శుక్రవారం, నవంబర్ 16, 2012

పాపం పురోహితులు...




ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. కెమరామెన్ గంగతో రాంబాబు మొదలు పెట్టిన గొడవలు  దేనికైనా రెడీ అని మోహన్ బాబు కుటుంబం నడివీధిలో నిలబడి బ్రాహ్మణులను సవాలు చేయడంతో తారాస్థాయికి చేరుకున్నాయి. విమెన్ ఇన్ బ్రాహ్మనిజం అనేసినిమా బ్రాహ్మణులను ముఖ్యంగా బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా అసభ్యంగా చూపించిదని అలాగే దేనికైనా రెడీ సినిమాలో కూడా బ్రాహ్మణ కులాన్ని వెకిలిగా చూపి అవమానించారన్నది బ్రాహమన సంఘాల అభియోగం. అయితే ఒకటి రెండు దళిత సంఘాలు మినహా ఈ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మోహన్ బాబు ఇంటిముందు, ఆ తరువాత సినిమా థియేటర్ల ముందు బ్రాహ్మణులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనల్లో కూడా మిగితా కులసంఘాలు ప్రజాసంఘాలు పాల్గొంటున్నట్టు లేదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా బ్రాహ్మణుల ఆందోళనలో భాగం కావడం లేదు. దేవుడికి అపచారం జరిగిందనో,  గుడి దగ్గర గొడవ జరిగిందనో ఆందోళనలకు దిగే హిందూ మత ప్రచారక సంఘాలు, పార్టీలు కూడా ఈ విషయం లో పెదవి మెదపడం లేదు. ఒక రకంగా బ్రాహ్మణులు ఈ విషయంలోఒంటరి పోరాటమే చేస్తున్నారు. పోనీ బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉన్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు సాగుతోన్న ఆందోళనల్లో ఆత్మాభిమానం కలిగిన పేద బ్రాహ్మలు, కొద్దో గొప్పో ఉద్యమాలతో మమేమకమై కదిలిన వాళ్ళు మినహా అగ్రవర్గ బ్రాహ్మలెవరూ కనిపించడం లేదు. 

ఈ బలహీనత తెలిసే మోహన్ బాబు మరింత రెచ్చగోట్టీ రీతిలో మాట్లాదుతున్నాడు. ఈ సినిమా ఎంత రచ్చ కెక్కితే ఆయనకు అంత వ్యాపారం జరుగుతుంది. చాలా కాలంగా పరాజయాల పాలయి చితికి పోయిన ఆయన కుటుంబానికి ఒక రకంగా బ్రాహ్మణుల ఆందోళన జీవం పోసింది. ఆ సినిమాల్లో ఏముంది? ఎందుకవి వివాదాస్పదం అయ్యాయి? అన్న విషయాలు వదిలేస్తే ఏ కులాన్నయినా వెకిలిగా చూపడం, అవమాన పరిచే రీతిలో ఆ కుల పాత్రలను రూపొందించి కథ నడపడం అనైతికం. కానీ తెలుగు సినిమా పాత్రలన్నీ ఇటువంటి అనైతిక పాత్రల చిత్రణ తోనే సాగుతుంటాయి. విలన్లు, రౌడీలు తెలంగాణా ప్రాంతం వాల్లయినట్టే పనిమనుషులు ఉత్తరాంధ్ర వాళ్ళో లేక ఇంకొక వెనుకబడిన ప్రాతం వాళ్ళో అయి ఉంటారు. అలా గే దేశ ద్రోహులు, దుర్మార్గులు మైనారిటీలో, దళితులో లేదా బహుజన కులాల వాళ్ళో అయి ఉంటారు. తెలుగు సినిమా మొదటినుంచీ కులాన్ని, మతాన్ని  ప్రస్తావిన్చాకుండానే ఆయా పాత్రల వేషధారణ, చిత్రణతో వాళ్ళు ఏ కులం వాళ్ళో చెప్పేస్తుంది. పాత సినిమాల్లో స్మగ్లర్లంతా రాబర్ట్ లో, థామస్ లో ఉన్నట్టే వాంప్ లు  లూసీ లు,జూలీ లు ఉంటారు. అలాగే ఈ కాలంలో వీధి రౌడీలంతా నర్సింగ్ లు, శ్రీశైలం పేర్లతోనే ఉంటారు. ఒక్క రాయలసీమ ఫాక్షన్ సినిమాల్లో తప్ప మరెక్కడా ప్రతినాయకులకు అగ్రవర్ణం పేర్లుండవు. 

