గురువారం, మే 31, 2012

దేవుడు చేసిన మనుషులు!



దేవుడు ఉన్నాడా లేడా ఆన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మే వాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు  లేడని  నిర్ధారించుకున్నాక చర్చకు కాలం చెల్లింది. కానీ ఇప్పుడు అదే చర్చ మళ్ళీ తెరమీదికి వస్తోంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అనుకున్నవాళ్ళకు  లేడేమోనని, లేనే లేడని వాళ్లకు ఉన్నాడేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి దేవుడు ఉన్నాడా లేదా ఆన్న సంశయానికి కారణం మనుషులే తప్ప దేవుడు కాదు. ఎవరైనా తప్పులు చేసినప్పుడు, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం లేనప్పుడు  దేవుడు ఉంటే బాగుండునని కోరుకుంటారు.
అటువంటి వాళ్లకు శిక్షలు పడ్డప్పుడు దేవుడున్నాడని నమ్ముతారు. అలా జరుగకుండా అన్యాయమే అధికారమై రాజ్యమేలుతున్నప్పుడు దేవుడు లేదన్న నిర్ధారణకు వస్తారు. దేవుడే ఉంటే ఇలా జరుగక పోయేదన్న నమ్మకం అపనమ్మకాన్నికి కారణమౌతుందిరాష్ట్ర రాజకీయాలలో ఇటీవలి పరిణామాల్లో ఇప్పుడు చాలా మంది నేతలు దేవుడిని ప్రస్తుతిస్తున్నారు.  

ముఖ్యంగా అక్రమాస్తులు, ఆర్ధిక నేరాల కేసులో పీకలలోతు కూరుకు పోయిన  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ  సభ్యులు దేవుడున్నాడని పదే పదే ప్రజలకు గుర్తుచేస్తున్నారు.  తనపై అన్యాయంగా నిందలేసి వేధిస్తున్నారని ఇదంతా దేవుడు పైనుంచి గమనిస్తున్నాడని జగన్ అంటున్నాడు. దానిని ఆయన ప్రత్యర్థులు కూడా సమర్థిస్తున్నారు. ఒకరు జగన్ తప్పులను దేవుడు ఆలస్యంగా గమనించాడని సినీ నటుడు బాలకృష్ణ ఆంటే,  తండ్రిని అడ్డం పెట్టుకుని  కొడుకు సాగిస్తున్న అక్రమాలు గమనించే దేవుడు రాజశేఖర్ రెడ్డిని త్వరగా తీసుకెళ్ళాడని లగడపాటి రాజగోపాల్ అంటున్నారుమన ప్రమేయం లేకుండానే కొన్ని సార్లు జరిగే సహజ పరిణామాలకు అలాంటి మహిమలు ఆపాదిస్తుంటాం.  ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు సందర్భంగా తెలంగాణలో రచ్చబండకు వెళ్ళిన ముఖ్యమంత్రిని జనం సుడిగాలిలా చుట్టుముట్టిన సందర్భాలు చూసాం. వరంగల్ జిల్లలో కొన్ని సభల్లో ఆయన మాట్లాడకుండానే వెనక్కి వచ్చిన సంఘటనలున్నాయి. ఇప్పుడు అదే వరంగల్ జిల్లాలో ఎవరూ అడ్డుకోక పోయినా ప్రకృతి సుడిగాలయి ఆయనను తరిమేసింది. అదికూడా దైవ సంకల్పమే అనే వాళ్ళూ ఉన్నారు

నిరంతరం దేవుడి పేరు చెప్పినంత మాత్రాన దేవుడు మనం ఏం చేసినా మన్నిస్తాడనుకోవడం పొరపాటు. పాపం ఆయనకు కూడా కొన్ని నీతి నియమాలు ఉంటాయిమత ప్రచారకుడు కే పాల్ సంగతే చూడండి. దైవోపాసకుడిగా ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి,  ఆయన వై ఎస్ కుటుంబానికి బద్ధ విరోధితన మీద కుట్ర పన్నినందుకే రాజశేఖర్ రెడ్డిని దేవుడు తీసుకెళ్ళాడని పదే పదే చెప్పిన ఆయనను ఒక హత్య, కుట్ర కేసుల్లో పోలీసులు ఈడ్చుకెళ్ళి జైలులో పెట్టారు.  గాలి జనార్ధన్ రెడ్డి అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 42 కొట్లు  ఖర్చు చేసి వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు కిరీటం కానుకగా ఇచ్చాడు. మరెందరో దేవుళ్ళకు గుడులు గోపురాలు కట్టించాడుఅయినా ఏడాది తిరిగే లోపే పాపాలు పండి జైలుకు వెళ్ళాడు. ఒక్క దేవుడైనా పూనుకుని భక్తుడికి కనీసం   బెయిలు  కూడా ఇప్పించలేక పోయాడు.  దేవుడితో ఉన్న చిక్కే ఇది.  ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియనీయడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపుతుంటాడు. అసలు  అతనే ఉన్నాడా, లేడా ఆన్న అనుమానం కలిగేలా చేస్తుంటాడుఅది ఆయన లీల అని సరిపెట్టుకునే వాళ్ళూ ఉన్నారు.    అదే ఇప్పుడు దేవుడికి చిక్కులు తెస్తోంది. మనుషులు తామ లీలలకు దేవుడిని వాడుకుంటున్నారు

సాధారణంగా దైవ చింతన ఉన్నవాళ్ళకు పాపభీతి కూడా ఉంటుందంటారు. అన్ని మతాలు అదే చెపుతాయని అంటారు. అసలు దేవుడు పుట్టిందే మనిషిని సన్మార్గంలో నడిపించడానికి. మనవ సమాజపు ఆవిర్భావపు తొలి దశలో దేవుడు లేడు. మతం లేదు. మనుషులు తమ ఊహకందని అన్ని చర్యలకూ ఏదో మహిమను ఆపాదించడం, మహిమ వెనుక ఏదో శక్తి దాగి ఉందని నమ్మడం మొదలు పెట్టారు.   రాజ్యాలు ఏర్పడ్డ తరువాత  నమ్మకం మీదనే చాలా ఏళ్ళు పాలన సాగింది.  ప్రపంచాన్ని దేవుడే పరిపాలిస్తాడని,   దైవ నిర్ణయాన్ని పురోహితులు అమలు చేస్తారని చాలా కాలం నమ్మించారు.   తరువాత రాజుల కాలం వచ్చింది. రాజే దైవం, రాజే న్యాయం అనే రోజులూ నడిచాయి. రాజులు కూడా దేవుళ్ళ పేరుచెప్పి దోచుకున్న వాళ్ళే. రోమన్ సామ్రాజ్యంలో పురోహిత వర్గమైనా, రాచారికమైనా దేవుడి పేరు చెప్పింది తమ దోపిడీని స్థిర పరచుకోవదానికే తప్ప  దేవుడు న్యాయాన్యాయ విచక్షణ చేయగలడని చెప్పడానికి కాదు.  ఇప్పటికీ చాలా దేశాలు, చాలామంది మనుషులు దేవుడున్నాడని, అన్నీ గమనిస్తున్నాడని నమ్ముతున్నా అవినీతికి మాత్రం అంతులేకుండా పోతోంది.  సమాజంలో భక్తి భావం పెరుగుతున్నట్టే అవినీతి కూడా పెరుగుతోంది. నిరంతరం బైబిల్ ఫటించేవాళ్ళు, మాటి మాటికీ  భగవత్గీత ను ఉటంకించే వాళ్ళు, భక్తిశ్రద్ధలతో రోజుకు ఐదు పూటలా ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా నేరస్తులుగా తేలుతున్నారు.  కాబట్టి భగవంతుడికి భక్తుడికీ ఉన్న బంధం వ్యక్తిగతం. అది నేరాలకు శిక్షలకు వర్తించదు. చరిత్ర పొడుగునా దేవుడికి మనిషికీ జరిగిన సంఘర్షణ, పోరాటాలు, తిరుగుబాట్లు, ఉద్యమాలు, విప్లవాలు  శాస్త్రీయ విజ్ఞాన ఆవిష్కరణకు, స్వతంత్ర పరిపాలనా వ్యవస్థల ఆవిర్భావానికి దోహద పడ్డాయి. దైవ న్యాయం, రాజ న్యాయం స్థానంలో రాజ్యాంగ న్యాయ వ్యవస్థలు అవతరించాయి. ఇప్పుడు మనిషి సచ్చీలత రుజువుచేసేది దైవభక్తి కాదు, రాజ్యాంగ బద్ధత. చట్ట నిబద్ధత. అదొక్కటే న్యాయ స్థానంలో నిలబడుతుంది.   దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెపుతానని, అబద్దం చెప్పనని ఒట్టేసి చెప్పినా చెప్పిందంతా నిజమేనని న్యాయమూర్తి నమ్మడానికి వీలు లేదు. దేవుళ్ళు, మత విశ్వాసాలను కాకుండా రుజువులు, సాక్షాలను మాత్రమే నమ్మాలన్నది సార్వత్రిక న్యాయ సూత్రం. కోర్టులకు మీరు దైవ భక్తి పరాయనులా కాదా అన్నదానితో సంబంధం లేదు, మీరు తప్పు చేసారా లేదా అన్నదే కావాలి.  ఏమార్ కుంబ కోణంలో పీకలదాకా కూరుకు పోయిన ఎస్ అధికారి బీ పీ ఆచార్య  తన దైవ భక్తిని న్యాయమూర్తికి చూపించి పాపపరిహారం కోరాలనుకున్నాడో ఏమో గానీ ఆంజనేయ స్వామి చిత్ర పటాన్ని నేరుగా కోర్టు హాలు లోకే తీసుకు వెళ్ళాడు. న్యాయమూర్తి నాగ మారుతి శర్మ గారి కి దేవుడి బొమ్మ కనిపించేలా ఉంచి దృష్టి  మరల్చే ప్రయత్నం కూడా చేసాడు. అది గమనించిన న్యాయమూర్తి  'భయపడకంటి మీరు తప్పూ చేయకపోతే దేవుడు మిమ్మల్ని తప్పక కాపాడుతాడు ' అన్నారు తప్ప మీరు దైవభక్తులు కాబట్టి తప్పూ చేయలేదని తీర్పు చెప్పలేదు.

అయినా సరే ఇప్పుడు చాలా మంది నేరాభియోగం మోస్తున్న వాళ్ళు పదే పదే దేవుడి ప్రస్తావన తెస్తున్నారు. ఇది న్యాయ వ్యవస్థను నమ్మించడానికి కాదు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి.  చేతిలో సొమ్ములుంటే  న్యాయ స్థానాల్లో తమ వాదన వినిపించడానికి కేసును  కీలుకు కీలు విరిచి వాదించే వకీళ్ళు  వందలాది మంది  క్యూ కడతారు.   కేసులు రుజువై, సాక్షాలు దొరికి శిక్ష పడడానికి కొన్ని దశాబ్దాల కాలం  పట్టొచ్చు.  సాక్షాధారాలు సరిగా లేక కేసు మధ్యలోనే కొట్టుడు కూడా పోవచ్చు. లోగా జనంలో కొట్టుడు పోగూడదు. వాళ్ళను నమ్మించాలి. ఓట్లు వేయించుకోవాలి. అలా నమ్మించడానికి అంది వచ్చిన అన్ని విశ్వాసాలను వాడుకోవాలి. ఇది ఇప్పుడు నడుస్తోన్న రాజకీయం. వై ఎస్ జగన్ కేసులో ఇప్పటికే ఆయన నేపధ్యం చాలామందిని ఆకట్టుకుంటోంది. వాటిల్లో మొదటిది ఆయన వారసత్వం. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఆయన ఒక వెలుగు వెలిగి పోయారు. స్వతహాగా రాజశేఖర్ రెడ్డి ఆహార్యం, శైలి, మిత్ర వాత్సల్యం చాలామందినే మంత్ర ముగ్దుల్ని చేసింది. ఆయన పాలన, పథకాలు, వాటికున్న ప్రజాదరణ వారిని మరింత సంమోహనుల్ని చేసింది. ఆయన బతికున్న కాలంలోనే కాదు ఆయన మరణించి మూడు ఏళ్ళు గడుస్తున్నా జిలుగు వెలుగుల వెనుక సాగిన చీకటి బాగోతాలను గురించి మాట్లాడే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. చీకటినే ఇప్పుడు సి బీ కేసు చేదిస్తున్నది.  నిజానికి విషయంలో జగన్ ఒక్కడే స్పష్టంగా ఉన్నాడని అనిపిస్తోంది. జగన్ తన తండ్రి పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాడని, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకు కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని  సి బీ మోపుతున్న అభియోగాలను ఆయన నిర్ద్వందంగా తోసి పుచ్చుతున్నారు. అధికారంలో తాను లేనని, తానెప్పుడూ సచివాలయానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికీ వెళ్లలేదని, తన తండ్రి అక్రమాలకూ తనకు ముడిపెట్టవద్దని అంటున్నాడు. తప్పులకు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి మండలి బాధ్యత వహించాలి తప్ప తాను కాదని కూడా వాదిస్తున్నాడు. ఇది వై ఎస్ అభిమానులకు అర్థం కావడం లేదు. చాలామంది తెలుగు మీడియా చిత్రీకరించినట్టు ఆయన నేల మీద నడిచిన దేవుడు అనే నమ్ముతున్నారు. దేవుడు ఏది చేసినా మంచికోసమే ఆన్న భక్తి పారవశ్యంలో వాళ్ళు ఇంకా ఉన్నారనిపిస్తుంది.  

రాజశేకర్ రెడ్డి దేవుడు అని నిరూపించడానికి వాళ్ళు ఎప్పుడో క్రుతాయుగంలో గతించి పోయిన చంద్ర బాబు కథలను ప్రస్తావిస్తున్నారు.  రాజశేఖర్ రెడ్డి అవినీతి పరుడైతే చంద్ర బాబు సంగతేమిటి అని ప్రశ్నిస్తున్నారు. నిజమే ఒకడు రాక్షసుడని చెప్పడానికి ఇంకొకరిని దేవుడని నెత్తిన ఎత్తుకోవాల్సిన పనిలేదు. రాజశేఖర్ రెడ్డి తప్పులను వాళ్ళు గుర్తించ నిరాకరించడానికి చంద్ర బాబు మీదున్న ద్వేషం కూడా ఒక కారణం కావొచ్చు. ఇలాంటి వారిని కాపాడుకోవడం కోసమే జగన్ కోర్టులో తన తండ్రి పాలనతో తనకు సంబంధం లేనే లేదని వాదించినా ప్రజల ముందు మాత్రం తన తండ్రి స్వర్ణ యుగం గురించి ప్రస్తావిస్తున్నాడు. అది మళ్ళీ తెస్తానని చెపుతున్నాడు.

 రాజకీయాల్లో కుల మతాలు బాగా కలిసొస్తాయని అంటారు. కానీ అవి ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో జగన్ కు కలిసోచ్చినంతగా మరొకరికి కలిసి రాలేదన్నది వాస్తవం. ఆయన అటు కుల పరంగా రెడ్డి సామాజిక వర్గాన్ని, మతపరంగా  క్రైస్తవులను, అందులో మెజారిటీ గా ఉండే దళితులను ఆకట్టుగో గలుగుతున్నారు. దానికి రాజశేఖర్ రెడ్డి పునాదులు వేసి వెళ్ళిపోయారు. ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో రెడ్డి సామాజిక ఆధిపత్యం మొదటినుంచీ ఉన్నా తెలుగుదేశం అనంతర రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఎదిగారు. రాష్ట్రం పుట్టినప్పటినుంచీ ఇప్పటిదాకా దాదాపు పది సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రులై పాలించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆదినుంచీ వర్గానిదే ఆదిపత్యం. బ్రాహ్మణులు, వెలమలు, దళితులు, వైశ్యులకు  ఒక్కొక్కరికి ఒక్కోసంధర్భంలో అధికారం వచ్చినా ఒక్కరూ  పూర్తికాలం పదవిలో ఉండలేక పోయారు. ఒక్క తెలుగు దేశం పార్టీ మాత్రం పదహారేళ్ళకుపైగా సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉంచగలిగింది. పార్టీ కమ్మ నాయకత్వం వారిని ముఖ్యమంత్రులను చేయగలిగింది తప్ప తరువాతి కాలంలో తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోలేకపోయింది. జగన్ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా ఒక కొత్త పార్టీతో ముందుకు రావడం సామాజిక వర్గానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఊపునూ ఇస్తోంది. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా మన సమాజానికి కులమే ప్రాధమికం కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పార్టీలో,   స్థితిలో, హోదాలో, అస్తత్వంలో ఉన్నా ఇప్పుడు జగన్ కు జై కొడుతున్నారు. అలా బహిరంగంగా జై కొట్టలేనివాళ్ళు లోలోపల ఆనందిస్తున్నారు. ఆలోచనా పరులయితే జగన్ ను తమ ఆత్మ బంధువుగా భావించి ఆయన  అవినీతిని వ్యతిరేకిస్తామని అంటూనే కేసులో చంద్రబాబును కూడా ఇరికిస్తే బాగుండునని ప్రయత్నిస్తున్నారు.  మరో వైపు దళితుల్లో ఒక వర్గం  జగన్ ను తమ బంధువని నమ్ముతోంది. మాల   మహానాయకుడే ఇప్పుడు జగన్ కు రక్షణ కవచమై నిలబడి ఉన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలోని చర్చి లలో ఆయన  విజయం కోసం ప్రార్థనలు నడుస్తున్నాయి. క్రైస్తవ మతగురువులు చాలా మంది బహిరంగంగానే రాజశేఖర్ రెడ్డిని ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన కుమారుడిని ఆదరిస్తున్నారు

దేవుడిని నమ్మని కొందరు తాత్వికులు, గతితార్కికులు ఇప్పుడు జగన్ లో ఒక ఆదర్శ వాద ప్రగతిశీల  నేతను చూస్తున్నారుయువకుడు, విద్యావంతుడు, పారిశ్రామిక వేత్త, మీడియా సంస్థల అధినేత, నిరంతరం ప్రజల్లో ఉండి వారిని ఓదార్చే స్వాంతన మూర్తిగా ఆయన రాష్ట్రానికొక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా వీరు భావిస్తున్నాయి. ఆలోచనా భావజాలం వారిని నిష్పాక్షికంగానో, న్యాయం వైపో ఉండనీయడం లేదు. అందుకే ఇప్పుడు అవినీతిని ఆమోదయోగ్యం గా మార్చి వేస్తున్నారు. అసలు అవినీతి లేని నాయకుడేది అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క జగన్ నే కాదు భూమి పుట్టినప్పటినుంచి జరిగిన అవినీతి అంతటి మీదా విచారణ జరగాలని వాదిస్తున్నారు. అక్కటితో ఆగకుండా ఇదొక రాజకీయ కక్ష అనీ, జగన్ కాంగ్రెస్ లోనే ఉంటే అసలు విచారణ జరిగేదా అని కూడా అడుగుతున్నారు. కారణాలు ఏవైనా, వ్యక్తులు ఎవరైనా మింగింది ప్రజల సొమ్ము ఐనప్పుడు కక్కి తీరవలసిందే.  నిజమే రాజకీయ కక్షలు లేకపోతే అటు చంద్ర బాబు అవినీతి అయినా, జగన్ అక్రమ సంపాదన అయినా బయటికి రావు, బయటికోచ్చినందుకు ఆనందిద్దామా, రాకపోతే బాగుండేదని అనుకుందామా ఆలోచించాలి. ఒక కేసులో విచారణ జరుగుతున్నప్పుడు వాదన అభియోగా పత్రానికే పరిమితం కావాలి తప్ప దాన్ని సాధారనీకరించడం కేసును నీరు గార్చడమే అవుతుంది. అంతేకాదు సమాజాన్ని మరింత దిగాజార్చడానికి దోహద పడుతుంది.  అది దేవుడు  చేసినా న్యాయ సమ్మతం కాదు

జగన్ దేవుడున్నాడని చెపుతున్నట్టే మానుకోట ప్రజలు కూడా దేవుడు ఉండే ఉంటాడని  అనుకుంటున్నారు. దేవుడు ఆకాశంలోనే కాదు, నేలమీద, కంకర రాళ్ళల్లో కూడా ఉన్నాడని అంటున్నారు. ఎవరికైనా నమ్మరానిది నిజమైనప్పుడు ఇటువంటి  విశ్వాస వైపరీత్యం కలుగుతుంటుంది. రెండేళ్ళ క్రితం తెలంగాణా కు వ్యతిరేకంగా పార్లమెంటు లో ప్రదర్శన చేసిన అనంతరం సైనిక పటాలం తో తెలంగాణలో ప్రవేశించాలని చూసిన జగన్ ను వరంగల్ ప్రజలు వట్టి చేతులతో నిలువరించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కంకర రాళ్ళే కరుకు తుపాకులను ఎదిరించాయి. 2010 మే 28 జగన్ బహుశ ఆయన జీవితంలో తొలిసారిగా మడమ తిప్పారు. తెలంగాణా ఉద్యమ చరిత్రలోనే అదొక చీకటి రోజు. ఎందుకంటే విడత తెలంగాణా ఉద్యమం పట్ల  ప్రభుత్వాలు ఎంత అమానుషంగా వ్యవహరించినా తుపాకిని పెల్చలేదు. రబ్బరు బుల్లెట్లు, భాస్పవాయు గోళాలు విసిరారు తప్ప మనుషులమీడికి మరతుపాకులు ఎక్కుపెట్టలేదు. మహా కర్కోతకమైన రాజ్యం చేయలేని సాహసానికి జగన్ అనుచరగణం ఒడిగట్టింది.  గుల్ల వర్షం కురిపింఛి తెలంగాణా హృదయాలను గాయపరిచింది. కాకతాళీయమే కావచ్చు కానీ సరిగ్గా రెండేళ్లకు అదే రోజున  ఆయన  జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని తెలంగాణా వాదులు మానుకోట రాళ్ళ మహిమగా అభివర్ణిస్తున్నారు. వాటిని ఇప్పుడు గ్రామగ్రామానా నిలిపి పూజిస్తున్నారు.  

ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా కొందరు జగన్  నామ స్మరణ చేస్తూ చంద్రబాబు నాయుడే విలన్ నెంబర్ వన్ అంటున్నారు.  తెలంగాణా విషయంలో ఇద్దరిలో పెద్ద తేడా లేదు. రెండు పార్టీల వైఖరీ ఒకటే. ఇద్దరూ రెండుకళ్ళ సిద్ధాంత ప్రచారకులే. ఇద్దరూ కుట్రలో సమాన భాగస్వాములే అయినప్పుడు వన్, టూ ఉండవు. అలా ఉందని చెప్పడం ఒక రాజకీయం. నిజానికి జగన్ కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేయకుండా ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి. ఇప్పటికి మనం తెలంగాణా రాష్ట్రంలో ఉండేవాళ్ళం. జగన్ తిరుగుబాటు కాంగ్రెస్ ను బలహీన పరచడానికే కాదు, తెలంగాణా నిర్ణయాన్ని నిలిపివేయడానికి కూడా కారణమయ్యింది. కాంగ్రెస్ సీమంధ్ర   శాసన  సభ్యులు జగన్ వెంట వెళ్తారన్నతప్పుడు నివేదికలు కారణమయ్యాయి. కాంగ్రెస్ భయపడింది, ఇప్పటికీ భయపడుతున్నది మూలిగే ముసలి నక్కలా ఉన్న తెలుగుదేశం పార్టీని చూసి కాదు, మింగేసే యువ కిశోరంగా గర్జిస్తోన్న జగన్ ను చూసి మాత్రమే నని గమనించాలి. జగన్ ను లోలోపలో, బహిరంగంగానో సమర్ధించే వాళ్ళు ముందుగా తెలంగాణా పై ఆయన వైఖరి స్పష్టంగా చెప్పేలా ఒప్పిస్తే మంచిది. అప్పుడు ఆయనను నేరుగా అనుసరించినా అడ్డుకునే వాళ్ళు ఉండరు

తెలంగాణా ఉద్యమం కేవలం దేవుళ్ళను, దేవుడు చేసిన ఇలాంటి మనుషులనో నమ్ముకోకూడదు.   ఉద్యమం కులమైనా, మతమైనా తమకు తెలంగాణా మాత్రమే అనే ఆలోచనాపరులైన ఒక క్రియాశీల  వర్గాన్ని  తయారు చేసింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల, రాజకీయ సమీకరణాల పట్ల వర్గం ఆప్రమత్తంగా ఉండాలి.  తెలంగాణా ప్రజలు చట్టాన్నిన్యాయాన్ని,  రాజ్యాంగ ధర్మాన్ని మాత్రమే నమ్ముతారని ఇప్పటికే ఉద్యమం రుజువు చేసింది.  మతమైనా, కులమైనా అది పెంచి పోషించే అభిమానం ఏదయినా మనిషిని ఒక మత్తులోకి తీసుకేల్లుతుంది. మాయలో ముంచివేస్తుంది. అలా మాయలో పడిపోయిన ఎవరయినా   తమనే కాదు,  తమ లక్షాన్ని కూడా మరిచిపోతారుతెలంగాణా ప్రజానీకం మాయ వలలో  పడకూడదనే అనుకోవాలి

        Part of this post is published in Namasthe Telangaana on 1st June 2012

2 కామెంట్‌లు: