శుక్రవారం, ఏప్రిల్ 17, 2020

Poetry Forum ప్రసాదమూర్తి, జింబో కవితలు!

|| ఒక వార్త చెప్పండి ||

 ప్రముఖ కవి మిత్రుడు ప్రసాదమూర్తి రాసిన కవిత ఇది. పేస్ బుక్ నుంచి. 

ఎవరైనా ఒక వార్త చెప్పండి
వాళ్ళంతా ఇళ్ళకు చేరుకున్నారని-
అక్కడేమీ విస్తళ్ళలో జీవితం వేడివేడిగా పొగలు కక్కదు
అక్కడ కూడా చెంపల మీద చీకటినే తుడుచుకోవాలి
చీకటి పొట్టలో మోకాళ్ళు పెట్టుకు ముడుచుకోవాలి
అయినా వాళ్ళు ఇళ్ళకే పోవాలి
ఆకలితో చచ్చినా
అక్కడ కనీసం శవాలను గుర్తుపట్టే
మరికొన్ని శవాలుంటాయి
స్క్రీన్ మీద జాలువారే ఈ డిజిటల్ కన్నీళ్ళ కంటే
కొన్ని తడి నీళ్ళయినా వారి ఆత్మలకు
అక్కడ తగిలే అవకాశాలుంటాయి

ప్రసంగాల అట్టహాస ప్రహసనాలతో
పేదరికాన్ని తరిమికొట్టలేమని మనకంటే వాళ్ళకే బాగా తెలుసు
వాళ్ళకి చాలా తెలుసు
ఇక్కడ ప్రతిదీ ఎన్నికల ప్రచారమేనని-
మృత్యువు కూడా ఒక బ్యాలెట్ పత్రమేనని వాళ్ళకి బాగా తెలుసు
అయినా వారు పోదామనుకుంటున్నారు
ఇళ్ళకో..తమ సజీవ మృతదేహాలు తల దాచుకునే సమాధుల్లోకో-
ఎవరైనా ఒక వార్త చెప్పండి
వాళ్ళంతా ఇళ్ళకు చేరుకున్నారని
ఎవరి నెత్తిమీద వారు ఒక దేశాన్ని పెట్టుకుని
గుడ్డిగా ఎటో వెళ్ళిపోతున్నారు
ఏ దేశం మీదంటే ఈ దేశమే అంటారు
మీరెటు పోతున్నారంటే మా దేశానికంటారు
ఏ దీపాలతో వారికి దారి చూపిస్తాం ?
ఆకలి పేగుల్ని వందల కిలోమీటర్లు
పరచుకుంటూ వెళ్ళిన వాళ్ళు
మైలు రాళ్ళకు నెత్తుటి బొట్లు పెడుతూ
వచ్చిన దారి పట్టారు
వాళ్ళేమీ చచ్చిపోరు
కొన ఊపిరితోనైనా బతికే వుంటారు
వాళ్ళకోసమో వాళ్ళ పిల్లల కోసమో కాదు
మన కోసం.. మన నగరాల దీపకాంతుల కోసం-
ఏకాంత వాసంలోనూ చీమంత అసౌకర్యం లేని
మన అమందానంద నిర్బంధాల కోసం
వాళ్ళు ఎలాగోలా బతికే వుంటారు
ఎవరైనా ఒక వార్త చెప్పండి
వాళ్ళంతా ఇళ్ళకు చేరుకున్నారని
......................... .......................
-ప్రసాదమూర్తి
15.04.20


 మిత్రులు, కవి రచయిత మంగారి రాజేందర్ (జింబో) రాసిన కవిత సాక్షిలో అచ్చయ్యింది.

1 కామెంట్‌: