బుధవారం, జూన్ 02, 2021

  జైత్ర యాత్ర శుభాకాంక్షలు !!

 

“And, when you want something, all the universe conspires in helping you to achieve it.”

 



 ఈ సూక్తి వ్యక్తిగత జీవితంలో సరిపోకపోవచ్చుగానీ తెలంగాణా విషయంలో నాకు నూటికి నూరుపాళ్లు  నిజమైనట్టే అనిపిస్తుంది. తెలంగాణా ఆలోచన వచ్చింది మొదలు, ఆ ఆకాంక్ష మొగ్గతొడిగింది మొదలు అది నిజమై, నేనూ అందులో ఒక బాధ్యున్నై, భాగమై నడిచిన తీరు ఇవాళ ఒకప్పటి నా కల నెరవేరడమే కాకుండా, అనేకమంది ( కనీసం అందులో కొందరి) కలలను నెరవేర్చే  క్రతువులో నేనొక భాగం కావడం కించిత్ గర్వం, మరికించిత్ తృప్తిని కలిగిస్తున్నది. ఇది ఎవరో 'కుట్రచేసి'నా కలను నిజం చేసారేమోనని కూడా అనిపిస్తున్నది. బహుశా ఆ 'కుట్రదారుల్లో'  ఆచార్య జయశంకర్ గారు, గాదె ఇన్నయ్య గారు, కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు ఇంకా అనేకమంది నా  మిత్రులు,సహచరులు ఉన్నారని కూడా అనిపిస్తోంది. జూన్ 2 లాంటి ఒక చారిత్రక సందర్భాన నా ముప్పై ఐదేళ్ల తెలంగాణా తండ్లాటను  గుర్తుచేసుకోవడం, ఆ ప్రస్థానాన్ని పదుగురిలో ప్రస్తావించడం అవసరమని అనిపిస్తోంది. (లేకపోతే తెలంగాణా ఉద్యమంలో నేను లేనని అనేవాళ్ళు కూడా ఉండవచ్చు! ) అందుకనే అలా అనే అందరికన్నా ముందు నేనున్నానని చెప్పడానికి కాదుకానీ ముందునుంచీ ఉన్న అందరిలో నేనున్నానని ఈ ప్రకటన చేస్తున్నాను. నేను తెలంగాణా ఉద్యమం మీద రాయబోయే (?) సిరీస్ కు ఇది తొలిపలుకు అనుకోవచ్చు.

నాకు తెలంగాణా అస్తిత్వ ఆకాంక్ష ను పరిచయం చేసింది కమాల్ కరీంనగరి. మా కరీంనగర్ పట్టణంలో శాస్త్రీ రోడ్ లో నేను పని చేసిన జీవగడ్డ కార్యాలయానానికి సమీపంలో ఒక పురాతన, విశాల భవనం లో ఆయన ఒక లైబ్రరీ నిర్వహించేవాడు. అందులోనే నివసించేవాడు. అప్పటికే 1985 నాటికే 55-60 సంవత్సరాల వయసున్న అయన అవివాహితుడు. పరమ సెక్కులర్. నా అనేవాళ్ళు ఎవరూ లేని వాడు. రజాకార్ వ్యతిరేకి, అలాగని కమ్యూనిస్టు కాదు, కానీ తొలి దశ (1969) ఉద్యమకారుడు. ఆయన తరచూ మా ఆఫీసుకు రావడం, నేను అతని లైబ్రరీకి వెళ్లడం జరిగేది. ఆయన వసపిట్టలాగా కలిసిన ప్రతి సారీ తెలంగాణ ఆకాంక్షను వ్యక్త పరిచేవాడు.  చాలా మంది కరీంనగర్ పాత్రికేయులకు ఆయన సోది విసుగు పుట్టించేది. కానీ మా జీవగడ్డ కార్యాలయంలో అప్పటికే తెలంగాణా ఆకాంక్ష గుబాళిస్తూ ఉండేది. మా ఎడిటర్ భాగ్యనగర్ విజయ కుమార్ 1969 విద్యార్థి నాయకుడు. అది విఫలమైన తరువాత విప్లవోద్యమం లో చురుకైన పాత్ర అతనిది. నేను ఆయన స్థాపించిన జీవగడ్డ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ ని, మా ఉప సంపాదకుడు అల్లం నారాయణ, అలాగే కె ఎన్ చారి అనే విప్లవ రచయిత మాకు న్యూస్ ఎడిటర్ వీరంతా తెలంగాణ అభిమానులు కావడంవల్ల నాకు 1985-86 నాటికే తెలంగాణా పట్ల అవగాహన కంటే ఇష్టం ఆసక్తి ఉన్నాయి కాబట్టి నేను కమాల్ కరీంనగరి చెప్పేవి శ్రద్ధగా వినేవాడిని. జీవగడ్డ కార్యాలయానికి ప్రతిరోజూ పౌరహక్కుల కురువృద్ధుడు జాపా లక్ష్మా రెడ్డి, నారదాసు లక్ష్మణ రావు, నరెడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్ ఇట్లా 69 ఉద్యమ కారులు చాలామందే వస్తుండేవాళ్లు. వాళ్ళు మా పత్రికలో కాలమ్స్ కూడా రాస్తుండేవాళ్లు. అట్లా మా ఆఫీసులో తెలంగాణా వాతావరణం ఆవరించి ఉండేది.
సరిగ్గా అదే దశలో స్థానిక నాయకుడు అప్పటికే ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల జగపతిరావు (తదుపరి ఎన్నికల్లో గెలుపొందారు) ఉన్నట్టుండి తెలంగాణా సమస్యలు ప్రధానంగా జలవనరులు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద ఒక భారీ సదస్సు నిర్వహించారు. అందులో ప్రధాన వక్త డాక్టర్ కె జయశంకర్. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడం, ఆ తరువాత జయశంకర్ గారిని  ఇంటర్వ్యూ చేయడం నాకు అప్పగించిన బాధ్యత. అప్పటికి 'బాల కార్మికుడిగా'  ఉన్న నాకు జయశంకర్ గారి  ప్రసంగం వినడం, డెస్క్ లో రాసిచ్చిన ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయడం, ఆ పసితనపు పరిచయం, ఆరాధ్యభావం గా మారి ఆయనకు ఏకలవ్య శిష్యునిగా చేసేశాయి. మరోవైపు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు అప్పటికే మెట్ పల్లి నుంచి శాసన సభ్యుడిగా ఉండేవారు. ఆయన తరచూ గోదావరి జలాల వినియోగం గురించి ముఖ్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఆవశ్యకత గురించి తరచూ చెపుతుండేవారు. అట్లా నాకు, నాతోపాటు కరీంనగర్లో ఉన్న చాలామంది మిత్రులకు అప్పటికే తెలంగాణా అర్థమవుతూ వచ్చింది. ఒక రకంగా మలిదశ తెలంగాణా గురించి తొలిసారిగా ఆలోచించింది బహుశా కరీంనగరే అని నా అనుమానం!

 
1987లో కొన్ని పరిణామాల మూలంగా నా మకాం హైదెరాబాద్ నగరానికి మారిన తరువాత, ఉస్మానియా యూనివర్సిటీ లో ఉండడం మూలంగా అప్పటికే CEFL(ప్రస్తుతం ఇఫ్లూ) రిజిస్ట్రార్ గా ఉన్న జయశంకర్ గారిని తరచూ కలవడం, వినడం అర్థం చేసుకోవడం జరుగుతూ ఉండేది. ఆయన 1991 వరకు ఇఫ్లూ లో నే ఉన్నారు. ఆ తరువాత కాకతీయ విశ్వవిద్యాలయానికి వీసీగా వెళ్లారు. ఆ మధ్య కాలంలోనే కాళోజీ నారాయణ రావు, కేశవరావు జాదవ్, నాట్యకళ ప్రభాకర్, హరనాధ్ లాంటి తెలంగాణా ఆలోచన పరులతో చర్చలు జరుగుతో ఉండేవి. తరచుగా ఖైరతాబాద్ లోని ప్రభాకర్ ఇంటిలో సమావేశాలు జరుగుతుండేవి. ఆయన అప్పటికే తెలంగాణ ఇంఫెర్మాషన్ ట్రస్ట్ పేరుతో వివిధ ప్రచురణలు వేస్తూ భావవ్యాప్తిలో తలమునకలై ఉండేవారు. ఇదే గ్రూప్ నుంచి నారా కిషోర్ రెడ్డి ఉస్మానియా క్యాంపస్ లో తెలంగాణా స్టూడెంట్స్ ఫ్రంట్ పేరుతో, మిత్రులు మనోహర్ రెడ్డి, ఎస్ జగన్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ ఆర్గనైజషన్ పేరుతో విద్యార్ధి ఉద్యమాన్ని నిర్మిచారు. వీటి కార్యకలాపాల్లో నా సహాధ్యాయులు అనిల్ కుమార్, సంగిశెట్టి శ్రీనివాస్ చురుకుగా ఉండేవారు. అప్పటికే ( మొదటి నుంచి కూడా) పాత్రికేయ వృత్తిలో ఉన్న నేను ఈ కార్యక్రమాల్లో పరోక్ష భాగస్వామిగా ఉండేవాడిని. ఉస్మానియా లో ఎం ఏ, ఎంసీజే పూర్తి చేసాక యూజీసీ జేఆర్ ఎఫ్ రావడంతో, మా కజిన్ ప్రత్సాహంతో ఢిల్లీ వెళ్లి జె ఎన్ యు లో పీహెచ్దీ పూర్తిచేసుకోవాలని అనుకున్నాను, అడ్మిషన్ కూడా తీసుకున్నాను. కానీ 1992 జయశంకర్ సార్ ప్రొత్సాహంతో ఆయన వీసీగా ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం లో లెక్చరరుగా చేరాను.



అప్పుడు గాదె ఇన్నయ్య పరిచయం నా తెలంగాణా వాదానికి పదును పెట్టింది. జయశంకర్ సర్ సిద్ధాంత రూపకల్పన చేస్తే నా మటుకు గాదె ఇన్నయ్య దానిని ఎలా ఆచరణలోకి తేవచ్చో ప్రత్యక్షంగా చేసి చూపిన వ్యక్తి. 1992 నుంచి మొదలయిన మా స్నేహం, ప్రస్తానం 1997 భువనగిరి సభ నిర్వహణ దాకా కొనసాగింది. ఇన్నయ్య ఈ మధ్య కాలం లో విస్తుత స్థాయిలో భావ వ్యాప్తికి పూనుకున్నారు. అనేక కరపత్రాలతో పాటు తెలంగాణాలోని వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలు, వనరుల దోపిడీ మీద 'దగాపడ్డ తెలంగాణా' పేరుతో ఒక సీరియస్ సిరీస్ ను ప్రచురించారు. ఆయనకు చాలా కాలం నేను మిత్రుడు గుంటి రవి తొలి శ్రోతలం, అలాగే ఆయన ప్రచురణలు చాలా వరకు నేనే కాపీ రైటర్ను. చివరకు భువనగిరి సభ నిర్వహణలోనే కాకుండా ఆ సభలో కాళోజి, కేశవరావు జాదవ్,డా. జయశంకర్, ప్రొ. బీ జనార్దన్ రావు, కె. శ్రీనివాస్ తో పాటు నేను కూడా ఒక వక్తను. అప్పటికి వామపక్షాలు తెలంగాణా వాదాన్ని ఒక అపచారంగా ప్రచారం చేస్తున్నా ఇన్నయ్య 1997 నుంచి దాదాపు ఒంటి చేయితో అనేక చోట్ల సభలు, సదస్సులు నిర్వహించేవాడు.దాదాపు ప్రతిసభలో నేను ప్రధాన వక్తగా ఉండేవాడిని.  క్రమంగా ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు కూడా తెలంగాణా కోసం మాట్లాడడం మొదలుపెట్టాయి. 

 
 
అన్ని సభల్లో నేను ఖచ్చితంగా పాల్గొనడంవల్ల చాలావిషయాలు అర్థం చేసుకునే అవకాశం, అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చాయి. ఇదే క్రమంలో ఏర్పడ్డ 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల నేతృత్వంలో ఏర్పాటయిన సెంటర్ ఫర్ తెలంగాణా స్టడీస్ లో నేనూ భాగస్వామిని కావడం, డా. జయశంకర్, జాదవ్ గారు, ప్రొ. విశ్వేశ్వర్ రావు, ప్రొ. సింహాద్రి వంటి వారితో కలిసి పనిచేయడం తో పాటు అనేక 1997-2001 మధ్యకాలంలో తెలంగాణాకు సంబంధించిన వివిధ అంశాలమీద పత్రికలకు అనేక వ్యాసాలు రాసే .అవకాశం కలిగింది. ఇవి తరువాత నా సామాజిక సందర్భం పుస్తకంలో, తల్లడిల్లుతున్న తెలంగాణా (సింహాద్రి, జయశంకర్ సంపాదకత్వంలో) కొన్ని ప్రచురితం అయినాయి.

ఇక టీఆరెస్ ఆవిర్భావానికి ముందస్తుగా వచ్చిన తెలంగాణా జర్నలిస్టుల ఫోరమ్, సభలకు, తెలంగాణా విష్యావంతుల వేదిక, తరువాత తెలంగాణా జాయింట్ ఆక్షన్ కమిటి ఇట్లా వివిధ సంఘాలు ఊరూరా నిర్వహించిన వేలాది సదస్సులు, సభల్లో పాల్గొనే అవకాశం ఉద్యమం ద్వారా వచ్చింది.. అన్నిటికీ మించి భావవ్యాప్తిలో కీలకంగా మారిన తెలుగు మీడియాను వేదికగా చేసుకుని, అన్ని ఛానెల్స్ లో, ప్రతి రోజూ గంటల తరబడి తెలంగాణ వాదానికి ప్రతినిధిగా ఉండే అవకాశంకూడా దొరికింది. ఇట్లా మొత్తం తెలంగాణా వాదానికి ప్రతినిధిగా, ఉద్యమకారులకు, యువతకు విద్యార్థులకు మొత్తంగా తెలంగాణా ప్రజలకు చేరువయ్యే అవకాశం వచ్చింది. తెలంగాణలో పల్లె పల్లె తిరుగున్న ఉద్యమ కాలంలో మిత్రుడు వెంకట్ మారోజు "కుట్ర"  పన్ని అమెరికాకు ఆహ్వానించి అమెరికా కెనడా దేశాల్లో దాదాపు 20కి పైగా తెలంగాణా సభల్లో పాల్గొని వేలాదిమంది NRI తెలంగాణా బిడ్డలకు దగ్గరయ్యే అవకాశం కల్పించాడు.


అట్లా 1985 మొదలు 2014 దాకా దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలంగాణా నాకొక కల. అది సాకారమయ్యే ప్రతి దశలో నా కలం, గళం భాగంగానే ఉన్నాయి. సరే జూన్ 2 తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇక స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉందామనుకుంటే తెలంగాణా తొలి ముఖ్యమంత్రి గా కేసీఆర్ గారు ఆరేళ్ళ పాటు ఈ రాష్త్ర పునర్నిర్మాణంలో ముఖ్యంగా ఉద్యమ లక్ష్యాలలో కీలకమైన నియామకాలలో నన్ను భాగస్వామిని చేయడం నాకూ తెలంగాణాకు మధ్య జరుగుతూ వస్తున్నా 'కుట్రలకు' పరాకాష్ట. విచిత్రం ఏమిటంటే 1999 లో వార్త దినపత్రికలో మల్లేపల్లి లక్ష్మయ్య, రామచంద్రమూర్తి గారి ప్రోత్సాహంతో 'తెలంగాణా నిరుద్యోగం' అనే వ్యాసం రాసిన నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావడం నేను నమ్మని విధి పన్నిన మరో కుట్రగా భావించవచ్చేమో! అక్కడ అందరినీ మెప్పించడం ఎవరి తరమూ కాదు కాబట్టి ఇచ్చిన మేరకు న్యాయంగా ఉన్నామన్న తృప్తి మిగిలింది. 
 
ఇట్లా తెలంగాణా ఆలోచనలో, భావ వ్యాప్తిలో, ఉద్యమంలో చివరకు పునర్నిర్మాణంలో కూడా భాగస్వామిని కావడం నాకు వచ్చిన అవకాశం. అందుకు గర్వపడుతున్నా. అసలే ఆత్మగౌరవాలు దెబ్బ తింటున్న ఈ కాలంలో, ఈ ప్రయాణం గుర్తొచ్చి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉండడమే ఒక గౌరవంగా భావిస్తున్న.. ఈ ప్రస్థానంలో నాకు అడుగడుగునా చేయూతనిచ్చిన అందరికీ కృతజ్ఞతలు.

నా మొత్తం తెలంగాణా వాదంలో నాకు అత్యంత తృప్తినిచ్చిన ప్రసంగం నెల్లూరు లో  HMTV నిర్వహించిన దశ-దిశ లో మాట్లాడింది. ఒక మిత్రుడు ఆ సీడీ Edited version ఇచ్చారు. ఆ ప్రసంగపాఠాన్ని ఘంటాపథం లో పోస్ట్ చేస్తున్న. త్వరలో youtube లో కూడా అందుబాటులో ఉంటుంది.  

1 కామెంట్‌:

  1. చక్రపాణి గారూ,
    తెలంగాణ ఉద్యమం పైన మీరు సీరీస్ ప్రారంభించబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు! జైత్రయాత్ర శుభాకాంక్షలు బ్లాగ్ పోస్ట్ బాగుంది. సీరీస్‌కు ఇది నిజంగా ఒక మంచి ప్రారంభంగా నేను భావిస్తున్నాను. Happy Telangana Formation Day!
    - మనోహర్ చిమ్మని

    రిప్లయితొలగించండి