తెలంగాణలో ఇప్పుడు నవ తెలంగాణ నినాదం మారు మోగుతోంది. రాజకీయపార్టీల ఎన్నికల ప్రణాళికలు మొదలు పత్రికల్లో మేధావుల విశ్లేషణల దాకా ఈ కల ఎలా వుంటుందో చెప్పి ఊరిస్తున్నాయి. ఇవన్నీ మన నీళ్ళ గురించి, వనరుల గురించి, వైద్య, విద్యా, ఉపాధి అవకాశాల గురించి ఊరిస్తున్నాయి. ఉపదేశిస్తున్నాయి. తెలంగాణలో ఒక సమగ్ర ప్రణాళిక ఉంటే అభివృద్ధి సాధ్యమేనని భరోసా కల్పిస్తున్నాయి. కానీ తెలంగా ణ సమాజాన్ని ఎలా పునర్నిర్మిస్తారు. నవ సమాజం లో మానవ సంబంధాలు, పాలకులకు ప్రజలకు మధ్య పరస్పర సంబంధాలు ఎలా ఉండాలి ఎలా ఉంటాయి అనే విషయాల మీద చర్చ జరగడం లేదు. భారత రాజ్యాంగ రచన నిజానికి ఇలాంటి మౌలికమైన అంశాల ప్రాతిపదికన మాత్రమే జరిగింది. పౌరులందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించడమే నవభారత నిర్మాణానికి ప్రాతిపదిక అని రాజ్యాంగ పీఠికలోనే చెప్పారు. రాజ్యాంగంలోని అన్ని అధ్యాయా లు దానికి కట్టుబడి ఆ పరిధిలోనే సాగుతాయి. ఈ నాలుగు రకాల లక్ష్యాలు నేరవేరితేనే అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి తప్ప అభివృద్ధికి భౌతికరూ పాలైన కట్టడాలు, నిర్మాణాలు, మౌళిక వసతుల కల్పన మాత్రమే అభివృద్ధి అనుకోవడానికి వీలు లేదు. రాజ్యవ్యవస్థ, పరిపాలన న్యాయం మీద నడి చి, సమానత్వ సాధన ఒక లక్ష్యంగా నిర్దేశించుకుని, ప్రతివ్యక్తికి, సమాజానికి స్వేచ్ఛను కల్పించినప్పుడే ఆ సమాజంలో సౌభ్రాతృత్వానికి ప్రాతిపదిక అయి న మనం అనే భావన పెరిగి ప్రజాస్వామికీకరణకు తోడ్పడుతుంది. అటువంటి పాలనను తెలంగాణ సమాజం అనేక దశాబ్దాలుగా కలగన్నది. ఆ కల సాకారం కోసం అప్రమత్తతో పోరాటాలు నిర్మించిం ది. నిర్వహించింది.
నిజానికి తెలంగాణ ఉద్యమం జనబాహుళ్యాన్ని ఆకట్టుకోవడానికి విస్తృతరీతిలో ప్రజలు ఉద్యమంలో పాల్గొనడానికి నెరవేరకుండా మిగిలిపోయిన ఆ కలే కారణం. ఆ కల నెరవేరి తీరాలని అనుకున్న వాళ్ళు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని అన్నారు. సామాజిక తెలంగాణలాగే ప్రజాస్వామిక తెలంగాణ కూడా నినాదాలతో వచ్చే ది కాదు, అది నిర్మించుకోవాల్సిన బాధ్య త. ఆ బాధ్యత పాలక వర్గాల మీద ప్రజలు, ప్రజా ఉద్యమాల మీద ఉంటుంది. కానీ ఈ రెండు వర్గాలూ తమ తమ ప్రణాళికలు, మ్యానిఫెస్టోలలో వాటి సం గతి మరిచిపోతున్నారు.
తొలి తెలంగాణ ఉద్యమం విఫలమైన దశలోనే మిగిలిపోయిన ఆ ఆకాంక్ష నుంచే ప్రజాస్వామిక విప్లవ ప్రయత్నాలు మొదలైనాయి. 1969 తెలంగాణ ఉద్యమ అణచివేతలో గాయపడిన యువ హృదయాలు విముక్తి మార్గం ఒక్కటే పరిష్కారం అనుకున్నాయి. మల్లోజుల కోటేశ్వర్‌రావు మొదలు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు అటువంటి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టి దాన్నొక దేశవ్యాప్త ఆకాంక్షగా మలిచా రు. అది అలా కొనసాగుతున్న సందర్భంలోనే ప్రజాస్వామ్య ఆకాంక్షల అణచివేత మొదలయ్యిం ది. సమాజం ప్రజాస్వామికంగా ఉండాలంటే రాజ్యాంగం చెప్పిన ఆర్థిక, సామాజిక రాజకీయ న్యాయం ఉండాలి. ఎటువంటి వివక్షలేని సమాన త్వం విలసిల్లాలి. ప్రతి పౌరుడికి స్వేచ్ఛాయుత జీవనం సాగించే హక్కులు ఉండాలి. నేను నాది అని కాకుండా మనం అనే భావనలో ప్రజలు ఉం డాలి. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే మౌలికంగా సమాజం పునాదులు మారాలి. అటువంటి సమ సమాజం ప్రయత్నాలన్నీ ప్రభుత్వాలు విఫలం చేస్తూ వచ్చిన సందర్భంలోనే మన ప్రాంతం-మన ప్రభుత్వం అన్న భావన బలపడి చిన్న రాష్ట్రాలలో అది సంధించడం తేలిక అన్న భావన పెరిగింది. చిన్న రాష్ట్రాల ప్రజల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక భావసారూప్యత ఉంటుంది. కాబట్టి మిగతా ప్రజాస్వామిక విలువలు పెంపొందించి సమ సమా జం ఏర్పాటు చేయవచ్చునని నమ్మిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమానికి తొలి పునాదులు వేశా రు.
కానీ తెలంగాణ ఉద్యమానికి ప్రజాస్వామిక పునాది వేసింది మాత్రం ప్రజా గాయకుడు గద్దర్. ఆ తరువాత తెలంగాణ విద్యావంతుల వేదిక అని చెప్పుకోవాలి. నూతన ఆర్థిక సంస్కరణల దుష్ఫలితాల ప్రభావంతో శిథిలమైపోయిన తెలంగాణ సమాజం నుంచి 1995 నాటికే అనేక ప్రజా ఉద్యమాలు వచ్చాయి. అప్పటికే అజ్ఞాతం వీడి జన బాహుళ్యంతో మమేకమై కదులుతున్న గద్దర్ భువనగిరిలో 1996లో జరిగిన ప్రజాస్వామిక తెలంగాణ సభ ద్వారా తెలంగాణ కోసం గళమెత్తారు. ఆయన కు బెల్లి లలిత వంటి గాయకులూ తోడయ్యారు. ప్రజలను కదిలించి తెలంగాణ సాధనతోనే సమస్యలకు పరిష్కారమని చాటుతున్న సందర్భంలోనే ప్రభుత్వ దాడి మొదలయ్యింది. 1997లో గద్దర్ మీద కాల్పులు, ఆ తరువాత బెల్లిలలిత హత్యా జరిగాయి. తెలంగాణ కోసం నిలబడ్డ ఒక్కొక్కరినీ అంతం చేయడం కొనసాగింది. ఈ దశలోనే తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభతోపాటు ఐక్య కార్యాచరణ వేదిక వంటివి వచ్చాయి.ఒకవైపు ప్రజాస్వామిక ఉద్యమాల మీద ప్రభుత్వ అణచివేత చర్యలు, ప్రజాసంఘాలు పౌరహక్కుల ఉద్యమకారుల మీద దాడులు, తెలంగాణవాదుల హత్యలు కొనసాగుతున్న దశను తెలంగాణ సమాజం చవిచూసింది. రైతుల ఆందోళనలు, విద్యార్థుల ఉద్యమాలు, వీధిన పడ్డ కార్మికుల అణచివేత మొదలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్న అన్నిశక్తుల గొంతు నులిమే ప్రయత్నం, బూటకపు ఎన్‌కౌంటర్లు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఆయన కాలంలో ఆత్మహత్యలు పెరిగాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు మాట్లాడే మనిషి లేకుండా చేయడంతో ప్రజాస్వామిక విలువలు లేని పాలన తెలంగాణను అతలాకుతలం చేసింది. కేవలం హక్కులేకాదు, అవకాశాలు, బతుకుదెరువుకు భద్రతలేని స్థితి 1991-2000 మధ్య కొనసాగింది. అటువంటి వాతావరణంలో ప్రజాస్వామిక స్పృహ ఉన్న మేధావులు, వామపక్ష ఉదారవాదులు, ప్రజాస్వామిక వాదులు కలిసి తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా తెలంగాణ సమాజాన్ని అధ్యయనం చేసి జాగృతపరిచే ప్రయ త్నం చేశారు. తెలంగాణ అభివృద్ధి లేమిని, వనరుల దోపిడీని వివరిస్తూనే వివిధ ప్రజాస్వామిక ఉద్యమాలలో ఉన్న క్రియాశీల మేధావులను కలుపుకుపో తూ దీన్నొక విశాల వేదికగా మలిచారు. ఈ నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయ ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు తమ కలలను వెతుక్కున్నారు. ఉద్యమంలో భాగాస్వాములయి కదిలారు. తమ తమ రాజకీయ అభివూపాయాలతో ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా నిలబడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష. దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్కలయిపోయిన హక్కులున్నాయి.ఇప్పుడు పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్న వాళ్ళు పౌరస్వేచ్ఛ గురించి తమ ఆలోచనలేమిటో చెప్పాలి. పౌర హక్కులతోపాటు పౌరులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఎలా అమలు చేస్తారో వివరించాలి. రాజ్యాంగ పరిధిలో తమ తమ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తుల పట్ల, ఉద్యమాల పట్ల, సంఘాల పట్ల, రాజకీయ పార్టీలు, సంస్థల పట్ల తమ వైఖరి ఏమిటో ప్రకటించాలి. ప్రజా సంఘా లు, ప్రజా ఉద్యమాల మీద తెలంగాణలో దాదాపు గడిచిన నలభై ఏళ్లుగా ప్రకటిత-అవూపకటిత నిషేధం అమలులో ఉంది. ఇది ప్రజల స్వేచ్ఛ, స్వాతంవూత్యాలను హరించడమే కాదు నియంతృత్వ పోకడలకు, ఆధిపత్య ధోరణులకు కారణం కూడా. ఈ నియంతృత్వం వాళ్ళే తెలంగాణ వనరుల దోపిడీ అప్రతిహతంగా కొనసాగింది. నియంతృత్వం, ఆధిపత్యం ఉన్నచోట ప్రజాస్వామ్యం ఉండదు. అలాంటప్పు డు ఉద్యమాలకు, విముక్తికి అర్థమే లేదు. ఈ విషయాలు పునర్నిర్మాణమే పని అని చెపుతున్న అంద రూ మరిచిపోయారు. ఎవరి ఎజెండాలో కూడా వీటి పట్ల స్పష్టత కనిపించడం లేదు. నిజానికి హక్కుల ప్రస్తావన లేకుండా, వాటి కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు, శక్తులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేకుండాపజా ఉద్యమాలను కాపాడుకోకుండా ప్రజాస్వామిక తెలంగాణ అంటే అర్థమేలేదు. కేవ లం ఈ విషయాలే కాదు. ప్రజల భాగస్వామ్యం కూడా ప్రజాస్వామ్యంలో కీలకం అటువంటి భరో సా కనిపించడం లేదు. కేవలం ఆధిపత్యం చెలాయించే శక్తులే కాదు, అరిచేవాడి ఆందోళనను అర్థం చేసుకోగలిగే సున్నితత్వం పాలకులకు ఉండాలి. కులం, మతం కాకుండా రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన విలువ ఉంటుంది.
ప్రజాస్వామ్యం అంటే నిరంతరం ఆచరించవలసిన ఒక విలువ, ఒక జీవన విధానం. ప్రజాస్వామి క సమాజానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆరు ప్రాతిపదికలు ముఖ్యమని చెపుతారు. రాజ్యాంగ రచనా సంఘంలో మాట్లాడినప్పుడు అసమానతలు కనిపించని సమాజం ఉండాలని, ప్రతిపక్షం ఉండి తీరాలని. చట్టం, పాలనలో అందరూ సమానులే అన్న భావన ఉండాలని, రాజ్యాంగం పట్ల విధేయ త ఉండాలని, మెజారిటీదే రాజ్యమనే భావన ఉండకూడదని, సమాజానికి నైతిక నిబద్ధత ఉండాలని, ప్రజలే ప్రామాణికం కావాలని అంటారు. ఇవి పాటించినప్పుడు రక్తపాతం లేకుండా ప్రజల సామాజిక, ఆర్థిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగే వ్యవస్థగా ప్రజాస్వామ్యం నిలిచిపోతుంది అని అంబేద్కర్ సంపూర్ణంగా నమ్మారు. కానీ పాలకులు ఆ విలువలు పాటించకపోవడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు రక్త తర్పణ చేయాల్సి వచ్చింది. నవ తెలంగాణలో కూడా ఆశించిన మార్పులు రాకపోతే నిజంగానే విప్లవాలు తప్పవు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి