మంగళవారం, జులై 12, 2011

వాళ్ళు సరిహద్దులు గీస్తున్నారు..


ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సిన భద్రతా దళాలను పంపించింది. అవి ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని తెలంగాణ పల్లెల్లో నిఘా వేసి ఉన్నాయి. అయినా ఉస్మానియా విద్యార్థులకు ఇవేవీ కొత్త కాదు. ఇప్పుడే కాదు తొంభయేళ్ల కాలంలో అనేకసార్లు అక్కడి విద్యార్థులు ఈ సమాజంలో ఉన్న సరిహద్దుల్ని సవరించడమో, చెరిపేయడమో చేస్తూనే ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం అమెరికా నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ‘అన్నా.. ఉస్మానియా యూనివర్సిటిలో ఏం జరుగుతోంది?’అని అడిగాడు. అక్కడ అప్పటికి ఇంకా తెల్లారి ఉండదు. అతను అడిగిన తీరును బట్టి రాత్రంతా నిద్రపోయి ఉండడని అర్థమైంది. అతను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుని డిట్రాయిట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ ఒక్క హరే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ పిల్లలకు కంటికి కునుకురాని కాలమిది. రోజు రోజుకూ మారుతున్న రాజకీయాలు.. ఒకవైపు ఆశల్ని ,మరోవైపు ఆసక్తిని పెంచుతుంటే.. ఉస్మానియా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నా యి. ‘రావూతంతా టీవీల ముందు జాగారం చేస్తున్నాం, ఉన్నట్టుండి మళ్లీ మన ఛాన ళ్లు సమైక్యరాగం అందుకున్నాయి. ఉస్మానియా ఉడికిపోతుంటే అవి ఆంధ్రా వంటా వార్పును వడ్డిస్తున్నాయి. తెలంగాణ విద్యార్థుల మీద , ప్రజా ప్రతినిధులమీద,మొత్తంగా ప్రజలమీద సాగుతున్న ఈ నిర్భంధం తప్పని ఒక్క ఛాన ల్ కూడా చెప్పడం లేదు’ అని వాపోయాడు. అతనే మళ్లీ అన్నాడు ‘వీళ్లు మన తో యుద్ధానికి దిగినట్టుంది. కనీసం కోర్టులైనా జోక్యం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలుపాలని , కనీసం నిరసన తెలిపే హక్కుకూడా లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యమని’వాపోయాడు.అవును తెలంగాణపై ఈ ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది. 

ఉస్మానియా యూనివర్సిటి చుట్టూ మోహరించిన సైనిక బలగాలను, సాయుధ దళాలను చూసిన ఎవరికైనా అదే భయం కలుగుతోంది. తాము జీవన్మరణ సమస్యగా భావిస్తు న్న తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ‘గాంధేయమార్గం’లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఓయూ జేఏసీ ప్రకటించింది. అది నేరం కాదు. దీక్షకు దిగుతున్న వాళ్లెవరూ సంఘవ్యతిరేక శక్తులూ కాదు. అదే యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు. పరిశోధకు లు. దాదాపు రెండువేల ఎకరాల్లో ఉన్న విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తకు చదువుతో పాటు సామాజిక స్పృహనందించిన కాలేజీ ముందర వాళ్లు దీక్షకు దిగుతున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటిలో యూనివర్సిటి కోరితే తప్ప పోలీసులు జోక్యం చేసుకోరాదు. ఆ అధికారం వారికి లేదు. కానీ పోలీసులు ఆ దీక్షకు అనుమతి లేదని అడ్డుకున్నారు. యూనివర్సిటికి వెళ్లే దారుల్లో ముళ్ల కంచెలు నాటారు.

గడిచిన ఏడాదిన్న గా ఆమార్గాల వద్ద చెక్ పోస్టులు పెట్టి ఉన్నా ..,అక్కడికి నెల రోజుల క్రితమే సరిహద్దు భద్రతా దళాలను దించారు. దీక్షకు దిగిన వారిని దీవించి వద్దామని వెళ్లిన ఉద్యమ నేతలను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను నిర్భందించారు. తెలంగాణ జిల్లాల నుంచి వస్తోన్న విద్యార్థులను , యువకులను అరెస్ట్ చేసి భయోత్పాతం సృష్టించారు. బహుశ తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు రావాలంటే పాస్ పోర్ట్‌లు , వీసాలు కావాలేమో! ఈ పరిస్థితులు గమనించిన ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదనే అనిపిస్తోంది. గడిచిన ఏడాది రెండేళ్లుగా తెలంగాణపై నిరంకుశత్వమే రాజ్యమేలుతోంది. రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా శ్రీకృష్ణ కమిటి చేసిన ఎనిమిదో చాప్టర్ మనల్ని పాలిస్తోంది. ’తెలంగాణ దారికొచ్చే విధంగా అన్ని రకాల పద్ధతులు వాడాలని’ ఆ కమిటీ సూచించిన సంగతి మనకందరి కీ తెలిసిందే. కమిటీ చెప్పిన పొలిటికల్ మేనేజ్‌మెంట్ మొదలైందని, అది అమలైతే మళ్లీ మనకు మోసం తప్పదని గ్రహించిన ప్రజావూపతినిధులంతా రాజీనామాలు చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆమోదంలేని ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రాతినిధ్యంలేని పాలన అమలవుతోంది. మరోరకంగా చెప్పాలంటే ఏ వలస పాలకుల భాగస్వామ్యమైతే మనల్ని నిలువు దోపిడీ చేసి నిట్టనిలువునా ముంచిందో ఇప్పుడు ఆ పరిపాలనే నూటికి నూరుపాళ్లూ అమలవుతోంది. ప్రజల ప్రాతినిధ్యంలేని పాలన ఏ రకంగా కూడా ప్రజాస్వామ్యబద్ధం కాదు. అలాంటి పాలన బహిరంగంగానే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం ఒకవూపాంతం పట్ల నిర్బంధ పూరితంగా వ్యవహరించడం అధర్మం.
అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు నిజంగానే పత్రికలో, న్యాయవ్యవస్థనో ప్రజలకు అండగా నిలబడాలి. ఎందుకంటే మనదేశంలో ఆ రెండు వ్యవస్థలూ అటువంటి హోదాను అనుభవిస్తున్నాయి. అటువంటి పాత్రను గతంలో నిర్వర్తించిన ఘన చరిత్ర వీటికి ఉంది. కానీ తెలంగాణ విషయంలో ఈ రెండు వ్యవస్థలూ పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో గతంలో పత్రికలు ప్రజల పక్షం ఉండేవి. ప్రజల న్యాయమైన ఉద్యమాలను బలపరిచేవి.

తెలంగాణ ఉద్యమాన్ని కూడా మీడియా మొదటి దశలో నిర్ద్వందంగా సమర్థించింది. కానీ డిసెంబర్ తొమ్మిది తర్వాత మీడియా వైఖరి మారిపోయింది. మీడియాలో కూడా ప్రాంతీయ ధోరణి స్పష్టంగా బయటపడింది. ఎనిమిదో చాప్టర్ పేర్కొన్నట్టుగా ఒకటి రెండు ఛానళ్లు పత్రికలు మినహా తెలుగుమీడియా సీమాంవూధకు అనుకూలంగా ఉంది. తెలంగాణ వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోంది. ప్రపంచంలో ఈజిప్టులోనో, టునేషియా లాంటి దేశాల్లో ఎక్కడ పదిమంది గుమిగూడి నినదించినా ప్రజాస్వామ్యపు కమ్మదనాన్ని కథలుకథలుగా ప్రచురించి ప్రసారంచేసే తెలుగు మీడియా తెలంగాణలో ప్రజాస్వామ్యం ముళ్లకంచెల మధ్య మూలుగుతున్నా పట్టనట్టే ఉంటోంది. ఇక కోర్టుల సంగతి చెప్పేదేముంది. తెలంగాణ ఉద్యమంపై సాగుతోన్న అప్రజాస్వామిక అణచివేతను ఆపాలని ఈ ప్రాంతపు న్యాయవాదులంతా ఎడతెగని పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయదేవతను ప్రతిసందర్భంలో వేడుకుంటూనే ఉన్నారు. 

వారిపై వందలాది అక్రమ కేసులు బనాయిస్తోన్నా కనికరించే నాధుడే కనిపించ పైగా న్యాయమూర్తులు కూడా ప్రాంతీయ భావాలకు ప్రభావితులవుతున్నారని విమర్శలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన కేసులింకా పెండింగ్‌లో ఉన్నాయి. అయినా న్యాయవ్యవస్థను, ఆదేశాలను ప్రభుత్వం, పోలీసులు గౌరవిస్తారా?
ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించరాదని, ఆ యూనివర్సిటీ అధికారులు కోరితే తప్ప అక్కడ జోక్యం చేసుకోవద్దని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది. ఇదే మాట మానవ హక్కుల సంఘం పదేపదే చెబుతోంది. అయినా ఇవాళ వేలాదిమంది పోలీసులే కాదు దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన బిఎస్‌ఎఫ్ కమాండోలు ఉస్మానియా యూనివర్సిటీని ముట్టడించి ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలతో మోహరించారు. శత్రువులపైన తప్ప వాడటానికి వీలులేని మందుగుండును యూనివర్సిటీ హాస్టళ్ల మీద, విద్యార్థుల మీద వదులుతున్నారు. అవి రబ్బరు బుల్లెట్లా, బాష్పావాయువు గోళా ల అన్నది కాదు. అవి విద్యార్థులకే కాదు ఆ పరిసరాల్లో నివసించే ప్రజలకూ హానికరంగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్కడ సైన్యం వాడుతోన్న గోళాలు ప్రజలకు హాని కలిగిస్తాయని, జనంపైకి వాడకూడదని హెచ్చరిక ఉన్నప్పటికీ గత వారంరోజులుగా వాటితో వర్షం కురిపిస్తున్నారు. నిజానికి దీన్ని యుద్ధమని కూడా అనలేం. యుద్ధానికి ఒక నీతి ఉంటుంది. కొన్ని నియమాలుంటాయి. ఏ యుద్ధమైనా కొన్ని పద్ధతులను అనుసరిస్తుంది. ఇప్పుడు అక్కడ నిరాయుధలపై ఏ నియమమూ లేని దాడి, ఏ నీతి లేని అణచివేత సాగుతోంది. సరిగ్గా సరిహద్దులోపల శత్రు దేశం మీద వదిలినట్టుగా సరిహద్దు భద్రతా దళాలు వాడే గోళాలను మర ఫరింగులు అమర్చిన వాహనాలతో యూనివర్సిటీ లోపలికి కురిపిస్తున్నారు. అయినా ధైర్యం సడలని విద్యార్థులు ఇప్పుడు నిరాహారదీక్షలకు దిగారు. వారికి వారి ప్రాణాలకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ ప్రజానీకంపై ఉంది. ఇవాళ రాజీనామాలు చేసి చేతులు కడిగేసుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు ప్రజలు సిద్ధంగా సంఘటితంగానే ఉన్నారు. సంఘటితంగా లేనిది రాజకీయ నాయకులే. రేపటి తెలంగాణలో తమ ప్రాబల్యం కోసం ఇప్పుడే ఎవరి కుంపటి వాళ్లు రాజేసుకుంటున్నారు. 

తాము ప్రజల్లో ఉన్నామన్న ప్రచారం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలూ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మీతో ఉన్నారా లేదా అన్నది కూడా మీ మీ అధిష్ఠానాలు గమనిస్తుంటాయి. యాత్రలు, దీక్షలు కాదిప్పుడు కావాల్సింది. తదేకదీక్షతో ఉన్న తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు అండగా ఉండాలి. పోరాటంలో ఉన్న వారికి ప్రజాస్వామ్యంపట్ల, భారత రాజ్యాంగం పట్ల నమ్మకం సడలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయపక్షాలకు ఉందిపజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సిన భద్రతా దళాలను పంపించింది. అవి ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని తెలంగాణ పల్లెల్లో నిఘా వేసి ఉన్నాయి. అయినా ఉస్మానియా విద్యార్థులకు ఇవేవీ కొత్త కాదు. ఇప్పుడే కాదు తొంభయేళ్ల కాలంలో అనేకసార్లు అక్కడి విద్యార్థులు ఈ సమాజంలో ఉన్న సరిహద్దుల్ని సవరించడమో, చెరిపేయడమో చేస్తూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రపు సరిహద్దుల్ని గీసే పనికి పూనుకున్నారు. వారికి అందరం అండగా నిలబడదాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి