శుక్రవారం, సెప్టెంబర్ 14, 2012

సెప్టెంబర్ -17 ముందూ వెనకా...



సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలి ఆన్న విషయంలో చాలా చర్చే జరిగింది, జరుగుతూనే ఉన్నది. చారిత్రకంగా స్వతంత్ర రాజ్యం గా ఉన్న హైదరాబాద్ భారత్‌లో కలిసిపోయిన రోజది. కాబట్టి అది విలీనమని వాదించే వాళ్ళున్నారు. విలీనమనేది ఇరుపక్షాల అంగీకారం తో జరగాలి కాబట్టి అది విలీనం కాదనేవాళ్ళూ ఉన్నారు. కొందరు దీనినొక విమోచనగా చూస్తున్నారు. ముస్లిం పాలకుల అకృత్యాల నుంచి ఇక్కడి ప్రజ లకు విమోచన కలిగిందని వాదిస్తున్నారు. ఇదికూడా మత, జాతీయవాద ధోరణే తప్ప ప్రజాస్వామిక దృక్పథంకాదు. తెలంగాణ ప్రజల కోణంలో ఆలోచిస్తే తప్ప చారిత్రక పరిణామాలను అర్థంచేసుకోవడం వీలుకాదు. తెలంగాణవాదం ఉద్యమరూపంలోకి మారిన తరవాత ఇప్పుడు చాలా మంది అదొక విద్రోహ దినమనే అవగాహనకు వచ్చారు. భారత ప్రభుత్వం ఇక్కడి ప్రజా పోరాటాలను, ముఖ్యంగా భూస్వామ్య విముక్తి ఉద్యమాలను అణచివేసే కుట్రలో భాగంగానే హైదరాబాద్ దురాక్రమణ జరిగిందని, ఆ ఆక్రమంలోనే వలసవాద ఆధిపత్యానికి పునాదులు వేసిందని ఆరు దశా బ్దాల అనుభవం తరువాత ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది.

తెలంగాణ చారిత్ర క ఫటనల, సందర్భాల పట్ల ఈఅయోమయం మొదటి నుంచీ ఉన్నదే. ఇది తెలంగాణ చరిత్ర పట్ల ఇక్కడి మేధావుల, చరిత్రకారుల నిర్ల క్ష్యం వల్ల కలిగినదే.1930కి ముందు బ్రిటీష్ ఇండియాలో జరిగినట్టుగా హైదరా బాద్‌లో సామాజిక, చారిత్రక పరిణామాల నమోదు జరగలేదు. నిష్పాక్షిక చరిత్ర రచన కూడా జరగలేదు. రాచరికపు వైభవాన్ని, ఆనాటి రాజుల వంశ చరిత్రలను, కొన్ని పాలనా విధానాలను డాక్యుమెంటు చేసే పుస్తకాలలో, గెజిట్‌లలో తప్ప పెద్ద గా సామాజిక, సాంస్కృతిక విశ్లేషణలు రాలేదు. రెండో దశలో కమ్యూనిస్టు పార్టీల కరపత్రాలే చరిత్రగా నమోదయిపోయి, సుందరయ్యలే తెలంగాణ చరిత్రకారలయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తరవాత హైదరాబాద్ చరిత్ర పూర్తిగా కనుమరుగయిపోయి ఆంధ్రుల చరిత్రే అందరి చరిత్రగా మారింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక ఎదిగివచ్చిన కొందరు విద్యావంతులు మళ్ళీ తెలంగాణ చరిత్రను స్థూలంగా రాస్తున్నారు. కానీ సూక్ష్మ అధ్యయనాలు, పరిశోధనలు పెద్దగా వెలుగు చూడడం లేదు. అలాగని దిగులుపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మీద ఇంగ్లిషులో చాలా పుస్తకాలే వచ్చాయి. దేశ విదేశాల్లో సమగ్రమైన పరిశోధనలు కూడా జరిగాయి. వాటిలోకి వెళితే హైదరాబాద్ మూలాలు, పరిణామాలు,ఈ క్రమంలో మోసాలు, ద్రోహాలు చాలావరకు తెలుస్తాయి. సెప్టెంబర్ 1948 లో ఏం జరిగిందో తెలుసుకోగలిగితే మాత్రం హైదరాబాద్ విలీనం ఎంత కుట్ర పూరితంగా జరిగిందో, దాని వెనుక ఎంతటి విద్రోహం ఉన్నదో అర్థ మౌతాయి.

1947 ఆగస్ట్‌లో దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికి రెండేళ్ళ ముందు నుంచే అధికారాల బదిలీకి కసరత్తు జరుగుతోంది. భారత్, పాకి స్తాన్‌లను స్వతంత్రదేశాలుగా, సంస్థానాలను స్వతంత్ర రాజ్యాలుగా ప్రక టించాలని బ్రిటన్ నిర్ణయించింది. భారత్ ఏర్పడ్డాక దేశంలో, దేశం చుట్టూ స్వతంత్ర రాజ్యాలు ఉండడం అప్పటి కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చలేదు. హైదరాబాద్‌తో సహా అన్ని సంస్థానాలను కలిపేసుకోవాలని ఎత్తువేసింది. ఇదంతా స్వాతంత్య్ర ప్రకటనకు ముందుగానే జరగాలని, ఆ తరువాత వారిని కలుపుకోవడం కష్టసాధ్యమని భావించి బ్రిటీష్ పాలకులతో ముఖ్యం గా లార్డ్ మౌంట్ బాటన్‌తో రాయబారాలు నడిపింది. వి.పి మీనన్ ద్వారా మౌంట్ బాటన్‌ను ఒప్పించి నిజాం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. భారత్‌లో చేరకపోతే సంస్థానాల్లో జాతీయవాదం రెచ్చగొట్టి పాలనను అస్తవ్యస్తం చేస్తామని, తిరుగుబాట్లు చేయించి రాచరికాన్ని కుప్పకూలుస్తామని కూడా కాంగ్రెస్ ఫీలర్లను పంపింది.

స్వయంగా మౌంట్‌బాటన్ కూడా ఆగస్ట్ 12 న నిజాంను సంప్రదించి చూశాడు. అప్పటికే దాదాపుగా అన్ని సంస్థానాలు భారత్‌లో చేరాయి. కానీ నిజాం తలొగ్గలేదు. చేసేది లేక బ్రిటీష్ ప్రభుత్వం ఆగస్ట్టు పదిహేనున భారత్, పాకిస్తాన్‌లకు స్వాతంత్య్రం ప్రకటించింది. అప్పటికి కాశ్మీర్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటే హైదరాబాద్, జునాగఢ్ మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగాలని నిర్ణయించుకున్నాయి. అప్ప టికి భారత్ నుంచే కాక పాకిస్తాన్ నుంచీ హైదరాబాద్ మీద ఒత్తిడి ఉంది. అయినప్పటికీ నిజాం తాను సంపూర్ణ సార్వభౌమాధికారిగా హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ ఫర్మానా జారీ చేసినట్టు 1947 జూన్ 24 న దక్కన్ క్రానికల్ ప్రచురించింది. భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు మూడునెలలపాటు నెహ్రూ, సర్దార్ పటేల్, మీనన్, మౌంట్ బాటన్ ఇలా అనేకమంది ఎవరి పద్ధతుల్లో వారు బేరసారాలు జరుపుతూనే వచ్చారు. అయినప్పటికీ నిజాం వెనక్కి తగ్గకపోవడంతో 1947 నవంబర్‌లో హైదరాబాద్‌తో భారత్ ‘యధాతథ’ ఒప్పందాన్ని చేసు కున్నది. ఈ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం హైదరాబాద్‌ను స్వ తంత్ర దేశంగా గుర్తించింది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి మధ్య రోడ్డు, రైల్వే రవాణాకు హైదరాబాద్ అనుమతించింది.

సంతకాలు జరిగిన మరుక్షణం నుంచి హైదరాబాద్‌ను వశపరచుకోవాలన్న ప్రయత్నాలను భారత ప్రభు త్వం ముమ్మరం చేసింది. శాశ్వతంగా హైదరాబాద్‌ను ఒక దేశంగా గుర్తించ డానికి చర్చలు జరుపుతూనే మరోవైపు హైదరాబాద్‌ను ఆక్రమించుకునే ప్రణాళికలను భారత్ రూపొందిసూ ్తవచ్చింది. 1948 మే చివరి వారంలో నెహ్రూ ఉస్మాన్ అలీఖాన్‌కు రాసిన లేఖలో కూడా, మీ ప్రధానమంత్రి ద్వారా మీరు హైదరాబాద్‌కు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు, పని ఒత్తిడి వల్ల వెంటనే రాలేను, మన రెండుదేశాల ప్రభుత్వాల మధ్య జరుగు తున్న చర్చలు, సంప్రదింపులు పరస్పరం సంతృప్తికరంగా ముగిస్తే కచ్చితంగా మీ రాజధానికి రావడానికే అన్నిపనుల కంటే మొదటి ప్రాధాన్యం ఇస్తాను అని రాశారు. కానీ అప్పటికే ఆయన హైదరాబాద్ వ్యతి రేక ప్రచారం మొదలుపెట్టాడు. దానికి రజాకార్ల ఆకృత్యాలను వాడు కున్నాడు. దేశదేశాల్లో ఉన్న ముస్లిం నాయకులతో ఈసంగతి చర్చిస్తూ ఉన్నా డు. కాంగ్రెస్ నాయకులతో కూడా హైదరాబాద్ ఆక్రమణ ప్రణాళిక గురించి చర్చిస్తూనే ఉన్నాడు.

నిజాంకు ఉత్తరం పంపడానికి చాలా ముందుగా ఏప్రిల్ 16న ఆయన బొంబాయిలో జరిగిన ఏఐసీసీ రహస్య సమావేశంలో హైదరాబాద్ పరిణా మాలను చూస్తూ ఊరుకోబోమని, సమయం కోసం చూస్తున్నామని చెప్పాడు. ఇదేవిషయాన్ని ఆయన అదే నెలలో సర్దార్ పటేల్‌కు రాసిన ఉత్తరంలో కూడా పేర్కొన్నాడు. ‘మనం చూస్తూ ఊరు కోకూడదు అని కూడా సూచించాడు. 1948 జూన్ 2న ఊటీలో బహిరంగ సభలో నెహ్రూ తన అంతరం గాన్ని బయట పెట్టాడు. హైదరాబాద్ పరిణా మాలను గమనిస్తున్నాం, ఇక ఆ ప్రభుత్వానికి మాతో విలీనమై పోవడం తప్ప మార్గాంతరం లేదని హెచ్చరించారు. చాలామంది సైనిక చర్యకు పటేల్ మాత్రమే బాధ్యుడనుకుంటారు. కానీ నెహ్రూ పటేల్ ఉత్తరాల పేర ప్రచురితమైన పుస్తకంలో హైదరాబాద్‌తో ఎలా వ్యవహరించాలో నెహ్రూ రాశారు. అప్పటికే దేశవిభజన, ముస్లింల మీది ఆకృత్యాల వల్ల బద్నాం అయి ఉన్నందు వల్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, ముస్లిం రాజును గద్దె దింపామన్న అపప్రథగాని, ముస్లి ం రాజ్యాన్ని కబళించామన్న అపవాదు గానీ రాకుండా దీనినొక శాంతి భద్రతల సమస్య కోణంలో పరిష్కరించాలని నెహ్రూ పటేల్‌కు పదే పదే సూచించాడు. ముట్టడికి ముందే హైదరాబాద్‌కు సరుకుల రవాణా నిలిపి వేయాలని, ఎలాంటి సహకారం పొరుగునుంచి అందకుండా చర్యలు తీసుకోవాలని సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని ఆదేశించాడు. ఇవన్నీ తెలిసిన నిజాం భారత సైన్యం దాడి చేస్తే ఎదుర్కొవడానికి కావలసిన ఆయుధాల ను కొనడానికి తన సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఎడ్రూస్‌ను లండన్‌కు పంపాడు.కానీ ఆయుధాలు అమ్మకుండా భారత్ మేనేజ్ చేయగలిగింది. కొంతవరకు సమకూర్చుకున్నా అవి హైదరాబాద్‌కు చేరకుండా అన్ని పోర్టుల, విమానాశ్రయాలలోనే నిలిపేసే విధంగా ఆదేశాలు ఇచ్చింది.

హైదరాబాద్‌కు ఏది చేరాలన్నా భారత నౌకాశ్రయాలు, బొంబా యి, మద్రా సు విమానాశ్రయాల నుంచే రావాలి. అది సాధ్యం కాలేదు. అప్పటికే పటేల్ హైదరాబాద్‌ను భారతదేశానికి అల్సర్ లా దాపురించినదని అభివర్ణించారు. భారత ప్రభుత్వం 1948జూలై26న ప్రచురించిన శ్వేత పత్రంలో హైదరాబాద్ అకృత్యాలకు నెలవయిందని, ఇది తమ భూ భాగంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నందున జోక్యం తప్పదని ప్రకటించింది. 1948 ఆగస్ట్ 29న నెహ్రూ, మౌంట్ బాటన్‌కు ఒక ఉత్తరం రాస్తూ హైదరాబాద్ ఆక్రమణ తప్పనిపరిస్థితి వచ్చింది. అయితే మేం దీన్ని పోలీస్‌చర్యఅంటాం, ఈ సందర్భంగా మీరు మాతో లేకపోవడం విచారకరం అని పేర్కొన్నారు.

భారత్ ఆగడాలపై ఐక్యరాజ్యసమితికి నివేదించాలని నిజాం నిర్ణయిం చాడు. ఆ మేరకు భద్రతా మండలికి టెలిగ్రాం పంపించాడు. ఈ విషయం అందరికంటే ముందు సర్దార్ పటేల్‌కు చేరింది. ఆయన జూలై 23న నెహ్రూకు రాసిన ఉత్తరంలో నిజాం ఐక్యరాజ్యసమితి జోక్యం కోరబోతు న్నాడని, ఇంకా ఆలస్యం చేస్తే హైదరాబాద్ సమస్య అంతర్జాతీయం అవు తుందని, అప్పుడు ఏమీ చేయలేమని, కాబట్టి హోంశాఖ సర్వ సన్నద్ధంగా ఉందని రాశాడు. వి.కె.కృష్ణ మీనన్‌కు ఆగస్ట్ 29న నెహ్రూ రాసిన ఉత్తరం లో కూడా హైదరాబాద్ ప్రభుత్వం ఐక్య రాజ్యసమితికి వెళ్ళే లోపే సైనిక చర్య ఉంటుందని స్పష్టం చేశారు. అనుకున్నట్టుగానే నిజాం ప్రభుత్వ ప్రతినిధి బృందం సెప్టెంబర్ 10న ఐక్యరాజ్య సమితికి విషయాన్ని నివేధిం చింది. అదే రోజు ‘మేం సికింద్రాబాద్‌ను ఆక్రమించుకోక తప్పడం లేద’ని నెహ్రూ ప్రకటించారు. మరుక్షణమే అప్పటిదాకా ఒప్పందంలో భాగంగా నిజాంకు సేవలందిస్తూ వచ్చిన బ్రిటీష్ సైనికాధికారులంతా రాజీనామా చేసారు.సెప్టెంబర్ 12న నెహ్రూ చేసిన ప్రకటనను హైదరాబాద్ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి దృష్టికి తెచ్చారు.

భారత్ ఒక స్వతంత్ర రాజ్యం మీద దురాక్రమణకు పూనుకుంది, ఆదేశ ప్రధాని ప్రకటనే అందుకు నిదర్శనమని వారు నివేదించారు. వీలయినంత తొందరగా దీనిని చర్చకు తీసుకోవాలని కోరారు. భద్రతా మండలి సెప్టెంబర్ 15న చర్చించడానికి ఎజెండాలో చేర్చింది. అనూహ్యంగా సెప్టెంబర్ 12న పాకిస్తాన్‌లో మహ మ్మద్ అలీ జిన్నా మరణించారు. ఆ వార్త తెలిసిన వెంటనే నెహ్రూ హైదరాబాద్ ఆక్రమణకు ఆదేశాలిచ్చారు. ముస్లిం సమాజం శోక సముద్రంలో మునిగి పోయిన సమయంలోనే హైదరాబాద్ ఆక్రమణ పూర్తి కావాలన్నది ఆయన అభిమతం. అప్పటికి రెండురోజుల ముందు నుంచే ఆయన హైదరా బాద్ ఆక్రమణ ముస్లింలను కాపాడడం కోసమేనని, రజాకార్ల ఆకృత్యాలకు ముస్లిం యువకులు బలి అవుతున్నారని పేర్కొన్నాడు. ఢిల్లీలో 10న నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రజాకార్లు పాత్రికేయుడు షోయ బుల్లాఖాన్‌ను హత్య చేసిన ఉదంతం ప్రస్తావిం చారు. జిన్నా మరణవార్త తెలిసిన మరుసటి రోజు తెల్లారి, ఆంటే సెప్టెంబర్ 13న భారత సైన్యం మూ డు దిక్కుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించింది.


ఆపరేషన్ పోలో పేరుతో సాగిన ఆక్రమణలో భారత సైన్యం హైదరా బాద్ మీద శత్రుదేశంకంటే భయంకరంగా దాడి చేసింది. అనేక అకృత్యాలకు పాల్పడింది. వేలాదిమంది మహిళలను బలాత్కరించి చంపేసింది. ముఖ్యం గా ముస్లింలను టార్గెట్ చేసి దాడులు సాగించింది. దారి పొడుగునా కనిపిం చిన వారినల్లా కాల్చి చంపింది. రైల్వే స్టేషన్లు, రవాణా వ్యవస్థలను కూల్చి వేసి ప్రజలను భయభ్రాంతులను చేసింది. భారత సైన్యం జరిపిన హత్య లను ఆ తరువాత ప్రధాని నెహ్రూ నియమించిన సుందర్‌లాల్ కమిటీ నిర్ధారించింది. ఈ హత్యాకాండ గురించి తెలిసి నాడు యూపీ గవర్నర్‌గా ఉన్న సరోజినీ నాయుడు బోరున విలపించారు. 

మొత్తం మీద సెప్టెంబర్ 15న ఐక్య రాజ్య సమితి సమావేశం ప్రారంభం అయ్యేసరికి సెక్రటరీ జనరల్‌కు హైదరాబాద్ ఆక్రమణ పూర్తి అయ్యిందని టెలిగ్రాం అందింది. అయినప్పటికీ హైదరాబాద్ ప్రతినిధులు సమితి జోక్యం చేసుకోవాలని పట్టుబట్టారు. భారత ప్రభుత్వం అడ్డగోలు వాదన లతో కేసును తిరిగి సెప్టెంబర్ 18కి వాయిదా వేయించగలిగింది. అప్పటికి సైన్యం హైదరాబాద్ నగరాన్ని చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడు భారత సైన్యా నికి లొంగిపోయాడు. ప్రధాని లాయక్ అలీ రాజీనామా చేసారు. తన సైన్యం వెనక్కి తగ్గాలని సెప్టెంబర్ 17న నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రక టించేశాడు. ఈలోపు నెహ్రూ, పటేల్ నిజాంకు భారీ నజరానాలు, హోదాను ప్రకటించి లొంగదీసుకున్నారు. నిజాం ఐక్యరాజ్య సమితికి చేసిన ఫిర్యా దును సెప్టెంబర్ 23న వెనక్కి తీసుకున్నాడు. అలా మొదలైన ఆక్రమణ నవంబర్ 24న భారత సైనిక పాలన మొదలవడంతో పూర్తయ్యింది. అప్పటి నుంచి 1949 డిసెంబర్ దాకా సైనిక పాలన అమలులోనే ఉంది. అప్పటికి ఇంకా రాజ్ ప్రముఖ్‌గా ఉన్న నిజాం ఆ రోజు నుంచి హైదరాబాద్ భారత రాజ్యాంగ పరిధిలోకి వస్తుందని ఫర్మానా జారీ చేశారు. దీనిని తిరిగి భారత దేశ రాజ్యాంగం ఏర్పడ్డాక 1950 జనవరి 25 న భారత గవర్నర్ జనరల్ రాజాజీకి, ఉస్మాన్ అలీఖాన్‌కు మధ్య ఒప్పందంతో చట్టబద్ధం చేసి హైదరా బాద్‌ను, తెలంగాణను భారతదేశంలో కలిపేశారు.

జనవరి 1950 లో సైనిక పాలనపోయి వెల్లోడి నాయకత్వంలో పౌర ప్రభుత్వం వచ్చింది. రెండేళ్ళ తరువాత బూర్గుల రామకృష్ణారావు నాయ కత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. కానీ సైన్యంలో ఉన్న ఆంధ్రు లు, సైన్యం వెంట విజయవాడ గుండా దారి చూపడానికి వచ్చిన వారు మాత్రం తిరిగి వెళ్ళలేదు. ఎంత వరకు నిజమో తెలియదు గానీ అలా వెళ్ళకుండా ఉండిపోయిన వాళ్ళలో రేణుకాచౌదరి తండ్రి ఎయిర్ కమాండర్ కే ఎస్‌రావ్ కూడా ఒకరని అంటారు. సైన్యం రాకతో అప్పటికే భయంతో వేలాది మం ది ముస్లిం భూస్వాములు, వ్యాపారులు, అధికారులు, నిజాం కొలువులో పనిచేసిన నౌకర్లు, చాకిర్లు ఇల్లూ వాకిళ్ళు వదిలి పాకిస్తాన్ పారిపోయారు.ఆ ఇళ్ళను, వారి ఆస్తులను ఆక్రమించుకున్న వారు తొలితరపు వలస వాదులు గా ఇక్కడే స్థిరపడిపోయి,1956 నాటికి వారి వారసులకు మార్గం సుగమం చేశారు. ఇప్పుడు తెలంగాణ పరిశోధన వీటిపై దృష్టి సారించవలసి ఉన్నది. ఒక్క నెల రోజుల్లో నేలకూలిన ఒక సంపన్న రాజ్య శిథిలాల కింద నలిగి పోయిన పురా వైభవాన్ని తవ్వి తీయాల్సి ఉన్నది.

2 కామెంట్‌లు:

  1. అర్టికల్ చదువుతున్నంత సేపు ఒక హాలివుడ్ సినిమా చుస్తున్నట్టు ఫీల్ ఐన .. కచ్చితంగా తెలంగాణా వచ్చినంక ఇది సినిమా తీయవలసిన అవసరం ఉంది... మన చెరిత్ర మన ఫుచార్ జెనరేషన్ వాళ్ళకు చెప్పాల్సిన బాద్యత మనందరిది .....
    రాజ్ కుమార్ .బి

    రిప్లయితొలగించండి
  2. ఘంటా చక్రపాణిగారు చరిత్రని వక్రీకరించి రాసి, భారత రాజ్యాన్గాన్నే సవాల్ చేసే విధంగా వేర్పాతువాడులని రెచ్చగొట్టడానికి పనికి వచ్చేదే కానీ అన్నీ వక్రభాష్యాలే తెలంగాణా ప్రాంతమైన అశ్వారావు పేట బోర్డర్ గ్రామం జీలుగుమిల్లి లో మేము ఉన్నప్పుడు అక్కడి మా ఇంటి ఓనర్ గారూ స్వర్గీయ శ్రీమతి గడ్డమణుగు యమునా సరస్వతీ (మేము అమ్మమ్మగారూ అని పిలిచేవారం) గారు భారత సైన్యం వచ్చిన వెంటనే అశ్వారావు పేట, సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో హిందువులు అందరూ రోడ్లపైకి వచ్చి సైనికిలకి దండలు వేసి ఏ విధంగా ఆహ్వానం పలికారో వివరించేవారు పైగా ఆ జవాన్లు ప్రజలందరితో కలిసి పోయి సైనిక సహాయ్యాన్ని అందించారు. నా స్నేహితుడు శ్రీ శ్రీకాంత్ మాహా (మహారాష్ట్ర బ్రాహ్మిన్) చెప్పినదే సారి అయినది అనిపిస్తుంది. ఆయన తండ్రి హైదరాబాద్ లో ఆంగ్ల వైద్యులుగా పని చేసారు. శ్రీకాంత్ చెప్పినదాని ప్రకారం భారత సైన్యాన్ని చూస్తూనే తోక ముడిచి పారిపోయారు రజాకార్లు. ఇంక ఖాసి రజ్వీ ని గృహ నిర్బంధం చేసింది. ఆ తరువాత కాళ్ళా, వెళ్ళా పది పాకిస్తాన్ పారిపోయాడు. సైన్యం చేసిన మంచి పనుల వల్లనే హిందువులు ఈ రోజు హైదరాబాద్ నగరం లో ప్రశాంతంగా బతకడానికి వీలుపడింది. లేకపోతె మన ఘంటా వారిని ఘాజీ సాబ్ అనాల్సి వచ్చేది.

    రిప్లయితొలగించండి