మిత్రులకు
మరోసారి తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
రామచంద్రమూర్తిగారు
జర్నలిజంలో నా గురువుల్లో ఒకరు. కె. శ్రీనివాస్ ద్వారా ఆంధ్రజ్యోతి నుంచి 1988 లో
(బహుశా) ఉదయం దినపత్రిక కు వెళ్లిన సందర్భంలో నన్ను బాగా ప్రోత్సహించిన సంపాదకుడు.
అంతేకాకుండా తెలుగు సంపాదకులలో మేధోవర్గానికి, తెగకు చెందిన వ్యక్తి. ఆయన నన్ను నెల్లూరు
లో జరిగిన hmtv దశ-దిశా కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించారు.అది సమైఖ్య ఆంధ్ర
పేరుతో ఒక నాటక సమాజం రక్తికట్టిస్తున్న కాలం. అందునా నెల్లూరు. అయినా వెళ్లాను. నాకు
ఇప్పటికీ గుర్తు పద్మవ్యూహంలో అభిమన్యుడి పరిస్థితి నాది. నన్ను అక్కడ కాపాడింది మా
పల్నాటి శ్రీరాములు ఆధ్వర్యంలోని దళిత సోదరులు, పౌరహక్కుల సంఘం మిత్రులు, డా. విజయ
కుమార్ లాంటి ప్రజాస్వామిక వాదులు. మాదాల జానకీరామ్ లాంటి సోషలిస్టులు. అలాగే ఆ ఉద్రిక్తతలను తగ్గించి కాపాడింది రామచంద్రమూర్తి గారు. అప్పటికే ఈ రచ్చ అంతా లైవ్ చూస్తూ అనేకమంది సంఘీభావంగా సందేశాలు పంపారు. వరంగల్ జిల్లా ఘనపూర్, ఖమ్మం జిల్లాలనుంచి కొందరు నెల్లూరుకు బయలుదేరుతున్నట్టు ఎస్సెమ్మెస్ లు పెట్టారు. సద్దుమణిగిందని చెప్పి వారిని వారించవలసి వచ్చింది.
నా
ప్రసంగం ఇలా సాగింది.
మీ అందరికి తెలుసు మహనీయులు పొట్టి శ్రీరాములు గారు ఎందుకు ఆత్మా బలిదానాన్ని చేసుకున్నారో. కేవలం తమ ప్రజల ఆత్మగౌరవం కోసం, తమ ఆత్మగౌరవం ఇతరుల కింద తాకట్టు పడకూడదనే తపనతో వారు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంద్ర ప్రజలను విముక్తి చేయడానికి ఆత్మబలిదానం చేసుకున్నారు. నిజంగానే ఆయన ఇవాళ యావత్ తెలంగాణా ప్రజలకు ఆదర్శ మూర్తిగా నేను భావిస్తున్నాను. తెలంగాణా ఉద్యమానికి పొట్టి శ్రీరాములు గారు సూర్తి ప్రదాత. ఆయన స్పూర్తితో మాత్రమే, ఆయన ఏ నినాదంతోనైతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని నిర్మించారో, ఏ కారణాలవల్లనైతే మద్రాస్ రాష్ట్రం విడిపోవాలని అనుకున్నారో మిత్రులారా సరిగ్గా అవే కారణాలతో ఇవాళ తెలంగాణా ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు. గతకొంత కాలంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. మీరంతా అనుకున్నట్టుగా, ఒక ప్రచారం జరుగుతున్నట్టుగా తెలంగాణా అనేది కేవలం కొంతమంది వ్యక్తులు, కొందరు రాజకీయ నిరుద్యోగులు, కొంతమంది అవకాశవాదులు తీసుకువచ్చిన ఆకాక్ష కాదు. ఆకాంక్ష అనేది ఎవరో సృష్టిస్తే వచ్చేది కాదు. ఆకాంక్షలను ఆర్గనైజ్ చేయలేము. అవి మన హృదయాల్లోనుంచి, మన అనుభవాల్లోంచి, మన ఆవేదనలోంచి తన్నుకు వస్తాయి. అటువంటి యాభైనాలుగు సంవత్సరాల అనుభవం, అటువంటి యాభై నాలుగు సంవత్సరాల అసమానతలు,అన్యాయాలు, అవమానాలు అంతకుమించిన నిర్వేదం మధ్య జీవించిన తమ జీవితకాలం నేర్పిన పాఠాలవల్ల ఇవాళ తెలంగాణా ప్రాంత విద్యార్థులు ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు.. ఆ మహోద్యమం ఇవాళ తెలంగాణా పది జిల్లాల్లో గ్రామ గ్రామాన విస్తరించి ఉన్నది. ఇప్పుడు గ్రామ గ్రామాన విస్తరించిన ఈ ఉద్యమానికి ఆజ్యం పోసింది మాత్రం ముమ్మాటికీ ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మిత్రులారా! మలిదశ ఉద్యమమని అంటున్న ఈ ఉద్యమం ఎలా మొదలయ్యింది, ఎలా విస్తరించిందో మీకు తెలియంది కాదు. తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా 2001 లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్)
తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరుతో ఒక ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటికే విద్యార్థులు, విద్యావంతులు, మేధావుల్లో తెలంగాణాకు సంబంధించిన బలమైన
ఆకాంక్ష ఉన్నది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాసంఘాలు, సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక రకంగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ఆఖ్ప్పటికే ఒక సిద్ధాంత భూమిక ఉన్నది. దీనిని సాకారం చేసుకునేందుకు ఒక రాజాకీయ పార్టీ అవసరమని కేసీఆర్ భావించారు. ఆ అవసరం రీత్యా తెరాస ను ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీ వేదికగా ప్రజలను సమీకరించడం, తద్వారా తెలంగాణా భావజాలాన్ని విస్తృత జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడం, ఉద్యమాన్ని నిర్మించడం, పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతుల్లో వివిధ కార్యక్రమాలు, పద్ధతుల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం
రాజకీయ పక్షాల మీద ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం ఆయన తన కార్యాచరణగా పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు పార్లమెంటు ఆమోదం ద్వారా మాత్రమే జరుగుతుంది అంటే భారత దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు ముఖ్యంగా దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణా డిమాండును అంగీకరించాలి. అందుకే ఆయన వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించే పని పెట్టుకున్నారు. 2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు బతికి ఉన్న స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి ఆ ప్రజాస్వామ్య ఆకాంక్షను గుర్తించి, తెలంగాణా ప్రజలను గౌరవించి, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెరాస తో ఎన్నికల ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో స్పష్టంగా రాసుకుంది. కేవలం మానిఫెస్టోలో రాసుకోవడమే కాదు ఆ పార్టీ అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తన ఎన్నికల ప్రచారంలో కనీసం ఐదు బహిరంగ సభల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఆమె పదేపదే 'మాకు తెలంగాణా ప్రజల గుండెచప్పుడు తెలుసు, వాళ్ళ ఆకాంక్ష తెలుసు ఆ ప్రజాస్వామిక ఆకాంక్షను గౌరవిస్తాం'
అని చెప్పి ఓట్లు అడిగారు.ఆ మాటమీది నమ్మకం, ఆ హామీ పట్ల విశ్వాసం ఉండబట్టే తెలంగాణా ప్రజలు అప్పటివరకు ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి రాజశేఖర్ రెడ్డిగారికి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.ఆ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా మీకు కూడా తెలుసు.
తెలంగాణా సాధనలో రాజకీయ వ్యవస్థమీద మరింత ఒత్తిడి పెంచడం కోసం 29 నవంబర్ 2009 న కెసిఆర్ నిరాహారదీక్ష చేపట్టారు. కేవలం నిరాహారదీక్ష తో తెలంగాణా వస్తుందని ఎవరూ అనుకోలేదు. సమస్య అంత తీవ్రమైంది కాదని, కేసీఆర్ నిరాహార దీక్ష విరమిస్తారని ఇక్కడి ఎంపీలు సోనియా గాంధీకి కూడా చెప్పినట్టు గౌరవ పార్లమెంటు సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు. అది నిజం కూడా! వాళ్ళు అలాగే చెప్పి నమ్మించ చూసారు. అలాగే కేసీఆర్ నిరాహారదీక్ష విరమించినట్టు కూడా మీడియా లో కథనాలు వచ్చాయి. మూడు రోజుల్లోనే నిమ్మరసం తాగాడని, దీక్ష ముగిందని వార్తలు రాశారు. కానీ ఏమయ్యింది. అప్పటివరకు కేసీఆర్ చేతిలో ఉన్న ఉద్యమం కాస్తా ప్రజల చేతుల్లోకి వెళ్ళింది. మూడు రోజుల లోపే ఉద్యమం ఉధృతమయ్యింది. ప్రజలందరూ పెద్దఎత్తున స్పందించి, విద్యార్థులు పెద్దఎత్తున తిరుగుబాటు చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
ఉద్యమాన్నివిద్యార్థులు తమచేతుల్లోకి తీసుకుని ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే కేసీఆర్ తన దీక్షను ఆసుపత్రిలోనే కొనసాగించారు. ఈ దశలో డిసెంబర్ 9వ తేదీన అసీంబ్లీ ముట్టడికి పిలుపులునిచ్చారు. పెరుగుతున్న ఉద్యమ ఉధృతి
ఒకవైపు,రోజురోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి మరోవైపు
ఒత్తిడిని పెంచాయి.అలాగే అప్పటికి రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య రాత్రికి రాత్రి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజలు
నూటికి నూరు మంది ఎందుకు తెలంగాణా
కోరుకుంటున్నారన్నది విజ్ఞులు ఆలోచించాలి.
రాష్ట్రంలో తెలంగాణా ప్రజలు ఆంధ్రా ప్రజలతో ఎందుకు ఉండలేమని అంటున్నారు అనేవిషయం ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణలో ఒక అపనమ్మకం, అభద్రత, భయం ఆవరించివున్నాయి. ఆ భయం, ఆ అపనమ్మకం వల్లనే తెలంగాణలో యువకులు విద్యార్థులు ఆత్మహత్యలకు దిగుతున్నారు. ఉద్యమం మొదలయిన నాటినుంచి ఇప్పటివరకు దాదాపు 250 మంది పిట్టల్లా రాలిపోయారు, ఆత్మ హత్యలకు పాల్పడ్డారు.తెలంగాణా ఉద్యమానికి అంబంధించి మొదటి నుంచీ ఇటువంటి రక్తతర్పణ కోరుకుంటూనే ఉంది. చరిత్ర పొడుగునా ఈ ఉద్యమం మా ప్రజల నెత్తుటితో తడిసిపోయింది. ఉద్యమం తలెత్తినప్పుడల్లా అణచివేత తప్పడంలేదు. గతంలో ప్రభుత్వాలు తెలంగాణా అడిగినందుకు కాల్చిచంపారు. ఇప్పుడు ప్రజలు తమంతట తాము కాల్చుకుని ఆత్మాహుతులకు పాల్పడుతున్నారు. ఈ హింస ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా మొదలయ్యింది కాదు.ప్రజలు ఈ హింసను, ఈ పీడనను, ఈ అణచివేతను గడిచిన యాభై సంవత్సరాలుగా భరిస్తూనే వస్తున్నారు. తెలంగాణా ఉద్యమం తలెత్తినప్పుడల్లా అయితే ప్రభుత్వకాల్పుల్లో చనిపోవడంతో, లేకపోతే ఆత్మహత్యల పాలుకావడమో మాకు తప్పడంలేదు. ఈ హింస ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొత్తగా ఈ ఉద్యమంతోనే మొదలయ్యింది కాదు మిత్రులారా అది మా జీవితాల్లో అంతర్భాగం అయిపొయింది. దాదాపుగా గడిచిన యాభై ఏళ్లుగా ఈ పరిస్థితిని, ఈ హింస, ఈ పీడన, ఈ దోపిడీని భయాందోళనలనుతెలంగాణా ప్రజలు భరిస్తూనే వస్తున్నారు. ఈ ఐదు దశాబ్దాలుగా ఇవన్నీ తెలంగాణా జీవోతాల్లో అంతర్భాగం అయిపోయాయి. ఈ యాభై సంవత్సరాల్లో ఉద్యమం వివిధ దశల్లో వచ్చింది.
తెలంగాణా ఉద్యమం నిజానికి సజీవంగా ఉన్నది. ప్రజల అంతరంగాల్లో అంతర్లీనంగా ఉన్నది. వివిధ సందర్భాల్లో బహిరంగంగా, బలంగా వ్యక్తమవుతున్నది. ఇట్లా ఏ రూపంలో వ్యక్తమైనా దాన్ని ఇంతకాలం హింసతోనే, అణచివేస్తూ వస్తున్నారు. తెలంగాణా ఆకాంక్ష వివిధ రూపాల్లో వ్యక్తమైనప్పుడు ఆ రూపాలను నిషేదించారు
ఆ ఉద్యమాలలో ఉన్నవాళ్ళను ఎన్ కాంటర్లు చేసి చంపడం, గుర్తుతెలియని వ్యక్తుల చేత దాడులు చూపించడం, హత్యలకు పాల్పడడం చేశారు. ఆ ఆకాంక్షను వ్యక్తం చేసిన వాళ్ళను నిర్బంధించడం, కేసులు పెట్టడం కూడా చూసాం. ఇప్పుడూ అదే చేస్తున్నారు. మొత్తం తెలంగాణాను ఇవాళ ముళ్లకంచెల మధ్య నిర్బంధించి ఉంచారు. ఒకవైపు ప్రజలు ప్రజాస్వామికంగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వమే హింసను ప్రయోగిస్తున్నది. అది మనందరం చూస్తున్నాం.
ఇవాళ పెల్లుబికిన ఈ ఉద్యమం చరిత్ర నేర్పిన పాఠం, చరిత్రలో జరిగిన అసమానతలు, దోపిడీ, అణచివేతల పర్యవసానం. ఇదొక ప్రజా ఉద్యమం. విద్యార్థుల నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో పల్లెపల్లె కదులుతున్నది. యువకులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, సింగరేణి
కార్మికులు ఇప్పుడు సైరన్ మోగించారు. మీరు ఎన్ని అరుపులు అరిచి గొంతులెంత చించుకున్నా లాభం లేదు. ఈ సారి తెలంగాణా గెలిచి తీరుతుంది.
మిత్రులారా దయచేసి ఒక్కటి గమనించండి. మానవ సంబంధాల్లో బలవంతం పనికిరాదు. బలవంతంగా మనం సమైక్యంగా ఉండలేం. ఆ అవసరం కూడా లేదు.
తెలంగాణా విడిపోయినంత మాత్రాన అది తెలుగురాష్ట్రం కాకుండాపోదు. మనకు కూడా రెండు రాష్ట్రాలు ఉంటె మంచిదే కదా ఆలోచించండి. హిందీ మాట్లాడే ప్రజలు ఈ దేశంలో కనీసం ఐదారు
రాష్ట్రాల్లో ఉన్నారు. అలాగే
తమిళ భాష మాట్లాడేవాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు.
కాబట్టి
భాషాసమైఖ్యతకు భంగం వాటిల్లదని నేను భావిస్తున్నాను.
తెలుగువారి మధ్య బలవంతపు సమైక్యత కంటే, భావ సమైక్యత మంచిదని నేను భావిస్తాను. మేం ఒకటే చెపుతున్నాం అన్నదమ్ముల్లా అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం!
జై తెలంగాణా !!
మొదట దాదాపు అరగంటపాటు మాట్లాడే అవకాశం వచ్చింది. నేను చెప్పాలనుకున్నది చెప్పినతర్వాత మరో నాలుగు గంటలపాటు చర్చ జరిగింది. చర్చలో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి, ఆనం వివేకానంద రెడ్డి, తెలుగు దేశం నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాదాల జానకిరామ్నె,పలువురు శాసన సభ్యలు, నాయకులు మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు మాట్లాడారు. సమైఖ్యఆంధ్ర సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కొందరు ఆవేశ పడ్డాడు, మరికొందరు ఉద్రేకపూరితంగా ఊగిపోయారు. ఒకరిద్దరు మినహా రాజకీయ నాయకులెవరూ తెలంగాణా ఏర్పాటును అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. అయినా విభజనకు పూనుకుంటే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారు. మరోవైపు నెల్లూరు కార్యక్రమానికి ప్రజాసంఘాలు, మానవాక్కులు పౌరహక్కుల సంఘాలు, దళిత బహుజన సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారు తెలంగాణా అనేది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష అని, రాజ్యాంగబద్ధమైన హక్కు అని వాదించారు.
నిజానికి నా ప్ప్రసంగం నిరాటంకంగా సాగడానికి వాళ్ళే కారణం సమైఖ్యఆంధ్ర పేరుతో కొందరు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ మొదట మాట్లాడింది కాకుండా చర్చలో వ్యక్తమైన అభ్యంతరాలు, అభిప్రాయాలకు సమాధానం చెప్పే అవకాశం మళ్ళీ చివరలో ఇచ్చారు.
మిత్రులారా! చాలా సేపు, చాలా అంశాలమీద చర్చ జరిగింది. చాలామంది పెద్దలు మాట్లాడారు.
మీ అందరి ప్రసంగాలు విన్న తరువాత
ఈ కార్యక్రమంలో వ్యక్తమైన అభిప్రాయలు, వ్యక్తుల ప్రసంగాలు విన్నతరువాత రాష్ట్ర విభజనకు సంబంధించి వాతావరణం పూర్తిగా అర్థమయ్యింది. విభజన విషయంలో ఆంధ్రా ప్రాంతంలో ప్రజలకు, రాజకీయనాయకులకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు, ప్రజాసంఘాలు తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకుంటుంటే, రాజకీయనాయకులు మాత్రం అపోహలు సృష్టిస్తున్నట్టు స్పష్టంగా అర్థమౌతోంది.
రాజకీయ నాయకులు తమ స్వార్థప్రయోజనాలకోసం మాత్రమే తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనేది నా అభిప్రాయం. నిజానికి కొందరు నాయకులు, మంత్రులుగా, శాసన సభ్యులుగా పనిచేసినవాళ్లు, చేస్తున్నవాళ్లు పదిమందిని వెంబడేసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడిన విధానం, ప్రవర్తించిన తీరు బాధ కలిగించింది.
( రాజకీయ నాయకుల అనుచరులు అల్లరి చేయడం మొదలుపెట్టారు. ఈ లోగా నిర్వాహకులు కె
రామచంద్ర మూర్తిగారు కలుగజేసుకుని రాజకీయ నాయకుల ప్రస్తావన లేకుండా మాట్లాడవలసిందిగా కోరారు.)
రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రస్తావన లేకుండా ప్రసంగించడం సాధ్యం కాదు. ఎందుకంటే అడ్డు తగులుతుంది, అభ్యంతర పెడుతున్నది, అపోహలు సృష్టిస్తున్నది రాజకీయ నాయకులే తప్ప ప్రజలుకాదు. ఇక్కడ వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రస్తావించిన విషయాలు విన్న తరువాత నేను కొన్ని విషయాలపాలట వివరణ ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళు మాట్లాడిన విషయాల్లో అనేకమైన అసత్యాలు, అర్థసత్యాలు ఉన్నాయి. వాటిని వివరించి చెప్పే అవకాశం నాకు కావాలి. సమస్య రాజకీయమైనది కాబట్టి నేను ఖచ్చితంగా రాజకీయంగానే మాట్లాడుతాను. తెలంగాణా రాజకీయాలపై నేనొక స్పష్టమైన రాజకీయ ప్రకటనకూడా చేయదలచుకున్నాను.
నేను నెల్లూరు దాకా వచ్చిందే మాట్లాడడానికి. మా మనోగతం చెప్పడానికి. ఎవరో అభ్యంతరపెడితే ఆగే రకం కాదు నేను.బెదిరిస్తే భయపడే రకంకూడా కాదు. మాట్లాడడానికే
నేను ఇక్కడిదాకా వచ్చాను.
కాబట్టి మాట్లాడవలసిన బాధ్యత నామీద ఉంది. రాజకీయ నాయకులు చేసిన కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధించాయి. దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. వివరణ ఇవ్వనివ్వండి. నిజమేదో చెప్పనివ్వండి.
ఒకటి తెలంగాణా రాష్ట్ర సాధనకోసం విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలపై వెకిలిగా మాట్లాడారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చాలా వెకిలిగా మాట్లాడారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ మాయకుడు, శాసన సభకు సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి
(ఆనం వివేకానందరెడ్డి) అలా దిగజారి మాట్లాడడం బాధ కలిగించింది. ఇది దుర్మార్గం. చావును కూడా హేళన చేయడం ఏమిటి? ఇటువంటి పరిస్థితి ఎవరి ఆత్మహత్యలకైనా రాకూడదు. చివరకు రాజశేఖర్ రెడ్డి కోసం చనిపోయినారని చెపుతున్నవారి ఆత్మహత్యలనైనా సరే రాకూడదు . తెలంగాణలో యువకులు, విద్యార్థులు ఆత్మాహుతులకు పాల్పడుతున్నారు.
జైతెలంగాణా అని రాసి మరీ చనిపోతున్నారు. పరుగెత్తుకుంటే వచ్చే రైళ్లకు ఎదురెళ్లి జైతెలంగాణా అని నినదిస్తూ ప్రాణాలువదులుతున్నారు. కొండలు, గుట్టల మేడిన్ నుంచి దూకేసి మరీ తమ నిరసనను ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకువచ్చింది. ఇదిగో ఇటువంటి బాధ్యాత రాహిత్యంతో, నిలకడలేని తనంతో, జవాబుదారీ తానంలేని రాజకీయ నాయకత్వం, పరిపాలనావ్యవస్థవల్ల వచ్చింది. ఒక భయంలోంచి, ఒక ఆత్రుతలోంచి ఒక హామీ ఇవ్వలేని సమాజంలోంచి ఈ పరిస్థితి వచ్చింది. దీనికి ఖచ్చితంగా మనందరం బాధ్యత వహించాలి. వీటిని ఆపవలసి బాధ్యత ఖచ్చితంగా మనందరిమీద ఉంది. కానీ మన నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో, కించపరిచే విధంగా మాట్లాడారు. ఇది మంచిది కాదని మనవి చేస్తున్నాను.
మిత్రులారా మాట్లాడిన వాళ్లలో కొందరు తెలిసో , తెలియకో లేక కావాలనో కొన్ని పొరపాట్లు మాట్లాడారు. తప్పుడు సమాచారం ఇచ్చారు
ఒకాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణా వాళ్ళే ఇరవై ఐదేళ్లు పరిపాలించారని చెప్పారు. ఆయన రాజకీయాలు తెలియని మామూలు మనిషైతే పట్టించుకోవసరం లేదు. కానీ దాదాపు ఇరవై ఐదేళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. నిజమేమిటంటే ఈ అరవై ఏళ్ళ ఆంద్ర ప్రదేశ్ చరిత్రలో తెలంగాణా నాయకులు ముఖ్యమంత్రులుగా కనీసం ఆరేళ్లుకూడా అధికారంలో లేరు. అయిదున్నర సంవత్సరాలు మించి పరిపాలించలేదు. దయచేసి సవరించుకోవలసిందిగా కోరుతున్నాను. ఇది మనం చెప్పినంత మాత్రాన జరిగిపోయే విషయం కాదు, ఇది చరిత్ర, దాన్ని వక్రీకరించడం తగదు.
ఇకపోతే రెండో చారిత్రక వక్రీకరణ పొట్టిశ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి. అయ్యా పొట్టి శ్రీరాములుగారు అమరుడయ్యింది ఆంద్ర రాష్ట్రం గురించి. ఆయన ఆత్మార్పణం వాళ్ళ ఏర్పాటయింది కర్నూల్ రాజధానిగా ఆంద్ర రాష్ట్రం తప్ప హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కాదు. కానీ సమైక్యవాదం పేరుతో ఇక్కడ మాట్లాడిన వాళ్ళు తెలంగాణా రాష్ట్రం పొట్టిశ్రీరాములుకు గారి త్యాగానికి విరుద్ధం అంటున్నావారు. అది తప్పు. పొట్టి శ్రీరాములుగారంటే తెలంగాణా ప్రజలకు కూడా అభిమానం, గౌరవం ఉన్నాయి. మా ప్రాతంలో ఊరూరా ఆయన విగ్రహాలున్నాయి. ఆయనకు మెం వ్యతిరేకం కానీ కాదు. నిజానికి మా ఆకాంక్ష కూడా ఆయన ఆశయాలకు అనుగుణమనదేనని మీకు చెప్పదలిచాను. మెం ఆయన నుంచి స్ఫూర్తిపొందామని మరోసారి చెపుతున్నాను.
ఇక భాష గురించి కూడా చాలామంది మాట్లాడారు. కేసీఆర్ గారి భాష బాగాలేదని అంటున్నారు. అయినా ఇది కొత్తకాదు. తెలంగాణాను భాష పేరుతో వెక్కిరించడం కొత్తకాదు. నిజంగానే కెసిఆర్ భాష, మాట్లాడిన పద్ధతి బాగాలేకపోతే ఆయనతో చెప్పండి. మీరిద్దరూ (సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి ) ఆయనతో చాలాకాలం కలిసి పనిచేసినవాళ్ళేకదా. సమస్య అదికాదు. కెసిఆర్ మాట్లాడిన భాషను ఎత్తిచూపి సమైక్యవాదాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఇది పద్ధతికాదు. నిజంగానే కెసిఆర్ మిమ్మల్నో మీ భాషణో అవమానిస్తే నేనుకూడా వారిని సమర్ధించాను. ఎవరైనా సరే ఇతరులను కించపరచకూడదు.
అవమానించడానికే వీలులేదు. మీరు ఒక విషయం గమనించండి. మీరు సాఫ్ట్ గా ఉండే భాషలోనే మాట్లాడినప్పటికీ మీ భావాలు ఎంత హార్స్ గా ఉన్నాయో కూడా చూడండి. నిజానికి భాషకంటే భావమే ప్రమాదకరం
మీరే గమనించండి. కేసీఆర్ గారి భాషగురించి అభ్యంతరం వ్యక్తం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగారు ఇందాకే ఈ సభ నుంచి వెళ్లిపోయారు. పోతూ పోతూ వారు ఏం మాట్లాడారు. రాష్ట్ర విభజన ఆలోచన మానుకోకపోతీ ఈ రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. ఏం భాష అది? ఎవరు అగ్నిగుండం సృష్టిస్తారు? ఎందుకు అగ్నిగుండం చేస్తారు>?
ఇదే నెల్లూరులో ఉంది అడుగుతున్నాను, ఎవరు అగ్నిగుండం చేస్తారు, అందులో ఎవరిని సమిధలు చేయదలుచుకున్నారు?
అయన వెళ్లేముందు నాతో మాట్లాడారు, తాను ఇక్కడినుంచి చెన్నై వెళ్లి విమానంలో హద్రాబాద్ వెళ్తున్నట్టు చెప్పారు. నిజంగానే అగ్నిగుండం చేసేవాడే అయితే హైద్రాబాద్లో అడుగుపెట్టగలడా అని నేను అడుగుతున్నాను. ( సభలో అల్లరి, అరుపులు కేకలు, ఒకతను కుర్చీ లేపి నా పైకి విసిరే ప్రయత్నం చేశారు, పక్కనే ఉన్న కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాటారించారు) మళ్ళీ చెపుతున్నాను, మీరు నన్ను ఆపేస్తే ఆగే ప్రసక్తి లేదు.
నన్నేమీ చేయలేరు, నేను ఒక్కడినే ఉండవచ్చు, కానీ హైద్రాబాద్లో, తెలంగాణలో మీవాళ్లు మీ సోమిరెడ్డి తో సహా చాలామందే ఉన్నారు. భాష సంస్కారం గురించి మాట్లాడిన వాళ్ళు, ఎత్తిచూపినవాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలి. ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ మాట్లాడింది తప్పయినప్పుడు, ఆయన మాటలను తప్పుపడుతున్న సోమిరెడ్డి మాట్లాడింది తప్పున్నర అవుతుంది. ఎవరుమాట్లాడిందయినా తప్పే అనుకున్నప్పుడు దయచేసి ఆ మాటలను మీరుకూడా ఖండించాలి.
ఇకపోతే మరో విషయం తెలంగాణా ఒక ప్రజాఉద్యమం దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. అది దొరల ఉద్యమమని, రాజకీయ నిరుద్యోగులైన దొరలూ రాజేసిన తాత్కాలిక ఉద్యమమని, తెలంగాణా గురించి మాట్లాడుతున్నవాళ్లంతా దొరలకు ఊడిగం చేసే బానిసలని అంటున్నారు. రాష్ట్రం విడిపోతే దొరల తెలంగాణా అవుతుందని బెదిరిస్తున్నాన్రు. మరో వైపు మీరే తెలంగాణా ఉద్యమం నక్సలైట్ల చేతుల్లో అంటున్నారు. మమ్మల్ని నక్సలైట్లని, తీవ్రవాదులమని అంటున్నారు. మేము ఏదో ఒకటే కావాలి, అయితే దొరల తొత్తులమైనా కావాలి, లేకపోతే నక్సలైట్లమైనా కావాలి. రెండూ కాలేము. ఏకకాలంలో భూసమయములుగా, నక్సలైట్లుగా ఉండలేము. అయినా మిత్రులారా మీకు తెలియంది కాదు. తెలంగాణా దొరల చేతుల్లో లేదు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దొరలను ఎదిరించి నిలబడిన చరిత్ర తెలంగాణాది. ఇదే నెల్లూరు జిల్లాకు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో దొరలమీద మొదలయిన యుద్ధం
కొనసాగుతూనే ఉంది.
ఇప్పటివర్కకు దొరలమీది పోరాటం రూపాలు మారిందేమో కానీ చరిత్రలో ప్రాతినిధ్యం గడించిన కాలమంతా సంఘర్షణలోనే సాగిపోయించి. కాబట్టి దొరలతెలంగాణా అయ్యే ప్రసక్తే లేదు. మెం దొరలకు తొత్తులమయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక నక్సలైటలంటారా, అసలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్లే లేరని స్వయంగా మీ నాయకుడురాజా శేఖర్ రెడ్డి గారు ఏనాడో ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి
హోదాలో,ఢిల్లీలో జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి. రాష్టంలో నక్సలైట్లను సమగ్రమైన వ్యూహంతో
సమూలంగా అణచివేశామని చెప్పడమే కాకుండా నివేదిక కూడా ఇచ్చారు. కాబట్టి తెలంగాణా ఇస్తే లేని నక్సలైట్లు ఎలా రెచ్చిపోతారా నాకతే అర్థం కావడం లేదు. నిజానికి నక్సలైట్లు ఉన్నారు. వారు మీ ప్రాతంలోని నల్లమలలో ఉన్నారు. మీ ప్రకాశం జిల్లాలో వారి కార్యకలాపాలు ఉన్నాయి. మీ ఆంధ్రా ఒరిస్సా బోర్డుర్ లో ఉన్నారు. వారి కార్యకలాపాలన్నీ మీ అడవుల్లో,ఆదివాసీ ప్రాంతాల్లో, విశాఖ ఏజెన్సీ లో
ఉన్నాయి. అయినా నక్సలిజం పుట్టింది తెలంగాణలో కాదు, మీ ఆంధ్రా ప్రాంతంలో, మీ సికాకుళంలో. దోపిడీ ఉన్నచోట నక్సలిజం ఉంటుంది. నక్సలైట్ల హింసా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద ఇదే నెల్లూరు లో నక్సలైట్ల దాడులు జరిగాయి. అంటే నక్సలైట్లు ఎక్కడ ఉన్నట్టు.
మరోవిషయం తెలంగాణలో నక్సలైట్ల కార్యకలాపాలు ఆగిపోయాయని క్రైమ్ రికార్డ్స్ చెపుతున్నాయి. గత ముప్పై సంవత్సరాల నేర చరిత్రలో 2008-2009 రెండు సంవత్సరాలు అత్యంత తక్కువ హింసాత్మక సంఘటనలు జరిగినట్టు ప్రభుత్వమే చెపుతోంది. ముప్పైఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువ హింసాత్మక సంఘటలు జరిగిన తెలంగాణను ఎందుకు మీరు నక్సలైట్ల ప్రభావిత ప్రాతం అంటున్నారు. ఎందుకు మీరు తెలంగాణా నక్సలైట్ల రాష్ట్రం అవుతుంది అంటున్నారు. మీరు ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా నక్సలైటలంటే మీకు భయమేమో, మాకు కాదు. అయినా నక్సలైట్లు ఉండకూడదని కాదు కోరుకోవాల్సింది, నక్సలైట్లు అవసరం లేని, వారి అవసరం రాణి సమాజంఉండాలని. ఎక్కడైతే సామాజిక అసమానతలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా నక్సలైట్లు ఉన్నట్టు. మనం చేయాల్సింది, నక్సలైట్లను నిర్మూలించడం కాదు, సమస్యని, అసమానతలను నిర్మూలించడం అని నేను భావిస్తున్నా.
ఆ అవగాహన లేకపోవడంవల్ల కదా,నక్సలలిజాన్ని ఓకే సమస్య అనుకుంటున్నాం.
ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడుతూ మా పోలీసులు మీ తెలంగాణా నక్సలైట్ల చేతిలో, మందుపాతరాల్లో చనిపోయారని అన్నారు.
ఇది చాలా దారుణమైన
విషయం, అలా మాట్లాడడం అన్యాయం
అలా అనుకుంటే తెలంగాణా పోలీసులు కూడా ఇక్కడ నల్లమలలో చనిపోయి ఉంటారు. పోలీసులేకాదు, నక్సలైట్లు, ఉద్యమకారులు
అక్కడివాళ్లు,ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ చనిపోయారు. నల్లమలలో గడిచిన పదేళ్లలో చనిపోయినావాళ్ళను ఎవరో లెక్క చూడండి.. ఉద్యమాల చరిత్రలో ఇది సర్వసాధారణం. సుదరయ్య గారు నెల్లూరునుంచి హైదరాబాద్ వచ్చి తెలంగాణా ఉద్యమం నిర్మించారు. కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి ఎక్కడినుంచి వచ్చారు. వారి నాయకత్వంలో సాగిన పోరాటాల్లో ఎంతో మంది అమరులయ్యారు. అయినాఉద్యమాల గురించి, అమరత్వాల గురించి మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు.
మిత్రులారా ఇక హైదరాబాద్ విషయంలో కూడా వక్తలు
అనేక వక్రీకరణలు చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులుఅనేక అపోహలు కలిగిస్తున్నారు.హైదేరాబద్ ప్రస్తుత
జనాభా 80 లక్షలు
అందులో 40 లక్షలమంది ఆంధ్రా వాళ్ళు ఉన్నారని మీరే అంటున్నారు. నిజానికి 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు శాసన సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 20, 30 వేలమంది మా ప్రజలు కూడా ఉన్నారని చెప్పారు.
అంటే కేవలం నలభై ఏళ్ళల్లో నలభై లక్షలమంది వచ్చి చేరారంటే పరిస్థితి అర్థం కావడం లేదా అని అడుగుతున్నాను. ఈ నలభై లక్షలమంది ఎందుకు వచ్చారు? ఎవరి ఉపాధిని, ఎవరి ఉద్యోగాలను కొల్లగొట్టారు? ఎవరి అవకాశాలను అడ్డుకున్నారు, ఎవరి వనరులను ఆధారం చేసుకుని వేలాది ఎకరాల్లో
వ్యవసాయం, వ్యాపారాలు, పరిశ్రమల పేరుతో ఎదిగారని అడుగుతున్నా. ఇదే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రాతిపదిక అనేవిషయం అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నా.
ఇక మీ శాసన సభ్యులు శ్రీధర్ గారు అభివృద్ధి గురించి చెపుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి వెనుక తమ చెమట రక్ట్సమో ఉందంటున్నారు. ఇలాంటి వి చాలానే విన్నాం, చాలా మందిని చూసాం. అసలు హైద్రాబాద్ను సృష్టించింది నేను అనే వాళ్ళు మొదలు అభివృద్ధి ని ఆంధ్రానుంచి సంచుల్లో తెచ్చి అక్కడ కుమ్మరించినట్టు మాట్లాడే అనేక మందిని చూసాం. ఆయన రింగురోడ్డు గురించి మాట్లాడారు, రింగు రోడ్డు ఒక్కటే అభివృద్ధి అన్నట్ట్టు మాట్లాడుతున్నారు. హైద్రాబాద్ చుట్టుపక్కల 200 కిలోమీటర్లు అభివృద్ధి జరుగని ప్రాంతం లేదని అన్నారు. కొత్తగా శాసన సభకు ఎన్నికయ్యారు, ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారో తెలియదు. ఎన్నిసార్లు శాసన సభకు వెళ్లారో తెలియదు, వారు వస్తే నేను స్వయంగా తీసుకెళ్లి
హైదేరాబద్ చుట్టూ అలుముకుని ఉన్న చీకటిని నేను చూపిస్తా వారికి. ఆ రింగురోడ్డును ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో
చేవెళ్ల, వికారాబాద్, తాండూరు ఎంత వెనుకబడి ఉన్నాయో, చూపిస్తా. .
శ్రీదర్ గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి అంటే తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నారు. తలసరి ఆదాయం తెలంగాణా జిల్లాల్లో ఎక్కువ అన్నారు. నిజమే సర్, తలసరి ఆదాయం తెలంగాణాలోనే ఎక్కువ. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు మీరన్నట్టు అగ్రభాగాన ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది తలసరి ఆదాయం కాదు, తలసరి
వ్యయం ఇంతకాలం తెలంగాణా వాదులు చెపుతున్నది కూడా అదే, తెలంగాణా ఆదాయం ఎక్కువ, కానీ వ్యాయామంతా ఆంధ్రాలోనే పెడుతున్నారని. అందుకు మీరు చెప్పిన ఔటర్ రింగురోడ్డును ఆనుకుని, 200 కిలోమీటర్లు అవసరం లేదు హైదరాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లానే తీసుకుందాం, నిజమే మెదక్ తలసరి ఆదాయంలో 23 జిల్ల్లాల్లో మూడో స్థానంలో ఉంది. కానీ మానవాభివృద్ధి సూచీలో మాత్రం 18 వస్తానంలో ఉంది. విద్యలో, ఆరోగ్యంలో, అక్షరాస్యతలో ఎక్కడో అట్టడుగున ఉంది.
మీ అభివృద్ధిని మెం నమ్మదలుచుకోలేదు, అది అభివృద్ధికాదు, అసలు అలాంటి అభివృద్ధి అవసరం లేదనికూడా అనుకుంటున్నారు తెలంగాణా ప్రజలు. ఆదాయంలో మొదటి మూడు జిల్లాలు తెలంణగానవే అలాగే వేణూకబాటులో, అవిద్యలో, నిరక్షరాస్యతలోఅట్టడుగున ఉన్న ఆరు జిల్లాలు కూడా తెలంగాణవే కావడం దురదృష్టకరం
మరొక ముఖ్య విషయం మిత్రులారా ! కొందరు తెలంగాణా ఉద్యమ ఆకాక్షలో భాగంగా వ్యక్తమవుతోన్న భావాలను కూడా కించపరుస్తున్నారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కొందరు సామాజిక తెలంగాణా అంటే ఏమిటో అని ఎద్దేవా చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఎస్, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం సరికొత్త సామాజిక చరిత్రకు నాందిగా నేను భావిస్తున్నాను. చిన్న రాష్ట్రాలుగా ఉన్నప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. నిజానికి తెలంగాణా చిన్న రాష్ట్రం కాదు, తెలంగాణా ఏర్పడితే దేశంలో 18వ పెద్ద రాష్ట్రం అవుతుంది, తెలంగాణా కంటే 17చిన్న రాష్ట్రాలు తెలంగాణలో ఉన్నాయి. నాలుగు కోట్ల మంది జనాభాతో ఏర్పడే రాష్ట్రం చిన్న రాష్ట్రం కాదు. మరి సామాజిక తెలంగాణా ఎలా వుంటుంది అంటే రేపు ఏర్పాటయ్యే తెలంగాణా రాష్ట్రం జనాభా ప్రాతిపదికన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆధిపత్యంలో ఉండే రాష్ట్రం కాబోతుంది. .ఇప్పుడు 16 శాతం ఉన్న దళితుల జనాభా తెలంగాణా రాష్ట్రంలో
22 శాతం కాబోతుంది.
అలాగే ఇప్పుడు ఆరుశాతం ఎనిమిది శాతం అంటోన్న ఆదివాసులు, ఎస్టీల జనాభా 11 శాతం ఉండబోతుంది. అలాగే కనీసం యాభై ఐదు శాతానికి తక్కువ కాకుండా వెనుకబడిన వర్గాలు, ముస్లింలు ఉండబోతున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే అగ్రవర్ణాలు అనేవాళ్ళు పదిశాతం దరిదాపుల్లోనే ఉండబోతున్నారు. ఇంతకుమించిన సామాజిక తెలంగాణా ఏముంటుంది. ఇంతకంటే సామాజిక సమతుల్యత ఉండే రాష్టం ఈ దేశంలో ఇంకొకటి ఉండబోదు.
ఇక అధికారం అటామా ఈ వర్గాల ఐక్యత, బలాన్ని బట్టి ఉంటుంది
మిత్రులారా మన రాజ్యాంగ రూపశిల్పి డా. బీఆర్
అంబెడ్కర్ గారు
కోరుకున్నది కూడా అదే.
సామాజికంగా ఆదిపత్యకులాలు ఎప్పుడైనా సరే రాష్ట్రాలు పెద్దవిగా ఉండాలని కోరుకుంటాయని, చిన్నరాష్టాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పుడున్న మన పరిస్థితినే తీసుకుందాం రాయల సీమలో ఉన్న ఒక సామజిక వర్గం, తెలంగాణలో ఉన్న అదే వర్గంతో సన్నిహితంగా, సమైఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఉదాహరణకు రెడ్డి సామాజిక వర్గమే అనుకుందాం, అది రాయలసీమయినా, తెలంగాణా అయినా రెడ్లంతా అధికారంకోసం ఒక్క=టవుతారు. అలాగే కమ్మ సామాజిక వర్గంకూడా, అధికారంలోకి రావడానికి మరో సామాజిక వర్గంతో చేతలు కలుపుతుంది. చరిత్రపొడవునా ఇట్లాటి ఆధిపత్య శక్తుల ఆటలు ఎన్నో చూసారం, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఆంద్ర్ ప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేక పోయాడు, ఒక ఎస్సీ కనీసం ఐదేళ్లు ఎందుకని అధికారంలో ఉండలేక పోయాడు. పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో చుడండి. దళిత, బహుజనులు ఏనాడో ముఖ్యమంత్రులు అయ్యారు. ముస్లింలు, ఆదివాసులు కూడా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంది ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడున్న పది జిల్లాలతో భౌగోళిక తెలంగాణా ఏర్పడితే, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇదే ఉద్యమ స్పూర్తితో భవిష్యత్తులో సామాజిక తెలంగాణా రూపొందించుకోవడం పెద్ద కష్టం కాదని నా భావన. ఆత్మ విశ్వాసం ఉన్నచోట ఏదయినా సాధ్యమేననేది నా అభిప్రాయం.
🙏🙏
రిప్లయితొలగించండి