సోమవారం, సెప్టెంబర్ 05, 2011

వో సుబహ్ కభీ థో ఆయేగీ... !?



దాపు నూటా పదిహేనేళ్ళక్రితం ఒక ఆదివాసీ యువకుడు అప్పటి బ్రిటీష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాడు. అప్పటికి సరిగ్గా ఇరవయ్యేళ్ళు కూడా నిండని యువకుడు  అడవి మాది, అడవి మీద సర్వహక్కులు మావే అని నినదించాడు. నినాదం అడవి బిడ్డల్ని మేల్కొలపడమే కాదు, అప్పటి వలస పాలకులకు నిద్రలేకుండా చేసింది. ఇప్పుడు ఝార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న చోటానాగపూర్ ప్రాంతంలో అడవిని ఆక్రమించుకుని అక్కడి ఆదివాసుల్ని తమ గులాములుగా మార్చుకోవాలని చూసిన తెల్లదొరలు, వాళ్ళ అడుగులకు మడుగులోత్తే అధికారులను గడగడలాడించింది.అతను జాతిని జాగ్రుత పరిచి తమ అమాయకత్వాన్ని  ఆసరాగా చేసుకుని బయటి ప్రాంతాల నుంచి వచ్చిన  వ్యాపారులు సాగిస్తోన్న దోపిడీని ,  అడవిని,   అడవిలోని వనరుల్ని కొల్లగొడుతున్న స్త్తానికేతర షావుకార్లను, పెట్టుబడి దార్లను, మతం పేరుతొ మాయ చేస్తోన్న మిషనరీలను తరిమికొట్టాలని  నిర్ణయించుకున్నాడు. ఆదివాసుల గుండెల్లో ఆత్మ గౌరవ జ్యోతిని వెలిగించాడు. ఒక నూతన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి భూమినీ, అడవినీ కాపాడుకోవాలని కర్తవ్య బోధ చేసాడు. సంఘం పెట్టాడు. గుట్టకొకరు, పుట్టకోగారుగా ఉన్న గిరిజన తెగలను సంఘటిత పరిచాడు. అతని బోధనలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, పోరాట పద్దతులు అడవంతటా ఒక దావానలమై వ్యాపించాయి. కేవలం నాలుగైదేల్లలోనే యావత్ ఆదివాసీ జాతులకు అతనొక ఆరాధ్యదయివమై పోయాడు. ప్రభుత్వం బెమ్బెలేత్తింది. జైలు లో నిర్భందించింది. నానా చిత్రహింసలు పెట్టింది. చివరకు ఇరవై అయిదేళ్ళ నవయవ్వనంలోనే యువకుడు 1900 సంవత్సరం లో  రాంచీ జైలులో 'అనుమానాస్పద స్థితిలో' మరణించాడు. ఆదివాసుల చీకటి జీవితాల్లో తోలిపోద్దుగా నిలిచిపోయిన యువకుడే భిర్సా ముండా.   అతను ఝార్ఖండ్ ఆదివాసులకు ఒక జానపద వీరుడు. ఒక్క ఆదివాసీలకే కాదు పోరాడే అందరికీ అతనొక స్పూర్తి ప్రదాత. ఇప్పటికీ అతని ఆత్మ అక్కడ సంచరిస్తూనే ఉందని, తమకు దారిచూపే దేవుడు అతనే అని అక్కడి ఆదివాసుల నమ్మకం. బిర్సా ముండా మరణించాక అతని ఆశయాల సాధనకోసం ఏర్పడ్డ చోటనాగ్ పూర్ ఉన్నతి సమాజమే, ఆదివాసి మహాసభగా జార్ఖండ్ తరువాత జార్ఖండ్ పార్టీగా ప్రత్యెక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేసింది. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి బిర్సా మూలపురుషుడు అందుకనే  అక్కడి ఆదివాసులు తమ ప్రతిపోరాటంలో భగవాన్ బిర్సా ప్రతిరూపాన్ని చూసుకుంటారుఆదివాసుల ఓట్ల మీద బతికే రాజకీయ పార్టీలు,   నేతలయితే అతన్ని నిజంగానే దేవుణ్ణి చేసారుఇప్పుడు ఝార్ఖండ్ లో రోడ్లకు, విమానాశ్రయాలకు, విశ్వవిద్యాలయాలకు, కార్యాలయాలకు ఇట్లా అనేక ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు బిర్సా ముండా పేరే కనిపిస్తుంది. అలాగే ప్రధాన నగరాలలోని కూడళ్ళలో ఆయన విగ్రహాలే దర్శనమిస్తాయి. చివరకు జార్ఖండ్ లో అతను నిర్భందంలో మరణించిన రాంచీ  జైలుకు కూడా బీర్సాముండా సెంట్రల్ జైలు అనే   పెట్టుకున్నారుఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే ఇప్పుడు అదే జైలులో అతను ప్రభోదించిన మార్గంలో ఇప్పటి ప్రభుత్వాల వనరుల దోపిడీని, అణచివేతను ఎదిరించిన  నలుగురు ఆదివాసీ యువకులు  ఉరికంబం ఎక్కడానికి సిద్దంగా ఉన్నారు. బిర్సా ముండా ఉద్యమానికి భయపడ్డ అప్పటి బ్రిటీష్ పాలకులు ఆయన మరణాంతరం అతని ఉద్యమ స్పూర్తికి తలొగ్గి  అటవీ భూముల మీద ఆదివాసుల హక్కులను స్తిరపరుస్తూ చట్టాలను  తయారు చేసారు. కానీ ఇవాళ భారత ప్రభుత్వమే చట్టాలను తుంగలో తొక్కి అడవిని, భూములనే కాదు అక్కడి భూగర్భ గనులను కూడా ప్రైవేటు వ్యక్తులు, స్తానికేతరులు, గిరిజనేతర వ్యాపారులకు, విదేశీ బహుళ జాతికంపనీలకు కట్టబెడుతోంది. దీన్ని ప్రశ్నించిన పాపానికి మన స్వతంత్ర ప్రభుత్వాలే జీతన్ మరాండి, అనిల్ రామ్, ఛత్రపతి మండల్ మనోజ్ రాజ్స్వర్ అనే నలుగురు ఆదివాసీల పై హత్యానేరం మోపి ఉరి శిక్ష ఖరారు చేసింది. 2007 లో ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న బాబూలాల్ మరాండి కుమారుడితో సహా మరికొందరిని మావోయిస్ట్ పార్టీ చంపేసిందని కేసులో నలుగురికీ సంబంధం ఉందన్నది ప్రభుత్వ ఆరోపణ

రాంచీ కోర్టు ఉరిశిక్ష విధించిన  నలుగురిలో జీతేన్ మరాండి సరిగ్గా బిర్సా ముండా ను  తలపించే సాంస్కృతిక సేనాని. అటు ఇటుగా అదే వయసులో ఉన్న ఆయన   ఝార్ఖండ్ జాగృతి (జ్యార్ఖండ్ అభేన్)అనే సంస్తకు నాయకుడు. దశాబ్ద కాలంగా అయన జార్ఖండ్లో సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీ భాషల్లో వేలాది పాటలు రాసిన, రచయితాకవి, గాయకుడు.  ఆటా, పాటలతోసంతాలి సిరింగ్ జానపద బాణీలతో, వీధి నాటకాలతో తన జాతిని జాగృతం చేసిన కళాకారుడు.  సహజంగానే జాతిని జాగృతం చేసే కళాకారుడైనా రాజ్యం కంటికి నలుసులాగే కనిపిస్తాడు. అతన్ని రెచ్చగొట్టే రచనలు చేసాడని, ఉద్రేక పరిచే ఉపాన్యాసాలు చేసాడని 2008 లో అరెస్టు చేసారు. అప్పటికి హత్యానేరం మోపలేదు. ఆతరువాత ఏడాదికి అంటే 2009 ఏప్రిల్ లో అతను మావోయిస్టు అని, బాబూలాల్ కొడుకు హత్యలో అతను ఉన్నాడని నేరారోపణ చేసి గత జూన్ నెలలో మరాన్డికి మరణ శిక్ష విధించారు. శిక్షను చూసి ఝార్ఖండ్ ఆదివాసిలే కాదు మరాండి ని  ఎరిగిన వారంతా అవాక్కయ్యారు. అన్యాయమన్నారు. అతను నిరంతరం ఆదివాసుల హక్కులకై తపించే ఒక సాంస్కృతిక కార్యకర్త  తప్ప నక్సలైటు కాదని, మాట, ఆటపాట తప్ప మరో ఆయుధం తెలియని మృధుస్వభావి అని చాలా మంది చెప్పారు. అతనెప్పుడూ తన ప్రజలను వదిలి, అడవిని వదిలి అజ్ఞాత వాసం చేయలేదు. చివరకు బాబూలాల్ మరాండి కూడా ఒకవేళ జీతెన్ తన కొడుకును చంపాడని కోర్టు భావించినా తాను క్షమిస్తానని, మరణ దండన వద్దని అన్నాడు.   కానీ న్యాయ మూర్తికి మాత్రం అతను నక్సలైటు గానే  కనిపించాడు. మరణ దండన పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కవులు, రచయితలు, కళాకారులు ఇది అన్యాయమని ఆందోళన చెందుతున్నారు. అయితే ఆందోళనను  అన్నాహజారే  హంగామా ముందు ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. నిజానికి అన్నా హజారే ప్రస్తావిస్తోన్న అవినీతికి మూలాలను వెతికి చూపించి, ప్రశ్నించిన వ్యక్తి జీతాన్ మరాండి. అయన తన ఝార్కాండ్ జాగృతి ద్వారా స్తానిక వనరులను స్తానికేతర కంపనీలు, వ్యాపారులు, పెట్టుబడీ దారులు ఎలా దోచుకున్తున్నది,  పాలకులకు అక్కడి మైనింగ్  మాఫియా తో కలిసి కోట్లకు కోట్లు ఎలా సంపాదిస్తున్నది, ఎదించిన ప్రజలను కేంద్ర రాష్ట్ర బలగాలతో ఎలా అనచివేస్తున్నది, ప్రజాస్వామ్యాన్ని రాజ్యం ఎలా నవ్వులపాలు చేస్తున్నదీ, అవినీతి వాళ్ళ ఆదివాసుల జీవితాలు, సంస్కృతి యెట్లా ధ్వంసమై పోతున్నదీ తన పాటల ద్వారా చెప్పాడు. అన్నా హజారే లాగా దిల్లీలో ఏదో ఒక వేదిక మీద బాసింపట్టు వేసుకుని తన నుచరులతో భజనలు చేసుంటే అతను కూడా మీడియా, చట్టం, కోర్టులు, రాజకీయ పార్టీల దృష్టిలో దేశ భక్తుడే  అయి ఉండేవాడు. కానీ అతను ప్రజాస్వామ్యమంటే ప్రభుత్వాన్ని హైజాక్ చేయడమని అనుకోలేదు.ప్రజల గొంతులు సవరించడమని, ప్రశ్నించే అధికారం నేర్పడమని  అనుకున్నాడు. ఉద్యమ కారుడైనా చేసేది అదే. ఇవాళ తెలంగాణా ఉద్యమం చేస్తున్నది  కూడా అలాంటి పనే. సరిగ్గా తెలంగాణా ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజలు విద్యార్తులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇట్లా అందరూ నక్సలైట్లుగా కనిపించినట్టే పాలకులకు మరాండి కూడా కనిపిస్తున్నాడుజార్ఖండ్ ప్రజల పోరాటానికీ తెలంగాణా ఉద్యమానికి అనేక పోలికలు ఉంటాయి. రెండు ప్రాంతాల ప్రజలదీ సుదీర్ఘమైన పోరాట అనుభవం. రెండూ ఆత్మగౌరవ నినాదంతో దోపిడీకి, వలస వాదుల పీడనకు వ్యతిరేకంగా పుట్టినవే.  కాక పొతే జార్ఖండ్ ప్రజలది మనకంటే సుదీర్ఘమైన అనుభవం. బిర్సా ముండా తో మొదలయిన పోరాటం అక్కడ ఇంకా కొనసాగుతోంది. పోరాట క్రమంలో జీతెన్ మూడో తరం వాడు. మొదటి తరం బిర్సా బాటలో తమ జాతిని కాపాడుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో  పోరాడింది. రెండో తరం తమ స్వపరిపాలన కోసం తపిస్తూ ప్రత్యెక రాష్ట్రం కోసం   ఉద్యమించింది. ఇప్పుడు మూడో తరం తమ రాష్ట్రాన్ని సంపదను దోచుకున్తోన్న దళారులతో పోరాడుతోంది.  జార్ఖండ్ ప్రజలు  ప్రత్యెక రాష్ట్రమైతే సాధించుకున్నారు గానీ    అవినీతి మూలంగా  అక్కడి వనరులన్నీ వలస వ్యాపారుల చేతిలోనే ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం అడవులకు నిలయం, అసలు జార్ఖండ్ అంటేనే అడవి ఖండం అని అర్థం. అడవి నిండా అనేక ఖనిజ నిక్షేపాలున్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, మైకా , సున్నపు రాయి, రాగి, వెండి మొదలు యురేనియం దాకా అక్కడలేని నిది లేదు. అందుకే అప్పుడు బ్రిటీష్ పాలకుల కన్ను ప్రాంతం మీద, అక్కడి సంపద మీద పడింది. అక్కడి సంపద చేజిక్కించుకోవాలంటే ముందుగా అక్కడి ఆదివాసులను తరిమేయాలి.  బిర్సా ముండా వాళ్ళ ఆటలు సాగనీయలేదు. విదేశీయులు ఆగద్దమీద అడుగు పెట్టకుండానే వెనుదిరిగారు కానీ వెంటనే దేశీయ షావుకార్లు డబ్బు సంచులతో అక్కడ దిగారు. బిర్సా చనిపోయిన నాలుగైదేల్లకే అడవిలో పెట్టుబడి జెంషెడ్ జీ టాటా రూపంలో ప్రత్యక్ష్యమయింది. ఆయన పేరుతొ జేమ్షేద్పూర్ ఉక్కు నగరమే వెలిసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా అక్కడి ఆదివాసులు తమ అడవిలో తామే పరాయివాల్లయి బతుకుతున్నారు. ఇప్పుడు చిన్న రాష్ట్రం దేశపు ఖనిజ ఉత్పత్తులలో పదిశాతం వాటాతో ఉంది.   వాటా ఇంకా పెంచి, తమ వాటాలు పంచుకుంటూ రాజకీయ నాయకులు ప్రైవేటు పెట్టుబడికి రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేసారు. గడిచిన పదేళ్ళలో వేలాది కంపనీలకు అక్కడి భూములు లీజుకివ్వడం మొదలు పెట్టారు. 2008 నాటికే ౭౩౦ లీజులిచ్చి జార్ఖండ్ ను అమ్మేసుకున్నారు. కాలంలో రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న మధుకోడా రెండేళ్లలో నాలుగు వేల కోట్ల అవినీతికి పాల్పడి దొరికి పోయాడంటే అక్కడ దొరకకుండా సాగుతోన్న దోపిడీ ఎంతుంటుందో పోల్చుకోవచ్చు.సరిగ్గా జీతెన్ మరాండి ప్రశ్నించింది  దోపిడీనే. కేవలం తను ప్రశ్నించడం మాత్రమె కాదు, ప్రజలకు అలా ప్రశ్నించి, ఎదిరించే బిర్సా ముండా తత్వాని బోధిస్తున్నాడు. దేశాని, దేశంలో ఉన్న సహజ వనరులను అవినీతి పరులపాలు కానీయ వద్దని ప్రజలను జాగ్రుత పరిచాడు. ప్రశ్నలకు, వాదానికి ఎలా సమాధానం చెప్పాలో  తెలియని పాలకులు  ఇప్పుడు ప్రశ్నిస్తున్న గొంతుకు ఉరి బిగించే పనిలో ఉన్నారు.  నిజానికి   ప్రజల ఆస్తుల్ని పీల్చి పిప్పిచేసిన మధుకోడా ఇవాళ అదే జైలులో మామూలు ఖైదీ లాగే ఉన్నాడు. అతనికి ఉరిశిక్ష వేసే చట్టం లేదు మన దేశంలో. మన దేశంలో ఇప్పటివరకు రాజకీయ నాయకుడికి, పెట్టుబడి దారుడికి, మరే యితర కార్పొరేటు మోసగాడికీ ఉరిశిక్ష పడలేదు. కానీ ఆకలికి, నిరుద్యోగానికి, పేదరికానికి బలిపశువులై చిల్లర నేరాలు చేసినవాళ్ళుi,  తమ స్తితికి కారణమైన దోపిడీని ఎదిరించిన వాళ్ళు , ప్రశ్నించిన వాళ్ళు, కొత్త విలువల్ని కోరుకున్నవాళ్ళు మాత్రమె ఉరికంబం ఎక్కారు.  పాలక వర్గాల వర్గాల రాజకీయ సిద్ధాంతాలను ప్రశ్నించిన వాళ్ళు , ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళూ జాబితాలో ఉన్నారు.  మరీ ముఖ్యంగా పేదలు, దళితులూ, ఆదివాసులు, అధికార పీడితులు లక్షలాదిగా ఏటేటా అనధికారికంగా అమలౌతోన్న మరణ దండనకు బలి అవుతూనే వున్నారు. అలా కుదరనప్పుడు వారిని ఏదో ఒక కేసులో తోసేసి చట్ట బద్ధంగా ప్రాణాలు తీసేస్తున్నారు. సంగతి గుర్తించే ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు మరణశిక్షను రద్దు చేయాలని కోరుతున్నాయి

మరణ శిక్షను రద్దు చేయాలన్న డిమాండు ఇవాళ కొత్తగా వస్తున్నది కాదు. అది అనాగరిక మైనదని, మధ్య యుగాలాని దుష్ట సాంప్రదాయమని చాలా మంది సామాజిక వేత్తలు చెప్పి ఉన్నారు. శిక్ష మనిషిని మార్చేదిగానే ఉండాలే తప్ప మనిషినే లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక వ్యక్తీ ఇంకొకరి ప్రాణాలు తీయడం   యెంత ఘోరమైన నేరమో శిక్ష పేరుతొ ప్రాణం తీసేయడం కూడా అంతే నేరమని, అయినా మరణ దండనల వాళ్ళ సమాజంలో కూడా నేరాలు ఆగిపోలేదని నేరశాస్త్ర పరిశోధనలు చెప్తున్నాయి.   ఇది గుర్తించి ప్రపంచంలో నూటా ముప్పై దేశాలు ఇప్పటికే శిక్షను రద్దు చేయడమో, అమలు చేయకుండా ఉండడమో చేస్తున్నాయి. కేవలం ౮౦ దేశాలే ఇంకా మరణ శాసనాలు అమలు చేస్తున్నాయి. అలాంటి  అనాగరిక సాంప్రదాయాన్ని అమలు చేస్తోన్న దేశాల్లో మనదీ ఒకటి. చట్టం అవసరమే అనే వాళ్ళూ ఉన్నారు, కానీ అమలులోనే విచక్షణ ఉండాలని   వాళ్ళు వాళ్ళు కోరుతున్నారు. మరణ శిక్ష అనేది అసాదారణ కేసుల్లో వాటిలో కూడా  అరుదైన సందర్భాల్లో మాత్రమె విధించాలని గతంలో సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పులో సూచించింది. కానీ దాన్నిప్పుడు సాధారణం చేసేసారు. ఎవరినైనా హత్య చేసిన వ్యక్తికి చట్టం ప్రకారం జీవిత ఖైదు గానీ మరణ శిక్ష గానీ విధిస్తారు. నేర స్వభావం, ప్రేరణ కలిగించిన అంశాలు, సమాజం పైన నేర ప్రభావం, నేర విస్తృతి, నేరస్తుడి వ్యక్తిత్వం వంటివి పరిగణలోకి తీసుకోవాలని తీర్పులో సుప్రీం కోర్టు చెప్పింది. మొత్తంగా ఒక వ్యక్తిని బతకనీయాలా లేక చంపి వేయాలా అని నిర్ణయించే అధికారం మానవ మాత్రుడైన న్యాయ మూర్తి చేతుల్లో ఉంటుంది. ఇది మంచిది కాదని చాల మంది న్యాయ కోవిదులు వాదిస్తున్నారు. అనేక కేసుల్లో ఒక న్యాయ మూర్తి చెప్పింది మరో న్యాయ మూర్తి తప్పు పడుతున్నప్పుడు మరణ శిక్ష లు అన్నీ న్యాయబద్దామేనని  చెప్పలేం. న్యాయం అనేది మీరు కుదుర్చుకున్న న్యాయవాది చేసే బెరాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు సమాజమంతా చలించిన సందర్భాల్లో న్యాయమూర్తులు చలించాట్లేదు. గ్రహం స్టైన్ విషయంలో అదే జరిగింది. విదేశీయుడైన గ్రహం స్టైన్ ను అతని ఇద్దరు పసిపిల్లల్ని అత్యంత పాశవికంగా హత్యచేసిన ధారా సింగ్ ను కోర్టు వదిలివేసిందిమరాండి కేసులో  న్యాయమూర్తి నిజంగానే పైన చెప్పినట్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వుంటే  అతనికి  ఉరిశిక్ష విధించే అవకాశం లేదు.  జితేన్ మరాండి ఒక్కడే కాదు ఇప్పుడు వరుసగా ఉరిశిక్షలు మన ముందున్నాయి. రాజీవ్ గాంధీ హత్యకేసులో నేరారోపణ ఎడుర్కొంతోన్న తమిళుల ఉరిశిక్ష రద్దు చేయాలని అక్కడి అసెంబ్లీ తీర్మానించింది. దాదాపు యిరవ్యఎల్లకు పైగా జైలులో కటఃఒరమైఅన శిక్షను అనుభవించిన వాళ్లకు ఇప్పుడు మరణ దండన అమలు చేయడం కేవలం ప్రతీకారమే తప్ప న్యాయసమ్మతం కాదు. అలాగే మరో నూట డెబ్బయి మందికి పైగా తమకు క్షమాభిక్ష పెట్టమని భారత రాష్ట్రపతికి ధరఖాస్తు చేసుకుని ఉన్నారు. అవి ఏళ్ళ తరబడి అలా మూలుగుతూనే ఉంటాయి తప్ప వాళ్లకు చావునుంచి విముక్తి కలుగుతుందని  అనుకోలేం. ఇలా వందలాది మందికి ఇప్పటికే ఉరి ఖరారై ఉంది కాబట్టి మనుషుల్ని చట్టబద్ధంగా చంపేసే క్రమం   సంవత్సరాల పాటు  కొనసాగనుంది. ఇది మన దేశానికి అంట మంచిది కాదు.  అయినా నేరాలకు మూల కారణాలని వదిలేసి నేరస్తులను ఉరితీస్తూ పొతే దేశంలో చివరి నేరస్తుడిని ఉరితీయడానికి ఒక్కడు కూడా మిగలడు.

ఇవాళ  ఉరిశిక్ష గురించి మాట్లాడుతోన్న వాళ్లకు జీతెన్ మరాండీ గురించి దిగులు లేదు. నిజానికి అతని చావు గురించిన దిగులు అతనికే లేదు. 'మీకు కోర్టు మరణ దండన విధిస్తోంది' అని న్యాయ మూర్తి తీర్పు చెప్పినప్పుడు కూడా ఆయన చలించలేదు. 'టీక్ హై' అన్నాడు. అంతే అలాగే కానీయండి అని అర్థం. ఎందుకటే సమస్య ఒక్క ఝార్ఖండ్ ది మాత్రమే కాదని అతనికి తెలుసుబెంగాల్బీహార్, ఒరిస్సా, చత్తీస్ గడ్, ఆంద్ర ప్రదేశ్,  కర్నాటక ఇట్లా దేశమంతటా భూమిని దోచేసుకోవడం, అడవుల్ని ఆక్రమించుకోవడం  కొనసాగుతూనే ఉంది. మైనింగ్ పేరుతొ దేశాన్ని లూఠీ చేయడం కొనసాగుతూనే ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలు తప్పక ఏకమై పోరాడుతారని ఆయన ఆశ. అందుకే    'వో సుబహ్ కభీ థో ఆయేగీ... ( ఉదయం ఎప్పటికైనా వస్తుంది)  అంటూ తనదైన శైలిలో పాడుకుంటూ అయన కోర్టు హాలు నుంచి వెళ్ళిపోయాడట.  మనం ఆలోచించాల్సింది చట్టాలు, కోర్టులను వాడుకుని ప్రభుత్వాలు ఇంట నిరంకుశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ పొతే రేపు ఉద్యమమైనా నిలబడుతుందా అని. న్యాయం పక్షాన   మాట్లాడే మనిషి మిగులుతాడా అని!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి