ఇప్పుడు యుద్ధం
ముగిసింది, ఇక భాగస్వామ్యంతో
కలిసిమెలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది అని కాంగ్రెస్ అది నాయకురాలు సోనియా గాంధీ
అంటున్నారు. అలాంటి బాధ్యతాయుతమైన పాలన
ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదని ఆమె కరీంనగర్
ఎన్నికల బహిరంగ సభలో అన్నారు. కానీ తెలంగాణ
ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు గానీ, ఆంధ్రప్రదేశ్
పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పూర్తిగా చదివినవాళ్ళు గానీ యుద్ధం అప్పుడే ముగిసిందని అనుకోవడం లేదు. నిజానికి అసలు
పోరాటం ఎన్నికలు ముగిసి కొత్త
ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మాత్రమే మొదలు కానుందని బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ తామే తెచ్చామనీ, తామే ఇచ్చామని చెపుతున్నవాళ్ళు, అరవై ఏళ్ళ కలను అరచేతిలో పెట్టామని అంటున్నవాళ్ళు ఎవరైనా
సరే ఒకసారి పార్లమెంటు ఆమోదించిన
పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చదివితే అందులో యుద్ధాలకు కావాల్సిన అన్ని ఆయుధాలూ కనిపిస్తాయి. నిజానికి ఇది భారత
పార్లమెంటు ఆమోదించాల్సిన బిల్లుకాదు.
బిల్లులో అనేక అంశాలు భారత రాజ్యాంగ నియమాలకు భిన్నంగా ఉన్నాయి. అవి యథాతథంగా కొనసాగాలంటే చట్ట సవరణలో,
కుదరకపోతే రాజ్యాంగ సవరణలో చేయక తప్పదు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా
చెపుతున్నవి కాదు. కాంగ్రెస్
అధిష్ఠానవర్గం (సీడబ్ల్యుసీ) చేసిన తీర్మానం చూసిన వెంటనే తెలంగాణ పౌరసమాజం బిల్లులోని లోపాలను గుర్తించింది. మామిడి
పండులో గుజ్జు ఆంధ్రా వాళ్లకు
టెంక తెలంగాణకు ఇచ్చే కుట్ర చేస్తున్నారని జేఏసీ సారథి కోదండరామ్ పదేపదే హెచ్చరిస్తూనే వచ్చారు. తెలంగాణ
ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలమీద జేఏసీ ఒక నివేదిక కూడా మంత్రుల బృందానికి,
అన్ని రాజకీయపార్టీలకు ఇచ్చింది.
కానీ ఒక్కరంటే
ఒక్కరు కూడా వాటిమీద స్పందించలేదు.
బిల్లు రూపొందే దశలోగానీ, పార్లమెంటులో చర్చకు వచ్చిన సందర్భంలో గానీ ఇప్పుడు
ఎన్నికల్లో పోటీపడుతున్న ఎవరూ నోరు విప్పలేదు ఒక్క అసదుద్దీన్ ఒవైసీ మినహా. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూడకుండా
కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి చర్చించిన
సంగతుల రికార్డులను యథాతథంగా పార్లమెంటు సిబ్బంది ద్వారా సంపాదించిన ఒక జర్నలిస్టు ప్రముఖుడు నాకు
మెయిల్ చేశాడు. ఇచ్చిన వారి తరఫున
మాట్లాడిన వాళ్ళు అంతా అమ్మ దయ అంటూ అదే మహాప్రసాదమని కళ్ళకు అద్దుకుంటే, తెచ్చామని
చెపుతున్న వాళ్ళు అదే భాగ్యం అన్నట్టుగా మౌనంగా భక్తిశ్రద్ధలతో విన్నారు తప్ప మాట మాత్రంగానైనా
అభ్యంతర పెట్టలేదు. ఒక్క అసదుద్దీన్
మాత్రం అడుగడుగునా తెలంగాణ హక్కుల కోసం పోరాడాడు. పలుసార్లు సవరణలు ప్రతిపాదించారు. కానీ ఆయనకు సాటి తెలంగాణ
సభ్యుల నుంచి కూడా కనీస మద్దతు రాలేదు. ఆ
అన్యాయాలను యథాతథంగా ఉంచుతూ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు అవే తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా
మారి భవిష్యత్తులో
ప్రజాపోరాటాలకు భూమిక కాబోతున్నాయి.
అందులో మొదటిది పదేళ్ళ పాటు ఉమ్మడి
రాజధాని, ఉమ్మడి గవర్నర్. ఉమ్మడి
రాజధాని మానవీయకోణంలో ఆలోచిస్తే
మంచిగానే కనిపించవచ్చు. కానీ దాని వెనుక అనేక సమస్యలకు అదే మూలం కాబోతోంది. దీనివల్ల ఆంధ్రాకు పాలనా
పరమైన సౌకర్యం ఎంతమాత్రం లేకపోగా
తెలంగాణ పరిపాలనకు ఇదే పెద్ద ప్రతిబంధకం కాబోతున్నది. ఉమ్మడి రాజధానికి మౌలిక వసతులు తెలంగాణ ప్రభుత్వమే
కల్పించాలి. ఉన్న భవనాలనే
వాడుకోవాలి. ఉద్యోగులంతా ఇక్కడే ఉంటారు. వారి పౌర సరఫరాలు, సదుపాయాలూ అన్నీ తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాలి. అలాగే
కొందరు అక్రమంగా సంపాదించిన భూములు,
ఆస్తులకు కాపలాఉండి రక్షణ బాధ్యత కల్పించాలి.
ఇదంతా తెలంగాణ ప్రభుత్వం చేయలేదు
కాబట్టి గవర్నర్‌కు దాని బాధ్యతలు అప్పగించారు. అంటే అరవై ఏళ్ళు ఆంధ్రా పాలనలో తెలంగాణ ప్రజలకులేని,
అనుమానాలు, అభ్యంతరాలు ఇప్పుడు వారికి కలిగాయి.
తెలంగాణలో
రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇక్కడి ప్రజలమీద వాళ్లకు నమ్మకం లేదు. అయినా సరే అంతా
సరే అని బల్లలు చరిచారు. ఈ
ప్రతిపాదనవల్ల హైదరాబాద్ అస్తిత్వం శాశ్వతంగా సమాధి అయిపోతుందని అంటూ ‘తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు ఎలా మౌనంగా ఉంటున్నారు. మీ
ఆత్మాభిమానం ఏమైందని’ అసదుద్దీన్ నిండు సభలో నిలదీశారు. కానీ మనవాళ్ళు మాత్రం
మౌనంగా కూర్చుండి పోయారు.
తెలంగాణకు వేరే గవర్నర్ ఉండాలన్న వాదనను కూడా వినిపించుకోలేదు. నిజానికి దేశంలో ఇలా ఏ రాష్ట్రం విషయంలోనూ
జరగలేదు. ఇలాంటి డిమాండు రాజ్యాంగ
విరుద్ధమని, రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని
భావన లేదని, ప్రజాప్రభుత్వం ఉండగా గవర్నర్ కు శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాలు ఇవ్వడానికి
కుదరదని న్యాయకోవిదులు మొత్తుకున్నా వినలేదు. ఉమ్మడి రాజధాని వాంఛనీయం కాదని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మద్రాస్-ఆంధ్రా విభజన సందర్భంగా జస్టిస్ వాంచూ కమిటీ స్పష్టం చేశారు. ఇది
భవిష్యత్తులో అనేక సమస్యలకు మూలం కాబోతున్నది.
రెండోది ఉద్యోగుల పంపిణీ. వారి
జీతాలు, పెన్షన్లు. వీటికి జనాభాను
ప్రాతిపదిక చేశారు. కానీ
స్థానికత మాత్రమే చూడాలన్నది తెలంగాణవాదుల ప్రాతిపదిక. నిజానికి ఎప్పుడైనా జరిగేది అదే. కానీ తెలంగాణ విషయంలో
మాత్రం అలా జరగలేదు సరికదా ఉద్యోగుల
పంపిణీ విషయం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే పెట్టుకుంది. ఇప్పుడు జరుగుతున్న కసరత్తు ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు కూడా సంబంధం లేకుండా జరుగుతున్నది. దీన్ని ముందే గ్రహించిన
అసదుద్దీన్ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది
వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు పాటించి బిల్లులోని 7వ క్లాజును ‘స్థానికత, పుట్టిన ప్రాంతం, సీనియారిటీ’
పరిగణనలోకి తీసుకుని వారి వారి ప్రాంతాలకు పంపించాలని కోరారు. గుడ్డి ఆప్షన్
ఉండకూడదని వాదించారు.’ ఉద్యోగాల మీది ఆశతో తెలంగాణలో ఎంతమంది బలిదానాలు చేసుకున్నారో మీకు తెలియదు. వారి ఆశల్ని
వమ్ము చేయకండి ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. తెలంగాణ నిరుద్యోగుల సమస్య
కూడా. గత రెండు మూడు దశాబ్దాలుగా
ప్రభుత్వ రంగంలో ఉద్యోగ నియామకాలులేక నిరుద్యోగులు వేసారి ఉన్నారు. వారే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి నిలబెట్టారు.
నిజంగానే న్యాయంగా పంపిణీ జరిగితే
ఒక్కరోజులో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వవొచ్చని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్ చెపుతున్నారు. మరి మన
నాయకులు ఆ మాట ఎందుకు చెప్పడం
లేదు. మరోవైపు ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ఈ మేరకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని జైరాం
రమేష్ ఆంధ్రా ఉద్యోగులకు అభయం
ఇస్తున్నాడు. ఈ ఎన్నికలు ముగిసి, అక్కడ ప్రచారం ఊపందుకునే లోగా అటువంటి ఆదేశాలు
అందినా ఆశ్చర్యం లేదు. ఉద్యోగాలే ఇవ్వనప్పుడు తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకనుకున్నారో ఏమో ఉన్న
కమిషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇచ్చేశారు. ఇప్పుడు తెలంగాణకు కమిషన్ కూడా లేదు. ఈ విషయంలో అసద్ ప్రశ్నల
పరంపరకు సమాధానం రాలేదు. ఇలాంటి విషయాల్లో కోర్టుకు వెళ్ళే వెసులుబాటు కూడా
లేదు. అసలు తెలంగాణకు హైకోర్ట్ కూడా
ఇవ్వలేదు. అది ఉమ్మడిగానే ఉంటుంది. అక్కడి ఆంధ్రా న్యాయమూర్తులు అలాగే ఉంటారు. తెలంగాణకు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా దావాలు వేసుకునే వెసులుబాటు ఎలాగూ
ఉంటుంది.
ఇక అత్యంత ప్రధానమైనది పోలవరం
ముంపు గ్రామాలు. అసలు పోలవరం ప్రాజెక్టే వద్దని ప్రజలు, పర్యావరణవేత్తలు మొత్తుకుంటుంటే
పార్లమెంటు మాత్రం దానికి జాతీయ హోదా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా 207 ముంపు గ్రామాలను కూడా అవశేష ఆంధ్రకు రాసిచ్చింది. ఇందులో తనకు తాను పదేపదే చెప్పుకుంటున్నట్టు
వెంకయ్యనాయుడు ప్రధాన పాత్ర
పోషించాడు. తమకు భద్రాచలం రాముడు వద్దని రాజ్యం మాత్రం రాసివ్వాలని పట్టుబట్టాడు. వెంకయ్య ఒత్తిడికి కాంగ్రెస్
తలొగ్గింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక
ఆర్డినెన్స్ రూపొందించింది. అది ఆమోదం పొందితే కనీసం మూడు లక్షల ఆదివాసులు చెల్లాచెదురై పోనున్నారు,
సీలేరు విద్యుత్ కేంద్రం ఆంధ్రా భూభాగంలో కలిసిపోతుంది. బహుశా ఎన్నికలలోపే
కేంద్ర మంత్రివర్గం సమావేశమై
పోలవరం ప్రాజెక్ట్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఇంత జరిగినా తెలంగాణ నాయకులు పార్లమెంటులో మాట్లాడలేదు.
అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
మునిగే వాళ్ళు ఆదివాసులే కదా అన్నట్టు వ్యవహరించారు. కనీసం ఎన్నికల ప్రచారంలోనైనా ఇవన్నీ చర్చకు వస్తాయని, కొంతవరకైనా హామీలు లభిస్తాయని తెలంగాణ సమాజం ఆశించింది. కానీ కూడా
బలుక్కున్నట్టు ఒక్కరూ ఈ విషయాలను చర్చకు తేకుండా ప్రచారం మొత్తం తిట్లకు, శాపనార్థాలకు పరిమితం చేసేశారు.
ఇవే కాదు ఇంకా జల వివాదాలు, ఆస్తుల పంపకాలు, హైదరాబాద్ నగరం మీద ఆధిపత్యశక్తుల ఆగడాలు భవిష్యత్తులో
తెలంగాణ ప్రజల హక్కులకు అనేకచిక్కులు తేనున్నాయి. ఇవాళ ఎన్నికల ప్రచారంలోనే హైదరాబాద్ అందరిదని
ఎవరైనా పోటీ చేసి, ఎవరైనా పరిపాలన చేయవచ్చని కొత్త బిచ్చగాళ్ళు కొందరు
కూనిరాగాలు తీస్తున్నారు. వారికి
మరికొందరు భరోసా ఇస్తున్నారు. ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు,సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే
సైనికులు కావాలి. తెలంగాణా అస్తిత్వాన్ని కాపాడి, హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే వారినే
ఎన్నుకోవాలి. ఎందుకంటే రేపు అధికారంలోకి ఎవరు వచ్చినా యుద్ధం తప్పదు. అయితే ఈ
యుద్ధం ప్రజలు చేయాల్సింది కాదు.
రేపటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేయవలసి ఉంటుంది.
తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎవరి పక్షంలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీలతో పనిలేదు. ప్రజలు
విజ్ఞతను ప్రదర్శించి తమతో కలిసి యుద్ధం చేసిన వాళ్ళను,
యుద్ధ సమయంలో తమతో ఉన్నవాళ్ళను, రేపుకూడా యుద్ధానికి సిద్ధంగా ఉండేవాళ్ళను మాత్రమే
ఎన్నుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి