"భయంకరమైన
స్వర్ణపిశాచి నగరం
నిద్రపోతూ ..
ఆ
నిద్రలో కలవరింతలు
పెడుతూ ఉంది".
ప్రఖ్యాత రష్యన్ విప్లవకారుడు,
రచయిత మాక్సిమ్
గోర్కీ న్యూయార్క్
నగరం గురించి చేసిన సుదీర్ఘ వర్ణణ లో ఇదొక వాక్యం. వాక్యం అనడంకంటే
దానిని శాపనార్థం
అనొచ్చేమో!
ఎందుకంటే
ఆయన రాసిన the monstrous
metropolis చదివితే ఆయన ఆ నగరాన్ని
తీవ్రంగా
అసహ్యించుకున్నట్టు
అర్థమౌతుంది.
1906లో అమెరికా వెళ్లిన మాక్సిమ్
గోర్కీ the monstrous
metropolis పేరుతో ఒకవ్యాసం
రాశారు, దానితోసహా
మరికొన్ని
రచనలు కలిపి 'స్వర్ణపిశాచి
నగరం' పేరుతో తెలుగులోకి
అనువదించి
ప్రచురించారు.
1986 లో ఈ పుస్తకం చదివినప్పుడు
పెద్దగా అర్థం కాలేదు. ఆయన ఒక విప్లవకారుడిగా
పెట్టుబడిదారీ
వ్యవస్థ నిర్మించిన
ఆ మహానగరంలో
నలిగిపోతున్న
శ్రామిక వర్గపు వ్యధను వర్ణించాడని
అనుకున్నాను.
ఆ తరువాత 2006 లో నేను న్యూయార్క్ నగరాన్ని చూసిన తరువాత, గోర్కీ కి అక్కడ జరిగిన పరాభవం గురించి విన్న తరువాత, చదివిన తరువాత ఆయన న్యూయార్క్ నగరాన్ని శపించాడని అర్థమయ్యింది. నిజానికి నేను చూసిన న్యూయార్క్ నిద్ర ఎరుగని నగరం. ఇరవైనాలుగు గంటలు తళతళా మెరిసే నగరం, కళకళలాడే నగరం. సజీవంగా నిలబడ్డ తేజోదీపం. ఇప్పుడు నిర్జీవం ఆవహిస్తున్నట్టు, ఆ మగతలో ఆ నగరం కలవర పడుతున్నట్టు, కలవరింతలు పెడుతున్నట్టు కనిపిస్తోంది.
గత కొద్దిరోజులుగా న్యూయార్క్ నగర వార్తలు నన్నూ కలవరపెడుతున్నాయి. నిజానికి మనమంతా కలవరంలోనే ఉన్నాం. ప్రపంచమంతా కలవరపడడమే కాదు, కన్నీరు పెడుతోన్న దశ ఇది. అయినా మనకు ఎంతో కొంత ధైర్యంఉంది. మన భారతీయుల ప్రవర్తన, మన మీడియా, సోషల్ మీడియా లో వస్తోన్న సందేశాలు, జోకులు, టెలివిజన్ లలో తరచూ కనిపిస్తూ, కథలు చెపుతూ, రకరకాల టాస్క్ లతో మనల్ని ఎంగేజ్ చేస్తూ కనిపెట్టుకుకు కాపాడుతున్నామని చెపుతున్న మన నాయకులు, మన చుట్టూ ఉన్న పౌర సమాజం ప్రదర్శిస్తోన్న సేవానిరతి, ప్రభుత్వం చూపిస్తోన్న శ్రద్ధ, చేపడుతున్న చర్యలు కారణాలేవైనా మనమిక్కడ పెద్దగా భయపడడం లేదు. కానీ చైనా ఇంకా భయపెడుతోంది. అమెరికా భయపడుతోంది. ఐరోపా, ఆఫ్రికా ఇట్లా ప్రపంచమంతా బిక్కిబిక్కుమంటోంది. ఈ పరిస్థితుల్లో నాకు న్యూయార్క్ నగరం పదేపదే గుర్తొస్తోంది. ఒక దిక్కూదివాణం లేని దిమ్మరిదేశంగా అమెరికా కనిపిస్తోంది.
నేను మొదటిసారి అమెరికా వెళ్ళింది 2005లో హవాయి ద్వీపానికి, అక్కడినుంచి కాలిఫోర్నియా, లాస్ ఏంజిలిస్, బర్కీలీ ఇట్లా పశ్చిమ తీరంలోని సిలికాన్ వ్యాలీ లో చాలాప్రాంతాలు రెండుమూడు సార్లు వెళ్లాను. అది తెలుగువాళ్ళ స్వర్గసీమ. అక్కడివారికోసం మా మువ్వా సత్యం సౌజన్యంతో 'సిలికానుక' పేరుతో ఒక ప్రత్యేక సంచిక కూడా రూపొందించాను. అయినా సరే నాకు న్యూయార్క్ నగరమే కళ్ళల్లో మెదులుతోంది. అది నా జీవిత గమనాన్ని మార్చిన నగరం. ప్రతిష్టాత్మక న్యూస్కూల్ యూనివర్సిటీ లోని ఇండియా-చైనా ఇన్స్టిట్యూట్ లో ఫెలో గా చేరడంతో 2006 నుంచి ఆ నగరంతో నాకు అనుబంధం ఏర్పడింది. రెండేళ్లపాటు ఆ నగరం నాకు తాత్కాలిక విడిది అయ్యింది.
న్యూస్కూల్ యూనివర్సిటీ న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన మాన్ హట్టన్ లో, అత్యంత విలాసవంతమైన 5th అవెన్యూ లో ఉంటుంది. మా విడిది కూడా అదేవరుసలో న్యూయార్క్ యూనివర్సిటీ ఎదురుగా ఉండే వాషింగ్టన్ స్క్వేర్ హోటల్. మా అధ్యయనం అంతా ప్రపంచీకరణ నేపథ్యంలోనగరీకరణ కావడం వలన, న్యూయార్క్ మా కార్యకేంద్రం కావడం వలన ఆ నగరాన్ని కలియతిరిగే అవకాశం, నగర పరిణామ క్రమాన్ని చదివే అవకాశం, నగర సామాజిక జీవన గతిని పరిశీలించే అవకాశం, ఆ నగర ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్రను, చైతన్యాన్ని తెలుసుకునే అవకాశం కలిగాయి.
నిజానికి న్యూయార్క్ ఒక సజీవ చైతన్య స్రవంతి. ఒకప్పుడు బానిసల అంగడిగా ఉన్న నగరం సామాజిక ఉద్యమాలకు, తిరుగుబాట్లకు, పౌరహక్కుల ఉద్యమానికి, ప్రజాస్వామ్య వికాసానికి ప్రధాన కేంద్రం గా ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని నిలబడింది. ఆధునిక స్వేచ్చా యుగకర్తలైన మాల్కమ్ ఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్-జూనియర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ల వంటి ఎందరినో మలచిన హార్లెమ్, బ్రూక్లిన్ మురికివాడలు, న్యూయార్క్, కొలంబియా, హార్వర్డ్ విశ్వవిద్యాలయాలు, ఇట్లా తరతరాలుగా భిన్నత్వం, బహుళత్వంలో బతుకుతున్న జీవితం న్యూయార్క్. విశ్వ విఫణిగా, ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా మిరుమిట్లు గొలిపే కాంతిలో వెలిగిపోయిన నగరం ఇవాళ విషాద వలయంలో విస్తుపోయి చూస్తోంది.
ఇప్పుడు అమెరికాలో న్యూయార్క్ కరోనావైరస్ రాజధానిగా మారిపోయింది. నగరంలో కోవిడ్-19 కేసులు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. ఈ మంగళ వారం అర్ధరాత్రికి అమెరికా లోని 50 రాష్ట్రాల్లో, 3 ఇతర పాలక మండలాలు కలిపి 583,220 కేసులు నమోదైతే ఒక్క న్యూయార్క్ నగరంలోనే 106,763 మందికి కరోనా సోకింది. ఇక దేశవ్యాప్తంగా 23,654 మంది కరోనాతో మరణిస్తే ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో 10,834 మంది ప్రాణాలు వదిలారు. న్యూయార్క్ నగరం లోనే కనీసం 7500 వరకు మరణించి ఉంటారని అంచనా. న్యూయార్క్ నుండి అందుతున్న వార్తల ప్రకారం ఈ అత్యాధునిక నగరంలో కనీసం ముక్కుకు కట్టుకునే మాస్క్ లు దొరకడం కూడా కష్టమైపోతోంది. ఆస్పత్రులు, అంత్యక్రియలు జరిపే స్మశానాలు నిండిపోయాయి. ఇవాళ చనిపోయిన మనిషికి వారంపది రోజులైనా పూడ్చిపెట్టే పరిస్థితిలేదు. రోడ్డు పక్కన, వీధి చివరల అనేక అనాధ శవాలు పడి ఉంటున్నాయి, అంత్యక్రియలు జరిపే నాధుడు లేక కుళ్లిపోయి కనిపిస్తున్నాయి.
నిన్నటిదాకా నిద్ర ఎరుగని ఆ నగరం 24 గంటలు మేల్కొనే ఉండేది. ఇప్పుడు స్మశాన వాటికలు 24 గంటలు పనిచేయాల్సివస్తోంది. అయినా సరే నగరంలో ఖననానికి స్థలాలు సరిపోవడంలేదు. ఇప్పుడు శవాలను నగరం పొలిమేరల్లో ఉన్న హార్ట్ ఐలాండ్ కు తీసుకువెళ్తున్నారని కథనాలు వస్తున్నాయి. కోవిద్ మృతులకు ఇప్పుడు అక్కడ 133 ఎకరాల పాడుబడ్డ దీవిని స్మశాన వాటికగా మార్చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
గోర్కీ ఈసడించుకున్నట్టుగానే నగరం నిండా జనం, కుప్పలు తెప్పలుగా జనం, ఇసుకేస్తే రాలనంత జనం, మెట్రో రైలు పెట్టెల్లో, టైం స్క్వేర్ బజార్లలో, మాల్స్ లో, పబ్బుల్లో, బ్రాడ్ వే వీధుల్లో, అవెన్యూల్లో, మురికివాడల్లో, చైనా బజార్లలో ఎక్కడ చూసినా జనం ఉండడం న్యూయార్క్ నగర లక్షణం. ఇప్పుడు ఎక్కడ చూసినా శవాలతో పిశాచనగారాన్ని తలపిస్తోంది. అందులో ఎక్కువగా సమిధలవుతోంది పేదలు, నల్లవాళ్ళు, ముస్లిం దేశాలనుంచి వలసవచ్చిన వాళ్ళు, మురికి కూపాల్లో నివసిస్తోన్న వాళ్ళు. ఇన్సూరెన్స్ లు, జీవితానికి ఎలాంటి భీమా లేనివాళ్లు, చేతికి గ్లౌజులు, మూతికి మాస్కులు దొరకానివాళ్ళు, ఆస్పత్రులకు వెళ్లలేని వాళ్ళు ముందువరసలో వెళ్లిపోతున్నారు. వారికి నా నివాళి.
ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న మన మిత్రులు గుర్తొస్తున్నారు. మన తెలంగాణా పిల్లలు గుర్తొస్తున్నారు. 2010 లో నేను అమెరికా వెళితే నాకోసం,నా ప్రసంగాల కోసం, సమావేశాలు ఏర్పాటు చేసి, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కలగన్న మిత్రులు గుర్తొస్తున్నారు. కోసం కనీసం పదిపదిహేను రాష్ట్రాల్లో2010లో మీటింగులు పెట్టిన తేనా గుర్తొస్తోంది. ఆ మీటింగులకోసం తెల్లవార్లూ బిక్కుబిక్కుమంటూ ఎదురుచూసిన అమాయకమైన తెలంగాణా ముఖాలు గుర్తొస్తున్నాయి. తెలుగువాళ్లు గుర్తొస్తున్నారు. భారతీయులు, ఆఫ్రికన్లు, నలుపు, తెలుపు తో పాటు అన్నిరంగులు మమేకమై మెరిసే బహుళ వర్ణ సింగిడి లాంటి ఆ దేశమే గుర్తొస్తోంది. ఇవాళ కొందరికి కాల్స్ చేసాను, కొందరికి మెయిల్స్ రాసాను. మనందరం మరోసారి కలుసుకోవడంకోసం సిద్ధంగా ఉండాలని కోరాను. వాళ్లంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. కొందరు వర్క్ ఫ్రొం హోమ్, ఇంకొందరు హోమ్ వర్క్ లో ఉన్నారు. కరోనానంతర కాలంలో ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కలుసుకుందాం!!
ప్రొ. ఘంటా చక్రపాణి, ఫెలో (2006-08), ఇండియా చైనా ఇన్స్టిట్యూట్, న్యూ స్కూల్, న్యూయార్క్
"
It is a good article.
రిప్లయితొలగించండి*Jeevan Kumar
Hyderabad,
TELANGANA State
మంచి సమాచారం అన్నగారు
రిప్లయితొలగించండిVery touching
రిప్లయితొలగించండిAnd filling hope for a future
After Corona
సర్ మీ అంతరంగంలోని కరోనా కల్లోలం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు ఎవరి బాధలు వాళ్లవే. కరోనా మహమ్మారి నుంచి ఎలా భయటపడాలని ఆలోచిస్తున్నవాళ్లే. కాని మీరు అమెరికాలో గడిపిన కేవలం రెండేళ్ల జ్ఞాపకాలను, తెలంగాణ ఉద్యమంలో భాగంగా చుట్టపు చూపుగా వెళ్లిన అరుదైన ఘటనలను ఎంతో ఆసక్తికరంగా వర్ణించడంతో పాటు అక్కడి సహచర మిత్రబృందాన్ని గుర్తుపెట్టుకొని వారి క్షేమాన్ని తలూస్తూ మీ మహన్నోత మానవీయ తత్వాన్ని చాటుకున్నారు. మీ ఇష్టానికి పాత్రులైనా మీ మిత్ర బృందానికి మీకు ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటూ. మీ అజయ్
రిప్లయితొలగించండిమాగ్జిం గోర్కీ శపించాడేమో...?! బాధాకరమైన సందర్భంలో న్యూయార్క్ ఉండటం విషాదం. ఇంతకి ఈ వ్యాప్తికి కారణాలు విశ్లేషణ మరొక వ్యాసం రాయండి సర్...
రిప్లయితొలగించండిBeautiful analysis of the cause and effect! Loved reading it as its contents have echoed my heart! Kudos!!
రిప్లయితొలగించండి