ముఖ్యమంత్రి
కిరణ్కుమార్ రెడ్డి తెలంగాణను ఆపేంత శక్తిమంతుడా! న్యాయంగా
అయితే ఒక రాజ్యాంగ ప్రక్రియ
కాబట్టి అడ్డుకోవడం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు.
అయినా సరే అడ్డు తగులుతున్నాడు.
అడ్డదార్లు తొక్కుతున్నాడు. అడ్డు తొలగించుకోవాలని ఆరాటపడుతున్నాడు.
యాభై ఏళ్ళకే, కనీసం మంత్రిగా పనిచేసిన
అనుభవం కూడా లేకుండానే ముఖ్యమంత్రి
కాగాలిగిన ఆయన ఇప్పుడు మరో యాభై ఏళ్లకు
రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు తెలంగాణకు,
తనకు కొత్త రాజకీయ జీవితాన్ని
ఇచ్చిన కాంగ్రెస్పార్టీకి అడ్డం తిరిగాడు. తాను
కాంగ్రెస్ అధిష్ఠాన విధేయుడిని అని, ‘అమ్మ’ దయవల్లే
ముఖ్యమంత్రిని కాగాలిగానని, పార్టీ వదిలివెళ్ళేది లేదని పదేపదే కిరణ్
చెపుతున్నారు. కానీ ఆయన దూకుడు
గమనిస్తున్నవాళ్ళు మాత్రం ఆయన సొంతంగా పార్టీ
పెట్టే యోచనలో ఉన్నాడని చెపుతున్నారు. ఆ పార్టీకి బలం
పెంచుకోవడం కోసమే ఆయన ఇప్పుడు
ధిక్కార స్వరంతో మాట్లాడుతున్నాడని ఆయనను సన్నిహితంగా గమనిస్తున్నవాళ్ళు
అంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణంచేసి, మొత్తం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు
రాజ్యాంగ నియమాలకు నీళ్ళు వదలడమే కాదు వ్యక్తిగా నైతిక
విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చాడు.
ఇప్పుడు ఆయన పార్టీ సహచరులే
చెపుతున్నట్టు ఆయనలో ఒక నియంత
కనిపిస్తున్నాడు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు విషయంలో ఆయన
వ్యవహరించిన విధానం ఆయన మానసికస్థితిని తెలియజేస్తున్నది.
ఏ విలువకు, ఏ చట్టానికి, చివరకు
ప్రజలకు కూడా జవాబుదారీగా ఉండకుండా
తన మాటే చెల్లుబాటు కావాలని
హుకుం జారీ చేసే పాలకుడిని
నియంత అనే అంటారు. తెలంగాణ
విషయంలో ఆయన ముమ్మాటికి నియంతను
మించి వ్యవహరిస్తున్నాడు. నియంతకు కూడా కొన్ని నియమాలుంటాయి.
కొద్దోగొప్పో తనకంటూ ఒక సిద్ధాంత లక్ష్యం
ఉంటుంది . ఈయనలో అలాంటివి కూడా
కనిపించడం లేదు. కేవలం తెలంగాణ
వ్యతిరేక స్వీయ మానసిక ధోరణిలో
వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు సీమాంధ్ర ప్రశాంతంగా ఉన్నది. చాలామంది ప్రజలు వారికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, మంత్రులు ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి ఏమేం కావాలో రాష్ట్రం
విడిపోయాక అక్కడికి ఎలాంటి వసతి సౌకర్యాలు తేవాలో
ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లి
కృపారాణి, పల్లంరాజు లాంటి మంత్రులు తమ
ప్రాంతానికి ఏమేం కావాలో జీవోఎం
నివేదికలో, తద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లులో పొందుపరచగలిగారు. ఈ ముసాయిదా ద్వారా
కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి అనూహ్యమైన ప్యాకేజీ ప్రతిపాదించింది. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఐఐటీ, ట్రిబుల్ ఐటీ,
ఎన్ఐటీ, ఐఐఎమ్లతో
పాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా వైద్య విద్యాశాలను
ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఒక నిర్ణీత కాల
వ్యవధిలో ముందుకు వచ్చింది, అనేక పరిశ్రమలు, రాయితీలు
ప్రతిపాదించింది. ఇవన్నీ వచ్చే తొమ్మిది సంవత్సరాలల్లో
పూర్తి కానున్నాయి. వీటిద్వారా ఎంత లేదన్నా కనీసం
ఆరు లక్షలమంది చదువుకున్న నిరుద్యోగులకు రాబోయే పదేళ్ళలో శాశ్వత ఉపాధి దొరుకనుంది. కానీ
కిరణ్ రెడ్డి ఇప్పుడు తన ఉపాధి గురించి
మాత్రమే ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడితో
సహా సీమాంధ్ర నేతలంతా పార్టీ ఆదేశాలు శిరసావహిస్తామని అంటుంటే ఈయన మాత్రం మానసికంగా
అధిష్ఠానవర్గంతో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దానికొక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. శాసనసభలో తెలంగాణ బిల్లు తేల్చకుండా రాజ్యాంగాన్ని రచ్చచేసి తీరాలన్న వ్యూహంతో ఉన్నాడు. అందులో భాగంగానే ఆయన శ్రీధర్ బాబును
తన లక్ష్యం చేసుకున్నాడు. ఆయనను శాసనసభా వ్యవహారాల
మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించారు.
తెలంగాణ
బిడ్డలు ఎవరైనా ఏదో ఒక దశలో
తమ నిబద్ధతను నిరూపించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం, అందులో ప్రజలు చేసిన త్యాగాలు ఎలాంటి
వారినైనా మార్చివేస్తున్నాయి. నిన్నటిదాకా ప్రజలను, వారి ఆకాంక్షలను గౌరవించడం
లేదని విమర్శలకు గురైన శ్రీధర్బాబు
శాసనసభలో సభా వ్యవహారాలమంత్రిగా ధర్మంవైపు
నిలబడ్డారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం, సభా సాంప్రదాయాల ప్రకారం
నడుచుకుని న్యాయంవైపు నిలబడ్డారు. అది ఇద్దరు మిత్రుల
కుట్ర అని కొందరు అంటున్నప్పటికీ,
అదే కిరణ్కు కోపం
తెప్పించింది. ఇంకేముంది ఆయనను ఆ పదవి
నుంచి తప్పించారు. ఆ బాధ్యతలు సీమాంధ్ర
జేఏసీ మిలిటెంటు నాయకుడు సాకే శైలజానాథ్కు అప్పగించారు. శ్రీధర్బాబు తెలంగాణ కోరుకున్నాడేమో
కానీ ఒక ప్రాంతీయవాదిగా ఎప్పుడూ
లేరు. ఆయన ఏనాడు శాసన
సభలో నిబంధనలు విరుద్ధంగా తెలంగాణ కోసం కనీసం లేచికూడా
నిలబడలేదు. బహుశా ఆయన తన
రాజ్యాంగ ధర్మానికి కట్టుబడి ఉన్నాడో లేక తన చిరకాల
మిత్రుడు కిరణ్ను ఇబ్బంది
పెట్టకూడదని అనుకున్నాడేమో కానీ ఆయన సభలో
తెలంగాణవాదిగా ఏనాడూ లేరు. కానీ
శైలజానాథ్ అలా కాదు. ఆయన
మొదటి నుంచీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే
ఉన్నాడు. ఆర్టికల్ 3 చెల్లదని వాదించారు. రాష్ట్రపతి పంపిన బిల్లును చిత్తు
కాగితంగా చూడడమే కాదు, శ్రీధర్ బాబు రాష్ట్రపతి ఆదేశాలు
పాటించి బిల్లుసభలో పెడితే దానిని అడ్డుకోవడానికి అరిచి గీపెట్టారు. బయటకువచ్చి
సభలో బిల్లు చర్చకు రానీయనని శపథం చేశారు. అటువంటి
పనిచేసి సభా నియమాలు తుంగలో
తొక్కి అవమానించినందుకు ఆయనను సభ నుంచి
బహిష్కరించాల్సింది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డందుకు ఆయనను మంత్రి పదవి
నుంచి తొలగించాల్సింది. కానీ ఇప్పుడు అదే
సభావ్యవహారాలమంత్రిగా కిరణ్ శైలజానాథ్ను
నియమించడం ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యం. ధర్మ విరుద్ధం. ఒకరకంగా
ఇది దాదాగిరి. ఇది సభలో బిల్లును
అడ్డుకోవడానికి పనికివస్తుందేమో కానీ తెలంగాణ ఏర్పాటును
ఆపలేదు. ఇదొక వృథా ప్రయాస.
తెలంగాణ తేలాల్సింది పార్లమెంటులో. బిల్లు వెళ్ళినా, ఆగినా పార్లమెంటు ఆమోదం
తెలపడానికి సిద్ధంగా ఉంటే చాలు. దీనిగురించి
ఆందోలనే అవసరం లేదు.
దుద్దిల్లను తప్పించి కిరికిరి రెడ్డి తన తద్దినాన్ని ఖరారు చేసుకున్నాడు
రిప్లయితొలగించండి