శుక్రవారం, జనవరి 06, 2012

మనుషులా? మృగాలా!?



ఆంధ్రవూపదేశ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత సౌమ్యుడుగా కనిపిస్తారో అంతటి రాజకీయ చతురుడు. ప్రజల ఒత్తిడో, తెలంగాణ సాధన లక్ష్యమో లేక ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న తపనో తెలియదు గానీ తెలంగాణ శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా ఒకటికి రెండుసార్లు రాజీనామాలు చేసి నా వాటిని ఆమోదించకుండా తన విచక్షణను ఉపయోగించి రాజ్యాంగ సంక్షోభం రాకుండా చేయగలిగాడు. ప్రజల ఒత్తిడికి లొంగి, భావోద్వేగాల తో చేసిన రాజీనామాలు చెల్లవంటూ తీర్పు చెప్పారు. మూకుమ్మడిగా చేసే రాజీనామాలు ఆమోదించడం కుదరదని కూడా కుండబద్దలు కొట్టారు. అదే మహా భాగ్యమని మన శాసనసభ్యులంతా ఆయన చతురతకు ముగ్దులై ధన్యవాదాలు చెప్పుకున్నారు. ప్రజలు కూడా తమకు రాజీనామాలు కోరే హక్కు ఉండదేమోనన్న సంశయంలో పడిపోయారు.

ప్రజాస్వామ్య మూల సూత్రం అదేనని, రాజ్యాంగం ప్రజలకు హక్కు ఇచ్చిందని ఎవరైనా వాదనకు దిగి ప్రజావూపతినిధులను రాజీనామాలకు ఒప్పించినా, రాజీనామాలను ఆమోదించాల్సిన పనిలేదని వారు తేల్చేశారు. నూతన ప్రజాస్వా మ్య సూత్రాన్ని 2009 డిసెంబర్లో స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్డ్డి గారు కనిపెట్టలేకపోయారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రాత్రి ఇంకా తెల్లారక ముందే ఆయన అందరి రాజీనామాలు తీసుకున్నారు. అంతేకాదు అదేరోజు శాసనసభ్యులను పిలిపించుకుని వారి వాదన విన్నారు. వెంటనే సమాచారం ఢిల్లీ కి చేరవేశారు. ఇంకేముంది సీమాంధ్ర శాసనసభ్యులు తెలంగాణ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల భావోద్వేగాలకు లోనయ్యి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే మాట మార్చింది. అదే పని తెలంగాణ వాళ్ళు చేస్తే చెల్లకుండా ఎలాపోతుం ది?.

  రాజీనామాలయితే ఒక ప్రక్రియను అడ్డుకోవడానికి పనికి వచ్చాయో అవే రాజీనామాలు అదే ప్రక్రియను కొనసాగించడానికి ఎందుకు పనికి రాకుండా పోయా యి? స్పీకర్ సభా సంప్రదాయాల పరంపరను పాటించి వుంటే యిప్పటికి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తేలిపోయేది కదా? ఇలాంటి ప్రశ్నలు రాజ్యాంగ నిపుణులు అడిగినా సమాధానం చెప్పవలసిన అవసరం బహుశా స్పీకర్కు లేదేమో! కానీ సిడాం దురుపతి భాయి అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పవలసిన బాధ్యత మాత్రం కచ్చితంగా నాదెండ్ల మనోహర్కు ఉన్నది. ఆంధ్రవూపదేశ్ శాసనసభ వన్యమృగ, పర్యావరణ కమిటీ చైర్మన్గా నాదెండ్ల మనోహర్ఆదిలాబాద్ జిల్లా లో గోండుల గుండెకాయ లాంటి జన్నారం ప్రాంతంలోని 90 చదరపు కిలోమీటర్ల అడవిని జాతీయ పులుల సంరక్షణ సంస్థకు రాసిచ్చారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే ఆయన ప్రాంతాన్ని సందర్శించి జూన్ నెలాఖరులో ప్రతిపాదనను ఢిల్లీ కి పంపారు. ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆగష్టు నెలలో ఆమోదముద్ర వేసింది.

పాలకులు ప్రజల మనోభావాలను పట్టించుకోకూదడనే సూత్రాన్ని ఆయన టైగర్ జోన్ విషయంలో కూడా పాటిస్తున్నట్టున్నారు. 41 గ్రామాల ప్రజలు మేం మా ఊరిని, అడవిని విడిచి బతకలేం అని మొత్తుకుంటు న్నా ఇప్పటికీ కనీసం గ్రామసభలు కూడా పెట్టకుండా, అక్కడి ఆదివాసుల మనోభావాలు తెలుసుకోకుండా వాళ్ళను తమ తల్లివేరు నుంచి వేరుచేసే పనిచేస్తున్నారు. ‘మాకు అంగీకారం లేకుండా తరతరాలుగా నివసిస్తోన్న మమ్మల్ని అడవి నుంచి తరిమేసే అధికారం సర్కారుకు ఎవరిచ్చారనిదురుపతి భాయి ప్రశ్నిస్తున్నారు. ఆమెకు ఆయన సభాహక్కుల నోటీసు ఇవ్వలేరు. ఎందుకంటే ఆమె ఇప్పుడు తనకున్న హక్కులను గురించి అడుగుతున్నారు. అసెంబ్లీ కమిటీకి చైర్మన్ గా ఆయన తమకు మరణశాసనం రాయడం తగదని వేడుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ప్రశ్నతోనే వాళ్ళ తాతల కాలంలో కొమురం భీమ్ నిజాం సర్కార్ మీద తిరుగుబాటు చేశా రు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ చర్యతో గోండులు ఉద్యమ బాటపట్టారు.

ఆదిలాబాద్లో పులుల పెంపక కేంద్రం పేరుతో ప్రభుత్వం ప్రజలను భయవూబాంతులను చేస్తున్న నేపథ్యంలో అక్కడి ఆదివాసుల మనోభావాలు తెలుసుకునే ఉద్దేశ్యంతో నేను మిత్రులు పిట్టల రవీందర్, శ్రీధర్ దేశ్పాండే కలిసి అలీ నగర్, దొంగపల్లి గ్రామాలకు వెళ్ళాం. మాకు జన్నారం మండలం అలిపూర్లో ఉండే దురుపతిభాయి తారసపడింది. ఆమె అడవిలోనే పుట్టింది. అడవినే కన్నతల్లిగా కాపాడుకుంటున్నది. అదే అడవిని నమ్ముకుని తమ కుటుంబానికి ఉన్న నాలుగెకరాలను సాగుచేసుకుని ఒకరికి చేయి సాచకుండా బతుకుతున్నారు. ఆమెకు అడవే ఒక అందమైన లోకం. ఇప్పు డు లోకంలో పులుల పేరుతో పాలకులు అలజడి రేపుతున్నారు. మా వెంట ఉన్న టీవీ కెమెరాలు, స్థానిక రిపోర్టర్లను చూసి మమ్మల్ని కూడా సర్కారోల్లు అనుకుని దురుపతి భాయి తన వాదన మొదలు పెట్టింది.

అడివి మాది, అడివి పుట్టినప్పటి నుంచి మేమూ అడివిలో ఉన్న సమస్త జీవరాశులు కలిసే బతుకుతున్నాం. మమ్మల్ని ఇప్పుడు ఎందుకు వేరుచేస్తున్నారని నిలదీసింది. మీరు వెళ్ళిపోతే యిక్కడ పులులను పెంచుతారట అంటే యే! మేం అడివిలో ఉంటే పులులు పెరుగవా? ఇంతకాలం అవీ మాతోపాటు బతకలేదా అని అని ఎదురు ప్రశ్న వేసింది? టైగర్ జోన్ ఏర్పాటయితే ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే భావన అక్కడి గిరిజనేతరుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా జన్నారం, ఉట్నూర్ ప్రాంతాల్లోని వ్యాపారులు, చదువుకున్న గిరిజనేతర యువకులు టూరిజం పెరుగుతుందని, వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయనే ప్రచారం చేస్తున్నారు. అటవీ అధికారులు అక్కడి ప్రజల్లో అటువంటి భ్రమలు ప్రచారం చేస్తున్నారు. ఆదివాసులు మాత్రం అదేమీ నమ్మడం లేదు సరికదా అడవినుంచి కదిలే ప్రశ్నేలేదని అంటున్నారు.

స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తమ వూరికి వచ్చి ఒక్కొక్క కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడని, తమ పిల్లలకు పోలీసు ఉద్యోగం ఇస్తామన్నాడని ఉద్యోగమేదో ఇక్కడే ఉంటే ఎందుకివ్వరని దురుపతి భాయి ప్రశ్నిస్తోంది.  మా వూరికి పక్కా రోడ్డు లేదు, బడి లేదు, కనీసం మంచినీళ్ళు లేవు. మా అడివి, వూరు, భూమి, జీవితం వదిలేసుకున్నాక డబ్బులతో ఏం చెయ్యమంటావ్ అని ఎదురు ప్రశ్న వేసింది. అయినా మనుషులను తరిమేసి మృగాలను పెంచడం అభివృద్ధి ఎలా అవుతుందని అడిగింది.

మన దేశంలో పులుల కోసం మనుషుల్ని తరిమేసిన ప్రతిసారీ ఇదే పాలకులకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. ఇలాంటి ఉద్యమాలే వచ్చాయి. కొన్ని జోన్లలో ఇప్పటికీ పులులూ ఆదివాసులు కలిసే జీవిస్తున్నారు. అయినా పులుల్ని పెంచి ఏం చేస్తారు? దాన్నొక సంపన్నుల విహార కేంద్రంగా మార్చివేస్తారు. ఇదొక్కటే కాదని దానికి ఇంకా పర్యావరణ పరమైన లాభాలున్నాయని చెప్పేవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు పాలకులు డబ్బుమాయలో ఉన్నా రు. మనుషుల్ని అడవులనుంచి తరిమేసి పులులను పెంచితే ప్రపంచ వన్యమృగ నిధి నుంచి డబ్బులొస్తాయి. పెట్టుబడిదారీ దేశాల మృగయా వినోదం కోసం ఏర్పడ్డ సంస్థ కోటానుకోట్ల రూపాయల పెట్టుబడితో వన్యమృగ, పర్యావరణ సంరక్షణ చేస్తోంది. అందులో భాగంగా పులులు పెంచే ప్రభుత్వాలకు డబ్బులు ఎరవేస్తోంది. డబ్బు అవసరంలేని అమెరికా, ఐరోపాలలోని దేశాలు పులులను ఎప్పుడో పలహారంచేసి నమిలి మింగేశాయి. అక్క డి సంపన్నులు ఇప్పుడు మిగిలి పోయిన వాటిని పెంపుడు కుక్కలకంటే హీనంగా మార్చి దొడ్లల్లో కట్టేసుకుంటున్నారు.

ఇప్పుడు అవే దేశాలు ఆసియాలో మాత్రమే మిగిలి ఉన్న పులులను కాపాడాలంటూ గోల చేస్తున్నా యి. అలా చేస్తేనే చెట్లు మొలిచి అడవులు ఎదుగుతాయని, పచ్చదనం నిలబడుతుందని, వానలు కురుస్తాయని, ఎండలు తగ్గుతాయని అంటున్నారు. కానీ చాలా మంది మానవశాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు అడవి అంటే కేవ లం చెట్లు,పుట్టల పర్యావరణము మాత్రమే కాదని, ఆదిమ తెగలతో పాటు సమస్త జీవావరణం కలిపే అడవి అని అంటున్నారు. అయినా అది మన పాలకుల చెవికి చేరక విచ్చలవిడిగా అడవుల ఆక్రమణ, ఆదివాసుల తరిమివేతతో పాటు కొట్లు వెచ్చించి అభయారణ్యాలు, పులుల విడిది కేంద్రా లు మొదలైన వాటికోసం ప్రత్యేక సంరక్షణ మండలాలు ఏర్పాటు చేస్తున్నారు.

దీనికోసం 2006లో వన్యవూపాణి సంరక్షణ చట్టం పేరుతో ఒక ప్రత్యేక చట్టాన్ని తేవడంతో పాటు ఇప్పటికి ఆదిలాబాద్ కలిపి 42 పులుల సంరక్షణ మండలాలు ఏర్పాటు చేశారు. మానవాభివృద్ధిలో ప్రపంచంలోనే 17 దేశాల్లో 134 స్థానంలో ఉన్న భారతదేశం పులుల జనాభా విషయంలో మాత్రం మూడవ స్థానంతో అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది. పరిస్థితుల్లో ఇప్పుడు పులుల కోసం మనుషుల్ని తరిమేసే ప్రణాళికలు, ప్రత్యేక చర్యల వెనుక అసలు కారణం అపరిమితమైన నిధులు. నిధులతోనే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలను అడవుల నుంచి పంపించివేసే పనికి పూనుకుంటున్నారు. 2005 టాస్క్ఫోర్సు నివేదిక ప్రకారం ఒక్కొక్క కుటుంబాన్ని తరలించడానికి అయ్యేఖర్చు 10 లక్షల రూపాయలుఅంటే గ్రామా లు ఖాళీ చేయించడంతో సహా సహాయం, పునరావాసం అన్నీ కలిపి పది లక్షలు! కానీ ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారులు పదిలక్షలు పరిహారం కింద అందిస్తామని ఊదరకొడుతున్నారు

పులులకూ, తమకూ పేచీ లేదన్నది ఆదివాసుల వాదన. పైగా పులి వాళ్లకు ప్రాణవూపదం. గోండు జాతి మూలపుటమ్మ జంగుభాయికి పులి వాహనం. ఆమె పరమశివుణ్ణి ఎదిరించి తమను శాప విముక్తుల్ని చేసి గుహల్లో నుంచి బయటకు తెచ్చిన వీరనారి అని వారి నమ్మకం. ఆమె వల్లే బతికి బట్టకట్టిన గోండులు ఆమెను వాళ్ళ తల్లిగా పూజిస్తారు. తల్లి వాహనమైన పులినీ ప్రేమతో ఆదరిస్తారు. ఇప్పుడు పులికే బలికావడం వాళ్లకు మింగుడు పడని విషయం. ‘పులులు పుట్టినప్పటి నుంచి అవీ మేం కలిసే ఉంటున్నాం. నా జీవితంలో ఎన్నో పులుల్ని చూశాను. మేం రమ్మంటే వచ్చే వి. పొమ్మంటే పోయేవి. వాటికి మేమెప్పుడూ అపకారం చెయ్యలేదు. అవికూడా మాకు ముప్పని ఎప్పుడూ అనుకోలేదు అని తమకూ పులికీ ఉన్న బంధాన్ని వివరించాడు దొంగపల్లికి చెందిన డ్బ్భై ఏళ్ల పట్టపు లస్మయ్య. దొంగపల్లి గ్రామంలో అంతా నాయకపోడ్ తెగకు చెందిన వాళ్ళే. వెదురు బుట్టలల్లి బతుకులు వెళ్ళదీసుకునే జాతులున్న గ్రామం కూడా ఇప్పుడు పులి జూదంలో చిక్కుకుంది.

ఆదిలాబాద్ ఆదివాసులకు మరీ ముఖ్యంగా గోండులకు పర్యావరణ ప్రేమికులనే పేరుంది. అలా ఉండబట్టే జిల్లా ఇప్పటికీ పచ్చగా ఉంది. సింగరేణి గనుల పేరుతో, పరిక్షిశమల పేరుతో, అధికార పార్టీల నేతల కలప స్మగ్లింగ్ లేకపోతే అడవి ఉంటే అందులో పొరుక సార్లు (నక్షలైట్లు) ఉంటారన్న భయంతో ప్రభుత్వమే అడవిని మేసేసింది తప్ప అడవి బిడ్డలైన గోండులు, కోలాములు, నాయకపోడ్లు అక్కడ పుల్లకూడా ముట్టరు. వాళ్ళు ఇతర సంచార గిరిజన జాతుల లాగా అడవులను నరుక రు. అడవి మృగాలను చంపరు. మేం పులులను మా కాపలా కుక్కని అనుకుంటామని వివరించాడు లస్మయ్య. కుక్కలను పెంచుకోవడం కోసం మనుషులను గ్రామాలు ఖాళీ చేయమని అడుగుతారా? అన్న ప్రశ్న ఆయన మాటల్లో ధ్వనించింది.

డబ్బులు ఖర్చుచేయడమే అభివృద్ధి అని భావించే మన దేశంలో ఆదివాసుల్ని బలి తీసుకోవడం కొత్తకాదు. దేశంలో విధ్వంసకర అభివృద్ధి వల్ల నిర్వాసితులో, నిరాక్షిశయులో అయిన వారిలో అరవై శాతం ఆదివాసు లే కావడం కలవరం కలిగించే విషయం. జనాభాలో ఆరు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ఉన్న ఆదివాసుల్లో ఇప్పటికే అరవైశాతం మంది నిరాక్షిశయులైపోతే ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరింత విధ్వంస పూరితంగా ఉన్నది. గడిచిన పదేళ్ళలో విధ్వంస పూరిత అభివృద్ధి వల్ల దేశంలోనే అరుదైన ఆదివాసీ తెగలు అంతరిస్తున్నాయి. చెంచు, కోయ జాతులు దేశంలో తొలి నాగరికతలకు పునాదులు వేసినవి. ఇప్పుడు పోలవరంవల్ల ఖమ్మం జిల్లా కోయ జాతి, వజ్రాలు ఇతర ఖనిజాలా తవ్వకం పేరుతో మహబూబ్ నగర్ నల్లమల చెంచు తెగ అంతరిస్తోంది. ఇప్పుడు మిగిలి వున్న ఒకే ఒక ఆదిమ జాతి గోండులు. ఇప్పుడు పాలక వర్గాల పులిపంజా గోండు జాతి మీద పడింది.

అవును..! మనుషులు అంతరించవచ్చు, తెగలు తరిగిపోవచ్చు, జాతు లు మాయమైపోవచ్చు కానీ మృగాలు మాత్రం బతకాలని అంటున్నారు. అదేం చిత్రమో కానీ ఇప్పుడు మనుషులను ద్వేషించే వాళ్ళే జీవ కారుణ్య వాదులై పోతున్నారు. మానవ హక్కులకు విలువ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు జంతువుల హక్కుల గురించి ఉద్యమిస్తున్నారు. సాటి మనిషిని ఇంకా జంతువుకంటే హీనంగా చూసే సాంప్రదాయ విలువలున్న దేశం మనది. తన అధికారానికి విలువ ఇవ్వలేదనో, తన అహంకారానికి తలొగ్గలేదనో కట్టుకున్న భార్యలతో సహా రోజుకు వేలాదిమందిని చంపేస్తున్న మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గోవునుంచి మొదలుకుని పులిదాకా అన్నీ పూజనీయమే! ఇక్కడ ఒక్క బలహీనుడి ప్రాణానికే విలువలేదు.

ఆదిలాబాద్ ఆదివాసులు అడవి దాటి బయటికొస్తే పులులకంటే ప్రమాదకరమైన మృగాలున్నాయని అర్థం చేసుకున్నారు. అందుకే తమ ప్రాణాలు పోయినా సరే అడవిలోనే, పులులతోనే సహజీవనం కొనసాగిస్తామని అంటున్నారు. గోండులు కేవలం ఆదివాసులే కాదు. మన ఆది రాజు లు. ఆదిలాబాద్ను పరిపాలించిన రాజులు. రాజ్ గోండ్ నాయకుడు రాంజీ గోండ్ మొదలు వందలాది మంది గోండ్ వీరులు మనల్ని కాపాడడానికో, విముక్తం చేయడానికో పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు నడిపారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వాళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలి. వాళ్ళను, వాళ్ళు అన్యాక్షికాంతం కాకుండా ఆపుతున్న అడవినీ కాపాడుకోవాలి. కేవలం పులులనే కాదు. సాటి మనుషులను కాపాడుకోవడం కూడా మన సామాజిక బాధ్యత!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి