మంగళవారం, ఆగస్టు 16, 2011

తెలంగాణకు ఇంక తెల్లారనే లేదు..!


భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఏడాది కూడా దేశం యావత్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో జెండావందనం చేసింది. పంద్రాగస్టు మనకొక పండగైపోవడానికి ప్రధా కారణం మన దేశం వలసపాలన నుంచి విముక్తిపొందడం. మనల్ని మనం పరిపాలించుకునే స్వేచ్ఛ, మన బతుకుల్ని మనం తీర్చిదిద్దుకోగలిగే అవకాశం, స్వాతంత్య్రానికి అర్థం నిర్వచనం కూడా అదే. ఏదైనా ఒక జాతి, దేశం, ప్రాదేశిక భూభాగానికి చెందిన ప్రజలు స్వపరిపాలనను, సార్వభౌమాధికారాన్ని కలిగి వుండడమే స్వాతంత్య్రం. కానీ దేశంలో ఇంకా అధికభాగం ప్రజలు తమని తాము పరిపాలించుకుని తమ జీవితాలను మెరుగుపరచుకునే దశకు చేరుకోలేదు. అరవై నాలుగేళ్లలో దేశంలోని అనేక జాతులు, తెగలు స్వాతంత్య్రం కోసం పరితపిస్తూనే ఉన్నాయి.


దేశంలోని అనేక ప్రాంతా లు ఇంకా తాము వలసపాలనలో ఉన్నామనే భావిస్తున్నాయి. అదే రకమైన దోపిడీ, పీడన నుంచి విముక్తికోసం ఆరు దశాబ్దాలలో అనేక ఉద్యమాలు సాగాయి. కొన్ని విజయం సాధిస్తే, అనేకం అణచివేతకు గురైనాయి. అయినా ప్రజల్లో ఇంకా దేశం పట్ల ప్రేమ చావలేదు. దేశ సార్వభౌమాధికారం పట్ల విశ్వాసం సడలలేదు. అందుకే స్వాతంత్య్ర దినమంటే ప్రజల్లో యెనలేని గౌరవం. ఇందుకు కారణం దేశం బాగుపడిందని, తమ బతుకులు మారిపోయాయని కాదు. మన దేశానికి బహుశా పోరాటం లేకున్నా స్వాతంత్య్రం వచ్చేదే.

ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధం తరువాత ఐరోపా సామ్రాజ్యవాదం కుప్పకూలి వలసవాద పాలన ప్రపంచవ్యాప్తంగా అంతమయింది. బ్రిటన్ తనంతట తానుగా అన్ని దేశాల నుంచీ విరమించుకుంది. నిజంగానే మన దేశాన్నుంచి విరమించుకునేదో లేదో కానీ, స్వాతంత్య్రం కోసం సాగిన ఉద్యమం స్వపరిపాలన ఆత్మగౌరవాలకు ప్రతీక. చరిత్ర నిండా దోపిడీ పాలన నుంచి భావి తరాలను విముక్తి చేయడానికి వేలాదిమంది చేసిన త్యాగాల ఫలితంగా సాధించిన విజయం కాబట్టే పంద్రాగస్టుకు గౌరవం.
పంద్రాగస్టుకు తెలంగాణకు అసలు సంబంధమే లేదు. మనకు 1947లో స్వాతంత్య్రం రాకపోయినా జెండావందనం చేయడం ఒక జాతీయ భావ వ్యక్తీకరణే తప్ప మనకు రోజున జరిగింది, ఒరిగింది ఏమీ లేదు. మరీ విచివూతంగా స్వాతంత్య్రం రావడంతో దేశమంతటా వలసపాలన అంతరిస్తే తెలంగాణలో మాత్రం నయా వలసపాలనకు బీజం పడింది.

స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి భారత సైన్యాలు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకుని, కలిపేసుకున్న ఎనిమిదేళ్లకే స్థానిక పరిపాలన అంతరించి ఆంధ్రా పాలన మొదలైంది. అప్పటిదాకా భూమిపువూతుల పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం 1956 ఆంధ్రవూపదేశ్ అవతరణతో పరాయిపాలనలోకి వెళ్లింది. తెలంగాణలో వలస పాలన అంతం కావాలని ఇక్కడి ప్రజలు నాటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు తమకు సంబంధం లేకపోయినా జాతీయస్ఫూర్తితో జెండావందనం జరుపుకుని వ్యవస్థ మీద విశ్వాసం ప్రకటిస్తే, ప్రజలకు జవాబుదారీగా లేని మంత్రులు ప్రజల ఆకాంక్షలను తోసిరాజని అధికారిక కార్యక్షికమాల్లో పాల్గొనివలసప్రభుత్వాల సేవలో పునరంకితమవుతున్నారు.

మన సంగతి అలా ఉంచుదాం. అసలు ఒక దేశంగా భారతదేశం నిజంగానే స్వాతంత్య్రం పొందిందా? ప్రజలకు స్వాతంత్య్రం వస్తే దోపిడీ పీడన ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? ఇవన్నీ సమాధానాలు దొరకని ప్రశ్న లు. మనం స్వాతంత్య్రం సాధించుకోవడంలో సఫలీకృతులం అయినాం తప్ప, స్వాతంవూత్యాన్ని అందరికీ పంచడంలో ఘోరంగా విఫలమయినాం. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా వేరువేరు పద్ధతుల్లో స్వాతంత్య్ర పోరాటాలు సాగుతున్నాయి. దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. కొందరు తమ సంపదను అది అడవి కావచ్చు, భూమి కావచ్చు. భూమి కింది వనరులు కావచ్చు దోచుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు సాగిస్తుంటే మరికొందరు ప్రజల శ్రమను, సంపదను కైంకర్యం చేసి కోట్లకు పడగపూత్తిన అవినీతిపరులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

ముఖ్యంగా దేశంలో నలు మూలలా విస్తరించిన ఆదివాసులు, పల్లెపప్లూనా వివక్షలో నలిగిపోతున్న దళితులూ, అభవూదతలో బతుకుతున్న ముస్లింలు, ఆధిపత్యంలో ఊపిరాడని మహిళలు ఇట్లా అనేక జాతు లు, తెగలు, వర్గాలు నిజమైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతూనే ఉన్నారు. లాల్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ దాకా విస్తరించి ఉన్న కొండల్లో నివసిస్తోన్న ఆదివాసుల సంగతే చూడండి. పదేళ్ల నుంచి దేశ సంపదను దోచుకుపోతోన్న విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతు న్నారు. పోరు స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తుంది. అప్పుడు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే. కానీ ఇవాళ వందలాది కంపెనీలు విస్తరించాయి. ప్రజలు ప్రాణత్యాగాలు చేసి పోరాడి తరిమేసిన విదేశీ పెట్టుబడిదారీ శక్తులను మన ప్రభుత్వాలే సాగిలపడి ఆహ్వానించి వాళ్ల అడుగులకు మడుగులొత్తుతున్నాయి.

అట్లా దేశ సంపదను విదేశీ శక్తులకు తాకట్టుపెట్టడం తప్పని చెప్పిన వాళ్లను, ఎదురు తిరిగిన వాళ్లను హింసావాదులని, దేశ ద్రోహులని కాసేపు అనుకుందాం. మరి గాంధీ మార్గంలో ఉద్యమాలు చేస్తున్న వాళ్లను మాత్రం గౌరవిస్తున్నారా? అవినీతికి వ్యతిరేకంగా గాంధీ మార్గంలో సత్యాక్షిగహానికి పూనుకున్న అన్నా హజారే పట్ల వ్యవహరిస్తోన్న పద్ధతి ప్రజాస్వామ్యానికే తలవంపు. అంతెందుకు తెలంగాణ విషయంలో పాలక వర్గాలు వ్యవహరిస్తోన్న పద్ధతి పార్లమెంటరీ వ్వవస్థకే అవమానం.

ఇంత జరుగుతోంటే మన గౌరవ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఏమంటున్నారో చూడండి.పార్లమెంటు ప్రతిష్ఠ కాపాడాలని, తెలిసిగానీ తెలియకగానీ అటువంటి రాజ్యాంగ వ్యవస్థల అధికారాలను, విశ్వసనీయతను దెబ్బతీయరాదని శ్రీమతి ప్రతిభాపాటిల్ గారు ప్రజలకు హితబోధ చేశారు. నిజానికి భారత రాజ్యాంగానికి రాష్ట్రపతి అధిపతి. అంటే దేశంలో పరిపాలన శాసనబద్ధంగా సాగుతున్నదీ లేనిది తెలుసుకోవాల్సిన వ్యక్తి. అలా సాగేలా చూడవలసిన బాధ్యత కూడా వారిదే. అలాగే పార్లమెంటు నడిచేది కూడా వారి కనుసన్నల్లోనే. మరి పార్లమెంటు విశ్వసనీయతను ఎవరు దెబ్బతీస్తున్నారో వారికి తెలియకపోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంటులో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఇరవై నెలలు దాటింది. అయినా వలస చీకటి తొలగిపోలేదు. తెలంగాణకింకా తెలవారలేదు.

స్వతంత్ర భారతదేశానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ ప్రజల స్వపరిపాలన పోరాటాలకు అంతకంటే ఎక్కువ చరిత్రే ఉంది. స్వాతంవూత్యోద్యమం ఎన్ని దశల్లో, ఎన్ని పాయలుగా జరిగిందో అంతకంటే ఎక్కువ సందర్భాల్లోనే సాగింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ పోరాటంలో ఉన్నంత సృజనాత్మక చైతన్యం, వైవిధ్యం జాతీయోద్యమంలో కూడా కనిపించదు. జాతీయోద్యమంలో ఎన్ని రోజుల పాటు సత్యాక్షిగహాలు జరిగాయో తెలియదు గానీ తెలంగాణలో బోధన్ లాంటి చిన్న పట్టణాల్లో కూడా గడచిన ఆరువందల రోజులుగా ప్రజలు నిరవధిక దీక్షల్లో ఉన్నారు. ఆరువందల పైబడి సామాన్యులు పార్లమెంటు చేస్తోన్న మోసానికి నిరసనగా ఉరికంబాలు ఎక్కారు. జాతీయోద్యమం కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది గానీ తెలంగాణ ఉద్య మం ఇవాళ పల్లెపప్లూకూ విస్తరించింది. అలాంటి ఒక మహోద్య మం అహింసాయుతంగా అప్రతిహతంగా ఇంకా కొనసాగుతున్నదంటే ఇక్కడి ప్రజలు పార్లమెంటును గౌరవించబట్టే.

దాదాపు పది సంవత్సరాల పాటు పార్లమెంటుపై విశ్వాసం ఉంచి అనేక పరీక్షలు, అవమానాలు ఎదురైనా భరించిన తెలంగాణ ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన, ఇస్తోన్న భరోసా ఏమిటో రాష్ట్రపతిగారే చెప్పాలి. ఇప్పుడు భారత రాష్ట్రపతిగా వారు హితబోధ చేయాల్సింది ప్రజలకు కాదు ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్న తన పాలక పరివారానికి. నిజానికి ప్రభుత్వాలు వాటిని ఏలుతోన్న రాజకీయ పార్టీలే పార్లమెంటు మీద ఉన్న నమ్మకాలను వమ్ము చేస్తున్నాయి. మాత్రం జవాబుదారీతనం లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. మాట మీద నిలబడాల్సిన ప్రభుత్వాలు రోజుకొక మాట చెప్పి ప్రజలను మాయ చేస్తున్నాయి. వ్యక్తులుగా నీతి, నిజాయితీ లేని వాళ్లు, అక్రమాలతో ప్రజలను దోచేసుకున్న వాళ్లు, గుత్తేదార్లు, బ్రోకరేజ్ చేసేవాళ్లు ఇవాళ శాసనకర్తలుగా అవతరించడం అన్నిటికంటే మించిన అమర్యాద అని వారు గమనించడం మంచిది.

అలాంటి వారి వల్లనే ఇవాళ డబ్బులుంటే పార్లమెంటుకు లక్షల మెజారిటీతో గెలవొచ్చని, పార్లమెంటులో ప్రశ్నలు అడిగినా, అడగకపోయినా డబ్బులు అందుతాయని, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను ఆపవచ్చని తెలిసిపోయింది. గౌరవ పార్లమెంటు ఇప్పటికే వివాదస్పదమయింది. ముందు రాష్ట్రపతిగా వారు ఒక అడుగు ముందుకేసిఅతి సర్వత్ర వర్జయేత్అన్నారు. నిజమే అవినీతి అతి అయిపోయిందనే పాపం హజారే వయసులో పార్లమెంటును నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలు, దోపిడీలు, దొమ్మీలు చేసినవాళ్లు కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని దోచేసిన వాళ్లు పార్లమెంటు లోపల ఉన్నారన్నది ఆయన వాదన.

వాళ్ల నుంచి విముక్తి కలిగినప్పుడే దేశానికి విముక్తి అని ఆయనతో పాటూ దేశ సౌభాగ్యం కోరుకుంటున్న వాళ్లు అందరూ భావిస్తున్నారు. దాన్నిఅతిఅని కొట్టిపారేయడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. అలా ప్రజలను అవహేళన చేసే తేలిక భావం పాలకవర్గాల్లో పెరిగిపోవడమే ఇవాళ రాజకీయాల్లో విలువల పతనానికి కారణం అవుతోంది. ప్రజలన్నా, వారి ఆకాంక్షలన్నా గౌరవం లేకుండాపోతోంది. అది పై నుంచి కింది దాకా అంతటా కనిపిస్తోంది.

మంగళవారం, ఆగస్టు 02, 2011

నాటి దోషి-నేటి ద్రోహులు




వర్తమానం కంటే చరిత్రే చాలా సార్లు ఘనంగా కనిపిస్తుంది. చరిత్రలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉంటాయి. అందుకే భవిష్యత్ గురించి ఆలోచించే ముందు చరిత్రలోకి చూడమంటారు. తెలంగాణ ఉద్య చరిత్ర ఎప్పటికైనా రోమాంచితమే. ఉద్యమానికైనా ఊపిరి అందించగల జీవమేదో తెలంగాణ గడ్డ మీద ఉన్నదనిపిస్తుంది. ఎన్నో ఉద్యమాలు తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాయి, పొందుతూనే ఉన్నాయి. ఇప్పుడు సాగుతోన్న రాష్ట్ర ఉద్యమం కూడా చరిత్ర నుంచి నేర్చుకున్న ఎన్నో వ్యూహాలను పరిణతితో ప్రదర్శిస్తున్నది. పరిణతికి తెలంగాణ విద్యావంతుల కృషి మరిచిపోలేనిది. తెలంగాణలో పుట్టి పెరిగి జీవితాన్ని అడుగడుగునా ఘర్షణలతో జయించిన తెలంగాణ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఇలా ఎవరైతేనేం ప్రతి ఒక్కరు చరిత్ర నుంచి ఎంతో నేర్చుకుని సంయమనంతో, చతురతతో ముందుకు నడుస్తున్నారు. అయితే నడవనిదల్లా ఒక్క కాంగ్రెస్ నేతలేమో! అది కూడా కాంగ్రెస్లోని అందరిని తప్పుపట్టడం కోసం కాదు. అలాగని తెలుగుదేశం పార్టీని క్షమించి వదిలేసినట్టు కాదు. పార్టీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో లేదు.

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లూదిన కాంగ్రెస్ ఇవాళ ఇంతగా ఎందుకు డీలా పడిపోయిందన్నది అర్థం కాని విషయం. అందరినీ ఉద్యమీకరించిన తెలంగాణ పోరాట వారసత్వం కాంగ్రెస్లోని కొందరికి ఎందుకని అబ్బలేదన్నది ఆలోచించాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమంలో దోషుల గురించి ద్రోహుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చాలా మంది చెన్నారెడ్డి నుంచి మొదలుపెడుతుంటారు. కొందరైతే అతనే మొదటి, చివరి దోషిగా చెబుతుంటారు. కానీ ఇప్పటి నాయకుల రాజకీయాలను, ఎత్తుగడలను గమనిస్తోన్న వారు ఎవరైనా చరిత్రను మరోసారి చదివితే చెన్నారెడ్డి చాలా చిన్నవాడనిపిస్తుంది. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ నాయకుల్లోనైతే ఒక్కొక్కరిలో వందమంది చెన్నారెడ్డిలు కనిపిస్తున్నారిప్పుడు. చెన్నారెడ్డి చిన్న కొడుకు శశిధర్డ్డి సంగతే చూడండి. ఆయన తండ్రికంటే నాలుగాకులు ఎక్కువగానే చదివినట్టు నిరూపించుకున్నాడు. అయినా మిగతా కొందరు నాయకులను ముఖ్యంగా మన మంత్రులను చూసినప్పుడు శశిధర్ చేసింది దోషమేమో కానీ ద్రోహం కాదని నా అభిప్రాయం.

ఎందుకంటే రాజీనామా చేశామని చెప్పిన వాళ్లు తమ పదవులను వదలిపెట్టలేదు. పనులను మానేయ్యలేదు. పైగా ముఖ్యమంత్రికి చాలా మంది చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో గుసగుసలు పెడితే, మరికొందరు పవర్ కోసం పాయింట్ల వారీగా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. పైకి రాజీనామా చేసి చేతులు దులిపేసుకున్న అందరూ పైళ్లు చకచకా చూసేస్తున్నారు. పాలన స్తంభించకుండా సహకరిస్తున్నామని బహిరంగంగానే చెప్తున్నారు. అసలు వీళ్లని రాజీనామా చేయమని అడిగింది ఎందుకు? పాలన స్తంభించాలని, సంక్షోభం రావాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, కేంద్రం తెలంగాణ ప్రక్రియ కొనసాగించాలని. అలా అడిగి అడిగి గడిచిన ఆరువందల రోజుల్లో ఆరువందల మందికి పైగా అసువులు బాసారు.

అంటే రొజుకొక్కరి చొప్పున మొక్కు చెల్లించుకున్నారు. అయినా వాళ్లు కరగలేదు సరికదా ప్రభుత్వం సంక్షోభంలో పడకుండా కాపాడుతున్నారు. చచరిత్రలో ఇలాంటి పని చెన్నారెడ్డి కూడా చేయలేదు. 1968-69లో చెన్నారెడ్డి ఉద్యమం నడిపించిన కాలంలో రాజకీయాలు ఇలా లేవు. ప్రజలు కూడా ఇలా లేరు. కేంద్రంలో ఇందిరాగాంధీ ఎదురులేని మహారాణి. అప్పటికే సంజీవరెడ్డి నుంచి అధికారం అందిపుచ్చుకున్న బ్రహ్మానందరెడ్డి యువరాజై వెలిగిపోతున్నాడు. సమయంలో ఖమ్మం జిల్లాలో పిడికెడు మంది విద్యార్థులు రాజేసిన నిప్పును చెన్నారెడ్డి ఒక జ్వాలగా రాజేశాడు. దానికి ఉద్యోగులు ఊపిరూది దావానలంలా జిల్లాలకు వ్యాపింపజేశారు. అయినా అది పల్లెలన్నిటికి చేరలేదు. ప్రజలందరినీ తాకలేదు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులు, విద్యార్థులు కదిలారు తప్ప ప్రజల్లో ఇప్పటిలా చైతన్యం లేకపోయింది. ఇప్పుడు ఉద్యమం తాకని ఊరులేదు.

తెలంగాణ కావాలని చెప్పని మనిషిలేడు. చిన్న చితకా పల్లెల్లో కూడా ఆరువందల రోజులకు పైగా నిరశన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లు కంటికి కునుకులేకుండా కోట్లాదిమంది ఉద్యమాన్ని కాపాడుకుంటున్నారు. ఉద్యమకారులను కాపాడుకుంటున్నారు. రాజీనామా చేసిన నేతలకు కాపలాకాసే వాళ్లూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నారెడ్డి లాంటి నాయకులు నాటి ఉద్యమాన్ని నిర్మించారు.

తమ వెంట నడవాలని వాళ్లు ప్రజలను వేడుకుంటున్నారు. ఇవాళ ప్రజలే ఆపని చేస్తున్నారు. ప్రజలు నాయకులను తమతో కలిసి నడవమంటున్నారు. అదీ చేతగాకపోతే కనీసం సీమాంధ్ర పాలకులకు సహకరించకుండా దూరంగా ఉండమంటున్నారు. నిజానికి అప్పుడు తెలంగాణ విషయంలో ఇక్కడి నేతల్లోనే భిన్నాభిప్రాయాలుండేవి. తెలంగాణ వద్దని వాదించిన వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీలకతీతంగా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదంటే మన నేతల బలం, బలగం ఏపాటిదో అధిష్ఠానానికి అర్థమైపోయింది.

చెన్నారెడ్డి ఇలాంటి బలహీనత ప్రదర్శించలేదు. ఉన్నంతకాలం ఒకే మాటపై ఉన్నాడు. నిరంకుశంగా అప్పటి ప్రభుత్వం సాగించిన అణచివేతలకు, హత్యాకాండలకు భయపడలేదు. ఉద్యమంలో ఉరుమై నిలిచాడు. అరెస్టయి జైలుపాలయ్యాడు. చెన్నారెడ్డి ఒక్కడే కాదు. దాదాపు నలభై మంది దాకా శాసనసభ్యులు తెలంగాణ కోసం జైలుకు వెళ్లారు. చెన్నారెడ్డితో పాటు కొండా లక్ష్మణ్బాపూజీ, అంజయ్య, ఈశ్వరీభాయి, సిహెచ్ రాజశ్వేరరావు, శివరావు షెట్కర్ లాంటి మహామహులు పీడీ యాక్ట్ కింద శిక్ష అనుభవించారు. అప్పటి నేతల వారసుల్లో చాలా మంది ఇప్పటి సభలో ఉన్నారు. కొందరు ఎంపీలు, కొందరు మంత్రులు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు. విషాదమేమిటంటే వాళ్లిప్పుడు తమ తండ్రుల చరిత్రనే తక్కువ చేస్తూ, ఇప్పుడు తాము చేసిన త్యాగం మరెవ్వరూ చేయలేదని చెప్పుకుంటున్నారు. చరిత్రలో తాము తప్ప మరెవ్వరు రాజీనామాలు చేయలేదన్నట్టుగా మంత్రులు మాట్లాడడం విడ్డూరం.

ఉద్యమంలోనే టీఆర్ఎస్ చేసిన రాజీనామాలను అలా ఉంచుదాం. బహ్మానందరెడ్డి మంత్రివర్గం నుంచి చెన్నారెడ్డి, బాపూజీ సహా తెలంగాణ మంత్రులంతా రాజీనామాలు చేసి చరిత్ర సృష్టించారు. అలా చేసిన వాళ్లు ఢిల్లీ దిగివచ్చేలా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, దేశ హోం మంత్రి, చివరకు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని హైదరాబాద్ రప్పించారు. నాటి ఉద్యమం చిన్నదే కావచ్చు. ఎన్నడూ మన శాసనసభ్యుల్లో కనీసం సగం మంది కూడా సమర్థించి ఉండకపోవచ్చు. కానీ ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించారు. ఆంధ్రా ప్రాంత శాసనసభ్యులను చివరకు ముఖ్యమంత్రిని కూడా నోరెత్తకుండా చేశారు.

అప్పటికే ఇక్కడ చేరిపోయిన వ్యాపారులు, ఉద్యోగులు చివరకు రాజకీయ నాయకులలో సగం మందిని ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయగలిగారు. అంతేకాదు శాసనసభలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిని నిలదీసి నీళ్లు తాగించిన ఘనత ఈశ్వరీబాయి లాంటి వాళ్లది. జైలు నుంచి వచ్చాక శాసనసభలో జరుగుతోన్న చర్చకు అడ్డుపడి ముఖ్యమంత్రిగారు అన్నీ బాగానే చెప్తున్నారు. తొమ్మిది నెలల్లో ఎంతమంది మా బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నావో కూడా చెప్పు. పాలపండ్లు కూడా ఊడనివాళ్లను పట్టుకున్నావ్ అని నిలదీసింది. కర్కశుడు అని పేరుతెచ్చుకున్న బ్రహ్మానందరెడ్డి ఆమె ధాటికి ఖిన్నుడైపోయాడు. నిందలు వద్దంటూనే అందుకు చాలా విచారిస్తున్నాను అనగలిగాడు. ఉద్యమంలో మూడువందల మంది బిడ్డలు చనిపోతే ముఖ్యమంత్రినే నిండు సభలో నిలువరించిన తల్లి కూతురు ఇప్పుడు మన మంత్రి గీతారెడ్డి.

ఆమె ఇప్పుడు ఆరువందల మంది ఆహుతైనా అడిగే సాహసం చేయలేకపోతున్నారు. నాటి ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన అంజయ్య సతీమణి మణెమ్మ మనలో లేరు. అలాంటి వారసులే సురేశ్ షెట్కర్. పార్లమెంటుకు వెళ్లడమే తనకు ముఖ్యమని మంకుపట్టుపడుతున్నాడు. తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ల వారసులు చాలా మందే ఉన్నా ఒక్కరంటే ఒక్కరికైనా వాసన వారసత్వంగా రాకపోవడం విచిత్రం.

నాటి ఇందిరాగాంధీతో మన్మోహన్ను మాటవరసకైనా పోల్చలేము. బ్రహ్మానందరెడ్డి బలం ముందు కిరణ్కుమార్రెడ్డిని లెక్కలోకి తీసుకోలేం. తెలంగాణలోని పది మంది ఎంపీలు పక్కకు తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వమే కుప్పుకూలే పరిస్థితి. రాజీనామా చేసిన మంత్రులు రాజీ పడకపోయి ఉంటే రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడే సందర్భం. అప్పటి ఉద్యమకారులు అనేకసార్లు తిరగబడి పార్టీ నుంచి బహిష్కారానికి, అధిష్ఠానం ఛీత్కారాలకు గురై చివరకు ప్రత్యేక పార్టీలు పెట్టుకుని ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టలేక రాజీపడిపోయారు. ఇప్పుడు ప్రజా ఉద్యమం నిలబడి ఉంది. నేతలు ముఖ్యంగా నాటి నేతల వారసులే రాజీ పడిపోతున్నారు!  అదీ విషాదం!!