మంగళవారం, మార్చి 07, 2023

అంబేడ్కర్: మా ఆకాంక్ష- కేసీఆర్ సంకల్పం !!




'When a person really desires something, all the universe conspires to help that person to realize his dream. 
 
ఇదొక పాపులర్ రచయిత చెప్పిన మాట!
ఈ మాట ముమ్మాటికీ కేసీఆర్ కు వర్తిస్తుంది!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్  మహా విగ్రహం ఏర్పాటు విషయంలో అవాంతరాలు వచ్చి ఉండవచ్చు,
కానీ అది పూర్తి కాకుండా ఏ శక్తీ అడ్డుకోక పోయింది.
ఇప్పుడు ఒక్కొక్క పుస్తకాన్ని పేర్చుకుంటూ , బోధిసత్వుని శిష్యుడు నగరం నడిబొడ్డున అవతరిస్తున్నాయి.
ఇది మా కాంక్ష!  కేసీఆర్ సంకల్పం!!

సంకల్పం మంచిదైనప్పుడు ఒక పని జరగడం ఆలస్యం అవుతుందేమో కానీ అది నెరవేరడం మాత్రం పక్కా! ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహ ఏర్పాట్లను గమనిస్తున్నప్పుడు నాలో కలిగిన భావన. నిజానికి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం గురించిన నేపధ్యాన్ని గురించి చాలాకాలంగా రాయాలనుకున్నా కానీ రాజ్యాంగ బాధ్యతలలో ఉండడం మూలంగా కొంత, అనుకున్న రీతిలో పని జరగక పోవడం వలన మరికొంత ఆలస్యం అయింది. కానీ ఇప్పుడు శరవేగంగా సాగుతున్న పనులు చూస్తున్నప్పుడు, మిత్రులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు, పత్రికల్లో వస్తున్న ఫోటోలు, వార్తలు చూస్తున్నప్పుడు ఒక కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నావరకు నాకు ఒక ఉద్వేగ సందర్భం.   

2016 ఏప్రిల్ 7 సాయంత్రం ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. చైర్మన్ గారు రేపు ఉగాది, ఏం చేస్తున్నారు అని అడిగారు. ప్రత్యేకంగా ఏమీ లేదు సార్, సెలవే కదా అన్నాను. సరే అయితే ఉదయమే ఇంటికి రండి అని ఆహ్వానించారు. 9 గంటలకల్లా అక్కడికి చేరుకున్నాను. ఒకరిద్దరు అతిధులు తప్ప పెద్దగా రద్దీ ఏమీ లేదు.  పచ్చడి, ప్రసాదం తరువాత 'పదండి రవీంద్రభారతి దాకా వెళ్లి వద్దాం' అన్నారు. ఆరోజు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాంగ శ్రవణం ఉంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర మంత్రులు అక్కడ  ఉన్నారు. ముఖ్యమంత్రి గారి కారులో నేను, మల్లేపల్లి లక్ష్మయ్య బయలుదేరాం. వచ్చే వారం పది రోజుల్లో అంబేడ్కర్ గారి జయంతి రాబోతుంది, ఈ సారి బాగా జరుపుకోవాలి అన్నారు. గడిచిన ఇరవై ముప్పై ఏళ్లుగా నేను చూస్తున్నాను హైదరాబాద్ లో అంబేడ్కర్ గారి జయంతి కి ఒక ప్రత్యేకత ఉంది,  ఒక మహా ఉత్సవంలా, భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. అనేక మంది సామాన్యులు సైతం పిల్లాపాపలతో ట్యాంకుబండ్ కు వస్తారు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు వస్తాయి, ఈ సారి ఘనంగా చేద్దాం అన్నారు. కానీ సర్ ఇప్పుడున్న ట్యాంక్ బండ్ విగ్రహం దగ్గర ఫ్లైఓవర్ రావడం మూలంగా ఇరుకై పోయింది, అంబేడ్కర్ గారి విగ్రహం పైనుంచే ఫ్లైఓవర్ వెళుతుంది, ఎక్కడైనా ఒక విశాలమైన వేదిక ఏర్పాటు చేస్తే బాగుండేది అన్నాను నేను. లక్ష్మయ్య గారు కూడా అవునన్నారు. ఒక ఎకరా, రెండెకరాల స్థలంలో అంబేడ్కర్ స్క్వేర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నాను . ఎక్కడైతే బాగుంటుందో చెప్పండి అన్నారు. అక్కడే మంచి విగ్రహం కూడా ఏర్పాటు చేద్దాం అని ముఖ్యమంత్రి గారే అన్నారు. నిజమే సార్, ఇది ఆయన నూట ఇరవై ఐదవ జయంతి కాబట్టి మహారాష్ట్రలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చదివాను, మనం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది అని చెప్పాను.   ఈ లోగా రవీంద్ర భారతి వచ్చింది. ఆయన తనతో పాటు నన్ను కూడా వేదిక మీదకు తీసుకుని వెళ్లారు. ఆయన ప్రసంగంలో ఉద్యోగాల గురించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ప్రస్తావించారు. నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు. 
 
 ముఖ్యమంత్రి గారి ప్రసంగం 
 
మీటింగ్ అయిపోగానే ఆయన తన వ్యక్తిగత సిబ్బందికి ఏదో చెప్పారు.  నేను ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రగతి భవన్ కు బయలుదేరాం. కానీ వచ్చిన దారిలో ఖైరాతాబాద్ నుంచి కాకుండా కాన్వాయ్ ట్యాంకుబండ్ వైపు బయలు దేరింది. 'ఒక పని చేద్దాం, సెక్రటేరియట్ ఎదురుగా ఐమాక్స్ పక్కన అయితే ఎలా ఉంటుంది అన్నారు. ఆయన దీని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమయ్యే లోపే 'మన పరిపాలనా సౌధం ముందు అంబేడ్కర్ గారు ఉండడం మంచిది' అన్నారు, 'ఆయన వెనుక బుద్ధుడు కూడా ఉంటారు' అన్నారు. నిజంగానే నేను ఆశ్చర్య పోయాను. ఈ లోగా ఆ స్థలానికి చేరుకున్నాం. సర్ ఇది ఎన్టీఆర్ గార్డెన్, ఆయన సమాధి కదా అన్నాను నేను. ఎన్టీఆర్ సమాధి కేవలం ఐదెకరాలు మాత్రమే, ఇంకా ఇరవై ఎకరాలకు పైగా ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, అందులో కొంత ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో, కోర్ట్ కేసుల్లో ఉంది. మిగితా స్థలం సరిపోతుంది అంటూ అక్కడ ఉన్న ఒక గుట్ట బోడు లాంటి ప్రదేశాన్ని చూపించి దానిపైనే 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం అన్నారు. ఒక్క విగ్రహమే కాదు, సమావేశ మందిరం, ఓపెన్ ప్లాజా, లైబ్రరీ, పార్క్, పార్కింగ్ ప్లేస్, మ్యూజియం .. ఇలా చెప్పుకుంటూ పోతున్నారు.  ఈ లోగా ముఖ్యమంత్రి గారి నివాసం చేరుకున్నాం. 
 
లోపలి వెళ్తూనే ఆయన తన కార్యాలయ అధికారులను పురమాయించి సంబంధిత మంత్రులను, అధికారులను పిలిపించారు.  అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గారు వెంటనే వచ్చారు. సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గురించి వాకబు చేశారు. ఆయన ఉగాది   వేడుకల కోసం సూర్యాపేట వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఉన్నారని చెప్పారు.  ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్ హర్ ఎక్కా గారు, కార్యదర్శి ఎం వీ రెడ్డి,   సలహా దారు రామ్ లక్ష్మణ్ గారు,  మల్లేపల్లి లక్ష్మయ్య గారు, గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,  మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ ఎం డి ఏ అధికారి చిరంజీవులు, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి గారు ఇలా అనేకమంది ఒక గంటలో చేరుకున్నారు. ముఖ్యులను భోజనానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి  అంబేద్కర్ విగ్రహ ప్రణాళికను  వివరించి అందరినీ ఆశ్చర్య పరిచారు. అంబేడ్కర్ విగ్రహం తో పాటు, మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కు ప్రత్యేక భవనం, ట్యాంక్ బండ్ దిగువన ఉన్న అంబేడ్కర్  భవనం స్థానంలో ఒక బహుళ అంతస్తుల భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు.  సాయంత్రానికల్లా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేమంతా సభ్యులుగా ఒక కమిటీ వేశారు. 
 

ఈ లోగా మిత్రుడు ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ ఒక మంచి ఆలోచన తో ముందుకు వచ్చారు. అప్పటికి ఉన్న గురుకులాలను తోడు మరో వంద గురుకులాలు కూడా కొత్తగా మంజూరు చేస్తే బాగుంటుందని, ముఖ్యమంత్రి గారితో ఈ మాట చెప్పమని అడిగారు. సర్ కేవలం విగ్రహం, భవనాలే కాకుండా  బడుగు వర్గాల  పిల్లలకు ఉపయోగపడే గురుకులాలు కూడా కొత్తగా కేటాయిస్తే బాగుంటుంది అన్నాను. కొత్తగా 125 గురుకులాలు కూడా ఏర్పాటు చేసే విషయం పరిశీలించండి అని అడిగాను.  అయితే ప్రతిపాదనలు సిద్ధం చేయండి, మంత్రిగారిని కలిసి  మాట్లాడండి అని ప్రవీణ్ గారిని పురమాయించారు. నేను,  ప్రవీణ్ కుమార్ గారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్ళాం, అప్పటికే సాయంత్రం కావొచ్చింది. ప్రవీణ్ కుమార్ గారు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రి గారికి వివరించారు. ఆయన వెంటనే సంతకం చేసి పంపించారు.
 
వారం రోజుల పాటు కడియం శ్రీహరి గారి కమిటీ అనేక దఫాలుగా సమావేశమై, స్థలాలు పరిశీలించి అన్ని జీవోలను విడుదల చేసింది. ఆ సందర్బంగా నేను మరో విషయం కూడా  ప్రస్తావించాను. మధ్యలో చదువు మానేసిన లక్ష మంది యువతీ యువకులను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుర్తించి   అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేర్పించి ఫీజులు ప్రభుత్వమే భరించి  డిగ్రీలు పూర్తి చేసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాలని కూడా సూచించాను. ఇటువంటి పథకం చైనాలో గ్రామీణ యువకులకు ఏర్పాటు చేసి, పదిలక్షల మందిని చదివించారని చెప్పను. ఈ ప్రతిపాదన కమిటీకి నచ్చింది. వెంటనే దానికి సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు, కానీ అధికారుల అలసత్వం వల్ల అది కార్యరూపం దాల్చలేదు.  కానీ అనుకున్న విధంగా కేసీఆర్ గారు ఏప్రిల్ 14 న మహా విగ్రహానికి భూమిపూజ చేశారు. అలాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కు, అంబెడ్కర్ భావం కు కూడా శంకుస్థాపన చేశారు. 125 గురుకులాలు అడిగితే 200 కు పైగా గురుకులాలు ప్రకటించారు. ఆ రోజు జనంలో ఉన్న నన్ను సభావేదిక మీదికి ముఖ్యమంత్రిగారు పిలిచి అభినందించారు. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాను. 
 

నిజానికి అప్పటికి మాలో ఎవరికీ ఈ భారీ విగ్రహాల తయారీ తయారీ గురించి తెలియదు. కాబట్టి మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి నాకు అప్పటికే మంచి మిత్రులుగా ఉన్న శిల్పి రమణారెడ్డి, జె ఎం టీ యు ఫైన్ ఆర్ట్స్ కళాశాల శిల్పకళ  ఆచార్యులు  శ్రీనివాస రెడ్డి ని సంప్రదించాం. వారిద్దరూ, మరికొంత మంది శిల్ప నిపుణులు కూడా సమావేశానికి వచ్చారు. అంతటి భారీ విగ్రహాలు తయారు చేసే సామర్థ్యం కేవలం చైనాలో మాత్రమే ఉందని, దానికి సమయం కూడా పడుతుందని చెప్పారు. అయితే చైనా సంస్థలకు కూడా మనం ప్రొటోటైప్ (చిన్న సైజు విగ్రహాలు) తయారు చేసి, నమూనాలు ఇస్తే మాత్రమే వారు తయారు చేయగలరని చెప్పారు.  వారు చెప్పిన విషయాలు మమ్మల్ని కొంత నిరాశ పరిచాయి. ముఖ్యమంత్రి గారు మాత్రం ఫరవాలేదు అవసరమైతే చైనా వెళ్లయినా సరే విగ్రహం చేయించండి. ఈ లోగా దేశంలో ఉన్న భారీ విగ్రహాలు పరిశీలించండి అని చెప్పారు. హైదరాబాద్ ముచ్చింతల లో  అప్పుడే నిర్మాణం ప్రారంభమైన రామానుజాచార్యుల  విగ్రహం, సిక్కింలోని బుద్ధ విగ్రహాలు పరిశీలించి వచ్చాము, అల్లాగే మరొక కమిటీ ఉత్తరప్రదేశ్ లో మాయావతి ఏర్పాటు చేసిన పార్కులు, విగ్రహాలు చూసి వచ్చింది. ఆ తరువాత కమిటి చైనా కూడా వెళ్ళింది. పనుల ఒత్తిడి వల్ల నేను ఆ పర్యటనకు వెళ్ళలేదు. ఇదంతా జరగడానికి ఏడాది పైగా పట్టింది. ఈ లోగా రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి మరికొందరు శిల్ప నిపుణులు వివిధ భంగిమల్లో అంబెడ్కర్ గారి ప్రొటోటైప్ విగ్రహాలు సిద్ధం చేశారు. వాటిని పరిశీలించి, నచ్చక మరికొన్ని కూడా రూపొందించారు. ఎంపిక కానీ వాటిలో ఒకటి మిత్రుడు రమణా రెడ్డి నాకు ఇచ్చారు. అది మా ఇంట్లో పదిలంగా ఉంది.
 
 
                                     మిత్రుడు రమణారెడ్డి రూపొందించిన విగ్రహం నమూనా
 
చివరగా అన్నీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలించి వాటిలో ఒకటి ఎంపిక చేశారు. బహుశా ఇవన్నీ జరిగే సరికి మరో ఏడాది పట్టింది. నియామక ప్రక్రియ వేగవంతం కావడంతో నేను కమిటీ మీటింగులకు వెళ్లలేకపోయాను. ఈ లోగా ఎన్నికలు జరగడం, మంత్రులు మారడం, చైనా కంపెనీలకు గ్లోబల్ టెండర్లు దానికి తోడు చైనానే కాకుండా మొత్తం ప్రపంచాన్ని రెండేళ్లపాటు స్తంభింప చేసిన కరోనా ఇట్లా అనేక పరిణామాలు ఆలస్యానికి తోడయ్యాయి. ఒక దశలో చాలామంది ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే దాకా పోయారు. 125 అడుగుల అంబేద్కర్  విగ్రహం ఏమైంది ? అని అడిగారు. ప్రపంచం కొంత కుదుట పడిన తరువాత తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు స్వయంగా రంగంలోకి దిగి కొప్పుల ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో కమిటీని పునర్వ్యవస్థీకరించి పనులు పూర్తి చేశారు. బాల్క సుమన్, మల్లేపల్లి లక్ష్మయ్య, మిగితా మిత్రులు ఆ కమిటీలో కూడా ఉన్నారు. 
 
సిక్కిం లో భారీ బుద్ధ విగ్రహం వద్ద

 మిత్రుడు కందుకూరి రమేష్ బాబు తీసిన ఫోటోలు, రాసిన చిరు వ్యాఖ్య చూసిన తర్వాత ఈ నేపథ్యం మీతో పంచుకోవాలని అనిపించింది. రమేష్ లాగే నాకు కూడా ఆ పనులు చూస్తున్నప్పుడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్  రాసిన వందలాది పుస్తకాలను, లక్షలాది పేజీలను ఒక్కొక్కటిగా క్రమపద్ధతిలో పేర్చినట్టు గానే అనిపిస్తుంది.  విగ్రహాలతో కడుపు నిండుతుందా, కష్టాలు తీరుతాయా అని రాగాలు తీసే వారు ఉండవచ్చు. కానీ అంబేద్కర్ అంటే అణగారిన శక్తులకు ఆత్మగౌరవ పతాక. ఆకాంక్షల ప్రతీక. హుసేన్ సాగర్ నడుమ నిలబడి ఉన్న బోధిసత్వుని ఎదురుగా ఆయన మార్గాన్ని అనుసరించి, ధమ్మాన్ని బోధించిన సమతా మూర్తి 125 అడుగుల  విగ్రహం ఈ రాష్ట్రానికి కూడా భవిష్యత్హులో మార్గం చూపుతుందని, ఆయన చూపుడు వేలును  డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం అనుసరిస్తుందని ఆశిస్తున్నాను.

                                                                                                - ప్రొ . ఘంటా చక్రపాణి                                                                                                                  డైరెక్టర్, అకాడమిక్                                                                        డా. బి. ఆర్. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్  

The Hans India 

The Hindu