సమాజంలో బ్రాహ్మణులు అగ్రవర్ణాగ్రేసరులే  అయినప్పటికీ సినిమా రంగం మాత్రం వాళ్ళను అల్పులుగానేచూపిస్తోంది. బూతులు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చాపల్యం ఉన్నవాళ్ళు, తిండిపోతులు ఇట్లా అనేకఅల్పపు పాత్రల్లో వారి వేషధారణ తో చేష్టలతో నవ్వు తెప్పించే సన్నివేశాల్లో మొదటి నుంచీ బ్రాహ్మణులే కనిపిస్తారు. తెలుగు సినిమా మొదటినుంచీ బ్రాహ్మణుడిని విదూషకుడిగానే పరిగణిస్తూ వచ్చింది తప్ప  ఎప్పుడూ నాయకుడిగా చూపలేదు. దానికి తమిళ సినిమా ప్రభావం, ద్రావిడ ఉద్యమం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. దానికి తోడు సినిమా రంగంలో పెట్టుబడి కూడా ఒక కారణం. తెలుగు సినిమా ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఒకటి రెండు కులాలు, ఒకటి రెండు జిల్లాలే కారణం. మొదటి నుంచీ కోస్తా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలే సినిమాను ఏలుతూ వచ్చాయి. ఆ తరువాత గోదావరి జిల్లాలు తోడయ్యాయి.  ఈ జిల్లాల్లో హరిత విప్లవం, భూస్వామ్యం, వ్యవసాయరంగ విస్తరణ, అభివృద్ధి అది తెచ్చిన సంపద నేరుగా మద్రాస్ కు వెళ్లి పెట్టుబడిగా మారి సినిమా రంగాన్ని ఆక్రమించింది.  అప్పటిదాకా గ్రామాల్లో పెత్తనం సాగించిన భూస్వాములు, రైసు మిల్లర్లు, చిన్న చితకా రాజకీయ నాయకులు నేరుగా ప్రొడ్యూసర్స్ గా, అందులో కొంత తెలివితేటలు ఉన్న వాళ్ళు డైరెక్టర్స్ గా మారిపోయారు. మొట్టమొదట నాటక రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు, అభినయం తెలిసిన వాళ్ళు, సినిమాకు పనికొచ్చే వాక్షుద్ధి  ఉన్న వాళ్ళు బ్రాహ్మలే అయినందువల్ల వాళ్ళు నటులుగా ఉండేవాళ్ళు. కానీ భూస్వామ్య కుటుంబాల పిల్లలు ఎదిగి వచ్చాక వాళ్ళే కథానాయకులు గా తెరమీదికి వచ్చారు. వాళ్ళే గడిచిన మూడు తరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక దశలో కమ్మ భూస్వామ్య వర్గాలు తెలుగు సినిమా రంగాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాయి. 

అయితే దాన్ని గోదావరి జిల్లాల కాపులు తరువాతి కాలంలో కొంతమేరకు నిలువరించే ప్రయత్నం చేసారు.తొలి తరంలో కొద్దో గొప్పో త్రిపురనేని రామ స్వామి చౌదరి వ, రఘుపతి వెంకయ్య లాంటి వారి సంస్కరణ వాదుల ప్రభావం ఉండడం వాళ్ళ సినిమాల్లో కొద్దో గొప్పో సందేశం సామాజిక ఎజెండా ఉండేది. తరువాతి కాలంలో ఈ వర్గాలే సినిమా స్టూడియో లు స్థాపించి క్రమక్రమంగా దాన్నొక లాభసాటి వ్యాపారం చేసుకున్నాయి. మధ్యలో కొద్దో గొప్పో కమ్యూనిస్టు భావాలున్న వాళ్ళు, ప్రజానాట్యమండలి లో పనిచేసి అభ్యదయ భావాలు ఉన్న అనేకమంది సినిమా రంగంలో చేరి కొంతకాలం దాన్ని ప్రాజా పక్షం ఉండే విధంగా చూసినా ఆ తరం అంతరించి పోయాక సినిమా పూర్తిగా ఏకపక్షమే అయ్యింది. ఈ వ్యాపారులు నేరుగా కులం పేర్లతో నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి వంటి కులాల పేర్లు కలిగిన సినిమాలు తీయడం మొదలు పెట్టి వల్లే ఆ గ్రామాన్ని, ప్రాంతాన్ని మొత్తం సమాజాన్ని కాపాదేవాల్లుగా సినిమాలు తీసే స్థాయికి చేరుకున్నారు.  సినిమా రంగాన్ని శాసిస్తున్న కులాలు, ప్రాంతమే ఇప్పుడు పత్రికలు, టీవీ మాధ్యమాల మీద కూడా ఆధిపత్యం సాగిస్తున్నాయి. మొత్తంగా సమాజం మీద బలమైన భావ ప్రసరణ, ప్రభావం కలిగించే మాధ్యమాలన్నీ ఒకే వర్గం చేతుల్లో ఉన్నాయి. కాబట్టీ బ్రాహ్మణులు  ఆత్మ గౌరవం కోసం చేస్తోన్న నిరసన పెద్దగా ప్రచారానికి కూడా నోచుకోవడం లేదు. 

తెలుగు సినిమాలో బ్రాహ్మణుల పాత్ర గానీ, భాగస్వామ్యం గానీ లేకుడా పోవడం దీనికి ఒక కారణం అయితే మొత్తం సామాజిక వ్యవస్థకు వాళ్ళు దూరం కావడమే ఇవాల్టి దురవస్థకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు.   మాటల రచయితలుగా, కవులుగా, గాయకులుగా చాలాకాలమే ఉన్నా వాళ్ళు పెట్టుబడి దారుడైన నిర్మాత చేతిలో డబ్బుకు దాసోహమై పోయారు. అందుకే మోహన్ బాబు తన సినిమా కథ రాసింది, నటించిందీ బ్రాహ్మలేనని దబాయిస్తున్నారు. ఈ మాటే ఒక టీవీ చర్చలో నేను ఏవీఎస్ అనే నటున్ని అడిగితే మేం పొట్టకూటికోసం నిర్మాతలు ఏం చెపితే అది చేసే వాళ్ళం. అని చెప్పారు. అంతే కాదుడబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాల్సి ఉంటుంది అని కూడా అన్నారు. ఆయన మాటల్లో తన నిస్సహాయత కనిపించింది. బ్రాహ్మణులను కించ పరిచే సన్నివేశాలను వేషాలు వేసి బతికేవాళ్ళు అడ్డుకోవాలనుకోవడం భ్రమ. అది వాళ్ళ వృత్తి. నిజానికి సినిమా రంగంలో చిల్లర వేషాల్లో తప్ప బ్రాహ్మణులు పెద్దగా కనిపించరు.  బ్రాహ్మలు  అందివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుని సృజనాత్మక కళారంగాలు వదిలి మిగితా వృత్తులలోకి మారిపోయారు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో, డబ్బులున్న వాళ్ళు వ్యాపారాల్లో, వారసత్వ బలమో బలగమో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో స్థిరపడి పోయారు. ఒక రకంగా ఇప్పుడు సినిమా రంగంలో మిగితా కులాల్లాగే బ్రాహ్మలు మైనారిటీలు. వాళ్ళు చాలా కాలం కిందే వదిలేసిన రచనా వ్యాసంగంలో శూద్ర కులాల్లోని సృజన శీలురు చేరిపోయారు. అయినంత మాత్రాన బ్రాహ్మణులను కించ పరచవచ్చా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. 

నిజానికి ఏ కులాన్ని గానీ కులవ్రుత్తిని గానీ కించపరిచే విధంగా చిత్రించడం అవివేకమే కాదు, హక్కుల ఉల్లంఘన కూడా. అది బ్రహ్మలయినా, దళితులయినా, ఇతర ఎకులమైనా వర్తించ వలసిన నియమం. కానీ తెలుగు సినిమా నీతి నియమాలను వదిలేసి ఇప్పుడు పూర్తిగా కార్పోరేట్ వ్యాపారమై కూర్చుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఒక బ్రాండ్స్ ఫ్యాక్టరీ.! ఎన్టీఆర్ కుటుంబం, అక్కినేని కుటుంబం, కృష్ణ కుటుంబం, రామానాయుడు కుటుంబం, చిరంజీవి కుటుంబం ఈ కుటుంబాల్లోని వారసులను బట్టి కథలు, వాళ్ళ రేంజ్ కి దాగిన మాటలు, పాటలు ఆ మేరకు వందల కోట్ల పెట్టుబడి దానినుంచి వేలకోట్ల వ్యాపారం ఈ కుటుంబాలు చేస్తున్నాయి. 

వ్యాపారం ఏదయినా సరే అందులో లాభానష్టాలే ఉంటాయి తప్ప నైతిక విలువలు ఉండవు.సినిమా కూడా అంతే. కానీ ఇప్పుడు బ్రాహ్మలు అందులో నీతి ఉండాలని అంటున్నారు. సినిమాకు కొన్ని నియమాలు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అది ఒక రకంగా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకప్పటిలా సమాజం ఎలా ఉండాలో శాసించే స్థాయిలో ఇప్పుడు బ్రాహ్మలు లేరు. పైగా సమాజంలోని చాలా వర్గాలకు బ్రాహ్మణులు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. పైగా ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం బలపడడం కూడా ఒక కారణం. నిజంగానా బ్రాహ్మణ వాద విలువలకు, బ్రాహ్మణీయ సంకృతికి వ్యతిరేకంగా కూడా చాలా సినిమాలే వచ్చాయి. స్వయంగా ఎన్టీ రామారావే పలు సినిమాలు బ్రాహ్మనీయ విలువలను విమర్శిస్తూ యమగోల వంటి పలు సినిమాలు తీశారు. అప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినా ఆ సినిమాల్లో ఆయన  భావజాల విమర్శ చేసారు తప్ప వెకిలి తనంతో బ్రాహ్మణులను అవమాన పరచ\లేదు.ఆ పై అడ్డ దిడ్డంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోహన్  బాబు మాత్రం ఆ పని చేస్తున్నాడు. బ్రాహ్మణుల సామాజిక బలహీనత ఆయనకు అర్థమయ్యింది. మన దేశంలో సినిమా రంగానికి ఉన్న స్వేచ్చ మరే రంగానికీ లేదు. ఎవరైనా ఎలాంటి సినిమాలయినా తీయవచ్చు. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటె చాలు ఎక్కడైనా ప్రదర్శించు కోవచ్చు. నిజానికి మన సెన్సార్ బోర్డు పూర్తిగా రాజకీయ నాయకుల తాబెదార్లతో,  ప్రొడ్యూసర్ ల ఏజెంట్ లతో బ్రోకర్ లతో నిండిపోయింది. అందులో విలువల గురించి ఆలోచించే వాళ్లున్నా వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. ఒక దశలో సెన్సార్ బోర్డ్ దేనికైనా రెడీ సినిమా ను ఆలస్యం చేసింది. కానీ మోహన్ బాబు తనదైన శైలిలో సెన్సార్ బోర్డ్ మీద విరుచుకు పడ్డారు. ఆ దెబ్బతో సెన్సార్ బోర్డు లో ఉన్న బ్రాహ్మణ సభ్యులు కూడా కళ్ళు మూసుకుని సినిమాను చూసి నోరు మెదపకుండా విడుదల చేసారు.

