శుక్రవారం, ఏప్రిల్ 06, 2012

బస్తర్ బిడ్డలకు బాసటగా నిలబడదాం!



తెలంగాణా ఉద్యమంలో ఆత్మహత్యల అగ్గి ఎందుకు రాజుకుందో కానీ అదిప్పుడు అందరినీ కలచివేస్తున్నది. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్యలకు ఆహుతి కావడం ఇప్పుడు  ఉద్యమ కారులను కూడా  కలవర పెడుతోంది. సుదీర్ఘ పోరాట సాంప్రదాయాలు ఉన్న నేల మీద నిరాశకు తావుండకూడదు. అది నిరాశ కాదు నిరసన అని సరిపెట్టుకున్నా నిరసన ఎప్పుడూ నిష్ఫలంగా మిగిలి పోకూడదు. వందలాది మంది ఆత్మాహుతుల తరువాత కూడా తెలంగాణా రాలేదంటే రాష్ట్ర సాధనకు అది సాధనం కానే కాదని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అసలది పోరాట రూపమే కాదన్న సంగతి గుర్తించాలిగతంలో, వర్తమానంలో ఎప్పుడూ ఆత్మ హత్యలు గెలిచిన దాఖలాలు లేవు. ఆత్మ హత్య ఓటమికి పరాకాష్ట. అది తెలంగాణా విషయంలో మరో సారి రుజువయ్యింది. ఎప్పుడైనా ఎక్కడైనా పోరాటమే గెలుస్తుందనదానికి చరిత్ర పొడుగునా అనేక దాఖలాలు కనిపిస్తాయి. అలాగే పోరాటమంటే నల్లేరు మీద నడక కాదన్న సత్యమూ ఉద్యమాలను గమనిస్తే  అర్థమవుతుంది.

 మన పొరుగున ఉన్న చత్తిస్ గడ్ ఆదివాసులనే తీసుకోండి. వాళ్ళు ఎన్నో ఆటుపోట్ల మధ్య ఎత్తిన పిడికిలి దించకుండా నడుస్తున్నారు. తమ భూమిని, అడవిని అడవినిండా ఉన్న సహజవనరులను ఖనిజ సంపదను కాపాడుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరతుపాకులు మొదలు మానవ రహిత యుద్ధ విమానాల దాకా వారిమీద ఎక్కుపెట్టినా మొక్కవోని ధైర్యంతో ముందుకే కదులుతున్నారు తప్ప వెనుదిరిగి పారిపోవడం లేదు. తమంతట తాము ప్రాణాలు తీసుకోవడంలేదు. తెలంగాణా, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్ సరిహద్దుల్లోని చత్తీస్ గడ్ అడవిమీద, ఆదివాసుల మీద సాగిస్తోన్న దాడికి 'గ్రీన్ హంట్'  అంటున్నారు. తెలంగాణా మీద ప్రకటనల యుద్ధం చేస్తూ అమాయక జనాలను బలిగొంటున్న   కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరమే గ్రీన్ హంట్ సృష్టి కర్త. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల ఉద్యమ కారులు మొదలు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఎందరు వ్యతిరేకించినా   యుద్ధోన్మాదం ఆగకుండా కొనసాగుతూనే ఉన్నది. పోరాటంలో వేలాది మందిని సైన్యం చంపేసింది. కొందరిని నక్సలైట్లు అని ఇంకొందరిని వాళ్ళ సానుభూతి పరులని పేర్లు పెట్టి మరీ పోత్తనబెట్టుకుందిఅయినా అక్కడి ఆదివాసులు బెదిరిపోలేదు, బెంగ పడలేదు. నిలబడి నిరసన తెలుపుతూనే ఉన్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుని చావాలని అనుకోలేదు.  అదీ పోరాటమంటే

చత్తీస్ గడ్ ఆదివాసీ పోరాటానికి బస్తర్, దంతేవాడ కీలక కేంద్రాలు. తెలంగాణా జిల్లాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఆనుకుని గోదావరి కి ఆవల ఉండే అడవి ఒకప్పుడు తెలంగాణా విప్లవోద్యమ పాథశాల. 1969   తెలంగాణా రాష్ట్ర పోరాటాన్ని ప్రభుత్వం అణచివేసిన తరువాత చెల్లాచెదురైన యువతరానికి అడవే ఆశ్రయమిచ్చింది. అక్కడి ఆదివాసులే వాళ్ళను ఆదరించారు. అప్పటినుంచి  భారతదేశ  విప్లవోద్యమానికి అడవి కీలక కేంద్రమయ్యింది. అడవినిండా అనేక వనరులున్నా ఆదివాసుల కడుపులనిండా ఆకలి తాండవిస్తుంది. దేశంలో ఉన్న ఇనుపఖనిజంలో దాదాపు 19 శాతం అడవిలోనే ఉంది. దాదాపు 17 శాతం బొగ్గు నిల్వలు భూ గర్భంలోనే ఉన్నాయి. దోలమైటు, బాక్సైటు, తగరపు నిల్వలకు కొడువే లేదు. అన్నిటినీ మించి అది వజ్రాల గని. దేశంలోని వజ్రాలలో దాదాపు 29 శాతం అడవిలో ఉన్నాయి.
సులభంగా చెప్పుకోవాలంటే తగరంలో దేశం లోనే మొదటి స్థానంలో , బొగ్గు లో రెండో స్థానంలో , దోలమైటు లో మూడో స్థానంలో, ఇనుప ఖనిజంలో నాలుగో స్థానంలో,సున్నపురాయిలో ఐదో స్థానంలో చత్తిస్ గడ్ ఉంది.    అయనా అక్కడి మనుషులకు గుర్తింపులేదు, గౌరవంలేదు అసలు మనుషులన్న స్పృహ కూడా పాలకులకు లేకపోయింది. దాదాపు 1980 దశకం దాకా అక్కడ ప్రభుత్వం అడుగుకూడా పెట్టలేదు. అలాంటి అడవిలో  తొలితరం తెలంగాణా యువకులే ఆదివాసులకు అన్నలు గా నిలబడి వారికి ప్రపంచాన్ని పరిచయం చేసారు. భూమిని సాగులోకి తెచ్చి జలవనరుల వినియోగం నేర్పించారు. విద్య, వైద్యం అందించి అక్కడ ఒక ప్రజా పాలనను అమలులోకి తెచ్చారు.  సాధారనంగా పాలకులు ఏం చేసినా పెద్దగా పట్టించుకోరు కానీ ప్రత్యామ్నాయంగా పరిపాలన చేస్తామంటే భరించలేరు. అక్కడికి మొట్టమొదటి సారిగా ప్రభుత్వం పోలీసుల రూపంలో ప్రవేశించింది. నక్సల్ ఏరివేత పేరుతొ అడవిని అడుగడుగూ గాలించింది. అడవి కేవలం ఆదివాసుల స్థావరం మాత్రమే కాదు, అశేష ఖనిజ సంపదకు నిలయమని అర్థం చేసుకుంది.

అదే సమయంలో నూతన ఆర్ధిక విధానాలను ఆవిష్కరించిన ప్రభుత్వం దేశ విదేశీ పెట్టుబడి దార్లకు అడవిలోకి ఎర్రతివాచీ పరిచింది. చత్తీస్ గడ్ పారిశ్రామిక, ఖనిజ విధానం పేరుతొ గుత్త పెట్టుబడికి ద్వారాలు తెరిచిన ప్రభుత్వం ఆదివాసీలు నివసిస్తోన్న ప్రాంతాలను పారిశ్రామిక వేత్తలకు పెద్దపెద్ద కంపనీలకు అప్పగిస్తూ దాదాపు నూట పదిహేను కంపనీలతో ఒప్పందాలు చేసుకుని అక్కడి ఖనిజ సంపదను దోచుకునేందుకు  ద్వారాలు తెరిచింది. తరతరాలుగా అడవే లోకమై  జీవిస్తోన్న సంగతి తెలియదు. వాలా అభిప్రాయం తీసుకోలేదు సరికదా కనీసం వాళ్లకు సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళకింది నేలను కంపనీలకు అప్పగించింది. ఆదివాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసారు. వాల్ల్లల ఎదురుతిరగడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెట్టింది. నక్సల్స్ బలంతో నే వాళ్ళలా ప్రతిఘతిస్తున్నారని భావించిన ప్రభుత్వం సాయుధ దళాలతో అణచివేత చర్యలకు పూనుకుంది. అడవిలో కాలుకడుపడమే కష్టం కాబట్టి ఆదివాసీ ప్రాంతాలు, గ్రామాలు తెలిసిన 'ఆదివాసీ' యువకులతో 2006 లో సాల్వా జుడుం అనే కొత్త దళాన్ని ఏర్పాటు చేసి ఆదివాసుల ఊచకోత మొదలుపెట్టింది. ఆదివాసులను, ముఖ్యంగా ప్రతిఘతిస్తోన్న యువకులను మట్టుబెట్టడం, దోపిడీలు చేసి ఆదివాసీ గ్రామాలను అల్లకల్లోలం చేయడం, గ్రామాలు ఖాళీ చేయించి ప్రజలను అడవి బయట స్తావరాలు, గుడారాలు  ఏర్పాటు చేసి బానిసలుగా వాటిలో బంధించడం, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం ఇట్లా సల్వాజుడుం ఆరేళ్ళ పాటు అడవిని అల్లకల్లోలం చేసింది. దాదపు ఆరువందల గ్రామాలు ఖాలిచేయించి ఆదివాసీ గూడేలను కాల్చివేసింది. ఇళ్ళను కూల గొట్టింది. దాడుల తరువాత ఇప్పటికీ దాదాపు యాభై వేల మంది యువకులు కనిపించకుండా పోయారు. వాళ్ళలో చాల మందిని సాల్వా జుడుం చంపేసి ఉంటుందని మానవ హక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి. సల్వా జుడుం ను రద్దు చేయాలని గత ఏడాది సుప్రీం కోర్టు ఆదేశించే దాకా అడవిలో అరాచకం రాజ్యమేలింది. అడ్డుచెప్పిన మేధావులు, పాత్రికేయులు న్యాయవాదులను అనేక మందిని నక్షలైత్లు గా ముద్ర వేసి జయిల్లలో తోసేశారుజాతీయ మానవహక్కుల సంఘం, ఇతర పౌర హక్కుల సంఘాలు, అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలు చేసిన నిరసనలన్నీ అరణ్యరోధనలే అయ్యాయి.

తరుణంలో 2011 జూలై  లో సుప్రీం కోర్టు సల్వాజుడుం ను రద్దు చేస్తూ ఒకచారిత్రాత్మకమైన  తీర్పును వెలువరించింది. తీర్పు  అడవికి  అరాచాకంనుంచి విముక్తి కలిగించింది. యాదృచ్చికమే కావచ్చు కానీ  తీర్పును వెలువరించింది కూడా తెలంగాణా న్యాయకోవిడుడు జస్టిస్ సుదర్శన రెడ్డి కావడం గమనార్హం.  సాల్వా జుడుం అనైతిక ప్రయోగమని అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తీర్పులో స్పష్టంగా చెప్పారు. ప్రజల ధన మాన ప్రాణాలకు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు భంగం కలిగించే రీతిలో పాలన ఉండకూడదని తీర్పు స్పష్త్మగా చెప్పింది. తీర్పరిగానే కాదు మనిషిగా కూడా సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తి కాబట్టీ ఆయన ఇప్పుడు తెలంగాణా ఉద్యమానికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు.

ఆదివాసీల ప్రతిఘటన, ప్రపంచ వ్యాప్తంగా   ప్రజా సంఘాల ఆందోళన, చివరికి సుప్రీం కోర్టు తీర్పు చిదంబరం కు దెబ్బ మీద దెబ్బగా తగిలాయి. ఎందుకంటే చత్తీస్ గడ్ ను చిందర వందర చేసి పెట్టుబడి దారులకు కట్టబెట్టింది ఆయనే! ఆయన గతంలో ఆర్ధిక వాణిజ్య శాఖలకు మంత్రిగా ఉన్నప్పుడే దేశ విదేశీ కంపనీలతో ఒప్పందాలు చేసుకుని అడవిని వారికి అప్పగిస్తూ ఒప్పందాలు చేయించాడు. వేదాంత లాంటి విదేశీ కంపనీలు మొదలు, టాటాలు, జిందాల్ లు, ఎస్సార్ వంటి వందలాది కంపనీలకు ఆదివాసుల అడవిని, భూమిని వాటాలు పంచి ఇచ్చాడు. ఇప్పుడు చత్తీస్ గడ్దా అడవుల మీద దాపు 90 ఇనుప ఖనిజం దోచే కాంట్రాక్టు కంపనీలు, బొగ్గు తవ్వీ మైనింగ్ కంపనీలు, బొగ్గు ఆధారంగా నడిచే 59 విద్యుత్ కంపనీలు  వచ్చి వాలాయి. వాళ్ళ కోసం ఆదివాసులను  అడవినుంచి తరిమి వేయడానికి ఇప్పుడు మళ్ళీ చిదంబరమే హోం మంత్రి వేషంలో రంగ ప్రవేశం చేసాడు.
ఒక్క బస్తర్ జోన్ లోనే ఇరవై బతాలియన్ సాయుధ బలగాలు ఇప్పుడు పనిలో ఉన్నాయి. ఇందులో పరిశ్రమల రక్షణకోసం ఉండాల్సిన ఇండస్త్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ మొదలు సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన బద్రతా దళాల దాకా ఉన్నాయి.   దళాలు రోజూ ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతూ నక్సల్ ఏరివేత పేరుతొ ఆదివాసీలను చెదర గొడుతున్నాయి.   అడవిలో ఉండే జంతువులూ, సర్పాలు ఇతర విష జీవాల పేర్లతో (కోబ్రా, స్కార్పియో, క్యాట్, టైగర్) దళాలను ఏర్పాటు చేసి దళాలు అడవిని మళ్ళీ అంగుళం అంగుళం గాలిస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, బెదిరిచి భయపెట్టి లోన్గాదీసుకోవదాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మొత్తం వ్యవహారానికి చిదంబరం పెట్టిన ముద్దు పేరు ఆపరేషన్ గ్రీన్ హంట్!

ఇంతటి విపత్కర పరిస్తితుల్లో కూడా ఆదివాసుల మనో ధైర్యం మొక్క వోలేదు. వాళ్ళిప్పుడు ఏక కాలంలో అనేక మందితో పోరాడుతున్నారు. ఒక వైపు సాయధ దళాలను ఎదిరిస్తున్నారు. మరోవైపు తమ నేలను కబలిస్తోన్న భారతీయ, బహుళ జాతి కంపనీలను నిలువరిస్తున్నారు. ఇంకొక వైపు ప్రజా స్వామ్య యుతంగా దేశ రాజకీయ, న్యాయ వ్యవస్తలనూ కదిలించే రీతిలో కదులుతున్నారు.  అందుకే ఇప్పుడు మారుమూల బస్తర్ గిరిజనుల సమస్య దేశ విదేశాల్లో చర్చకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం అవుతోంది. అది ఇప్పుడు వాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇష్తోంది.

ఎప్పుడైనా సరే మనిషికి పోరాటం ఒక్కటే ధైర్యాన్ని ఇస్తుంది. పోరాడే వాళ్ళకే మద్దతు ఉంటుందిఅది బస్తర్ ఉద్యమం నిరూపించింది.  అటు చత్తీస్ గడ్ లో, ఇటు తెలంగాణా లో ప్రజలను అల్లా కల్లోలం చేస్తున్నది ఒకడే! అక్కడా ఇక్కడా జనం తమ భూములు, తమ నీళ్ళు, తమ వనరుల కోసమే పోరాడుతున్నారు. రెండు చోట్లా అమాయక జనం ఆహుతవుతున్నారు. అక్కడ  హత్యలకు గురయితే ఇక్కడ ఆత్మహత్యల పాలవుతున్నారు. తెలంగాణా సమాజం కూడా చత్తీస్ గడ్ ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుగ్పాలి. పోరాడడమే కాదుపోరాడే వారికి బాసటగా నిలబడడం, సంఘీభావం తెలుపడం కూడా  కొత్త ధైర్యాన్ని తెగువను నేర్పుతుంది. అది ఇప్పుడు తెలంగాణా ఉద్యమానికి చాలా అవసరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి