మంగళవారం, ఆగస్టు 02, 2011

నాటి దోషి-నేటి ద్రోహులు




వర్తమానం కంటే చరిత్రే చాలా సార్లు ఘనంగా కనిపిస్తుంది. చరిత్రలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉంటాయి. అందుకే భవిష్యత్ గురించి ఆలోచించే ముందు చరిత్రలోకి చూడమంటారు. తెలంగాణ ఉద్య చరిత్ర ఎప్పటికైనా రోమాంచితమే. ఉద్యమానికైనా ఊపిరి అందించగల జీవమేదో తెలంగాణ గడ్డ మీద ఉన్నదనిపిస్తుంది. ఎన్నో ఉద్యమాలు తెలంగాణ నుంచి స్ఫూర్తి పొందాయి, పొందుతూనే ఉన్నాయి. ఇప్పుడు సాగుతోన్న రాష్ట్ర ఉద్యమం కూడా చరిత్ర నుంచి నేర్చుకున్న ఎన్నో వ్యూహాలను పరిణతితో ప్రదర్శిస్తున్నది. పరిణతికి తెలంగాణ విద్యావంతుల కృషి మరిచిపోలేనిది. తెలంగాణలో పుట్టి పెరిగి జీవితాన్ని అడుగడుగునా ఘర్షణలతో జయించిన తెలంగాణ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఇలా ఎవరైతేనేం ప్రతి ఒక్కరు చరిత్ర నుంచి ఎంతో నేర్చుకుని సంయమనంతో, చతురతతో ముందుకు నడుస్తున్నారు. అయితే నడవనిదల్లా ఒక్క కాంగ్రెస్ నేతలేమో! అది కూడా కాంగ్రెస్లోని అందరిని తప్పుపట్టడం కోసం కాదు. అలాగని తెలుగుదేశం పార్టీని క్షమించి వదిలేసినట్టు కాదు. పార్టీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో లేదు.

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లూదిన కాంగ్రెస్ ఇవాళ ఇంతగా ఎందుకు డీలా పడిపోయిందన్నది అర్థం కాని విషయం. అందరినీ ఉద్యమీకరించిన తెలంగాణ పోరాట వారసత్వం కాంగ్రెస్లోని కొందరికి ఎందుకని అబ్బలేదన్నది ఆలోచించాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమంలో దోషుల గురించి ద్రోహుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చాలా మంది చెన్నారెడ్డి నుంచి మొదలుపెడుతుంటారు. కొందరైతే అతనే మొదటి, చివరి దోషిగా చెబుతుంటారు. కానీ ఇప్పటి నాయకుల రాజకీయాలను, ఎత్తుగడలను గమనిస్తోన్న వారు ఎవరైనా చరిత్రను మరోసారి చదివితే చెన్నారెడ్డి చాలా చిన్నవాడనిపిస్తుంది. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ నాయకుల్లోనైతే ఒక్కొక్కరిలో వందమంది చెన్నారెడ్డిలు కనిపిస్తున్నారిప్పుడు. చెన్నారెడ్డి చిన్న కొడుకు శశిధర్డ్డి సంగతే చూడండి. ఆయన తండ్రికంటే నాలుగాకులు ఎక్కువగానే చదివినట్టు నిరూపించుకున్నాడు. అయినా మిగతా కొందరు నాయకులను ముఖ్యంగా మన మంత్రులను చూసినప్పుడు శశిధర్ చేసింది దోషమేమో కానీ ద్రోహం కాదని నా అభిప్రాయం.

ఎందుకంటే రాజీనామా చేశామని చెప్పిన వాళ్లు తమ పదవులను వదలిపెట్టలేదు. పనులను మానేయ్యలేదు. పైగా ముఖ్యమంత్రికి చాలా మంది చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో గుసగుసలు పెడితే, మరికొందరు పవర్ కోసం పాయింట్ల వారీగా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. పైకి రాజీనామా చేసి చేతులు దులిపేసుకున్న అందరూ పైళ్లు చకచకా చూసేస్తున్నారు. పాలన స్తంభించకుండా సహకరిస్తున్నామని బహిరంగంగానే చెప్తున్నారు. అసలు వీళ్లని రాజీనామా చేయమని అడిగింది ఎందుకు? పాలన స్తంభించాలని, సంక్షోభం రావాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, కేంద్రం తెలంగాణ ప్రక్రియ కొనసాగించాలని. అలా అడిగి అడిగి గడిచిన ఆరువందల రోజుల్లో ఆరువందల మందికి పైగా అసువులు బాసారు.

అంటే రొజుకొక్కరి చొప్పున మొక్కు చెల్లించుకున్నారు. అయినా వాళ్లు కరగలేదు సరికదా ప్రభుత్వం సంక్షోభంలో పడకుండా కాపాడుతున్నారు. చచరిత్రలో ఇలాంటి పని చెన్నారెడ్డి కూడా చేయలేదు. 1968-69లో చెన్నారెడ్డి ఉద్యమం నడిపించిన కాలంలో రాజకీయాలు ఇలా లేవు. ప్రజలు కూడా ఇలా లేరు. కేంద్రంలో ఇందిరాగాంధీ ఎదురులేని మహారాణి. అప్పటికే సంజీవరెడ్డి నుంచి అధికారం అందిపుచ్చుకున్న బ్రహ్మానందరెడ్డి యువరాజై వెలిగిపోతున్నాడు. సమయంలో ఖమ్మం జిల్లాలో పిడికెడు మంది విద్యార్థులు రాజేసిన నిప్పును చెన్నారెడ్డి ఒక జ్వాలగా రాజేశాడు. దానికి ఉద్యోగులు ఊపిరూది దావానలంలా జిల్లాలకు వ్యాపింపజేశారు. అయినా అది పల్లెలన్నిటికి చేరలేదు. ప్రజలందరినీ తాకలేదు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులు, విద్యార్థులు కదిలారు తప్ప ప్రజల్లో ఇప్పటిలా చైతన్యం లేకపోయింది. ఇప్పుడు ఉద్యమం తాకని ఊరులేదు.

తెలంగాణ కావాలని చెప్పని మనిషిలేడు. చిన్న చితకా పల్లెల్లో కూడా ఆరువందల రోజులకు పైగా నిరశన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లు కంటికి కునుకులేకుండా కోట్లాదిమంది ఉద్యమాన్ని కాపాడుకుంటున్నారు. ఉద్యమకారులను కాపాడుకుంటున్నారు. రాజీనామా చేసిన నేతలకు కాపలాకాసే వాళ్లూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నారెడ్డి లాంటి నాయకులు నాటి ఉద్యమాన్ని నిర్మించారు.

తమ వెంట నడవాలని వాళ్లు ప్రజలను వేడుకుంటున్నారు. ఇవాళ ప్రజలే ఆపని చేస్తున్నారు. ప్రజలు నాయకులను తమతో కలిసి నడవమంటున్నారు. అదీ చేతగాకపోతే కనీసం సీమాంధ్ర పాలకులకు సహకరించకుండా దూరంగా ఉండమంటున్నారు. నిజానికి అప్పుడు తెలంగాణ విషయంలో ఇక్కడి నేతల్లోనే భిన్నాభిప్రాయాలుండేవి. తెలంగాణ వద్దని వాదించిన వాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీలకతీతంగా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదంటే మన నేతల బలం, బలగం ఏపాటిదో అధిష్ఠానానికి అర్థమైపోయింది.

చెన్నారెడ్డి ఇలాంటి బలహీనత ప్రదర్శించలేదు. ఉన్నంతకాలం ఒకే మాటపై ఉన్నాడు. నిరంకుశంగా అప్పటి ప్రభుత్వం సాగించిన అణచివేతలకు, హత్యాకాండలకు భయపడలేదు. ఉద్యమంలో ఉరుమై నిలిచాడు. అరెస్టయి జైలుపాలయ్యాడు. చెన్నారెడ్డి ఒక్కడే కాదు. దాదాపు నలభై మంది దాకా శాసనసభ్యులు తెలంగాణ కోసం జైలుకు వెళ్లారు. చెన్నారెడ్డితో పాటు కొండా లక్ష్మణ్బాపూజీ, అంజయ్య, ఈశ్వరీభాయి, సిహెచ్ రాజశ్వేరరావు, శివరావు షెట్కర్ లాంటి మహామహులు పీడీ యాక్ట్ కింద శిక్ష అనుభవించారు. అప్పటి నేతల వారసుల్లో చాలా మంది ఇప్పటి సభలో ఉన్నారు. కొందరు ఎంపీలు, కొందరు మంత్రులు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు. విషాదమేమిటంటే వాళ్లిప్పుడు తమ తండ్రుల చరిత్రనే తక్కువ చేస్తూ, ఇప్పుడు తాము చేసిన త్యాగం మరెవ్వరూ చేయలేదని చెప్పుకుంటున్నారు. చరిత్రలో తాము తప్ప మరెవ్వరు రాజీనామాలు చేయలేదన్నట్టుగా మంత్రులు మాట్లాడడం విడ్డూరం.

ఉద్యమంలోనే టీఆర్ఎస్ చేసిన రాజీనామాలను అలా ఉంచుదాం. బహ్మానందరెడ్డి మంత్రివర్గం నుంచి చెన్నారెడ్డి, బాపూజీ సహా తెలంగాణ మంత్రులంతా రాజీనామాలు చేసి చరిత్ర సృష్టించారు. అలా చేసిన వాళ్లు ఢిల్లీ దిగివచ్చేలా చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, దేశ హోం మంత్రి, చివరకు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని హైదరాబాద్ రప్పించారు. నాటి ఉద్యమం చిన్నదే కావచ్చు. ఎన్నడూ మన శాసనసభ్యుల్లో కనీసం సగం మంది కూడా సమర్థించి ఉండకపోవచ్చు. కానీ ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించారు. ఆంధ్రా ప్రాంత శాసనసభ్యులను చివరకు ముఖ్యమంత్రిని కూడా నోరెత్తకుండా చేశారు.

అప్పటికే ఇక్కడ చేరిపోయిన వ్యాపారులు, ఉద్యోగులు చివరకు రాజకీయ నాయకులలో సగం మందిని ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేయగలిగారు. అంతేకాదు శాసనసభలో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిని నిలదీసి నీళ్లు తాగించిన ఘనత ఈశ్వరీబాయి లాంటి వాళ్లది. జైలు నుంచి వచ్చాక శాసనసభలో జరుగుతోన్న చర్చకు అడ్డుపడి ముఖ్యమంత్రిగారు అన్నీ బాగానే చెప్తున్నారు. తొమ్మిది నెలల్లో ఎంతమంది మా బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నావో కూడా చెప్పు. పాలపండ్లు కూడా ఊడనివాళ్లను పట్టుకున్నావ్ అని నిలదీసింది. కర్కశుడు అని పేరుతెచ్చుకున్న బ్రహ్మానందరెడ్డి ఆమె ధాటికి ఖిన్నుడైపోయాడు. నిందలు వద్దంటూనే అందుకు చాలా విచారిస్తున్నాను అనగలిగాడు. ఉద్యమంలో మూడువందల మంది బిడ్డలు చనిపోతే ముఖ్యమంత్రినే నిండు సభలో నిలువరించిన తల్లి కూతురు ఇప్పుడు మన మంత్రి గీతారెడ్డి.

ఆమె ఇప్పుడు ఆరువందల మంది ఆహుతైనా అడిగే సాహసం చేయలేకపోతున్నారు. నాటి ఉద్యమంలో అనేక త్యాగాలు చేసిన అంజయ్య సతీమణి మణెమ్మ మనలో లేరు. అలాంటి వారసులే సురేశ్ షెట్కర్. పార్లమెంటుకు వెళ్లడమే తనకు ముఖ్యమని మంకుపట్టుపడుతున్నాడు. తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ల వారసులు చాలా మందే ఉన్నా ఒక్కరంటే ఒక్కరికైనా వాసన వారసత్వంగా రాకపోవడం విచిత్రం.

నాటి ఇందిరాగాంధీతో మన్మోహన్ను మాటవరసకైనా పోల్చలేము. బ్రహ్మానందరెడ్డి బలం ముందు కిరణ్కుమార్రెడ్డిని లెక్కలోకి తీసుకోలేం. తెలంగాణలోని పది మంది ఎంపీలు పక్కకు తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వమే కుప్పుకూలే పరిస్థితి. రాజీనామా చేసిన మంత్రులు రాజీ పడకపోయి ఉంటే రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడే సందర్భం. అప్పటి ఉద్యమకారులు అనేకసార్లు తిరగబడి పార్టీ నుంచి బహిష్కారానికి, అధిష్ఠానం ఛీత్కారాలకు గురై చివరకు ప్రత్యేక పార్టీలు పెట్టుకుని ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టలేక రాజీపడిపోయారు. ఇప్పుడు ప్రజా ఉద్యమం నిలబడి ఉంది. నేతలు ముఖ్యంగా నాటి నేతల వారసులే రాజీ పడిపోతున్నారు!  అదీ విషాదం!!

1 కామెంట్‌:

  1. Idantha telipinaa veellaku cheema kuttinattu kooda anipinchadu...meerannattu appati peddala tyaagapu bathukulaku johaar kanee aa vaasanlu ee taraalaku abbakapovadam entho vichaarakaram inka alaanti vaarinin ennukoni baadhapadadam kooda duradrishtam. Sympathyla meeda seat sampaadinchukunnawaallani, vaarasatwaala meeda raajyameluthunnawaallani choosthunte jaali kalugutundi..! Vimukthi eppuda anipisthundi!

    రిప్లయితొలగించండి