 సినిమా కేవలం వ్యాపారమే పరమావధిగా ఉండదు. పనిలో పనిగా  కీలకమైన విషయాల పట్ల సమాజపు ఆలోచనా ధోరణిని మార్చే ప్రయత్నం కూడా చేస్తుంది. చాలా సినిమాల్లో  ఒకానొక ముస్లిం పేరుతో విలన్ ఉంటాడు. అతడు దుబాయిలో ఉండే డాన్ అని సినిమాలో చెప్తున్నా అంతర్లీనంగా అటువంటి ముస్లిం లు మన అంతర్గత భద్రతకు ముప్పు అనే సందేశం అందులో ఉంటుంది. అటువంటి ప్రయత్నమే తెలంగాణా విషయంలో కూడా అనేక సినిమాల్లో జరిగింది. తాజాగా కెమరామాన్ గంగ తో రాంబాబు కూడా అనేక పాత్రల్లో, సంభాషణల్లో, సన్నివేశాల్లో తెలంగాణా వాదాన్ని, వాదుల్ని చీల్చి చెండాడే ప్రయత్నం చేసింది. ఒక్క సినిమాలే కాదు, మొత్తం మీడియా ఇప్పుడు తెలంగాణా అనేది ఒక సమస్య అనే భావిస్తున్నాయి తప్ప అది అనేక చారిత్రక సమస్యలకు, తప్పిదాలకు పరిష్కారం అని చెప్పలేక పోతున్నాయి. 

ఒక రకంగా బ్రాహ్మణులు  ఒక కులంగా సామాజిక వర్గంగా  హక్కులకోసం ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నప్పుడు వారికి మద్దతునివ్వడం ప్రజాస్వామిక లక్షణం కానీ వారికి ఆశించినంత మద్దత్తు దొరకక పోవడం విచారకరం.  మిగితా సామాజంతో బ్రాహ్మణులు మమేకం కాకపోవడం కూడా ఇవాళ వారిది ఒంటరి పోరాటం కావడానికి కారణం. తెలుగు సినిమాల్లో అశ్లీలత దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా వెర్రి తలలు వేస్తూనే ఉంది. స్త్రీని ఒక భోగ వస్తువుగా మాత్రమే చూపే అనేక సినిమాలు, వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయి. చైతన్యవంతులైన మహిళా సంఘాలు, విద్యార్ధి వర్గాలు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆ సందర్భంగా ఒక్క బ్రాహ్మణులే కాదు, కుల సంఘాలేవీ అందులో క్రియాశీలంగా పాల్గొన లేదు. మన సమాజానికి స్త్రీ ని అసభ్యంగా చూపిస్తే ఎదిరించే శక్తి లేదు. అటువంటి స్పృహా ఉండి  ఉంటె ఎ విమెన్ ఇన్ బ్రాహ్మనిజం వంటి సినిమా వచ్చేది కాదు. కేవలం బ్రాహ్మణా స్త్రీలనే కాదు ఏ  స్త్రీని కూడా అలా చూపకూడదన్న సార్వజనీన విలువ గానీ, అటువంటి ప్రయత్నాలకు మదతుగానీ లేకపోవడం వల్ల  అటువంటి సినిమాలు వస్తున్నాయి. అలాగే దళితులనో, మిగితా వృత్తుల వాళ్లనో కించపరుస్తూ సినిమాలు తీసినప్పుడో, వార్తలు రాసినప్పుడో బ్రాహ్మణులు కూడా వాటిని వ్యతిరేకించి ఉంటె, అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో బ్రాహ్మణులు కూడా భాగస్వాములై ఉంటె ఇవాళ బ్రాహ్మణ సంఘాల ప్రయత్నానికి మరింత బలం చేకూరేది. 

