భారతపార్లమెంటు మీద దాడికి సూత్రధారి అన్న అభియోగం తో అఫ్జల్ గురు అనే ఒక కాశ్మీర్ యువకున్ని భారత ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం (ఫిబ్రవరి9. 2013న) ఉరితీసింది. 2001 డిసెంబర్ లో పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అఫ్జల్ గురు అక్కడ లేడు. పార్లమెంటు మీదికి దూసుకు వచ్ఛి కాల్పులు జరిపిన ఐదుగురిని భద్రతాదళాలు దారిలోనే కాల్చి చంపేసాయి. ఆ తరువాత దాదాపుఒక దశాబ్దంపాటు దీనిని భారతదేశం మీద దాడిగా దేశ భక్తులంతా భావించారు. పార్లమెంటు మీద దాడి ద్వారా ఈ దేశ సార్వభౌమాదికాన్ని సవాలు చేశారన్నది అఫ్జల్ మీద మోపిన అభియోగం. నిజానికి అఫ్శల్ గురు పార్లమెంటుకు వెళ్ళలేదు, కనీసం ఆ పరిసరాలలో కూడా లేడు. అయినప్పటికీ కుట్రకు కారణమని పోలీసులు చూపిన సాక్షాల మేరకు అదొక సీమాంతర ఉగ్రవాద చర్యగా కోర్టు తీర్పు చెప్పింది. దేశమంతా నిజమేనని నమ్మింది. మరి సీమాంధ్ర ఉగ్రవాదం సంగతి ఏమిటి? సీమాంతర ఉగ్రవాదులను తుదముట్టిస్తామని చెప్పే భారతీయ జనతాపార్టీ ఇప్పుడు ఈ సీమాంధ్రఉగ్రవాదులను ఎందుకు వెనకెసులు వస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసి రాజకీయ అస్థిరతను సృష్టించడమే ఉగ్రవాదం లక్షణం. అదే అస్థిరతను ఇప్పుడు సీమాంద్ర ఉగ్రవాదులు సృష్టిస్తున్నారు.
తెలంగాణా బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా ఎం పీ లగడపాటి రాజగోపాల్ నిజంగానే సభలో పిచ్చిపట్టినవాడిగా ప్రవర్తించాడు. అతని ఉన్మాద ప్రవర్తన భయవిహ్వాలత కు కారణమయ్యింది. ఆయన నిండుసభలో కారం, మిరియాల పొడి కలిపిన ద్రవాన్ని వెదజల్లడంతో సభ అవాక్కయ్యింది. ఒక్క లోక్ సభ ను మాత్రమే కాదు. తెలంగాణా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. యావత్ దేశం అవాక్కయ్యింది. ఈదేశ ప్రజలను కాపాడడానికి చట్టాలు చేసి దేశ భద్రతకు పూచీ ఇవ్వాల్సిన పార్లమెంటు సభ్యులు ఎం జరుగుతోందో తెలియని అయోమయంతో బయటకు పరుగులు తీశారు. సరిగ్గాటెర్రరిస్టుల దాడి సందర్భంగా పార్లమెంటు భవనం వెలుపల ఆవరించిన భయమే ఇప్పుడు పార్లమెంటు లోపల ఆవరించింది. పార్లమెంటు బయటే కాదు పార్లమెంటు లోపలకూడా టెర్రరిస్టులు ఉంటారని రాజగోపాల్ నిరూపించాడు. అది ఇప్పుడు యావత్ భారత దేశాన్ని కలవర పెడుతోంది.
సాధారనంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చేస్తారు. 2001 లో మాదిరిగా కారణాలు అడగకుండానే కాల్చిపారేస్తారు. ఆ తరువాత అదొక టెర్రరిస్టు చర్యగా చెపుతారు. కానీ లగడపాటికి మాత్రం మినహాయింపు దొరికింది. ఎందుకంటే ఆయన ఒక పెట్టుబడి దారుడు. అలాగే డబ్బుసంచులతో ఎవరినయినా కొనేయగలిగే శక్తిమంతుడు. అధికార పక్షాన్నీ ఇంతకాలం మేనేజ్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్షాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకొగలుగుతున్నాడు. లేకపోతే తల పండిన పార్లమెంటేరియన్ ఎల్ కే అద్వానీ అంత అద్వాన్నంగా ఎలా మాట్లాడుతున్నాడు? ఆయనను పార్లమెంటులో కలిసిన విలేకరులు లగడపాటి ఎపిసోడ్ మీద మాట్లాడవలసింది గా కోరారు. ఆయన మాత్రం అన్నీ చెప్పి బడ్జెట్ తప్ప ఇంకేదీ చర్చలోకి రావొద్దని చెప్పాడు. ఆ వెంటనే అప్పటిదాకా తెరవెనుక వుండి వ్యూహాలు రచించిన చంద్రబాబు నాయుడు ప్రత్యక్షమయ్యాడు.ఐదువందల మందికి పైగా సభ్యులున్న లోక్ సభలో కేవలం ఐదుగురు సభ్యులే ఉన్న ఆయనకు ఢిల్లీ లో ఎం పని అని అడగకండి.ఇప్పుడు సీమాంద్రఉగ్రవాదులకు తర్ఫీదు ఇస్తున్నది ఆయనే! సాధారణంగా ఇలాంటి సమయంలో ఆయన చేతనయితే సమర్ధించాలి, చేవ ఉంటె వ్యతిరేకించాలి, కానీ ఆయన తెలంగాణా వ్యతిరేకులను కూడగట్టే దళారీ పనిలో ఉన్నాడు. అప్పటిదాకా తెరవెనుక ఉన్న ఆయన ఉత్సాహం ఆపుకోకుండా టీవీ ల ముందుకు వచ్చి లబో దిబోమంటూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా కాంగ్రెస్ఆడిస్తోన్న నాటకమని ఆడిపోసుకున్నాడు. ఇంకేముంది తెలుగు చానెల్స్ అన్నీ అసలు విషయం వదిలేసి ఇప్పుడు రాజగోపాల్ ను రక్షించే పనిలో ఉన్నాయి. ఆత్మరక్షణ కోసమే ఆయన మిరియాల రసం సభలోకి తెచ్చాడని చెప్పిస్తున్నాయి.
రాజగోపాల్ ప్రవర్తనలో కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు, ఆయన 2009 నాడే తెలంగాణా వాదులతో కసబ్ అనే పేరును తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది నిరూపించుకున్నాడు.ఇప్పుడు అతనికి తోడయిన మరో దుండగుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మోదుగుల వేణుగోపాలరెడ్డి. ఆయన తెలంగాణాను పీల్చి పిప్పి చేస్తోన్న రాంకీ గ్రూప్ కు దగ్గరి బంధువు. ఆయన గతంలోనే రైళ్ళు పేల్చి వస్తానని, మానవ బాంబుగా మారిపోతానని చెప్పాడు. ఇప్పుడు సరిగ్గా అదే పని చేసాడు. ఆయన లోక్ సభలోకి కత్తి తో ప్రవేశించాడని అంటున్నారు. అదెఇ ఎంతవరకు నిజమో విచారణలో తేలుతుంది కానీ ఆయన గత చరిత్ర అలాంటి మనస్తత్వం ఉండనే చెపుతోంది. ఈ ఇద్దరే కాదు సీమాన్ధ్ర నేతలంతా పార్లమెంటులో తీవ్రవాదులనే తలపింప జేశారు. అనకాపల్లి ఎం పీ సబ్బంహరి సభలోనే ఆత్మాహుతికి దళపతి అవతారం ఎత్తారు. ఆయన నిండుసభలో ఆత్మాహుతికి పాల్పదతానని బెదిరించడం తో ఆయన సభలో ఉన్నంత సేపూ ఆయనను, మార్షల్స్, భద్రతాసిబ్బంది కనిపెడుతూనే ఉన్నాయి. మైకులు విరిచేసి టేబుళ్లు విసిరేయడం, కంప్యూటర్లు ఎత్తేయడం అద్దాలు పగులగొట్టడం ఇట్లా సభలో సీమాన్ధ్ర ఎం పీ లు చేయని హింస లేదు. ఆ చర్యలు గమనించిన వారు ఎవరైనా సరే టెర్రరిస్టు చర్యలకు తీసిపోవనే అంటారు. ఇది కేవలం సభాహక్కులకే కాదు, దేశ సార్వభౌమాధికారానికి కూడా ముప్పుగానే భావించాలి.
భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు చాలామంది ఈ దేశంలో న్యాయబద్ధమైన, ధర్మ బద్ధమైన పరిపాలనకు అంకురార్పణ జరుగుతుందని ఆశపడ్డారు. భారత రాజ్యాంగం ప్రజలకొక పెట్టని కోటగా ఉండి కాపాడుతుందని, పౌరులందరికీ సమానమైన హోదా, విలువ, గౌరవం దక్కుతాయనీ భావించారు. సమాజంలో అప్పటిదాకా ఉన్న ఆధిపత్య ధోరనులన్నీ అంతమైపోతాయనీ అనుకున్నారు. అందుకే రాజ్యాంగ పీఠికలో 'భారతీయులమైన మేము ఈ రాజ్యాంగాన్ని రాసుకున్తున్నమని ప్రకటించారు. సర్వజన ప్రాతినిధ్యం ఉన్న రాజ్యాంగ సభ దీనిని రూపొందించింది. రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలుచేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వేదికయితే ఇక ఈ దేశాన్ని ఎవరు కాపాడగలరు. దీనంతటికీ కాంగ్రెస్ పార్టీ బలహీనతే కారణం. ఆ పార్టీ 2009 న తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిన్చినప్పుడే లగడపాటిని పార్టీనుంచి బయటకు పంపించి ఉంటే సభలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇదొక్క లగడపాటి మనోవైకల్యం మాత్రమే కాదు. ఆధిపత్య ధోరణికి, అధికారానికీ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సీమాంధ్ర సామూహిక నాయకత్వ వైపరీత్యం. ఒక కసబ్ వెనుక, ఒక అఫ్జల్ గురు వెనుక రకరకాల తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెబుతుంటారు. రాజగోపాల్ వెనుకకూడా రాజకీయ తీవ్రవాదులు ఉన్నారు. వారు చద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, జగన్ రెడ్డి, కిరణ్ రెడ్డి ఇలా ఏ రూపంలో ఉన్నా వీరిని ఎదుర్కోకపోతే ఒక్క తెలంగానకే కాదు ఈ దేశానికే ముప్పు. తెలంగాణా వచ్చినా రాకపోయినా ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తూ భారత రాజ్యాంగ పునాదులనే ద్వంసం చేస్తోన్న ఇలాంటి టెర్రరిస్టులను తరిమికొడితే తప్ప ప్రజాస్వామ్యం మనుగడ కష్టం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి