శుక్రవారం, సెప్టెంబర్ 07, 2012

తెలంగాణ: ఒక అనివార్యత


చాలా రోజుల స్తబ్దత తరువాత మళ్ళీ తెలంగాణలో కదలిక కనిపిస్తోం ది. తెలంగాణ జిల్లాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ, ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ చేపట్టిన ఆందోళనలు కాంగ్రెస్ పార్టీని పెద్దగా కదిలించినట్టు కనిపించలేదు. కానీ తాజా పరిణామాలు ఆ పార్టీని లోలోపల కచ్చితంగా కలవరపెడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అటు కేంద్రం లో, ఇటు రాష్ట్రంలో ఆ పార్టీ తుమ్మితే ఊడిపోయే ముక్కులా మూలుగుతూ ఉంది. అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిపోయి ఉన్న మన్మోహన్ సింగ్ అప్రతిష్ఠ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మరక ఏదైనా మన మంచి కే అన్నట్టు మన జాతీయ మీడియా మాత్రం మన్మోహన్‌ను సమర్థిస్తోంటే అంతర్జాతీయ మీడియా అవినీతిమయ పాలనను ఉతికి ఆరేస్తోంది. గతం లో ‘అండర్ అచీవర్’ అని టైం మేగజైన్ ప్రధాని అసమర్థతను నిర్ధారిస్తే తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆయనను అవినీతి ఊబిలో కూరుకుపోతున్న ‘విషాద మూర్తి’గా అభివర్ణించింది.

ఇప్పుడు ఆ అసమర్థ విషాదమూర్తికి తెలంగాణ గురించి ఆలోచించే తీరికలేకపోయినా, ఒక రాజకీయ పార్టీగా ఆలోచించకుండా ఉండలేని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ చుట్టూ కమ్ముకుంటున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకూ తెలంగాణ పేరెత్తకుండా పూట గడవని స్థితి. అందుకే అన్నిపార్టీలు ఇప్పుడు వాటంతట అవే తెలంగాణ కోసం ఉద్యమించే పరిస్థితి. తెలంగాణకు సంబంధించినంత వరకు ఇదొక మంచి పరిణామం.

రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని పదేపదే విన్న తెలంగాణ ప్రజలకు అసలు రాజకీయ ప్రక్రియ అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. సాధారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ఉందని నమ్మే ప్రజలు తమ అవసరాలు, ఆకాంక్షలను, తక్షణ అవసరాలను పదేపదే పాలక వర్గాల ముందు పెడుతుంటారు. కానీ పాలక వర్గాలు తమ అవకాశ రాజకీయవాదాల్లో భాగంగానే వాటిని పరిష్కరించాలో, లేదో చూసుకుంటాయి. అవసరమనుకున్నప్పుడే వాటిని తెరమీదికి తేవడం, తెరమరుగు చేయడం చేస్తుంటాయి తప్ప పరిష్కారం వెతకవు. తెలంగాణ విషయంలో గడిచిన అరవై సంవత్సరాలూ అదే జరుగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ప్రజల సజీవ ఆకాంక్ష అని గమనించిన రాజకీయ పక్షాలన్నీ ఆ ప్రజా ఆకాంక్షను ఒక సెంటిమెంటు కింద మార్చేసి తరచూ తెరమీదికి తెస్తూ తెరమరుగు చేశాయి. చెన్నాడ్డి మొదలు చంద్రబాబునాయుడు దాకా (1969 నుంచి 2009 దాకా) అధికారం కావాలనుకున్న అందరూ ఇదే ప్రయత్నం చేసి వదిలేశారు. కానీ ప్రజలు మాత్రం ఆ ఆకాంక్షను వదిలేయలేదు. దాన్నొక స్వప్నంగా మార్చేసుకున్నారు. మతంగా మలచుకున్నారు. అలాగని ఆ కలలో మునిగిపోయి కాలం గడిపేయలేదు. ఆ మతంలో మంచీ చెడూ తెలియని అయోమయస్థితికి చేరుకోలేదు. తెలంగాణ సాధన దిశలోఅందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేశారు. గడిచిన పదేళ్ళలో అదొక తిరుగులేని రాజకీ య సిద్ధాంతమైపోయింది.

దానికి వివిధ రాజకీయ, ప్రజాసంఘాల కృషి ఒక ఎత్తయితే, ఆ ఉద్యమ నేపథ్యంలోనే పుట్టి, ఆ పలవరింతల్లోనే పెరిగి, ఆ లక్ష్యం కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే ఒక తరం ఎదిగిరావడం మరో కార ణం. ఇదే ఇవాళ తెలంగాణ ఓడిపోకుండా నిలబడడానికి ప్రధానమైన కార ణం. సుష్మా స్వరాజ్ అన్నట్టు ఇదొక ప్రసవ వేదన. ఒక్క తెలంగాణ తల్లులే కాదు, తెలంగాణ తల్లికోసం ఇక్కడి పిల్లలు కూడా అదే వేదనను అనుభవిస్తున్నారు. కోట్లాదిమంది ఒక అర్ద శతాబ్దంపైగా అదే ఆ వేదనలోనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరసలో ఉన్నవాళ్ళు 1969 తెలంగాణ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది, విద్యార్థులుగా, ఉద్యోగులుగా, కవులుగా, రచయితలుగా, లాయర్లుగా, డాక్టర్లుగా లేక ప్రజలుగా నిరంతరం ఏదో ఒక పోరాటంలో నలిగిపోయి రాటుదేలి నిలబడినవాళ్లే! తెలంగాణ ఉద్యమానికి ఇవాళ రాజకీయంగా టీఆర్‌ఎస్-కేసీఆర్ కేంద్ర బిందువుగా కనిపించవచ్చు. కానీ ఆ కేంద్రకం చుట్టూ ఆవరించి ఉన్న ప్రజాసమూహం, విడివిడిగానో, ఒక్కటిగానో కదులుతున్న ప్రజాసంఘాలు, పౌరసమాజం అందులో క్రియాశీలంగా కదులుతున్న ప్రజా సమూహాలు వాటి పోరాట పటిమ ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నిలబెడుతున్నాయి, నడిపిస్తున్నాయి. తెలంగాణ మనుషులు ఈ భూమి మీద ఎక్కడున్నా వాళ్ళ ఆలోచనలు ఒక్కటిగానే ఉంటున్నాయి.

ఒక ముస్లిం ఏ దేశంలో ఉన్నా రోజుకు ఐదుసార్లు అల్లాను మనసులోనైనా ప్రార్థించకుండా నిదురపోనట్టు.. ఒక క్రిస్టియన్ ఎక్కడున్నా జీసస్‌ను గుర్తు చేసుకోకుండా రోజు గడపనట్టు, ఒక హిందువు ఎక్కడున్నా ముప్ఫైమూడు కోట్ల దేవతలలో ఎవరో ఒకరిని తలచుకోకుండా ఉండలేనట్టు తెలంగాణ ప్రజలు ఇప్పుడు తెలంగాణ మనసులో లేకుండా ఉండలేకపోతున్నారు. అందుకే అదొక మతంగా ప్రజల అభిమతంగా మారిపోయిందని అనిపిస్తోంది. సెప్టెంబర్ ముప్ఫైన, హైదరాబాద్‌లో తెలంగాణా మార్చ్ ఉంటుందని చైర్మన్ కోదండరాం చెప్పాడో లేదో అమెరికాలోని న్యూయార్క్ నగరం నడిబొడ్డున తెలంగాణవాదులు దానికి సన్నాహక సూచికగా ఒక మార్చ్‌ను నిర్వహించారు.

ఇప్పటిదాకా దేవతామూర్తులు, దేశదేశాల జాతీయ నేతలే ఊరేగిన వీధుల్లో తెలంగాణ చిత్రపటాలను ఊరేగించారు. అక్కడితో ఆగకుండా చైర్మన్ కోదండరాంతో అక్కడి నుంచి కాన్ఫన్సు కాల్‌లో మాట్లాడి ఆయనకు సంఘీభావం పలికారు. బహుశా సెప్టెంబర్ ముప్ఫై నాటికి కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మనుషులున్న ప్రతి నేలమీదా ఇటువంటి ప్రయత్నాలే జరుగుతాయి. ఈ దశలో తెలంగాణా ఉద్యమానికి చేకూరిన బలం కూడా అదే. ఇంతకాలం కేవలం ప్రజలే ఉద్యమించారు. తెలంగాణా తమ తక్షణ అవసరమని ప్రజలే భావించారు. ప్రజలు పోరాడినప్పుడు వారితో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత దూరం నడుస్తూ తామే ఉద్యమాన్ని నడిపిస్తున్నట్టు నమ్మ బలుకుతూ వచ్చాయి. కొన్ని పార్టీలు జే ఎ సి లో ఉంటూనే జే ఏ సి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాయి. మరికొన్ని సార్లు జే ఎ సి బలాన్ని తమ బలంగా చూపించుకోన్నాయి.  కొన్ని పార్టీలు ఉద్యమానికి దూరంగానే ఉండి  మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు పోరాడకుండా ఉండలేని స్థితి వచ్చింది. అందుకే స్వతంత్రంగా ఆయా పార్టీలే ఉద్యమిస్తున్నాయి. కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణాకు కావాల్సింది ఇదే. ప్రజలు ముందుంటే రాజకీయ పార్టీలు వెనుక నడిచే పరిస్థితి నుంచి ప్రజలకోసం రాజకీయ పార్టీలు ముందు నడిచే దశ వచ్చింది. అన్ని పార్టీలు ఇదే రీతిగా ఉంటె రాజకీయ ప్రక్రియ దానంతట అదే మొదలుతుంది. అసమర్థ పాలకులున్న ఈ సందర్భంలో ప్రతిపక్షాలు  బలపడడం ప్రజలకు  లాభదాయకం. తెలంగాణా ఇప్పుడొక చారిత్రక అనివార్యత అవుతుంది. 

ఇదంతా రాజకీయ పార్టీలకు అర్థమౌతోంది. ఈ ఒక్క సందర్భంలోనే కాదు గడిచిన మూడేళ్ళుగా తెలంగాణ ఉద్యమం వినూత్నంగా విస్తరిస్తోన్న తీరును అన్ని పార్టీలు గమనిస్తున్నాయి. ప్రజలు విడివిడిగా కనిపిస్తున్నా వాళ్ళంతా ఒకే కూడలిలో ఉన్నారని అర్థమయ్యింది. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో సహా అందరూ ఆ కూడలికే చేరాలని అనుకుంటున్నారు. అక్కడ కేవలం ప్రజలు, ఉద్యమకారులు మాత్రమే కాదు. వాళ్ళ ఓట్లు కూడా అక్కడే ఉన్నాయని వారికి అర్థమయింది. ఇట్లా ప్రజల దగ్గరికి-వాళ్ళ ఆకాంక్షల దగ్గరికి రాజకీయపార్టీలు చేరడమే రాజకీయ ప్రక్రియకు తొలిమెట్టు.

ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ ఒక్కటే అన్నట్టున్న ఉద్యమం ఇప్పుడు పాయలు పాయలుగా కనిపిస్తోంది. అదినిజంగానే కాంగ్రెస్‌ను కలవరపెట్టే అంశం. టీఆర్‌ఎస్ ఒక్కటే అయితే ఏదో ఒక విధంగా నచ్చజెప్పవచ్చు. మాట్లాడవచ్చు. ఒప్పించవచ్చు. కాదంటే తెలంగాణ ఇచ్చేసి తమలోనో, తమ కూటమిలోనో కలిపేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉద్యమాన్ని పూర్తిగా తలకెత్తుకుని ముందుకు వస్తున్న రెండు పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు. అవి రేపు యూపీఏకు వ్యతిరేకంగా నిలబడే రెండో, మూడో కూటముల్లో ప్రధాన భాగస్వాములుగా ఉండబోతున్నాయి. ఢిల్లీలో కిషన్‌డ్డి దీక్షకు అద్వానీతో సహా భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకత్వమంతా హాజరయింది. తెలంగాణ తమ జాతీయ ఎజెండా అని అద్వానీ సహా ఆపార్టీ అగ్రనేతలంతా ప్రకటించారు. అలాగే సీపీఐ తెలంగాణ యాత్ర ముగింపు సభకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌డ్డి హాజరై తెలంగాణ తమ ప్రధాన ఎజెండా అని స్పష్టంగా చెప్పడమే కాక, మొత్తం వామపక్ష కూటమి తెలంగాణను సమర్థించాలని కూడా ప్రతిపాదించారు. ఈ లెక్కన ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణను నిర్ద్వందంగా సమర్థించే శక్తులే మూడింట రెండువంతులున్నాయి.

సరిగ్గా ఈ దశలోనే, టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకేరోజు ఢిల్లీ వెళ్ళారు. చంద్రబాబు పైకి వెనుకబడిన కులాల (బీసీల) కోసం ముందున్నానని, అందుకే ఢిల్లీ వెళ్లానని చెపుతున్నా ఆయనలో తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నానన్న భయం కూడా ఉంది. అసలు ఆయన అక్కడికి వెళ్ళింది తెలంగాణ గురించి ఆరా తీయడం కోసమేనని మీడియా అనుమానిస్తోంది. ఇవన్నీ కేసీఆర్ ఎప్పటిలాగే మౌనంగా గమనిస్తున్నారు. ఈ సందర్భంలో కూడా ఆయన మౌనానికి ఎవరికీ తోచిన భాష్యం వాళ్ళు చెబుతున్నారు. తనకు కచ్చితమైన సిగ్నల్స్ ఉన్నందువల్లే కలవరపడిపోవడం లేదని, ఆ సిగ్నల్స్ అందని వాళ్ళే ఆందోళన చెందుతున్నారని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ ఒత్తిడి కాంగ్రెస్ మీద పనిచేస్తుందని ఆయన అనుయాయులు అంటున్నారు. అన్ని రాజకీయపార్టీలు వాటికవే తెలంగాణను తలకెత్తుకోవడం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి శిరోభారమన్నది వాళ్ళ అంచనా.

వీటన్నిటికి మించి జేఏసీ చైర్మన్ కోదండరామ్ వ్యూహాత్మకంగా కదలడం కూడా రాజకీయపార్టీలను కలవరపెడుతోంది. ఇంతకాలం జేఏసీని, ఆ నాయకత్వాన్ని రాజకీయపార్టీలన్నీ టీఆర్‌ఎస్ జేబు సంస్థగా చూస్తూ వచ్చాయి. కొందరైతే కోదండరామ్ స్వతంవూతుడు కాదని కేసీఆర్ తొత్తు అనికూడా నోరు పారేసుకున్నారు. కానీ చాలామందికి ఇప్పుడిప్పుడే జేఏసీ వ్యూహం అర్థమౌతోంది. సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ ఉంటుందని రెండునెలల ముందుగా కోదండరామ్ ప్రకటిస్తే రాజకీయపక్షాల్లో ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. టీఆర్‌ఎస్ కూడా కనీసం మాటవరసకైనా మద్దతు ప్రకటించలేదు. టీఆర్‌ఎస్-జేఏసీ మధ్య సంబంధాలు చెడిపోయాయని, జే ఏసీ నాయకత్వాన్ని మార్చాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఎవరూ పెద్దగా ఖండించలేదు సరికదా ఇద్దరి వైఖరి అవి నిజమేనేమో అన్నట్టుగా ఉంది. స్వతంవూతంగా ఉండడం ఎంత బలాన్నిస్తుందో బహుశా కోదండరాంకు అర్థమయినట్టుంది. అందుకే ఆయన ఎవరు వచ్చినా రాకపోయినా మార్చ్ మాత్రం జరిగి తీరుతుంది అని స్పష్టంగానే చెబుతున్నారు.

ఇప్పుడు 30లోపు తెలంగాణ ప్రకటన రాకపోతే వెనుదిరిగేది లేదని చెప్పిన జేఏసీ ఆ మేరకు సన్నాహాలు కూడా చేస్తోంది. జేఏసీ కార్యక్షికమానికి విస్తృతస్థాయిలో మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా వామపక్షపార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, వ్యాపారవర్గాలు, విద్యార్ధి సంఘాలు, జర్నలిస్టులు జేఏసీకి సంఘీభావం ప్రకటిస్తూ తెలంగాణ మార్చ్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జనతాపార్టీ కూడా ఎవరున్నా లేకున్నా జేఏసీతో తామున్నామని స్పష్టంగా చెప్పింది. సీపీఐ నారాయణ అయితే తన యాత్ర పొడుగునా ఇదే మాట చెప్పి ఒక రకంగా తెలంగాణ మార్చ్‌కు ప్రచారకర్తగా పనిచేశారు.

రాజకీయ ఎత్తుగడ కోసమే అయిన ఢిల్లీ నుంచి రాగానే చంద్రబాబునాయుడు కూడా తన పార్టీ తరఫున తెలంగాణ ప్రకటన చేస్తాడు. వాళ్ళది రాజకీయ వ్యూహమే కాబట్టి జేఏసీకి జైకొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో టీఆర్‌ఎస్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తే మంచిది.ఎవరు అవునన్నా కాదన్న టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతీకగా నిలబడ్డపార్టీ. ఆ ఆకాంక్షకు ఆత్మవిశ్వాసాన్నిచ్చి నిలబెట్టింది కేసీఆర్.టీఆర్‌ఎస్‌లేని, జేఏసీలేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. మార్చ్ కోసం ప్రజలు పదిమంది కదిలినా, పదిలక్షలు కదిలినా అందులో టీఆర్‌ఎస్ కూడా ఉండాలి. అది ఉద్యమానికే కాదు. ఆ పార్టీకి కూడా బలాన్ని ఇస్తుంది. గతంలో మానుకోటలో జగన్‌ను అడ్డుకునే సందర్భంలో, ఆ తరువాత మిలియన్ మార్చ్ సందర్భంలో కూడా కేసీఆర్ చివరి నిమిషం వరకూ ఇదే అనిశ్చితిని కొనసాగించారు. కానీ ఆ రెండు కార్యక్షికమాల్లో కూడా ఆలస్యంగా స్పందించినా టీఆర్‌ఎస్ క్రియాశీలంగా పాల్గొంది. బహుశా ఢిల్లీ సిగ్నల్స్‌ను బట్టి టీఆర్‌ఎస్ నిర్ణయం ఉండొచ్చు. సిగ్నల్స్ సానుకూలం అయితే 30లోపు ఢిల్లీ తెలంగాణకు రావాలి. లేదంటే తెలంగాణ హైదరాబాద్‌కు రావాలి. ఏది జరిగినా తెలంగాణ వస్తుంది.

1 కామెంట్‌: