గురువారం, మార్చి 14, 2019

#నాతెలంగాణ-01

 మలిదశలో తొలిఅడుగు: భువనగిరి సభ   


మార్చి కోసం నేను చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా మిత్రుడు ప్రొ. దినేష్ కుమార్ భువనగిరి సభ ఫోటోలు పంపినప్పటినుంచి వాటిని మీతో పంచుకోవడం కోసం. జయశంకర్ గారి కొత్త పుస్తకం కోసం కొందరు మిత్రులం పాతజ్ఞాపకాలను తవ్వితీస్తుండగా కొన్ని ముఖ్యమైన ఫోటోలు దొరికాయి. అందులో 1997 లో జరిగిన భువనగిరి ఫోటోలు కూడా ఉన్నాయి.
 సదస్సులో ప్రసంగిస్తున్న నేను 

 తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ చేసిన తొలి ప్రజా ప్రయత్నంగా భువనగిరి సభలను చెప్పుకోవచ్చు. అప్పటికి చిన్న చిన్న వేదికలు సభలు ఏర్పాటు చేసినప్పటికీ 1997 మర్చి 8, 9 తేదీలలో జరిగిన ఈ రెండు రోజుల సదస్సు, బహిరంగ సభ ప్రత్యేక తెలంగాణా సాధనలో నిర్మాణాత్మక ముందడుగు గా పేర్కొనవచ్చు.  అది చంద్రబాబు నాయుడు పాలన, నిర్బంధ,  నియంతృత్వ పోకడతో సాగుతున్న కాలం. ఆయన పాలనలో తెలంగాణ పరిస్థితులకు అద్దంపట్టే విధంగా ఈ సభకు "దగాపడ్డ తెలంగాణ" గా నామకరణం చేశారు.

గాదె ఇన్నయ్య
సభ వెనుక కర్త, కర్మ,  క్రియ అన్నీ తానే అయి నడిపించింది మిత్రుడు గాదె ఇన్నయ్య. ఇన్నయ్యకు సుదీర్ఘ పోరాట అనుభవం ఉంది. నేను వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం లో చేరినప్పటినుంచే  (1992) నాకు ఇన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన అప్పటికే ఆయన తెలంగాణా దుస్థితిపై విస్తృత అధ్యయనం చేస్తూ వచ్చారు. తరచూ ఆ అంశాలు మా మధ్య చర్చకు వచ్చేవి. ఆ అధ్యయన సారాంశాన్ని ఆయన 'దగాపడ్డ తెలంగాణా' పేరుతో వివిధ సంచికలుగా ప్రచురించి పంచేవారు. అది తెలంగాణా  భావ వ్యాప్తి లో కీలకంగా మారాయి. ఆ దశలోనే ఈ సభకు "దగాపడ్డ తెలంగాణ" సభగా నామకరణం చేయడం జరిగింది. నేను,   డా. దినేష్ కుమార్ ఇద్దరం ఇన్నారెడ్డికి నిర్వహణలో పాలుపంచుకున్నాం. స్థానికంగా జైని మల్లయ్య గుప్తా, నాగారం అంజయ్య, పిట్టల శ్రీశైలం, , మల్లారెడ్డి, రావి సురేందర్ రెడ్డి మరికొందరు సభ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై మేధో మధనంగా సాగిన ఈ సదస్సు వేదికకు  "నిజాం వ్యతిరేక పోరాటాలు అమరవీరుల ప్రాంగణం"గా నామకరణం చేశారు. ఈ సదస్సును ను తెలంగాణా ఉద్యమ పితామహుడు  కాళోజీ నారాయణ రావు ప్రారంభించారు. ఆంద్ర వలస పాలనలో తెలంగాణా ఎలా నిర్లక్షానికి గురయ్యిందో ఈ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
 
 ప్రసంగిస్తున్న కె. శ్రీనివాస్, వేదికపైన కూర్చున్నది నందిని సిద్ధారెడ్డి 

వివిధ రంగాలలో కొనసాగుతున్న వివక్ష మూలంగా తెలంగాణా ఎలా దగా పడిందో సదస్సులో సమగ్ర చర్చ జరిగింది. విద్య వైద్య రంగం (ప్రొఫెసర్ జయశంకర్) తెలంగాణ వనరులు పారిశ్రామిక కాలుష్యం- (ప్రొఫెసర్ కేశవా రావు జాదవ్)  వలసీకరణ, నిరుద్యోగం   ( ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా ఉన్న కె.  శ్రీనివాస్) భాషా సంస్కృతి మీడియా (నందిని సిద్ధారెడ్డి) , రిజర్వేషన్లు, దళితుల వర్గీకరణ-డాక్టర్ ముత్తయ్య, ఆదివాసి సమస్యలు (ప్రొఫెసర్ బియ్యాల జనార్ధ న రావు) సంక్షేమం పైన నేను ప్రసంగాలు చేసాం.
 
 సభావేదిక మీద గద్దర్, దినేష్ కుమార్ తదితరులు 

ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గద్దర్  తెలంగాణ ఉద్యమం పై అవగాహన కల్పించారు. సదస్సు, బహిరంగ సభలో బెల్లి లలిత పాటలు హోరెత్తించాయి. ఈ సభ తరువాతే బెల్లిలలిత హత్య, గద్దర్ పై కాల్పులూ జరిగాయి. ఈ సభ తరువాత అదే ఏడాది ఆగస్టు నెలలో సూర్యాపేటలో మారోజు వీరన్న మార్గదర్శకత్వంలో డా. చెరుకు సుధాకర్, వి. ప్రకాష్  నేతృత్వంలో మరోసభ జరిగింది, అది తెలంగాణా మహాసభగా మారింది. అనతికాలంలోనే మారోజు వీరన్న "ఎదురుకాల్పుల"లో మరణించారు.

  మలిదశ తెలంగాణా ఉద్యమానికి తొలి బీజాలు వేసిన భువనగిరి సభ నిర్వహణలో పాలుపంచుకుని,  సదస్సులో భాగస్వామినైనందుకు, అదే స్పూర్తితో తెలంగాణ సాధనలో నిలబడి ఉన్నందుకు గర్వంగా ఉంది. సరిగ్గా ఇరవైరెండేళ్ల క్రితం మొదలైన ప్రత్యక్ష తెలంగాణా ఉద్యమ ప్రస్థానాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. 

3 కామెంట్‌లు:

  1. తెలంగాణ ఉద్యమంలో భువనగిరి సభ ఒక మైలురాయి....
    Dagapadda telangana . .ఇప్పటికి నిరుద్యోగుల విషయంలో అలాగే వుంది... మీలాంటి వారు tspsc చైర్మైన్ గా ఉన్నందుకు చాలా గర్వపడ్డాము...కానీ గ్రూప్2 విషయంలో మీరు కూడా ఏమి చేయలేక పోతున్నారు అందుకు బాధగా ఉంది....కోర్టు కేసులు త్వరగా పూర్తిచేసి నియామకాలు పూర్తిచేస్తారని ఆశిస్తూ dagabadda తెలంగాణ నిరుద్యోగులు....

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి "తెలంగాణ జైత్రయాత్ర" పేరుతో పుస్తక రచనలు చేశారు...ఘంటపథం ద్వారా నిజాలను నిగ్గు తేల్చారు...వామపక్ష భావాజలంతో అనేక చర్చలలో పాల్గొని ఉద్యమాల పట్ల అవగాహన కలిగించారు....మావోయిస్టులతో శాంత్జిచర్చలు జరిపారు....
    తెలంగాణ మలి ఉద్యమ నిర్మాతలలో మీరు ఒకరు....

    మీ రచనలు చదివి మేము తెలంగాణ వివక్ష , వలసవాదం అనేది నక్సలిజం కంటే ప్రమాదకరం అని ఆదివాసుల గురించి రచనలు etc... చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని ఆంధ్రజ్యోతి పేపర్లో చదివాము...మీరూ ఘంటాపథం ఎప్పటికి continue చేస్తా అన్నారు....కానీ ఎందుకు చేయడం లేదు సార్....
    మీలాంటి వారి ఆలోచనలు ఎల్లప్పుడూ మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము....

    రిప్లయితొలగించండి
  3. గత జ్ఞాపకాలను మా అందరి ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఉద్యమం ఉదృతంగా ఉన్న దశలో మీరు మీడియా వేదికగా అనేక చర్చల్లో పాల్గొని ఉద్యమంలో పాల్గన్న అనేక ఉద్యమకారులకు దిశా నిర్దేశ్యం చేసిన తీరు మేము ఎన్నటికి మర్చిపోము.

    రిప్లయితొలగించండి