శుక్రవారం, మార్చి 28, 2014

V6 మార్నింగ్ షో. దళిత ముఖ్యమంత్రి ?

V6 మార్నింగ్ షో. దళిత ముఖ్యమంత్రి ?

6TV వార్ రూం వెంకట కృష్ణ తో..


Political Parties Mind Game in Telangana - News Scan


సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?


సామాజిక ఉద్యమాలు చాలా సందర్భాల్లో ఆశించిన లక్ష్యాలు నెరవేర్చడం కంటే ఊహించని పార్శ్వాలను తడుముతుంటాయి. ఉద్యమ సందర్భంలో, ఆ ఉద్యమంలో మమేకమయ్యే ప్రజానీకం దీనివల్ల తమకెలాంటి మేలు జరుగుతుందో ఆలోచించి అందులో భాగస్వాములవుతారు. తెలంగాణ ఉద్యమం కూడా ఒక వైపు సమష్టి చైతన్యానికి ప్రతీకగా ఉంటూనే సామాజిక మూలాలను వెతికే ప్రయత్నం చేసింది. రాజకీయ సంవాదంలో మౌలికమైన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఉద్యమంలో ఉన్న భిన్న భావజాలాలున్న వ్యక్తులవల్ల, సంస్థల వాళ్ళ, అలాగే ఉద్యమానికి మద్దతునిచ్చిన రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల మూలంగా ఉద్యమం కేవలం రాష్ట్ర సాధనకే పరిమితం కాకుండా అనేక కీలకమైన అంశాలను చర్చకు పెట్టింది. అందులో ఎలాంటి రాష్ట్రం, ఎవరి రాష్ట్రం, ఎవరి అధికారం అనే అంశాలు కూడా ఉన్నాయి.వీటి నేపథ్యంలో ప్రధానంగా సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అంశాల మీద చాలా చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. నిజానికి ఈ రెండు అంశాలు చాలా లోతయినవి, విస్తృతితో కూడుకున్నవి. ప్రజల పోరాటాలు, ఉద్యమాలు, భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేవి. కానీ రాజకీయపార్టీలు ఇప్పుడు వాటిని ఎన్నికలకు, ముఖ్యమంత్రులకు పరిమితంచేసి దానినొక రాజకీయ సంకుచితవాదంవైపు నడిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సామాజిక తెలంగాణ అన్న విశాల భావనను సామాజిక న్యాయం అనే ఒక తేలికపాటి పాతకాలపు ఎన్నికల నినాదంగా మార్చివేశాయి. 

తెలంగాణా ఉద్యమం సామాజిక నేపధ్యం 

తెలంగాణవాదం ఈ ప్రాంతపు ప్రజల ఉద్వేగపూరిత ఆకాంక్షగా మొదలయినప్పటికీ క్రమక్రమంగా ఒక సామాజిక, ఆర్థిక ప్రత్యామ్నాయ నమూనాగా మారింది. అలాగే వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలపడింది. 1952లో వచ్చిన  ‘ముల్కీ’ వ్యతిరేక ఉద్యమం, 1969 లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, మళ్ళీ 1990లో మొదలయిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో వచ్చిన మార్పుకుఅద్దం పడతాయి.  మొదటి రెండు దశల్లో ముఖ్యంగా చదువుకున్న నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు కీలక భూమిక పోషించారు. అవి హైదరాబాద్‌తో పాటు కొన్ని పట్టాణ ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. ఈ ఉద్యమాలు అవకాశాలు ఆధిపత్యం చుట్టూ సాగాయి.మూడవ దశలో మేధావులు, ఆలోచనాపరులు వివిధ ప్రజా సంఘాల ద్వారా తెలంగాణ భావవ్యప్తిని ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని కదిలారు. ఈ దశలో తెలంగాణవాదం మరింత పరిణతితో ఆర్థిక సంస్కరణల నేపధ్యంలో తెలంగాణలో జరిగిన సామాజిక విధ్వంసానికి విరుగుడుగా, ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. 1990వ దశకం మధ్యకాలం నుంచి తెలంగాణ సమాజం తీవ్ర సామాజిక సంక్షోభానికి లోనయ్యింది. వర్షాభావం, కరువు పరిస్థితులకు తోడు ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, నీళ్ళు లేక, కరెంటులేక, విత్తనాలు పురుగుమందులు అందక తెలంగాణ రైతాంగం అతలాకుతలం అయ్యింది. రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయి, వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. రైతు ఉద్యమాలను, నిరసనలను ప్రభుత్వాలు క్రూరంగా అణచివేసాయి. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కరెంటు సరఫరా చేయాలని, విత్తనాలు అందించాలని, చివరకు అరాకొరగా పండిన పంటలను సమయానికి కొనాలని ఆందోళన చేసిన రైతుల మీద పోలీసు కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించే స్థాయికి వెళ్ళాయి. ఈ పరిణామాలు వ్యవసాయ ఆధారిత వృత్తులను, కులాలను, కూలీలను దెబ్బతీశాయి. మరోవైపు మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న చేనేత మొదలు ఇతర వృత్తులు కుప్పకూలిపోయాయి. నేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు పెరిగిపోయాయి గ్రామీణ సామాజిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రపంచీకరణ ముసుగులో కనిపించని కుట్రలతో పల్లె కన్నీరు పెడుతున్న దృశ్యాన్ని మేధావులు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల ప్రతినిధులు బట్టబయలు చేస్తూ వచ్చారు. ఈ తెలంగాణ కన్నీటి పాటను గోరటి వెంకన్న లాంటి  గద్దర్ లాంటి  అనేకమంది తెలంగాణ వాగ్గేయకారులు వాడవాడలా పాడి వినిపించారు. కవులు, రచయితలు గ్రామాల విధ్వంసం మీద అనేక రచనలు చేశారు. 

మరోవైపు చదువు కుంటుపడింది. ప్రభుత్వ ఖర్చును తగ్గించే పేరుతో ప్రైవేటు విద్యను ప్రోత్సహించే పేరుతో ఉన్నత విద్యావకాశాలను తెలంగాణ పిల్లలకు అందకుండా చేసి హైదరాబాద్‌ను కార్పోరేట్ విద్యా విపణిగా మార్చేశారు. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ టీ) తప్ప మిగతాది ఏదీ చదువు కాదనే స్థితి ప్రభుత్వమే కల్పించింది. ఉద్యోగాల మీద అధికారిక నిషేధం సాగింది. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించిన వందలాది పరిశ్రమలను మూసివేయడంతో లక్షలాది ఉపాధి కోల్పయారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు లేక, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రాక నిరుద్యోగుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఈ దశలో సంఘటితమై నిరసన తెలపడానికి, పోరాడటానికి కూడా అవకాశాలు లేకుండా ప్రభుత్వం అశాంతిని అణచివేసే అధికారం పోలీసు దొరకు అప్పగించింది. ఇట్లా ఒక దశాబ్ద కాలంలో మొత్తం తెలంగాణ సమాజాన్ని మార్కెట్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేసింది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబునాయుడు అన్నది చారిత్రక సత్యం. సరిగ్గా ఈ సంక్షోభపు పునాదుల నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టింది. తెలంగాణను ఒక పార్లమెంటరీ రాజకీయ నినాదంగా మార్చి ప్రజలకు ఒక కొత్త ఆశ రేకెత్తించింది. మన నీళ్ళు మనకు రాకుండా పోతున్నాయని, ఉద్యోగాల్లో మన వాటా మనకు దక్కడం లేదని ఇట్లా ప్రజల సమస్యలకు కారణం వలస పాలనే కారణమని మన రాష్ట్రం మనకు వస్తే మన పాలన మనకు ఉంటుందని ఒక సరికొత్త ప్రతిపాదన చేసింది.  

సామాజిక తెలంగాణా అంటే ,,? 

తమ కష్టాలకు తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక తక్షణ పరిష్కారంగా ప్రజలు భావించి ఉద్యమంలో కదిలారు. ప్రజలంతా కేసీఆర్‌ను నమ్మి ఆయన వెంట నడవకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే తమ కష్టాలు తీరుతాయని మాత్రం నమ్మారు. ఆ నమ్మకంతోనే ఎవరి వేదికల్లో వారు తెలంగాణవాదాన్ని ప్రచారం చేశారు. తెలంగాణ అంతటిని ఒక నిర్లక్షానికి, వివక్షకు బలయిపోయి, బలహీన పడిన సమాజంగా చూశారు. సామాజిక పునర్నిర్మాణ భావనకు పునాది పడింది అక్కడే. ఒక కులం మరో కులాన్ని దోచుకోవడం, వివక్ష ప్రదర్శించడం, అవమానకరమైన రీతిలో తక్కువ చేసి చూడడం జరిగినట్టే తెలంగాణ సమాజాన్ని కూడా ఆంధ్రా పాలకులు చూశారు. కాబట్టే ఇది కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా సామాజిక ఆర్థిక స్వయం ప్రతిపత్తి కోసం సాగిన ఉద్యమంగా గుర్తింపు పొందింది. నిలబడి గెలిచింది. ఈ గెలుపులో తెలంగాణ ప్రజలందరి భాగస్వామ్యం ఉంది. అంటే తెలంగాణ సమాజంలోఎక్కువ సంఖ్యలో ఉన్న అణగారిన కులాలకు, వర్గాలకు ఎక్కువ భాగస్వామ్యం ఉంది.ఆంధ్రా పాలకుల దోపిడీ నుంచి తెలంగాణ విముక్తి కావాలని కోరుకున్నట్టే భూస్వాములు, దొరలూ, అగ్రవర్ణ ఆధిపత్య శక్తుల నుంచి, భావజాలం నుంచి కూడా విముక్తి కావాలని ఈ వర్గాలు, కులాలు వాటి ప్రజలు, ఉద్యమ ప్రతినిధులు కోరుకున్నారు. దాన్నే వాళ్ళు సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ అంటే ఉద్యమ నాయకత్వం అప్పగించడం అని అప్పట్లో కొందరు వాదించారు. ఇప్పుడు చాలామందే రాష్ట్ర పరిపాలనను అణగారిన వర్గాల నాయకులకు అప్పగించడం అని వాదిస్తున్నారు. నిజానికి ఈ రెండూ కాదు. 

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు. నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాలపార్టీల్లో బడుగులకు బడుగులకు అధికార పదవులిస్తే సామాజిక తెలంగాణ రాదు. సామాజిక తెలంగాణ ఆచరణాత్మక ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, ఒక ప్రత్యేక అభివృద్ధి లక్ష్యంగా సాగాల్సిన ఉద్యమం. అది సామూహిక చైతన్యం ద్వారా సాధించావలసిందే తప్ప వ్యక్తిగత పదవులతో దానికదే రాదు. సామాజిక తెలంగాణ రావాలంటే సమాన భాగస్వామ్యంతో పాటు సమగ్ర ప్రణాళికతో ధ్వంసమైన సామాజిక రంగాలన్నిటినీ పునర్నిర్మించాలి. అన్ని కులాలకు, వర్గాలకు వారి వారి రంగాల్లో  గౌరవప్రదమైన జీవిక ఉండేలా ఈ ప్రణాళిక ఉండాలి. విద్య, వైద్యం, ఉపాధి రంగాల మీద ప్రత్యేక దృష్టి ఉండాలి. దీనికి ఇప్పటిదాకా ఆచరిస్తున్న పద్ధతులు, విధానాలు కాకుండా ప్రజలకు అనుకూలమైన ఆర్థిక విధానాలు ఉండాలి. మొత్తంగా పాలన సంస్కరించబడాలి. భూమి పంపిణీ జరగాలి, చదువులు అందుబాటులో ఉండాలి. ఆ చదువులకు సార్థకత ఉండాలి. ఆర్థికంగా ఎదిగి నిలబడే అవకాశాలు అందాలి. అన్నిటికీమించి అణగారిన వర్గాలను మనుషులుగా చూసే సంస్కారం, సమాన భావన రావాలి. దీనికి ప్రజల్లో అలాంటి చైతన్యం రావాలి. నిజంగానే స్వతంత్రుడు, శక్తివంతుడైన ఒక దళిత ప్రతినిధి నాయకత్వంలో పాలన ఉంటే ఇవన్నీ సాధించవచ్చు. కానీ అలా అందరికీ నాయకత్వం వహించే శక్తి ఉన్నవాళ్ళు, ఒకవేళ ఉన్నా వారికి స్వాతంత్రం ఉన్నాయా అన్నది కూడా ఆలోచించాలి. తెలంగాణ విధ్వంసం మొదలైన నాటి నుంచి, ఇంకా చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి  ఈ నాయకులంతా రాజకీయాల్లో, పదవుల్లో ఉన్నారు. కాకపోతే ఆంధ్రా పాలకుల కింద తాబేదార్లుగా ఉన్నారు. వాళ్ళు ఏది చెపితే అది చేస్తూపోయారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి ముఖ్యం అనుకున్నారు తప్ప నా ప్రాంతం ఇది అని అనుకోలేదు. 

వీరితో సామాజిక తెలంగాణా సాధ్యమేనా !

అధికారంలో ఉన్నవ్యక్తి ఏ కులమైనా ఆ పార్టీ విధానాల ప్రకారమే, తన నాయకుడి ఆదేశాన్ని బట్టే నడుస్తాడు. తనదే ఒక స్వతంత్ర పార్టీ అయితే తప్ప స్వతంత్రంగా ఉండడం భారత దేశ పార్లమెంటరీ వ్యవస్థలో సాధ్యం కాదు. ఇది అంబేద్కర్ మొదలు కాన్షీరాం దాకా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మొదలు ఆయన యాదవ శిష్యులు ములాయం, లాలూ ప్రసాద్ దాకా నమ్మారు. వాళ్ళు సొంతంగా పార్టీలు స్థాపించుకుని, ప్రజల్లోకి వెళ్లి, వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడ్డారు. ప్రజలందరికీ పాలకులయ్యారు తప్ప, పెత్తందార్ల కింద పెద్ద పాలేర్లుగా ఉండాలనుకోలేదు. కానీ తెలంగాణలో ఇప్పుడు కొందరు కొత్త పాలేర్లను నియమించేస్తున్నారు. సామాజిక తెలంగాణ డిమాండ్ ఉద్యమ కాలంలో ఊపందుకున్న దశలో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి బాణాన్ని వదిలారు. అదే మాట ఒకటికి వందసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదన్న సంకేతాలు ఇస్తున్నారు. దానికి కారణాలు ఏవైనా ఆయన మాట మీద నిలబడరన్న భావనను మరింత బలపరిచింది. ఇదే అదునుగా కాంగ్రెస్ బీసీని పార్టీ అధ్యక్షుడిగా చేసి సామాజిక తెలంగాణ తమతోనే సాధ్యం అనడానికి ఇదే సాక్ష్యం అంటున్నది. కానీ పొన్నాల లక్ష్మయ్య సామర్థ్యం మీద నమ్మకం లేకనో ఏమో ఆయనను కేవలం వ్యంగ్యపు మాటలకు పరిమితంచేసి పని చేయడానికి ఇంకొక రెడ్డి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించుకుంది. ఇకపోతే తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవికను కుప్పకూల్చిన చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రినిచేసి సామాజికన్యాయం చేస్తానని అంటున్నాడు. ఆంధ్రాలో సామాజిక న్యాయం అవసరం లేనట్టుగా అక్కడ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కలగంటున్నాడు. తెలంగాణ కోసం రెడీమేడ్‌గా మార్కెట్లో ఉన్న కొందరు బీసీ నేతల్ని ముందుకు తెస్తున్నాడు. అభ్యర్థుల ఎంపిక మొదలు అన్ని అధికారాలు తన దగ్గరే ఉంచుకున్న నాయుడు గారు అలంకారప్రాయ పదవుల్లో తెలంగాణ బీసీలను నియమిచారు. ఈ నాయకులు ఎలాంటి మొహమాటం లేకుండా తెలంగాణ అభివృద్ధి కేవలం మా బుగారి మార్గదర్శకత్వంలోనే సాధ్యం అని తమ విధేయతను చాటుకుంటున్నారు. ఇకపోతే మరో రెడ్డిగారి అధ్యక్షతలో నడుస్తున్న భారతీయ జనతాపార్టీ కూడా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తుందట. అయినా ఎవరో ఒక బీసీని, ఎస్సీలు ఎందుకు భరించాలి? అతనికి కులం ఉండదా? అలాగే ఎస్సీల్లో ఒక ఉపకులం వ్యక్తిని ఇంకో ఉపకులం వ్యక్తి అంగీకరిస్తాడా? అసలు ఈ ఇద్దరినినీ ఇతర కులాలు ఆమోదిస్తాయా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పాలకులు దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రాయితీలు, వెసులుబాట్లు, పదవులు అన్నీ ఒక భిక్షంగానో, వరంగానో, దానంగానో  ఇస్తున్నారు తప్ప అది పొందడం వాళ్ళ హక్కు అనే అవగాహన అధికారంలో ఉన్నవాళ్ళకు, ప్రజలకు కూడా కల్పించలేకలేకపోయారు. అంతేకాదు పాలకులుగా మారాలని అనుకునే దళిత బహుజన వాదులు కూడా వారిమధ్య ఏకత్వ భావన సాధించలేకపోయారు. అగ్రవర్ణాలు దళితులను ఎలా చూస్తున్నాయో, ఎంత దూరంలో పెడుతున్నాయో బీసీ కులాలు కూడా అలాగే చూస్తున్నాయి. 

ఇటువంటి ధోరణి ఉన్న సమాజంలో ఇది సాధ్యపడే పనేనా అన్నది కూడా ఆలోచించాలి. ప్రజల్లో అటువంటి సమభావన కలిగించకుండా, అలాంటి నాయకత్వం ఎదగకుండా, సామాజిక తెలంగాణ కావాలని కోరుకోవడం పగటి కలె అవుతుంది. కులంతో సంబంధం లేకుండా స్పష్టమైన ప్రణాళికకు చిత్తశుద్ధి, నిబద్ధత, కార్యదక్షతకు తోడైతే అగ్రకులం వాళ్లైనా సామాజిక తెలంగాణను ఆచరణలోకి తేవచ్చు. పునర్నిర్మాణం గురించి మాట్లాడేవాళ్లు నవ నిర్మాణం అని చెప్తున్న వాళ్లు ఎవరైనా సరే ధ్వంసం చేసిన వాళ్లకు పునర్నిర్మించే అర్హత లేదని గుర్తించుకోవాలి. నవ తెలంగాణ నిర్మించుకునే హక్కు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి నడిపించిన  వాళ్లకే ఉంటుందని గమనించాలి.

శుక్రవారం, మార్చి 21, 2014

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?



"స్వాతంత్రం రావడం సంతోషదాయకం అనడంలో సందేహంలేదు. కానీ అది మనమీద ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టిందన్న సంగతి మరచి పోవద్దు. స్వాతంత్రం రావడం వాళ్ళ మనం ఏతప్పు జరిగినా బ్రిటీష్ వాళ్ళమీద తోసేసి పబ్బం గడుపుకునే అవకాశాన్ని కోల్పోయాం. ఇకముందు కూడా పొరపాట్లు జరిగితే దానికి  నిందించడానికి మనం తప్పఇంకెవరూ ఉండరు. కాలం వేగంగా మారుతోంది, తప్పులు జరిగే ప్రమాదం మెండుగా ఉంది".

 భారత రాజ్యాంగ రచన పూర్తవుతున్న దశలో రాజ్యాంగ సభను ఉద్దేశించి డా. బి. ఆర్. అంబేద్కర్ అన్న మాటలు ఇప్పుడు తెలంగాణా సమాజానికి కూడా వర్తిస్తాయి. తెలంగాణా సమాజం కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఒక స్వాతంత్ర్య ఆకాక్షగా,స్వయంపాలన ఆకాక్షగానే భావించింది. తెలంగాణా ఉద్యమం కూడా అదే పద్దతుల్లో అంతే స్థాయిలో జరిగింది. తెలంగాణా వస్తే అన్ని సమస్యలు తీరి బతుకు బంగారంలా మారిపోతుందన్న భావన చాలామందిలో ఉంది. ఉద్యమ భావ వ్యాప్తి, రాజకీయాలు అలాంటి హామీని తెలంగాణా సమాజానికి ఇచ్చాయి. మొత్తానికి తెలంగాణా కల సాకారం అయ్యింది. తెలంగాణాకు ఇదొక చారిత్రక సందర్భం. ఆరుదశాబ్దాల సుదీర్ఘ పోరాటాల తరువాత తెలంగాణా ఇప్పుడొక ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తోందిఇప్పుడు అంతా స్వపరిపాలన మీద, తెలంగాణా పునర్నిర్మాణం మీద దృష్టి పెడుతున్నారు. ఒక్క రాజకీయపక్షాలే కాదు తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ తో సహా ప్రజా పక్షం ఉండే మేధావులు, జర్నలిస్టులు కూడా భవిష్యత్ తెలంగాణా గురించి ఆలోచిస్తున్నారు. అందుకు ప్రణాళికలు ప్రతిపాదిస్తున్నారు. రాస్తున్నారు. దీనిని తెలంగాణా పునర్నిర్మాణం అని కొందరంటే మరి కొందరు నవనిర్మాణం అనిఇంకా కొందరు పునరుజ్జీవం అనీ అంటున్నారు. మాట ఏదయినా రేపటి తెలంగాణా ఎలా ఉండాలన్నదే అందరి ఆలోచన. ఇదొక మంచి పరిణామం. ఇటువంటి ఆలోచనలు గతంలో ఏర్పడ్డ కొత్తరాష్ట్రాల్లో పెద్దగా కనిపించలేదు. ఒక రాజకీయ ప్రక్రియ ముగిసి కొత్త రాష్త్రాలు ఏర్పడ్డాక వారిని రాజకీయ పార్టీలకు, పాలక వర్గాలకు వదిలేయడం వల్ల అక్కడ సామాజిక మార్పు పెద్దగా కనిపించలేదు. తెలంగాణా ఆలోచనా పరులు ఇప్పుడు మార్పునుకోరుకుంటున్నారు. కొత్త సామాజిక, ప్రజాస్వామిక విలువలు రావాలనిఆశిస్తున్నారు. కేవలం భౌగోళిక తెలంగాణా మాత్రమే సాధించి ప్రయోజనం లేదని, అది కేవలం రాజకీయ స్వాతంత్రాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప సామాజిక, ఆర్ధిక స్వాతంత్రం ప్రజాస్వామిక వాతావరణం వీటిద్వారా ఏర్పడదని స్పష్టంగా నమ్ముతోంది. అలా కాకుండా ప్రజల బతుకుల్లో వెలుగు నింపే తెలంగాణా కావాలని ఇప్పుడు అంతా కోరుకుంటున్నారు. అందుకే ఆకాంక్షలు ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు  డా. బి. ఆర్. అంబేద్కర్  గారు ఇలాంటి ఆలోచన చేసారు. ఆయన భారత రాజ్యాంగాన్ని దేశ పునర్నిర్మాణ ప్రణాళికగా మలిచారు. దేశంలోని అన్ని వర్గాలు, జాతులు, తెగలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, స్త్రీ పురుషులు ఇట్లా అన్ని అస్తిత్వాల ఆకాకంక్షాల వేదికగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పుడు తెలంగాణలో వ్యక్తమవుతున్నఆకాంక్షలే రత దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలో కూడా వ్యక్తం అయినాయి. తరతరాల స్వపరిపాలన ఆకాంక్షకు స్వాతంత్ర్యం వచ్చిందన్న భావోద్వేగం తోడై ఇకనైనా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలన్న తపన పట్టుదలతో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. దానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు. రాజకీయ స్వాతంత్రం పొందిన భారతదేశం సామాజిక విప్లవం సాధించాలన్నది లక్ష్యాల్లో అన్నిటికంటే కీలకమైనది. రాజ్యాంగం ద్వారా లక్ష్యం సాధించాలని భావించి అందుకు అవసరమైన అన్ని మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచే ప్రయత్నం చేసారు. అయితే ఇది ఒక్కరి చేతుల్లోనో పెట్టకుండా ప్రజలందరికీ ప్రాతిధ్యం వహించే  ఒక వేదికగా రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పరచి వారి ఆలోచనలు, సలహాలు సూచనలతో న్యాయనిపుణులు, మేధావులతో కూడిన రచనా సంఘం ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాలు, ఆదర్శాలను ఆచనలో పెట్టేవిదంగా బంగారు భారతావనిని నిర్మించే దిశగా రాజ్యాంగం ఉండాలని భావించారు. స్వపరిపాలన అంటే కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే కాదని స్వాతంత్ర్యంలో ప్రజలందరి భాగస్వామ్యమని విశ్వసించి రాజ్యాంగ నిర్మాతలు సమష్టి ఆలోచనలతో దానిని రూపొందించారు. భారత రాజ్యాంగం భారత దేశ భవిష్యత్తు పునర్నిర్మాణానికి ఒక ప్రాతిపదికగా రూపొందింది. సందర్భంగా పాలకవర్గాల బాధ్యత గుర్తుచేస్తూ  స్వాతంత్ర్యం రావడం వాళ్ళ వలసపాలకులను నిందించే అవకాశాన్ని  కోల్పోయామన్న సంగతి మరిచిపోవద్దని ఆయన హెచ్చరించారు.

ఇప్పుడు అదే హెచ్చరిక తెలంగాణా రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఇంతకాలం ఆంధ్రా దోపిడిని సాకుగా చూపి పబ్బం గడుపుకున్నట్టు భవిష్యత్తులో పరిపాలన సాగదని వారు గుర్తుపెట్టుకోవాలి. బహుశ అది గుర్తించే ఇప్పుడు అన్ని పార్టీలు పునర్నిర్మాణ మంత్రాన్ని జపిస్తున్నాయితెలంగాణా రాష్ట్రం ఏర్పాటవడంతో పాటు రాష్ట్ర శాసన సభకు, పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ తమ తమ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. యధాలాపంగా రూపొందించే ఎన్నికల ప్రణాళికలనే ఇప్పుడు రాజకీయ పార్టీలు పునర్నిర్మాణ ప్రణాళికలుగాచెపుతున్నాయి. కానీ పునర్నిర్మాణం ఎవరు చేయాలి అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న కాబోతున్నది. స్వాతంత్ర్యం వచ్చింది మొదలు తెలంగాణా ప్రజలు తమను తాము పరిపాలించుకునే అవకాశం ఏనాడు కూడా పొందలేదుహైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అయిన వెంటనే రాజకీయ అధికారం పొందలేదు. మొదట కొద్దికాలం సైనిక పాలన తరువాత పౌర ప్రభుత్వం పేరుతో అధికారుల పాలనలో ఉండాల్సి వచ్చింది. 1952-56 మధ్య స్వతంత్రంగా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఉమ్మడి హైదరాబాద్ గా కన్నడ, మరాటీ ప్రాంతాలతో కలిసి ఉండడం మూలంగా తెలంగాణా పునర్నిర్మాణ అవకాశం రాలేదు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలంగాణా పునర్నిర్మాణ అవకాశమే రాక పోగా తెలంగాణా అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త వలసవాదం మొదలయ్యింది. తెలంగాణా అస్తిత్వాన్ని, ప్రజల ఆకాక్షలను, అభివృద్ధిని గడిచిన అరవై సంవత్సరాల్లో అణచివేసి దీనిని ఆంద్ర ప్రదేశ్ గా మలిచిన శక్తుల్లో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు ప్రధాన పాత్ర పోషించాయి రెండు పార్టీల పాలనలో సాగిన అన్యాయాలకు పరిష్కారంగానే ప్రజలు తెలంగాణా ను కోరుకున్నారు. తెలంగాణా ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఎదగాలని, స్వీయ రాజకీయ చైతన్యంతో ప్రజాభాహుల్యంలోనుంచి ఎదిగివచ్చిన విద్యావంతులు కలలుగన్నారు. ఫలితంగా ఉద్యమం సకల జనుల సమాహారమై నిలబడి తెలంగాణా సాధించుకుంది. భారత స్వాతంత్ర్య పోరాటం కూడా ఇలాగే రూపుదిద్దుకుంది. బ్రిటీష్ పాలనలో కొలువులకోసం చదువుకున్నవాళ్ళు, ఉద్యోగస్తులు ప్రజల ఆకాంక్షలు గుర్తించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నిర్మించారు. నాయకత్వం వహించి దానినొక జాతీయ ఉద్యమంగా సజీవంగా నిలబెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ వంటి ఒక విశాల వేదికను ఏర్పాటు చేసి ఒకరి తరువాత ఒకరు నాయకత్వంలోకి వచ్చి నిరంతరాయంగా నడిపించారు. స్వపరిపాలన ఆకాంక్షను గుర్తించిన వలస పాలకులు భారత దేశానికి 1935 లోనే ఒక రాజ్యాంగ పత్రాన్ని రూపొందించి దానిని భారత స్వపరిపాలనా ప్రణాళికగా చెప్పారు. సందర్భంలో గాంధీ గారు " భారతీయులు తమ గమ్యాన్ని తామే నిర్ణయించుకోవాలి,స్వరాజ్యం బ్రిటీష్ వాళ్ళిచ్చే బిక్షకాదు. అది ప్రజల ఆకాంక్షల  మేరకువాళ్ళు స్వేచ్చగా ఎంచుకున్న ప్రతినిధుల ద్వారా ఆవిర్భావించాలి అని చెప్పారు. 1945 నాటికి బలహీన పడ్డ బ్రిటీష్ ప్రభుత్వం స్వతంత్ర రాజ్యాంగానికి అనుమతి ఇస్తూ భారతీయులకు రాజ్యాంగం రాసిపెట్టడానికి తన అధికారులను పంపింది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ దానికి అంగీకరించక స్వతంత్ర రాజ్యాంగ నిర్ణాయక సభను ఎన్నుకుని పునర్నిర్మాణ ప్రణాళికగా రాజ్యాంగ రచనకు పూనుకుంది. రాజ్యాంగ నిర్ణాయక సభలో సభ్యులను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంపిక చేసింది. అన్ని పక్షాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా సభ్యులను ఎంపిక చేసింది.
కానీ ఇప్పుడు తెలంగాణలో అలా జరుగడం లేదు. ఎవరికీ వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో తెలంగాణా, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండా పోయింది. ఉద్యమానికి ఊతమిచ్చిన విద్యావంతులు, జె సి ప్రమేయం లేకుండా పోయింది . అరవై ఏళ్ళు తెలంగాణా అస్తిత్వాన్ని కూలగొట్టిన వాళ్ళే మళ్ళీ పునర్నిర్మిచి నిలబెడతామని ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం కూడా ఇప్పుడు తెలంగాణాను పునర్నిర్మించేది తామేనని అంటున్నారు. తెలంగాణ లో ప్రతి రాజకీయ పార్టీ పునర్నిర్మాణం గురించి ప్రస్తావిస్తున్నా నిర్దుష్టమైన ప్రతిపాదనలతో తెలంగాణా రాష్ట్ర సమితి మినహా ఇంకెవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా కె సి ఆర్ ఆలోచనలు, హామీలు క్రోడీకరించి అదే పునర్నిర్మాణ ప్రణాళిక అంటుందే తప్ప ప్రజల్లో చర్చించి ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రాతిపదికన దీనిని ఒక భవిష్యత్ ప్రణాళికగా మలిచే ప్రయత్నం చేయడం లేదు. నిజన్నికి తెలంగాణా పునర్నిర్మాణం ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికన, ఉద్యమ ఎజెండా ప్రకారం జరగాలిఇంతకాలం సమస్యలప్రాతిపదికన తెలంగాణా ఉద్యమాన్నినిర్మించారో, ఆసమస్యలే పునాదిగా తెలంగాణా ఏర్పడాలి. దానికొక ఆచరణాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలి.

ఇప్పుడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు మనవారో ఎవరు పరాయివారో తెలియని రోజులు వచ్చేసాయి. తెలంగాణా రాష్ట్ర సమితి లో ఇప్పుడు మానుకోట మారణకాండ సృష్టించిన కొండా మురళి దంపతులు కీలక నేతలైపోయారు. పార్టీ లో ఇంతకాలం ఉద్యమాన్ని ఉక్కుపాదాలకిండా అనచివసిన వాళ్ళు చాలామంది చేరిపోతున్నారు. వాళ్ళే గెలిచి తెలంగాణాను పునర్నిర్మిస్తారు. అలాగే ఆరు దశాభ్దాల వంచనకు, మూడు సంవత్సరాల మారణకాండకు కారణమైన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా ఉద్యమ కారులకు, జె సి నాయకులకు ఊయలగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మోసం, జాప్యం వల్ల  కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఇప్పుడు పార్టీ గుండెలకు హత్తుకుంటోంది. అమరవీరులని ఆకాశానికి ఎత్తుతోందిచివరిదాకా తెలంగాణాకు అండగా ఉన్న తెలంగాణా బీజేపీ తెలంగాణా ఏర్పాటును ఆఖరి నిమిషం దాకా అడ్డుకోవడానికి ప్రయత్నించి, దేశంలోని అన్నిపార్టీలను ఏకంచేసిన చంద్రబాబు నాయుడుతో చెలిమి చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు నిజంగానే ఎవరు ద్రోహులో తేల్చుకోలేని అయోమయంలో  తెలంగాణా సమాజం పడిపోయింది.

పరిస్థితికి తెలంగాణా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ( జే సి) తిరోగమన వైఖరి కూడా కారణం. మూడేళ్ళపాటు తెలంగాణా ఉద్యమానికి జవజీవాలు నింపిన రాజకీయ జే సి తెలంగాణా ప్రకటన వచ్చిన తరువాత పూర్తిగా నిర్వీర్యమై పోయిందిజె సే సారధులు చాలామంది ఇప్పుడు రాజకీయ పార్టీలకు గెలుపు గుర్రాలుగా మారిపోతున్నారు. టీ ఆర్ ఎస్స్ మొదలు బీ జె పీ, తెలుగుదేశం, కాంగ్రెస్ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు వారిని దువ్వేపనిలో పడ్డాయి. రాజకీయ జె సి ఒక స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి ఉంటె పరిస్థితి వచ్చేది కాదు. స్వాతంత్ర్యం రాగానే భారత జాతీయ కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ చెప్పినప్పటికీ నెహ్రూ వినలేదు. ఆయనే దానికి అధ్యక్షుడై దేశ పునర్నిర్మాణంలో భాగస్వామిగా మారాలనుకున్నాడు. జే సి కూడా అటువంటి పాత్ర పోషించి ఉంటె బాగుండేది. ఉద్యమమైనా సరే ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళే భవిష్యత్తుకు నాయకత్వం వహించినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. కానీ ప్రొ. కోదండరామ్ అలా చేయలేక పోయారు. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఆయన జేఏసీ ఏర్పాటు చేసి ఇంతకాలం నిలబెట్టి, తెలంగాణా సాధించి ఇప్పుడు పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు రాజకీయ పార్టీల చేతిలో తెలంగాణా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. ఇది మంచి పరిణామం ఎంత మాత్రమూ కాదు!