తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా? కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించే సమయం దగ్గరపడుతున్నకొద్దీ సీమాంధ్ర మంత్రులు, రాజకీయ నాయకులు చేస్తున్న హడావిడి గమనిస్తే తెలంగాణ ఇచ్చేస్తారనే అనిపిస్తోంది. అఖిలపక్షం తరువాత దాదాపు రెండువారాల పాటు స్తబ్దంగా ఉన్న రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ ప్రాం తంలో పెద్దగా అలజడి లేకపోయినా ఆంధ్రా, రాయలసీమ నేతల్లో మాత్రం ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొందరు నేతలు, మంత్రులు, శాసనసభ్యులు ముందువరసలో నిలబడి సమైక్యవాదం వినిపిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర విభజన జరగదని అంటూనే మరోవైపు విభజనను వ్యతిరేకిస్తామని, పదవులు, పార్టీని వదిలి తెలంగాణను అడ్డుకుని తీరుతామని కొందరు అంటున్నారు. మంత్రి టీజీ వెంక ష్ ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టుగా తమకు అధిష్ఠానం మాటల్లో అర్థం అయిందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణకు కూడా ఈ మేరకు సమాచారం ఉందని, అందుకే కిరణ్ తన మంత్రివర్గ సహచరులు కొందరిని ఢిల్లీ కి పంపించారని, అధిష్ఠానం ఎదురు క్లాసు తీసుకోవడంతో వీళ్ళంతా ఎవరి బేరాలు వాళ్ళు చేసుకున్నారని అంటున్నారు. టీజీ వెంక లాంటి వాళ్ళు రాయలసీమ సాగునీటి సమస్యను, ఇంకొందరు రాజధాని సమస్యను ప్రస్తావించినట్టు వాళ్ళే చెప్పుకుంటున్నారు. సీమాంధ్ర నేతలు, మంత్రుల కలవరం గమనిస్తుంటే ఈ వారంలో తెలంగాణ కల సాకా రం కావొచ్చనే అనిపిస్తున్నది.
ఇది ఒక్క కాంగ్రెస్ సీమాంధ్ర నేతలకే కాదు తెలుగుదేశంతో సహా అన్నిపార్టీల్లోని ఆ ప్రాంత నాయకులకు మింగుడుపడడం లేదు. అందుకే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో చంద్రబాబు పాదయాత్ర సాగినంత కాలం తెలంగాణను అడ్డుకోం అన్న తెలుగుదేశం బాబుగారు మరోనాలుగురోజుల్లో పొలిమేరలు దాటుతుండగా మళ్ళీ కొత్తరాగం ఎత్తుకున్నది. నిన్న మొన్నటిదాకా తెలంగాణ విషయంలో స్పష్టత ఇచ్చామని, అఖిలపక్షంలో తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ కూడా ఇచ్చామని, సమావేశానికి ఇద్దరు వెళ్ళినా ఒకే మాట చెప్పామని బుకాయిస్తూ వచ్చిన సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు అసలు తాము తెలంగాణకు అనుకూలంగా మాట్లాడనే లేదని దబాయిస్తున్నారు.
అఖిలపక్షంలో గోడమీది పిల్లిలా ఉన్న జగన్‌పార్టీ కూడా కొత్తగా సమైక్యవాదంవైపే మొగ్గు చూపుతున్నది. రాజ్యాంగంలో అంబేద్కర్ సూచించిన మేరకు నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ అఖిలపక్షంలో చెప్పినా... ఇప్పుడు అందుకు భిన్నంగా ఆ పార్టీ శాసనసభ్యులు కొందరు హింసను ప్రేరేపించే మాటలు మాట్లాడుతున్నారు. మరోవైపు ఎన్నడూ లేనంతస్థాయిలో ఇప్పుడు హైదరాబాద్ గురించిన చర్చ జరుగుతున్నది. ఢిల్లీలో హైదరాబాద్ గురించి ఎవరైనా మాట్లాడారో లేదో కానీ మన గల్లీ ఛానళ్ళు మాత్రం తెగ ఊదరగొడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యేక రాజ్యంగా, దేశంగా, రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్‌ను ఇపుడు వాళ్ళ జాగీరులా మార్చుకునే పనిలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరంటుంటే కాదుకాదు రాష్ట్రమే చేయాలని మరికొందరు అంటున్నారు.
నిన్నమొన్నటిదాకా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వాదించిన విదూషకులు కొందరు తెలంగాణలోని కొన్నిజిల్లాలను, కొన్ని ప్రాంతాలను విడగొట్టి హైదరాబాద్‌లో కలిపి మహానగారాన్నే రాష్ట్రం చేయాలని వాదిస్తున్నారు. ఎవడికి నచ్చిన భాగం వాడు పంచుకోవడానికి తెలంగాణ కేక్ కాదని వాళ్ళు గుర్తించాలి. తెలంగాణ వేల సంవత్సరాల స్వతంత్ర అస్తిత్వం. అది తెలంగాణ గుండెకాయ. దాన్నివేరుచేసే శక్తి, స్థాయి ఎవరికీ లేదు. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.
కేంద్ర ప్రభుత్వం తనకు తాను విధించుకున్న నెలరోజుల డెడ్‌లైన్ దగ్గ ర పడుతుండడంతో ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని, అది కుదరకపోతే హైదరాబాద్‌ను అడ్డం పెట్టుకుని తమ బేరసారాలు పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నమని అర్థమౌతున్నది. అడ్డుకునే కుట్రలో భాగంగానే సమైక్యవాదాన్ని రెచ్చగొట్టే రీతిలో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు, టీజీ వెంక సాకే శైలజానాథ్ లాంటివాళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళారు. ఇప్పుడు హైదరాబాద్‌తో సహా అనేకచోట్ల సమావేశాలు నిర్వహిస్తూ ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. నిజంగానే రాజీనామా చేసి పోరాడాలని అనుకుంటే ఇప్పటికే ఆ పని చేసేవారు. కానీ అలా చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒత్తిదిపెంచే వ్యూహం పన్నుతున్నారు.
కేంద్రవూపభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తామని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మంత్రులు ఇలా ద్వేషం వెళ్లగక్కడం, ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబో రాజ్యాంగ నిపుణులే చెప్పాలి. అటువంటి వారిని కట్టడి చేయకుండా మరింతగా ప్రోత్సహించే రీతిలోనే ముఖ్యమంత్రి వైఖరి కనిపిస్తున్నది. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని కూడా రాజకీయవర్గాల భోగట్టా. ఇట్లా ముఠాలను ప్రోత్సహించే వ్యక్తి నిజంగానే రాష్ట్రాన్ని పాలించడానికి అర్హుడా అన్నది కూడా ఆలోచించాలి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలని లేదా హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం ఇరు ప్రాంతాలకు చెందాలని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సీమాం ధ్ర నాయకులు మరీ అంత మూర్ఖంగా ఉంటారని నేననుకోను. ఒకవేళ వాళ్ళలా అన్నా విజ్ఞులైన సీమాంధ్ర ప్రజానీకం అందుకు ఒప్పుకోరనే అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడైనా అది దేశమైనా, రాష్ట్రమైనా రాజధాని ఆ రాష్ట్ర భూభాగంలో మాత్రమే ఉంటుంది. ఒక దేశపు రాజధాని మరో దేశం లో, ఒక రాష్ట్రపు రాజధాని ఇంకొక రాష్ట్రంలో ఉండవు. అలా ఎక్కడా లేవు. చండీగడ్ ప్రస్తావన కూడా కొందరు తెస్తున్నారు. చండీగడ్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు నగరం. అది రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల్లో భాగంగా ఉన్నది. హైదరాబాద్ అలా కాదు. హైదరాబాద్ కు ఏ మూలనుంచి ఎవరు రావాలన్నా ఒకటో రెండో తెలంగాణా జిల్లాలు దాటి కనీసం మూడువందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రయాణించి రావాలి. రాజధాని అనేది పరిపాలనా కేంద్రం. ఆంధ్రా ప్రాంతపు పరిపాలనా కేంద్రా న్ని హైదరాబాద్ నగరంలో ఎలా ఉంచుతారు.
అలా ఉం చడం వలన ఎవరికి లాభం అనేది కూడా ఆలోచించాలి. కచ్చితంగా రాష్ట్రా న్ని ఏర్పాటు చేసేముందు వారికొక శాశ్వత రాజధాని కోసం కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే అక్కడ రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు సమకూరే వరకు హైదరాబాద్‌ను తాత్కాలికంగా వాడుకోవచ్చు. నిజానికి అలాం టి ఏర్పాటు కూడా అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి 1953-56 మధ్య కర్నూలు రాజధానిగా ఉంది. ఆంధ్రా రాయలసీమ ప్రజలకు ఏకాభివూపా యం ఉంటే దానినే తమ రాజధానిగా చేసుకోవచ్చు. అది కాదనుకున్న పక్షంలో స్వయంగా కొత్త రాజధానిని కట్టుకోవచ్చు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్టాలు ఏర్పడ్డప్పుడు ఆయా రాష్ట్రాలు తమ పాత రాజధానిలో ఉంటామని గానీ అది తమకే చెందాలని గానీ మొండికేయలేదు. ఛత్తీస్‌గఢ్ పన్నెండేళ్ళపాటు రాయ్‌పూర్‌లో సర్దుకుని నయా రాయ్‌పూర్ పేరుతో కొత్త రాజధానిని కట్టుకుంది. ఇప్పుడున్న రాజధానుల్లో కెల్లా అత్యంత అద్భుతమైన నగరంగా నయా రాయపూర్ ఉంది.
అలాగే జార్ఖండ్ ఏర్పడ్డప్పుడు కూడా వాళ్ళు రాంచి నగరాన్ని తమ రాజధాని చేసుకున్నారు. అంతేతప్ప పాట్నాను పట్టుకుని వేలాడలేదు. విజ్ఞతతో ఆలోచిస్తే ఇది అభివృద్ధికి ఒక సదవకాశం. ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడే అంశం. ఛత్తీస్‌గఢ్ ఆ అవకాశాన్ని వాడుకుంది. దాదాపు పన్నెండేళ్ళపాటు అక్కడ రాజధాని నిర్మాణం జరిగింది. లక్షలాదిమంది ఆ పనిలో భాగం పంచుకుని ఉపాధిని పొందారు. అలాగే అక్కడ దాదాపు యాభై కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకున్నారు. వందకుపైగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా భవనాలు వచ్చాయి.
అన్ని అత్యాధునిక హంగులతో దాదాపు 20 వేల ఎకరాల్లో రూపొందిన నయా రాయ్‌పూర్‌ను భారతదేశపు ‘భవిష్యత్ నగరం’ అని కొనియాడుతున్నారు. అలాంటి నగరాన్నే కాదు బంగారం లాంటి భవిష్యతును నిర్మించుకునే అవకాశం ఇప్పుడు ఆంధ్రులకు వచ్చింది. వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలతో దాన్ని అడ్డుకోవాలనే కుట్ర ఇప్పుడు జరుగుతున్నది. అందుకే చర్చను హైదరాబాద్ చుట్టూ తిప్పుతున్నారు.
రెండోది హైదరాబాద్ ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇక్కడి రెవెన్యూ ఎలా పంపిణీ చేస్తారు? ఆంధ్రాకు వాటా ఎంత అనే ప్రశ్నలను కొందరు పనిగట్టుకుని ప్రచారంలోకి తెస్తున్నారు. ఇది కూడా పగటికలే అనుకోవాలి. భారతదేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏ రాష్ట్రంలో పోగయ్యే సంపద ఆ రాష్ట్రానికే చెందుతుంది. ఆ సంపదలో పన్నుల రూపంలో వచ్చిన దానిలో కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. అంతేతప్ప పక్క రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు హక్కు ఉండదు. నిజంగానే ఇక్కడి పరిక్షిశమలు సీమాంధ్ర నీళ్ళు, కరెంటు లేదా భూభాగాన్ని ఇతర వనరులను వాడుకుంటే కొంత వాటా కోరవచ్చు. సెస్సు పేరుతో పన్నులు వేసుకోవచ్చు. కానీ వాటా అడగడం భారత రాజ్యాంగ ఫెడరల్ భావనకే విరుద్ధం. సాగు నీరు కూడా ఇప్పుడు తెరమీదికి రాబోతున్నది. సీమాంధ్ర ప్రాజెక్టుల్లో చాలావరకు భవిష్యత్తులో తెలంగాణ భూభాగంలోనే ఉంటాయి. ఈ విషయంలో కూడా ముందు ముందు మరి న్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది.
విభజనపై ఏకాభివూపాయం కుదిరితే వీటన్నిటినీ చర్చించవచ్చు. కానే అలాంటి నిర్ణ యం రాకముందే వీటిని ఇప్పుడు తెరమీదికి తేవడం అంటే తెలంగాణవాదులను అయోమయానికి గురిచేయడం తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే కేంద్రం తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటిస్తే ఎలాగూ అన్ని విషయాలూ చర్చలోకి వస్తాయి. కొంతకాలం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచమనిఆంధ్రా నాయకత్వం కోరవచ్చు. తెలంగాణ ప్రాంతపు పరిపాలనలో, వనరులు, ఆదాయం, అభివృద్ధిలో భాగం అడుగకుండా కొత్త రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేసుకునేంత వరకు తాత్కాలికంగా ఉండడానికి అంగీకరించ వలసిందిగా అభ్యర్తించవచ్చు. అయినా సరే అది కుదరని పని అని స్పష్టంగా చెప్పాలి.
నిజానికి ఒకసారి విభజనకు అంగీకరించిన తరువాత ఉమ్మడి రాజధాని తాత్కాలికంగా కూడా సాధ్యమయ్యేపనికాడు. ఐదేళ్లో పదేల్లో ఉన్నా వారికి కావాల్సిన విద్యుత్తు, తాగునీరు తదితర నిత్యావసర సరుకులు ఎక్కడినుంచి వస్తాయి. అవి ముమ్మాటికి పరాయి రాష్ట్రానివే వాడుకోవాలి. వాటికి సొమ్ము చెల్లించాలి. కాబట్టి తాత్కాలికం, శాశ్వతం అనే మాటలతో నిమిత్తం లేకుండా ఉమ్మడి రాజధానికి అంగీకరించడం సమంజసం కానే కాదు.
అలాగే హైదరాబాద్‌లో పెట్టుబడులు తమవని, ఆదాయం తమదని, తమకు వాటా ఉండాలని ఎవరైనా వాదిస్తే అలా అనుకున్నవాళ్ళు వెళ్ళిపోయి ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు తప్ప హైదరాబాద్ ఖజానాలో వేలుపెడితే సహించమని చెప్పాలి. ఈ విషయంలో తెలంగాణ పౌర సమాజం గట్టిగానే స్పందిస్తున్నా రాజకీయ పార్టీలు మాత్రం మౌనంగా ఉంటున్నాయి. ఏదో ఒక నిర్ణయం వెలువడే దాకా ఈవారం రోజులూ మౌనమే మంచిదని భావించడం కూడా కారణం కావొచ్చు.
కానీ అలా మౌనంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఉండగలమా అన్నది సమస్య. చరిత్ర పొడవునా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ ఇప్పుడు హటాత్తుగా మారిందని చెప్పినా నమ్మే స్థితిలో తెలంగాణ లేదు. 1969 ఉద్యమ సమయంలో ఇందిరాగాంధీ కూడా చివరినిమిశం వరకు ఇలాంటి ప్రకటనే చేసి మోసం చేసింది. అదే 2009 లో పునరావృతం అయ్యింది. అందుకే ఆంధ్రా పెత్తందార్ల అలజడికి ఆందోళన చెందకుండా తెలంగాణ సమాజం వాళ్ళ ఆటలను మౌనంగా గమనిస్తున్నది. తెలంగాణ పట్ల స్పష్టమైన అధికారిక ప్రకటనను తప్ప ఇప్పుడు వార్తా కథనాలను, ఊహాగానాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు.
ఎందుకంటే గతంలో చేసి న ప్రకటన మూడేళ్ళు దాటినా అమలుకాలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒక ప్రకటనచేసి పార్లమెంటులో బిల్లు పెట్టినా దాన్ని చట్టరూపం దాల్చకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వెనుకాడరు. ఇప్పటికే సమాజ్‌వాది పార్టీతో పాటు యూపీఏ భాగస్వామ్య పార్టీలతో ఈ మేరకు మంతనాలు నడుస్తున్నాయి. ఇక్కడ వైఎస్ జగన్‌తో కూడా చర్చలు సాగిస్తున్నారు. మాటకు కట్టుబడి నిజంగానే కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడితే గాలి కబుర్లు ఆపి ముందు బిల్లు సిద్ధం చేసి రాబోయే సమావేశాలలో ప్రవేశపెట్టాలి. దానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను వెంటనే ప్రకటించాలి. అప్పటిదాకా తెలంగాణ వస్తుందంటే నమ్మలేం. నమ్మకూడదు కూడా!
సీమాం ధ్ర నాయకులు మరీ అంత మూర్ఖంగా ఉంటారని నేననుకోను. ఒకవేళ వాళ్ళలా అన్నా విజ్ఞులైన సీమాంధ్ర ప్రజానీకం అందుకు ఒప్పుకోరనే అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడైనా అది దేశమైనా, రాష్ట్రమైనా రాజధాని ఆ రాష్ట్ర భూభాగంలో మాత్రమే ఉంటుంది. ఒక దేశపు రాజధాని మరో దేశం లో, ఒక రాష్ట్రపు రాజధాని ఇంకొక రాష్ట్రంలో ఉండవు. అలా ఎక్కడా లేవు. చండీగడ్ ప్రస్తావన కూడా కొందరు తెస్తున్నారు. చండీగడ్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు నగరం. అది రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల్లో భాగంగా ఉన్నది. హైదరాబాద్ అలా కాదు. హైదరాబాద్ కు ఏ మూలనుంచి ఎవరు రావాలన్నా ఒకటో రెండో తెలంగాణా జిల్లాలు దాటి కనీసం మూడువందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రయాణించి రావాలి. రాజధాని అనేది పరిపాలనా కేంద్రం. ఆంధ్రా ప్రాంతపు పరిపాలనా కేంద్రా న్ని హైదరాబాద్ నగరంలో ఎలా ఉంచుతారు.
రిప్లయితొలగించండి