 కేవలం సినిమాల్లోనే కాదు మొత్తం సామాజిక రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు ఒంటరివాల్లయి పోతున్నారు. నిజానికి ప్రభుత్వం బ్రాహ్మణుల అభ్యంతరాలకు,  ఆందోళనకు వెంటనే స్పందించాల్సింది. కనీసం సినిమాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్నాయని ప్రభుత్వమే వేసిన కమిటీ నిర్ధారించిన తరువాతయినా ఆ సినిమా ను నిలిపివేయాల్సింది. అలా చేయకపోగా విషయం వివాదమై కోర్టుకు చేరేదాకా చూసి చేతులెత్తేసింది. గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి కులపరమైన అభ్యంతరాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించిన ప్రభుత్వం పాపం పురోహితులను మాత్రం పట్టించుకోలేదు. అది బ్రాహ్మణుల బలహీనత, అనైక్యత తో పాటు వాళ్ళు ఓటు బ్యాంకు కాకపోవడం కూడా ఒక కారణం. సమాజంలో బ్రాహ్మణులు ఇప్పుడు అసంఘటిత అల్పసంఖ్యాక వర్గం. వాళ్ళను ఓట్లకోసం బుజ్జగించవలసిన అవసరం లేదనే ప్రభుత్వాలు భావిస్తుంటాయి.    బ్రాహ్మణ మేధావులు కూడా ఇప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడడం అంటేనే భయపడుతున్నారు. అది కులతత్వమని ఎక్కడ అంటారోనని వాళ్ళ భయం. బహుశ గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న సిద్ధాంత చర్చలు, కులవ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు అవి వ్యాపింప చేసిన భావజాలం కారణంకావచ్చు. నిజానికి అవేవీ బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఆ భావజాలానికి వ్యతిరేకం. కులం పుట్టుకకు కారణాలు ఎలావున్నా ఆ కులాన్ని పోషించడంలో,  కాపాడడంలో రాజ్యం తో పాటు ఇతర కులాల పాత్రను విస్మరించాలేము. బ్రాహ్మణులు ఈ సమాజంలో భాగం. ఈ నేలమీద పౌరాలకు లభించే అన్ని హక్కులు, అధికారాలు బ్రాహ్మణులకు కూడా ఉంటాయి. రాజ్యాంగం పౌరులను గుర్తించి కల్పించిన హక్కులన్నీ బ్రహ్మనులకు కూడా ఉంటాయి. ఉండాలి. అటువంటి ప్రజాస్వామిక ధోరణి  అలవాటు కాకపోవడం వల్లే ఇవాళ బ్రాహ్మణులు ఏకాకులుగా మిగిలి పోయారు. రేపు ఎవరినైనా ఏకాకులు చేయగలిగే సత్తా ఈకోస్తా పెట్టుబడికి ఉంది. అది అందరూ గమనించాలి. 

1 కామెంట్‌:

  1. ఇతర బడుగు కులాలను హేళన చేస్తూ సినిమాలు వచ్చినప్పుడు, బడుగు కులాల వాళ్ళు నిరసన తెలిపినప్పుడు, ఏనాడూ బ్రాహ్మణసంఘాలు సానుభూతి ప్రకటించలేదు. "మనకెందుకులే!!" అని నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నాయి. ఇప్పుడు విషయం తమ దాకా వచ్చేసరికి వాళ్ళకు దాని తీవ్రతా, దాని వల్ల ప్రజాబాహుల్యంలో ఆ కులం పట్ల కలిగే చులకన భావమూ తెలిసి వచ్చాయి. బ్రాహ్మణులు కూడా సంకుచిత సినిమా ధోరణుల పట్ల నిరసన తెలిపే రోజులు వచ్చినందుకు మనం మొదట సంతోషించాలి. కానీ బ్రాహ్మణుల్లోనే ఐక్యత లేనందుకు కొంత బాధపడాలి.

    ఇతర బడుగు కులాల మద్దతు సంగతి తెలియదు కానీ, మంద కృష్ణమాదిగ మాత్రం బ్రాహ్మణులను కించపరచడాన్ని ఖండించారు. బ్రాహ్మణుల ఉద్యమానికి మద్దతు పలికారు, జిల్లా కేంద్రాల్లో సంఘీభావంగా ధర్నాలు కూడా చేశారు. మిగిలిన కులసంఘాలు మద్దతు తెలపడానికి సిద్ధపడ్డా సరే, ఆ మద్దతు స్వీకరించడానికి అగ్రవర్ణ బ్రాహ్మణులు సిద్ధంగా ఉంటారా అన్నది ఒక శేషప్రశ్న!!

    రిప్లయితొలగించండి