రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లెల్లో అలజడి, ఆం దోళన కనబడ్డాయి. టెలివిజన్లలో ఆ వార్తను చూసిన కొందరు రాజకీయ నాయకులు అప్పటికప్పుడు స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు పనిలో పనిగా తెలంగాణ రాష్ట్ర సమితి జెండాలను పీకేసి, గద్దెలు కూల్చేశారు. ఇంకొంతమంది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
సరిగ్గా ఈ సంఘటనలు జరుగుతున్న సమయంలో కరీంనగర్ జిల్లా ములకనూరు నుంచి ఒకతను ఫోన్ చేశాడు. ఆయన ఆవేశంతో రగిలిపో తున్నాడు. రైతులను ఇలా మోసం చేయవచ్చునా, మ్యానిఫెస్టోలో చేర్చినప్పుడు కేసీఆర్ ఇవన్నీ ఎందు కు ఆలోచించలేదు? అని సున్నితంగానే ప్రశ్నించా డు. అంతటితో ఆగకుండా పనిచేయని ఉద్యోగులను నెత్తికి ఎక్కించుకుంటూ పనిచేసే రైతుల పొట్టలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలా?అని అడిగాను. ఒక వైపు రైతులు ఆందోళనలో ఉంటుం మరోవైపు ఉద్యోగుల పే-కమిషన్ అవసరమా, వాళ్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ పేరుతో వేలకు వేలు ఇవ్వొచ్చా అని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలో నిజాయితీ ఉందనిపించింది. కానీ ఇప్పుడు ఉద్యోగుల ఊసెందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఆయనే చెప్పా డు, ఉద్యోగులకు కేసీఆర్ వరాలు అంటూ టెలివిజన్ చానెల్స్‌లో స్క్రోలింగ్ వస్తున్నదని. నిజానికి ఆ రోజు ఉద్యోగుల వేతనాలు, కొత్త పే కమిషన్, ఇంక్రిమెం ట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ టీవీ చానెల్స్‌లో నిజంగానే స్క్రోలింగు లు, వార్తలు వచ్చాయి. ఇది పుండు మీద కారం చల్లినట్టు రైతులకు కోపం తెప్పించింది. నాకు కాల్ చేసి న వ్యక్తి కూడా అలాంటి ఒక రైతే. నిజానికి ఈ రెండు వేరువేరు అంశాలు.ఉద్యోగులకు ఇచ్చింది కొత్త వరం ఏమీ కాదు. అది ఎన్నికల మ్యానిఫెస్టో లో ఉన్నదే. ఇక పే కమిషన్ కూడా ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు. దాన్ని ఎవరూ కాదన లేరు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఇటువంటి అంశాలను ఎవ రూ వేరువేరుగా చూడడం లేదు. ఎవరికి వారు తమకు సంబంధించిన అంశాలను తెరమీదికి తెస్తున్నారు. అయితే ఎవరూ ఇంకా కొత్త విషయాలను ప్రస్తావించడం లేదు. టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల గురించే అడుగుతున్నారు. అవి తమ హక్కులని నమ్ముతున్నారు. నిజంగానే ఇప్పుడు తెలంగాణ లో అంతా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను తమ హక్కుల పత్రంగా చూస్తున్నారు. ‘బంగారు తెలంగాణ’ పేరుతో టీఆర్‌ఎస్ అనేక వాగ్దానాలు చేసింది. ఇప్పుడు ఒక్కొక్కటి కదిపిన కొద్దీ అనూహ్యమైన కుదుపులు వస్తున్నాయి. ఇవి మునుముందు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
నిజానికి టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో నవ తెలంగా ణ నిర్మాణానికి కొన్ని మౌలికమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఎనలే ని విధ్వంసానికి గురయినందువల్ల కొన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రణాళికలను అమలు చేసి తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించుకోవాలని, అంతకు ముందు కొన్నివర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని భావించి రైతుల రుణా ల మాఫీ, ఉద్యోగుల ఇంక్రిమెంట్ల వంటి అంశాలు అందులో చేర్చిందే తప్ప, పెద్దగా ప్రజాకర్షక పథకాలను ప్రస్తావించలేదు. వీటివల్లే బంగారు తెలంగాణ రాదు. వీటితో పాటు సమ తుల అభివృద్ధికి అవసరమైన భూమి పంపిణీ, వ్యవసాయానికి సాగునీరు, నిరుపేదలకు రెండు పడక గదుల పక్కా గృహాల వంటి పథకాలను ప్రతిపాదించింది. ఇవి నిజంగానే మౌలికమైన వసతులుగా నిలబడతాయి. వీటితోపాటు మానవాభివృద్ధికి అవసరమైన విద్య, వైద్యం. వృత్తి నైపుణ్యతలు, ఉపాధి అవకాశాలను కూడా కొత్తగా చెప్పే ప్రయ త్నం చేసింది. ‘కామన్ స్కూల్’ అనే మాట అనక పోయినా సమాజంలో అన్నివర్గాలకు ప్రభుత్వరం గంలో విద్యను అందుబాటులోకి తెస్తామని దానికి పూర్తిస్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తామని, చదువుకునే వయసున్న అందరికీ ప్రాథమిక స్థాయి నుంచి నిర్బంధ ఉచిత విద్య అందిస్తామని, అందరికీ ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తామని వాగ్దానం చేసింది.
అలా గే ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసి గ్రామ స్థాయినుంచి ప్రాథమిక ఆరోగ్యసేవలను పటిష్టపరుస్తామని చెప్పిం ది. మండల, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా ఆస్పవూతులను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. ఇట్లా దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు పింఛన్ల వంటి తాత్కాలిక ఉపశమనాలు అనేకం అందులో చేర్చింది. నిజంగానే అన్నీ సజావుగా అమలయితే బంగారు తెలంగాణ అవుతుందన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నిజంగానే ఆ బంగారు కల నెరవేరుతుందా! అంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే అది అంత సుల భం కాదనే అనిపిస్తున్నది. బంగారు తెలంగాణ కేవ లం ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి మన పాత్ర ఏమీ ఉండదనుకుంటే అది ముమ్మాటికి సాధ్యం కాదనేది వాస్తవం. బంగారు తెలంగాణ అంటే తెలంగాణ చిత్ర పటాన్ని బంగారు రంగుతో గీసినంత సులభం కాదు. ప్రజల జీవితాల్లో చింత లేకుండా, సుసంపన్నం చేయడం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి రెండు మూడు అవాంతరాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ప్రజల విశ్వాసం. ఎన్నికల్లో గెలిచిన పార్టీ తమ విజయమే ప్రజల విశ్వాసానికి గీటురాయి అనుకుంటుం ది. తమకు వోటు వేసి అధికారంలోకి తెచ్చారు కాబ ట్టి ఐదేళ్ళ దాకా అడ్డు ఉండదని భావిస్తుంది. కానీ అది నిజం కాదని పాలకులు ఎప్పటికప్పుడు ప్రజల విశ్వాస పరీక్షలకు నిలబడవలసి ఉంటుందని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ప్రజలు ఏ చిన్న అసమ్మతి తెలిపినా రాజకీయ పార్టీలు దానినొక అతిపెద్ద అవిశ్వాసంగా మార్చివేస్తాయని రైతు రుణా ల సందర్భం రుజువు చేసింది. రుణాల మాఫీ విషయంలో నిజానికి మార్గదర్శకాలు ఉంటాయి, ఇది అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఆ మార్గదర్శకాలను నిర్ధారించే పనికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నది. బ్యాంకుల యాజమాన్యాలతో వాటి గురించి మాట్లాడింది. ఎవరైనా అదే చేయాలి. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు లాగా మొదటిసంతకం విధివిధానాల నిర్ధారణ కమిటీ నియామకం ఫైలు మీద చేసి ఉండవచ్చు. అలా అతి తెలివికి పోకుండా నేరుగా మాట్లాడింది టీఆర్‌ఎస్. కానీ అదే బెడిసి కొట్టింది. అదొక పెద్ద వివాదమైపో యింది. నిజంగానే రైతులందరికీ రుణ మాఫీ చేసెయ్యవచ్చా, వాళ్ళ సామాజిక ఆర్థిక నేపథ్యంతో, కాలపరిమితితో సంబంధం లేకుండా అందరి రుణా లు రద్దుచేసి వాటిని ప్రభుత్వమే చెల్లించి చేతులు దులుపు కోవా లా! అంటే రైతుల పరిస్థితి దృష్ట్యా చేయాలనే అంద రూ అంటారు. కానీ రుణాలు ఎవరు తీసుకున్నారు, అందులో భూస్వాములున్నారా, కౌలు రైతులున్నా రా, సన్న, చిన్నకారు రైతులు ఎందరు? ఎన్నేళ్ళుగా ఆ రుణాలు పెండింగ్‌లో ఉన్నాయి? పోయిన రెండు మూడేళ్ళలో నిజంగానే కరువో, అనావృష్టి పరిస్థితులో ఉన్నాయా అని ఆలోచించే.. ఆర్థిక నియమా లు, మార్గదర్శకాలు ఉంటాయి. ఈ విషయాలను చర్చించి అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అర్థం చేయించవలసిన మేధావులు మౌనంగా ఉంటున్నా రు! ఇది రెండో ప్రమాదకర ధోరణిగా కనిపిస్తున్నది. నిజానికి తెలంగాణ ఉద్యమ బలం మేధావులు, ఉద్యోగులు విద్యావంతులైన ప్రజలు. వారు ఉద్యమకాలంలో ప్రదర్శించిన పరిణతి, వ్యూహరచన అంతా ఇంతా కాదు. నిజానికి అదే తెలంగాణ ప్రజ ల్లో ఒక బంగారు కల ను ఆవిష్కరించింది. ఇక మూడోది-రాజకీయ పార్టీలు. ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు అల్లరి చేయడానికి దీనినొక అవకాశంగా భావిస్తున్నాయే తప్ప పార్టీల వారిగా తమ వైఖరి ఏమిటో చెప్పలేకపోతున్నాయి. వెరసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మంత్రులు ఎంత మొత్తుకుంటున్నా ఎవ్వరూ వినిపించుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రే శాసన సభలో ఈ సంగతి ప్రకటించి వివాదానికి తెరదించారు.
నాలుగవది-తెలంగాణ సమాజంలో తలెత్తుతు న్న అనైక్యత. ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం చూస్తుం భవిష్యత్తులో కూడా ఎవ్వరూ ఎవ్వరిమాటా వినరనే అనిపిస్తున్నది. ఇదొక్క రైతులు, వారి రుణాల తో ఆగిపోయేలా లేదు. రేపో మాపో ఉద్యోగులు ముందుకొస్తారు. ముందుగా తమ తెలంగాణ ఇంక్రిమెంట్ సంగతి తేల్చమని అడుగుతారు. ఆ వెంటనే పదవీ విరమణ వయస్సు ఆంధ్రాలో మాదిరిగా 60 ఏళ్ళకు పెంచాలని ఒత్తిడి చేస్తారు. కాదు కుదరదం ఆందోళనకు దిగుతారు. సరే అని ఒప్పేసుకుంటే నిరుద్యోగులు ఒప్పుకోరు. వాళ్ళు ఇప్పటికే కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారు. నిరుద్యోగులతో పాటు దాదాపు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టులోనో, దినసరి వేతనాల మీద నో,తాత్కాలిక ఉద్యోగులుగా ఉంటూ పొట్టపోసుకుంటున్న వాళ్ళు వేలాదిమంది ఇప్పుడు కొత్త ఉద్యోగాలమీద కోటి ఆశలతో ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలిస్తే ఊరుకునేది లేదని మరికొందరు బెదిరిస్తున్నారు. అలాగే దళితులు కూడా తమ మూడెకరాల గురించి ఆలోచిస్తున్నారు. రెండు బెడ్ రూం ల ఇండ్ల గురించి ఇప్పుడు ఇల్లులేని ప్రతిఒక్కరూ ఎదురుచూస్తున్నా రు.
ఇట్లా ఎవరికి వారు తమ తమ ఆశలు, ఆకాంక్షలకు కొత్త జీవం నింపుకుని ఉన్న తరుణంలో కొత్త ప్రభుత్వానికి పరిపాలన కత్తిమీది సామే అవుతుంది. ప్రభుత్వం సంగతి ఎలా ఉన్నా ప్రజల్లో ప్రయోజనా ల సంఘర్షణ అనైక్యతకు దారి తీస్తుం ది. ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములై నడిపించాల్సి ఉంటుం ది. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ రకమైన సామాజిక వ్యవస్థలను కూడా ప్రభు త్వాలు నిర్మిం చలేవు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు, విశ్వాసం లేని ప్రభుత్వంలో అధికా రం ఉంటుంది తప్ప జీవం ఉండదు. అలాగని ఈ ప్రభుత్వం ప్రజల ప్రజాప్ర యోజనాలకు వ్యతిరేకంగా ఉండదని అనుకోలే ము. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడాని కైనా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి ఐక్యంగా ఉండడం అవసరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి