మీకు ఈ ఘంటాపథం నచ్చితే మౌనంనే ఉండండి. మనసులోనే అభినందించండి. దయచేసి నోరు విప్పకండి. ఇంకెవరికీ ఆ మాట చెప్పకండి. నేను పేస్ బుక్ లో పోస్ట్ చేసినా సరే 'లైక్' ని క్లిక్ చెయ్యకండి. ఇప్పుడు నోరు విప్పాలంటేనే భయపడాల్సిన రోజులు వచ్చేసాయి. మన మాటలను, చర్యలను, చేష్ట లనే కాదు మన ఆకాంక్షలను, ఆలోచనలను చివరికి భావోద్వేగాలను కూడా మనలోనే సమాధి చేసుకోవాల్సిన రోజుల్ని మనం చూస్తున్నాం. అలా చేసుకోకుండా మొండిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీ మనసుతో మీరు ఆలోచించి, మీకు మీరుగా మీ భావాలను బయట పెట్టాలనే ప్రయత్నంలో గొంతెత్తి గట్టిగా అరవాలని నోరుతేరిచారో అంతే సంగతులు. మీరు తల దించుకుని బతకాల్సి వస్తుంది. మళ్ళీ తలేత్తుకోవాలంటే ఒకటికి పది సార్లు క్షమాపణలు కోరుకోవాల్సి ఉంటుంది. అయినా ఎవ్వరూ వినరు. మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ వెంటపడి నిరంతరం వేధిస్తారు. అవసరం అనుకుంటే ఎదో ఒక చట్టం లో బుక్ చేసి మిమ్మల్ని అరెస్టు చేసి బొక్కలో తోసేస్తారు. అట్లా మన ఆలోచనలను, ఆకాంక్షలను, అభిప్రాయాలను కట్టడి చేసే కొత్త తరం దొరలు, నయా నిఘా వర్గాలు, మన ఆలోచనలను అరెస్టు చేసే 'థాట్ పోలీసులు',మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తత్వ బోధకులు ఇప్పుడు తయారుగా ఉన్నారు. వాళ్ళందరికీ మన పాలక వర్గాలు పహారా కాస్తుంటాయి. అవసరమైతే పాదపూజ చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యం నిలబడింది, నిలబడాలని కలగంటోంది అలాంటి వాళ్ళ కాళ్ళ మీదే!
మొన్నకు మొన్నబొంబాయిలో ఎవరో ఒకరుచనిపోయారు. అదికూడా దాదాపు ఎనభై ఏళ్లకు పైగా బతికి సహజంగానే చనిపోయాడు తప్ప మరొక రకంగా కాదు. జనన మరణ గణాంకాల ప్రకారం అలాదేశంలో ప్రతి సెకనుకు ఒకరికంటే ఎక్కువమందే చనిపోతున్నారు. కానీ ఆరోజు చనిపోయింది మాత్రం మనిషికాదు. పులి. ఆ నగరానికే పెద్దపులి. దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఆ నగరాన్ని, ఆ నగరానికి బతకడానికి వచ్చిన మూగజీవాలను తన అరుపులతో హడలెత్తించిన పులి. ఒక్క మరాఠీ జాతి తప్ప మరెవ్వరూ బొంబాయిలో కాలరేగిరేసి బతకడానికి వీలులేదని శాసించిన వ్యక్తి. ఆయన ప్రాంతీయ వాదిగా కొందరు చెపుతుంటారు. కానీ అది ప్రాంతీయ వాదం కాదు,ప్రాంతీయ, జాతీయ విద్వేషం. తెలంగాణలో కూడా ప్రాంతీయ వాదం ఉంది. కానీ ప్రజాస్వామికంగా, న్యాయబద్ధంగా ఉంది.
1960 చివర్లో బతుకుదేరువుకోసం బొంబాయి వెళ్ళిన తెలంగాణాబిడ్డల్ని తరిమి తరిమి వెంటాడినవ్యక్తి, మహారాష్ట్ర అంటే మరాఠీ ల జాగీరని చెప్పిన వ్యక్తి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను లుంగీ వాలాలని అవహేళన చేసి, ఉద్యోగాలుచేయకుండా చేసిన వ్యక్తి. తన ప్రతాపమంతా వలసకూలీల మీద, బీహారీ టాక్సీ డ్రైవర్ల మీద, చిన్నా చితకా వ్యాపారుల మీదా చూపించి బోంబాయి నగరాన్ని తన కబంద హస్తాలలో ఉంచుకున్న వ్యక్తి. అతనొక నియంత. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు నియంతృత్వాన్ని సమర్థించాడు, అనుసరించాడు, ఆచరించాడు. ఆయన జర్మన్ నియంత హిట్లర్ ప్రేమికుడు. తనను తాను హిట్లర్ తో పోల్చుకున్నాడు. హిట్లర్ కు తనకు చాలా సారూప్యత ఉందని, అలవాట్లు, పద్ధతులు హాబీలు వృత్తి వ్యాపకాలు, మనస్తత్వం ఇద్దరిదీ ఒకటే నని చెప్పుకున్న వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యానికి పచ్చివ్యతిరేకి. భారత దేశానికిప్రజాస్వామ్యం పనికి రాదనీ,నియంత్రుత్వమే పరిష్కారమని పదేపదేప్రభోదించిన వ్యక్తి. దేశమంతాఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీఉక్కుపాదం కింద నలిగి పోతుంటే ఆమెకు మద్దతు తెలిపి ఆమెఅరాచక ధోరణిని సమర్ధించిన వ్యక్తి. ఆయన పేరు బాల్ థాకరే . ఆయనమరణంతరువాత ఆయనకు గౌరవ సూచకంగా బంద్ పాటించాలని ఆయన అనుచరులైన సైనికులు పిలుపునిచ్చారు. బంద్ ప్రశాంతంగా ఉండదని ఊహించిన పోల్లీసులు భారీగా బలగాలు దించి సహకరించారు. ఆ సేనలు అన్ని షాపులను దగ్గరుండి మరీమూయించాయి. రైళ్ళు, బస్సులు ఆన్నీ నిలిచిపోయాయి. అంతే ముంబాయి మూత పడింది.
ఈ సంఘటనలు కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఎదో ఒక రకంగా స్పందిస్తారు. మనిషన్నాక స్పందించి తీరాలి. చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అందులో షహీన్ అనే యువతీ కూడా ఉంది. మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసిన ఆ యువతీ తన భావాలను నిర్మొహమాటంగా తన మిత్ర్హులతో పేస్ బుక్ ద్వారా పంచుకుంది. అది ఆమె హక్కు. ఎ మనిషయినా తన మనసులో కలిగిన భావాలను, అభిప్రాయాలను ఇతరులతో పన్చిఉకొవక్చని, ఎటువంటి మాధ్యమంద్వారా అయినా దానిని ప్రచారం చేసుకోవచ్చు నని రాజ్యాంగం చెపుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఎ)(బి) పౌరుడికి భావప్రకటన స్వేచ్చను కల్పించాయి. నిజానికి మన పత్రికలు, తెలీవిజన్ చానల్లు కూడా మనిషికి ఉండే ఈ రాజ్యంగా హక్కును అడ్డుపెట్టుకునే నడుస్తున్నాయి. మీడియా ఏదయినా అడినిర్వహిస్తోన్న పాత్ర భావ ప్రసరణ. వ్యక్తులు, సమూహాల అభిప్రాయాలను, భావాలను ఇతరులకు చేరవేయడం కోసమే మీడియా పుట్టింది. అలాగే సోషల్ మీడియా కూడా. పత్రికలు, టెలివిజన్ ల లాగే ఇప్పుడు సోషల్ మీడియా విస్త్రుత ప్రచారం లోకి వచ్చింది. అందులో పేస్ బుక్ కు విపరీతమైన ఆదరణ ఉంటోంది. వ్యక్తులు తమ భావాలు,ఉద్వేగాలను , అభిప్రాయలు అంచనాలను పదిమందితో అదీ వారి మిత్రులతో పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా సైట్లు ఉపయోగపడుతున్నాయి. అలా తన మనసులోని ఉద్వేగాలను షహీన్ తన పేస్ బుక్ ప్రొఫైల్ లో రాసుకుంది. ప్రొఫైల్ అంటే ఓపెన్ డైరీ లాంటిది. మీరు ఏదయినా అందులో రాసుకోవచ్చు. అది మీ మిత్రులతో పంచుకోవచ్చు.
షహీన్ తన భావాలను ఈ విధంగా రాసి మిత్రులతో పంచుకుంది. ''ప్రతిరోజు వేలమంది మరణిస్తుంటారు. అయినా ప్రపంచం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. కాని ఒక రాజకీయ వేత్త సహజమరణం పొందినపుడు ప్రతి ఒక్కరూ ఆవేదనకు గురవుతారు. ఇష్టాన్ని బట్టిగాక బలవంతంగా అలా జరుగుతుందని వారు తెలుసుకోవాలి. ఎవరివల్లనైతే స్వేచ్ఛాయుత భారతీయులుగా మనం జీవిస్తున్నామో అటువంటి షహీద్ భగత్సింగ్, సుఖదేవ్, రాజ్ గురు, ఇంకా అటువంటి వారికి ఎవరైనా కొంత గౌరవంచూపి, లేదా రెండు నిముషాల మౌనం పాటించి ఎంతఎంత కాలం అయ్యిందో కదా? గౌరవాన్ని ఆర్జించాలి, పొందాలి. అది బలప్రయోగం ద్వారా కాకూడదు. ఈ రోజున ముంబయి గౌరవంతో గాక భయంతో మూతపడింది''. ఇది ఆమె అభిప్రాయం. ఆమె సగటు మనిషి కాబట్టి, ఆమెకు మనసు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి సహజంగానే కలిగిన అభిప్రాయం. అందులో ఇతరులను కించపరచడం గానీ, అవమానించే వ్యాఖ్యలు గానీ, అనవసర మాటలు గానీ లేవు. నిజానికి ఆమె ఎవరి పేరును కూడా ఎత్తలేదు. కేవలం తన భావాలు పంచుకుంది. ఇలాంటప్పుడు, ఇలాంటి బలవంతపు బందులు చూసినప్పుడు దేశంకోసం మరణించిన వారికోసం ఒక్క నిమిషం ఆలోచించక ఎంతకాలమయ్యిందో కదా అనిపిస్తుంది. అదే ఆమెకు కూడా అనిపించి రాసింది. అది ఆమె హక్కు. కానీ పోలీసులు ఆమె చేసింది నేరమంటూ అరెస్టు చేసారు. అలాంటి దేశభక్తి భావాలున్నందుకు అరెస్టు చేసి ఆమె మీద మతాలమధ్య చిచ్చు పెట్టె ఆలోచన చేసిందని అభియోగం మోపారు. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టు ను చదివి బాగుంది అని 'లైక్' చేసిన రేణు శ్రీనివాసన్ అనే మరో అమ్మాయిని కూడా పోలీసులు అరస్టు చేసారు. ఆమె భావాలు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేవిగా ఉన్నాయట.! ఈ ఇద్దరిమీదా ఇండియన్ పీనల్ కోడ్ లోని 505 ( 2), 295 ఎ, తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 66 ఎ, ప్రకారం కేసులు పెట్టారు. ఆ అరెస్టులను చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంది. కొద్దో గొప్పో ఇంకా ప్రజాస్వామిక స్పృహలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా స్పందించడంతో ఇప్పుడు పోలీసు చర్య పెద్ద వివాధమై కూర్చుంది. పోనీ చట్టం తన పని తాను చేసుకుంటుందని సరిపెట్టుకున్నారా అంటే అదీలేదు. బాల్ థాకరే భక్తులు ఆ యువతీ ఇంటిమీద, బందువుల ఆస్తుల మీద దాడి చేసి కోట్లాది రూపాయలు నష్టం చేసారు. విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు చట్టం, పోలీసులు, ప్రభుత్వం తప్పు సవరించుకుని వారిద్దరినీ వదిలేసినా వీళ్ళు మాత్రం వదిలే స్థితిలో లేరు. వాళ్ళిప్పుడు థాకరే తమ దేవుడని చెపుతున్నారు.
మనిషిగానే మారణ హోమాన్ని సృష్టించిన థాకరే నిజంగానే దేవుడయి కూర్చుంటే మరీ ప్రమాదం. ఎందుకంటే ఆయన బతికుండగానే రాజ్యాంగాన్ని, చట్టాన్ని పనిచేయనీయలేదు. ఆయన చెప్పిందే రాజ్యాంగం, చేసిందే శాసనం. కేవలం నియంతృత్వ ధోరణే కాదు చట్టం, న్యాయం, రాజ్యాంగంతో సమాంతరంగా పనిచేసి, ఏ అధికారం లేకున్నా బొంబాయి నగరాన్ని శాసించిన వ్యక్తి థాకరే. ఒక దశలో ఆయన ఉగ్రవాదులను మించి ప్రకటనలు చేసారు. ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం అనుమతించని మాటలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి విద్వేషాల విషం విరజిమ్మే ప్రకటనలు చేసారు. భారత రాజ్యంగ స్ఫూర్తి వ్యతిరేకంగా ఆయన ఇస్లాం కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా హిందూ మానవ బాంబులుగా మారాలని యువతను రెచ్చగొట్టి అలజడి సృష్టించారు. అట్లా అనుకుని ఆయన హిందూ రాజకీయ సిద్ధాంతాలు నమ్మినవాడని అనుకుంటే పొరపాటు. ఆయన పక్కా సంకుచిత వాది. ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వాళ్ళ ప్రాంతీయ పండుగ చ్చ్చాత పూజ చేసుకుంటే అడ్డుపదడమే కాక ఆ పూజలో పాల్గొన్న పార్లమెంటు సభ్యలను కూడా బెదిరించాదాయన. ఆయన తీరును యావత్ పార్లమెంటు హక్కుల తీర్మానం పెట్టి మరీ ఖండించింది. చివరకు ఆయన పార్టీలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నేతలు కూడా థాకరే ధోరణిని ఖండించి పార్టీ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. 'పంజాబ్ లో ఖలిస్తాన్ కు, కాశ్మీర్ ఉగ్రవాద మిలిటెంట్లకు, శివసేనకు పెద్ద తేడా లేదని అన్నవారూ ఉన్నారు.
అయినా సరే థాకరే ముద్ర చాలా మందికి నచ్చింది. దేశంలోని అన్ని పత్రికలు ఆయన మరణ వార్తను పతాక శీర్షికలలో ప్రచురించాయి. చానల్లు చర్చలు పెట్టాయి. ఈ దేశ ప్రధాని తో సహా అనేకమంది ఆయనను అజరామరుడిగా కీర్తించారు, కొనియాడారు! ప్రజాస్వామిక విలువలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండే మనుషులు హటాత్తుగా ఎదో ఒకరోజు మరణించగానే మహానుభావులై పోయే పరిస్థితి కొత్తగా వచ్చినదేమి కాకపోయినా, ఇప్పుడు ఆయన ఆత్మ శాంతికోసం బొంబాయి పోలీసులు అతిగా ప్రవర్తించి రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన సేచ్చాను హరించే చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మీద ప్రెస్ కౌన్సిల్ ఫ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మాట్లాడిన తరువాత పరిస్థితి మారింది గానీ లేకపోతే ఎవరూ పెద్దగా స్పందించే వాళ్ళు కూడా కాదు.
ఎందుకో ఏమోగానీ చాలా మంది ఈ మధ్య ఎవరు నిజాలు మాట్లాడినా భరించలేక పోతున్నారు. అభిప్రాయాలు, భావాలు చెప్పినా విమర్శలుగానో, తిట్లుగానో, తీవ్రమైన అభాందాలుగానో భావించి గాబరా పడిపోతున్నారు. నిజాలు మాట్లాడినా సరే నిలువునా రగిలిపోయి ఒంటికాలిమీద లేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళయితే మరింత రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పార్టీల నేతలను ఏమన్నా సరే ఇప్పుడు తట్టుకునే స్థితిలో లేరు. ఆమధ్యన ఒక కార్టూనిస్ట్ అన్నా హజారే క్యంపైన్ కు ప్రభావితుడై అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్టూన్ వేశాడు. అది పార్లమెంటు ను కించ పరిచేడిగా ఉందని ఆ కార్టూనిస్టు మీద ఇదే బొంబాయి పోలీసులు రాజద్రోహం కేసులు పెట్టి అరెస్టు చేసారు. అలాగే మమతా భేనర్జీ ని వ్యంగంగా చిత్రించినందుకు జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రోఫెస్సోర్ను అరెస్ట్ చేసారు. వీటన్నిటికి పరాకాష్టగా చిదంబరం చేష్టలను చెప్పుకోవచ్చు. తన కొడుకు మీద త్వీటర్ లో కామెంట్ చేసినందుకు పాండిచ్చేరికి చెందినా ఒక వ్యాపారిని అరెస్టు చేయించారు. చిదంబరం గతంలో ఇవే సాకులు చెప్పి నోరులేని ఆదివాసుల పక్షాన మాట్లాడుతున్న అరుంధతి రాయ్ గొంతునోక్కాలని చూసాడు. మొన్నటికి మొన్న అమ్మ గారి అల్లుడి అవినీతిని బట్టబయలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు అరవింది కేజ్రివాల్ మీద కూడా దేశద్రోహం, రాజద్రోహం లాంటి కేసులు పెడతామని బెదిరించారు.
ఇట్లా చట్టాన్ని ఎవరికీ తోచిన రీతిలో వాళ్ళు వాడేసుకుని ఎదుటివాడి నోరు నొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారు. చట్టం పరిధిలో నేరుగా అలా వీలు కానప్పుడు దొడ్డి దారిలో మిగితా చట్టాలను వాడేసుకుంటున్నారు. పాపం బాల్ థాకరే ఒక్కడే కాదు. బలమున్న ప్రతి ఒక్కరూ ఆయన వారసులే. అదే నియంతృత్వం, అదే ఫాసిస్టు ధోరణి ఇప్పుడు చాలామందికే అబ్బుతున్నాయి. మన రాష్ట్రంలోనే చూడండి. తెలంగాణా ఉద్యమ నాయకుడిగా జే ఎ సి చైర్మన్ గా కోదండ రాం తెలంగాణా ప్రజల పక్షానఒక సమిష్టి ప్రకటన చేసారు. దానిని గీతారెడ్డి ఒక విమర్శగా స్వీకరించి స్పందించవచ్చు. లేదా అదే స్థాయిలో సమాధానం చెప్పి ఉండవచ్చు. కానీ ఆమె హటాత్తుగా దళితురాలిగా మారిపోయింది. మూడు దశాబ్దాల క్రితమే రెడ్డి అనే వారసత్వ పదాన్ని తన పేరులోంచి తీసి వేసి, పీడిత, తాడిత దళిత వర్గాలతో, అవసరమయినప్పుడు న్యాయానికి గుర్తులుగా ఉన్నప్పుడు నక్సలైటు శక్తుల తో సహా అణగారిన వర్గాలకు అందరికీ అండగా ఉన్న కోడండ్ ఇప్పుడు కోదండ రామి రెడ్డి అయిపోయాడు. దాదాపుగా అదే కాలంలో జెట్టి ఈశ్వరీ భాయి కూతురుగా పుట్టిన జెట్టి గీత తన వారసత్వ దళిత అస్తిత్వాన్ని వదిలేసి రెడ్డి కులాంతీకరణం చెంది దొరసానిగా చెలామణి అవుతున్నా హటాత్తుగా దళిత మహిళగా అవతారమెత్త గలుగుతున్నారు.
నిజానికి ఉపముఖ్యమంత్రిగా దామోదర రాజ నరసింహ తో గీత గారు పోటీ పడ్డప్పుడు ఆమె ఉట్టి గీత కాదని గీత రెడ్డి అని వాదించిన వాళ్ళు, అసలు ఆమె దళితురాలే కాదని, ఎప్పుడో రెడ్డి గా మారిపోయిందని చెప్పినవాల్లె ఇప్పుడు గీతా రెడ్డి గారిని దళిత మహిళను చేసేశారు. ఆమె ఇప్పుడు అన్యాయంగా, అధర్మంగా ఉన్నా సరే ఎవరూ ఏమీ అనకూడదు. ఏది న్యాయమో, ఏది ధర్మమో చెప్పకూడదు. ప్రజల పక్షం ఉండమని అడగకూడదు. కనీసం ఒక తెలంగాణా బిడ్డగా తన తల్లి మార్గంలో నడవాలని కూడా ఆశించకూడదు. అసలు ఆమెపట్ల మీ అభిప్రాయమే చెప్పకూడదు. నోరు తెరిచి ఏమయినా మాట్లాడారో ఎస్ సి ఎస్ టీ చట్రంలో ఇరుక్కుపోతారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే రాజద్రోహం కిందో వీలయితే దేశద్రోహం కిందో మీ మీద కేసులు పెడతారు. పెట్టకపోతే పెట్టితీరాలని ఆందోళన చేసే ఉద్యమకారులు పుట్టుకువస్తారు. వాళ్ళు మీ ఇంటిముందర ధర్నాలకు దిగి మీ మైండ్ ను ముట్టడిస్తారు. మనం ఒక్క మాట అంటామో లేదో ఎవరో ఒకరు ఎదో ఒక రూపంలో విరుచుకు పడడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది కులమో, మతమో, ప్రాంతమో రూపమేదయినా కావొచ్చు. మాటా పలుకూ లేకుండా మన మనోభావాలను పంచుకోకుండా అంతా గప్ చుప్ గా ఉండండి. మనమిప్పుడు థాకరే రాజ్యంలో తాకట్టుపడి ఉన్నాం.