలంగాణ జన విముక్తి కోసం దొడ్డి కొమురయ్య తన ప్రాణాలను బలిదానం ఇచ్చిన రోజు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడిన కొదమ సింహం అల్లూరి జయంతి. యాదృచ్ఛికమే అయినా తెలంగాణ ప్రజావూపతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక విజయంగా నమోదయింది.


అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ఆ దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేసింది. అంతేకాదు ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ఒక పరిపాలనా విలువ గా ఆవిష్కరించింది. ఫ్రాం క్లిన్ లాంటి ఎంతో మంది మేధావులు ప్రజాస్వామ్య మూల సూత్రాలను రూపొందించారు. ప్రజాస్వామ్యం .పజలు తమ అంగీకారంతో, ఉమ్మడి ఆలోచనతో, సమష్టి నిర్ణయాలతో ఏర్పాటు చేసుకు నే పాలనా వ్యవస్థ అని అనుకున్నారు. ఈ ఉమ్మడి విలువలకు ఎవరైనా కట్టుబడి ఉండకపోతే, సమష్టి నిర్ణయాన్ని ఎవరైనా ధిక్కరిస్తే ఏం చేయాలన్న ప్రశ్నలు అప్పుడు, ఆ తరువా త అనేక సందర్భాల్లోనూ వచ్చాయి. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో అసమ్మతిని, అసంతృప్తిని, అనంగీకారాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుందని అమెరికా స్వాతంత్య్ర ప్రకటన స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా లేని ప్రభుత్వాలకు నిరసన తెలపడమే కాదు, అట్లాంటి పరిస్థితులు సరిదిద్దడానికి ఆ ప్రభుత్వాలను కూల్చివేసే అధికారం కూడా ప్రజలకు ఉంటుందని ప్రజాస్వామ్యానికి మూలమైన ఆ ప్రకటనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అటువంటి అధికారంలోంచి వచ్చిన హక్కే రాజీనామా. ఆ హక్కును గుర్తించినందుకు అభినందనలు.



పాలకవర్గంలో ఉన్న ఒక ప్రతినిధి రాజీనామా చేయడమంటే బాధ్యత నుంచి పారిపోవడం కాదు. ప్రజావూపతినిధులుగా బాధ్యతలను గుర్తెరిగి, అది పాలకులకు గుర్తుచేయడం. పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజలకు ఎరుక పరచడం. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులను కాపాడడం. ఇవాళ తెలంగాణ ప్రజావూపతినిధుల రాజీనామాలు ఇలాంటి అనేకానేక ప్రజాస్వామిక విలువలను నిలబె భావించాలి. యాభై ఏళ్ల నిర్లక్ష్యంపై తిరుగుబాటుగా పరిగణించాలి. గత పదేళ్లుగా కొనసాగుతోన్న రాజకీయ పోరాటానికి గుర్తింపుగా గమనించాలి. పైగా ఒక వ్యక్తో, ఒక పార్టీనో కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా నివ్వెరపోయే విధంగా ఎలాంటి శషభిషలు లేకుండా ఈ రాజీనామా లు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టాయి. ప్రజాభివూపాయాన్ని ఇంతకంటే పరిపూర్ణంగా వ్యక్తం చేసిన సంఘటన భారత పార్లమెంటరీ చరివూతలో ఎన్నడూ లేదు. పైగా ఈసారి రాజీనా మా చేసిన వాళ్లు పదవిపోతున్నట్టుగా లేరు. ఒక పవిత్ర కార్యంలో మమేకవుతున్నట్టుగా కనిపించారు. ఒక బరువు దిగినట్టుగా, బంధనాలు తెగిపోయినట్టుగా ఆనందించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత ఆ ఆనందంలో నడిరోడ్డుపై నృత్యం చేశారు. బహుశ ఎమ్మెల్యేగా గెలిచిన రోజు కూడా ఆమె అంత ఆనందించి వుండరు.


అయినా సరే .. కొందరు పదవీ లాలసలో ఉన్న వాళ్లు పెదవి విరుస్తూనే ఉన్నారు. రాజీనామాల వల్ల్ల రాష్ట్రం రాదనీ, మహా అయితే మళ్లీ ఎన్నికలొస్తాయని ఎగతాళి చేస్తున్నారు. రాజీనామాల వల్ల రాజ్యాంగ సంక్షోభం కాదుగదా.. రాజకీయ సంక్షోభం కూడా రాదని అవహేళనగా మాట్లాడుతున్నారు. రాజకీయ సంక్షోభం అప్పుడే మొదలైందన్న సంగతి వాళ్లు గమనిస్తే మంచి ది. రాజీనామాల దెబ్బకు నిన్నటిదాకా నిద్ర నటిస్తూ వచ్చిన ఢిల్లీ పెద్దలు ఉలిక్కిపడి లేచి ఇవాళ అర్ధరావూతుల దాకా జాగారం చేస్తున్నారు. పైకి మేక పోతుల్లా గంభీరంగా కనిపిస్తున్నా తమ వారికి సందేశాలు పంపిస్తున్నారు. సంకేతాలిస్తున్నారు. చర్చలు సంప్రతింపులు మొదలు పెట్టారు. మరోవైపు యింతకాలం షరతులతో నడిచిన తెలుగుదేశం ఇవాళ నూటికి నూరు పాళ్లు ప్రజల్లో కలిసిపోవడానికి సిద్ధపడింది. ప్రజల్లో లేకపోతే ఎక్కడా మిగలలేమన్న సంగతి వాళ్లకు అర్థమయింది. ఒక వైపు కాంగ్రెస్ మరోవైపు తెలుగుదేశం రాజీనామాల్లో పోటీపడ్డాయి. ఇక ఉద్యమిస్తామని పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి.


అయినా సరే ఇదొక శుభ పరిణామం. ఇదొక బలం. రాజీనామాలకు అంతటి బలముంది కాబట్టే తెలంగాణలో నాలుగుకోట్లమంది ఏడాదికిపైగా ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రాజీనామాల కోసమే వందలాది మంది యువకులు కలతతో తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ రోజును చూడడం కోసమే జయశంకర్ సారు పదిరోజుల క్రితం వరకు పలవరిస్తూ ఎదురుచూశారు. ఎన్ని అనర్థాలకో, అనవసర చర్చలకో కారణమైన ఈ రాజీనామాలు ఆలస్యమైనా సరే అమరుల ఆత్మకు శాంతి చేకూరుస్తాయి. ఇంకా మిగిలి ఉన్న యుద్ధానికి కొత్త బలాన్ని ఇస్తాయి.తెలంగాణ ఉద్యమం లో ప్రజలు ఎప్పుడూ యుద్ధానికి భయపడలేదు. భూమికోసమైనా, భుక్తికోసమైనా, విముక్తికోసమైనా పోరాటమే మార్గమని నమ్మిన చరిత్ర తెలంగాణది. ఇవా ళ రాష్ట్రం కోసం సాగుతు న్న పోరాటంలో ప్రజలు తమతో ప్రజావూపతినిధులు కూడా నిలబడాలని కోరుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కలిసొచ్చే వాళ్లందరినీ అభినందించాల్సిందే. అలాగే అధికార మదాంధకారమత్తులై కలిసిరాని వాళ్లను జనంలోంచి వెలివేయాల్సిందే. అయితే అంతిమ విజయం అంత తేలిక కాదు. అది ఐక్య కార్యాచరణతోనే సాధ్యపడుతుంది. ఇప్పుడు పార్టీలు వేరైనా అంతా ప్రజల పక్షంలోనే ఉన్నామని నిరూపించుకోవాలి. ఉత్థానపతనాపూన్ని ఎదురైనా ఉద్యమ పతాకాన్ని విడువని జేఏసీ కొత్త కార్యాచరణ ప్రకటించింది. ఆ కార్యాచరణ అమలులో రాజీనామాలు చేసిన నేతలంతా ముందుండాలి. జేఏసీతో పాటు ఇప్పటిదాకా ఉద్యమరథ సారథ్యం చేస్తోన్న కేసీఆర్ కూడా ఈ కొత్త బలగాలను కలుపుకునిపోతే తెలంగాణకు బలం పెరుగుతుంది. ఇప్పుడు పదవులు లేవు. పార్టీల ప్రతిబంధకాలు కూడా ఉండకూదన్న విషయాన్ని అందరూ గమనించాలి.


తెలంగాణ నేతలను పార్టీ అధిష్ఠానాలు..బుజ్జగిస్తే వినకపోతే బెదిరించే అవకాశాలున్నాయి. అటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఆ పనిచేస్తారు. రాష్ట్రపతి పాలన అని తెలుగు మీడియా కూస్తూనే ఉంది. అది పదవులండవని బెదిరించడం కోసం చేస్తోన్న ప్రచారం అని గమనించాలి. అయినా రాష్ట్రపతి పాలన వస్తే కొత్తగా పోయే హక్కులేవీ లేవు. గత ఏడాదిగా తెలంగాణ పోరాటం ఎనిమిదో చాప్టర్ పాలనను అనుభవిస్తూనే ఉన్నది. రేపోమాపో పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతారు. స్పీకర్లు పిలిచి సమైక్య హితబోధనలు చేస్తారు. అందుకే అందరూ ఒక్కమాట గుర్తించుకోవాలి. తెలంగాణ సాధించేదాకా కలిసి పోరాడాలి. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అండతో ముందుకు సాగాలి. ఎన్నికలంటూ వస్తే.. సమైక్యంగా కలిసికట్టుగా ఎదుర్కోవాలి. వచ్చే ఎన్నికలను తెలంగాణలోనే..నిర్వహించుకోవాలి. విడిపోతే ఎక్కడికక్కడ బలితీసుకునే కసాయిలుంటారు. జాగ్రత్త!!