హైదరాబాద్ నగరంలో ఆ నగరానికి పునాది రాయి వేసిన ఖులీ కుతుబ్ షా పేరున అయన చనిపోయి నాలుగు శతాబ్దాలు దాటినా ఒక్క స్మారక చిహ్నం కూడా నగరంలో లేదు. కానీ బీ పీ ఆచార్య పేరున మాత్రం ఆయన బతికి ఉండగానే ఇప్పుడొక రోడ్డు ఉంది. ఆయన ఏ శతాబ్దపు రాజు అని ఆశ్చర్య పోకండి. ప్రస్తుతం ఎమార్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఐ ఏ ఎస్ అధికారి అతను. గచ్చిబౌలీ లోని ఎమార్ ప్రాపర్టీస్ కు వెళ్ళే దారికి బీ పీ ఆచార్య మార్గ్ అని నామకరణం చేసారు. ఆ రోడ్డు గుండా వెళ్తే మీరు నేరుగా వై ఎస్ ఆర్ భవన్ కు చేరుకుంటారు. అది అధునాతన హంగులతో నిర్మించిన ఆంద్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనం. ఆ భవనానికి వై ఎస్ బతికుండగానే పునాది వేసినప్పటికీ ఆయన దుర్మరణం తరువాత నెల లోపే ఆ భవనాన్ని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ప్రారంభించి వై ఎస్ ఆర్ భవనంగా నామకరణం చేసారు.
అ సమయంలో సంస్థ చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా ఆచార్య ఉన్నారు. ఎమార్ ప్రాపర్టీస్ రూపకల్పనలో ఆచార్యుల వారి అకుంటిత దీక్షకు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఎమార్ సంస్థ ఆ రహదారికి బీ పీ ఆచార్య మార్గ్ అని నామకరణం చేసింది. ఆ రహదారితో ఆయన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని భావించి ఉండవచ్చు. కానీ అది ఇప్పుడు ఆయనను నేరుగా చంచల్ గూడా జైలుకు చేర్చింది. ఎమార్ కేసులో విచారణ చేస్తోన్న సి బీ ఐ ఆచార్య అనేక అడ్డదార్లు తొక్కి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం చేకూర్చాడని నేరారోపణ చేస్తోంది. ఈ సొమ్ము ఏ దారిగుండా ఎక్కడికి చేరిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు సి బీ ఐ చేస్తోంది. ఇలా బీ పీ ఆచార్య నడిరోడ్డుమీద అడ్డంగా దొరికిపోయినా ఐ ఏ ఎస్ అధికారుల సంఘం మాత్రం ఆయన అమాయకులమని, సి బీ ఐ కావాలనే కక్ష గట్టి వేధిస్తోందని అంటున్నారు. వెంటనే సి బి ఐ ని కట్టడి చేయాలని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. ఒక ఐ ఏ ఎస్ అధికారి పేరున ఆయన సర్వీసులో ఉండగానే హైదరాబాద్ మహానగరంలో ఒక రోడ్డు వెలిసిందంటే ఆయన ఎంతటి ఘనత వహించిన వారో ఎవరికైనా అర్థమై పోతుంది. పాపం ఐ ఏ సే అధికారుల సంఘానికి మాత్రమే అది ఇంకా అర్థం కావడం లేదు. కొందరు ఐ ఏ ఎస్ అధికారులు మీడియా ముందు మంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కడిగి పారేస్తున్నారు. పనిలో పనిగా సి బీ ఐ కి దురుద్దేశాలు అంటగడుతున్నారు.
బీ పీ ఆచార్య అవినీతి పరుడా కాదా అనేది న్యాయస్థానాలు తేల్చుతాయి. సి బీ ఐ తన విచారణలో కేవలం ఆధారాలే సేకరిస్తోంది. ఈ దశలో ఎవరైనా సరే దర్యాప్తుకు అడ్డు తగల వచ్చా? అసలు ప్రభుత్వ సర్వీసుల్లో ఉండి, పరిపాలనకు వెన్నెముకగా ఉండాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడ వచ్చా అన్నది ఆలోచించాలి.ఇది కేవలం తొందరపాటే కాదు బాధ్యతా రాహిత్యం అని కూడా గ్రహించాలి.
భారతీయ సివిల్ సర్వీసెస్ కు ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. కలెక్టర్ కావడం అనేది దేశానికి సేవ చేయడం తో సమానం అనుకునే వారు. కొందరు కలెక్టర్ లు నిజంగానే ప్రజాసేవకులుగా చరిత్రలో మిగిలి పోయారు. అలాంట్ వారిలో ఎస్ ఆర్ శంకరన్ లాంటి అరుదైన అధికారులు నిన్న మొన్నటి వరకు మనమధ్యలో ఉన్నారు. అలాంటి వారి వల్లే కలెక్టర్ ల వ్యవస్థకు ఆ గుర్తింపు వచ్చింది. రాజకీయాలు ముదిరిపోయిన ఇటీవలి కాలం దాకా సామాన్య ప్రజల దృష్టిలో ప్రభుత్వం ఆంటే జిల్లా కలెక్టర్ మాత్రమే. నిజానికి రాజ్యాంగం కూడా అదే చెపుతోంది.
స్థానికంగా అమలయ్యే ప్రభుత్వానికి ఆయన అధికారి మాత్రమే కాదు న్యాయదీషుడు కూడా. ఒకరకంగా కలెక్టర్ ఆంటే స్థానికంగా రాజ్యాంగ ప్రతినిధి. రాజ్యాంగం ప్రకారం శాసన న్యాయవ్యవస్థలు కూడా ప్రభుత్వ ప్రధాన అంగాలు గా ఉన్నప్పటికీ దేశ పరిపాలనను రాజ్యంగాచట్టానికి అనుగుణంగా నడిపించే అధికారం, బాధ్యత కలెక్టర్ల వ్యవస్థది. కానీ ఇప్పుడు కొందరు కలెక్టర్ లు ఆ బాధ్యతను పూర్తిగా మరిచిపోతున్నారు. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకో, నాయకులకో ఏజెంట్లుగా మారిపోతున్నారు. మార్కెట్ వ్యవస్థ బలపడి పోతున్న ఈ కాలంలో కొందరైతే ఏకంగా కొన్ని కంపనీలకు మేలుచేస్తూ వారిచ్చే కమీషన్ ల కోసం కక్కుర్తి పడుతున్నారు.
నిజానికి ఈస్ట్ ఇండియా కంపనీ కాలంలో కలెక్టర్ల వ్యవస్థ ఇలాగే ఉండేది. అప్పుడు దానిపేరు వాణిజ్య పాలనా వ్యవస్థ గా ఉండేది. వారిని ఆ కాలంలో కంపనీ వ్యాపారులుగానే (మర్చంట్స్) పిలిచేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున దాదాపు నూటాయాభై సంవత్సరాల పాటు అన్నిరకాల వ్యాపార లావాదేవీలు ఈ మర్చంట్స్ చూసుకునేవారు. కంపనీ పౌర పరిపాలన మొదలయినాక వ్యాపారం, వ్యవహారం వేరుచేయబడ్డాయి. అప్పటి మర్చంట్స్ లో పేరుకుపోయిన అవినీతి ఆర్ధిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని బ్రిటీషు పాలకులు రెవిన్యూ, న్యాయ వ్యవహారాలను మర్చంట్స్ నుంచి వేరుచేసి కొత్త పరిపాలన వ్యవస్థగా సివిల్ సర్వీసెస్ ను నెలకొల్పారు. సివిల్ సర్వీసెస్ లో ఉన్నవారు వ్యాపారాలు చేయడం, వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉండడం నిషేధించారు. బ్రిటీష్ అధికారులలో ఉన్న బంధు ప్రీతీ, అవినీతి కార్యకలాపాలు పరిపాలనను అష్టవ్యస్తం చేస్తున్న తరుణంలో దేశంలో నూతన విధ్యావ్యవస్తకు రూపకల్పన చేసిన మెకాలే ఆధ్వర్యంలో కొత్త వ్యవస్థ రూపొందిందింది. అదే ఆ తరువాత కలెక్టర్ల వ్యవస్థగా మారింది. చదువుకున్నవాళ్ళు, యువకులు, ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకున్నా వాళ్ళు కలెక్టర్లుగా ఉంటే భారతదేశంలో శాస్త్రీయమైన సుపరిపాలన సాధ్యమని, అవినీతికి ఆర్ధిక ప్రలోభాలకు తావుండదని మెకాలే భావించాడు. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ లో అభ్యర్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేసే విధానం, శిక్షణను కూడా మెకాలే ప్రవేశ పెట్టాడు. దీని వల్ల బ్రిటీష్ సింహాసనానికి దాసోహమయ్యే కొత్తతరం కలెక్టర్లు వచ్చారు.
భారతీయ పరిపాలన వ్యవస్థను సమూలంగా సంస్కరించే ప్రయత్నం 1930 తరువాత జరిగింది. బ్రిటీష్ కాలంలోనే పాలన సంస్కరణల విషయంలో డా. బి ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది, అయితే చరిత్ర రచయితలెవరూ దానిని గుర్తించిన పాపాన పోలేదు. నిజానికి భారత సామాజిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని బ్రిటీష్ పాలకులకు అర్థం చేయించడమే కాదు, భారతీయ పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలో అప్పటి ప్రభుత్వానికి సవివరంగా తెలిపింది డా. అంబేద్కర్. రౌండ్ టేబుల్ సమావేశాల చర్చలు పరిశీలిస్తే పరిపాలనను సామాజికీకరించి న్యాయబద్ధం, పారదర్శికం చేసి భూమార్గం పట్టించింది అంబేద్కర్ అన్నది అర్థమౌతుంది. పాలన వ్యవస్థను శిస్త్తవర్గం పెత్తందార్లు, రాజకీయ నాయకుల కబంద హస్తలనుంచి ఎలా తప్పించాలో ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆంటే కాదు భారత పరిపాలన, న్యాయ, సైనిక వ్యవస్థలతో పాటు మొత్తం ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా మలచాలంటే ఏం చేయాలో సూచిచారు. ఆ సూచనలు చాలావరకు 1935 గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆక్ట్ లో చోటుచేసుకున్నాయి. ఆ అనుభవం ఆయనకు రాజ్యాంగ రచనలో చాలా వరకు ఉపయోగపడింది. రాజ్యాంగ రచన సందర్భంగా సూచన మేరకు అంబేద్కర్ సివిల్ సర్వీసెస్ ను రాజ్యాంగ బద్ధం చేసి ఒక గౌరవనీయమైన, స్వతంత్రమైన వ్యవస్థగా నిలబెట్టారు.
భారతదేశంపార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రామాణిక పరిపాలనా వ్యవస్థగా తీసుకున్నప్పటికీ కేవలం పార్లమెంటుకు పార్లమెంటరీ రాజకీయ పార్టీలకే సంపూర్ణ పరిపాలనా అధికారాలు ఇవ్వకుండా అంబేద్కర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. భారతదేశం సామ్ప్రదాయకదేశం, అసమానతలతో ఉన్న దేశం. సామాజిక అసమానతల మూలంగా ప్రజాస్వామ్యం పేరుతొ మళ్ళీ దేశంలో సంపన్నులు, కుల,మత, ఆదిపత్య శక్తులే అధికారం చలాయిస్తారు కాబట్టి, పరిపాలనా అధికారాలను అధికార వర్గానికి ఇస్తూ ఆ అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగ సభలో ఎందరు వ్యతిరేకించినా ముఖ్యంగా పబ్లిక్ సర్వీసు కమీషన్, కంప్ట్రోలర్ ఆడిటర్ జెనరల్, అటార్నీ జనరల్ సహా మొత్తం సివిల్ సర్వీసెస్ ను, వాటి అధికారాలను రాజ్యాంగంలో రాసి పెట్టారు. అలా చేయడం వల్ల రాజకీయాలు పెత్తందారీ సాంప్రదాయ వర్గాల చేతిలో ఉన్నా పరిపాలన నీతివంతంగా, నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉంటుందని భావించాడు.
కానీ ఇప్పుడు అదే వ్యవస్థ ఆదిపత్య రాజకీయ వర్గాలకు, పెట్టుబడి దారీ వర్గాలకు మోకరిల్లుతున్నది. పదవులకు, ప్రలోభాలకు లొంగి పోతున్నది. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు ఆ పదవిని, ఆ పదవికి ఉన్న చట్టబద్దతను దిగజార్చి రాజ్యాంగ గౌరవాన్నే మంట గలుపుతున్నారు. గడిచిన పది పదిహేనేళ్ళలో ఐ ఏ ఎస్ కు ఉన్న గౌరవాన్ని స్వయంగా కొందరు ఐ ఏ ఎస్ లే మంట గలుపుతున్నారు.
నిజానికి 1980 కాలం వరకు సివిల్ సర్వీసెస్ కు ఎక్కడా లేని డిమాండ్ ఉండేది. కానీ ప్రపంచీకరణ మొదలై మార్కెట్ విస్తరిస్తూ పోతోన్న తరుణంలో చాలామంది ఐ ఏ ఎస్ కావాలనుకున్న వాళ్ళు , ఐ టీ అలల మీద అమెరికా వైపో డబ్బులు కురిసే ఇంకో వ్రుత్తిలోకో వెళ్ళిపోయారు. కొందరు అధికారులు సైతం ఐ టీ వైపు, ప్రైవేటు సంష్తల వైపు ఆకర్షితులై ఆ హోదా వదులుకోవడానికి కూడా సిద్ధ పడ్డారు. కొందరు ప్రైవేటు కంపనీలు, ఎన్ జీ వో లు ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళారు. ఇంకా వెళుతున్నారు.
రెండేళ్ళ క్రితం ఇండియా టుడే అనే పత్రిక రాసిన కథనం ప్రకారం గత పదేళ్ళలో దేశవ్యాప్తంగా 150 మంది ఐ ఏ ఎస్ లు ఈ అత్యున్నత పదవిని అర్థాంతరంగా వదిలేసుకుని స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం యాభై ఏళ్ళ వయసు నిండిన వాళ్ళు లేదా ముప్పి ఏళ్ళ సర్వీసు నిండిన వాళ్ళు ఎవరైనా పదవీ విరమణ కోరుకోవచ్చు. నిబందనల ప్రకారం వారికి పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఇప్పుడు చాలా మంది దానినొక సౌలభ్యంగా మార్చుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకో, నాయకుదికూ, కంపనీకో అనుకూలంగా ఉండడం పూర్తి పెన్షన్ అర్హత రాగానే రాజీనామా చేసి ఆ కంపనీలో చేరిపోవడం జరుగుతుంది. నిజానికి అలా సర్వీసు వదిలేశాక పెన్షన్ రావాలంటే ఆదాయం వచ్చే ఉద్యోగాల్లో చేరకూదదన్నది నిబంధన కానీ అలా ఉద్యోగాలు వదిలేసి కొత్త కంపనీలలో చేరిన వాళ్ళు చాలా మంది పెన్షన్ కూడా కొల్లగొడుతున్నారు. గతంలో చంద్ర బాబు నాయుడుకు చేదోడు వాదోడుగా ఉన్న అనేకమంది రాజశేఖర్ రెడ్డి రాగానే కొలువులకు తిలోదకాలిచ్చి బాబు గారి చలవతో బయటి కంపనీలకు వెళ్ళిపోయారు. ఒక అధికారయితే అలా స్వచ్చంద పదవీ విరమణ చేసి ఏకంగా బాబు గారి హెరిటేజ్ కంపనీలోనే చేరిపోయారు. ఒకప్పుడు కొన్ని వృత్తులకు, ఉద్యోగాలకు గౌరవం ఉండేది. ఆ వృత్తిలో చేరేందుకే చదువుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బే ప్రధానం అయిపోయాక డబ్బు వస్తే చాలు గౌరవం, హోదా దానంతట అదే వస్తుంది. ఏదీ కుదరక పొతే పదవీ విరమణ తరువాత ఏదో ఒక పార్టీలో చేరిపోవడం, ఏదో ఒక పదవినిపొందడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఈ రకమైన దూరదృష్టి ఉన్న కొందరు ఐ ఏ ఎస్ అధికారులు ముఖ్యమంత్రులకు, కంపనీల పెద్దలకు, పెట్టుబడి దారులకు సలాం కొట్టడానికే కాదు, ఏకంగా గులాంగిరీ చేయడానికి కూడా సిద్ధ పడుతున్నారు.
అలాంటి వారికోసం ఐ ఏ ఎస్ అధికారుల సంఘాలు రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా మేమోక్కరిమే తిన్నామా? అని ఎదురు ప్రశ్న వేయడం విడ్డూరం. తమపై రాజకీయ ఒత్తిడులు ఉంటున్నాయని, మంత్రులు ముఖ్యమంత్రులు చట్టవిరుద్ధంగా తమతో పనులు చేయిస్తూ వాళ్ళు మాత్రం తప్పుకున్తున్నారని మరీ చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం ప్రభుత్వాధికారులు అందునా సివిల్ సర్వెంట్స్ ఏం చేయాలో స్పష్టంగా చెపుతోంది. మనది లిఖిత రాజ్యాంగం, పరిపాలన అంతా లిఖితపూర్వక ఆదేశాలు, శాసనాలను బట్టే జరుగుతుంది తప్ప, మౌఖిక ఆదేశాలను వినవలసిన పని లేదు.
ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధుల సభలు చేసిన శాసన తీర్మానాల పరిధిలో జాతీయ స్థాయి వ్యవహారాలు రాష్ట్రపతిద్వారా, రాష్ట్ర స్థాయి వ్యవహారాలు గవర్నర్ ద్వారా అమలవుతాయి. వాటిని అమలుచేసే బాధ్యతను రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థకు అప్పగించింది. ఇక్కడ కార్యనిర్వహణలో ఉండే రాష్ట్రపతి, గవర్నర్ మొదలు కలెక్టర్ వరకు రాజ్యంగా పరిరక్షకులుగా, శాసన పాలకులుగానే ఉండాలి తప్ప మౌఖిక ఆదేశాలకు తలలూపే బంత్రోతులుగా మారిపోకూడదు. ఇది మన కల్లెక్టర్లకే కాదు. క్లర్కులకు కూడా స్పష్టంగా తెలుసు.అందుకే పాలకులు ఏ పని చెప్పినా, అది నోట్ ఫైల్ మీద రాసి సంతకం చేస్తేనే చెల్లుబాటు అవుతుంది. అలా ఆంటే లిఖిత పూర్వకంగా ఏది చెప్పినా వినాలని, ఏది రాసినా చేసి పెట్టాలని కాదు. అది చట్టబద్దమా కాదా అని చూసి చట్టబద్దమైతేనే చేయాలని రాజ్యాంగం చెపుతోంది. చట్టవిరుద్ధమైన పనులు చేయం అని చెప్పే అధికారం అధికార వ్యవస్థకు ఉంది.
అంతేకాదు ప్రజా వ్యతిరేకమైన, చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా మరెవరైనా అదుపుచేసే బాధ్యత కూడా వారికి ఉన్నది. అలా చెప్పిన వాళ్ళు చరిత్ర పొడుగునా మనకు కనిపిస్తారు. కానీ మన అధికారులు మాత్రం అవినీతి పాలకులకు ఆచార్యులై పోతున్నారు. అయ్యా ఎస్ అని దేబురించే స్తాయికి దిగాజారుతున్నారు. అలాగని అందరూ అలాగే ఉంటారని అనలేం. మన రాష్ట్రంలో ఇప్పుడున్న ఇప్పుడున్న అధికారులలో కనీసం ఒక ఇరవై శాతం నీతిమంతులు నిజాయతీ పరులున్నారని అంచనా! ఇది రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన కొత్తలో అప్పటి విజిలెన్సు కమీషనర్ ఇచ్చిన నివేదికలో ఎనభై శాతం మంది ఐ ఏ ఎస్ అధికారులు అవినీతి పరులని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పారు. అందుకు సంబంధించి 56 పేజీల నివేదిక కూడా ఇచ్చారు. రెడ్డిగారు అవినీతి అధికారులను తొలగించాల్సింది పోయి సమాల్ చెప్పిన సత్యాన్ని శాశ్వతంగా సమాధి చేసారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే సమాల్ ను పిచ్చివాడని ప్రచారం చేసారు. నిజంగానే 2007 లో సమాల్ నివేదిక ప్రకారం అవినీతి ఐ ఏ ఎస్ ల పై చర్య తీసుకుని వుంటే వై ఎస్ ఆర్ పేరు అవినీతికి పర్యాయపదం గా ప్రచారం అయ్యేది కాదు.
బహుశ ఆ నివేదిక ప్రకారమే ఆయన ఐ ఏ ఎస్ లను కీలకమైన స్థానాల్లో వాడుకుని ఉంటాడు. ఇప్పుడు అధికారులు కూడా తమను ముఖ్యమంత్రులు, మంత్రులు వాడుకున్నారని వాపోతున్నారు. నేరం చేస్తే ఒకటే తప్పు, కానీ నేరానికితోడ్పడడం, భాగ స్వాములు కావడం, నేర సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తేకపోవడం ఇవన్నే ఐ ఏ ఎస్ లు తెలిసి చేసిన తప్పులు. రాజకీయ నాయకత్వం తమను తాప్పుదోవ పట్టించిందని చెప్పుకొస్తున్న ఈ అధికారుల సంఘం ఇప్పుడు ఏం చేస్తోంది? మళ్ళీ అదే రాజకీయ నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి ని కలిసి విచారణలో జోక్యం చేసుకోమని కోరుతోంది. ఈ ఒత్తిడి ఢిల్లీ పెద్దలవరకు పాకిందని తెలుస్తోంది. తమను విచారణ పరిధినుంచి తప్పించక పొతే అందరి బాగోతాలు బయట పెడతామని హెచ్చరిస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే నేరస్తులకు సహకరించి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన దానికంటే ఇదే పెద్ద నేరం అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి