గురువారం, మే 31, 2012

దేవుడు చేసిన మనుషులు!



దేవుడు ఉన్నాడా లేడా ఆన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మే వాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు  లేడని  నిర్ధారించుకున్నాక చర్చకు కాలం చెల్లింది. కానీ ఇప్పుడు అదే చర్చ మళ్ళీ తెరమీదికి వస్తోంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అనుకున్నవాళ్ళకు  లేడేమోనని, లేనే లేడని వాళ్లకు ఉన్నాడేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి దేవుడు ఉన్నాడా లేదా ఆన్న సంశయానికి కారణం మనుషులే తప్ప దేవుడు కాదు. ఎవరైనా తప్పులు చేసినప్పుడు, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం లేనప్పుడు  దేవుడు ఉంటే బాగుండునని కోరుకుంటారు.

శనివారం, మే 19, 2012

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!




జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సి బీ ఐ అరెస్టు చేసింది. వాన్పిక్ పేరుతొ వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిందుకు ఆయన ఇప్పుడు చంచల్ గూడా జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. కానీ మా మిత్రుడు ఏడుకొండలు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాడు. ఏడుకొండలుకు నిమ్మగడ్డ తో వ్యాపార పరమైన వైరమేమీ లేదు, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. కాకపోతే ఆయన వాన్పిక్ విద్వంసానికి ప్రత్యక్ష సాక్షి. వాన్పిక్ వల్ల ఉపాదికోల్పోయిన పల్లెకారుల ప్రతినిధి. సింగోతు ఏడుకొండలుది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం లో ఒక చిన్న పల్లె. ఆ పల్లెనిండా పల్లెకారులే! సముద్రాన్నే నమ్ముకుని చేపలుపట్టి ఉపాధి పోసుకోవడం పల్లెకారుల వృత్తి. వారిలో చదువుకునే వాళ్ళే అరుదు. అటువంటి కుటుంబంలో చీరాలలో డిగ్రీ దాకా చదివిన ఏడుకొండలు తండ్రి మరణంతో పైచదువులకు స్వస్తి పలికి సముద్రాన్ని ఈదే సాహసం చేయలేక పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. ఉస్మానియా లో ఎం ఏ సైకాలజీ, బీ ఈ డీ, ఎం ఫిల్ చేసిన ఏడుకొండలు ఒకవైపు చదువుకుంటూనే చిన్నా చితకా పనులు చేసి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసారు. బాధ్యతలన్నీ తీరిపోయాయనుకున్న సమయంలో వాన్పిక్ ఉప్పెన వాళ్ళ ఊర్లన్నీ ముంచేసింది. ఉన్న ఎకరం, అరెకరం కూడా మిగలకుండా పోయేసరికి చిన్నా చితకా కుటుంబాల పరిస్థితి ఆయనను కలవర పెట్టింది.


ఆ సమయంలో ఏడుకొండలు మా విశ్వవిద్యాలయం లో తాత్కాలికంగా పనిచేసేవాడు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న కాలంలో ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతునిచ్చాడు. తాము కోస్తాలోనే ఉన్నా తమ పరిస్తితి తెలంగాణా లాగే ఉందని, అక్కడి సంపన్నులు తమని బతుకనిచ్చే పరిస్థితి లేదని వాపోయేవారు. వాన్పిక్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ సాగిస్తోన్న భూ సేకరణ బాగోతాన్ని వివరించి మమ్మల్ని వాళ్ళ ఊరికి ఆహ్వానించారు. నాతో పాటు పనిచేసే కొందరు అధ్యాపకులు, ఒకరిద్దరు జర్నలిస్టు మిత్రులం ఆయనతో పాటు వెళ్ళాం. రెండు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ కబంద హస్తాల్లో చిక్కుకున్న పల్లెల్ని వాన్పిక్ విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బంగారం పండే భూములు, పుష్కలంగా నీల్లున్నా సాగుచేయలేని స్థితిలో ఉన్న రైతులు, సముద్రం ఒడ్డునే ఉన్నా అందులో చేపలుపట్టే హక్కులు లేని స్థితిలో పల్లెకారులు, ఊళ్ళో వ్యవసాయ పనుల్లేక ఉపాధి కోల్పోయిన కూలీలు, దళితులు ఇట్లా ఆ పల్లెలు కన్నేరుపెట్టడం కనిపించింది. తిరుగు ప్రయాణంలో సర్ మనం వీళ్ళకోసం ఏమైనా చేయగలమా? అని ఏడుకొండలు మళ్ళీ అడిగాడు. అప్పటికి రెండేళ్లుగా తెలంగాణా ప్రజలంతా ఏకభిగిన పోరాడుతున్నా స్పందించని ప్రభుత్వం తానే విధ్వంసానికి దిగుతుంటే ఏం చేయగలం. అప్పటికే ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం వాన్పిక్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అదొక్కటే పరష్కారం అనుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా వాన్పిక్ అధినేత జైలు పాలు కావడం ఒప్పందాలు రద్దవుతాయన్న వార్తలు వస్తోన్న నేపద్యంలో ఏడుకొండలు కు ఫోన్ చేసాను. ఆయన స్వరంలో ఒక కొత్త ఆశ ద్వనించింది. ఇదే ఆశ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మందిలో ప్రతిధ్వనిస్తోంది. అక్కడి రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన్పిక్ ను రద్దుచేసి తీరాలని కోరుతున్నారు.


జగన్ అక్రమ ఆస్తుల కేసులో సి బీ ఐ విచారణ, నిమ్మగడ్డ అరెస్టు పుణ్యమా అని ఇవాళ ఆకడి ప్రజలకు ఆ ధైర్యం వచ్చింది. వాన్పిక్ అనే సంస్థకు జరిగిన భూ కేటాయింపులన్నీ 'క్విడ్-ప్రొ-కో" ప్రాతిపదికన జరిగినవేనని సి బీ ఐ అంటోంది. న్యాయ శాస్త్ర పరిభాషలో "క్విడ్-ప్రొ-కో" ఆంటే బదులుకు బదులు అని. ఆంటే దాదాపు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. మీకు ఎవరైనా మేలుచేస్తే అందుకు ప్రతిగా మీరు అతనికి చేసే మేలు అన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంపదలో దాదాపు ఎనిమిది వందల కొట్లు జగన స్థాపించిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సి బీ ఐ గుర్తించింది. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ అలా పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలను ఆయనకు రాసిచ్చాడని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అలా భూములు కేటాయించే ముందు కనీస నిబంధనలు పాటించలేదని, మంత్రివర్గ ఆమోదం కూడా పొందకుండానే పనులు జరిగాయని, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదని ఇలా తవ్విన కొద్దీ అనేక పెంకులు అందులో దొరుకుతున్నాయి. సాక్షి, టీ వీ, చానెల్, పత్రికలో పెట్టుబడులు పెట్టినందుకు వంపిక్ అనే సంస్థకు భూ కేటాయింపు జరిగిందని చెపుతున్నారు. అందులో నిజమెంతో కోర్టులు తేల్చాల్సి ఉంది. అది పక్కన పెడితే వాన్పిక్ కోస్తాలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అధికార బలాన్ని ఆసరా చేసుకుని ఆ ఆ సంస్థ అనేక అమానవీయ చర్యలకు పూనుకుంది.


వాన్పిక్ పూర్తి పేరు వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ & ఇండస్త్రియాల్ కారిడార్. ప్రకాశం జిల్లాలోని చీరాల దగ్గర ఉన్న వాడరేవు అనే ఊరినుంచి గుటూరు జిల్లా నిజాంపట్నం వరకున్న కోస్తా తీరాన్ని రాజశేకర్ రెడ్డి గారి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సంష్తకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఓడరేవులు నిర్మిస్తానని, విద్యుత్ ఉత్పత్తికి పవర్ స్టేషన్ లు నెలకొల్పుతామని, పారిశ్రామిక వాడలు, ఆధునిక విమానాశ్రయం కడతామని నమ్మబలికి ఆయన ఇక్కడ భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా ఆయన కంపనీకి భూసేకరణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఘమేఘాలమీద దాదాపు 34 గ్రామాల్లో 15 వేల ఎకరాల భూమిని తీరప్రాంతంలో ఆయనకు కేటాయించింది. దీనిలో దళితులు గత ముప్పై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు అటవీ  భూములు, సముద్రపు కోతను ఆపేందుకు   చెట్లనుపెంచే నేలలూ ఉన్నాయి.

ఇలాంటి భూములు కేటాయించడం పర్యావరణానికి ముప్పు అనీ, తీర ప్రాంతాల భూములు ప్రైవేటు కంపనీలకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని నిపుణులు చెప్పినా రెడ్డి గారు వినలేదు సరికదా మరింత భూమి ప్రయివేటు వ్యక్తులనుంచి, రైతులనుంచి సేకరించుకునే స్వేచ్చను ఆ కంపనీకి ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకునా పూర్తిచేసేందుకు రైల్వే శాఖలో ఉన్న తన బంధువు బ్రమ్హానంద రెడ్డి ని ప్రత్యక అధికారిగా నియమించారు. ఇంకేముంది నిమ్మగడ్డ తన సామ్రాజ్యాన్ని ౩౦ వేల ఎకరాలకు విస్తరించాడు. అప్పటి కలెక్టర్లు మొదలు, రెవిన్యూ యంత్రాంగమంతా రెండేళ్ళ పాటు ఈ పనిలో తరించింది. వాన్పిక్ ఇచ్చిన పరిహారంతో పెద్ద భూస్వాములు, కమీషన్ లతో బ్రోకర్ లుగా పనిచేసిన చోటా మోటా రాజకీయ నాయకులు, ఎం ఎల్ ఏ లు, మంత్రులు కోట్లకు పడగలెత్తారు. లక్షలాది రైతులు, కూలీలు, సముద్ర తీరాన్ని రేవులను నమ్ముకుని బతికే మత్సకారులు వీధిన పడ్డాయి. దాదాపు నలభై గ్రామాలు స్మశానంగా మారే పరిస్తితి వచ్చింది. ఒక్క సి పీ ఐ మినహా అన్నిపార్టీల నాయకులను కంపనీ కొనేసి ప్రతిఘతిస్తోన్న ప్రజల గొంతులు వినిపించకుండా చేసేసాయి. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళెవరూ అక్కడ అడుగుపెట్టకుండా పోలీసులతో దిగ్భందం చేసి భూసేకరణను జరిపారు. ఈ సందర్భంగానే సి పీ ఐ నాయకులు నారాయణ రహస్యంగా పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటే మీడియా అక్కడ ఆయన గాంధీ జయంతి రోజున చికెన్ తింటున్న దృశ్యాన్ని చిలువలు పలువలు చేసినంతగా అక్కడి పోరాటాన్ని ప్రచురించలేదు, ప్రసారం కూడా చేయలేదు. అలా అందరినీ కోనేయగల శక్తి కలిగిన నిమ్మగడ్డ ఇప్పుడొక చానెల్ కు అధిపతి మరొక చానెల్ కు పెట్టుబడి దారుడు! ఇప్పుడు నిమ్మగడ్డ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించడమే అని కూడా ఎవరైనా అనవచ్చు!!


నిజానికి పత్రికా స్వేచ్చ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో మనిషికి మించిన హక్కు మరెవరికీ లేదు. రాజ్యాంగం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్చ ఉందన్తూనే ఆ తరువాతి పేరాలోనే దానికుండే పరిమితులను కూడా చెప్పింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్చకు వాహికగా ఉన్నదే మీడియా కాబట్టి రాజ్యాంగం చెప్పిన పరిమితులకు లోబడే మీడియా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం మీడియా స్వేచ్చను ప్రస్తావించక పోయినా మీడియాకు స్వేచ్చ ఉండాలన్నది ఒక ప్రజా స్వామిక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అనేక కోర్టులు నిర్ధారించాయి కూడా. అలాగే మీడియా స్వేచ్చ ఆంటే పాత్రికేయుల స్వేచ్చ. పత్రిక రచయితలు, ప్రచురణ కర్తల స్వేచ్చ అని అనేక సందర్భాల్లో కోర్టు లు తేల్చాయి. అంతే తప్ప యజమానుల స్వేచ్చ కాదని గుర్తించాలి. సాక్షి తెలుగు జర్నలిజం లో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించింది. సాక్షి లో వచ్చిన వార్తల వల్ల ముఖ్యంగా ఈ రెండేళ్లలో నాణేనికి రెండో వైపు ఏముందో తెలిసి వచ్చింది. ఆ పత్రిక రాతలను, ప్రచురణను ఎవరైనా అడ్డుకోవడం ముమ్మాటికి పత్రికా స్వేచ్చ కిందికే వస్తుంది. ఇప్పుడు సి బీ ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సాక్షి సిబ్బందిలో పాతకుల్లో ఆందోళన కు కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రిక ప్రచురణకు ఆటంకం కలిగించే విధంగా ఉంటున్నాయి. దాన్ని తప్పుపట్టవచ్చు. కానీ ఇదంతా నేరవిచారణలో భాగం అయినప్పుడు విచారణ జరిపే అధికారాన్ని ప్రశ్నించలేము. పత్రిక ప్రచురణకు, సిబ్బంది భద్రతకు భంగం కలుగకుండా ఏ విచారణయినా జరగాలి. పత్రికా స్వేచ్చ పేరుతో విచారణను అడ్డుకున్నా, విచారణ పేరుతో పత్రికా స్వేచ్చను హరిన్చినా న్యాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించ కూడదు. పత్రిక , చానల్ ఏదైనా ఒక ప్రయివేటు యాజమాన్యంలో నడిచే వ్యాపార సంస్థ, ఆ సంస్థ మూతపడితే దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా మూత వేస్తే ప్రభుత్వం మీద జర్నలిస్టు సంఘాలు పౌరసమాజం ఒత్తిడి తెచ్చి దాన్ని తెరిపించాలి. అంతే  తప్ప ఇది పత్రిక కాబట్టి ఆ పత్రిక యజమానిమీద విచారణ వద్దన్నా, ఆ యజమాని తెచ్చిన పెట్టుబడులను ముట్టుకోవద్దన్నా భావ్యం కాదేమో ఆలోచించాలి. అదే న్యాయమని ఎవరైనా వాదిస్తే ఇక ముందు మనం ఏ పెట్టుబదిదారున్నీ విచారించాలేము. కాబట్టి పత్రికా స్వేచ్చను యజమానుల స్వేచ్చతో ముడిపెట్టి చూడకూడదు.


విచిత్రంగా కొందరు నిమ్మగడ్డ అరెస్టు ను పారిశ్రామిక ప్రగతికి అవరోధమని అంటున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాల్లో ఉన్న సంపన్నులను, పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు విచారణలో ఉన్న ఈ పెద్దమనుషులు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విధ్వంసం స్తుష్టించారన్న సంగతి దాచిపెడుతున్నారు. వాళ్ళ భూదాహానికి పాలమూరు జిల్లా పోలేపల్లి పేద రైతులతో సహా లక్షలాది జీవితాలు చిందర వందరైన సంగతి మరిచిపోతున్నారు. ప్రజల పోట్టలుగొట్టి పెట్టుబడులు పెట్టే ఇటువంటి పారిశ్రామిక వేత్తలేనా మనకు కావాల్సింది ఆన్న విషయాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించక పోవడం మన సంకుచిత అభివృద్ధి ఆకాంక్షకు పరాకాష్ట. ఇప్పుడు వాన్పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి ఆ భూములను తిరిగి అక్కడి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఏమార్, పోలేపల్లి మొదలు చంద్ర బాబు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీదా విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తాలో మొదలవుతున్నావాన్పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణా ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణ దారుడు ఒకడే! లంకోహిల్ల్స్ , ఏమార్ , పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణా వాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్ఖ, లేకపోతే మన మాటలు, రాజకీయాలు, ఉద్యమాలు అన్నీ క్విడ్-ప్రొ-కో అనే భావించాల్సి ఉంటుంది

శుక్రవారం, మే 11, 2012

తెలంగాణ గళంలో కాషాయ గరళం!



బీజేపీ గురించి తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్కే ఎక్కువగా తెలుసు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న యువనేత పూర్వాక్షిశమం లో కరుడుగట్టిన కాషాయ కరసేవకుడు. శ్రావణ్ మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతున్నప్పుడు అఖిల ఏబీవీపీ మిలిటెంట్ నాయకుల్లో ముఖ్యుడు.ఆయన ఏబీవీపీనుంచి ఆర్ట్స్కాలేజీ విద్యార్థిసంఘం ప్రధానకార్యదర్శిగా గెలుపొందారు. 1985-90 మధ్యకాలంలో కొన్ని వామపక్ష విద్యార్ధిసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. మరికొన్నిటిని నిర్మూలించడానికి ఏబీవీపీ ప్రయత్నించేది. వామపక్ష, దళిత బహుజన విద్యార్ధి సంఘాలు, భావజాలంతో పనిచేసే విద్యార్థుల మీద ఏబీవీపీ ఆధ్వర్యం లో అనేక దాడులు జరిగేవి. ఆయనకు ఆకాలంలో అగ్రక్షిశేణి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి.

అదే శ్రావణ్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలను ఏవగించుకుంటున్నాడు. మతతత్వ, ప్రాంతీయ అవకాశవాద పార్టీ అని, నిండుకుండ లాంటి తెలంగాణ ఉద్యమంలో విషపుచుక్క అని బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రావణ్ మాటలను రాజకీయ ప్రేలాపనలుగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన సంప్రదాయ రాజకీయ వాదికాదు. ఎంబీఏతో పాటు ఎంఏ, పీహెచ్డీ చేసిన శ్రావణ్ కొంతకాలం ఆధ్యాపకుడుగా ఉన్నా డు. తరువాత ప్రముఖ కార్పొరేట్ కంపనీలలో పనిచేసేవాడు.సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యంలో చేరిన శ్రావణ్ ఇప్పుడు తెలంగాణాతోనే అది సాధ్యమని నమ్ముతున్నాడు. నమ్మకంతోనే ఎన్ని ఒడిదుడుకులున్నా టీఆర్ఎస్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ కుల, మతవాద ధోరణి తెలంగాణవాదానికీ, సామాజిక న్యాయానికి పెనుముప్పుగా మారిందని అంటున్నారు.ఆయనొక్కరే కాదు, జాతీయవాద పార్టీగా బీజేపీని అభిమానిస్తోన్న వాళ్ళు, సంఘ్ పరివార్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయ ఎత్తుగడలపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు, ఆయన శిష్యుడు కిషన్రెడ్డి రాజేసిన కుంపటి అని వారి వాదన. కుంపటి ఇప్పుడు తెలంగాణ జేఏసీలో పొగపెడుతోంది. ఇది చాలా మంది తెలంగాణ వాదులను కలవరపెడుతోంది.

బీజేపీ పన్నెండేళ్ళ క్రితం కాకినాడలో కాగితంమీద రాసి పెట్టడం మిన హా సంస్థాగతంగా తెలంగాణ కోసం ఎన్నడూ పోరాడింది లేదు. 2004 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నడూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా పార్టీ అగ్రనాయకత్వం భావించింది.తెలంగాణ ఉద్యమం 2009 లో ఊపందుకున్న తరువాత పార్టీ గుంపులో గోవింద అన్నట్టుగా ఉద్యమానికి జైకొట్టింది. అడపాదడపా పార్టీ శ్రేణులను బహిరంగ సభలకు తరలించి బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎన్నడూలేని జనామోదం లభించడానికి పార్టీ సొంత ఎజెండా పక్కకుపెట్టి తెలంగాణ జేఏసీలో చేరడం కారణమయింది. తెలంగాణ జేఏసీకి ఉన్న విశ్వసనీయత మొత్తం తెలంగాణ సమాజాన్ని కులమతాలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడానికి దోహదపడింది. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులుగా ఉండే నక్సలైటు పార్టీలు, ప్రజాసంఘాలతో బీజేపీ చేతులుకలిపి పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అప్పటిదాకా మతతత్వ రాజకీయాలు నడిపే పార్టీగా ఉన్న బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

చాలా మంది పార్టీని అంగీకరించే స్థితికి వచ్చారు. కేవలం తెలంగాణ సాధనే తప్ప మరో ఎజెండా లేని నాయకత్వం, దానికోసం సంఘటిత శక్తిగా కదిలిన ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం వెన్నెముకగా ఉంటూ జేఏసీని నిలబెట్టాయి. పార్టీ తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నదని నమ్మడం వల్లే నిజామాబాద్లో డి.శ్రీనివాస్ను కాదని ముస్లింలు కూడా జేఏసీ పై విశ్వాసంతో బీజేపీకి పట్టం కట్టారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మినారాయణ ముస్లిం వీధుల్లో తలపై టోపీ పెట్టుకుని కేసీఆర్, కిషన్డ్డితో కలిసి ఊరేగితే ప్రజలు నిజంగానే నమ్మారు. కానీ జేఏసీ కార్యక్షికమాల్లో, ప్రజా ఉద్యమ క్షేత్రంలో బీజేపీ కదలికలను నిశితంగా గమనించిన వారికి బీజేపీ పట్ల పెద్ద నమ్మకం ఎప్పుడూ లేదు.

బీజేపీ కూడా టీడీపీ లాగే రెండు కళ్ళ సిద్ధాంతాన్నే పాటించింది. పార్టీ తరపున రాజేశ్వర్రావు, విద్యాసాగర్రావు, దత్తావూతేయ, లక్ష్మణ్లాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే కిషన్రెడ్డి మాత్రం వెంకయ్యనాయు డు కనుసన్నల్లో పనిచేస్తూ వచ్చారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నరోజుల్లో బీజేపీ ఒకవైపు జేఏసీలో ఉంటూనే కార్యక్షికమాలకు దూరంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. బతుకమ్మ ఆడడంలో ఆసక్తిగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నాయి. రైల్రోకో సందర్భంగా టీఆర్ఎస్, టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఎక్కడా కనిపించలేదని ఉద్యమాన్ని పరిశీలించిన వారికి అర్థమవుతోంది. అలాగే జేఏసీ పిలుపు మేరకు అందులో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులంతా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కిషన్డ్డి రాజీనామా చేయలేదు.

జగన్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయనను నిలదీయాలన్నా, చంద్రబాబును పాలకుర్తి రాకుండా అడ్డుకోవాలన్నా బీజేపీ స్పందించలేదు. పైగా అది తమ విధానం కాదని తప్పించుకున్నది. మహబూబ్నగర్ ఎన్నికలకు ముందు యాత్రచేసే దాకా ఆయన పెద్దగా ఉద్యమంలో లేరు. కనీసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలయిన వారిని విడిపించడంలో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మనోధైర్యం నింపడంలో పార్టీ నిర్లిప్తతే దీనికి నిదర్శనం. ఆంధ్రాలో జై ఆంధ్రా నినాదంతో ముందుకు వెడతామని చెప్పిన పార్టీ మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది.నిజానికి జై ఆంధ్రా ఆపార్టీ విధానం అయితే ఇప్పటికే అటువంటి నిర్మాణం, కార్యాచరణకు పూనుకుని ఉండాలి. భావ సారూప్యం ఉన్న రాజకీయ సంస్థలు, పౌర సమాజంతో అక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. కనీసం అక్కడ ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడుతున్న దళిత బహుజన సంఘాలకు బాసటగా ఉండాల్సింది. కొవ్వూరులో పోటీ చేసి తమ వాదనను వినిపించి ప్రజలను ఆదిశగా చైతన్యవంతులను చేయాల్సింది. ఆప్రాంతంలో తన కులంలో ఆదరణ ఉన్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక మహాకూటమి ఏర్పాటు చేయాల్సింది.ఇవేవీ పార్టీ చేయలేదు. విషయంలో సీపీఐని, ఆపార్టీ అధినేత నారాయణను అభినందించాలి. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే నాలుకతో మాట్లాడారు. జేఏసీలో భాగం కాకపోయినా అన్ని సందర్భాల్లోనూ సీపీఐని ప్రజలపక్షాన నిలబడేలా చూశారు. ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సుష్మాస్వరాజ్ పార్లమెంటు ప్రసంగాన్ని గురించి చెపుతుంటారు.

అది నిజమే, ఆమెకు స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నది. అందు కే ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గర కాగలిగారు. కానీ అన్నా హజారే అవినీతి అజెండాకోసం నెలలతరబడి పార్లమెంటు జరుగకుండా అడ్డుకున్న పార్టీ తెలంగాణ కోసం నిరవధికంగా పార్లమెంటును ఎందుకు స్తంభింప చేయలేక పోయింది? బీజేపీ ఎంపీల్లో వందమంది ఒక్కసారిగా లేచి నిలబడితే నిజంగానే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. కానీ ఆపార్టీ అలా చేయలేదు. 2014 దాకా చేయదు కూడా! ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలాగే సమస్య 2014 దాకా మిగిలి ఉండాలని కోరుకుంటోంది. 2014ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల్లోఒంటరిగానే పోటీ చేస్తాం అని పార్టీ నేత కిషన్డ్డి ప్రకటించారు. మహబూబ్నగర్ విజయం తరువాత ఆయనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.నిజానికి అప్పటినుంచే పార్టీ తప్పటడుగులు మొదలయ్యాయి. మహబూబ్నగర్ గెలుపు పూర్తిగా తనదేనని బీజేపీ భ్రమ పడుతున్నది. మహబూబ్నగర్లో బీజేపీ బలం కన్నా ఎన్నం శ్రీనివాసడ్డికి ఉన్న బలగం ఎక్కువ ప్రభావం చూపింది. శ్రీనివాసడ్డి పోటీ చేసే నాటికి ఆయనకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ఆయన కరుడుగట్టిన తెలంగాణావాది. కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్ళినా పార్టీ శ్రేణులతో సాన్నిహిత్యం కొనసాగిం చారు. టీఆర్ఎస్ పట్ల అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా అనుకూలంగా మలుచుకున్నారు.

ఆయనకు అక్కడ సామాజికంగా పెద్ద బలగమే ఉన్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ఎన్నంను బీజేపీఅభ్యర్థిగా ఎంచుకుంది. ఇదే మహబూబ్నగర్ జేఏసీ రెండుగా చీలిపోవడానికి కారణం అయింది. అక్కడి జేఏసీలో వామపక్ష భావాలున్న విద్యావంతులు ఉన్నట్టే ఆధిపత్య కులరాజకీయాలు నడిపే వాళ్ళూ ఉన్నారు. బీజేపీ శ్రీనివాసరెడ్డి బలంతో పాటు ఆయన కులాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయన ఒక్కరే రెడ్డి కావడం కలిసి వచ్చింది. ఇక రెండోది మతం.టీఆర్ఎస్ ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే సరికి బీజేపీ తన పాత మతవాదానికి పదునుపెట్టింది. కాషాయం పులుముకుని కిషన్రెడ్డి కాస్తా లాల్కిషన్ అద్వానీగా మారిపోయా రు. ఎన్నికను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్తో పోల్చారు.ఆయనకు ముస్లిం సోదరుల్లో రజాకార్లు కనిపించారు. ఎన్నికల్లో గెలిచారు కానీ రెండేళ్లపాటు బీజేపీ నేతలు ఉద్యమంలో ఉంటూ పార్టీకి సమకూర్చిన సరికొత్త ఉదార రూపాన్ని మాత్రం చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఆపార్టీ తెలంగాణ సాధనకు, ఉద్యమ సామాజిక న్యాయ ఎజెండాకు భిన్నంగా నడుస్తోంది. అందుకే పరకాలలో మరో శ్రీనివాసడ్డి కోసం గాలిస్తోంది. ఇప్పుడు పార్టీ చిన్నాచితక నేతలు కూడా సకల జనుల సమ్మె విరమణను తప్పుపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదనే వాదన లేవనెత్తుతున్నారు. శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో జాతీయ పార్టీ అవసరం ఏమిటో అర్థం కాదు. లోక్సభలో 114 మంది సభ్యులున్నా ఏమీ చేయలేకపోతున్న పార్టీ ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో నాలుగో సభ్యుడు గెలిస్తే తడాఖా చూపిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. బీజేపీ వైఖరి తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. భాగస్వామ్య పార్టీల ఆధిపత్య పోరు జేఏసీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇంతకాలం మీడియా గుసగుసలకే పరిమితమైన విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ మాటల యుద్ధమే దానికి అద్దంపడుతోంది.

మహబూబ్నగర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు పరకాలలో టీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. కచ్చితంగా వరంగల్ జిల్లా టీఆర్ఎస్కు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. మహబూబ్నగర్లో జేఏసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పటికైనా పరకాల నుంచి విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిమీదయినా పోటీకి దిగొచ్చు. కానీ జేఏసీలో చేరిన పార్టీలు సమష్టిగా తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, ఉద్యమ వ్యతిరేక శక్తులమీద యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతకాలం తమకు నీడనిచ్చిన చెట్టును తామే నరికేసుకుంటున్నాయి. జేఏసిని రద్దు చేస్తారని, కోదండ రామ్ను చైర్మన్ పదవినుంచి తప్పిస్తారని వార్తాకథనాలు వ్యాపిస్తున్నాయి. జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలించే వేదిక. దాన్ని రద్దు చేయడమంటే తెలంగాణ ఉద్యమాన్ని రద్దు చేయడమే. హక్కు ఒక్కరికీ ఉండదు.

సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ సమష్టి, జన ఆకాంక్షకు అధికారిక ప్రతినిధిగా నిలబడ్డ వ్యక్తి కోదండ రామ్. ఆయన జేఏసీ ఏర్పడ్డాక ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తికాదు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరు. కీలకమైన సమయంలో ఉద్యమ రథానికి సారధిగా ఉన్న కోదండరామ్ను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదు. పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జేఏసీ సూచన మేరకు నడుచుకోవాలి. లేదంటే ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలి. ఉద్యమాన్ని విషతుల్యం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు