శుక్రవారం, నవంబర్ 02, 2012

చర్చలు జరపాల్సింది ఎవరితో?



తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావును చాలామంది కీలెరిగి వాతలుపెట్టే నేతగా పేర్కొంటారు. ఆయన వర్తమాన రాజకీయాలలో ఆరితేరిన వాడని, వ్యూహాలు ఎత్తుగడలు ఎరిగిన నాయకుడు అనీ అంటుంటారు. బహుశా సరైన సమయంలో తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకున్నందుకు, అందరిలా మధ్యలో వదిలేయకుండా దానినొక బలమైన ఆకాంక్షగా మలచి జాతీయస్థాయిలోనిలబెట్టినందుకు, దానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలనూ తెలంగాణకు అనుకూలంగా మార్చినందుకు ఆయనకు అటువంటి పేరు వచ్చి వుంటుంది. నిజంగానే దాదాపు ముప్ఫై సంవత్సరాలకుపైగా అటు కాంగ్రెస్ను, ఇటు తెలుగుదేశంను అతిదగ్గర నుంచి గమనించిన వ్యక్తి, అనేక పరాజయాల తరువాత డిసెంబర్ 9 ప్రకటనతో తెలంగాణకు తొలి విజయాన్ని అందించిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడమే కాదు ఆంధ్రవూపదేశ్ రాజకీయాలను కూడా శాసించగలిగిన శక్తిమంతుడు. అందులో సందేహం లేదు. కానీ ఇటీవలి పరిణామాలు ఆయన ఊహించినట్టుగా లేవు

ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలు ఆయన చెప్పినట్టుగా తెలంగాణకు అనుకూలం గా కనిపించడం లేదు. దీర్ఘకాల ఢిల్లీ పర్యటన తరువాత అక్టోబర్ మొదటివారంలో హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ చాలా ఆశాజనకంగా కనిపించారు. అతిత్వరలోనే ఢిల్లీ నుంచి తనకు పిలుపు రానుందని, రెండోవారంలో చర్చలున్నాయని మూడోవారంలో ముమ్మాటికి ప్రకటన వస్తుందని ఆయన తనను కలిసిన వారికి చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక అక్టోబర్ రెండోవారం దాకా ఉత్తరాది ప్రజలు పీడరోజులుగా భావిస్తారు కాబట్టి తరువాత తనకు తుది చర్చల కోసం పిలుపు వస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పారు. పీడరోజులు పోయి మూడువారాలూ గడిచిపోయాయి తప్ప పిలుపు మాత్రం రాలేదు. ఆయన చెప్పిన దానికి భిన్నం గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తటస్థంగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు నేరుగా కేంద్ర కేబినేట్లో చేరిపోయారు.

కేంద్ర కేబినేట్ కూర్పు గమనిస్తే కాంగ్రెస్పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేదని, పార్టీ విషయాన్ని మళ్ళీ ఎన్నికల దాకా నాన్చే ధోరణితో ఉన్నట్టు అర్థమౌతోంది. అందుకే రానున్న రెండు సంవత్సరాల పాటు అప్పుడప్పుడు తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు, తెలంగాణకు అడ్డు తగిలేవాళ్లకు వేరే పని లేకుండా స్వేచ్ఛనిచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీలో అంతో ఇంతో సీనియర్లు, తమకంటూ కొద్దో గొప్పో ప్రజాబలం ఉన్నవాళ్ళను వదిలేసిఅమ్మచేతి బొమ్మలను మాత్రమే కొలువులోకి తీసుకున్నా రు. వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ నోరు మెదప డం లేదు. కానీ కావూరి మొదలు రాయపాటి దాకా సమైక్యవాద సాంబశివరావులు శివాపూత్తుతున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణవాదాన్ని గౌరవించి ఉంటే వాదాన్ని వినిపిస్తున్న వారికి అవకాశం ఇచ్చి ప్రాంతవాసుల మనసులు గెలిచే ప్రయత్నం చేసేది. కానీ అలా జరగలేదు. అలాగే సమైక్యవాదం పేరుతో తెలంగాణ ఏర్పాటుకు అడ్డుగానిలుస్తున్న కావూరికో, లగడపాటికో, రాయపాటికో స్థానం కల్పించి మచ్చిక చేసుకునేది. అది కూడా జరగలేదు. ఎక్కడివాళ్ళను అక్కడే రంగంలో ఉంచి ఎటూ తేల్చుకోలేని తటస్థులను అందలం ఎక్కించడం చూస్తే పార్టీ ఆట ఇప్పుడే ముగించాలని అనుకోవడం లేదని అర్థమౌతున్నది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ నైజమే అలాంటిది. పార్టీ తీసుకునే నిర్ణయాలేవీ నేరుగా ఉండవు. 2004 ఎన్నికల నాటి నుంచీ కాంగ్రెస్ పార్టీ తెలంగా విషయంలో ఆడుతున్న నాటకాలన్నీ కేసీఆర్కు తెలిసినంతగా ఇంకొకరికి తెలియవు. ఆనాటి ఎన్నికలకు ముందు స్వయంగా పార్టీ అధిష్ఠానవర్గం ప్రతినిధిగా గులాం నబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి ఎన్నికల ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఆయన ఆపార్టీ ఎత్తులను చూస్తున్నారు.

మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, యూపీఏ ఎజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించడం, వివిధ సందర్భాల్లో రాష్ట్రపతి ద్వారా ప్రధాని ద్వారా అంశాన్ని చెప్పించడం చూశారు. ఒక రకంగా ఆయన మాటలు వారితో చెప్పించారు. స్వయంగా కేసీఆర్ కూడా యూపీఏ మొదటి ప్రభుత్వంలో చేరారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో ప్రభుత్వంలో భాగంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేస్తుందని గుర్తించే ఆయన బయటకు వచ్చారు. ఇదొక ఘట్టం అయితే, రెండోవిడతగా కేసీఆర్ కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బకొట్టే ఉద్దేశ్యంతోనే 2009 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలకు విసిగిపోయి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తప్ప ఇక లాబీయింగ్ పనికిరాదని నిర్ధారించుకునే కేసీఆర్ 2009 నవంబర్లో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుని తెలంగాణపై చారివూతాత్మక ప్రకటనను సాధించారు. అప్పటి దాకా ఒక్క కేసీఆర్ను, టీఆర్ఎస్ను మాత్ర మే మోసగిస్తూ, మభ్యపెడుతూ వచ్చిన కాంగ్రెస్ 2009 డిసెంబర్ ప్రకటన తరువాత యావత్ ప్రపంచాన్ని, భారత పార్లమెంటును కూడామోసం చేసింది.

ఒకవైపు ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తున్నామని, ప్రక్రియ మొదలు పార్లమెంటులో చెప్పిన ప్రభుత్వం తరువాత మూడేళ్ళు గడుస్తున్నా మళ్ళీ ఊసే ఎత్తడంలేదు. పైగా శ్రీకృష్ణ కమిటీ పేరుతో కొంతకాలం, ఏకాభివూపాయం పేరుతో మరికొంతకాలం సాగదీస్తూ వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను శాశ్వతంగా మూలన పడేసే ప్రయ త్నం చేస్తోంది. విషయాలన్నీ కేసీఆర్కు అర్థం కావడం లేదనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. కేసీఆర్కు కాంగ్రెస్ ఏమిటో తెలిసినంతగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుడికీ తెలియదు. ఆయన రాజకీయ జీవితం మొదలయ్యిందే యువజన కాంగ్రెస్తో. ఆయన కాలంలోనే ఒక వెలుగు వెలిగిన ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్గాంధీకి సన్నిహితంగా ఉండేవాడని చెపుతారు. అంతేకాదు దేశ ప్రజాస్వా మ్య వ్యవస్థను అతలాకుతలం చేసిన ఎమ్జన్సీ కాలంలో ఆయన పార్టీ అసలు రూపం ఏమిటో ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి కేసీఆర్కు కాంగ్రెస్ స్వభావం తెలిసే ఆయన మళ్ళీ పార్టీని మెప్పించి, ఒప్పించి తెలంగాణ తీసుకోవాలని భావించి ఉండవచ్చు.

కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా కొట్లాడుకున్న ప్రతిసారీ పార్టీ పెద్దలు తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెపుతుంటారు. అంతర్గతంగా పార్టీలో ఉన్నంత సహనశీలత, ప్రజాస్వామిక ధోరణి పార్టీ ప్రభుత్వాల పనితీరులో ఉండదు. ముఖ్యంగా రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన చరిత్ర పొడుగునా అత్యంత ప్రమాదకరంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించింది. పంజాబ్, అస్సాం మొదలు స్వాతంత్య్రం తరువాత ఏర్పడ్డ అన్నిరాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కల్లోలమే సృష్టించింది. తనకు లాభం లేదనుకున్న ప్రతిసారీ ఉద్యమాలను క్రూరంగా అణచివేసింది. బహుశా చారివూతక నైజం తెలిసే కేసీఆర్ మూడేళ్ళ మోసకాలంలో కూడా ఉద్యమం ప్రజాస్వామిక పరిధి దాటకుండా జాగ్రత్తపడి ఉంటాడు. అణచివేతను ప్రజలు ఎదుర్కొన్నంతగా రాజకీయపార్టీలు ఎదుర్కోలేవు. ఎదుర్కొని నిలబడలేవు. అందుకే ఆయన పోరుబాట వదిలి ఢిల్లీలో చర్చల కోసం ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలుగుతుందని చెప్పడం కోసమే ఆయన టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న ప్రతిపాదన కూడా చేసి ఉండవచ్చు. నిజంగానే కేసీఆర్ మాట అన్నాడా, ఒకవేళ అన్నా నిజంగానే టీఆర్ఎస్ను విలీనం చేస్తాడా, అంత తేలిగ్గా ప్రజలు, పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తారా అన్నది వేరే విషయం.

కాంగ్రెస్పార్టీ పూర్తిస్థాయి మాంసాహారి. మనకు మనం అర్పించుకోకపోతే అది మనల్ని చీల్చిచెండాడి చంపేస్తుంది. అది తెలిసే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్కు నష్టం ఉండదు అని చెప్పడం కోసం ఆయన అలాంటి ప్రతిపాదన చేసి ఉండవచ్చు. అయినా సరే పార్టీ మెట్టు దిగినట్టు కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ పట్ల కేసీఆర్ ఊహించింది తప్పని తేలిపోయింది. నిజంగానే రాష్ట్రాన్ని ఇస్తారని అనుకుని చేశాడో, లేక తన ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఒక అవకాశం ఇవ్వడం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను సామరస్యం పూరితంగా పరిష్కరించడం కోసం తనవంతుగా ప్రయత్నం చేశానని చెప్పడం కోసం అలా చేశారో తెలియదు గానీ కేసీఆర్ చర్చల వల్ల ఆశించిన ఫలితం రాలేదు సరికదా తెలంగాణ ఉద్యమ మనోధైర్యం కూడా దెబ్బతిన్నది. తెలంగాణ ఉద్యమం గడిచిన మూడేళ్ళ కాలంలో రాజకీయ సంప్రదింపుల దశ దాటి ఒక అడుగు ముందుకేసింది. తెలంగాణవాదులు కేవలం రాష్ట్ర సాధన కోసమే కాదు, ప్రతి దశలోనూ పోరాటమే చేయవలసి వస్తోంది. మీటింగులకు పర్మిషన్ తెచ్చుకోవడం మొదలు, ఆయా సందర్భాల్లో పెట్టిన కేసుల ఎత్తివేత దాకావూపతిదానికీ పోరాడవలసి వస్తున్నది.

రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాల కార్యకర్తలే కాదు సాధారణ విద్యార్థులు, ఉద్యోగులు ఎన్నో కష్టాలను, నష్టాలను భరించి బరిగీసి నిలబడి పోరాడే దశకు ఉద్యమం చేరింది. ఇంతకాలం తమను తాము చంపుకుని వందలాదిమంది తెలంగాణ యువకులు ఉద్యమాన్ని మూడేళ్ళపాటు బతికించారు. ఇప్పుడు స్వయంగా పోలీసులే ఉద్యమకారులను చంపే దశకు తెగించారు. పోలీసులు ఉద్యమకారులపై రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగిస్తున్నారని ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో నిజం లేదు. పోలీసులు తెలంగాణ ఉద్యమకారులపై విదేశీ శత్రువుల కోసం తయారుచేసిన విషపు గుళ్ళను వదులుతున్నారు. సరిహద్దు భద్రతాదళాలు వాడే ప్రమాదకర విషవాయు గోళాలను మర తుపాకుల్లో మదించి ప్రజల మీదికి వదులుతున్నా రు.

అలాంటి కాలం చెల్లిన క్రూర విషగోళ ప్రయోగమే రాజిడ్డి అనే తెలంగాణవాది ప్రాణం తీసింది. దీని మీద ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. జర్నలిస్ట్లను ప్రాంతాల వారీగా విడదీసి తెలంగాణ వారిని ప్రభుత్వం అధికారికంగా వెలివేసింది. జర్నలిస్టులు అరిచి గోలపెట్టారే తప్ప దాన్ని రాజకీయంగా మలచి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం రాజకీయపార్టీలు చేయలేకపోయాయి. నిజమైన జర్నలిస్టులు తెలంగాణ వాళ్ళయిన పాపానికి ప్రభుత్వం వారిని వారితో పాటు తెలంగాణ ప్రసార మాధ్యమాలను వెలివేస్తే ఆంధ్రాకు చెందిన రాంబా బు మాత్రం కెమెరామెన్ గంగతో నకిలీ జర్నలిస్టు అవతారమె త్తి తెలంగాణవాదాన్నే అవహేళన చేస్తూ ఊరేగుతున్నాడు. తనకు నష్టమని తెలిసినా ఏకైక తెలంగాణవాద దర్శకుడు శంకర్ ఎదురొడ్డి నిలబడ్డాడు. వీటన్నింటినీ ఉద్యమంలో భాగం చేసుకుంటూ జేఏసీ తన ప్రయత్నం తాను చేస్తున్నది. అవమానాన్ని ఎదిరిస్తూ తెలంగాణ జర్నలిస్టులు కలాలతో కవాతు చేస్తూనే ఉన్నారు. అయినా కేసీఆర్ మాత్రం ఇంకా ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి నెల గడిచినా పిలుపు రాలేదు. అయినా సరే పిలిస్తే వెంటనే చర్చలకు వెళతా అంటున్నా రు. ఇన్ని అనుభవాల తరువాత కూడా ఇంకా ఢిల్లీ వైపు చూడడం సమంజసంగా లేదు. జిత్తులమారి కాంగ్రెస్ ముందు రాజకీయ ఎత్తులు పనిచేయవని ఇప్పటికైనా అర్థం చేసుకుని మెలిగితే మంచిది.

నిజమే ఇప్పుడు చర్చలే పరిష్కారం. కానీ కాంగ్రెస్తో కాదు. కేసీఆర్ ఇప్పుడు చర్చలు జరపాల్సింది కోదండరాంతో, జేఏసీ నేతలతో. ఇంకా చెప్పాలంటే ప్రజలతో! టీఆర్ఎస్, జేఏసీల మధ్య చాలాకాలంగా చిన్న చిన్న అభివూపాయభేదాలుగా కనిపించినవి కాస్తా ఇప్పుడు విభేదాలై కూర్చున్నా యి. ఇద్దరు నేతలు కలిసి చర్చించుకుని వాటిని వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరముంది. అభివూపాయభేదాలైనా, విభేదాలైనా మనసులు మారా లి తప్ప మనుషుల్ని మారిస్తే పరిష్కారం ఉండదు. ఇది ఇద్దరూ అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మూడేళ్ళ శ్రమ ఫలితాన్ని ఇవ్వకుండా పోతున్నదనే ఆందోళన ప్రజల్లో నెలకొంటున్నది. ఇంకా జాప్యంచేస్తే మొదటికే మోసం వస్తుంది. మూడేళ్ల పాటు ప్రాంతంలో అడుగుపెట్టడానికి సాహసం చేయనివాళ్ళు ఇప్పుడు నామమావూతపు నిరసనల మధ్య కుంటుతూ, కుములుతూ నడిచివస్తున్నారు.

చంద్రబాబు తెలంగాణవాదుల నిరసనలకు బెదరలేదు గానీ, ఆయన నేలమీద అడుగుతీసి అడుగువేయలేక అవస్థలు పడుతున్నాడు. మరోవైపు జగనన్న వదిలిన బాణం షర్మిల రూపంలో శరవేగంతో దూసుకువస్తోంది. వాళ్లకు మళ్లీ ఎన్నికల దాకా వేరే పనిలేదు. ఇప్పుడు అందరిలాగే ఏదో ఒక యాత్ర చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. యాత్రలు చేయడం రాజకీయ చైతన్యరాహిత్యంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. అది కాలయాపనకు తప్ప కార్యాచరణకు పనికి రాదు. ఇప్పుడున్న చైతన్యం ఏమిటో మొన్నటికి మొన్న హైదరాబాద్ మార్చ్తో రుజువైంది.కేసీఆర్ బస్సు యాత్ర చేసి తెలంగాణ పల్లెల్లోకి వెళ్ళడం కంటే ఇప్పుడు తెలంగాణ పల్లెలే జాతరలా హైదరాబాద్కు తరలిరావాలి. ప్రజల్లో నిలకడగా ఉన్న చైతన్యాన్ని ఉద్యమంలోకి నడిపించే వ్యూహం కావాలి. కేసీఆర్లోని వ్యూహకర్త ఇప్పుడు కార్యాచరణకు దిగాలి. డిసెంబర్ 9 లక్ష్యంగా ప్రజలను కదిలిస్తే ఢిల్లీ తనంతట తానే దిగివస్తుంది. అప్పుడు చర్చలు ఢిల్లీలో కాదు. హైదరాబాద్లోనే అంద రి సమక్షంలో జరుగుతాయి. అటువంటి చర్చలే ఫలితాన్ని ఇస్తాయి. కేసీఆర్ గారు అర్థం చేసుకుంటారని ఆశిద్దాం!













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి