శనివారం, జనవరి 11, 2014

చర్చ జరగాల్సిందే!



నువ్వు చెప్పే విషయాన్ని నేను అంగీకరించకపోవచ్చు,
కానీ చెప్పడానికి నీకున్న హక్కును మాత్రం నా ప్రాణం పోయేవరకు కాపాడతాను -  అంటాడు ఒక మహానుభావుడు.

మనిషికైనా మనసులో ఉన్న మాట చెప్పడానికి స్వేచ్ఛ ఉంటుందని, అది అంగీకారయోగ్యం కాకపోయినా, అభ్యంతరకరమైనా సరే చెప్పడానికి మనిషికి ఉన్న స్వేచ్ఛను కాలరాయకూడదని దీని అర్థం. కానీ ఇప్పుడు అలాంటి మహానుభావులు ఎవరూ మిగిలి ఉన్నట్టులేరు. ఇప్పుడు చాలామంది చెప్పాల్సిన అవసరం లేనేలేదని అంటున్నారు. కొందరు అడిగినా అభిప్రాయాలు చెప్పడానికి నిరాకరిస్తుంటే మరికొందరు మాత్రం చెప్పే స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా జరుగుతున్న తతంగం అంతా ఇదే  సూత్రం మీద నడుస్తున్నది. ఆలస్యంగానైనా సరే శాసనసభ తెలంగాణ బిల్లును చర్చకు చేపట్టింది. సభలో చర్చ జరిగినా జరగకపోయినా తెలంగాణకు నష్టం ఏమీ లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవాల్సింది దానిపై చర్చ జరగాల్సింది పార్లమెంటులో. అదొక పార్లమెంటరీ ప్రక్రియ. కేంద్రంలో ఉన్న అధికార కూటమి, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ రెండూ అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి అది ఫిబ్రవరితో పూర్తవుతుంది. మార్చ్ నాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందన్న విశ్వాసం ప్రాంత ప్రజల్లో ఉంది. మార్చ్ నాటికి రాకపోయినా ఎవరూ పెద్దగా దిగులు చెందనక్కరలేదు. ఎందుకంటే తరువాత రెండే రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వంకర టింకర మాటలు మాట్లాడిన వాళ్ళంతా మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తారు. ఇక వాళ్లను నమ్మించడానికి వేరే కొత్త హామీలేవీ ఉండవు. అందుకే తెలంగాణలో నూకలు చెల్లాయన్న నిర్ధారణకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ లాంటివి మినహా ఇప్పుడు ఒక్కరూ వ్యతిరేకించరు. వ్యతిరేకిస్తే తెలంగాణలో అడుగుపెట్టలేరని వాళ్లకు తెలుసు. ఇప్పుడు నాటకమంతా కేవలం ఆంధ్రా ప్రేక్షకులను రంజింపజేయడానికి తప్ప దేనికీ పనికిరాదు నాటకం గమనించే కిరణ్కుమార్ రెడ్డి ఇప్పుడు చర్చ జరగాలని అంటున్నాడు. ఇక క్లైమాక్స్లో నాటకాన్ని రక్తికట్టించి కథా నాయుకుడిగా మిగిలిపోవాలని కలలుగంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అదే కలలో ఉన్నాడు. వీళ్ళిద్దరి లక్ష్యం వీలయితే విడివిడిగా, కాదంటే కలివిడిగా జగన్ ఎజెండాను దెబ్బకొట్టడం. సంగతి తెలిసే జగన్ చర్చ మొదలుపెట్టకుండానే సమైక్యాంధ్ర తీర్మానంచేసి పార్లమెంటుకు పంపాలని పట్టుబడుతున్నాడు. బయటకు అందరూ విభజన వద్దనే అంటున్నా విభజన జరగకపోతే తమ మనుగడకే ముప్పు అని అందరికీ తెలుసు. విభజన జరిగితేనే తమకు అంతే ఇంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఇంతగా వేధించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మొఖం చెల్లదని కూడా వాళ్ళకు తెలుసు

చట్టసభల సంగతి, సీమాంధ్ర పార్టీల, ప్రతినిధుల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలు మాత్రం చర్చను కోరుకుంటున్నారు. చర్చ జరగడం ద్వారానే భావప్రసారం జరుగుతుందని, తద్వారా సమస్య ఎలాంటిదైనా పరిష్కరించుకోవడం సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజల విశ్వాసం విశ్వాసపూరిత పట్టుదలే ఇవాళ తెలంగాణ ప్రక్రియను చట్టసభల దాకా తీసుకొచ్చింది. చర్చే రేపో, మాపో తెలంగాణ కలను సాకారం చేస్తుంది. నిజంగానే తెలంగాణ వస్తే ఇక చర్చలతో పని ఉండదా? తెలంగాణ ఏర్పడగానే చెట్టుమీది కాయ దించినట్టు సమస్యలన్నీమాయమైపోతాయా? అవునని ఎవరైనా అంటే అది మభ్యపెట్టి మోసపుచ్చడమే అవుతుంది. ఇప్పుడు చట్టసభల్లో చర్చ జరుగుతున్నది కేవలం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ను విభజించడం కోసమే. చర్చ ఫలవంతమై పార్లమెంటు బిల్లును ఆమోదిస్తే భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. తెలంగాణకు సంబంధించి అసలు చర్చ అప్పుడు మొదలవుతుంది. కొత్త రాష్ట్ర  ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలు  ఎలా ఉండబోతాయి, పునాదుల మీద నవ తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అన్న చర్చ కీలకం కాబోతుంది. ఇప్పటికే కేసీఆర్ తనదైన శైలిలో ఒక పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకటించి వున్నారు. ప్రణాళికలో కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు, ఇంకొందరు ప్రత్యామ్నాయం చూపించవచ్చు. మరికొందరు అసలు దాన్ని తాము ఒప్పుకోమనే అనవచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఎవరనేది ఇప్పుడే తెలియదు. కాబట్టి పాలకవర్గాల ఎజెండా కాసేపు పక్కన పెడదాం. పైగా తెలంగాణ సాధన విషయంలో కుదిరిన ఏకాభిప్రాయం పునర్నిర్మాణం విషయంలో కుదరకపోవచ్చు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఇప్పటికే ప్రజాస్వామిక తెలంగాణ అలాగే సామాజిక తెలంగాణ మీద లోతైన చర్చే జరిగి వుంది. చర్చలు ఇప్పుడు మళ్ళీ ప్రధానం కానున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం మొదలవ్వాల్సిన మొదటి చర్చ కూడా అదే. అయితే అది పాలకవర్గాల సమస్య కాదు, ముమ్మాటికి అది ప్రజలుప్రజాసంఘాలు, ఉద్యమకారులు, మేధావుల బాధ్యత. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి జవసత్వాలు ఇచ్చింది వాళ్ళే కాబట్టి. తెలంగాణ రాష్ట్ర సమితి మొదలు ఇంతకాలం ప్రజలతో మమేకమై ఉద్యమించిన రాజకీయపార్టీలు రేపు ఎలాగో పాలక వర్గాలుగా మారతాయి, అటువంటప్పుడు ప్రజలు, ప్రత్యామ్నాయ వేదికలు చర్చను బలంగా ముందుకు తేవాల్సిన అవసరం ఉంటుంది

బాధ్యతను ముందుగా గుర్తించింది జమ్మికుంట. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు అటువంటి చరిత్ర ఉంది. అక్కడి ప్రజలు, యువత అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. తెలంగాణ తొలి ఉద్యమంతో పాటు, నక్సల్బరీ ప్రభావంతో నూతన ప్రజాస్వామ్య విప్లవంకోసం కలలుగన్న అనేకమందిని నిలబెట్టిన ఊరు జమ్మికుంట. తెలంగాణ బిల్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం పొందగానే అక్కడి యువకులు, మేధావులు సంబరాలు చేసుకోలేదు, సమాలోచన మొదలుపెట్టారు. తెలంగాణ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. వేదికలో అక్కడి డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాత్రికేయులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ బిల్లును రాజకీయ పక్షాల నుంచి పరిరక్షించుకోవడం మాత్రమే కాదు, రేపు రాబోయే తెలంగాణను ఎలా కాపాడుకోవాలో వాళ్ళు సదస్సులు ఏర్పాటుచేసి చర్చ మొదలుపెట్టారు. రేపటి తెలంగాణ ఎవరిదీ, ఎవరికీ చెందాలి అన్న కీలక ప్రశ్నను సంధిస్తున్నారు. తెలంగాణ అందరిది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళే. కానీ తెలంగాణను దోచుకున్న వాళ్ళలో కేవలం సీమాంధ్ర స్వార్థపరులే లేరు. స్వప్రయోజనాల కోసం ప్రజలను ఏమార్చే నేతలు మనదగ్గర కూడా ఉన్నారు. ఇక్కడి వనరులను అడ్డగోలుగా సొంతం చేసుకుని వాగులు, వంకలు మొదలు కొండలు గుట్టల దాకా అమ్మేసుకుంటున్న వాళ్ళు, తెలంగాణ మొత్తాన్ని గుత్తకు తీసుకున్నట్టు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్ళుకులం పేరుతో పెత్తనం చేస్తున్న వాళ్ళు ఇట్లా అనేకమంది ప్రజలతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ  రాబోయే కాలంలో కూడా రాజ్యం వీళ్ళదే. అయితే ఎలా అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. చర్చ ఇప్పుడు ప్రశ్న నుంచే మొదలవుతున్నది. తెలంగాణ పరిరక్షణ ఉద్యమం ఇప్పుడు పది జిల్లాల్లో కూడా మొదలు కావాలిఇలాంటి చర్చలకు విసుక్కుంటున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ వినే వాళ్ళూ కూడా ఉంటారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి