మరిచిపోలేని మనిషి !
జీవితంలో మనకు ఎంతోమంది పరిచయం అవుతుంటారు. పరిచయం అయిన ప్రతి ఒక్కరూ మన స్నేహితులో, బంధువులో లేదా మరో రకంగా 'మన వాళ్ళే' కానక్కరలేదు. వాళ్ళతో మనకు ఎలాంటి అనుబంధం ఉండనవసరం లేదు. మన రాజకీయ అభిప్రాయాలు, సామాజిక దృక్పథాలు కలవనవసరం లేదు. అయినా మనకు గుర్తుంటారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనలను ఆకట్టుకుంటారు. అలాంటి వాళ్ళు మరికలేరన్న వార్త విన్నప్పుడు బాధ కలుగుతుంది. వాళ్ళతో ఉన్న పరిచయం గుర్తొస్తుంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ పరిచయం అలాంటిదే.
2018 ఫిబ్రవరి లో వృత్తిరీత్యా ఆయన తో పరిచయం కలిగింది. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గోవాలో జరిగిన సందర్బంగా ఆయనను కలవాల్సి వచ్చింది. సాధారణంగా ఏడాదికి ఒక సారి జరిగే ఈ సదస్సులను ఒక్కొక్క సారి ఒక్కొక్క రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. UPSC చైర్మన్ తో సహా అన్ని రాష్ట్రాల కమిషన్ల చైర్మన్లు హాజరయ్యే ఈ సదస్సు కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ లను ఆహ్వానించడం ఆనవాయితీ. నేను ఈ జాతీయ సదస్సు స్టాండింగ్ కమిటీ కి చైర్మన్ గా ఉన్నందువల్ల మనోహర్ పారిక్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. సదస్సుకు హాజరై అంతసేపు ప్రసంగించలేనేమో, అయినప్పటికీ ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు మా రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల ఆతిధ్యం ఇస్తున్న వ్యక్తిగా మీతో కాసేపైనా గడపడం నా బాధ్యత, కాబట్టి ఎప్పుడు వీలయితే అప్పుడు వస్తాను అని చెప్పారు. మేము కూడా ఆయన రాకపోవచ్చుననే అనుకున్నాం.
11 వ తేదీ రాత్రి గోవా ప్రభుత్వం ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విందులో అందరం భోజనాలకు సిద్ధమవుతుండగా ఒక వ్యక్తి సాదా సీదాగా డైనింగ్ హాల్ లోకి నడుచుకుంటూ వచ్చాడు. పోల్చుకోవడానికి నాకు సమయం పట్టినా మిత్రుడు గోవా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జోస్ మాన్యుయేల్ నోరాహ్న అలర్ట్ చేయడంతో వచ్చింది పారిక్కర్ అని గుర్తించి UPSC చైర్మన్ ప్రొ. డేవిడ్ శామ్లే తో సహా వెళ్లి స్వాగతించాం. ఒక వ్యక్తిగత సహాయకుడు తప్ప సాధారణంగా ముఖ్యమంత్రుల వెంట ఉండే హడావిడి, పోలీసులు, సెక్యూరిటీ అధికారులు, వందిమాగధులు ఇతర మందీ మార్బలం ఎవారూ లేరు. ఒక సాధారణ పౌరుడిగా ఆయన వచ్చి మాలో ఒకరిగా కలిసిపోయారు. అందరినీ పలకరించారు. కుశల ప్రశ్నలు వేశారు. అనేక జోకులు పేల్చి అందరిని నవ్వించి ఆహ్లాద పరిచారు. తెలంగాణా గురించి అడిగారు. గోవా మతసామరస్యం, సంస్కృతి గురించి చెప్పారు. రక్షణ శాఖ గురించి, ఢిల్లీ గురించి, గోవా వాతావరణం, బీచ్ ల గురించి బీఫ్ ( గోవా లో బీఫ్ పై నిషేధం లేదు) గురించి హాస్యభరితంగా అనేక సంగతులు చెప్పారు. రెండు బన్నులు, పప్పు వేసుకుని తింటూ సివిల్ సర్వీసెస్ ఎలా ఉండాలి, సర్వీస్ కమిషన్స్ ఎలా ఉంటె బాగుంటుంది పిచ్చాపాటిగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అని కానీ, దేశ మాజీ రక్షణ మంత్రి అని కానీ, ఒక హిందూ రాజకీయ పార్టీ నాయకుడు అని కానీ మాకెవ్వరికీ అనిపించలేదు. మనకు మామూలుగా ప్రయాణంలో ఎదురై పలకరించి మాట్లాడే మనసున్న మనిషిగా దాదాపు మూడు గంటల పాటు ఆనందంగా గడిపి సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు గవర్నర్ మృదులా సిన్హా సదస్సును ప్రారంభించారు.
ఆ తరువాత కొద్దిరోజులకే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. నిజానికి ఆయన ఇంతకాలం బతికి ఉండడమే గొప్ప విషయం, అది కేవలం ఆయన మనో నిబ్భరం వల్లే సాధ్యపడింది. ఆయనే అన్నట్టు Human mind can overcome any disease, కానీ ఏ మనిషికైనా జీవితం తాత్కాలికమే. ఆయన మరణ వార్త దానిని మరోసారి రుజువు చేసింది. ఆయన ఎప్పటికీ గుర్తుండే మనిషి. పారిక్కర్ పరిచయం ఒక మరిచిపోలేని జ్ఞాపకం.