శుక్రవారం, మార్చి 09, 2012

ఈ విరామం ఇక చాలు...


చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వైఖరి. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక కూడా ఆ పార్టీ తన స్థాయి గుర్తించకపోవడం విడ్డూ రం. ప్రతి పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటించినా, సోనియా ఏజెంట్లు మాత్రం ఇంకా తలబిరుసు మాటలే మాట్లాడుతున్నా రు. గులాంనబీ ఆజాద్‌నే తీసుకోండి. ఆయన తెలంగాణ ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ ఇచ్చే విషయం ఆలోచిస్తాడట. ఆయన కశ్మీర్ మఖ్యమంవూతిగా ఉన్న కాలంలో భూమి కేటాయింపు విషయంలో హిందూ ముస్లింల మధ్య వివాదాలు పెద్దవి చేసి శాసనసభలో అవిశ్వాసం పాలయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆజాద్ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యం మరింత పెరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే తెలంగాణ విషయం తేల్చేస్తామని చెప్పిన ఆయన..

ఇప్పుడు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రం ఇస్తామని అన్నట్టు వార్తలొస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ప్రతి ఏడాది ఏవో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తూనే ఉన్నా యి. సరిగ్గా ఏడాది కిందట పశ్చిమబెంగాల్ ఎన్నికలకు ముందు కూడా ఇదే కథ చెప్పింది. ఎన్నికలు అయిపోగానే తెలంగాణ ఇచ్చేస్తామని ఆ పార్టీ నేత లు ముక్తకం చెప్పారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న ఆజాద్ తెలంగాణ అంశాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని ఒకసారి డిసెంబర్ అని, దీపావళి అని.. హోలీదాకా లాక్కొచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల ఛీత్కారానికి గురైనా ఇక్కడ ఎన్నికల్లో గెలిపించమని కోరడం, గెలిపిస్తే తెలంగాణ ఇస్తామని ఆశ చూపడం అవకాశవాదం తప్ప మరోటి కాదు. జాదూ చేయడంలో ఆజాద్‌ను మించిన వాళ్లు ఇంకొకరు కనిపించరు. ఆ జాదూ పార్టీ వరకో, పదవుల కోసమో అయితే పరవాలేదు. కానీ ప్రజాస్వామ్యంతో కూడా అదేస్థాయిలో పరాచికాలాడగల వ్యక్తి ఆయన. 

కేవలం మాయమాటలతో ప్రజలను మోసం చేస్తూ వస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ఉత్తరవూపదేశ్‌తో సహా మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు కనివిప్పు కలిగించాలి. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా ప్రకటించి ఫైనల్‌గా రాహుల్‌గాంధీని రాజును చేయాలని కలగన్న ది. ఆ పాచిక పారలేదు సరికదా ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా రెండేళ్ల తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఊపును తీసుకు రావాలనుకున్న కాంగ్రెస్ ఆశలు పూర్తిగా చెదిరిపోయాయి. ఉత్తరవూపదేశ్ పరాజయం ఆ పార్టీని, రాహుల్ కూటమిని నైతికంగా కుంగదీసింది. అంతేకాదు మిత్రుల అలకలతో లుకలుకలాడుతున్న యూపీఏకు రానున్న రెండేళ్లు దినదిన గండంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. బీజేపీ పరిస్థితి కాంగ్రెస్‌కు భిన్నంగా లేదు. రాబోయే కాలంలో కేంద్రంలో అధికారం తమదేనని ఉత్సాహపడుతున్న ఆ పార్టీ మీద కూడా ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లినట్టే ఉన్నాయి. అయినప్పటికీ తామే అధికారంలోకి వస్తామని, తెలంగాణ తామే తెస్తామని ఆ పార్టీ తెగ ప్రచారం చేసుకుంటున్నది. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మహబూబ్‌నగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించి మిగతా అందరికంటే తామే మెరుగు అనే ప్రచారం చేస్తోంది. రాబోయే కాలంలో కొత్త రాజకీయ సమీకరణలు తెరమీదికి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు సమానంగా ఓటమిని పంచుకోవడం, స్థానిక అంశాల ఎజెండాతో ముందుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు విజయం సాధించడం భవిష్యత్ రాజకీయ చిత్రపటంలో మార్పుకు సంకేతంగా భావించాలి. కేవలం పార్టీలకే కాదు, ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో నేర్చుకోదగిన పాఠాలు ఉన్నాయి.

ఒక రకంగా ఇవి తెలంగాణవాదానికి వ్యతిరేక ఫలితాలు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బహుజన సమాజ్ పార్టీ మూడు ఓడిపోవడం తెలంగాణకే కాదు ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలకు కలిసి వచ్చే అంశం కాదు. ఈ మూడింటిలో ఏ ఒక్క పార్టీ యూపీలో గెలుపొందినా పరిస్థితులు వేరుగా ఉండేవి. స్థానిక రాజకీయ కూటములు, ప్రాంతీయ పార్టీలు బలపడితే అది ముమ్మాటికీ ఉప ప్రాంతీయ అస్తిత్వాలకు, ఉద్యమాలకు వ్యతిరేక సంకేతమే అవుతుంది. అదే సమయంలో ఇది జాతీయస్థాయిలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు కలవరపెట్టే పరిణామం. ఆ కలవరపాటు తో పాటు 2014లో అధికారంపట్ల బెంగ కూడా ఈ పార్టీలో సహజం. అలాంటి సందర్భంలో ఉద్యమం ఉధృతమైతే తప్ప ఈ రెండు పార్టీలు తెలంగాణ విషయంలో నిలబడే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలే కాదు, పార్లమెంటు ఎన్నికలలోపు రానున్న ఏ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. రెండేళ్లలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నా యి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హిమాచల్‌వూపదేశ్, మధ్యవూపదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌వూపదేశ్‌లలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచే సూచనలే ఉన్నాయి. కర్ణాటకతో సహా మరికొన్ని చోట్ల బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుంది. 

ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు ఇచ్చిన మాటకు కట్టుబడతాయా అన్నది ప్రశ్న. బీజేపీ విషయాన్నే తీసుకుం దాం. ఆంధ్రవూపదేశ్‌లో బీజేపీ తెలంగాణ పాట పాడుతున్నా.. ఆ పార్టీ ఆచరణలో ద్వంద్వ నీతితోనే ఉన్నది.199లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన ఆ పార్టీ ఏడేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆ అంశాన్ని తొక్కిపెట్టింది. ఆ నెపం టీడీపీ మీదకు నెట్టింది. 2014లో కూడా బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే సూచనలు లేవు. చిన్న చితకా పార్టీల సహకారంతోనే అధికారంలోకి రావాలి. అలాంటప్పుడు తెలంగాణ కోసం కట్టుబడి ఉంటుందా అన్న సందేహాలు సహజం. పైగా ఇవాళ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న తరుణంలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా జేఏసీలో ఉంది తప్ప తెలంగాణ కోసం రాజకీయ పోరాటం చేయలేదు. తెలంగాణవాదులంతా రాజీనామాలు చేసినప్పుడు కూడా ఆ పార్టీ రాజీనామాలకు ముందుకురాలేదు. 

ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జై తెలంగాణ అంటూ యాత్రలు చేయడం మినహా ఆ పార్టీ నిర్మించిన పోరాటం ఏదీ లేదు. అద్వానీ, సుష్మాస్వరాజ్ మొదలు కిషన్‌డ్డి దాకా బహిరంగ సభలు పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడానికి చూశారు. ఉద్యమ కాలంలో సాగిన వేధింపుల పైనగానీ, పెట్టిన కేసుల విషయంలో కానీ, సమ్మెలు, సహాయనిరాకరణల సందర్భంగా గానీ స్వతంత్ర కార్యక్షికమాలేవీ చేపట్టలేదు. త్వరలో జైఆంధ్ర అంటామన్నా, ఇప్పటివరకు ఆంధ్రాలో ఆమేరకు చేసిన ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. ఆ లెక్కన చూసినప్పుడు సీపీఐ చాలా నయమనే చెప్పుకోవాలి. ఆ పార్టీ నేత నారాయణ ఏ ప్రాంతంలోనైనా ఒకే మాట మాట్లాడుతున్నాడు. ఎన్ని ఒత్తిడులున్నా ఉప ఎన్నికల్లో తెలంగాణవాదానికి మద్దతునిస్తామని స్పష్టమైన వైఖరితో ఉన్నారు. కానీ తెలంగాణవాడే అయి న కిషన్‌డ్డి మాత్రం వెంకయ్యనాయుడి కనుసన్నల్లో నడుస్తున్నాడన్న విమర్శలు ఆ పార్టీలోనే ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో పోటీ కూడా ఆ పార్టీ సొంత ఎజండాలో భాగమే తప్ప తెలంగాణకోసం కాదని అర్థమవుతున్నది. పార్లమెంటులో ఒకరోజు మాట్లాడడం, బిల్లుపెడితే మద్దతు ఇస్తామనడం మాత్రమే తెలంగాణకోసం పోరాడుతున్నామని చెప్పడానికి సరిపోతామని అనుకుంటే పొరపాటు. ఆ పార్టీ జాతీయ ఎజెండాలో రాష్ట్రాల విభజన విషయంలో స్పష్టత ఉండాలి. అది ఇప్పటికైతే కొరవడింది.

ఇక కాంగ్రెస్ అవకాశవాదానికి అంతేలేదు. అయితే ఈ ఎన్నికలు, రాబో యే కాలంలో ఎదురయ్యే పరీక్షలు కాంగ్రెస్‌ను ఇంకా బలహీనపరుస్తాయి. ఒకచోట బలహీనపడుతున్నప్పుడు ఇంకొక చోట బలపడే ప్రయత్నాలు చేయడం ఆ పార్టీ మొదటినుంచీ చేసే పనే. యూపీఏ భాగస్వామ్యపక్షాలు దయతలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా మిగిలి ఉన్న రెండేళ్లు అధికారంలో ఉండే అవకాశాలు లేవు. ఇప్పటికే మహారాష్ట్రలో ఎదురవుతున్న పరాభవాలను పసిగట్టిన శరద్‌పవార్ కాంగ్రెస్ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. మమతాబెనర్జీ ఎలాగైనా సరే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోవాలని చూస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కరుణానిధి అన్ని అవమానాలు దిగమింగి యూపీఏ మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. వీళ్లంతా ఎప్పుడైనా యూపీఏకు విడాకులు ఇవ్వొచ్చు. అదే జరిగితే మధ్యంతరం తప్పదు. లేదంటే మరో రెండేళ్ల పాటు ఇలాగేనెట్టుకురావాలి. ఈ స్థితిలో కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచే విధంగా తెలంగాణ ఉద్యమకారులు పావులు కదపాలి.

 కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరిస్థితి గాలిలో దీపంలా ఉన్నది. ఈ ఉపఎన్నికల్లో, రాబోయే 17 నియోజకవర్గాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైతే ఇక్కడి ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. కాబట్టే ఉప ఎన్నికలు కీలకమని గుర్తించాలి. రాజకీయ పార్టీలు అధికారానికి దూరమవుతామన్న సంకేతాలు ఉంటే తప్ప ప్రజల మాట వినవు. ఇప్పుడు అది వినపడాలంటే ఆయా పార్టీలను ఓడించాలి. అయితే ఎవరిని గెలిపించాలి? గెలిపిస్తే గెలిచి న వాళ్లు తెలంగాణ తెచ్చారా? మళ్లీ గెలిపిస్తే ప్రజలకు ఒరిగేదేమిటి అనే ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. నిజమే రాజీనామాలు కోరి, ఎన్నికలు అనివార్యం చేసిన ఉద్యమకారులు ఇప్పుడు చేతుపూత్తేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. తెలంగాణ తేలాల్సింది చట్టసభల్లోనే అంటున్నప్పుడు ఆ సభలకు ఎవరిని పంపాలో ప్రజలే తేల్చుకోవాలి. ఎన్నికల వల్ల తెలంగాణ రాదు, ఉద్యమాల వల్లే తెలంగాణ వస్తుందన్నది నిజం. కానీ ఆ ఉద్యమాలు ఎవరిమీద ఎవరు చేయాలి? ఎవరు నడిపించాలి? అనేది ఆలోచించాలి. తెలంగాణ విషయంలో ఎన్నికల పార్టీలు పుట్టడానికంటే చాలా కాలం ముందే ఉద్యమ సంస్థలు పుట్టాయి. తెలంగాణ కల నెరవేరకపోవడం వెనుక ఎన్నికల్లో లబ్ధిపొందుతున్న పార్టీలకు ఎంత బాధ్యత ఉందో ఆ పేరు మీద నడుస్తున్న ఉద్యమ సంస్థలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఈ ఎన్నికలు ఉద్యమంలో వచ్చిన రాజీనామాల పర్యవసా నం అని మరిచిపోరాదు. ఎమ్మెల్యే లంతా రాజీనామా చేయాలని జేఏసీలు, తెలంగా ణ పౌర సంఘాలు, ఉద్యమ వేదికలు డిమాండ్ చేశాయని తెలిసిందే. దానికి తెలంగాణ శాసనసభ్యులు, పార్టీలు పెద్దగా స్పందించలేదు. అది ఆయా పార్టీల బలం కాదు. ముమ్మాటికీ ఉద్య మ బలహీనతే. ఆయా పార్టీలు చట్టసభల మీద ఒత్తిడి తేవడంలో విఫమయినట్టుగానే తెలంగాణ ఉద్యమం ఆయా పార్టీలను ప్రభావితం చేయడం లో విఫలం అయినట్టుగానే లెక్క. 

ఇట్లా ఎవరి లెక్కలు వాళ్లే వేసుకుంటూ పోవడం వల్లే తెలంగాణ ఉద్యమం ఎక్కడిగొంగడి అక్కడి లాగానే ఉన్నది. ఇప్పుడు కూడా అదే గొంగట్లో అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు సీట్లు ఏరుకు ని పంచుకునే స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు లెక్కతప్పినా 2014లో చూసు కుందాం అని టీఆర్‌ఎస్ పదేపదే చెబుతున్న మాటలు కూడా ఎవరూ నమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్, బీజేపీ రెండూ నిర్ణాయకస్థితిలో లేకపోతే, ఒకవేళ ఉన్నా తెలంగాణలో వచ్చే పదో పదిహేనో పార్లమెంటు స్థానాలు వద్దనుకుంటే పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు మూడునెలల్లో రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు రావచ్చు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ జేఏసీ రెండు కీలక నిర్ణయా లు తీసుకోవాలి. ఒకటి -ఎన్నికల కోసమే ఉద్యమంలో ఉన్న పార్టీల ప్రమే యం లేకుండా జేఏసీని పునర్వ్యవస్థీకరించడం. రెండోది- తక్షణమే స్వతం త్ర ప్రజా ఉద్యమాన్ని తదనుగుణమైన ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించ డం. ప్రజలు రాజకీయ పార్టీలకంటే జేఏసీ నాయకత్వాన్నే ఎక్కువగా నమ్ము తున్నారు. జేఏసీ పట్ల ఉన్న గౌరవం పార్టీలకు అస్సలు లేదని మహబూబ్‌నగర్ ఎన్నికల విషయంలో స్పష్టం అయింది. ప్రజలు, ఎన్నికల లాభ నష్టాలతో సంబంధంలేని రాజకీయ సంస్థలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం ముఖ్యంగా విద్యార్థి, యువజన వృత్తి సంఘాలు తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపాన్ని ఇవ్వాలి. 

సకల జనుల సమ్మె విరమణ సందర్భంగా అది విరామం మాత్రమే అన్నారు. ఇంకా ఆరాంగా అదే విరామ స్థితిలో ఉంటే రాజకీయ పరిణామాలు మొదటికే మోసం తేవచ్చు. ఏడాదిలోపే కొత్త కూటములు ఏర్పాటు కావచ్చు. మమత, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ములాయం వంటి నేతలు తెరమీదకు రాబోతున్నారు. వీళ్లెవరూ రాష్ట్రాల విభజనకు అనుకూలం కాదు. కాబట్టి ఈ లోగా విరామం నుంచి బయటపడి కాంగ్రెస్ మీద వత్తిడి పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత తెలంగాణ విషయం తేల్చుతామని చెప్పిన వారికి ఎన్నికలు ముగిసిన సంగతి, అక్కడ ఓడిపోయిన సంగతి గుర్తుచేయాల్సిన బాధ్యత జేఏసీ మీద ఉంది. తెలంగాణను వెంటనే తేల్చకుండా ఇక్కడ అధికారంలో ఉండలేరని అర్థం చేయించాలి. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి