శనివారం, జనవరి 21, 2023

యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అడ్డెవరు?


ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్ని మీట్ కోసం వెళ్ళినప్పుడు తారసపడ్డ అనేక మంది యూనివర్సిటీ అధ్యాపకుల నియామకం విషయం గురించి ప్రస్తావించారు. విద్యార్థులు, స్కాలర్లు, అధ్యాపకులు, కాంట్రాక్టు పద్ధతిలో బోధన చేస్తున్న  మిత్రులు చాలా మంది ఈ విషయమే ప్రధానంగా ప్రస్తావించారు. ఒకరిద్దరు వీసీలు కూడా అధ్యాపకుల కొరత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.దీనికి తోడు ప్రజా రంగంలో ఉన్న మేధావులు కూడా విశ్వవిద్యాలయాల స్థితిగతుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీలయినప్పుడల్లా సోషల్ మీడియా తో పాటు ఇతర బహిరంగ వేదికలమీద ఎదురైన వారినల్లా అడుగుతూనే ఉన్నారు. దీనితో నాకు ప్రత్యక్ష సంబంధం లేక పోయినా ఒక 
అధ్యాపకుడిగా తెలిసిన విషయాలను పంచుకోవడం నా బాధ్యత అనిపించింది. 
 
ఈ నేపథ్యంలో ఉస్మానియా గ్లోబల్ అలుమ్ని మీట్ రెండో రోజు నా సెషన్ ఒకటి ఉండింది. ఉన్నత విద్య - సవాళ్లు అనే పేరుతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాల వీసీలు, మాజీ వీసీలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు తదితరులతో ఈ గోష్ఠిని నేను నిర్వహించాను. 16 మంది ఉన్నత విద్యారంగ అతిరథ మహారథులు పాల్గొన్న ఈ సదస్సులో నేను చివరగా ఈ అంశాన్ని లేవనెత్తాను. ఎవరి కారణాలు వారికి ఉన్నప్పటికీ దీనిమీద సమగ్రమైన, స్పష్టమైన విశ్లేషణ, చర్చ జరగాలని అనిపించి ఇది రాయడం జరిగింది. ఈ వ్యాసాన్ని 'నమస్తే తెలంగాణా దినపత్రిక' రెండు భాగాలుగా కొంత కుదించి జనవరి 20, 21 తేదీల్లో ప్రచురించింది. సమగ్రతకు పూర్తి వ్యాసాన్ని  ఇక్కడ ప్రచురిస్తున్నాను.-
 

 ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం 105వ వ్యవస్థాపక సంవత్సరం ఇది. శతాబ్దానికి ముందు బ్రిటీష్ వాళ్ళు మొదటిదశలో నెలకొల్పిన విశ్వవిద్యాలయాలతో సరిసమానంగా   హైదరాబాద్ పాలకులు ఎంతో బాధ్యతగా ఏర్పాటు చేసిన చారిత్రక విద్యాలయం. ఈ వర్సిటీ ఒక్క తెలంగాణాకే కాదు, హైదరాబాద్ రాష్త్రానికి, క్కన్ ప్రాంతానికి మొత్తం దేశానికే సేవలు అందించిన సంస్థ.  జనవరి మూడు, నాలుగు తేదీల్లో ఈ విశ్వవిద్యాలయం 'గ్లోబల్ అలుమ్ని మీట్' పేరుతో విశ్వవ్యాప్తంగా ఉన్న తమ పూర్వవిద్యార్థుల సమాగమం నిర్వహించింది. ఇందులో రెండు అంశాలు కనిపించాయి ఒకటి తమ గతకాలపు ఘనతను తమ పూర్వవిద్యార్థులు సాధించిన విజయాలతో ప్రపంచానికి చాటడం. రెండోది భవిష్యత్ కార్యాచరణలో వారిని భాగస్వాములు చేసి పునర్నిర్మాణ ప్రణాళిక రూపొందించుకోవడం. అందులో విశ్వవిద్యాలయం సంపూర్ణంగా విజయవంతం అయ్యిందనే చెప్పాలి. అందుకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఇతర అధికారులను అభినందించాలి. 
 
రెండురోజుల పాటు జరిగిన ఉత్సవాలు విశ్వవిద్యాలయానికి కొత్తకళను తీసుకొచ్చాయి. ప్రముఖుల ప్రసంగాలు, చర్చాగోష్టులు, వితరణలకు తోడు సవాళ్లు, సమస్యలను కూడా ఈ వేడుకలు వేదిక మీదకు తెచ్చాయి. ఒక్క ఉస్మానియాకే పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ ఉన్నత విద్యారంగం మీద ఈ సమాగమం సమాలోచన చేసింది. నిజానికి తెలంగాణ ఏర్పాటయిన తరువాత ఉన్నత విద్యారంగంలో స్థూలంగా గణనీయమైన విజయాలు సాధించింది. ఉన్నత విద్య వికాసానికి కొలమానంగా భావించే స్థూల నమోదు నిష్పత్తి లో 2021నాటికి  36 శాతం నమోదు చేసుకుని  జాతీయ సగటు 26 కంటే పది పాయింట్లు ముందుకు వెళ్ళింది. దేశంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన మెడికల్, బయోమెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో అనూహ్యమైన విజయాలు సాధించింది. 
 
మరీ ముఖ్యంగా మహిళల నమోదు విషయంలో విప్లవాత్మక ప్రగతి కనిపిస్తున్నది. కొన్ని విశ్వవిద్యాలయాల క్యాంపస్ లలో  మహిళల నిష్పత్తి 70 దాటింది. ఇవన్నీ ఆనందించే విషయాలే అయినప్పటికీ విశ్వవిద్యాలయాలలో  అధ్యాపకుల అందుబాటు విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. రెగ్యులర్ అధ్యాపకుల నియామకం దాదాపుగా ఇరవై ఏళ్లుగా లేకపోవడంతో దాదాపు మూడింట రెండు వంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక డిపార్ట్మెంట్లలో ఒక్కరు కూడా లేకపోవడం తో, బోధనా పరిశోధన పూర్తిగా కుంటుబడిపోయాయి. తాత్కాలిక అధ్యాపకులతో కాల వెళ్లదీసే స్థితి దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉండడం ఆందోళనకు కారణం అవుతున్నది.

ప్రామాణిక పద్ధతి లేకపోవడం

నిజానికి అధ్యాపకుల భర్తీలో జాప్యం తెలంగాణా ప్రభుత్వానిది ఎంతమాత్రం కాదు. అసలు జరిగిందేమిటి, జాప్యానికి కారణాలు ఏమిటి అన్న విషయాలను బహిరంగ పరచకపోవడం వల్ల తెలంగాణా ప్రభుత్వాన్ని బదనాం చేసి కొందరు మాట్లాడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం నియామకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఖాళీలు భర్తీ చేయడమే కాదు అనేక రంగాల్లో కొత్త పోస్టులను కూడా వేలాదిగా స్రుస్థించిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, యూజీసీ చేసిన పొరపాట్లకు బాధ్యత వహిస్తోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో అనేక రంగాలలో నియామకాలను చేపట్టింది. ఇప్పటికే కనీసం లక్ష నలభై వేల నియామకాలు పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఈ మధ్యకాలంలో దాదాపు అరవై వేల కొత్త ఉద్యోగాల నియామకానికి అనుమతి ఇచ్చింది.  ఇప్పటికిప్పుడు ప్రతిష్టాత్మకమైన గ్రూప్-I  మొదలు, గ్రూప్-II, III, IV తో పాటు పోలీసు, కళాశాలల లెక్చరర్ వంటి అనేక రంగాల్లో నియామకాల ప్రక్రియ ఏకకాలంలో విడివిడిగా సాగుతున్నది. 
 
కానీ విశ్వవిద్యాలయాల ఖాళీలు మాత్రం నియామకానికి నోచుకోలేదు. ఇది సహజంగానే విద్యావేత్తలు, విద్యార్థులను కలవరానికి గురి చేయడంతో పాటు నిరుద్యోగులలో నైరాశ్యానికి కారణం అవుతున్నది. అన్నిటికంటే మించి విద్యాప్రమాణాల మీద ప్రభావం చూపుతోంది. దీనికి కారణం ఎవరు? ఎవరైనా సహజంగానే వేలెత్తి చూపిస్తారు. ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు తమ ప్రయత్నం తాము చేస్తున్నట్టు చెపుతోంది. అందుకు సాక్ష్యంగా విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ఆమోదించిన బిల్లును చూపెడుతోంది. మూడు నెలల క్రితమే దీనిని గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. దానిపై అధ్యయనం సాగుతున్న దరిమిలా అది అక్కడే పెండింగులో ఉంది. ఇదొక రాజకీయ సాకుగా కనిపించవచ్చు. కానీ విశ్వవిద్యాలయాల నియామకాల జాప్యం వెనుక లోతుగా వెతికితే తప్ప కనిపించని అనేక చిక్కుముడులు ఉన్నాయి. 
 
అందులో మొదటిది నియామక విధానం. ఈ దేశంలో అన్ని నియామకాలలోకి అత్యంత అస్పష్టమైన విధానం అధ్యాపకులది.  ఈ దేశంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నియామకానికి అనేక అర్హతలు, పరీక్షలు పద్ధతులు ఉన్నాయి కానీ పేరుకు పెద్ద ఉద్యోగమైన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల ఎంపికకు ఒక ప్రామాణికమైన పద్ధతి లేకపోవడం సమస్యలకు మూలం అవుతోంది. సాదాసీదా బడిపంతులు కావాలంటే కనీస డిగ్రీ అర్హత తో పాటు బోధనకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. బీఎడ్, డీఎడ్ వంటి డిగ్రీలు ఉండాలి, ఆ తర్వాత జాతీయ, రాష్ట్ర  స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసై ఉండాలి ఇందులో తాము బోధించే విషయంతో పాటు, బోధనా పద్ధతుల మీద  పరిజ్ఞానాన్ని, విద్యా విషయాల మీద అవగాహననూ పరీక్షిస్తారు.  ఆ అర్హత ఉన్నవాళ్లే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత నియామక  సంస్థలు  ఎంపిక పరీక్షలు నిర్వహిస్తాయి. ఆ పరీక్షలో కనబరిచిన ప్రతిభ, టెట్ లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేసి ఒక బడిపంతులును ఎంపిక చేస్తారు. కానీ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు మాత్రం ఇన్ని షరతులు, పద్ధతులు, ప్రామాణిక పరీక్షలు లేవు. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి జాతీయ, రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష  ఉత్తీర్ణులై ఉంటే చాలు. నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లిపోవచ్చు. అదీ  లేకపోతే పీహెచ్డీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆర్టికల్స్, అకడమిక్ స్కోర్ కోసం ఇతర జోడింపులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో డబ్బు చెల్లిస్తే ఆర్టికల్స్ ప్రచురించే విధానం కూడా వచ్చింది కాబట్టి ఇవన్నీ తూతూ మంత్రం తతంగం గా మారిపోయాయి. ఇది దశాబ్దాలుగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం (UGC) కూడా విద్యార్హతలు, ఎంపిక కమిటీల గురించి మాట్లాడి చేతులు దులుపుకున్నదే తప్ప ఎక్కడా ప్రమాణాలకు, ఎంపిక ప్రక్రియలకు ఎటువంటి నిబంధనలు రూపొందించడం లేదు. దీంతో విశ్వవిద్యాలయాల అధ్యాపకుల ఎంపిక దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతోంది.

యూజీసీ దశాబ్దాలుగా  తన మార్గదర్శకాలలో విశ్వవిద్యాలయాల అధ్యాపకుల ఎంపికకు అభ్యర్థుల విషయ పరిజ్ఞానాన్ని, ప్రతిభా పాటవాలను నిర్ధారించే ఎలాంటి రాత పరీక్షగానీ, స్క్రీనింగ్ టెస్ట్ గానీ సూచించలేదు. కేవలం  అభ్యర్థి అప్పటివరకు తన చదువులో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అంటే సాధించిన మార్కులు, చేసిన పరిశోధనలు, ప్రచురించిన పత్రాలు, బోధనానుభవం వంటివాటిని లెక్కించి పాయింట్స్ కేటాయిస్తారు, వాటితో పాటు ఇంటర్వ్యూ లో కనబరిచిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తారు. అంటే ఎటువంటి పోటీ పరీక్ష లేకుండా కనీస విద్యార్హతలు, విద్యార్థిగా, పరిశోధకుడిగా సాధించిన మార్కుల ఆధారంగానే ఈ గ్రేడ్ పాయింట్లు నిర్ధారించి వాటికి ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్‌ లిస్టులు తయారు చేస్తారు. ఇందులో అనేక రకాల సమస్యలున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. 
 
వాటిల్లో ముఖ్యంగా ఎంపిక ప్రక్రియ పారదర్శకత లేకపోవడం. పోటీలో ఉన్న అభ్యర్థికి ఎన్ని గ్రేడ్ పాయింట్లు వస్తాయన్నది ఆ అభ్యర్థి గతంలో చదివిన విద్యాలయాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదివిన విద్యార్థికి, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయానికి, గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని అలాగే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మధ్య బోధన, శిక్షణ ప్రమాణాల విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి, సహజంగానే మార్కులలో, గ్రేడ్ లలో తేడాలుంటాయి తేడాలుంటాయి. ఈ తేడాలు ఎంపిక కోసం రూపొందించే పాయింట్ల మీద ప్రభావం చూపిస్తాయి. రెండోది ఈ మార్కులను లెక్కగట్టి, పాయింట్లను నిర్ధారించే కమిటీలు విశ్వవిద్యాలయం ఆంతరంగిక కమిటీలై ఉంటాయి
 
అంటే ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించిన దరఖాస్తులు పరిశీలించి మార్కులను లెక్కగట్టి పాయింట్లు వేసేది ఆ విశ్వవిద్యాలయం, ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆచార్యులు, విభాగాధిపతులు, శాఖాధిపతులే అయి ఉంటారు. ఆ దరఖాస్తుదారుల్లో వారి విద్యార్థులు, వారి ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినవారు, వారితో కలిపి పత్రాలు ప్రచురించిన వారు ఇంకా చెప్పాలంటే వారితోపాటు కనీసం ఐదు పదేళ్ల పరిచయం ఉన్నవాళ్లు, కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటున్నారు. అలాగే తిరిగి ఎంపిక కమిటీలు, ఇంటర్వ్యూ బోర్డు లలో కూడా మళ్ళీ వారే ఉంటారు. అలా ఉండాలని యూజీసీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి కూడా. దీనివల్లే చాలా సందర్భాల్లో సమస్యలు ఎంపిక తీరు పట్ల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. గడిచిన ఇరవై ఏళ్లలో పరిశోధనలు చేసిన వాళ్ళు, యూజీసీ అధ్యాపకుల కోసం నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించిన వారి సంఖ్య ప్రతి డిపార్ట్మెంట్లోనూ గణనీయంగా పెరిగింది. ముప్పే, నలభై ఏళ్ళక్రితం విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టులకు పెద్దగా పోటీ ఉండేది కాదు. డిగ్రీ తరువాత పీజీ, ఆ తరువాత, రెండేళ్లు పీజీ, కనీసం రెండేళ్ల ఎంఫిల్, నాలుగైదేళ్ళ పీహెచ్డీ చేస్తూ పోయేవాళ్లు తక్కువ. ఆ కాలంలో డిగ్రీ అవగానే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి క్యాంపస్ వదిలి బయటకు వెళ్ళేవాళ్ళే ఎక్కువ. చాలామంది టీచర్లుగా, లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా, ఉద్యోగులుగా పరీక్షలు రాసి వెళ్ళిపోయేవారు. గడిచిన 20-25 ఏళ్ళల్లో అక్కడా ఉద్యోగావకాశాలు తగ్గాయి. విశ్వవిద్యాలయాల్లో చేరి చదువుకుంటున్న వాళ్ళ సంఖ్యా యూనివర్సిటీలలో గణనీయంగా పెరిగింది. దీనితోపాటు జాతీయ స్థాయిలో, నెట్ స్థానికంగా సెట్ పాసవుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఇది తీవ్ర పోటీ కి కారణం అవుతోంది

పారదర్శకత లోపించడం

ఎప్పుడైనా ఉద్యోగ నియామకాల విషయంలో ఎంపిక విధానం పారదర్శకంగా, ప్రామాణికత తో లేకపోతే వివాదాలు, విమర్శలు తప్పవు. విశ్వవిద్యాలయాలలో అదే జరుగుతోంది. దీనివల్ల ప్రధానంగా మెరిట్ ప్రమేయంలేకుండా ఎక్కడ చదివిన వాళ్ళు అక్కడే ఎంపిక కావడం జరిగి వేరే విశ్వవిద్యాలయంలో చదివిన, పరిశోధనలు చేసిన ప్రతిభావంతులైన వారికి అవకాశాలు రాలేదన్న విమర్శలు వచ్చాయి. ప్రతిభావంతులైన అధ్యాపకులు ఉండాల్సిన విశ్వవిద్యాలయాలలో అక్కడే చదువుకుని అక్కడే, పరిశోధన పూర్తిచేసి, అక్కడివారితోనే ఎంపిక కావడం వల్ల విశ్వవిద్యాలయాల్లో వైవిధ్యం కొరవడిందని నిర్ధారణకు ప్రభుత్వాలు వచ్చాయి. అంతే కాకుండా వైస్ ఛాన్సలర్ లాంటి అత్యున్నత పదవుల్లో ఉన్న ఆచార్యులు ఇలాంటి ఆరోపణలు,  కోర్టు కేసులు ఎదుర్కోవడం తో విశ్వవిద్యాలయాల అభివృద్ధి  మీద, విద్యాప్రమాణాల మీద దృష్టి పెట్టే అవకాశం రాకుండా పోయింది. మరోవైపు ఏటేటా రిటైర్మెంట్లు యథావిధిగా జరిగిపోవడంతో విశ్వవిద్యాలయాలు వెలవెలపోయే పరిస్థితులు వచ్చాయి. చాలా చోట్ల సీనియర్ ప్రొఫెసర్లు లేక రీసెర్చ్ కుంటుపడిపోయింది. అనేక డిపార్ట్మెంట్లలో ఒక్క టీచర్ కూడా లేని పరిస్థితి వచ్చింది.
 
నియామక ప్రక్రియలో మరో ప్రధానమైన అంశం ఎంపిక కమిటీ కూర్పు అన్ని సబ్జెక్టుల నియామకాలకు వైస్ ఛాన్సలర్ చైర్మన్ గా ఉంటారు. కమిటీలో రిజిస్ట్రార్, ఆయా ఫాకల్టీ డీన్లు, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్,  బోర్డు అఫ్ స్టడీస్ చైర్మన్ కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మరో ముగ్గురు విషయ నిపుణులు ఉంటారు. అంటే దాదాపు సగానికంటే ఎక్కువ మంది విశ్వవిద్యాలయానికి చెందినవారే ఉంటారు. దీనివల్ల కూడా ఆశ్రిత పక్షపాతం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ప్రతి ఇంటర్వ్యూలో వీసీ, రిజిస్ట్రార్ ఇతర అధికారులు తప్పనిసరిగా ఉండవలసి రావడం మూలంగా నెలల తరబడి విశ్వవిద్యాలయ అధికారులంతా మిగితా విషయాలు వదిలేసి బోర్డులోని కూర్చోవలసి వస్తోంది. గతంలో జరిగిన నియామకాలు దాదాపు ఏడాదిన్నర పాటు సాగడంతో ఒక ప్రధాన విశ్వవిద్యాలయం వీసీ తన పదవీ కాలంలో సగభాగం ఇంటర్వ్యూలతో సరిపెట్టారన్న విమర్శ ఉంది. ఇకపోతే కనీస అర్హత ఉన్న ప్రతి ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం మూలంగా కొన్నిసార్లు ఒక్క పోస్టు కు వందలాది మందిని ఇంటర్వ్యూ చేస్తూ పోతున్నారు ఇవి కొన్నిసార్లు నెలల తరబడి సాగుతున్నాయి, దీనికి బదులు కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ల మాదిరిగా ఒక పటిష్టమైన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఒక్కొక్క పోస్టుకు మెరిట్ ప్రాతిపదికన ఇద్దరినో, ముగ్గురినో ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించాలనే సూచనకూడా కొందరు చేస్తున్నారు. ఈ పద్ధతి డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామకంలో ఉంది. ఇది పారదర్శకంగా, పటిష్టంగా సాగుతున్నది. దీనివల్ల నియామక ప్రక్రియ కూడా త్వరగా ముగిసే అవకాశం ఉంటుంది. 
 
విశ్వవిద్యాలయాల ఎంపికలో ఉన్న లోపాలవల్ల గడిచిన ఇరవై ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయి. అవకతవకలు జరిగాయని పత్రికల్లో కథనాలు వచ్చాయి.  అప్పుడు పనిచేసిన వైస్ ఛాన్సలర్ లు అవినీతికి, బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడి తమవారికి ఉద్యోగాలాన్నే ఇచ్చుకున్నారని, అమ్ముకున్నారని, రాజకీయ జోక్యం, ఒత్తిళ్లతో ఎంపిక చేశారని కోర్టులలో కేసు నమోదు అయ్యాయి. ప్రభుత్వానికి, గవర్నర్లకు ఫిర్యాదులో అందాయి. కొందరు వైస్ ఛాన్స్ లర్ల  మీద విచారణ జరిగింది, విజిలెన్సు నివేదికలు అందాయి. ఒకరిద్దరు  ఒత్తిళ్లకు లోనయి రాజీనామాలు చేయవలసి వచ్చింది.

కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య

ఇది ఒక్క అప్పటి ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల అధ్యాపకుల ఎంపిక ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిపోయింది. ఆ పరిస్థితుల్లోనే బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తిగా రాష్త్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కు  అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రాష్త్ర విభజన జరిగింది. రెండు రాష్ట్రాల్లో కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు అధ్యాపకుల ఎంపిక బాధ్యత అప్పగించే ప్రయత్నం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం  ఈ పరిస్థితిని గమనించి విశ్వవిద్యాలయాల నియామకాలను రాష్త్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించాలని 2017లోనే ఆలోచన చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయాన్ని సూచనప్రాయంగా అధికారులతో చర్చించారు. మొదటి విడతగా అటవీ కళాశాల, మెడికల్ కాలేజీ లలో ఉన్న వేకెన్సీ లను టీఎస్పీఎస్సీ కి అప్పగించారు. ఆ నియామకాలన్నీ పకడ్బంధీగా పూర్తయ్యాయి.  మిగిలిన అన్ని విశ్వవిద్యాలయాలలో  కూడా అదే పద్ధతిలో నియామకాలు పూర్తి చేయాలని భావించినప్పటికీ విశ్వవిద్యాలయాల్లో  దీనిమీద కొందరు పెద్ద ఎత్తున నిరసనలు లేవదీశారు. మరోవైపు  ఆంధ్రప్రదేశ్ లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా  ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వడపోసి ఇంటర్వ్యూలు పెట్టాలని భావించింది. పరీక్షలు కూడా నిర్వహించింది. కోర్టు కేసులతో ఆ ఫలితాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. 
 
అందుకు రెండు కారణాలు, ఒకటి విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తికి ఇది విఘాతం కలిగిస్తుందని కొందరు వాదించారు. నిజానికి స్క్రీనింగ్ టెస్ట్ కు స్వయం ప్రతిపత్తికి నేరుగా ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మెరిట్ ను ప్రాతిపదిక చేసుకుంటే  అక్కడే చదివి నిరుద్యోగులుగా విశ్వవిద్యాలయాల్లో పాతుకుపోయి ఉన్న వారికి  ఉద్యోగాలు రావేమోననే భయం వలన కొన్ని విద్యార్థి సంఘాలు కూడా దీనిని  వ్యతిరేకించాయి. ఇక రెండోది కొత్త నియామకాలు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా వడపోసి , ఇంటర్వ్యూలు నిర్వహిస్తే దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న వారి భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న కూడా వచ్చింది. దీనిని నిరుద్యోగులు వ్యతిరేకిస్తూ ఇప్పటికే కోర్టుల్లో కేసులు వేశారు. అయినప్పటికీ చిరు జీతాలతో ఏళ్ల తరబడి పాఠాలు చెపుతున్న తాత్కాలిక ఉపాధ్యాయులు ఇటు విశ్వవిద్యాలయాలమీద, అటు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. అదికూడా జాప్యానికి ప్రధాన కారణం అయ్యింది.  కేసీఆర్ ధర్మ సంశయం కూడా కారణం అనే చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం తీవ్రం అవుతున్న దశలో అప్పటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. నిజంగానే సమాన అర్హతలు ఉండి , సమానమైన పని చేస్తూ తక్కువ వేతనం పొందడం ఏమిటి అన్నది మౌలికమైన అంశం. అది ధర్మం కూడా. కానీ సాంకేతికంగా ఈ హామీ అన్ని రంగాలలో నెరవేరడం సాధ్యం కాదని, అలా చేయడం న్యాయ సమ్మతం కూడా కాదని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు ప్రధానమైన అడ్డంకిగా మారాయి. ఇది అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న రాజ్యాంగ మౌలిక సూత్రానికి, ఆర్టికల్ 16కు ఇది విరుద్ధమని గతంలోనే కోర్టులు ఆక్షేపించాయి.  దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నత న్యాయస్థానంలో పలువురు కేసులు వేశారు. ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు రావడంతో కొన్ని కార్పొరేషన్స్ లో, కొన్ని రకాల కింది స్థాయి ఉద్యోగులకు వెయిటేజీ లతో రెగ్యులరైజ్ చేయడం మినహా మిగతా విభాగాల్లో ఇది సాధ్యం కాలేదు.
 
ఈ పరిస్థితుల్లో  విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా, డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించే విషయం అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో  దాదాపు పదహారు వందల మంది ఇలా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో వెయ్యిమంది రెగ్యులర్ ఖాళీలతో ఉండగా, మరో ఆరు వందల మంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ లలో ఉన్నారని, డిగ్రీ కళాశాలల్లో మరో ఐదువేల మంది ఉంటారని అంచనా. వీరంతా సహజంగానే ఒక ప్రెషర్ గ్రూప్ గా మారిపోయారు. మా సంగతి తేల్చకుండా నియామక ప్రక్రియ ఎలా మొదలు పెడతారని న్యాయంగానే అడుగుతున్నారు. ఇది రెగ్యులర్ నియామకాల ప్రయత్నాలకు ప్రధాన  అడ్డంకిగా మారిందని అధికారులు చెపుతున్నారు.


యూజీసీ ఆదేశాలు


అవరోధాల నేపథ్యంలో అధ్యాపకుల కొరత, విద్యార్థుల భవిష్యత్తును గమనించిన ప్రభుత్వం 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను  వెంటనే భర్తీ చేయాలని 2017లో  జీవో 30 ని విడుదల చేసింది. పాత పద్ధతిలోనే అత్యవసరంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కానీ అదే సమయంలో విశ్వవిద్యాలయాలలో ఎక్కడో అలహాబాద్ యూనివర్సిటీ లో రిజర్వేషన్ల అమలు పద్ధతి విషయంలో సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగులో ఉన్నందున అది తేలేదాకా నియామకాలు చేపట్టవద్దని యూజీసీ ఒక సర్క్యులర్‌ దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు పంపింది. రేజర్వేషన్లు ఇప్పుడున్న ఫాకల్టీ ప్రాతిపదికన కాకుండా డిపార్ట్మెంట్ల వారీగా ఉండాలన్నది ఆ కేసు సారాంశం. ఇది 2014లోనే నమోదయ్యింది. ఆ తరువాత కొన్ని నెలలకు కోర్టు కేసు తేలేవరకు నియామకాలకు చేపట్టకూడదని కేంద్ర ప్రభుత్వం యూజీసీని, యూజీసీ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. 
 
 



 
దానితో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా నియామకాలకు విశ్వవిద్యాలయాలు చేస్తున్న ప్రయత్నాలను నిలిపి వేసింది. కానీ విశ్వవిద్యాలయాలు మూసివేయలేము కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టులో ఉన్న అధ్యాపకులకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని, వివాదాలు సద్దుమణిగే వరకు వారికి గౌరవప్రదమైన భృతి ఇవ్వాలని భావించి అసిస్టెంట్ ఈ ప్రొఫెసర్ కనీస వేతనంతో పాటు కొన్ని అలవెన్సులు ఇస్తూ వారినే కొనసాగిస్తూ వారిద్వారానే విశ్వవిద్యాలయాలను నడిపిస్తూ వచ్చారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి ఇరవై వేళా లోపు  కాంట్రాక్టు అధ్యాపకులకు ఇప్పుడు  బట్టి యాభై నుంచి, డెబ్బై వేల కనీస వేతనం వస్తోంది. ఇది వారి పనికి, ప్రతిభకు సరిపోతుందని చెప్పలేం. కానీ అంతో ఇంతో వారు నిలదొక్కుకోవడానికి దోహదపడిన మాట వాస్తవం.  అలహాబాద్ విశ్వవిద్యాలయ రిజర్వేషన్ విషయాన్ని సాకుగా చూపి నియామకాలు ఆపేసిన యూజీసీ, కేంద్రం ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకు రావడంతో, ఇప్పుడు కొనసాగుతున్న విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, యూజీసీ ఆదేశాల మూలంగా నియామకాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. దీని మూలంగా ఐదేళ్ల కాలం ఒక్క నియామకం లేకుండానే పూర్తయ్యింది

ఆగిపోయిన బోర్డు

ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య ప్రధాన ప్రతిబంధకంగా ముందుకు వచ్చింది. అలాగే విశ్వవిద్యాలయాల వీసీల నియామకం కూడా ఆలస్యమయింది. అప్పటికే కోవిడ్‌ మూలంగా ఏడాది పాటు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యక్ష బోధన మూలకు పడిపోయింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10 విశ్వవిద్యాలయాల వీసీల నియామకం ప్రభుత్వం 2021 మే నెల నాటికి పూర్తి చేసింది. కొత్త వీసీలకు వచ్చి రాగానే ఎదురైన ప్రధాన సమస్య అధ్యాపకుల కొరతే కావడంతో వెంటనే నియామకాలు చేపట్టాలని వీసీలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అంతే కాకుండా ఆ బాధ్యత విశ్వవిద్యాలయాల నెత్తిన పెట్టకుండా ఒక ఉమ్మడి నియామక సంస్థ ద్వారా చేపట్టాలని వీసీలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. స్వయంగా తామే చేస్తే స్వయం ప్రతిపత్తి పక్కనపెట్టి సమస్యలు వస్తాయని వారికి తెలుసు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కొక్క పోస్టుకు వందల మంది పోటీ పడే అవకాశం ఉంటుంది. వీసీల మీద, అధ్యాపకులు, అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది. ఈ విషయం వారికి స్పష్టంగా తెలుసు. కాబట్టే ప్రత్యామ్నాయ పద్ధతికి వీరంతా ఓటు వేశారు. దాని మేరకే  రాష్ట్ర ప్రభుత్వం కామన్‌ బోర్డును ఏర్పాటు చేసింది. వాటిలో 3,500 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఏప్రిల్‌ 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల పరిధిలో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందులో మొదటి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి నుంచి వాటి భర్తీ కోసం నోటిఫికేషన్‌ రాకపోవడం గమనార్హం. 

 గతంలో విశ్వవిద్యాలయాలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి నినయామకాలు చేపట్టే విధానం అమల్లో ఉన్నది. దానివల్ల ఒకే అభ్యర్థి వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల్లో నియామకమైనపుడు మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. దానికితోడు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులను పరిశీలించి క్యాబినెట్‌ కామన్‌ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జూన్ నెలలోనే ఉత్తర్వులు విడుదల చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన బిల్లును సెప్టెంబర్ లోనే శాసన సభలో ఆమోదించి గవర్నర్ గారికి పంపించింది. నాలుగు నెలలుగా వారు దానిని పరిశీలిస్తున్నారు.విశ్వవిద్యాలయాలకు సంబంధించినంత వరకు అధ్యాపకుల నియామకం అత్యవసరం, అత్యంత కీలకం కూడా. అధ్యాపకులు లేకపోవడం వల్ల కేవలం బోధన కుంటుపడడమే కాదు, విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయి. మనం రాష్త్ర ప్రభుత్వంకృషి వల్ల విద్యార్థుల స్థూల నమోదులో దేశంలోనే ముందున్న మాట వాస్తవమే కానీ ప్రమాణాలు, నాణ్యమైన ఉన్నత విద్య విషయంలో కొంత వెనుకబడి ఉన్నామన్నది గుర్తించాలి.
 
ప్రభుత్వం తక్షణం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోకపోతే ఇంకా నష్టం కలిగే ప్రమాదం ఉంది. అందులో ముఖ్యంగా రిక్రూట్మెంట్ బిల్లును ఆమోదింపచేసుకోవడం ముఖ్యం. గవర్నర్ కూడా ఈ పట్టింపులు వదిలేసి ఏదో ఒక విషయం చెప్పాలి. ఆమెకు అర్థం కాని అభ్యంతరాలుంటే ఎవరైనా విద్యావేత్తలు పిలిచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ బిల్లుట్ల, అందులో ప్రతిపాదించిన పద్ధతి పట్ల అభ్యంతరాలు ఉంటె తిప్పి పంపే అధికారం ఆమెకు ఉంది. మార్పులు చేర్పులు సూచించడానికి కూడా అవకాశం ఉంది.  ఇప్పటికే అనేక మంది విద్యావేత్తలు,  విద్యార్థిసంఘాలు ఈ విషయమై విజ్ఞప్తులు చేసి ఉన్నారు. 
 
మొన్నటికి మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం నాయకులు, తెలంగాణా విశ్వవిద్యాలయాల అధ్యాపకుల ఫెడరేషన్ నాయకులు కూడా గవర్నర్ గారిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది న్యాక్ అక్రిడిటేషన్ కోసం ప్రయత్నిస్తున్నాయి.  న్యాక్ అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, యూజీసీ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాలూ, మానవ వనరులు ఇతర వసతులు చూసి విద్యాలయాలకు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ. ఈ ర్యాంకింగ్ ఆధారంగానే యూజీసీ నిధులు కేటాయిస్తుంది. టీచర్లు తగిన నిష్పత్తిలో లేకపోతే సరైన గుర్తింపు రాదు, నిధులూ రావు. ఇప్పటికే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కేంద్ర నిధులు, రీసెర్చ్ గ్రాంట్లు, జాతీయ ఉన్నతవిద్యా మండలి (రూసా) నిధులు సరిగా అందడం లేదు. ఫెలోషిప్ లు ఆగిపోయాయి. 
ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగి అధ్యాపకుల నియామకం ఆగిపోతే తలెత్తే సంక్షోభానికి విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కారణం కాకూడదు. అత్యంత కీలకమైన ఈ బిల్లును నెలల తరబడి ఆపివేయడం అంటే తెలంగాణా భవిష్యత్తును , విద్యారంగ అభివృద్ధిని తొక్కిపెట్టడమేనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆ అపప్రథ గవర్నర్ కు రాకూడదనే ఆశిద్దాం.

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
డైరెక్టర్ (అకడమిక్)
డా. బి, ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి