శుక్రవారం, డిసెంబర్ 09, 2011

‘రాజ’ద్రోహానికి రెండేళ్ళు!



కావూరి సాంబశివరావును తెలంగాణ కు విలన్ అని చాలామంది అనుకుంటారు. కానీ తెలంగాణ నేతల గుణగణాలు ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవని అనిపిస్తుంది. కావూరి దాదాపుగా నాలు గు దశాబ్దాలుగా తెలంగాణలో ఉండి ఇక్కడి రాజకీయ స్వభావాన్ని అవపోసన పట్టారు. వరంగల్ ఆర్ఈసిలో చదివి, ఇక్కడే చిన్న చితకా కాంట్రాక్టులు చేసి పైకొచ్చిన కావూరికి ఇక్కడి నేతలు ఎంతటి బానిస మనస్తత్వం కలవా రో బాగా తెలుసు. అది తెలిసే ఆయన ఒకసారి తెలంగాణ నేతలు పదవీ లాలసులని, అధికారం లేకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కనిమిషం కూడా బతకలేరని అన్నారు. అంతేకాదు చేతనైతే పదవులు వదిలేసి పోరాడమనండి అనికూడా సవాలు విసిరారు. వాళ్ళు పని చేస్తే నిజంగానే ఇప్పటికి తెలంగాణ వచ్చేది. అలా చేయకపోగా మాట అన్నందుకు ఆయనను విలన్ అన్నవాళ్ళే ఇప్పుడు తెలంగాణకు అసలు సిసలు విలన్లుగా అవతరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రెండు సంవత్సరాలుగా తోక్కిపెడుతున్న ప్రభుత్వాన్ని పడిపోకుండా నిలబెట్టిన కాంగ్రెస్స్ ఎమ్యెల్యేలను తెలంగాణ పాలిట విలన్లు కాక ఇంకేమవుతారు. శాసన సభలో అవిశ్వాస తీర్మానంతో రెండు రోజులక్షికితం దాకా శ్వాస ఆడక ఉక్కిరి బిక్కిరైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటోంది. ఆయన ప్రభుత్వానికి మరో ఆరునెలలపాటు డోకా లేకుండా చేసినందుకు బహుశా ఇప్పుడు ఆయన తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యులు, మంత్రుల ఋణం తీర్చుకునే పనిలో ఉండి ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు, మంత్రులు బేషరతుగా దాసోహమైపోయి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటిదాకా లేని కొత్త బలాన్ని సమకూర్చారు.

బలంతో ఆయన తెలంగాణవాదం మీద ఉక్కుపాదం మోపాలని చూస్తున్నాడు. ఆయన సభలో గెలిచిన మరుసటి రోజే డాక్టర్ చెరుకు సుధాకర్ను ఏడాది కాలం బంధిస్తూ శిక్ష ఖరారు చేసాడంటే తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన వైఖరి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే అదే కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్లో టీ వీ స్టూడియోలలో కూర్చుని చెరుకు సుధాకర్ నిర్బంధాన్ని ఖండించారు.

తెలంగాణ ఎంపీలయితే ఢిల్లీలో ప్రదర్శనలు కూడా చేశారు. ఇది ఆయన వైఖరి మాత్రమే కాదు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి. అయితే హైకోర్టు కోర్టు జోక్యంతో చెరుకు సుధాకర్ చెర వీడారు. కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లుగా ఇదే నాటకాన్ని పదే పదే ప్రదర్శిస్తోంది. ఇక్కడ అక్కడ ఏడవడం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్ల తమ అచంచల విశ్వాసాన్ని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ చేతు ల్లో ఉన్న చిట్ట చివరి అవకాశాన్ని కూడా ఇప్పుడు చేజార్చుకున్నారు. తాముకూడా తెలంగాణా వాదులమే అని చెప్పుకునే అర్హతను కూడా వాళ్ళిప్పుడు కోల్పోయారు. రకంగా తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యలు కావూరి సాంబశివరావు మాటలు తప్పుకాదని రుజువు చేసారు.

ఒక్క వాళ్లే కాదు మొత్తం రాజకీయ వ్యవస్థే ఇప్పుడు తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉన్నా యి. ప్రభుత్వాల వైఖరి ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థకే తలవంపుగా మారిపోయింది. గడిచిన అరవై ఏళ్ళుగా జరుగుతున్న మోసాన్ని, వంచనను, పదేళ్లుగా సాగాదీస్తోన్న వ్యవహారాలను అలా వదిలేసి గడిచిన రెండేళ్లలో జరిగిన పరిణామాలను గమనిస్తే ప్రభుత్వాలకు విశ్వాసనీయత కోల్పోయాయన్న సంగతి ఎవరికైనా అర్థమౌతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొద లు పెట్టబోతున్నట్టు కేంద్ర హోం శాఖా మంత్రి చిదబరం ప్రకటించి ఇప్పటికి రెండేళ్ళు పూర్తయ్యాయి. రోజు రాత్రి ఆయన భారత ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో మరో కొత్త రాష్ట్రం యేర్పడ బోతున్నదని, సుధీర్ఘ చర్చల తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారని ఆయన విస్పష్టంగా చెప్పారు.

ఆయన చెప్పిన సంగతి అలా ఉంచితే నాలుగు రోజులు ఢిల్లీలో భారత ప్రభుత్వం విషయం మీద పెద్ద కసరత్తే చేసింది. కాంగ్రెస్ కోర్ కమిటీ అనేక దఫాలుగా సమావేశమయ్యింది, ముఖ్యంగా తొమ్మిదో తేదీ రాత్రి పొద్దుపోయేదాకా యూపీఏ అధినేత్రి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గ సహచరులతో సుదీర్ఘంగా చర్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్ణయాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించిన చిదంబరం క్లుప్తంగా నాలుగే వాక్యాల్లోఆ రోజు జరిగిన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారు. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రక్రియ మొదలు మొదలుపెడతాం.  రెండవ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజకీయ పార్టీలన్నీ డిసెంబర్ ఏడో తేదీన హైదరాబాద్లో సమావేశమై అందుకు ఏకక్షిగీవ తీర్మానం చేశాయి.

తీర్మానం మేరకు యూపీఏ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది. మూడవది డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు జరిగిన ఆందోళనల్లో నమోదైన అన్ని కేసులను ఎత్తివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము, తన లక్షం నేరవేరినందున కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చివరగా నిర్ణయం మేరకు రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టవలసిందిగా ముఖ్యమంవూతికి చెప్పాం. ఇదీ చిదంబరం ప్రకటన సారాంశం. ప్రకటనను ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్మారు. పత్రికలన్నీ భారతదేశంలో కొత్త రాష్ట్రం ఆవిర్భవిస్తోందని కథనాలు రాశాయి. తెలంగాణ మ్యాపులు గీసి ప్రచురించాయి. దేశంలోని ప్రధాన పత్రికలన్నీ తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటాన్ని విశ్లేషిస్తూ సంపాదకీయాలు రాశాయి. ప్రభుత్వం అంతటితో ఆగలేదు.

అప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నందున, సభ జరుగుతున్నప్పుడు అత్యవసరంగా సభా తీసుకునే నిర్ణయాలను సభ్యుల దృష్టికి తీసుకు వచ్చి వారి ఆమోదం పొందా ల్సి ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా మరుసటి రోజు పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. సభ్యులు బల్లలు చరిచి ప్రకటనను ఆమోదించారు. తతంగమంతా జరిగి రెండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ నాలుగు అంశాల్లో ఒక్కటీ ఇప్పటి కీ నెరవేరలేదు. అలాంటి ప్రభుత్వం మీద విశ్వాసం ఎలా ఉంటుంది. తెలంగాణ ప్రజలు మాట తప్పిన ప్రభుత్వం మీద తమ అవిశ్వాసాన్ని గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే ఉన్నారుఒక్క అవిశ్వాసమే కాదు. రెండేళ్లలో అద్భుతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. ప్రజల ఆగ్రహావేశాలు గమనించిన పాలకవర్గాలు శ్రీ కృష్ణ కమిటీ పేరుతో మరో కుట్రకు తెరతీశాయి. తెలంగాణ రాజకీయ పక్షాలు కూడా వారి కి సహకరించాయి.

ప్రజాభివూపాయ సేకరణ పేరుతో ఏడాదిపాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ రాష్ట్రంలో 11 నెలల్లో 23 జిల్లాలు తిరిగింది. 34 సార్లు సమావేశమయ్యింది. రహస్య చాప్టర్తో సహా అన్నీ కలిపి 688 పేజీలతో నివేదిక సమర్పించింది. ఇది జరిగి ఏడాది గడిచింది. ఇది ఏడాదిలో రెండో మోసం అని ప్రజలు గమనించారు. ఊరూ వాడా ఒక్కటిచేసి పోరాడుతూనే ఉన్నారు.అయినా ప్రభుత్వం తన బాధ్యత ను తెలుసుకోలేదు. ప్రజాస్వామ్యం పరిహాసం అవుతున్న క్రమంలో వందలాదిమంది ప్రాణాలు తీసుకున్నారు. ప్రభుత్వానికి చలనం తెప్పించేందుకు తెలంగాణ పౌరసమాజం అన్ని ప్రయత్నాలూ చేసి చివరకు సకలజనుల సమ్మెను కూడా విజయవంతంగా నిర్వహించింది. అయినా ప్రభుత్వం కదల లేదు సరికదా కక్షసాధింపు చర్యలకు పూనుకుంది.

రెండేళ్లలో రాజకీయ పార్టీల పుణ్యమా అని వెయ్యి గుర్రాలతో బలం తో పరుగెత్తిన తెలంగాణ జేఏసీ బండి ఆగి ఆగి నడుస్తోంది. అలసిపోయిన గుర్రాలు ఒక్కొక్కటి బండీ వెనుకకు చేరిపోయాయి. అసలయితే ముందు గుర్రాలు ఉంటే బండీ వెనుక ఉండాలి. రెండేళ్ల ప్రయాణం తర్వాత చూస్తే ఇప్పుడు బండీ ముందు వెనుక గుర్రాలు అన్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నే ఇప్పుడు 2014 ఎన్నికల మీదే దృష్టి సారించి ఉన్నాయి. అందుకే 2014 దాకా తెలంగాణ వచ్చేలా లేదని, సూచనలు కనిపించడం లేదని సన్నాయి నొక్కులు మొదలుపెట్టాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉద్యమం ఎలా ఉధృతం చేయాలి అనే దానికంటే ఉద్యమాన్ని 2014 దాకా ఎలా బతికించుకోవాలి అన్నదే ప్రధాన చర్చ అవుతోంది. ఉద్యమం బతక కపొతే వాళ్లకు భవిష్యత్తు ఉండదని బాగా తెలుసు.

ఇవన్నీ లెక్కలు వేసుకునే తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు తాము ప్రభుత్వ పక్షమేనని ఇప్పుడు విశ్వాస తీర్మానంలో తేల్చేశారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తామని పిట్టల దొరల్ల మాట్లాడిన వాళ్ళు, శవాలమీద ప్రమాణాలు చేసిన వాళ్ళు, తెలంగాణ కోసమే అంటూ నిరాహార దీక్ష పేరుతో నాటకాలాడిన వాళ్ళు, మా తడాఖా చూపిస్తామని మీసాలు మెలివేసిన వాళ్ళు, గుండెలు బాదుకున్నవాళ్ళు ఒక్కరు కూడా ప్రజలపట్ల, ఉద్యమంపట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించకలేకపోయారు. అధికార పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం సందర్భంగా శాసన సభలో మాట్లాడిన ఒక్క తెలంగాణ మంత్రి, శాసనసభ్యుడు కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలని అనలేకపోయారు. అలాంటి వాళ్ళను ఎవరైనా పదవీ లాలసులు అనో, బానిసలు అనో ఆంటే తప్పెలా అవుతుంది? బానిసత్వం అంటే తిట్టెం కాదు.

తన అంతరాత్మ ఏం చెపుతున్నా వినలేకపోవడం, విన్న దానికి తగినట్టుగా వ్యవహరించలేని స్థితిలోఉండడమే. జగన్ వెంట ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ తిరుగుబాటు అనైతికమని, చట్ట విరుద్ధమని, అలా చేయడం వల్ల పదవులు పోతాయని తెలిసినా ఆయనకు ఇచ్చిన మాట కోసమో లేక ఆయన ఇచ్చిన మూటకోసమోగానీ మాట మీద నిలబడ్డారు. అలాగే చిరంజీవిని ఎవరూ కాంగ్రెస్లో పెద్దగా గుర్తించక పోయి నా, ఆయన ఎమ్మెల్యేలు ఎందరు ఆయన విధేయులుగా ఉన్నారో తెలియక పోయినా ఆయన కూడా అదిరించో, బెదిరించో ఒక ఆట ఆడించాలని చూశా రు. చంద్రబాబునాయుడు అవిశ్వాసం వెనుక మతలబు వేరు. తెలంగాణలో ఆయన మీద విశ్వాసం పూర్తిగాపోయింది. శాసన సభ్యులను సంబాలించుకోవడమే కష్టంగా మారిపోయింది. ఇప్పటికే అర డజను మంది శాసన సభ్యులు ఆయన మీద విశ్వాసం లేక రాజీనామా చేశారు. పైగా సీబీఐ విచారణతో ఇప్పుడు ఆయన విశ్వాసనీయతే ప్రశ్నార్థకంగా మారిపోయింది. స్థితిలో ఆయన అవిశ్వాసం అనే అస్త్రాన్ని ప్రయోగించాడు.

అలా చేయడం వల్ల ప్రజల దృష్టి మరల్చడమే కాకుండా, సమావేశాల్లో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాకుండా చేయగలిగాడు. తతంగంలో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ వంటి పార్టీల తెలంగాణ వాదమంతా అరణ్య రోదనే అయ్యింది. అవిశ్వాస తీర్మానం అనేదానికి రాజ్యాంగం ఇచ్చిన అర్థం వేరు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రబుత్వాలు నడుస్తున్నప్పుడు, ప్రజలకిచ్చిన హామీని విస్మరించి ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వాలకు అధికారంలో కొన సాగే హక్కు ఉండకూడదు. అలా ప్రజల విశ్వాసం లేని ప్రభుత్వాలు కొనసాగడం అనైతికమే కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతోంది. అలా కొనసాగడానికి అనేక అనైతిక ప్రయత్నాలను విజయవంతంగా చేసింది. ప్రభుత్వానికి తన సొంత పార్టీ శాసనసభ్యులను ప్రలోభపెట్టాల్సి వచ్చింది. గౌరవ శాసన సభ్యులను సంత లో పశువుల్లా కోనేశారని అదే స్వయంగా అదే సభలో ప్రతిపక్షనేతలు వాపోయారు.

సంతలో పశువులను ఒక్కరే ఒకే సారి కొంటారు. కానీ అంతకంటే హీనంగా ఒక్కొక్కరు రెండుమూడు సార్లు అమ్ముడు పోయారని పవూతికలూ రాశాయి. అవిశ్వాసం రోజున మీడియా కథనాలు గమనిస్తే అదొకదొంగల సంతలా కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు దేశం పాలనతో పోల్చితే రైతులకు చేసిన మోసం పెద్దదేమీ కాదు. కానీ తెలంగాణ విషయంలో ప్రజా స్వామ్యానికి చరివూతలో ఎవరూ చేయని స్థాయిలో నమ్మక ద్రోహం చేసింది. డిసెంబర్ తొమ్మిది 2009 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన విశ్వాస ఘాతుకానికి ఒక్కసారి కాదు వందసార్లు అవిశ్వాసం పెట్టవచ్చు!. వాళ్ళు చేస్తోన్న మోసానికి వెయ్యిసార్లు పడగొట్టవచ్చు!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి