శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

వాళ్లకు రాజనీతి బోధించండి!


‘మార్గం సుదీర్ఘం’,‘భూమి గుం డ్రం’ అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్ర మహాసభతో మొదలయిన తెలంగాణ అస్తిత్వం దొరలూ, జమీన్‌దార్లు, జాగీర్‌దార్లను పల్లెల నుంచి తరిమేసిన క్రమాన్ని కళ్ళకు కడుతుంది. అలా పారిపోయిన దొరలు రెండుమూడేళ్ల అజ్ఞాతం తరువాత మళ్ళీ ఎలా గ్రామాలకు చేరుకొని ‘పునర్నిర్మాణానికి’ పునాదులు వేసుకుంటారో దాశరథి  తరువాతి కాలంలో రాసిన ‘జనపథం’ నవలలో వివరిస్తారు. కథ, చెప్పిన పద్ధతి, అందులోని రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఇది జరిగిన సంగతి. 1942-52 మధ్య చరివూతను పరిశీలిస్తే నిజంగానే చరిత్ర తనంతట తాను పునరావృతం అవుతుందనే అనిపిస్తుంది. అందుకే దాశరథి ‘భూమి గుండ్రం’ అన్నా డు. 

నిజాం రాజుల పాలనలోని లోపభూయిష్ట భూ పంపిణీ, యాజమాన్య విధానాల వల్ల భూస్వాము లే పాలకులుగా చెలామణి అయ్యారు.  నిజాం రాజులకు  తాబేదార్లుగా మారి ప్రజలను దోచుకుని దొరలయ్యారు. ఆ దొరల దోపిడీ, దాష్టీకాలకు హద్దూ అదుపు లేకుండా పోయింది. తెలంగాణ బతుకు ఛిద్రమైపోయింది. ఆ దశలోనే ప్రపంచం గర్వించే స్థాయిలో సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో ప్రారంభమయ్యింది. నాగలి పట్టాల్సి న రైతులు, రైతు కూలీలు తుపాకులు పట్టారు, సాయుధ దళాలు ఏర్పాటు చేసుకుని ‘భూస్వాముల’ మీద దండయావూతకు దిగారు. దొరలూ ప్రతిఘటించారు.రజాకార్లను ఉసిగొలిపి దొరికిన వాళ్ళ ను దొరికినట్టు  ఉద్యమకారులను ఊచకోత కోశా రు. వేలాదిమందిని జైళ్లలో తోశారు. కేసులు బనాయించారు. కోర్టులకు ఈడ్చారు. అయినా దొరలను నిజాం ప్రభువు కాపాడలేకపోయాడు, రజాకార్లు, కిరాయి మూకలు కాపాడలేకపోయా యి. కంటిచూపుతో మొత్తం సమాజా న్ని శాసించిన దొరలు తమ గ్రామాలు వదిలి, గడీ లు వదిలి పారిపోయారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అనేక నగరాలకు పారిపోయారు. ఉద్య మం ఉధృతంగా సాగినంత కాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అజ్ఞాతంలో గడిపారు. 

ఇదే అదనుగా నెహ్రూ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు చర్య పేరుతో భారత సైన్యాన్ని రంగంలోకి దింపి హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో కలిపేసుకుంది. అంతే! అప్పటిదాకా ఎక్కడెక్కడో దాక్కున్న దొరలంతా కొత్త అవతారాల్లో మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి చేరారు. అప్పటిదాకా వాడిన షేర్వానీలు వదిలేశారు. ఖద్దరు తొడిగారు. తలమీద గాంధీ టోపీలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో కలిసిపోయారు. సైన్యం, పోలీసు సెక్యూరిటీ వెంట బెట్టుకుని మళ్ళీ గ్రామాల్లో చేరిపోయారు. అప్పటి దాకా  నిజాం రాజు తొత్తులుగా వుండి, మొత్తం పల్లెల్ని దోచి, ఈ దోపిడీ నుంచి, వెట్టి నుంచి, గులాంగిరీ నుంచి, భూస్వామ్య బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని పోరాడిన ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళు, ఇక్కడి జన జీవనాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు హటాత్తుగా జాతీయ వాదులై పోయారు. దేశ భక్తులయ్యా రు. కాంగ్రెస్ నేతలై కండువాలు కప్పుకున్నా రు. భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా నవసమాజా న్ని నిర్మిస్తామని ప్రతినబూనారు. తరువాత ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళే మళ్ళీ మంత్రులైపోయారు. 

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే పాలనను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోకి తెచ్చేందుకు 1953లో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా మద్రా స్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలుగు తెలిసిన ఉద్యోగులను ఇక్కడికి ఆహ్వానించింది. పనిలో పనిగా  సాగు తెలిసిన కోస్తా రైతులను కూడా ఉచితంగా ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చి పిలిపించుకుంది. ఉద్యోగులను నియమించినప్పుడు పెద్ద ఎత్తున స్థానిక యువకులు, నిరుద్యోగులు నిరసన తెలిపా రు. ఆందోళనకు దిగారు. ‘నాన్-ముల్కి గో బ్యాక్’ పేరుతో ఉద్యమించిన పిల్లల మీద కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణచివేసింది. అప్పటి నుంచి స్థానికుల నోళ్ళు మూయించి వేలాదిమందిని ఉద్యోగా ల్లో నియమించింది. ఇది వలసాధిపత్యానికి తొలి మెట్టు అయింది. అప్పటి దాకా కొనసాగిన నిజాం ముతక పాలనా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంది. ఇది జరిగి రెండేళ్ళు కూడా గడవక ముందే ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మం తనాలు మొదలుపెట్టారు. ఆంధ్రా పెద్దలు కలిసి వుంటే కలదు సుఖం అన్నారు. తెలంగాణ పెద్దమనుషులు ఎవరికి  సుఖం అని ఆలోచించలేకపో యారు. హైదరాబాద్ ముఖ్యమంవూతిగా ఉన్న బూర్గు ల రామకృష్ణారావు అలాంటి ఆలోచన చేసినా కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీ పిలిపించి ఒప్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో బాగుపడతారని చెప్పింది. ఆయనా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో  ఆంధ్రవూపదేశ్ పునర్నిర్మాణం మొదలు పెడతామని చెప్పారు. మళ్ళీ మంత్రులయ్యారు. కానీ పదేళ్ళు గడిచినా పరిస్థితి మారకపోగా మరింత శిథిలం అయ్యింది. ఇక చాలనుకున్న యువతరం తెలంగా ణ కోసం 1969 లో ఉప్పెనై లేచింది. ఆంధ్రా ఆధిపత్యశక్తులను, పాలకులను వాళ్లకు వంతలు పాడే తెలంగాణ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వ సహకారంతో ఆ ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసింది. వందలాది మందిని హైదరాబాద్ వీధుల్లో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి వేసింది. అప్పటి పాలకుల్లో ఇప్ప టి నాయకుల తండ్రులున్నారు. కొందరు నేతల తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళే పెద్దమనుషులుగా ఉండి ఒప్పందాలు చేసుకుని, షరతులు పెట్టుకుని దాదాపు 1982 దాకా అదే తంతు కొనసాగించారు. 

ఈ పాలనే తెలంగాణ బతుకుల్ని రోడ్డు మీదికి తెచ్చింది.  దానికి తెలుగుదేశం పాలన కూడా తోడయ్యింది. ఇదే నాయకత్వం ఆ పార్టీ హయాంలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. జానాడ్డి లాంటి వాళ్ళయితే అక్కడా ఇక్కడా రెం డు చోట్లా ఉన్నారు. మళ్ళీ మొదలయిన తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు, అణచి వేసిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు, ఉద్యమకారుల మీద కేసులు బనాయించి జైళ్లలో తోసిన వాళ్ళు, చివరకు వేలాదిమందిని నిరాశలో ముంచి ఆత్మహత్యలకు పురికొల్పిన వాళ్ళు కూడా గడిచిన పదేళ్లుగా పాలించిన వాళ్ళే. వాళ్ళే ఈ విధ్వంసానికి మూలం అని ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఇదంతా ఒక చరిత్ర.  

ఆ చరిత్ర క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక అధ్యయనాలు చేసి తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్యమానికి సన్నద్ధులను చేసింది. ఈ విధ్వంసంలో భాగంగా వచ్చిన నిబంధనలు ఉద్యోగులను ఊపిరాడకుండా చేస్తున్నాయన్న  ఆందోళనలో నుం చే కే.చంద్రశేఖర్‌రావు నిరాహారదీక్ష, జేఏసీ ఏర్పా టు జరిగిపోయాయి. ఈ విధ్వంసమే అప్పటిదాకా అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా మాత్రమే ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ పౌర సమాజానికి తిరుగులేని నాయకుడై నిలబడ్డాడు. రాజకీయవాదులు, పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా వెరవకుండా తుదిదాకా నిలబడి ఇప్పుడు పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకటించాడు.కానీ తెలంగాణ కాంగ్రెస్ అధినేత పొన్నాల లక్ష్మయ్య మాత్రం అసలు విధ్వం సం జరగనే లేదని, అలాంటప్పుడు పునర్నిర్మాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్  ఇంకా తటస్థంగా ఉంటే కుదిరేలా లేదు. వాళ్లకు రాజనీతిశాస్త్రం బోధించాల్సిన అవసరం ఉంది. వీలయితే చరిత్ర కూడా చెప్పాల్సి ఉంది. 

ఎవరయినా తెలియని వాళ్లకు చెప్పవచ్చు. కానీ తెలిసీ తెలియనట్ట్టు నటించే వాళ్లకు ఏది చెప్పినా ప్రయోజనం ఉండదు అని అనిపిస్తే మీకు మీరే ఒక చారివూతాత్మక నిర్ణయం తీసుకోండి. ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాధనకు ఊపిరై నిలబడ్డ రాజకీయ జేఏసీ పౌరసమాజానికి దిశా నిర్దేశం చేయక తప్పదు. మీతో భుజం భుజం కలిపి పోరాడినవాళ్ళను ఏ పార్టీలో ఉన్నా గెలిపించండి. విధ్వంసం జరిగిందని ఒప్పుకున్న పార్టీలను, పునర్నిర్మాణం అవసరాన్ని గుర్తించిన వాళ్ళను, నవ తెలంగాణ నిర్మించాలనే వాళ్ళనే బలపరచండి. లేకపోతే తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఆకాంక్షకు అర్థమే లేకుండాపోతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి