గురువారం, మార్చి 06, 2014

తెలంగాణా కలాలకు సలాం!

జర్నలిస్టుల జాతర జనజాతర కావాలి!


తెలంగాణ ఉద్యమం తుదిఘట్టంలో ఉన్న సందర్భంలో పోయిన ఏడాది ఏప్రిల్లో విశాలాంధ్ర మహాసభను బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఒక సభ పెట్టింది. సభలో తెలంగాణవాదానికి వ్యతిరేకంగా నూటా ఒక్క అబద్ధాల పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. పుస్తకమే ఒక పెద్ద అబద్ధాల పుట్ట అయితే అందులో మాట్లాడిన పెద్దమనుషులు అంతకంటే అబద్ధాలను చెప్తూ పోవడాన్ని కొందరు జర్నలిస్టులు సహించలేకపోయారు. సభలో పోలీసుల్లో కొందరు, జర్నలిస్టుల్లో కొందరు మినహా తెలంగాణ వాళ్ళు ఎవరూ లేరు. తెలంగాణవాదం మీద వక్తల అవాకులు చెవాకుల పట్ల అక్కడే ఉన్న జర్నలిస్టులు కొందరు అభ్యంతరం చెప్పారు. వారిని సభలోని విశాలాంధ్ర వాదులు అడ్డుకున్నారు. తెలంగాణ జర్నలిస్టులు వారితో ఘర్షణ పడ్డారు. ఘర్షణలో సీనియర్ జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకుడు క్రాంతి కిరణ్ గాయపడ్డారు. ఆయన చేయి విరిగింది. వార్త విని ఆస్పత్రిలో ఉన్న  క్రాంతికి ఫోన్ చేశాను. క్రాంతి దాదాపు ఇరవై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాడు. నాకు చిరకాల మిత్రుడు. మొదటి నుంచి ప్రజా ఉద్యమాలతో మమేకమై ఉన్నప్పటికీ వార్తల సేకరణ విషయంలో రాగద్వేషాలకు అతీతంగా ఉండే పరిణతి గలిగిన వ్యక్తి కాబట్టీ చాలా కాలం టీవీ9 ఉన్నాడు. ఇప్పుడు వీ 6 చానెల్లో కీలకమైన స్థానంలో ఉన్నాడు. పరామర్శ అనంతరం ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేశాను. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ పరకాల ప్రభాకర్ మాట్లాడాడని అందుకే అడ్డుకున్నామని చెప్పాడు. అది దాడికి, ఘర్షణకు దారితీసిందని, చేతికి ప్రెస్ క్లబ్ అద్దాలు గుచ్చుకుని గాయం అయ్యిందని  చెప్పాడు. నిజానికి  ఇలాంటి సందర్భాలలో జర్నలిస్టు ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలి. ఉద్వేగాలకు లోనుకాకుండా కేవలం వార్తా సేకరణ మీదే దృష్టి పెట్టాలి. మాకు అటు చదువుకున్నప్పుడు క్లాసులో తరువాత పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు ఆఫీసుల్లో అదే నేర్పేవాళ్ళు. జర్నలిస్టుకు సొంత మనసు, సొంత అభిప్రాయలు, సొంతగా భావోద్వేగాలు ఉండకుండా వార్తను వార్తగానే గమనించాలి, రిపోర్ట్ చేయాలి అన్నది సాంప్రదాయ సూత్రం. నేనూ అదే అన్నాను. అనవసరంగా గొడవలెందుకు అని ఇంతకీ నువ్వు జర్నలిస్టువా, ఉద్యమకారుడివా అని అడిగాను.  ‘అన్నా.. నేను తెలంగాణవాణ్ని. ప్రాంత ప్రజలను, ఆకాంక్షను వాళ్ళు అవహేళన చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? అని అడిగాడు. ఇంకా చాలా చాలా మాట్లాడాడు. నాకు క్రాంతి ఒక సగటు తెలంగాణ బిడ్డగా మాత్రమే కనిపించాడు. అంతేకాదు నీ కోసం ఇక చాలు, నీ ప్రాంతం కోసం నిలబడు అని బోధించిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం ప్రతినిధిగానే కనిపించాడు.

తెలంగాణ ఉద్యమం ప్రాంత ప్రజలను అలా మార్చి వేసింది. మాట్లాడేలా చేసింది. వృత్తి, ఉద్యోగం, పదవి, హోదా అన్నది ముఖ్యం కాదు. నువ్వు తెలంగాణ వాడివా కాదా అన్నదే ప్రధానం అన్న పరిస్థితి ఉద్యమం తీసుకువచ్చింది. అది జర్నలిస్టులను కూడా విపరీతంగా ప్రభావితం చేసింది. మాటే నేను విశాలాంధ్ర పత్రిక సంపాదకుడు జర్నలిస్టుల సంఘాల జాతీయ నాయకుడు కె. శ్రీనివాసరెడ్డితో అన్నాను. శ్రీనివాసరెడ్డి నాకు తెలిసిన నాటి నుంచి జర్నలిస్టుల సంఘం నాయకుడిగా ఉన్నారు. జర్నలిస్టుల జీతాలు జీవితాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఒకప్పుడు ఆయనే పెద్ద దిక్కు. చాలా సౌమ్యుడు, మితభాషి, పెద్దమనిషి. ఆయన టీవీ చర్చల్లో విశ్లేషకుడిగా వచ్చాక ఆయన ఒక సగటు తెలంగాణవాదిగా మారిపోయారు. ఆంధ్రా మేధావుల వక్రీకరణలను చీల్చి చెండాడే తత్వం అలవరచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో తప్పుడు వాదనలు ఖండించడానికి ఆగ్రహోదగ్రుడై వూగిపోయేవాడు. ఆయనలోనే అంతటి ఆవేశం ఉన్నప్పుడు తరువాత రెండో తరంలో వచ్చిన క్రాంతి చేసింది తప్పెలా అవుతుంది. ఇది ఒక్క క్రాంతి సమస్యే కాదు. మొత్తం తెలంగాణ పౌర సమాజం సమస్య. 190కి అటూ ఇటుగా ఎదిగి వచ్చిన అందరి సమస్య. దానికి మూలం తెలంగాణ అస్తిత్వంలో ఉన్నది. ఒక రకంగా తెలుగు జర్నలిజాన్ని తెలంగాణ ఒక మలుపు తిప్పింది. 1970కి ముందు తెలుగు జర్నలిజం పడికట్టు పద్ధతుల్లో, మూస ధోరణిలో సాంప్రదాయ పద్ధతుల్లో పండితుల పాలనలో సాగేది. దాన్నొక మేధో పరమైన ప్రక్రియగా, శిష్ట జన వ్యవహారంగా భావించేవాళ్ళు. తెలంగాణ వాళ్లకు తెలుగు తెలియదనో, రాయడం రాదనో అనుకునే వాళ్ళు. కానీ 1970 తరువాతి పరిణామాలు జర్నలిజాన్ని జనాంతికం చేశాయి. ఈనాడు వంటి పత్రికలు ఇటు తెలంగాణను, అటు సామాన్యులను చేరాయి. వాటి విస్తృతి పెరిగింది. దైనందిన, సమస్యలు, సామాజిక సంక్షోభాలు, సామాన్యుడికి అవసరమైన విషయాలు వార్తలుగా మారాయి. అప్పుడు అనివార్యంగా తెలంగాణ యువతకు జర్నలిజంలో స్థానం దొరికింది. దాదాపు 0 దశకం దాకా హైదరాబాద్, వరంగల్ జిల్లాల నుంచి, అప్పటికే కమ్యూనిస్టు పార్టీల భావజాలం నుంచి, అడపాదడపా ఆర్ఎస్ఎస్ ప్రభావంతో వచ్చిన వాళ్ళు మొదటి తరంలో వృత్తిలోకి రాగలిగారు. తరంలో వచ్చిన పాశం యాదగిరి, దేవులపల్లి అమర్, శ్రీనివాస రెడ్డి మరికొందరు తిరుగులేని జర్నలిస్టులుగా ఎదిగారు. వీళ్ళే ఇటు జర్నలిస్టులుగా, సంఘాల నాయకులుగా కూడా కీలక భూమిక పోషించారు.

కానీ  80-90 మధ్యకాలం చరిత్రను పూర్తిగా మార్చివేసింది. తెలంగాణలో కాలంలో అలాగే అప్పటికి పదేళ్ళ ముందు వచ్చిన ఉద్యమాలు, వామపక్ష విప్లవ రాజకీయాలు తెలంగాణ సమాజంలో ఒక వెల్లువ లాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాయి. అప్పుడు కాలేజీల్లో కత్తులై మెరిసిన వాళ్ళు, పీడిత ప్రజల విముక్తిని కలలుగని కథలో, కవితలో రాసిన వాళ్ళు ఎదిగి వచ్చారు. అప్పటికి ప్రత్యామ్నాయ ఆలోచనలు, భావజాలం, విజ్ఞానం చాలామందిని మంచి పాఠకులుగా, రచయితలుగా, వక్తలుగా, వ్యాఖ్యాతలుగా తయారు చేసింది. దాసరి నారాయణరావు మొదలు పెట్టిన ఉదయం ఇలాంటి వాళ్లకు వేదికయ్యింది. ఒక వర్గం, ఒక ప్రాంతం, కొన్ని కులాలకే పరిమితమైన జర్నలిస్టు వృత్తిలో జనబాహుల్యం భాగస్వాములవడం అక్కడ మొదలయ్యింది. అందులో తెలంగాణదే పెద్దవాటా. వార్త సేకరించాలన్నా, రాయాలన్నా, శీర్షికతో సంచలనాలు సృష్టించాలన్నా తెలంగాణ పిల్లలే చేయగలరన్నంతగా తరం జర్నలిజాన్ని మార్చి వేసింది. అక్కడి నుంచి తెలంగాణ జర్నలిస్టులకు డిమాండ్ పెరిగింది. తెలుగు పత్రికలు పెట్టుబడివి అయినా ఎడిటర్లతో సహా కీలక భూమిక పోషితున్నది తెలంగాణ తరం నుంచి ఎదిగిన వాళ్ళే. అలాంటి వాళ్ళలో కె. రామచంద్ర మూర్తి, టంకశాల అశోక్, కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి) అల్లం నారాయణ (నమస్తే తెలంగాణా) వి. మురళి ( సాక్షి) వినయ కుమార్ (ప్రజాశక్తి) వంటి వాళ్ళున్నారు. అది అక్కడితో ఆగలేదు. తెలంగాణ జర్నలిస్టులు ఎదిగి వస్తున్న క్రమంలో సమాజంలో వచ్చిన అన్ని అస్తిత్వాలను ఆదరించారు, గౌరవించారుఅనేకసార్లు ప్రజాస్వామికంగా వాటితో మమేకమై కదిలారు. బుద్ధిజీవులుగా వాటిని భుజాన వేసుకుని తిరిగారు. కారంచేడు లాంటి కుల అహంకారాలు పడగ విప్పినప్పుడు, హైదరాబాద్లో మతం పేరుతో స్వార్థ శక్తులు విషం చిమ్మినప్పుడు, గుజరాత్ గాయపడ్డప్పుడు, రాజ్యమే రాక్షసిగా మారి కోరలు సాచి నక్సల్స్ పేరుతో సమస్యను సాధిస్తూ, వేధిస్తూ వెంటబడి చంపినప్పుడు పాత్రికేయులోక్కరే ప్రజాస్వామ్య విలువల గురించి గొంతెత్తారు. పత్రికలను బాధితుల కరపత్రాలుగా మలిచారు. వార్తలు, వర్ణ చిత్రాలు, వ్యాసాలు సంపాదకీయాలు ఇట్లా పత్రికలను బాధితుల పక్షాన నిలబెట్టారు. అప్పుడు వారి వారి యాజమాన్యాలు కూడా అడ్డు చెప్పలేదు. ఇవన్నీ తెలంగాణ పౌర సమాజం ఎదగడానికి, ఆలోచించడానికి దోహదపడ్డాయి. తరం జర్నలిస్టుల్లో అనేకమంది అలాంటి పౌరసమాజం నుంచి ఎదిగి వచ్చిన వాళ్ళే.

అదే పౌరసమాజం తెలంగాణ ఆలోచన చేసింది.తెలంగాణ అస్తిత్వం కోసం కలవరించింది.దాన్ని మాత్రం పత్రికలు వాటి పెట్టుబడిదారులు గుర్తించలేదు. తెలంగాణను బాధితపక్షంగా చూడలేదు. తెలంగాణను ఒక న్యాయమైన డిమాండ్గా పరిగణించలేదు. తెలంగాణ భాషను, సంస్కృతిని  సమానమైనరీతిలో గౌరవించలేదు సరికదా. తెలంగాణ గురించి మాట్లాడడం, రాయడమే తప్పు అన్నట్టుగా కొన్ని పత్రికలు ప్రవర్తించాయి. అసెంబ్లీలో చంద్రబాబు తెలంగాణను నిషేధించినట్టే కొన్ని పత్రికలు అలాంటి వార్తలను కూడా నిషేధించాయి. తెలంగాణ వారిని కీలక బాధ్యతల నుంచి దూరం పెట్టాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల్లోంచి తొలిగించాయి. సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే 2001లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పుట్టింది. తెలంగాణ అస్తిత్వమే పునాదిగా ఒక పరిపూర్ణమైన పౌరసమాజం పోషించాల్సిన పాత్రను తన భుజానికి వేసుకుంది. నిజానికి అదొక సాహసం. అల్లం నారాయణతో పాటు నలుగురైదుగురు చేసిన ప్రయత్నం. అన్నీ వదిలేసి తెలంగాణ కోసం నిలబడింది. వారివారి యాజమాన్యాలను ఎదిరించి కొందరు, వారికి ఇబ్బంది కలుగనీయకుండా కొందరు వాళ్ళ వృత్తిపరమైన సమస్యలను పూరవపక్షంచేసి తెలంగాణే మా నినాదం అని చాటి నిలబడ్డారు. అప్పటికే కొందరు మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, ముఖ్యంగా ఎన్జీవోలు ప్రయత్నం చేస్తున్నారు. అది తెలంగాణలో పుట్టినందుకు, మట్టిలో ఎదిగినందుకు తమ బాధ్యత అనుకున్నారు. బుద్ధిజీవులుగా ప్రజలను చైతన్యపరచడం, సంఘటితపరచడం, పాయలు పాయలుగా ఉన్నా తెలంగాణ వాదాన్ని ఒక చోటికి చేర్చడం పనిగా పెట్టుకున్నారు. కవులు, రచయితలు కళాకారుల్లాగే జర్నలిస్టులు కూడా సృజనశీలురని, సృజనంటే కేవలం తెల్లకాగితాన్ని నల్లగాచేసే అక్షరాలూ రాయడమే కాదని, నలుపెక్కిన నెలలో ఎర్రపూలు పూయించే చైతన్యాన్ని నింపడమనీ భావించారు. అలా మొదలైన జర్నలిస్టు ఫోరం గడిచిన దశాబ్దానికి పైగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజల పక్షాన, తెలంగాణపక్షాన, పోరాడేశక్తుల పక్షాన నిలబడింది. అందేకాదు ఉద్యమం ఆగిపోతుందనో, ఉద్యమ నాయకత్వం అలసిపోయిందనో అనిపించినప్పుడు తనే ముందు నిలబడి ప్రజలను నడిపించింది. రాజకీయపార్టీలను సమన్వయపరచింది. తెలంగాణ గురించి సభల్లో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పింది. వ్యూహాలు నేర్పింది. విద్యార్థులను కలిపింది.  


జర్నలిజం అంటే చాలా మందికి ఒక ఆకర్షణ, జర్నలిస్టు అంటే ఒక వీరుడు, శూరుడు, దేశోద్ధారకుడు అన్న భావన చాలా మందిలో ఉంది. వృత్తికి ఉన్న గుర్తింపు, గౌరవం దృష్టా జర్నలిస్టులు కూడా మర్యాదస్తులుగా మసలుకునే వాళ్ళు. నిజానికి జర్నలిజం మేడిపండు లాంటి వృత్తిపైకి మెరుస్తూ కనిపిస్తున్నా ఎక్కడాలేని వృత్తిపరమైన సమస్యలు, అభద్రత జర్నలిస్టుల సొంతం వృత్తిని కాపాడడానికి, వృత్తిలోకి వచ్చిన వారిని నిలబెట్టడానికి జర్నలిస్టుల సంఘాలు ఎంతో కృషి చేశాయి. అయినప్పటికీ తెలుగు మీడియాలో జర్నలిస్టులు సాధారణంగా సంఘాలు ఉద్యోగాలు, ప్రమోషన్లు, వేతనాలు తదితర విషయాలే ఆలోచిస్తాయి, కానీ తెలంగాణ జర్నలిస్టు సమస్య ప్రజలది నేనొక రిపోర్టర్ మాత్రమే అనుకోలేదు సమస్య నాది అనుకున్నారు. సమస్య నాది అనుకున్న తత్వం అలవాటు అయినాక నేనునా వృత్తి, ప్రమాణాలు, నిబంధనలు, నియమాలు ఎవరికైనా సరే గుర్తుకు రావు. అసలు ఉద్యమం అంటే అలాంటి వాటిని ఉల్లంఘించి నిలబడడం. నిలబడి పోరాడడం. పనే తెలంగాణ జర్నలిస్టు ఫోరం చేసింది. ఒకప్పుడు  జర్నలిస్టులు గొంతెత్తాలంటే చాలా తతంగం ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ జర్నలిస్టులు మాత్రం కోట్లాది గొంతులకు కోరస్ గా మారిపోయారు. ఇప్పుడు తెలంగాణ వచ్చింద కాబట్టి  ఒక బృందగానంతో ఉద్యమానికి ముగింపు పలకాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం భావిస్తున్నట్టు లేదు. దీన్నొక జాతరగా కొనసాగించాలని, నవ తెలంగాణ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని తీర్మానించింది . దీన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘంగా మార్చుతోంది. ఇది తక్షణావసరం. ఇదొక్క టీజేఎఫ్కే కాదు అన్ని సంఘాలు ఇదే బాట పట్టాలి. ఇప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళు, ఎవరి రంగంలో వాళ్ళు, ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు పాత కాలపు వలస సంస్కృతిని పాతరేసికొత్త విలువలు తేవాలి. బాధ్యత రాజకీయ నాయకులదే అనుకుంటే జరిగేది కేవలం అధికార పార్టీదే తప్ప ఇంతకాలం చెప్పినట్టు విముక్తి కాదు. పునర్నిర్మాణం అసలేకాదు. నిజానికి సగం విధ్వంసం తెలంగాణ సంస్కృతి, భాషల పరాయీకరణలో జరిగింది. మరో సగం ప్రజలను తప్పుదోవ పట్టించే మీడియా మాయాజాలంతో జరిగింది. మీడియా ప్రజల మెదళ్లలోకి తన అభిప్రాయాలు జొప్పించి ఒక అంతా మనమంచికే అన్న ధోరణిని స్థిరపరిచింది. రెండింటినీ సవరించాలి. గడిచిన పది ఇరవై ఏళ్ళలో ఇదొక క్రమ పద్ధతిలో జరిగింది. ముసుగులు తొలగించాలంటే తెలంగాణ పౌరసమాజం స్వతంత్రంగా నిలబడాలి. అది తెలంగాణ జర్నలిస్టుల నుంచే మొదలవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరికీ పోటీ కాదు. పోటీ అయినా నష్టం లేదు. పోటీ ఉండకూడదని అనుకోవడం రాచరికపు, నియంతృత్వ, వలస ధోరణి. తెలంగాణ సమాజం రాచరికాన్ని తరిమేసింది, నియంతృత్వాన్ని ఓడించింది, నిన్నటికి నిన్న వలసవాదానికి సరిహద్దులు గీసేసింది. ఇప్పుడు ఇంకా అవే చెల్లుబాటు కావాలనుకోవడం అత్యాశ. అశేష ప్రజానీకానికి బాసటగా నిలబడ్డందుకు వారిని జై కొడదాం. ఒక సరి కొత్త పౌరసమాజ వేదికగా ఎదిగి తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ జర్నలిస్టులు కూడా ప్రజలతో భుజం భుజం కలిసి నడవాలి, తెలంగాణ జర్నలిస్టుల  జాతర జన జాతర కావాలి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి