శుక్రవారం, మార్చి 21, 2014

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?



"స్వాతంత్రం రావడం సంతోషదాయకం అనడంలో సందేహంలేదు. కానీ అది మనమీద ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టిందన్న సంగతి మరచి పోవద్దు. స్వాతంత్రం రావడం వాళ్ళ మనం ఏతప్పు జరిగినా బ్రిటీష్ వాళ్ళమీద తోసేసి పబ్బం గడుపుకునే అవకాశాన్ని కోల్పోయాం. ఇకముందు కూడా పొరపాట్లు జరిగితే దానికి  నిందించడానికి మనం తప్పఇంకెవరూ ఉండరు. కాలం వేగంగా మారుతోంది, తప్పులు జరిగే ప్రమాదం మెండుగా ఉంది".

 భారత రాజ్యాంగ రచన పూర్తవుతున్న దశలో రాజ్యాంగ సభను ఉద్దేశించి డా. బి. ఆర్. అంబేద్కర్ అన్న మాటలు ఇప్పుడు తెలంగాణా సమాజానికి కూడా వర్తిస్తాయి. తెలంగాణా సమాజం కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఒక స్వాతంత్ర్య ఆకాక్షగా,స్వయంపాలన ఆకాక్షగానే భావించింది. తెలంగాణా ఉద్యమం కూడా అదే పద్దతుల్లో అంతే స్థాయిలో జరిగింది. తెలంగాణా వస్తే అన్ని సమస్యలు తీరి బతుకు బంగారంలా మారిపోతుందన్న భావన చాలామందిలో ఉంది. ఉద్యమ భావ వ్యాప్తి, రాజకీయాలు అలాంటి హామీని తెలంగాణా సమాజానికి ఇచ్చాయి. మొత్తానికి తెలంగాణా కల సాకారం అయ్యింది. తెలంగాణాకు ఇదొక చారిత్రక సందర్భం. ఆరుదశాబ్దాల సుదీర్ఘ పోరాటాల తరువాత తెలంగాణా ఇప్పుడొక ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తోందిఇప్పుడు అంతా స్వపరిపాలన మీద, తెలంగాణా పునర్నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారు. ఒక్క రాజకీయపక్షాలే కాదు తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ తో సహా ప్రజా పక్షం ఉండే మేధావులు, జర్నలిస్టులు కూడా భవిష్యత్ తెలంగాణా గురించి ఆలోచిస్తున్నారు. అందుకు ప్రణాళికలు ప్రతిపాదిస్తున్నారు. రాస్తున్నారు. దీనిని తెలంగాణా పునర్నిర్మాణం అని కొందరంటే మరి కొందరు నవనిర్మాణం అనిఇంకా కొందరు పునరుజ్జీవం అనీ అంటున్నారు. మాట ఏదయినా రేపటి తెలంగాణా ఎలా ఉండాలన్నదే అందరి ఆలోచన. ఇదొక మంచి పరిణామం. ఇటువంటి ఆలోచనలు గతంలో ఏర్పడ్డ కొత్తరాష్ట్రాల్లో పెద్దగా కనిపించలేదు. ఒక రాజకీయ ప్రక్రియ ముగిసి కొత్త రాష్త్రాలు ఏర్పడ్డాక వారిని రాజకీయ పార్టీలకు, పాలక వర్గాలకు వదిలేయడం వల్ల అక్కడ సామాజిక మార్పు పెద్దగా కనిపించలేదు. తెలంగాణా ఆలోచనా పరులు ఇప్పుడు మార్పునుకోరుకుంటున్నారు. కొత్త సామాజిక, ప్రజాస్వామిక విలువలు రావాలనిఆశిస్తున్నారు. కేవలం భౌగోళిక తెలంగాణా మాత్రమే సాధించి ప్రయోజనం లేదని, అది కేవలం రాజకీయ స్వాతంత్రాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప సామాజిక, ఆర్ధిక స్వాతంత్రం ప్రజాస్వామిక వాతావరణం వీటిద్వారా ఏర్పడదని స్పష్టంగా నమ్ముతోంది. అలా కాకుండా ప్రజల బతుకుల్లో వెలుగు నింపే తెలంగాణా కావాలని ఇప్పుడు అంతా కోరుకుంటున్నారు. అందుకే ఆకాంక్షలు ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు  డా. బి. ఆర్. అంబేద్కర్  గారు ఇలాంటి ఆలోచన చేసారు. ఆయన భారత రాజ్యాంగాన్ని దేశ పునర్నిర్మాణ ప్రణాళికగా మలిచారు. దేశంలోని అన్ని వర్గాలు, జాతులు, తెగలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, స్త్రీ పురుషులు ఇట్లా అన్ని అస్తిత్వాల ఆకాకంక్షాల వేదికగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పుడు తెలంగాణలో వ్యక్తమవుతున్నఆకాంక్షలే రత దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో కూడా వ్యక్తం అయినాయి. తరతరాల స్వపరిపాలన ఆకాంక్షకు స్వాతంత్ర్యం వచ్చిందన్న భావోద్వేగం తోడై ఇకనైనా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలన్న తపన పట్టుదలతో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. దానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు. రాజకీయ స్వాతంత్రం పొందిన భారతదేశం సామాజిక విప్లవం సాధించాలన్నది లక్ష్యాల్లో అన్నిటికంటే కీలకమైనది. రాజ్యాంగం ద్వారా లక్ష్యం సాధించాలని భావించి అందుకు అవసరమైన అన్ని మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచే ప్రయత్నం చేసారు. అయితే ఇది ఒక్కరి చేతుల్లోనో పెట్టకుండా ప్రజలందరికీ ప్రాతిధ్యం వహించే  ఒక వేదికగా రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పరచి వారి ఆలోచనలు, సలహాలు సూచనలతో న్యాయనిపుణులు, మేధావులతో కూడిన రచనా సంఘం ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాలు, ఆదర్శాలను ఆచనలో పెట్టేవిదంగా బంగారు భారతావనిని నిర్మించే దిశగా రాజ్యాంగం ఉండాలని భావించారు. స్వపరిపాలన అంటే కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదని స్వాతంత్ర్యంలో ప్రజలందరి భాగస్వామ్యమని విశ్వసించి రాజ్యాంగ నిర్మాతలు సమష్టి ఆలోచనలతో దానిని రూపొందించారు. భారత రాజ్యాంగం భారత దేశ భవిష్యత్తు పునర్నిర్మాణానికి ఒక ప్రాతిపదికగా రూపొందింది. సందర్భంగా పాలకవర్గాల బాధ్యత గుర్తుచేస్తూ  స్వాతంత్ర్యం రావడం వాళ్ళ వలసపాలకులను నిందించే అవకాశాన్ని  కోల్పోయామన్న సంగతి మరిచిపోవద్దని ఆయన హెచ్చరించారు.

ఇప్పుడు అదే హెచ్చరిక తెలంగాణా రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఇంతకాలం ఆంధ్రా దోపిడిని సాకుగా చూపి పబ్బం గడుపుకున్నట్టు భవిష్యత్తులో పరిపాలన సాగదని వారు గుర్తుపెట్టుకోవాలి. బహుశ అది గుర్తించే ఇప్పుడు అన్ని పార్టీలు పునర్నిర్మాణ మంత్రాన్ని జపిస్తున్నాయితెలంగాణా రాష్ట్రం ఏర్పాటవడంతో పాటు రాష్ట్ర శాసన సభకు, పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ తమ తమ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. యధాలాపంగా రూపొందించే ఎన్నికల ప్రణాళికలనే ఇప్పుడు రాజకీయ పార్టీలు పునర్నిర్మాణ ప్రణాళికలుగాచెపుతున్నాయి. కానీ పునర్నిర్మాణం ఎవరు చేయాలి అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న కాబోతున్నది. స్వాతంత్ర్యం వచ్చింది మొదలు తెలంగాణా ప్రజలు తమను తాము పరిపాలించుకునే అవకాశం ఏనాడు కూడా పొందలేదుహైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అయిన వెంటనే రాజకీయ అధికారం పొందలేదు. మొదట కొద్దికాలం సైనిక పాలన తరువాత పౌర ప్రభుత్వం పేరుతో అధికారుల పాలనలో ఉండాల్సి వచ్చింది. 1952-56 మధ్య స్వతంత్రంగా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఉమ్మడి హైదరాబాద్ గా కన్నడ, మరాటీ ప్రాంతాలతో కలిసి ఉండడం మూలంగా తెలంగాణా పునర్నిర్మాణ అవకాశం రాలేదు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలంగాణా పునర్నిర్మాణ అవకాశమే రాక పోగా తెలంగాణా అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త వలసవాదం మొదలయ్యింది. తెలంగాణా అస్తిత్వాన్ని, ప్రజల ఆకాక్షలను, అభివృద్ధిని గడిచిన అరవై సంవత్సరాల్లో అణచివేసి దీనిని ఆంద్ర ప్రదేశ్ గా మలిచిన శక్తుల్లో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయి రెండు పార్టీల పాలనలో సాగిన అన్యాయాలకు పరిష్కారంగానే ప్రజలు తెలంగాణా ను కోరుకున్నారు. తెలంగాణా ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఎదగాలని, స్వీయ రాజకీయ చైతన్యంతో ప్రజాభాహుల్యంలోనుంచి ఎదిగివచ్చిన విద్యావంతులు కలలుగన్నారు. ఫలితంగా ఉద్యమం సకల జనుల సమాహారమై నిలబడి తెలంగాణా సాధించుకుంది. భారత స్వాతంత్ర్య పోరాటం కూడా ఇలాగే రూపుదిద్దుకుంది. బ్రిటీష్ పాలనలో కొలువులకోసం చదువుకున్నవాళ్ళు, ఉద్యోగస్తులు ప్రజల ఆకాంక్షలు గుర్తించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నిర్మించారు. నాయకత్వం వహించి దానినొక జాతీయ ఉద్యమంగా సజీవంగా నిలబెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ వంటి ఒక విశాల వేదికను ఏర్పాటు చేసి ఒకరి తరువాత ఒకరు నాయకత్వంలోకి వచ్చి నిరంతరాయంగా నడిపించారు. స్వపరిపాలన ఆకాంక్షను గుర్తించిన వలస పాలకులు భారత దేశానికి 1935 లోనే ఒక రాజ్యాంగ పత్రాన్ని రూపొందించి దానిని భారత స్వపరిపాలనా ప్రణాళికగా చెప్పారు. సందర్భంలో గాంధీ గారు " భారతీయులు తమ గమ్యాన్ని తామే నిర్ణయించుకోవాలి,స్వరాజ్యం బ్రిటీష్ వాళ్ళిచ్చే బిక్షకాదు. అది ప్రజల ఆకాంక్షల  మేరకువాళ్ళు స్వేచ్చగా ఎంచుకున్న ప్రతినిధుల ద్వారా ఆవిర్భావించాలి అని చెప్పారు. 1945 నాటికి బలహీన పడ్డ బ్రిటీష్ ప్రభుత్వం స్వతంత్ర రాజ్యాంగానికి అనుమతి ఇస్తూ భారతీయులకు రాజ్యాంగం రాసిపెట్టడానికి తన అధికారులను పంపింది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ దానికి అంగీకరించక స్వతంత్ర రాజ్యాంగ నిర్ణాయక సభను ఎన్నుకుని పునర్నిర్మాణ ప్రణాళికగా రాజ్యాంగ రచనకు పూనుకుంది. రాజ్యాంగ నిర్ణాయక సభలో సభ్యులను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేసింది. అన్ని పక్షాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా సభ్యులను ఎంపిక చేసింది.
కానీ ఇప్పుడు తెలంగాణలో అలా జరుగడం లేదు. ఎవరికీ వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో తెలంగాణా, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండా పోయింది. ఉద్యమానికి ఊతమిచ్చిన విద్యావంతులు, జె సి ప్రమేయం లేకుండా పోయింది . అరవై ఏళ్ళు తెలంగాణా అస్తిత్వాన్ని కూలగొట్టిన వాళ్ళే మళ్ళీ పునర్నిర్మిచి నిలబెడతామని ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం కూడా ఇప్పుడు తెలంగాణాను పునర్నిర్మించేది తామేనని అంటున్నారు. తెలంగాణ లో ప్రతి రాజకీయ పార్టీ పునర్నిర్మాణం గురించి ప్రస్తావిస్తున్నా నిర్దుష్టమైన ప్రతిపాదనలతో తెలంగాణా రాష్ట్ర సమితి మినహా ఇంకెవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా కె సి ఆర్ ఆలోచనలు, హామీలు క్రోడీకరించి అదే పునర్నిర్మాణ ప్రణాళిక అంటుందే తప్ప ప్రజల్లో చర్చించి ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రాతిపదికన దీనిని ఒక భవిష్యత్ ప్రణాళికగా మలిచే ప్రయత్నం చేయడం లేదు. నిజన్నికి తెలంగాణా పునర్నిర్మాణం ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికన, ఉద్యమ ఎజెండా ప్రకారం జరగాలిఇంతకాలం సమస్యలప్రాతిపదికన తెలంగాణా ఉద్యమాన్నినిర్మించారో, ఆసమస్యలే పునాదిగా తెలంగాణా ఏర్పడాలి. దానికొక ఆచరణాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలి.

ఇప్పుడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు మనవారో ఎవరు పరాయివారో తెలియని రోజులు వచ్చేసాయి. తెలంగాణా రాష్ట్ర సమితి లో ఇప్పుడు మానుకోట మారణకాండ సృష్టించిన కొండా మురళి దంపతులు కీలక నేతలైపోయారు. పార్టీ లో ఇంతకాలం ఉద్యమాన్ని ఉక్కుపాదాలకిండా అనచివసిన వాళ్ళు చాలామంది చేరిపోతున్నారు. వాళ్ళే గెలిచి తెలంగాణాను పునర్నిర్మిస్తారు. అలాగే ఆరు దశాభ్దాల వంచనకు, మూడు సంవత్సరాల మారణకాండకు కారణమైన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా ఉద్యమ కారులకు, జె సి నాయకులకు ఊయలగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మోసం, జాప్యం వల్ల  కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఇప్పుడు పార్టీ గుండెలకు హత్తుకుంటోంది. అమరవీరులని ఆకాశానికి ఎత్తుతోందిచివరిదాకా తెలంగాణాకు అండగా ఉన్న తెలంగాణా బీజేపీ తెలంగాణా ఏర్పాటును ఆఖరి నిమిషం దాకా అడ్డుకోవడానికి ప్రయత్నించి, దేశంలోని అన్నిపార్టీలను ఏకంచేసిన చంద్రబాబు నాయుడుతో చెలిమి చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు నిజంగానే ఎవరు ద్రోహులో తేల్చుకోలేని అయోమయంలో  తెలంగాణా సమాజం పడిపోయింది.

పరిస్థితికి తెలంగాణా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ( జే సి) తిరోగమన వైఖరి కూడా కారణం. మూడేళ్ళపాటు తెలంగాణా ఉద్యమానికి జవజీవాలు నింపిన రాజకీయ జే సి తెలంగాణా ప్రకటన వచ్చిన తరువాత పూర్తిగా నిర్వీర్యమై పోయిందిజె సే సారధులు చాలామంది ఇప్పుడు రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలుగా మారిపోతున్నారు. టీ ఆర్ ఎస్స్ మొదలు బీ జె పీ, తెలుగుదేశం, కాంగ్రెస్ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు వారిని దువ్వేపనిలో పడ్డాయి. రాజకీయ జె సి ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి ఉంటె పరిస్థితి వచ్చేది కాదు. స్వాతంత్ర్యం రాగానే భారత జాతీయ కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ చెప్పినప్పటికీ నెహ్రూ వినలేదు. ఆయనే దానికి అధ్యక్షుడై దేశ పునర్నిర్మాణంలో భాగస్వామిగా మారాలనుకున్నాడు. జే సి కూడా అటువంటి పాత్ర పోషించి ఉంటె బాగుండేది. ఉద్యమమైనా సరే ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళే భవిష్యత్తుకు నాయకత్వం వహించినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రొ. కోదండరామ్ అలా చేయలేక పోయారు. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఆయన జేఏసీ ఏర్పాటు చేసి ఇంతకాలం నిలబెట్టి, తెలంగాణా సాధించి ఇప్పుడు పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు రాజకీయ పార్టీల చేతిలో తెలంగాణా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. ఇది మంచి పరిణామం ఎంత మాత్రమూ కాదు!

1 కామెంట్‌: