మంగళవారం, జూన్ 01, 2021

తెలంగాణ పోరు దారిలో ...

  జూన్ 2014

 ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (2nd June, 2014) ప్రత్యేక సంచిక కోసం రాసింది. స్థలాభావం మూలంగా ఇది పూర్తిగా అచ్చుకాలేదు. నిజానికి ఇప్పటి సంగతులు అన్నీ అందరికీ తెలుసు, పైగా ఆంద్ర జ్యోతి మిత్రులు కూడా ఆ సంచికలో కొన్ని విశేషాలు రాస్తామన్నారు కాబట్టి ఇటీవలి విషయాలు తగ్గించి రాశాను. మిత్రులు కాసుల ప్రతాపరెడ్డి, కందుకూరి రమేష్ బాబు తదితరుల సూచన మేరకు దీనిని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దీనిని మరింత సమగ్రంగా మార్చి ఒక చిన్న పుస్తకంగా తేవాలని మిత్రుల సలహా. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల పాత్ర తో పాటు ఇందులో కొన్ని మిస్ అయ్యాను. అవి కాకుండా ఇంకా ఏవైనా నేను మరిచి పోయిన, నాకు తెలియని విషయాలు అయినా లేక సూచనలు ఉన్నా ఈ మెయిల్ ghantapatham@gmail,com ద్వారా పంపవలసిందిగా మనవి.  
                                                                                                                               మీ 
                                                                                                                                ఘంటా చక్రపాణి 

మట్టి చాలా గొప్పది.

అందులోనే తన సృష్టి రహస్యమేదో ఉన్నట్టు మనిషి పుట్టి పెరిగిన మట్టిని అమితంగా ప్రేమిస్తాడు.

బహుశా అదే చివరి మజిలీ అయినందుకేమో మనిషి ప్రాణం ఆ మట్టి కోసం కొట్టుమిట్టాడుతుంటుంది.

అది తన సొంత గుడిసె, గూడెం, వూరు వాడ ఏదయినా కావొచ్చు తను నిలబడ్డ సొంత గడ్డతోనే మనిషి అస్తిత్వం మొదలవుతుంది.

దానితోనే జీవితం పెనవేసుకుంటుంది. ఆ తరువాత మాత్రమే కులం,మతం, భాష, దేశం, జాతీయత ఇంకేదయినా వస్తాయి.

అందుకే తన ఊరంటే మనిషికి ప్రాణం. ఊరంటే కేవలం ఇండ్లు, గోడలు, వాడలు మాత్రమే కాదు, ఊరంటే ఉనికి.

ఊరిని కేవలం ఒక నైసర్గిక, భౌగోళిక పరిధిగా మాత్రమేచూడలేం. ఎన్ని వైరుధ్యాలు, అసమానతలు ఉన్నా ఊరిని ఏదో ఒక దశలో 

సామూహిక సహజీవన వేదికగా చూస్తాం.

ఏదో ఒక స్థాయిలో సమష్టి తత్వంతో మనల్ని నిలబెట్టే జీవపదార్తమేదో జన్మభూమిలో ఉంటుంది.

అందుకే తన నేలంటే మనిషికి ప్రాణం. 


సొంత నేలను కాపాడుకోవడం కోసం, ఆ నేలమీద తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసమే చరిత్రలో అనేక పోరాటాలు, సంఘర్షణలు, యుద్ధాలు జరిగాయి. తెలంగాణా ఉద్యమం కూడా సరిగ్గా అలాంటిదే. కోట్లాది మంది ప్రజల అస్తిత్వ ఆకాంక్ష అది. ఆ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరింది. ఆరు దశాభ్దాలుగా పరాయీకరణ నుంచి, ఆధిపత్యం నుంచి, అసమానతల నుంచి బయటపడి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు తెలంగాణా ప్రజలు చేసిన ప్రయత్నాలు, పోరాటాలు, బలిదానాలు, రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ఇప్పుడు మనం మన తెలంగాణాలో ఉన్నాం !

  ***
ఇది తెలంగాణా  

కోట్లాదిమంది తెలంగాణా ప్రజల తరతరాల కల నెరవేరి ఒక ప్రత్యేక అస్తిత్వంగా భారతదేశ  చిత్రపటంలో తెలంగాణా ఇప్పుడొక రాష్ట్రంగానిలబడింది. తెలంగాణా ఉద్యమం కేవలం ఒక రాష్ట్రాన్ని సాధించిన రాజకీయ ఉద్యమంగానే కాదు, భారతదేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాలకు, ముఖ్యంగా అస్తిత్వపోరాటాలకు ఒక కొత్త దిశా నిర్దేశం చేసిన ఉద్యమంగా కూడా చరిత్రలో మిగిలిపోతుంది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ ఉద్యమం కూడా ఇంత నిలకడగా సాగలేదు, పాలకుల ఆధిపత్య ఆలోచనలను అధిగమించి ప్రజల ఆకాంక్ష విజయం సాధించి నిలబడలేదు. ఇది తెలంగాణా ప్రజల పోరాటపటిమ, ఉద్యమ నాయకత్వ పరిణతి వల్లే సాధ్యమయ్యింది. నిజంగానే భారత దేశంలో రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అంత కష్టమా? అంటే కానే కాదు. 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అతిసాధారణ నిబంధన ను అనుసరించి దేశంలో రాష్ట్రాలను విడదీయవచ్చు, సరిహద్దులు మార్చవచ్చు, కొత్తరాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. ఈ అధికారం సంపూర్ణంగా పార్లమెంటుకు ఉంది. కానీ దేశంలో ఇప్పటివరకు ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా పాలకవర్గాలు ప్రజల ఆకాంక్షలను గుర్తించి స్వచ్చందగా ఏర్పాటు చేయలేదు. పంజాబ్, అస్సాం, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల ఏర్పాటుకోసం స్థానిక ప్రజలు మిలిటెంట్ ఉద్యమాలు నిర్మించి నెత్తురోడి పోరాడవలసి వచ్చింది. అయినా సరే ప్రభుత్వాలు, పార్లమెంటు లొంగలేదు. తమకు అనుకూలమైనప్పుడు, అవసరమైనప్పుడు మాత్రమే ఆయా రాష్ట్రాలను ఏర్పాటు చేసారు. బోడో లాండ్ కోసం అక్కడి ప్రజలు దశాభ్దాల పాటు మిలిటెంట్ పోరాటాలు చేసినా ప్రభుత్వాలు లొంగలేదు. హింస ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, హింసకు లొంగితే ప్రజాస్వామ్యం నిలబదన్నది పాలక వర్గాల భావన. హింస గెలిస్తే ప్రజలంతా దానినే ఆయుధంగా చేసుకుంటారని అప్పుడు ప్రభుత్వానికి విలువ గౌరవం ఉండదని వారి భయం. దీనిని మలిదశ తెలంగాణా ఉద్యమం గుర్తించింది. ఎక్కడా హింసకు తావులేకుండా ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను అనేక మార్గాల్లో ఆవిష్కరించడమేలక్ష్యంగా మలిదశ తెలంగాణా ఉద్యమం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగింది.  

1969 నుంచి వివిధ సందర్భాల్లో వ్యక్తమైన ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ఎంతమాత్రంగుర్తించక పోగా ఒకవైపు రాజకీయ ఆధిపత్యం చేజారి పోతుందేమోనన్న బెంగ, మరోవైపు ఆర్ధిక ప్రాభల్య వర్గాల  ఒత్తిడికి  లొంగిపోయిన పాలక వర్గాలు ప్రజల ఆకాంక్షను అడుగడుగునా అణచివేస్తూ వచ్చాయి.ఎప్పటికప్పుడు కొత్త ఒప్పందాలు, హామీలతో మోసం చేస్తూ దాదాపు ఆరు దశాబ్దాలు కాలం గడిపాయి . అయినా 2009 నుంచి నిరంతరాయంగా సాగిన పోరాటం ముందు తలవంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.ఈ అసాధారణ విజయం ఏ ఒక్కరివల్లో, ఒక్కరోజులోనో వచ్చింది కాదు. ఇది  ప్రజల విజయం. అయితే ఈ విజయం అటు పౌరసమాజంపు పట్టుదల, ఇటు స్వీయ రాజకీయ శక్తుల చైతన్యం, చొరవ మూలంగా సాధ్యపడింది. తెలంగాణా సమాజంలో విడివిడిగా ప్రజాసమూహాల్లో ఉన్న అసంతృప్తి, అసహనం ఒక సమిష్టి చైతన్యంగా మారి తెలంగాణా సాధనకు దోహదపడింది.  తెలంగాణా ప్రజల ఆకాంక్ష ప్రజలు ఆశపడి ప్రోదిచేసుకున్నది కాదు. ఇది కోల్పోయింది తిరిగి పొందడం కోసం చేసిన పోరాటంగా మాత్రమే గుర్తించాలి. పరాధీనత, పరాయీకరణ భావన నుంచి మొదలయిన ఉద్యమం, వలసాధిపత్య ధోరణులతో విసిగిపోయి, హక్కులకోసం ఆరాట పడింది.  ఆత్మ గౌరవ పోరాటంగా ఎదిగింది. కేవలం ఉద్వేగాలు, ఉద్రేకాలే కాకుండా ఆలోచనలను పదునుపెట్టి చట్టబద్ధమైన రీతిలో తమ న్యాయబద్ధమైన వాదనలు వినిపించి రాజ్యాంగ పరిధిలో తెలంగాణాను సాధించుకుంది. 

పరాధీన తెలంగాణ 

తెలంగాణా ఉద్యమం పరాదీనతలో నుంచి మొదలయ్యింది.  హైదరాబాద్ రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నప్పుడు (1948 సెప్టెంబర్ 17 వరకు ) లేని ఈ పరాధీన భావన సైనిక చర్యతో మొదలయ్యింది. నిజానికి అప్పటిదాకా తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల ప్రజలు కలిసిమెలిసే ఉన్నారు. ఆ కాలంలో కన్నడ, మరాఠీ మాట్లాడే వారితో తెలంగాణా ప్రజలకు ఎలాంటి పేచీ లేదు. సైనిక చర్య అనతరం ఆంధ్రా ప్రాంత తెలుగు ప్రజల రాక మనుషుల మధ్య విభజన రేఖగా మారిపోయింది. పైగా భారత ప్రభుత్వం తమను మోసం చేసిందన్న భావన ప్రజల్లో వచ్చింది. నిజంగానే హైదరాబాద్ రాజ్యాన్ని ఒక స్వతంత్ర అస్తిత్వం ఉన్న రాజ్యంగా గుర్తించి, ఇక్కడి ప్రజలను, పాలకులను ఒప్పించి విలీనం చేసుకుని ఉంటే  బహుశ ప్రజల్లో ఈ పరాధీన భావన వచ్చేది కాదేమో. కానీ అలా చేయకుండా నెహ్రూ ప్రభుత్వం హైదరాబాద్ ను పోలీసులు, సైన్యం సహాయంతో స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత ఇక్కడి ప్రజలమీద 1949 డిసెంబర్ దాకా సైనిక నిఘా నడిచింది.  సైనిక పాలన ఆంధ్రా వలస మొదలయ్యింది. సైనికాదికారుల్లో తెలుగు తెలిసిన వారిని ఇక్కడికి తరలించడం తో ఆంధ్రా తెలంగాణా మధ్య కొత్త బంధాలు మొదలయ్యాయి. 

ఇవి 1950-53 మధ్య పౌరపాలన పేరుతో సాగిన జె ఎన్ వెల్లోడీ పాలనలో ఈ బంధాలు మరింత బలపడ్డాయి. సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత కేంద్ర ప్రభుత్వం మూడేళ్ళపాటు ఒక అధికారిని నియమించి పరిపాలనను తనకింద ఉంచుకుంది. ఆ కాలంలో ఆంధ్రా ప్రాంతం నుంచి ప్రభుత్వోద్యోగాల్లో తెలుగు ఇంగ్లీష్ తెలిసిన ఆంధ్రులకు విరివిగా అవకాశాలు వచ్చాయి. ఉద్యోగులు, వారివెంటే నిరుద్యోగులు, రైతులు ఇట్లా వలసలకు గేట్లు బార్లా తెరిచిన పరిస్థితి తలెత్తడంతో స్తానికత ఒక ప్రధానమైన సమస్య అయ్యింది. నిజానికి నిజాం పాలకులు స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా 1919 నుంచి ముల్కీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ పుట్టిపెరిగి పదో పరకో చదివిన వాళ్ళు కాదు, వాళ్ళ తల్లిదండ్రులలో ఎవరో ఒకరైనా కనీసం 15 సంవత్సరాల పాటు హైదరాబాద్ నిజాం కొలువులో పనిచేసి, ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళయి ఉండాలి. కాని పోలీసు బలగాలతో హైదరాబాద్ రాజ్యాన్ని రద్దు చేసిన ఢిల్లీ పెద్దలు ముల్కినిబంధనాలను కూడా మూసీలో తొక్కి స్థానికుల గొంతు నొక్కారు. ఆ గొంతులే 1952లోనే నాన్-ముల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని నినదించాయి. అట్లా గొంతెత్తిన యువకులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అదే సమయంలో రాష్ట్రాల పునర్విభజనకోసం ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమీషన్ హైదరాబాద్ వచ్చింది. కొండా వెంకటరంగా రెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, మఱ్ఱి చెన్నారెడ్డి వంటి నాయకుల నేతృత్వం లో అనేక మంది ప్రత్యేక తెలంగాణా డిమాండ్ ను కమిషన్ ముందు బలంగా పెట్టారు. ప్రజా సోషలిస్ట్ పార్టీ దీనినొక ప్రధాన అంశం చేసుకుని పోరాడింది. మరోవైపు అదే కాలంలో ఆంద్ర రాష్ట్ర ఆవిర్భావం కూడా జరిగింది.  

నిజానికి పొట్టి శ్రీరాములు పోరాడింది మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలు వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని. కానీ ఆదిపత్య శక్తుల ఆలోచనలు మాత్రం హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణా ప్రాంతం చుట్టూ తిరగసాగాయి. కర్నూల్ లో నామమాత్రపు రాజధాని ఏర్పాటు చేసుకుని అదే రోజునుంచి హైదరాబాద్ ను కబళించే కుట్రలు మొదలు పెట్టారు. భారత ఉపఖండంలో ఒక ప్రత్యేక, స్వతంత్ర అస్తిత్వంతో ఉన్న హైదరాబాద్ ను ఇక్కడి ప్రజలతో సంబంధం లేకుండా దేశంలో విలీనం చేసినట్టే 1956 లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విశాలాంధ్ర సామ్రాజ్యవాద కుట్రలో భాగంగా తెలంగాణాను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేశారు. ఇది రెండో బలవంతపువిలీనం. రాష్ట్రాల పునర్విభజనకోసం ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమీషన్ వ్యతిరేకించినా వినకుండా బలవంతపు విలీనాన్ని చేసి ఢిల్లీ పెద్దలు తెలంగాణాను పరాయీకరణ లోకి నెట్టేశారు. 

 భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతో భిన్నమైన  నైసర్గిక, భౌగోళిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ ప్రాంతాలను ఒక్కటిగా చేయడం భారత ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేద్కర్ భాషా ప్ర్కయుక్థ రాష్ట్రాల ప్రతిపాదన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు. భాష మాత్రమే ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు తగదని సూచించారు. ' ఒక రాష్ట్రానికి ఒక భాష ఉంటె మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనుకోవడం పొరపాటని, రాష్ట్రాల ఏర్పాటులో ప్రాంతాల సామాజిక, రాజకీయ నేపధ్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కానీ అప్పటి పాలకులు దానిని పూర్తిగా పెడచెవిన పెట్టారు. ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటును హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రాజకీయ నిర్ణయాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తోసిపుచ్చి విలీనం కానిచ్చారు. దానికి కొన్ని, షరతులు, ఒప్పందాలు జతచేశారు. అవేవీ అమలుకు నోచుకోకపోవడంతో పదేళ్ళలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి రాజుకుంది. ఆందోళన మొదలయ్యింది. ఇది క్రమంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా 1968-69 నాటికి ఉధృతం అయ్యింది. ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డ సందర్భంగా 1956 లో చేసుకున్న ఒప్పందాలు తుంగలో తోక్కడమే కాకుండా, తెలంగాణా ప్రాంతంలోని అవకాశాలను తెలంగాణా వారికి చెందకుండా చేయడంవల్ల అస్తిత్వం కోల్పోతున భావన, మోసప్తున్నామన్న భయం ఇక్కడి ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో మొదలయ్యింది.

దగాపడ్డ తెలంగాణ 

సొంతగడ్డ మీదనే  పరాయి వాళ్ళలా బతకడం తెలంగాణా యువతకు, విద్యావంతులకు రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ళకే అనుభవంలోకి వచ్చింది. విలీనం నాడు చేసుకున్న ఒప్పందాలేవీ అమలుకాలేదు. పెద్దమనుషులుగా సంతకాలు చేసినవాల్లంతా గద్దెలెక్కారు. మంత్రులై, ఆంధ్రా పాలకులకు దాసోహమై పోయారు. చదువుకునే అవకాశాలు మెరుగుపడలేదు. ఉద్యోగావకాశాలు లేవు. ఏర్పడ్డ ప్రతి ఖాళీలో ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళే చేరిపోతున్నారు. ఇలా వేలాదిమంది అక్రమంగా ఉద్యోగాలు పొంది ఆదిపత్యం చేయడం మొదలయ్యింది. బడి పంతుళ్ళు మొదలు బంట్రోతుల దాకా ఎక్కడ చూసినా వాళ్ళే..! మరోవైపు తెలంగాణా ఉపముఖ్యమంత్రి ఆరోవేలుతో సమానమయ్యింది. వందల కోట్ల రూపాయల తెలంగాణా ఆదాయం లెక్కలేకుండా పోయింది. తెలంగాణా డెవలప్ మెంట్ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఒకవేళ నివేదికలిచ్చినా దానికి చట్టబద్ధత లేక అవి చెత్తబుట్టలోకి చేరేవి.

ఈ దశలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలను మొట్టమొదటగా ఎలుగెత్తి , ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అన్నది మాత్రం వరంగల్. 1968 జూలై నెలలో వరంగల్ లో జరిగిన స్థానిక నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సదస్సులో ప్రత్యేక తెలంగాణా నినాదం వచ్చింది. పెద్దమనుషుల ఒప్పందం అమలుకాక కొత్త ఉద్యోగాలు లేక తెలంగాణా యువత కునారిల్లుతున్న దశలో ఎన్జీవో సదస్సులో పాల్గొన్న డెమోక్రాటిక్ ఫ్రంట్ కార్యదర్శి, శాసన సభ్యులు టి. పురుషోత్తం రావు, తెలంగాణా టీచర్స్ అసోసియేషన్ శాసనమండలి సభ్యులు ముత్తారెడ్డి మొట్టమొదట గళమెత్తారు. ఇదే డిమాండ్ వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మంత్రి నూకల రామచంద్రా రెడ్డి అనుచరుడు  వెంకట రామిరెడ్డి కూడా ముందుకు తెచ్చారు. ఇది క్రమంగా తెలంగాణా అంతటా పాకింది. పెద్దమనుషుల ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మల్లిఖార్జున్ నాయకత్వంలో ఉద్యమాన్ని ఉధృతం చేసారు.

1968 డిసెంబర్ 6న హైదరాబాద్ వివేకవర్ధిని పాథశాల నుంచి మొదలయినవిద్యార్థులు ర్యాలీ మీద సమైఖ్యవాదులు, పోలీసులు లాఠీలతో విరుచుకు పది చితక బాదారు. 1969 జనవరి 8న ఖమ్మం జిల్లాలో రవీంద్రనాథ్ అనే విద్యార్ధి 14 రోజుల పాటు ఆమరణ దీక్షకు కూర్చోవడం తో పరిస్థితి గంభీరంగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జనవరి 11 న ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు.  తెలంగాణా లో జరిగిన ఉల్లంఘనలు సరిదిద్దాలని, తెలంగాణా కు చెందవలసిన ఉద్యోగాల్లో అక్రమంగా తిష్టవేసిన ఆంద్ర ఉద్యోగులను వెనక్కి పంపాలని, అర్హులయిన తెలంగాణా వాళ్ళు వెంటనే అందుబాటులో లేకపోయినా అర్హత కలిగిన వారు దొరికేదాకా ఖాళీలను అలాగే ఉంచాలని, తెలంగాణా నుంచి వచ్చే ఆదాయం తెలంగాణాలోనే పూర్తిగా ఖర్చు చేయాలని, తెలంగాణలో విద్యావకాశాలు మెరుగు పరచాలని తీర్మానించింది.

ఈ మేరకు ప్రభుత్వం వెంటనే అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగులను వారివారి సొంత ప్రాంతాలకు పంపిస్తూ జీవో నెంబర్ 36 ని జనవరి 21న జారీ చేసింది. కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో ఉద్యమం విరమించి తెలంగాణా శాంతిస్తున్న దశలో ఆంధ్రా ఉద్యోగులు జీవో 36ను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. మార్చ్ నెలలో హైకోర్ట్ సమర్థించిన ఉత్తర్వులను 1969 ఏప్రిల్ లో సుప్రేంకోర్టు  కొట్టివేయడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో ప్రతాప్ కిశోరే, రఘువీర్ రావు అనే ఇద్దరు జర్నలిస్టులుతెలంగాణా ప్రజాసమితి పేరా ఒక వేదికను ఏప్రిల్ 6 న ఏర్పాటు చేసి ఉద్యమ శక్తులను ఏకం చేసే పనికి పూనుకున్నారు. అదేపేరుతో ఆ తరువాత తెలంగాణా రాజకీయ పార్టీ మొదలయ్యింది. మరోవైపు స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ ఆందోళనను ఉధృతం చేసింది. ఆందోళనలు, హర్తాళ్ళ తో హైదరాబాద్ తో పాటు తెలంగాణా హోరెత్తింది. ప్రత్యేక తెలంగాణా తప్ప తమకు మరేదీ ఆమోదయోగ్యం కాదని ఉద్యమం స్పష్టం చేసింది. 

రాజకీయ ఆధిపత్యం కోసం తెలంగాణా ఉద్యమాన్ని బ్రహ్మానందరెడ్డి అణచివేసే ప్రయత్నం చేసాడు పోలీసులకు సర్వాధికారాలు ఇచ్చాడు.  మే ఒకటో తేదీన స్టూడెంట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపువేలమంది విద్యార్థులు చార్మినార్ నుంచిరాజ్ భవన్ కు బయలుదేరారు. ర్యాలీకి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్,  కేశవ రావు జాదవ్, సోషలిస్ట్ పార్టీ నాయకులు నాయిని నరసింహారెడ్డి, బద్రివిశాల్ పిత్తి నాయకత్వంవహిస్తోన్నారు. ఈ ర్యాలీని అణచివేయ వలసిందిగా బ్రహ్మానంద రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తెలంగాణా పోలీసులు పాటించలేదు. పైగా పిల్లల మీద కాల్పులు జరుపడం ఏమిటని ప్రశ్నించారు. ఆంద్ర అధికారులు ఉమేందర్ అనే విద్యార్ధి నాయకుడి మీద గుళ్ల వర్షం కురిపించారు. ఉమేందర్ తో పాటు అనేకమంది విద్యార్థులు నేలకొరిగారు. అయినా ప్రజలు భయపడలేదు నేలతల్లి విముక్తికోసం నెత్తురైనా ధారపోయడానికిసిద్ధపడ్డారు.ఈ ఉద్యమంలో 369 మంది పోలీసు కాల్పుల్లో మరణించారు.

 నిజంగానే అదొక ధిక్కారంగా, ఆదిపత్యానికి వ్యతిరేకంగా రగిలిన ఆగ్రహ జ్వాలగా మారింది.  అప్పటికి తెలంగాణా ఉద్యమానికి బలమైన రాజకీయ నాయకత్వం లేదు. గమ్యం తెలియదు. వ్యూహం లేదు. విద్యార్థులంతా రోడ్ల మీద. వారికి మద్దత్తుగా ప్రజలు.రాజకీయ నాయకులెవరూ ప్రజలతో లేరు. పైగా తెలంగాణా మత్రులంతా మూకుమ్మడిగా ప్రత్యేక తెలంగాణా అవసరం లేదని ప్రకటించారు. పైగా హైదరాబాద్ లోని బూరుగు మహాదేవ హాల్ లో  సమైక్యవాదుల సభ కాంగ్రెస్ పెద్దలు మద్దతిచ్చారు. కు ఈ దశలో కొందాలక్ష్మన్ బాపూజీ ముందుకు వచ్చారు. తెలంగాణా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మినహా మరే గత్యంతరం లేదని ప్రకటించారు.  ఉద్యమానికి ప్రజల మద్దతు పెరగడంతో  చెన్నారెడ్డి, కె వీ రంగారెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. అరెస్టయ్యారు.

1969 మే 21 న చెన్నారెడ్డి రంగ ప్రవేశంతో ప్రజా ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే చెన్నా రెడ్డి మీద ప్రజలనుంచి ముఖ్యంగా మేధావుల నుంచి ఒత్తిడి పెరిగింది. మే 20 న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్  తోట ఆనందరావు తెలంగాణా అభివృద్ధి అసమానతలు ఒక సెమినార్ నిర్వహించారు. దీనికి స్వయంగా ఓ యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు, ప్రొఫెసర్ శ్రీధర స్వామి, ప్రొఫెసర్ బషీరుద్దిన్, పెన్నా లక్ష్మి కాంతం వంటి ప్రముఖులు అనేక అంశాల్లో అసమానతల మీద విశ్లేషణలు చేసారు. ఇదొక రకంగా మధ్యతరగతిని, మేధావులను కదిలించింది. తెలంగాణా ప్రజాసమితి ఉద్యమం లో కీలకం కావడంతో సెగ ఢిల్లీ కి తాకింది. ఇందిరా గాంధీ జాతీయ స్థాయిలో అఖిలపక్షం ఏర్పాటు చేసి సమస్యను చర్చించింది. అధికారులను మంత్రులను పురమాయించింది. ప్రణాలికలు ప్రకటించింది. ఉద్యోగాలు, నిధులు, నియామకాలతో సహా ఎనిమిది అంశాలతో పథకాలు సిద్ధం చేసింది. అయినా జనం వినలేదు.

 ఒక రకంగా దేశాన్ని వణికించిన ఇందిరా గాంధీ నిలువెల్లా వణికి పోయింది. ఒకవైపు ప్రజా ఉద్యమం మరోవైపు తెలంగాణా ఎన్జీవో లు వారికి మద్దతుగా రోడ్లు ఎక్కారు.  వర్క్ టు రూల్ తో మొదలుపెట్టి సార్వత్రిక సమ్మెకు దిగారు. ఎన్జీవోలు జూన్ 10 నుంచి సమ్మెకు దిగాల్సి ఉండగా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ స్వయంగా జూన్ నాలుగున హైదరాబాద్ లో దిగారు. అందరితో మాట్లాడిన ఆమె ఏమీ చెప్పకుండానే వెనుదిరిగారు. ఉద్యమం మరింత ఊపందుకుంది. సహాయ నిరాకరణ సాగింది. వేలాదిమందిని అరెస్టు చేసి జైళ్లకుపంపారు.  విచిత్రమేమిటంటే పోలీసులు అరెస్టు చేసిన వారిలో సగం మందిదాకా 13 ఏళ్ళ లోపు వయసున్న విద్యార్థులే.! అదే వయసున్న వాళ్ళు అనేకమంది కాల్పుల్లో మరణించారు కూడా. ఇది పౌరసమాజాన్ని కదిలించింది. హైదరబాద్ హై కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రొఫెసర్ లు, డాక్టర్లు, సంఘ సేవకులు, వ్యాపారస్థులు అనేక మందితో కూడిన ఒక ప్రతినిధి బృందం అణచివేత ఆపేయాలని కోరింది. కలిపి ఉంచాలన్న, విడదీయాలన్న ప్రజల సమ్మతితోనే జరగాలి తప్ప బెదిరించి, భయపెట్టి కాదని తేల్చి చెప్పింది. అయనా రాజకీయం నేతలను బెదిరించింది. ముఖ్యులను ఢిల్లీ కి పిలిపించుకుని బేరసారాలు చేసుకుంది.  కొందరు ఎన్నికలకు ముందే లొంగిపోయి కాంగ్రెస్ లోనే ఉండి పోయారు. మరికొందరు 1971  పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాసమితి తరఫున పోటీ చేసి ఘనవిజయం సాధించిన తరువాత లొంగిపోయారు. 

అంతటితో ఆగకుండా 1972 ఎన్నికలకు ముందు ప్రజాసమితిని కూడా కాంగ్రెస్ లో కలిపేసి ఉద్యమ శక్తిని సజీవ సమాధి చేసారు. కేవలం నాయకత్వంలో ఉన్న పరాధీనత, లొంగుబాటు నైజం వల్లనే తెలంగాణా మీదా ఆంధ్రా ఆధిపత్యపు  ఆజమాయిషీ కొనసాగింది . ఇది  1972నుంచి పదేళ్ళపాటు తెలంగాణా ప్రజలను ప్రత్యక రాష్ట్రం విషయంలో నోరెత్తకుండా చేసింది. ఈ లోగా తెలంగాణా అస్తిత్వం పూర్తిగా మరుగున పడిపోయి ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశంతో తెలుగు జాతి నినాదం తెరమీదికి వచ్చింది.

తిరగబడ్డ తెలంగాణ 

తిరుగుబాటు స్వభావం ఉన్న మనుషులకు లొంగుబాటు నేతలే దొరకడం అప్పటి తెలంగాణా రాజకీయ నాయకత్వ లోపాన్ని సూచిస్తుంది. నిజానికి తెలంగాణా ఉద్యమం విఫలం అయినప్పటికీ ఈ ప్రాంతానికి ఒక కొత్త ఆలోచనా పరులయిన నాయకత్వాన్ని అందించింది. దీనివల్ల 1970వ దశకం నిరంతర ఘర్షణలతో గడిచింది. ఉద్యమ అనచివేతతో కలత చెందినా యువత నేలతల్లి విముక్తి కోసం  సాయుధ పోరాటమే ఏకైక మార్గమని నమ్మింది. అప్పటికే శ్రీకాకుళం నుంచి వీస్తోన్న నక్షల్బరీ జంఝామారుత ప్రభావానికి లోనయ్యింది. కరీంనగర్ నుంచి వచ్చిన మల్లోఝుల కోటేశ్వర్ రావు నాయకత్వంలో కొందరు యువకులు రాడికల్ విద్యార్ధి సంఘానికి ఆ తరువాత పీపుల్స్ వార్ కు నాయకత్వం వహించారు. డా కొల్లూరి చిరంజీవి లాంటి వాళ్ళు అనేక మంది అందులో ఉన్నారు. 

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకున్న విఠల్ రావు గద్దర్ గా మారి తెలంగాణా పోరాట వాగ్గేయకారుదయ్యారు. ఆయన కాలంలోనే ఉన్న కూర రాజన్న కూడా తెలంగాణా ఉద్యమ స్పూర్తితో పల్లెబాట పట్టి తరువాత జనశక్తి నాయకుడయ్యారు. తెలంగాణలో పల్లెల్లో రైతుకూలీ ఉద్యమాలు, విద్యార్ధి ఉద్యమాలు మొదలుపెట్టి నూతన వ్యవసాయ విప్లవ దిశగా ప్రజలను నడిపించిన స్ఫూర్తి 1969 తెలంగాణా ఉద్యమం నుంచి వచ్చిందే. పట్టణాలకే పరిమితమైన ఉద్యమం, నేతల దాసోహ మనస్తత్వం, రాజకీయ పార్టీల వైఫల్యం, ఆధిపత్య శక్తుల ద్రోహం వల్ల తెలంగాణా యువతకు పార్లమెంటరీ వ్యవస్థమీద నమ్మకం లేకుండా చేసింది. విద్యార్థులను గ్రామాలకు తరలించి చైతన్యం చేసి  భూస్వామ్య వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించే ప్రయత్నం చేసింది. ఇది ఒక రకంగా సాంప్రదాయ రాజకీయ నాయకత్వాన్ని, దొరతనాన్ని పల్లెలనుంచి తరిమేసింది. అధికార కేంద్రాలుగా ఉన్న గడీలను ఖాళీ చేయించి వెట్టి చాకిరీ మొదలు అనేక సామాజిక రుగ్మతలనుంచి ప్రజలను ముఖ్యంగా దళితబహుజనులను విముక్తం చేసే ప్రయత్నం చేసింది.భూమి కేంద్రంగా సాగిన ఈ ఉద్యమాలు గోదావరి లోయంతా విస్తరించి దండకారన్యాన్ని దాటి నేపాల్ దాకా ఆదివాసుల నేలమీద, అడవిమీద, వనరుల మీద ఎర్ర తివాచీ పరిచింది.

మరోవైపు  ఢిల్లీ కి దాసోహమైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా మారిపోయారు. తెల్లారే లోపు జాతీయ నాయకులయ్యారు. ప్యాకేజీలో భాగంగా తెలంగాణా నుంచి పీవీ నరసింహారావును ముఖ్యమంత్రిని చేసారు. ఏడాది కూడా తిరగక ముందే ముల్కి నిబంధనలు సమర్థిస్తూ 1972 అక్టోబర్ లో  సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పింది.  తెలంగాణాలో ఉన్న నాన్ లోకల్ ఉద్యోగులు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మరో అప్పటికే వైపు ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసే చర్యలను పీవీ చేపట్టారు. ఇది ఆంధ్రా పెత్తన్దార్లకు నచ్చలేదు. కోర్టు తీర్పును సాకుగా చూపి  జై ఆంధ్రా ఉద్యమం పేరుతో ప్రత్యక ఆంద్ర రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యమాన్నిలేవదీశారు. ఇది రాష్ట్రపతి పాలనకు దారి దీయడంతో పీవీ తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆ కాలంలో సోషలిస్టు పార్టీ అలాగే జస్టిస్ పార్టీ తెలంగాణాకు గట్టి మద్దత్తుగా ఉన్నప్పటికీ ఆ బలం సరిపోలేదు. ఆ తరువాత ఎమర్జెన్సీ రాజకీయాల గొంతును పూర్తిగా నొక్కివేయడంతో తెలంగాణా వాదం కూడా పెద్దగా వినిపించలేదు. 

తెలంగాణా ఉద్యమ ప్రభావంలో పెరిగిన యువకులు కొందరు మొదట సోషలిస్టులుగా ,ఎమర్జెన్సీ అనంతరం లోక్ దల్ , జనతా పార్టీ నేతలుగా ఎదిగి సాంప్రదాయిక రాజకీయాల్లోకి వచ్చేసారు. ఇంద్రా రెడ్డి, జీవన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జానారెడ్డి, సంగం రెడ్డి సత్యనారాయణ, కరణం రామచంద్రా రావుఇట్లా తెలంగాణా రాజకీయాల్లోకి కొత్త రక్తం వచ్చింది. కానీ జనతా ప్రయోగం పెద్దగా ఇక్కడ విజయవంతం కాకపోవడంతో 'ఈ అభ్యుదయ భావ చైతన్యం లో ఉన్న నేతలంతా 1982 లో ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగుదేశంలో చేరిపోయారు. నిజానికి తెలుగుదేశంలో ఆ కాలంలో చేరిన నేతలంతా ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షులు. జీ నారాయణ రావు, సంగంరెడ్డి సత్యనారాయణ, పి. మహెంద్రనాథ్ లాంటి వాళ్ళు అప్పటికే ఉద్యమ కారులు. ఇంద్ర రెడ్డి, నర్సింహులు లాంటి మరికొందరు తెలంగాణా ఉద్యమ ప్రభావంతో ఆ తరువాత వచ్చిన ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు. ఇట్లా ఒక యువ తరానికి తెలుగుదేశం వేదికయ్యింది. ఇది ఒక రకంగా దాదాపు ఇరవయ్యేళ్ళ పాటు తెలంగాణా రాజకీయ పోరాటాన్ని వాయిదావేసింది. రెండో వైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు ద్రోహం చేసిన పాత తరం కాంగ్రెస్ నాయకత్వానికి ఇక్కడ నిలువ నీడకూడా లేకుండా చేసింది. మరోవైపు వెనుకబడిన కులాలనుంచి ఎదిగివచ్చిన యువత కూడా తెలుగుదేశంలో చేరిపోయి తెలంగాణలో ఒక కొత్త సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టింది. బీసీ రిజర్వేషన్స్, రెండు రూపాయల బియ్యం, గృహనిర్మాణాలు ఎన్టీ రామారావును తిరుగులేని నేతగా చేసాయి.

 తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో తెలంగాణా ఆలోచన లేకపోయినా రామారావు రాకతో మళ్ళీ నగరాల్లో తెలంగాణా అలజడి మొదలయ్యింది. దీనికి 1984 తెలంగాణా ఎన్జీవోల  సమ్మె  శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల హక్కుల రక్షణకు మొదలయిన సమ్మె ఉద్యోగుల బలాన్ని పెంచింది. తిరిగి టి ఎన్ జి వో లు 1985 చివర్లో తెలంగాణాలో ఆంధ్రా ఉద్యోగుల అక్రమ నియామకాల గురించి ఎన్టీ రామారావుకు ఒక వినతి పత్రం ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుందరేషన్ కమిటీ తెలంగాణా ప్రాంతంలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా దాదాపు 59వేల ఆంధ్రా ఉద్యోగులున్నారని తేల్చింది. వారిని వెనక్కి పంపించేందుకు వచ్చిందే 610 జీ వో. అది రెండు దశాబ్దాలు దాటినా అమలుకు నోచుకోలేదు. అది వేరే విషయం. కానీ సుందరేషన్  నివేదిక చాపకింది నీళ్ళలా ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఎలా తెలంగాణలో అక్రమంగా పాగా వేశారో వివరించింది. అప్పుడు అత్యంత ఆదరణ కలిగి ఉన్న ఉదయం దినపత్రిక ఈ అన్యాయాన్ని మొదటిపేజీ ఎడిటోరియల్ లో కళ్ళకు కట్టినట్టు వర్ణించింది. ఇది మరోసారి తెలంగాణా పాత ఉద్యమాలను కొత్త తరాలకు పరిచయం చేసింది. అప్పటికే తెలంగాణా ప్రాంతంలో వివిధ వేదికలు పనిచేస్తున్నాయి. 

అప్పటికే ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ వేరువేరు వేదికల ద్వారా భావ వ్యాప్తిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకొక వైపు శ్రీధర్ రెడ్డి, బీ పీ ఆర్ విఠల్ ఆధ్వర్యంలో తెలంగాణా ఖజానా లెక్కలు వెలికి తీసే పని జరుగుతోంది. అలాగే నాట్యకళ ప్రభాకర్, డా. హరినాథ్ తెలంగాణా ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాచార వ్యాప్తి చేస్తున్నారు. కొంతకాలం మా తెలంగాణా పేరుతో ఒక పత్రిక కూడా నడిపించారు. ఇవన్నీ ఇటు ఉస్మానియా, అటు కాకతీయ యూనివర్సిటీ లలో ఒక కొత్త విద్యార్ధి ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. దీనికి సెంటర్ ఫర్ తెలంగాణా స్టడీస్ పేరుతో జయశంకర్, పీ ఎల్ విశ్వేశ్వర్ రావు, సింహాద్రి తదితర ఉస్మానియా  కాకతీయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఒక వేదికను ఏర్పాటు చేసి వివిధ రంగాల లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను అధ్యయన పత్రాలుగా ప్రచురించారు. 

ఇదే క్రమంలో 1980  చివరి నాటికి తెలంగాణా స్టూడెంట్ ఫ్రంట్ పేరుతో కిషోర్ రెడ్డి, అనిల్ కుమార్, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి  మరికొందరు అలాగే తెలంగాణా లిబరేషన్ స్టూడెంట్ ఆర్గానయిజేషణ్ (తెల్సో) పేరుతో మనోహర్ రెడ్డి, జగన్ రెడ్డి లు వేరు వేరు విద్యార్ధి శిభిరాలు నడిపారు. సెప్టెంబర్ 17 ను  విద్రోహ దినంగా ప్రకటించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మీద నల్ల జెండాలు ఎగరేసే దాకా ఈ నిరసన కొనసాగింది.  అమరేందర్ రెడ్డి అనే విద్యార్ధి నాయకుడు టీ  ఎస్ ఎఫ్ ను వరంగల్ కు విస్తరించాడు. రెండు మూడేళ్ళలోనే  తెలంగాణా అంతటా ఒక నవ తెలంగాణా విద్యార్థి ఉద్యమం గా విస్తరించి 1990వ దశకాన్ని తెలంగాణా ఉద్యమ దశకంగా మార్చి వేసింది.

 *****

రెడ్ కార్పెట్ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ చెన్నారెడ్డి శకం మొదలయ్యింది. ఆయన దాదాపు పదేళ్ళు అజ్ఞాతవాసం లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లాంటి రాష్టాలకు గవర్నర్ గా ఉంది వచ్చాడు. పీసీసీ అధ్యక్షుడిగా తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. కాంగ్రెస్ సీమాంద్ర నాయకత్వం తనని ఎక్కువ కాలం అధికారంలో ఉండనీయదని ఆయనకు స్పష్టంగా తెలుసు. తన పార్టీ లోని నాయకులతో పాటు, తెలుగుదేశం కూడా బలమైన సీమాంద్ర పార్టీ కాబట్టి ఇక తనకే కాదు ఇంకెవరికీ తెలంగాణలో అధికారం దక్కదని కూడా ఆయన గమనించి ఉంటాడు. అయినా పార్టీని గెలిపించిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రిగా 3 డిసెంబర్ 1989 న ప్రమాణ స్వీకారం చేసారు. అనుకున్నట్టుగానే ఏడాదిలో హైదరబాద్ మత ఘర్షణలు జరిగి ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. చెన్నారెడ్డి కి అధికారంలోకి రావడం అదే చివరిసారి అని తెలుసు. బహుశ మట్టి ఋణం తీర్చుకోవాలనుకున్నాడో లేక తెలంగాణా మట్టి మనుషులకు ఒక కొత్త బలం ఇవ్వాలనుకున్నాడో తెలియదు గానీ చెన్నారెడ్డి అధికారంలోకి రాగానే నక్సల్స్ పై, ఇతర ప్రజా సంఘాలపైన నిషేధం ఎత్తివేశాడు.

ఇది అజ్ఞాతవాసం నుంచి చాలా మంది తెలంగాణా పాతతరం నాయకులను బయటకు తెచ్చింది.వాళ్లకు తెలంగాణా ఒక బలమైన ప్రజా క్షేత్రంయ్యింది.  గద్దర్ తెలంగాణా రాగం ఎత్తుకున్నాడు. జి. ఇన్నయ్య అన్యాక్రాంతమైన తెలంగాణా వనరుల మీద లెక్కలు తీసి తెలంగాణా అంతటా సభలు సమావేశాలు పెట్టాడు. దగాపడ్డ తెలంగాణా పేరుతో ప్రచురణలు తెచ్చేవాడు. అప్పుడు 1992-93 లో నేను వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండేవాడిని,ఇన్నయ్య సేకరించి తెచ్చిన గణాంకాలను క్రోడీకరించి రాత ప్రతి రూపొందించడం చేసేవాడిని. ఇన్నారెడ్డి, పాశం యాదగిరి, కేశవరావు జాదవ్ ఇట్లా అనేకమంది ఎవరికివారు తెలంగాణా కు వివిధ రంగాలలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుండేవారు. ఇదంతా హూహించని రీతిలో భావవ్యాప్తికి దోహద పడింది.1997 మార్చ్ నెలలో భువనగిరి పట్టణంలో మొదటి తెలంగాణా సదస్సు, బహిరంగ సభ జరిగాయి. మార్చ్ 7-8 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు ఒక మలుపు. ఆ సదస్సు ఆ తరువాత తెలంగాణా జనసభ చకచకా ఏర్పడ్డాయి. మరోవైపు మారోజు వీరన్న తెలంగాణా మహాసభ, జనశక్తి తెలంగాణా సదస్సులు, బెల్లి లలిత, గోరెట్టి వెంకన్న, అందె శ్రీ ల ఆటపాటలు తెలంగాణాను ఒక జన జాతరగా మార్చివేశాయి. ఇట్లా మరోసారి నగరాల్లోమొదలయిన నగారా విశ్వవిద్యాలయాలు, విద్యార్తులనుంచి  మరోసారి గ్రామాలకు వెళ్ళింది. అయితే గతంలో లాగా విశాల ఉద్యమం లాగా కాకుండా కేవలం ప్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షగా వెళ్ళింది. కవులు, గాయకులు గళమెత్తి తెలంగాణా పల్లెలకు తీసుకు వెళ్ళారు. తెలంగాణా నేలను, ప్రజలను స్వరాష్ట్ర కాంక్ష వైపు ఆలోచించేలా చేసాయి. 1996 దాకా తమిళనాడు గవర్నర్ గా ఉన్న చెన్నారెడ్డి ఉద్యమాలకు  తన పరోక్ష మద్దత్తు   ఇచ్చేవాడని చెపుతారు.

 తెలంగాణా వాదానికి కాలం కూడా కలిసొచ్చింది. 1990వ దశకం మధ్యకాలం నుంచి తెలంగాణ సమాజం తీవ్ర సామాజిక సంక్షోభానికి లోనయ్యింది. వర్షాభావం, కరువు పరిస్థితులకు తోడు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, నీళ్ళు లేక, కరెంటులేక, విత్తనాలు పురుగుమందులు అందక తెలంగాణ రైతాంగం అతలాకుతలం అయ్యింది. రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి, వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. రైతు ఉద్యమాలను, నిరసనలను ప్రభుత్వాలు క్రూరంగా అణచివేసాయి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కరెంటు సరఫరా చేయాలని, విత్తనాలు అందించాలని, చివరకు అరాకొరగా పండిన పంటలను సమయానికి కొనాలని ఆందోళన చేసిన రైతుల మీద పోలీసు కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించే స్థాయికి వెళ్ళాయి.ఈ పరిణామాలు వ్యవసాయ ఆధారిత వృత్తులను, కులాలను, కూలీలను దెబ్బతీశాయి. మరోవైపు మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న చేనేత మొదలు ఇతర వృత్తులు కుప్పకూలిపోయాయి. నేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు పెరిగిపోయాయి గ్రామీణ సామాజిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రపంచీకరణ ముసుగులో కనిపించని కుట్రలతో పల్లె కన్నీరు పెడుతున్న దృశ్యాన్ని మేధావులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల ప్రతినిధులు బట్టబయలు చేస్తూ వచ్చారు. 

ఈ తెలంగాణ కన్నీటి పాటను గోరటి వెంకన్న,  గద్దర్,  విమలక్క, అందే శ్రీ, జయరాజ్   అదే క్రమంలో రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ లాంటి గాయకులు వాడవాడలా పాడివినిపించారు. కవులు, రచయితలు గ్రామాల విధ్వంసం మీద అనేక రచనలు చేశారు.  మరోవైపు చదువు కుంటుపడింది. ప్రభుత్వ ఖర్చును తగ్గించే పేరుతో ప్రైవేటు విద్యను ప్రోత్సహించే పేరుతో ఉన్నత విద్యావకాశాలను తెలంగాణ పిల్లలకు అందకుండా చేసి హైదరాబాద్‌ను కార్పోరేట్ విద్యా విపణిగా మార్చేశారు. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ టీ) తప్ప మిగతాది ఏదీ చదువు కాదనే స్థితి ప్రభుత్వమే కల్పించింది. ఉద్యోగాల మీద అధికారిక నిషేధం సాగింది. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించిన వందలాది పరిశ్రమలను మూసివేయడంతో లక్షలాది ఉపాధి కోల్పయారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు లేక, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రాక నిరుద్యోగుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ దశలో సంఘటితమై నిరసన తెలపడానికి, పోరాడటానికి కూడా అవకాశాలు లేకుండా ప్రభుత్వం అశాంతిని అణచివేసే అధికారం పోలీసు దొరకు అప్పగించింది. ఇట్లా ఒక దశాబ్ద కాలంలో మొత్తం తెలంగాణ సమాజాన్ని మార్కెట్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేసింది.  జన సభలు,  మహాసభలు,  మాటలు,  పాటలు,   ప్రజాసంఘాలు, కవులు,  కళాకారులు  తెలంగాణా నేలను చదును చేసారు.

1994లో ఎన్టీ రామారావు, ఆ తరువాత 1995లో చద్రబాబు నాయుడు అద్జ్హికారంలోకి వచ్చాడు.చంద్రబాబు నక్సల్స్ మీద మళ్ళీ నిషేధం విధించాడు. తెలంగాణా పదాన్ని కూడా అసెంబ్లీలో నిషేధించాదంటే ఆ పదం  అప్పటికే ఎంత పదునేక్కిందో తెలుసుకోవచ్చు. మాటలు, పాటలు పడునేక్కినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుధాలు వాడుతుంటారు. జనసభ గొంతుకగా ఉన్న బెల్లిలలితను ముక్కలు ముక్కలుగా నరికేసి భువనగిరిలో బావిలో పడేశారు. జనసభ కనకా చారి గుర్తుతెలియని వ్యక్తులే చంపేసి వెళ్ళారు. మహాసభ నాయకుడు మారోజు వీరన్న ఎదురుకాల్పుల్లో చంపేశారు. గద్దర్ గుండె గట్టిది కాబట్టి గురిచూసి కాల్చినా బతికి గజ్జేకట్టాడు కానీ లేకపోతే 1997 ఆగంతకులు ఆయననూ అంతం చేద్దామనే చూసారు. అప్పటికే వరంగల్ డిక్లరేషన్ వచ్చింది. ప్రత్యేక తెలంగాణా ఎందుకు అవసరమో స్పష్టంగా, సైద్ధాంతిక అవగాహనతో చెప్పింది, ఆ తెలంగాణా ప్రజాస్వామిక తెలంగాణా కావాలని కోరుకుంది జనసభ.

1999 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్న్రి అయ్యారు. ఈ దశలోనే తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభతోపాటు ఐక్య కార్యాచరణ వేదిక వంటివి వచ్చాయి.ఒకవైపు ప్రజాస్వామిక ఉద్యమాల మీద ప్రభుత్వ అణచివేత చర్యలు, ప్రజాసంఘాలు పౌరహక్కుల ఉద్యమకారుల మీద దాడులు, తెలంగాణవాదుల హత్యలు కొనసాగుతున్న దశను తెలంగాణ సమాజం చవిచూసింది. రైతుల ఆందోళనలు, విద్యార్థుల ఉద్యమాలు, వీధిన పడ్డ కార్మికుల అణచివేత మొదలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్న అన్నిశక్తుల గొంతు నులిమే ప్రయత్నం, బూటకపు ఎన్‌కౌంటర్లు,  ఆత్మహత్యలు  పెరిగాయి.  ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు మాట్లాడే మనిషి లేకుండా చేయడంతో ప్రజాస్వామిక విలువలు లేని పాలన తెలంగాణను అతలాకుతలం చేసింది. కేవలం హక్కులేకాదు, అవకాశాలు, బతుకుదెరువుకు భద్రతలేని స్థితి 1991-2000 మధ్య కొనసాగింది. అటువంటి వాతావరణంలో ప్రజాస్వామిక స్పహ ఉన్న మేధావులు, వామపక్ష ఉదారవాదులు, ప్రజాస్వామిక వాదులు కలిసి తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా తెలంగాణ సమాజాన్ని అధ్యయనం చేసిజాగృత పరిచే ప్రయత్నం చేశారు.దానికి తొలుత ప్రొఫెసర్ జయశంకర్, తరువాత ప్రొఫెసర్ కోదండ రామ్ నాయకత్వం  వహించారు.

ఈ దశాబ్దం పూర్తిగా తెలంగాణా లో భావచైతన్యం తెచ్చిన కాలం. తెలంగాణా వాదాన్ని సానబట్టిన కాలం.  రాష్ట్ర సాధనకు ఈ భావ వ్యాప్తిని ఒక సాధనంగా మలిచింది. ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణా వాదంలో తరచుగా వినబడే చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి దాకా ఆయన సలహాలు, సూచనలు విన్నవాళ్ళే . ఆయన వేసిచ్చిన లెక్కలు చెప్పిన వాళ్ళే. ఆయన రాసిచ్చిన ఉపాన్యాసాలు మాట్లాడిన వాళ్ళే. ఆరెసెస్ నుంచి ఆర్ ఎస్ యు దాకా ఆయన వాళ్ళ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా తన తెలంగాణా సిద్ధాంతం చెప్పేవారు. ఎవరిలోనైనా చంద్రగుప్తుడు దొరకక పోతాడా అని ఆయన కనిపించిన ప్రతి నాయకుడినీ చాణక్యుడి మాదిరిగా తన వాదం వైపు మలిచే ప్రయత్నం చేసారు. ఆయనకు 2000 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కలిశారు  తనకు కే సి ఆర్ లో ఈ తరానికి కావాల్సిన అసలు సిసలు తెలంగాణా రాజకీయ నాయకుడు కనిపించాడని  జయశంకర్ గారు స్వయంగా చెప్పారు.

తెలంగాణా గురించి జయశంకర్ దాదాపు జీవితమంతా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. 1969 వైఫల్యం తరువాత ఆయన తెలంగాణా నినాదాన్ని ఒక వాదంగా నిలబెట్టే ప్రయత్నం చేసారు. ఆ వాదంలో ఒక జాతి ఆర్థికంగా ఎదగడానికి, స్వాలంభన తో మనగలగ డానికి కావాల్సిన శాస్త్రీయ ప్రతిపాదనలు ఉన్నాయి.గాలిలో ప్రతిధ్వనించే  ప్రాంతీయ నినాదాన్ని, ఒక బలమైన ప్రాంతీయ అభివృద్ధి  ఆకాంక్షగా, ప్రాంతీయ అస్తిత్వ వాదంగా సిద్దాన్తీకరించిన మేధావిగా ఆయన తన ప్రతి ప్రతిపాదనలో రెండువైపులా నుంచి ఆలోచించేవాడు. అలా ఆలోచించడం వల్లే తెలంగాణా వాదం ఒక సిద్ధాంతంగా అందరూ ఆమోదించే దశకు చేరింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన ఈ దశలో ప్రభుత్వం చేస్తోన్న ప్రతిపాదనల్లో జయశంకర్ ప్రతిపాదించిన ప్రాంతీయ సిద్ధాంతంలోని అనేక అంశాలు కనిపిస్తున్నాయి. అపోహలు, అనుమానాలు, ఆదిపత్య ధోరణులు, అపనమ్మకాలు, షరతులు, ఉల్లంఘనలు ఇవి కొనసాగుతున్నంతకాలం ఏ జాతికూడా ఐక్యంగా మనజాలదన్నది జయశంకర్ అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆయన పడే పడే చెప్పేవారు. దీని ప్రాతిపదికనే ఆయన తన తెలంగాణా వాదానికి పదును పెట్టారు. ఆంద్ర ప్రదేశ్ ఏర్పాటయిన నాటి నుంచి తెలుగు ప్రజల్లో జాతి భావనకంటే ఈ పోకడలే ఎక్కువగా ప్రభావితం చేశాయి. అది అనేక సందర్భాల్లో ఉద్యమాలు, ఆందోళనల రూపంలో చరిత్రలో ఆవిష్కృతం అయ్యింది. దీనికి పరిష్కారం ప్రాంతాలుగా విడిపోయిప్రజలుగా కలిసి ఉండవచ్చునన్నది ఆయన ప్రతిపాదనల్లో మొదటిది. కొన్ని షరతులు, ఒప్పందాలతో కలిసిన ఇద్దరిలో నిరంతరం ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు ఉన్నప్పుడు ఎవరికీ వారుగా ఉండడమే మంచిది కాబట్టి విభజన ఒక్కటే పరిష్కారం అని ఆయన భావించారు. అలా విడిపోవడం వలన జరిగే నష్టం కూడా లేదు. నిజానికి కలిసిన తరువాతే తెలుగుజాతి భావన ఉందనుకోవడం కూడా పొరపాటు. రెండు ప్రాంతాలు కలవక  పూర్వం కూడా తెలంగాణా ఆంధ్రా ప్రాంత్రాల మధ్య అన్నిరకాల సంబంధాలు, అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రెండు ప్రాంతాల్లో వేమన పద్యాలు, సుమతీ శతకాలు, శ్రీ శ్రీ మహా ప్రస్థానాలు, బ్రహ్మం గారి కాలజ్ఞానాలు, గుర్రం జాషువా గబ్బిలాలు నన్నయ, తిక్కన, సోమన ల  పురాణ పారాయణాలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు విడిపోయినా అవి కలిసే ఉంటాయి. విభజనవల్ల తెలుగు భాషకో, సంక్రుతికో జరిగే నష్టం ఏమీ లేదు.

ఈ ప్రతిపదికను పునాదిగా చేసుకునే జయశంకర్ తెలంగాణా వాదాన్ని ఒక గుణాత్మక, క్రియాశీల సిద్ధాంత భూమికగా మలిచారు. ఇది 1968-69 లో, 1971-72 లో వచ్చిన వాదాలకు భిన్నమైనది. ఆ రెండు వాదాలు ఒక ప్రాంతం నుంచి మరొకరు వెల్లిపోవాలనో, వెళ్లి పోతామనో వచ్చినవి. కానీ గడిచిన ఇరవయ్యేళ్ళుగా జయశంకర్ ఆలోచనల ప్రభావం తో వచ్చిన ఉద్యమాలేవీ తెలంగాణా నుంచి ఆంధ్రా- రాయలసీమ ప్రజలు వెళ్ళిపోవాలని ఏనాడూ అనలేదు. కేవలం అధికారం, ఆధిపత్యం మాత్రమే వద్దన్నది తెలంగాణా ఉద్యమ సారాంశం. జాగో- బాగో అన్న వారిని కూడా వారించి కేవలం మీరు మేల్కోండి మీ వాదనను వినిపించి వారిని ఒప్పించండి అని మాత్రమే ఆచార్య జయశంకర్   చెప్పేవారు. దానినే ఆయన భావ చైతన్యం అన్నారు. నిద్రలో కూడా చైతన్యంతో మెలిగే మనసుకే కలలోస్తాయి మరి. సరిగ్గా ఆ కల కెసీఆర్ మనసులో కూడా నాటాడు ప్రొఫెసర్ జయశంకర్. ఆ కల మొదలయినప్పటి నుంచి కెసీఅర్ నిద్ర పోలేదు, అంతటితో ఆగకుండా తోటి రాజకీయ పార్టీల నిద్ర చెడగొట్టడం మొదలు పెట్టాడు.

పింక్ రెవల్యూషన్ 

 నేలగుణం తెలిసిన వాడు విత్తనాలు నాటడానికి సరయిన కాలాన్ని ఎన్నుకుంటాడు.   కె. చంద్రశేకర్ రావు (కె  సి ఆర్) కు తెలంగాణా నేల గుణం బాగా తెలుసు. కాబట్టీ  ఇప్పుడు తెలంగాణా మొత్తాన్ని గులాభీ మయం చేసేసాడు. నిజానికి ఆయనకు కాలం  చంద్ర బాబు పాలన రూపంలో కలిసొచ్చింది. నిజానికి ఆయన చద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మొదటి కాబినెట్ లో సీనియర్ మంత్రి. ఆ తరువాత శాసన సభ డిప్యూటీ స్పీకర్. 1999 ఎన్నికల్లో గెలిచాక బాబుగారి సంస్కరణల బండికి పట్టా పగ్గాలు లేకుండా పోయాయి. ఆయన  సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇది రైతులకు ఆగ్రహం తెప్పించింది. అఖిల పక్షం ఆధ్వర్యంలో 2000 ఆగస్టు 27న  అసెంబ్లీ కి బయలుదేరిన సందర్భంలో మార్గమధ్యలో బషీర్ బాగ్ లో పోలీసులు విరుచుకుపడి కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో నలుగురుచనిపోయారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చంద్రబాబు కు అప్రతిష్ట తెచ్చిన సంఘటనగానే కాకుండా ఆయన సంస్కరణల ఎజెండాను జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది. అలాగే ముఖ్యంగా తెలంగాణా రైతాంగంలో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  దీనిని అదునుగా తీసుకుని ఆయన సంసకరనలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. పేరుకు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నా ఆయన ఆఫీసుకి వెళ్ళకుండా జయశంకర్, ఇన్నయ్య,  ప్రకాష్ ల తో కలిసి అధ్యయనంలో మునిగిపోయారు. 2001 ఏప్రిల్ 27 న పదవికి రాజీనామా చేసిన ఆయన తెలంగాణా రాష్ట సమితి స్థాపించారు.

కె సి ఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. చెన్నారెడ్డి నుంచి చిన్నా రెడ్డి దాకా అనేకమందిని  చూసిన వాళ్లకు ఆయనమీద పెద్దగా నమ్మకం కుదుర లేదు. కానీ ఆయన వ్యూహాత్మకంగా కదిలారు. చతురతతో వ్యవహరించారు. తొలుత మేధావులను సమీకరించారు. తెలంగాణా విద్యావంతుల వేదిక తో సహా అనేక రచయితల సంఘాలు, అప్పటికీ ఉన్న తెలంగాణా జర్నలిస్టుల ఫోరం, కవులు, రచయితలు, ప్రోఫెసర్లతో సలహాలు సూచనలు తీసుకున్నారు. రెండో దశలో రాజకీయ సమీకరణాల మీద దృష్టి పెట్టారు. అప్పుడు ప్రతిపక్షం లో ఉన్న కాంగ్రెస్ మీద గురిపెట్టాడు. 2004 ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నాడు. దీనివల్ల రెండు ప్రయోజనాలు నెరవేరాయి. ఒకటి దేశంలోని ఒక ప్రధాన పార్టీని, అలాగే యూపీఏ కూటమిని తెలంగాణాకు ఒప్పించడం. రెండోది ఆయన తన పార్టీని ఎన్నికల్లో పరిమిత స్తానాల్లోనయినా నేగ్గించుకోవడం.  మిషన్ వన్ పూర్తయినాక ఆయన తెలుగుదేశం మీద కన్నేశారు. 2009 ఎన్నికల్లో ఒక్క తెలుగు దేశం పార్టీనే కాకుండా మరో మూడు పార్టీలను ముగ్గులోకి దించారు. అప్పటికే బీ జీ పీ కూడా తెలంగాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇట్లా దేశంలో దాదాపు అన్ని జాతీయ పార్టీలు, అలాగే మన రాష్ట్రంలోని అన్ని ప్రధాన పక్షాలను ఒప్పించిన ఆయన అందర్నీ తెలంగాణా బిల్లు సందర్భంగా ఒక నైతికత మారు మూలకునెట్టేశారు  నెట్టేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీలు అధికారికంగా తెలంగాణాను వ్య్తిరేకించలేని స్థితి రావడం వెనుక ఆ పార్టీల్లో ఉన్న లోపం కాదు, అది చంద్ర శేకర్ రావు వ్యూహం.

కెసీఆర్ లాబీయింగ్ ద్వారా తెలంగాణా తెస్తానని చెప్పినప్పుడు కూడా విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. పోరాటాలద్వారా తప్ప రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు పని చేయవని కూడా చాలా మందే అన్నారు. ఆయన చాలామందిని అలాగే నమ్మించాడు. రాజకీయంగా లాబీయింగ్ చేస్తున్నట్టే ఉద్యమం చేసాడు, ఆయన 2009 నవంబర్ లో నిరాహార దీక్ష చేస్తారని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఆయన దీక్షకు దిగింది కూడా ఉద్యోగుల సమస్య మీద తప్ప తెలంగాణా కోసం కాదు. తెలంగాణా  పార్లమెంటు ద్వారా తప్ప వీధి పోరాటాల ద్వారా  కాదని ఆయనే పదేపదే చెప్పేవారు. కానీ ఆయన నిరాహార దీక్షను ఒక ఆయుధంగా చేసుకున్నది ప్రజలను సమాయత్తం చేసుకోవడానికి తప్ప ప్రభుత్వాన్ని బెదిరించడానికి కాదు. దీక్షకు దిగిన రెండో రోజునే ఆస్పత్రికి తరలించి సెలైన్ ఎక్కిస్తారని, ఆ తరువాత నిమ్మరసం ఇచ్చి విరమిమ్పజెస్థారని ఆయనకు కూడా తెలుసు. రాజశేఖర్ రెడ్డ ఆకస్మిక మృతి, ఒక బలహీనమైన ముఖ్యమంత్రిగా రోశయ్య ఉండడం, తెలంగాణా కాంగ్రెస్ లో బలమియన్ నాయకత్వం లేకపోవడం ఇవన్నీ కాలంతో పాటు ఆయనకు కలిసివచ్చిన సందర్భాలు.  సందర్భాన్ని సరిగ్గా తనకు, తెలంగాణాకు అనుకూలంగా మార్చుకోవదానికే ఆయన దీక్షను ప్లాన్ చేసుకున్నాడు. నిజంగానే దానిని మూడో రోజుకు ముగించాలని కూడా అనుకుని ఉంటాడు.

ప్రజలెప్పుడూ నాయకుల చేతిలోనే ఉండరు. కొన్ని సార్లు నాయకులు కూడా ప్రజల చేతిలో పావులు కాక తప్పదు. పైగా అత్యంత చైతన్యశీలమైన తెలంగాణా సమాజంలో నాయకుల మాటే ఎల్లకాలం చెల్లుబాటు కాదు.
మూడో రోజుకు  దీక్ష ముగించినట్టు వార్తలు రావడంతో తెలంగాణా సమాజం ఒక్కసారిగా ఆప్రమత్తమయ్యింది. తెలంగాణా వచ్చేదాకా దీక్ష కొనసాగించాల్సిందేనని శాసించింది. యావత తెలంగాణా సమాజం ఒక్కటయ్యింది. విద్యార్థులు ముందువరసలో నిలబడ్డారు. ప్రజా సంఘాలు, సామూహిక చైతన్యంతో కదిలాయి. అట్లా రోజులు గడుస్తున్నాయి, ఆరోగ్యం క్షీనిస్తోందని డాక్టర్లు చెపుతున్నారు. అయినా ప్రజలు ఢిల్లీ దిగివచ్చేదాకా వదలలేదు. నిజానికి ఆనాటి పరిస్థితి ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు దయనీయంగా , అమానవీయంగా అనిపించి ఉంటుంది. నిజానికి అది లేకపోతే గులాబీలకు ఇవాల్టి గుభాలింపు లేదు.

ఇదంతా ఒక ఎత్తయితే 2009 నుంచి నుంచి 2014 దాకా కీ సి ఆర్ కు అండగా ప్రజల్ని నిలబెట్టింది మాత్రం తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్), దాని నాయకుడు ప్రొఫెసర్ కోదండ రామ్. కోదండ రామ్ ను ఏరికోరి ఎంపిక చేసుకున్నాడా లేక తెలంగాణా విద్యావంతుల వేదిక అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి యాధృశ్చికంగా జరిగిందా తెలియదుగానీ ఆయన వల్ల ఉద్యమానికి నిండుదనం వచ్చింది. నిలకడగా నడిచింది. పరిణతి ప్రదర్శించింది. ఆత్మ హత్యలవంటి ఎన్ని ఉద్వేగాలున్నా అణచుకుని, దిగమింగుకుని ఉద్యమాన్ని హింసా మార్గం పట్టకుండా కాపాడింది జాక్. నిజంగానే హింస ప్రవేశించి ఉంటె తెలంగాణా అసలు సాధ్యమయ్యేదే కాదు. అంతే కాదు ఉద్యమాన్ని దీర్ఘ కాలికంగా నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగాసృజనాత్మక కార్యక్రమాలను మిళితం చేసింది. వంటా వార్పూ, ఆట-పాటా, ధూంధాం, బతుకమ్మ, బోనాలు ఇవన్నీ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాయి. ముఖ్యంగా తెలంగాణా సంస్కృతిని జోడించడం మహిళలను ఆకర్షించి, సమస్యను అర్థం చేసుకునేతట్టు చేసింది. వంటా వార్పూ చాలా చోట్ల సామాజిక సంబంధాలను మెరుగు పరిచింది. వండి వార్చిన తరువాత ఊరంతా ఒకే చోట కలిసి భోజనం చేయడం విడిగా అయితే చాలా పెద్ద సామాజిక సంస్కరణ. అలాగే సకలజనుల సమ్మె అనేది నిజానికి మొత్తం ఉద్యమానికి కీలకమైన మలుపుగా చెప్పుకోవాలి. 

కార్మికులకు సమ్మె చేసే హక్కు చట్టబద్ధంగా ఉన్నా సమ్మెలను నిషేధించే న్యాయస్థానాలు, న్యాయ మూర్తులు ఉన్న కాలంలో ప్రజలంతా సామూహికంగా సమ్మెకు దిగడం ఒక మహా ధిక్కారం. ఒక దశలోతెలంగాణా సమాజం జాక్ ఏది చెప్పితే అది చేసే యాంత్రికత వెళ్ళిపోయింది. అందుకే జాక్ ఇచ్చిన ప్రతిపిలుపుకు యావత తెలంగాణా సమాజం స్పందించింది. మొత్తం ఉద్యమంలో ఒక మహా విషాదం ఆత్మహత్యలు. ఎక్కడ కూడా ఆత్మ హత్యా ఒక పోరాట రూపం కాదు. నిజానికి అదొక పిరికితనం. ఆ పిరికి తనం ఎలా మొదలయ్యిందో కానీ ఒక మహమ్మారిలా మారి వేలాదిమందిని బలిగొన్నది.  ఉద్యమాన్ని నిలబెట్టడానికి సాగిన క్రతువులో ఆ నవయువకులు సమిధలై తమను తాము సమర్పించుకున్నారు. ఒక రకంగా వారు కూడా ఈ విజయానికి కారకులు.

 ఈ ఆరుదశాబ్దాల్లో అడుగడుగునా ఈ నేలతల్లి విముక్తి కోసం పోరాడిన వీరులకు, నవ సమాజాన్ని కలలుగని కరిగిపోయిన అమరులకు ఈ విజయం అంకితం కావాలి. వాళ్ళ కలలు నెరవేర్చడమే తెలంగాణా తొలి ప్రభుత్వపు అంతిమ లక్షం కావాలి.! అంతకు మించిన పునర్నిర్మాణం ఇంకేముంటుంది?!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి